అరవింద మోడల్ స్కూల్ పిల్లలు రాసిన అనుభవాలు
నాకు సంతోషాన్నిచ్చిన షీరోస్
నా పేరు ప్రదీప్తి. నేను ఆరో తరగతి చదువుతున్నాను. నేను మా పాఠశాల తరపున షీరోస్ కార్యక్రమంలో పాల్గొన్నాను. నా పాత్ర పేరు స్మితా సబర్వాల్. ఈవిడ తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
విధుల నిర్లక్ష్యాన్ని సహించేవారు కాదు. ఈవిడ మాతృభాష బెంగాలీ. ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. ఇలా తన గురించి వివరాలను నేను సేకరించి ఆవిడ యొక్క పాత్రధారణను గావించి మా యొక్క పాఠశాల తరపున షీరోస్ కార్యక్రమం జరిగిన చేతన అనే పాఠశాలకు వెళ్ళాను. నాకు ఆమె గురించి తెలుసుకోవడానికి మా తరగతి ఉపాధ్యాయులు సహాయం చేశారు. నాకు చేతన స్కూల్ ఎంతో నచ్చింది. అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా ఆనందం అనిపించింది. అందరం కలిసి ఆనందంగా ఆడుకున్నాము. అక్కడ మాకు భోజనం అందించారు. కార్యక్రమంలో మాకు పుస్తకాలు మరియు పుస్తకాల సంచి ఇచ్చారు. నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ` ప్రదీప్తి, 6వ తరగతి
అందమైన అనుభవం షీరోస్ కార్యక్రమం
నా పేరు శ్రీ చరిత. నేను అరవింద మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల తరపున గుంటూరు నగరంలో జరిగిన షీరోస్ ప్రోగ్రాంకి నేను నాట్యమయూరి సుధా చంద్రన్ పాత్ర ధరించి వెళ్ళడం జరిగింది. నేను ఆమె గురించి తెలుసుకోవడం కోసం అంతర్జాలం నందు, ఆమె జీవిత చరిత్రకు సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్స్ చదవడం జరిగింది. అలాగే ఆమె జీవిత చరిత్రకు సంబంధించిన ఆటోబయోపిక్ ‘మయూరి’ సినిమా చూసి ఎక్కువ సమాచారాన్ని తెలుసుకున్నాను. దీని ప్రకారం తను ఒక భరతనాట్యకారిణి. మద్రాసు నగరంలో ఒక ప్రదర్శన చేసి తిరుగు ప్రయాణం సమయంలో ఒక ప్రమాదంలో కాలు కోల్పోయింది. అయినప్పటికీ, కృత్రిమ కాలు ఏర్పరచుకొని ఎన్నో ప్రదర్శనలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు గడిరచింది. నేను ఆమె కథను ఏకపాత్రాభినయం చేయడానికి సిద్ధం చేసుకొని మా ఉపాధ్యాయురాలు, మా అమ్మగారి సహాయంతో మొదటగా అనుకున్నట్లు అయిదు నిమిషాల నిడివికి సరిపడా అభినయంతో మొత్తం సిద్ధం చేసుకున్నాను. జనవరి 9వ తేదీన ప్రదర్శన జరిగే స్థలంకు నా తోటి ప్రదర్శనకారులతో, మా ఉపాధ్యాయురాళ్ళతో కలిసి కార్యక్రమం జరిగే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ చివరి నిమిషంలో సమయాన్ని ఐదు నిమిషాల నుండి మూడు నిమిషాలకు కుదించారు. నేను వెంటనే మూడు నిమిషాలకు సరిపడా నా ప్రదర్శనను కుదించుకొని ప్రదర్శించాను. కానీ సమయానుభావం వలన నా మూడు నిమిషాల ప్రదర్శనలో 11 సెకండ్లు మాత్రమే చూపించినప్పటికీ అందరూ ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఒక నెల ముందు నుండి సాధన చేశాను. కానీ నాకు బహుమతి రానప్పటికీ ఒక పెద్ద ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందిస్తున్నాను. నా యందు నమ్మకంతో నాకు ఈ కార్యక్రమంలో అవకాశాన్నిచ్చి ప్రోత్సహించిన మా
ఉపాధ్యాయురాలికి, మా అమ్మ గారికి నా కృతజ్ఞతలు. ` శ్రీ కుసుమ చరిత, 9వ తరగతి
మరువలేని నిజం నా షీరోస్ అభినయం
నా పేరు ఆశ్రిత శ్రీ వర్ష. నేను షీరోస్ అనే కార్యక్రమంలో వందన శివ అనే ఆమె పాత్ర పోషించినందుకు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది, గర్వంగా కూడా అనిపించింది. మా స్కూల్ నుండి ఇంకా ఎన్నో పాత్రలుగా చాలామంది వచ్చారు. మేము కార్యక్రమం జరిగే చోటుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటో తీసుకున్నాము. మేమే కాదు, మాతోపాటు అక్కడ 256 మంది షీరోస్ వచ్చారు. మాకంటే బాగా తయారయ్యారు. మేము ప్రదర్శించే సమయంలో నాకు ఎంతో భయమేసింది. కానీ, భయాన్ని తొలగించుకొని మంచిగా ప్రదర్శించాను. నేను ప్రదర్శించిన తర్వాత అక్కడ ఉన్న జడ్జిలు నాకు చప్పట్లు కొట్టి అభినందించారు. అప్పుడు కొంచెం సంతోషంగా అనిపించింది. నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు బహుమతులు అందజేస్తారని చెప్పారు. మేమందరం నాలుగు గంటలకు బహుమతులు ఇచ్చే ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ 256 కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీలు 256 కంటే ఎక్కువే ఉండవచ్చు. కానీ 256 కుర్చీలలో షీరోస్ బ్యాగ్‌లు ఒకవైపు, సాధారణ ప్రజలు ఇంకొకవైపు కూర్చున్నారు. ఆ షీరోస్ బ్యాగ్‌లు తీసుకొని మేము కూర్చున్నాము. అక్కడ ఒక నిజమైన షీరో వచ్చింది. ఆవిడ ఎవరో కాదు. పది రూపాయల డాక్టర్ నూరి పర్వీన్. ఆవిడ మాకు బహుమతులు అందజేసింది. మొత్తం 32 మందికి బహుమతులు వచ్చాయి. ఆ 32 మందికి 1,115 రూపాయల విలువచేసే పుస్తకాలు, సర్టిఫికెట్‌తో కొనుక్కోవచ్చు. నాకు బహుమతి వస్తుందో రాదో అని చాలా భయమేసింది. కానీ నాకు బహుమతి వచ్చింది. నేను నమ్మలేకపోయాను. నాకు చాలా సంతోషం వేసింది, గర్వపడ్డాను కూడా. నాకు షీరోస్ వారు ఇచ్చిన సర్టిఫికెట్‌తో అశోక బుక్స్ సెంటర్‌లో పుస్తకాలు కూడా కొనుక్కున్నాను. మరువలేని నిజం నా షీరోస్ అభినయం. ` వి.ఆశ్రిత శ్రీ వర్ష
ఎంతోమంది మహనీయులను పరిచయం చేసిన షీరోస్ కార్యక్రమం
నా పేరు జోష్ణ. నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. షీరోస్ అనగా అనేక రంగాల్లో గొప్ప పనులు చేసిన మహిళల యొక్క కార్యక్రమం. నేను సుధా భరధ్వాజ్ అనే ఒక మహిళ యొక్క పాత్రను పోషించాను. నేను ఈ పాత్రను పోషించేందుకు తరగతి ఉపాధ్యాయురాలి సలహాలను, సూచనలను పాటించాను. మేము ఆ కార్యక్రమం జరిగే ప్రదేశానికి వెళ్ళాము. అక్కడ మాకు కొన్ని రూమ్ నెంబర్లు ఇచ్చారు. ఆ రూమ్ నెంబర్ల వాళ్ళందరూ వారి యొక్క పాత్రలను ప్రదర్శించి చూపించాలి. ఆ తర్వాత మేము వేదిక దగ్గరకు వెళ్ళాము. తర్వాత భోజనం చేసి క్విజ్‌లో పాల్గొన్నాము. వేదిక మీద బహుమతులు ఇచ్చారు. వాటితో పాటు కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చారు. అందులో 250 మంది మహిళల చిత్రాలతో, వారి గురించిన వివరాలతో ఉన్నటువంటి పుస్తకాన్ని మాకు బహుమతిగా అందించారు. ఎంతోమంది మహనీయుల యొక్క చరిత్రలను తెలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా అనిపించింది. ` జోష్ణ,
స్ఫూర్తినిచ్చిన షీరోస్ కార్యక్రమం
నా పేరు వేద సాయి శ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నాకు షీరోస్ కార్యక్రమం బాగా నచ్చింది. ఎందుకంటే ఒక గొప్ప స్త్రీ గురించి తెలుసుకుని, వాళ్ళలా మనల్ని మనం ఊహించుకోవడం, వాళ్ళు ఎలా ఉంటే అలా ఉండడం, వాళ్ళలా మాట్లాడడం నాకు ఎంతో నచ్చింది. ఈ కార్యక్రమంలో నేను సుధారెడ్డి గారి పాత్రను ఎంచుకున్నాను. ఆమె గురించి తెలుసుకుని ఆమెలా వేషం ధరించి, ఆమెలా మాట్లాడటం చేశాను. అలా చేయగలనా లేదా అని మొదట భయపడ్డాను. ఈ పాత్ర చేయడానికి నేను నా స్నేహితురాలి సహాయం కూడా తీసుకున్నాను. నేను ఈ పాత్రను ముఖాముఖి ద్వారా నా స్నేహితురాలితో కలిసి ప్రదర్శించాను. ప్రదర్శన అయిన తర్వాత మేము వేదిక దగ్గరికి వెళ్ళాము. అక్కడ ప్రతి ఒక్క షీరోస్‌కి ఒక సంచిలో ఏడు పుస్తకాలు పెట్టి ఇచ్చారు. ఒక పెద్ద పుస్తకమైతే ఆ రోజే ప్రదర్శించింది. అందులో మేమందరం చేసిన పాత్రలు కలిగిన వ్యక్తుల గురించిన సమాచారం ఉంది. ఇంకా ఇలా ఎంతోమంది బయటకు తెలియని గొప్ప స్త్రీలు మన దేశంలో ఉన్నారని, వారితో మళ్ళీ ఇంకో పుస్తకం తయారుచేసి ప్రచురిస్తారని అక్కడ మాకు తెలిపారు. ఇలాంటి స్త్రీమూర్తులు మాకు ఎంతో స్ఫూర్తినిస్తారని, ఈ అవకాశం నాకు వచ్చినందుకు సంతోషిస్తూ, ఇలాంటి అవకాశాలు అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ` జి.వేద సాయి శ్రీ,
ఆనందంగా అనిపించిన షీరోస్ కార్యక్రమం
నా పేరు హాసిని. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను షీరోస్ కార్యక్రమంలో పాల్గొన్నాను. షీరోస్ అంటే మహిళా వీర నారీమణులు. దేశంలో ప్రసిద్ధులైన మహిళలు. షీరోస్‌లో నాకు సుధామూర్తిగారి పాత్ర వచ్చింది. నాకు షీరోస్‌లో పాల్గొనాలని ఆ పాత్రను బట్టి అనిపించింది. సుధామూర్తిగారి గురించి తెలుసుకోవడానికి నేను అంతర్జాలాన్ని ఆశ్రయించాను. వారి వేషధారణ, మాట్లాడటం అన్నింటినీ అనుకరించాను. ఇక నేను మోనో యాక్షన్ ద్వారా చేయాలని ఆలోచించుకొని ప్రదర్శనను చేశాను. నేను మోనో యాక్షన్‌ని మొదటిసారిగా చేయడం వల్ల నాకు ఈ కార్యక్రమం ఎంతో బాగా నచ్చింది, చాలా ఆనందంగా అనిపించింది. ` టి.హాసిని
మా షీరోస్ కార్యక్రమం
నా పేరు జీవిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను సుజాత కృపలానిగా షీరోస్ కార్యక్రమంలో నటించాను. ఈ కార్యక్రమం చిలకలూరిపేటలో ఉన్న చేతన పాఠశాలలో జరిగింది. నేను ఈ కార్యక్రమం ద్వారా చాలా మంచి విషయాలను తెలుసుకున్నాను. అలాగే ఎంతోమంది షీరోస్ గురించి తెలుసుకున్నాను. షీరోస్ కార్యక్రమంలో నిర్వహించిన క్విజ్‌లో పాల్గొని ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. పాత్ర చేసే సమయంలో నేను పాత్ర చేస్తున్నాను అని నాకు అనిపించలేదు, నేనే ఆ పాత్రలో ఉన్నట్లు అనిపించింది. సుజాత కృపలాని పాత్రను ఎంచుకోవటానికి కారణం ఏమిటంటే దేశం కోసం ఎంతో కృషి చేసిన వారిలో ఆమె ఒకరు. ఆమె మన మొదటి మహిళా ముఖ్యమంత్రి. అందువల్ల నేను ఈ పాత్రను ఎంచుకున్నాను. షీరోస్ కార్యక్రమంలో వారు ఏడు పుస్తకాలను ముద్రణ చేశారు. అందులో ఒక పుస్తకాన్ని ఆహ్లా అనే ఏడో తరగతి అమ్మాయి రాసింది. ఆ అమ్మాయిని చూసి నేను చాలా ప్రభావితురాలినయ్యాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా తరగతి
ఉపాధ్యాయురాలు, నన్ను ఉత్సాహపరిచారు. నేను ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఈ కార్యక్రమం కోసం పడిన కష్టాన్ని మర్చిపోయాను. నేను ఈ షీరోస్‌ను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఒక షీరోగా ఉండాలని అనుకున్నాను. ఈ కార్యక్రమం చాలా గొప్పది. ఎందుకంటే మగవారే హీరోస్‌గా కాదు, ఆడవారు కూడా షీరోస్ అని తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం. మా షీరోస్ కార్యక్రమం అలా జరిగింది. ` జీవిత
నా షీరోస్ అనుభవాలు
షీరోస్ కార్యక్రమం ద్వారా మా విద్యార్థులందరికీ ఇలాంటి గొప్ప మహిళల గురించి కొంచెం అవగాహన వచ్చింది. విద్యార్థులకు వాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళలాగా అవ్వడానికి ఒక పెద్ద అవకాశం. విద్యార్థులు మహిళలలో గొప్ప గొప్ప నైపుణ్యం కలిగిన వాళ్ళని, వాళ్ళు వేషాలు ధరించి, వాళ్ళలాగా గొప్పవాళ్ళు అవ్వాలని చెప్పడమే ఈ షీరోస్ ముఖ్య ఉద్దేశ్యం నాలోని ఆలోచనను చూపడానికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పవచ్చు. దీని ద్వారా మాకు తెలియని వాళ్ళని కూడా తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ షీరోస్ కనిపెట్టిన వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలా మరికొంతమంది గొప్ప గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా మా స్కూలు యాజమాన్యాన్ని కోరుతూ, ఈ ప్రోగ్రాంను ప్రోత్సహించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
` ఎం.మనస్విని
ఆదర్శమైన కార్యక్రమం
షీరోస్ అనేది భారతదేశపు గొప్ప వీరవనితల గురించి తెలిపేందుకు నిర్వహించిన గొప్ప కార్యక్రమం. మన దేశంలో కొన్ని వందల మంది గొప్ప స్త్రీలు ఉన్నారు, కానీ, వారిలో కొంతమందికి మాత్రమే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఉదాహరణకు మదర్ థెరిస్సా, రాణి లక్ష్మీబాయి… ఇలాంటి వారే కాదు, ఇంకా ఎంతోమంది స్త్రీలు మన దేశం కోసం, మన కోసం పోరాడారు. కానీ, వారి గురించి ఎవరికీ ఏమీ తెలియదు. వారి గురించి ఈ దేశానికి తెలియజేయడమే షీరోస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాకుండా పురుషులే అన్ని రంగాల్లో గొప్ప అన్న నమ్మకాన్ని తప్పు అని, మహిళలు కూడా పురుషులకు ఏ మాత్రం తీసిపోరని, ఇద్దరూ సమానమే అని నిరూపించడం దీని మరో ముఖ్య ఉద్దేశ్యం.
ఈ షీరోస్ అనే భాగంలో మన దేశంలోని 256 మంది గొప్ప స్త్రీల గురించి రాసి ఉంటుంది. అహల అయ్యాల సోమయాజులు గారు దీన్ని రచించారు. దీనిలోని అద్భుతమైన చిత్రాలను బాబు దుండ్రేపల్లి గారు చిత్రించారు. ఈ పుస్తకంలో లెక్కించబడిన 256 మంది వీర వనితలను ఆదర్శంగా తీసుకోవాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. డాక్టర్ శివ, అహల అయ్యాల సోమయాజులు మరియు బాబు దుండ్రేపల్లి గార్ల యొక్క అనేక సంవత్సరాల కష్టమే ఈ షీరోస్ పుస్తకం.
ఈ పుస్తకంలోని చక్కని సమాచారం, మన సమాజానికి ఎంతో అవసరమని, ఈ పుస్తకంతో స్త్రీలు ఆదర్శప్రాయంగా నిలుస్తారని, సమాజంలో వారికి కొంత పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయని నేను భావిస్తున్నాను. ఈ పుస్తకంలోని స్త్రీలు నాలాంటి ఎంతోమందికి ఆదర్శం కావాలని, ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలని కోరుకుంటూ… ధన్యవాదములు.
` ఎం. తనుశ్రీ