పరిపూర్ణ స్పర్శ – డా॥కె.గీత

దాదాపు 2000లలో, నేను హైదరాబాద్‌లో స్థిరపడ్డ తొలి రోజుల్లో ఆంధ్రజ్యోతి వివిధలో నా ‘వాన స్వాగతం’ కవిత అచ్చయింది. ఆ కవిత తనని ఎంత కదిలించిందో చెబుతూ అమరేంద్ర గారు ఉత్తరం రాశారు. అంతేకాకుండా అదే నెలలో ఏదో సభలో మొదటిసారి కలిసి ఎంతో ప్రశంసించారు. అక్కడే వారి అమ్మగారినీ, శిరీష గారినీ పరిచయం చేశారు. అలా నేనా కవిత రాయడం, వారి కుటుంబంతో పరిచయం కావడం యాదృచ్ఛికమైనప్పటికీ నంబూరి పరిపూర్ణ గారితో నాకు అనుబంధం కలగడం మాత్రం గొప్ప అదృష్టంగా భావిస్తాను.

నాకు పరిచయమయ్యేటప్పటికి ఆవిడ అమరేంద్ర గారికి, శిరీష గారికి అమ్మ మాత్రమే. అప్పట్లో ఆవిడ సనత్‌ నగర్‌లో ఒక్కరే ఉండేవారు. అంతకు రెండు, మూడేళ్ళ ముందే ఆవిడ తొలి కథా సంపుటి ‘‘ఉంటాయి మాకు ఉషస్సులు’’ వెలువడిరది. మొదటిసారి ఇంటికి వెళ్ళినపుడు పుస్తకం ఇచ్చారు. రచయిత్రిగా నాకు తెల్సింది అప్పటినుంచే. అప్పటి నుంచి శిరీష, అమరేంద్ర, శైలేంద్రలతో కలిసి 2006లో కథా పరిపూర్ణం వెలువడేవరకూ అప్పుడప్పుడూ వాళ్ళింట్లో ఆవిణ్ణి కలిసిన జ్ఞాపకాలు ఇంకా ఎంతో తాజాగా ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళినా ఆ కబుర్లు, పాటలు అక్కణ్ణించి వచ్చిన తర్వాత కూడా నన్ను వెంటాడేవి. మామూలు సరదా కబుర్లతో పాటు ఆవిడ అనుభవాల్లోంచి ఎన్నో విలువైన అంశాలు మా మాటల మధ్య దొర్లేవి. స్త్రీలు ఎంత విద్యాధికులైనా కుటుంబాలు, సమాజం చూపించే నిర్ణయాపూరిత తీరు, అణచివేత, దళితుల పట్ల వివక్ష, చిన్నచూపు, ఉద్యమాలు చేసే వారిలోనూ కొరవడిన నిబద్ధతలు, తాను స్వయంగా ఎదుర్కొన్న ఎన్నో ఆటుపోట్లు, పోరాటాల గురించి ధాటిగా మాట్లాడేవారు. ఆవిడ ధైర్యంగా మాట్లాడే తీరు, ధారాళంగా, అద్భుతంగా వచ్చే పదసంపదకు అబ్బురమనిపించేది. కొన్ని వాక్యాలు కట్టిపడేసేవి. అప్పటికే ఆవిడ రిటైరయ్యి పది పదిహేనేళ్ళయి ఉంటుందేమో. వయసులో నాలాంటి చిన్నవారితోనైనా చక్కగా కలిసిపోతూ ఎంతో ఆత్మీయత, ఆప్యాయత, ప్రేమ చూపించేవారు. నా కవిత్వాన్ని మురిసిపోతూ పైకి చదివేవారు. నాతో కలిసి పాటలు పాడేవారు.
చాలా ఆలస్యంగా రచనలు ప్రారంభించినా ఆవిడ చాలా అలవోకగా రాయడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది. ఏది చెప్పినా ఒక దృఢమైన స్పష్టతతో చెప్పడం ఆవిడ రచనా లక్షణం. మధ్యలో ఒకసారి బెంగుళూరులో ‘‘కథ’’ ఆవిష్కరణకు వెళ్ళినపుడు అమరేంద్ర గారింట్లో ఆవిడతో కలిసి పూర్తిగా రెండ్రోజులు గడిపే అవకాశం కలిగింది. మా అమ్మతో, నాతో కులాసా కబుర్లు చెపుతూ, మా అబ్బాయితో నవ్వుతూ ఆడిన ఆవిడ రూపం ఇంకా చెక్కు చెదరలేదు. కథా పరిపూర్ణం ఆవిష్కరణ సభగా ఆవిడ తన 75 ఏళ్ళ జీవితాన్ని సాహితీ పండుగగా జరుపుకున్నప్పుడు ఆ ఆనందంలో పాలుపంచుకున్న క్షణాలు ఇప్పటికీ మరపుకు రాలేదు.
మేం అమెరికా వచ్చాక మధ్యలో ఒక దశాబ్దం పాటు కలవడానికి కుదరక పోయినా 2017లో అచ్చయిన ‘‘వెలుగుదారులలో’’ ఆ బెంగంతా తీర్చివేసింది. అందునా ముఖచిత్రమ్మీద నాకు వారింట్లో ఆవిడ స్వయంగా చూపించిన చిన్ననాటి ఫోటోలతో బాటు, నేనెరిగిన పరిపూర్ణ గారి రూపం చూసి ఎంత ముచ్చటేసిందోÑ అప్పటివరకు నేనెరిగిన అమ్మగా, రచయిత్రిగా మాత్రమే కాకుండా అంతకంతా జీవితకాలపు కష్టనష్టాల్లో తనని తాను సాన పెట్టుకుని చెదరని ఉక్కుమహిళగా ఆవిష్కరించిన ఆవిడ ఉత్కృష్ట రూపం చూసి గర్వం వేసింది. ఎన్ని బాధలెదురైనా ఎక్కడా ఎవ్వరినీ ద్వేషించకుండా, స్ఫూర్తిదాయకంగా మలిచిన అక్షరమక్షరం హృదయంలోనించి దూసుకుపోయే ఆ స్వీయ చరిత్ర ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదివి తీరవలసినది.
అయితే ఆ పుస్తకం చదివి అప్పటికప్పుడు ఆవిణ్ణి చూసి రావాలన్న తపన నెరవేరడానికి నాకు మరో అయిదేళ్ళు ఆగాల్సి వచ్చింది. అన్నాళ్ళు పట్టినా అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సంఘటన అయ్యింది. అదే 2022లో నా నెచ్చెలి పత్రిక కోసం బెంగుళూరు పనిగట్టుకుని వెళ్ళి మరీ చేసొచ్చిన ఇంటర్వ్యూ. తొంభై రెండేళ్ళ ఆ నవ యువతితో మాట్లాడిన ఆ చివరి జ్ఞాపకం ఈ ప్రపంచంలో నాకు లభించిన, అన్నింటికన్నా అద్భుతమైన, నాకు మాత్రమే దక్కిన అరుదైన గొప్ప అవకాశంగా పులకించిపోయాను.
అప్పుడూ అదే ఖంగుమనే స్వరం. చెవులు సరిగా వినిపించకపోయినా ఏదో రకంగా తప్పకుండా ఇంటర్వ్యూ చేద్దామని ఆవిడే ధైర్యం చెప్పారు నాకు. అప్పటికప్పుడు చక్కగా నాకిష్టమైన గులాబీ రంగు చీర కట్టుకుని వచ్చారు. ధీమాగా కాగితమ్మీద ప్రశ్నలు రాసివ్వమని, ప్రశ్నలు వినబడనప్పుడల్లా వేలితో చూపిస్తూ ఉంటే అర్ధం చేసుకుంటూ ఉంటానని చెప్పడమే కాకుండా అప్పటికప్పుడు ఆశువుగా సమాధానాలు చెప్తూ, ఎక్కడా మంచినీళ్ళు తాగడానికి కూడా ఆగకుండా గంటన్నరలో ఇంటర్వ్యూ పూర్తి చేశారు. చివర్లో మేమిద్దరం కలిసి పాడుకున్న పాటలు జ్ఞాపకం చెయ్యగానే గొంతెత్తి హాయిగా పాడిన పరిపూర్ణ గారితో అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా జీవితం అయిపోయిందని ఆదుర్దా పడిపోయి రచనని అటకెక్కించి రెస్టు తీసుకనే స్థాయికి వచ్చేసే వారంతా ఆవిడ ఇంటర్వ్యూని తప్పకుండా చూసి తీరవలసిందే. (‘నెచ్చెలి’లో పరిపూర్ణ గారితో నేను చేసిన ఇంటర్వ్యూ లింకు ఇక్కడ ఇస్తున్నాను)
(https://www.neccheli.com/2022/11/ప్రముఖ రచయిత్రి నంబూరి పరిపూర్ణ)
ఆ ఇంటర్వ్యూలో ఆవిడ అప్పటికి ఓ కొత్త నవల రాస్తున్నానని చెప్పడమే కాకుండా మరుసటి ఏడాదికల్లా ప్రచురించి మన ముందుంచారు. ఎప్పుడు ఆవిణ్ణి కలిసినా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నా, తొంభై ఏళ్ళ వయసులో ఎలా ఉండాలో నేర్పించిన ఆ చివరి కలయిక మాత్రం నా వరకు నాకు అత్యంత అపురూపమైనది. ‘‘రచన ఒక జీవితకాలపు వైయక్తిక బాధ్యత అయితే, చివరి క్షణం వరకూ రచయితగా జీవించడం అన్నది సామాజిక బాధ్యత!’’ అన్నది ఆ మెత్తని చేతిని నా చేత్తో పట్టుకుని చివరగా గడిపిన ఆ రెండు మూడు గంటల ఆత్మీయ స్పర్శతో అవగతం అయింది.

Share
This entry was posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.