‘‘నీ కథలకన్నా ఉంటాయి మాకు ఉషస్సులు లోని కథలే బావున్నాయి!’’
హతాశుడినయ్యాను… స్వీయానురాగంలో మునిగి తేలుతున్న రోజులవి. పై మాట అన్నది నాకెంతో గురి ఉన్న మనిషి! కాలేజీ రోజుల్లో ఎన్నెన్నో గంటలు రంగనాయకమ్మ గురించీ, కుటుంబరావు గురించీ… మధ్యలో కాంటాక్ట్ పోయి మళ్ళా ముప్ఫై ఏళ్ళ తర్వాత కలిసిన మనిషి, నాతోనే గాకుండా అమ్మతోనూ పరిచయం ఉన్న మనిషి!
‘‘వివరించగలవా!’’ సంబాళించుకుని అడిగాను.
‘‘నీ కథలు వాస్తవాల మీద ఆధారపడినవే అయినా, వాటిల్లో లోతు తక్కువ. ఉండాల్సిన ‘జీవితం’ స్థానంలో నీదైన ‘ఆదర్శవాదం’ నిండిపోయింది. అమ్మ కథల్లో నికార్సయిన జీవితం ఉంది. ఘర్షణ ఉంది. వేదన ఉంది. పడిలేచిన వైనాలు ఉన్నాయి. ‘దారి దీపాలు’ స్థాయి కథలు అవి…’’ ఈ మాటలు అర్థం చేసుకోడానికి పెద్ద సమయం పట్టలేదు నాకు.
‘‘రేడియో స్టేషనుకు నాకు తోడుగా వస్తావా’’, అమ్మ అడిగింది.
తొమ్మిదో తరగతి రోజులవి. రేడియో స్టేషనంటే అదో గొప్ప ఆరాధనీయ స్థలమన్న భావన. అక్కడికి వెళ్ళడమా! సంబరమే సంబరం!! అసలు అమ్మ ఎందుకు వెళుతున్నట్లు?
‘‘ఒక ప్రసంగం చేసే అవకాశం వచ్చింది. సీతాదేవిగారు పూనుకుని ఇప్పించారు’’.
వెళ్ళాం. రికార్డింగు చూడటమన్నది ఒక కలలాగా సాగిపోయింది. మొట్టమొదటి రేడియో ప్రసంగం అన్న తడబాటూ, సంకోచమూ లేకుండా స్పష్టంగా మాట్లాడిరది అమ్మ. సంబరం. సంతోషం. ఆ తర్వాత ప్రతి నెలా అవకాశాలు. కొన్నింటికి నేనూ తోడుగా…
‘ఎవరీమె? గంధర్వ మహిళా? విజయవాడ మొత్తం వెదికినా ఇంతటి ధీరగంభీర రాశి కనిపించదు కదా?’ వాసిరెడ్డి సీతాదేవి.
ఆ మధ్యే హైదరాబాదు నుంచి బదిలీ అయి అమ్మకు పై అధికారిగా విజయవాడ చేరిన మనిషి. వామపక్ష భావ సమన్విత! అప్పటికే ఆమె కథలూ, రచనలూ చదివి ఉండడం వల్ల చిరపరిచిత అనిపించే మాట తీరు, స్నేహంగా నన్ను పలకరించడం.
‘‘పరిపూర్ణా! నీ ప్రసంగాలు బావుంటున్నాయంటున్నారు రేడియో వాళ్ళు. కొనసాగించు. కానీ ఆకాశవాణినే నీ మాధ్యమంగా చేసుకోకు. పత్రికలకు రాయడం మొదలెట్టు. నీకా శక్తి ఉంది’’, ఇంటికి భోజనానికి వచ్చిన సీతాదేవి గారి ప్రోత్సాహం.
మరో ఆరు నెలల్లో అమ్మ వ్యాసాలకు విశాలాంధ్ర వాళ్ళ ‘ప్రగతి’ వారపత్రిక, నండూరి రామమోహనరావు గారి ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక వేదికలయ్యాయి. ఇవన్నీ 60ల నాటి విషయాలు.
నేను కాకినాడ, అమ్మ విజయవాడ అయ్యేసరికి తన రచనా వ్యాసంగానికి ప్రత్యక్షసాక్షి నవడం తగ్గి, దూరాన ఉన్న పాఠకుడినయ్యాను! వ్యాసాలు రావడం ఆగలేదు. సెలవల్లో వాటి కటింగులన్నీ నా ముందు వేసుకోవడం, నావైన మాటలు చెప్పడం, కొన్ని కొన్ని సూచనలు.
… … …
80ల ఆరంభంలో అమ్మ స్థావరం హైదరాబాదుకు మారింది. విజయవాడ పత్రికలతో ప్రత్యక్ష సంబంధం తెగిపోయింది.
హైదరాబాదులో మాత్రం పత్రికలకేం తక్కువా?! పరిచయాలా ` చేసుకొంటే అవుతాయి! అదే మాట అమ్మతో అన్నాను.
తురగా జానకీరాణి. ఆకాశవాణి. తిరిగి మొదలయిన రేడియో ప్రసంగ పరంపర!
‘‘కథ రాశాను. తెలిసిన విషయాలే. నా ఆఫీసు టూర్లలో ఏళ్ళ తరబడి గమనించిన విషయమే. రాశాను. చూడు’’ పాతిక, ముప్ఫై పేజీల బొత్తి చేతిలో పెట్టింది అమ్మ. 1984 చివరి దినాలు. పది రోజులు సెలవు పెట్టి ఢల్లీి నుంచి హైదరాబాదు వెళ్ళిన సమయం. చదివాను.
ఆశ్చర్యం. సంభ్రమం. విభ్రాంతి. భయం.
‘ఇలా తెలిసిన విషయాలన్నీ పత్రికలకు ఎక్కిస్తే సమస్యలు రావూ?’ నాలోని భద్రజీవి అడిగిన ప్రశ్న.
‘మరేం పర్లేదు. నేనేం అబద్ధాలు రాయడం లేదు. వస్తే చూసుకొందాం’, ధీమా, విశ్వాసం.
అవును మరి, నలభై ఏళ్ళ పోరాట జీవితచరిత్ర తనది.
ఎవరికి ఇవ్వాలి? ఇంత పెద్ద కథ వేసుకుంటారా?
మాకు బాగా ఇష్టమయిన పత్రిక ఆంద్రప్రభ. వెళ్ళాం. పొత్తూరి వెంకటేశ్వరరావుగారిని కలిశాం. ఆయన మమ్మల్ని ‘ఎల్లోరా’ గారికి అప్పజెప్పారు.
‘మరేం పర్లేదమ్మా `నిడివి పెద్దదయితే మాత్రమేం? చదువుతాను. బావుంటే తప్పకుండా వేస్తాం’, స్నేహ అనునయ ఎల్లోరా పలుకులు… మూడు వారాలు సీరియల్‌గా వచ్చింది ‘మాకు రావు సూర్యోదయాలు’ నవలిక. పాఠకుల నుంచి చక్కని స్పందన, ప్రోత్సాహం, స్ఫూర్తి! కథల పరంపర. శీనుగాడి తత్వ మీమాంస, ఎర్ర లచ్చుప్ప, ఉంటాయి మాకు ఉషస్సులు. సాగిపోతున్న కథా వ్యాసంగం.
తొంభైల ఆరంభంలో నాకూ నమ్మకం కలిగి విరివిగా రాయడం మొదలుపెట్టాను. మూడు నగరాలు అన్న ట్రావెలాగ్ ఆరంభ రచన! బ్రతకనేర్వనివాడు ` కథారచన అన్న సాహసానికి నాంది! వ్యాసాలు, అనువాదాలు, తొంభైల పొడవునా సాగిపోయిన నా కలం. అటు శిరీష అప్పటికే పాతికేళ్ళుగా కథలూ, నవలలూ రాస్తోన్న మనిషి. ఒక ఇంట్లో ‘‘ముగ్గురు’’ రచయితలు. అదో మురిపెం!
కథలు రాయటం మొదలుపెట్టినా వ్యాస పరంపర ఆపలేదు అమ్మ. ఆంధ్రజ్యోతిలోని యువ పాత్రికేయుడూ, కవీ ‘అరుణ్‌సాగర్’ ఆమెకు మెంటర్. తనకా పరిచయం తురగా జానకీరాణి చలవ.
‘జ్యోతి ఆఫీసుకు వెళ్తున్నావా? ఈ వ్యాసం అరుణ్‌సాగరుకు ఇవ్వవూ’, సెలవు పెట్టి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా రోజంతా పత్రికాఫీసులకు వెళ్ళడం, స్నేహితులను, అఫ్సర్, వాకాటి, ఆరెమ్ ఉమా, చలసాని ప్రసాదరావు లాంటి వాళ్ళని కలవడం, వ్యాసాలూ, కథలూ అందించడం… అదే పని నాకు.
వెళ్ళాను… అప్పటికే అరుణ్‌సాగర్ పేరు విని ఉన్నాను. అతనికి నా పేరు తెలియదు. అయినా అమ్మ కొడుకునని తెలిసి ఎనలేని అనురాగం చూపించాడు. అదో మధుర స్మృతి.
… … …
‘పాతిక కథలదాకా వచ్చాయి కదా, పుస్తకం వేద్దామా?’ అమ్మకు, నాకూ ఒకేసారి కలిగిన ఆలోచన. ‘పుస్తకంగా రాగల స్థాయి కథలు ఎక్కువగా లేవేమో ` ఇంకా ఆగితే?’ నేను నిత్యశంకితుణ్ణి. ‘మరేం పర్లేదు. వేద్దాం’. ఆమె నిరంతర ధీర.
అనుభవం లేదు. శ్రీపతి, మునిపల్లె రాజుల పూనిక. విశాలాంధ్ర. ప్రముఖ ప్రచురణ సంస్థ వేస్తున్నందుకు సంతోషం. ‘టైమ్ టు సెలబ్రేట్’!
శ్రీపతి పూనుకొన్నారు. ఇద్దరం కలిసి పనిచేశాం. కేతు, రంగాచార్య, మునిపల్లె, బి.ఎస్.రాములు, అబ్బూరి ఛాయాదేవి, ముక్తేవి భారతి, శారదా అశోక్‌వర్ధన్ ` సాహితీ విజయోత్సవం. కథలన్నీ ఒకేసారి చదివినప్పుడు సంబరపడిన నాలోని నిత్యశంకితుడు. అది 1998’ నవంబరు.
నిరాడంబరంగా సాగిపోయింది అమ్మ సాహితీ వ్యాసంగం.
పాఠకుడు, విమర్శకుడు, ప్రోత్సాహకుడు `ప్రచురణ (కార్య) కర్త ` దాసరి అమరేంద్ర.
2006. అమ్మకు డెబ్భై అయిదేళ్ళు.
ఏదన్నా చెయ్యాలి… ఏం చెయ్యాలి?
ముగ్గురం కలిసి ఆలోచించాం.
బహుమతి ఇద్దాం ` అది సాహిత్యానికి చెందినదై ఉండాలి.
‘అమ్మ, పాప, నేను కథలు రాస్తున్నాం. ఎంపిక చేసిన కథలతో పుస్తకం వేద్దాం. శైలేంద్ర విపులమైన ముందుమాటా, తుది పలుకూ రాయాలి. ఒక కుటుంబపు నాలుగు చేతులూ కలిసిన అరుదైన సందర్భమవుతుంది’. నా ప్రతిపాదన.
‘బావుంది. చేద్దాం. దానికి కథాపరిపూర్ణమ్ అని పేరు పెడదాం’, శైలేంద్ర.
పని మొదలుపెట్టాం. కథలు ఎంపిక చేశాం.
అప్పటికే నా ‘కథల సంపుటి’ రమణజీవి సృజనాత్మకతను సంతరించుకొని పుస్తకంగా వచ్చింది. ఈ పుస్తకానికీ బాధ్యత తీసుకొన్నా.
కథలు సరే ` శైలేంద్ర ‘మాటలు’ అద్భుతంగా అమరాయి.
ఆవిష్కరణ ఇంకా అద్భుతంగా ` జ్వాలాముఖి, శివారెడ్డి, మునిపల్లె రాజు.
తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఆవిష్కర్త.
అప్పటికీ ఇప్పటికీ నాకు అత్యంత సంతృప్తి కలిగిన కార్యక్రమమది!
మరో పదేళ్ళు. 2015.
ఎనభై అయిదవ వడిలోనూ తరగని ఉత్సాహం!
ఇంకా ఇంకా పంచుకోవాల్సిన ఆలోచనలు, అనుభవాలు.
పంచుకోవాలన్న తపన.
సాగుతోన్న సాహితీ ప్రస్థానం.
కథలయితే ఒక చోట చేరాయి గానీ వ్యాసాలు సంపుటిగా రాలేదు గదా…
రావల్సిన కథలూ ఉన్నాయి కదా…
‘రెండు పుస్తకాలు వేద్దామా?’ అమ్మ.
‘వద్దు. కలిపి ఒకటే వేద్దాం’, నేను.
ఫిబ్రవరి 2016లో శిఖరారోహణ ఆవిష్కరణ.
ఎన్ని జన్మదినాలు కలిస్తే ఒక పుస్తకావిష్కరణకు సమానం?
నవతరం, యువతరం, అనుభవం నిండిన తరంతో భుజం భుజం కలిపిన వేళ.
విమల, అపర్ణ, అజాద్, ఖదీర్ కూడా. నవీన్, శివారెడ్డి సరేసరి. నవ్య శర్మ ఆవిష్కర్త.
ఊర్లోని వాళ్ళే కాకుండా విజయవాడ, వైరా, ఖమ్మం, కొత్తగూడెం… ఎక్కడెక్కడి వాళ్ళు.
చివర్లో 45`50 నిమిషాల అమ్మ ప్రసంగం.
తన యావత్ జీవితాన్ని సింహావలోకనం.
‘జీవిత చరిత్ర రాయడానికిదే సమయం’, అమరేంద్ర, విమల మోర్తల.
‘అవునవును. నేను తోడు’, కొల్లూరి సోమశంకర్.
తోడూ, నీడా అయ్యారు సోమశంకర్. ప్రోత్సహించి, వెంటాడి, వేధించి, సాయపడి, టైపు చేసి, సవరణలు సూచించి…
ఏడాది శ్రమ! అడపాదడపా ` సెలవులకి వెళ్ళినప్పుడు నా ప్రమేయం. ఇంకా ఇంకా వివరాలు సోమశంకర్ వ్యాసంలో ఉన్నాయి.
ఏప్రిల్ 2017. వెలుగుదారులలో…
పుస్తకం బాగా వచ్చిందని తెలుసు. అపురూప సంయమనంతో, తాజా సమకాలీన వ్యక్తీకరణతో ` మంచి పుస్తకం, జీవన సాఫల్యం!
చదువరుల నుంచి ఊహలకు మించిన స్పందన.
‘ఇంగ్లీషు చెయ్యండి, అవసరం’ ఖండాంతరాల నుంచీ డిమాండ్లు.
అనువాద ప్రక్రియ మొదలయింది.
నా ప్రమేయం లేకుండా అమ్మ ఏ పుస్తకమూ వేయలేదు.
అమ్మ ప్రమేయం లేని పుస్తకం అన్నది ఊహాతీతమైన విషయం.
కానీ, ఈసారి, ఈ అభినందన సంచిక ` తనకు సర్‌ప్రైజ్ బహుమతిగా…
తొంభై నిండిన మనుషులకు! అందునా రచయితలకు!!
ఇదే సరైన బహుమతి!!