‘వెలుగు దారులలో’ నిరంతర ప్రయాణం – జి.వెంకటకృష్ణ

నంబూరి పరిపూర్ణ గారి ఆత్మకథ చదివాక గొప్ప అనుభవాల గుండా ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. అయితే ఆద్యంతమూ ఒక విషాదస్వరం మనవెంట ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ అక్షరాలు పలికే వినయ సంస్కారపు విజయాల వెనుక బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లాగా ఆమె పంటిబిగువున అణచిన కోపమో, వగపో, తృణీకారమో చిరుసవ్వడి చేస్తూ ఉంటాయి. దాన్ని ఎంతమంది వింటారో తెలియదు.

ఆమె దాని గురించి అస్సలు పట్టించుకోలేదు. అయితే ఒకచోట తనకు జరిగిన అన్యాయాన్ని గురించి, అందరికీ ఆదర్శాలు వల్లించే కమ్యూనిస్టు నాయకత్వాలు అన్యాయం అనకపోవడం మీద ఒక చిన్న కామెంట్‌ చేసి వదిలేసిందంతే. కుటుంబం పట్ల పిసరంతైనా బాధ్యతలేని సోకాల్డ్‌ కమ్యూనిస్టు నాయకత్వాలు రాజ్యమేలే కాలంలో, ఆమె వినిపించిన అసమ్మతి కాలంలో కలిసిపోయింది.
ఈ పుస్తకంలో ఆమె తనవీ, తన సంతానానివీ ఎన్ని విజయాలు వివరించినా అవేవీ నాలోని పాఠకుడి ఆగ్రహాన్ని తీర్చలేకపోయాయి. ఆగ్రహం రగిలించడం కోసం పరిపూర్ణగారేమీ రాయలేదీ పుస్తకంలో. అయితే ఒకసారి రాసినా వందసార్లు రాసినట్టు. ఒకానొక అగ్రకుల అహంకారీ, పితృస్వామ్యం మూర్తీభవించిన వ్యక్తి ఏ విమర్శా లేకుండా, ఎవరి నిలదీతా లేకుండా పరిపూర్ణ గారిని తొక్కుకుంటే బతికేశాడే!? అని ఒక నిస్సహాయ ఆగ్రహం వెంటాడుతుంది నాలాంటి పాఠకుడిని. ఏ రచనకైనా పొయెటిక్‌ జస్టిస్‌ జరగాలంటారు. పరిపూర్ణ గారు కలలోనైనా ‘యన్‌ఆర్‌.దాసరి’కి తీక్షణంగా బుద్ధి చెప్పి ఉంటే అలాంటి ఒక న్యాయం అయి ఉండేది.
1931లో జన్మించిన పరిపూర్ణ గారు బెజవాడలో ఐదో తరగతి చదువుతున్నప్పుడు, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. బ్రిటిష్‌ ప్రభుత్వం కోరినట్లు స్కూలు టీచర్లు యుద్ధ సహాయ నిధి కోసం పిల్లలచేత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శన చేయించే క్రమంలో రామాయణంలోని పాదుకా పట్టాభిషేకం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. అందులో భరతుడిగా పరిపూర్ణ జీవించి నటిస్తే, దాన్ని చూసిన భక్తప్రహ్లాద సినిమా నిర్మాత, మీర్జాపూర్‌ జమిందార్‌ రంగరాయిణ గారు, పరిపూర్ణను ప్రహ్లాద పాత్రకు ఎంపిక చేసుకుంటాడు. అది పరిపూర్ణగారి జీవితంలో (1940) అత్యుత్తమ దశ. ఆ తర్వాత ఆమె బాంబేలో నిర్మాణమయ్యే ఇంకో సినిమాకు కూడా ఎంపికవుతారు గానీ, అది కొనసాగదు. ఆ దశలో ఆమెలోని గాయక నైపుణ్యం రూపొందింది.
1950 నాటికి పరిపూర్ణగారు రాజమండ్రిలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేస్తారు. ఇంటర్‌లోనే ఆమె (ఎస్‌ఎఫ్‌ఐ) విద్యార్థి ఫెడరేషన్‌లో కార్యవర్గ సభ్యురాలు! జిల్లా మహాసభల కోసం రాజమండ్రి అంతా పాటలు పాడుతూ తిరిగి ఏడువందల రూపాయలు సేకరించింది. ఆ తర్వాత జరిగిన సభల్లో ముఖ్యమైన నాయకురాలిగా ఎదిగింది. దాసరి నాగభూషణరావు పరిచయమయిందీ, ఆమె వాక్చాతుర్యానికీ, ఉద్యమదీక్షకూ ముగ్ధుడై పెళ్ళి చేసుకుంటానని ప్రతిపాదన చేసిందీ అక్కడే. అతను రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్‌ సెక్రటరీ అయ్యింది కూడా ఆ సభల్లోనే.
ఆ వేసవి సెలవుల్లో పరిపూర్ణ గారు తమ ఊరికి పోకుండా రాజమండ్రిలో కమ్యూనిస్టు మహిళా సంఘాల నిర్మాణంలో నిమగ్నులవుతారు. కామ్రేడ్‌ దాసరి నాగభూషణరావును వివాహం చేసుకుంటారు. 1953 వరకూ ఆమె కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల కార్యకర్త. మరోవైపు తన సహచరుడు అజ్ఞాతంలో ఉండటం వల్ల అతన్ని కాపాడుకునే బాధ్యత కూడా వహించారు. ఇద్దరు పిల్లల తల్లయ్యారు. కమ్యూనిస్టుల మీద ఉన్న నిర్బంధం కారణంగా గుంటూరు, తెనాలి, మద్రాసు లాంటి చోట్ల రహస్యంగా ఉండాల్సి వచ్చింది. 1952లో కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీ పంథాలోకి వచ్చి అప్పుడు జరిగిన ఎన్నికల్లో పాల్గొనగానే, పరిపూర్ణ గారు మద్రాసు, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు, విజయవాడ, బందరు, ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నంలలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనతో కమ్యూనిస్టు భావాలు ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.
ఈ దశ ఆమెలోని కమ్యూనిస్టు ఉద్యమ కార్యకర్త రూపొందిన దశ. ఈ దశలో ఆమెను కమ్యూనిస్టు పార్టీ బాగా
ఉపయోగించుకుంది.
మూడో దశ, పరిపూర్ణ గారు కామ్రేడ్‌ దాసరిని 1949లో పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి 1960లో డబ్బులు ఇవ్వనందుకు కొట్లాడి, నీ మొఖం చూడనని చెప్పి వెళ్ళిపోయేదాకా నడిచింది. ఈ దశలో పరిపూర్ణ గారు భర్తను భారతీయ సంస్కృతి (వ్యతిరేక) అర్థంలో నిజంగానే భరించింది. అతడి రహస్యాలు కాపాడిరది. అజ్ఞాతంలో సైతం త్రికరణశుద్ధిగా అతనితో కలిసి జీవించింది. తత్ఫలితంగా ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. వాళ్ళ సంరక్షణ కోసం చిన్నా, చితకా ఉద్యోగాలు చేసింది. అంతో, ఇంతో భద్రత కోసం గవర్నమెంట్‌ ఉద్యోగం కోసం ప్రయత్నించి కమ్యూనిస్టు నాయకుడైన భర్త వ్యతిరేకతను ఎదుర్కొంది. (అతని అజ్ఞాన ఉద్దేశ్యం ఏమిటంటే, కమ్యూనిస్టులు ప్రభుత్వ వ్యతిరేకంగా రాజకీయ కార్యాచరణ గలవారు కాబట్టి ప్రభుత్వంలో పనిచేయకూడదట, చివరకు వాళ్ళ సహచరులు కూడా.) అతన్ని కాదని ఆమె తన స్వశక్తితో ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకుంది. ఆ జీతంలో పావు భాగం ఆ కమ్యూనిస్టు భర్తకు నెలనెలా ఇస్తుంది. తనకు కలిగిన ముగ్గురు పిల్లలను భర్త అనేవాడు, వాళ్ళ జన్మకు కారణమైనవాడు, కనీసం దగ్గరకు తియ్యకపోతే, ఒక్కమాటా మాట్లాడిరచకపోతుంటే, కేవలం డబ్బుల కోసమే ఇంటికి వచ్చి పోతుంటే, ఆ సంబంధంలోని డొల్లతనం బద్దలవుతుంది ఈ దశలోనే. దానికి పరిపూర్ణ గారు జీవితమంతా మూల్యం చెల్లించింది.
ఇక నాలుగో దశ, ఆమె ప్రభుత్వ ఉద్యోగాలు, బాధ్యతలు నిర్వహించిన దశ. తన పిల్లలకు తానే సర్వస్వమై, వాళ్ళను ప్రయోజకులుగా చేసిన దశ. వాళ్ళ విజయాలలో తన విజయాలను చూసుకొని ఏ పశ్చాత్తాపమూ లేకుండా జీవించిన దశ. ప్రభుత్వ ఉద్యోగినిగా కూడా తన స్వభావానికి చేరువైన పనిలోకే ఆమె చేరి ఉన్నందున, మహిళలతో, వాళ్ళ సంక్షేమ సంరక్షణలో పాలుపంచుకొన్న దశ. తనలో నిబిడీకృతమై ఉన్న కమ్యూనిస్టు భావాల సారాన్ని ఆమె ప్రభుత్వ ఉద్యోగినిగా కూడా నిలుపుకోవడానికీ, ఆచరణలో చూపడానికీ జీవితాంతం ప్రయత్నించిన దశ. ఐదవది, ఆమెలోని సృజనశీలి సాంస్కృతిక, సాహిత్య రంగాలలో ఆమెను నిలబెట్టిన దశ. ఈ దశ క్రోనలాజికల్‌గా ఆమె ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించే రోజుల్లో నుండి వ్యాసాలూ, కథలూ, నవలలూ రాయడమొక్కటే కాకుండా, రేడియో ప్రసంగాలు చేయడమే కాకుండా, ఇంకా వెనక్కి వెళ్ళి తన పదేళ్ళ వయసు నుంచి స్కూల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తున్నప్పటిది కూడా. ఈ దశ ఆమె జీవితంలో ఫలానా సంవత్సరాల మధ్య మాత్రమే ఉన్న దశ కాదు, ఆమె జీవితంలో ఒక నిరంతర ధారగా ప్రముఖ భాగమైన దశ. ఆమెలోని ఈ స్థితే ఆమె ‘పరిపూర్ణ’గా తయారవడానికి కారణమైంది. ఆమె జీవితం ఇలా ఉండడానికి ఆమెలోని ‘సృజన శీలత్వమే’ కారణం! ఆమె ఎంతటి ప్రభావశాలో, ఎంతమంది (ఆ తర్వాత కాలంలో గొప్పవారిగా తయారైన) మన్ననలను పొందిందో, ఎన్ని అమూల్య అవకాశాలు ఆమెకు అందినట్టే అంది చేజారి వెళ్ళిపోయాయో తలచుకున్నప్పుడు, ఒక నిష్ఠూరమైన నిజం తెలిసివస్తుంది. అది ఈ దేశంలో కింద, అణగారిన కులాల ప్రజలకు ఏ అందలమూ అంది రాదని. కులం కారణంగా పరిపూర్ణగారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తనలోని ప్రతిభ కారణంగా ఎందరితోనో అనాదరణకూ గురయ్యారు.
అయితే అన్ని అడ్డంకులనూ, అనాదరణలనూ అధిగమించి ఆమె విజయవంతంగా నిలబడడానికి ఆమెలోని సృజనశీలి ప్రతిభే కారణమైంది. దొరికిన దానితో సంతృప్తి చెంది, నిరాడంబరంగా, సమాజం పట్ల వినయశీలంగా, సమాజానికి చేతనైనంత తిరిగి ఇవ్వడమనే గుణంతో బతకడానికి ఆమెలోని సృజనశీలత్వమే కారణమైంది.
ఒక మహిళగా పరిపూర్ణ జీవితాన్ని పరిశీలించవచ్చు. ఒకానొక కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా చూడొచ్చు.
ఒకానొక సంప్రదాయ కమ్యూనిస్టు నాయకుడి కారణంగా జీవితంలో భర్త ప్రేమానురాగాలు కోల్పోయిన స్త్రీగా ఆమెని చూడొచ్చు. ఒంటిచేత్తో ముగ్గురు పిల్లలను పెంచి, పెద్దచేసి, ప్రయోజకుల్ని చేసిన తల్లిగా చూడొచ్చు.
పిల్లలతో స్ఫూర్తి పొంది తనలోని సృజనకు మెరుగులు దిద్దుకొని రచయిత్రిగా మారిన సృజనశీలిని చూడొచ్చు. బాల్యంలోనే గొప్ప అవకాశాలు అందినట్టే అంది, కులమో, పేదరికమో కారణంగా వాటిని చేజార్చుకున్న వ్యక్తిగా చూడొచ్చు. ఆమెను తెలుగు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చరిత్రలో కీలకమైన కాలాల్లో, కింది స్థాయిలో ఉన్న సాక్ష్యంగా, వనరుగా అధ్యయనం చేయొచ్చు. ఒకానొక ఆధిపత్య కులపురుషుడిని నిలదియ్యకుండా, తనను ఉపయోగించుకున్న కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని, తనకు అన్యాయం చేసిన వాడిని నిర్విమర్శగా అందలం ఎక్కించిన పార్టీని ప్రశ్నించకుండా, నిర్లిప్తంగా నిలిచిపోయిన స్త్రీగానూ చూడొచ్చు. వెరసి నంబూరి పరిపూర్ణ కమ్యూనిస్టు నాయకత్వాల (వాళ్ళెన్ని ఆదర్శాలు వల్లించినా) దృష్టిలో దళిత స్త్రీగానే పరిగణింపబడిరదని చెప్పొచ్చు. అందువల్ల ఈ ఆత్మకథ, గొప్ప అవకాశాలు అందుకునే శక్తి ఉండీ, కిందనే మిగిలిపోయి దళిత స్త్రీ ఆత్మకథగానే పరిగణిస్తాను. ఈ భవతి శతమానం ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షిస్తాను.

Share
This entry was posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.