ఔనెందుకో…!
ఆమెకు ఊరూ పేరూ ఉండదు
పనులన్నీ చేసి పెట్టినందుకు గాను
‘పనామె’గానే
కీర్తించబడుతుంది.
ఈ రోజు మా మిత్రులు
వాళ్ళ పనామెలపై అసహనాన్ని
వెళ్ళగక్కుతున్నారు
సమయానికి రాదనో…
సరిగ్గా తోమదనో…
సందు దొరికితే డుమ్మా అనో…
సబ్బు అరగదీస్తుందనో…
బుడ్డ పోరికి జరమనో,
ఊరికి పోవాల్ననో వంకలెన్నో పెడుతుందని
ఆరోపిస్తున్నారు!
వాళ్ళ మైలబట్టలను
మల్లెపువ్వులుగా,
చింపిరి వాకిళ్ళ చిక్కు దువ్వి
ఎంగిలి బోళ్ళ మిలమిలా
మెరిపించినందుకు
సమర్పించుకుంటున్న సత్కారం
అదీ వాళ్ళ సంస్కారం
ఆమె…
ప్రాణం లేని వస్తువో
పని యంత్రమో
అనుకుంటున్నారీ వైట్ కాలర్ ఎంప్లాయీస్
మూతి విరిచి ముఖం చిట్లిస్తూ
ఉతికి ఆరేస్తున్నారు
అరకొర కొత్తలని విదిల్చి
అరవై సార్లు వల్లిస్తున్నారు కానీ
వారాంతపు సెలవులు,
పెన్షన్లు, పేస్కేళ్ళు, కరువు భత్యాలు
ఇతర అలవెన్సుల
కోసం పోరిందా ఏనాడైనా
ఆలోచించరే!?
స్వర్ణ చెంచాతో
పుట్టకపోవడం ఆమె నేరమా
స్కీములు, స్కాములు, దోపిడీ, దౌర్జన్యం
కాదనుకునే నాలుగిళ్ళల్లో చాకిరీకి
తలవంచిందీ పనిపిల్ల
సాటి మనిషి శ్రమని
గౌరవించని
వీళ్ళ హృదయ వైకల్యం కన్నా
పేదరికం లోంచి మొలిచిన
ఈ స్వచ్ఛ మల్లె శ్రమ సౌందర్యానికి
ప్రణమిల్లాలని ఉంది…!
`