మొఘలుల చరిత్రకు మరో చేర్పు ద గ్రేట్‌ మొఘల్స్‌ – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

భారతదేశ చరిత్రలో తీవ్రంగా వివాదాస్పదం చేయబడుతున్న భాగాల్లో మొఘలుల చరిత్ర ప్రధానమైనది. ఎంత తీవ్రంగా వీరి చరిత్ర వివాదాస్పదమౌతోందో, అంతే పెద్ద ఎత్తున వీరి చరిత్రపై పుస్తకాలూ వెలువడుతున్నాయి. అలా ఇటీవల వెలువడ్డ ఒక ముఖ్యమైన పుస్తకం ప్రొఫెసర్‌ ఫర్హత్‌ నస్రీన్‌ రచించిన ద గ్రేట్‌ మొఘల్స్‌.

చాలావరకు ఫారసీ (పర్షియన్‌) భాషలోని ప్రాథమిక ఆకరాల మీద ఆధారపడి రాసిన ఈ పుస్తకంలో భారతదేశంలో మొఘల్‌ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్‌ మొదలుకొని చివరి గొప్ప మొఘల్‌ చక్రవర్తి అయిన ఔరంగజేబ్‌ వరకూÑ చిట్టచివరి మొఘల్‌ చక్రవర్తి అయిన బహదూర్‌ షా జఫర్‌పైన ఒక అధ్యాయమూ కలుపుకొని మొత్తం ఎనిమిది అధ్యాయాలున్నాయి. ప్రధానంగా ఈ ‘గొప్ప’ మొఘలుల రాజకీయ చరిత్రే అయినప్పటికీ, వారి కాలం నాటి సాంఘిక, సాంస్కృతిక, మత, ఆర్థిక కోణాలనూÑ మొఘలుల వ్యక్తిగత జీవిత అంశాలు, కుటుంబ జీవిత విశేషాలు కూడా చరిత్రకారిణి ఫర్హత్‌ నస్రీన్‌ రాజకీయాల్లో అంతర్భాగంగానే చిత్రించారు. అంతే కాకుండా, వారిలోని వఎశ్‌ీఱశీఅaశ్రీ పార్శ్వాన్నీ, న్యాయదృష్టినీ, మానవీయ కోణాల్నీ చూపెట్టారు.
ఫర్ఘానా, సమర్ఖండ్‌లను గెలుస్తూ, కోల్పోతూ, చివరికి కాబూల్‌ చేరుకున్న జహీరుద్దీన్‌ ముహమ్మద్‌ బాబర్‌కు (జననం: 1483 ఫిబ్రవరి 14) అక్కడ యేర్పడిన తీవ్రమైన రాజకీయ అనిశ్చితి కారణంగా, అనివార్యంగా, భారతదేశం వైపు చూడాల్సి వచ్చింది. 1526 ఏప్రిల్‌ 20న జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంతో మధ్యయుగ భారతదేశ రాజకీయాలూ, సమాజ గతీ మారిపోయాయి. ఆటోమన్‌ టర్కిష్‌ యుద్ధ విధానాల్ని (సాధారణ సైనికులూ, యుద్ధ కమాండర్లూ ఒకేసారి శత్రువుపై విరుచుకుపడడంÑ పరిగెడుతున్న గుఱ్ఱాలపై నుంచే బాణాలను వర్షించడం మొదలైనవి) అవలంబించడం కారణంగా, కేవలం 12 వేల సైన్యాన్ని కలిగిన బాబర్‌, ఒక లక్ష సైన్యాన్ని కలిగిన ఢల్లీి సుల్తాన్‌ ఇబ్రహీం లోడీపై సులభంగా విజయం సాధించాడు. బాబర్‌కు రాజకీయంగా విజయమైతే లభించింది గానీ స్థానికుల నుండి సామాజిక ఆమోదం (సోషల్‌ యక్సెప్టెన్స్‌) కష్టమైపోయింది. ఆగ్రాలో నివసించిన తొలినాళ్లలో మొఘలులకు స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యేది. వాళ్లు కనిపిస్తే చాలు స్థానికులు పారిపోవడమో, దుకాణాలు మూసివేయడమో చేసేవారు! ఈ విధంగా ప్రారంభంలో మొఘలులు ‘పరాయితనాన్ని’ ఎదుర్కోవాల్సి వచ్చింది. అననుకూలమైన భారత వాతావరణం సహా యిక్కడి పరిస్థితుల్లో యిమడలేకపోయిన బాబర్‌ సైనికాధికారులు కాబూల్‌కు తిరిగి వెళ్లాలని భావించారుÑ బాబర్‌కు బాగా దగ్గరివాడైన అధికారి ఖ్వాజా కలన్‌ లాంటి వాళ్లు యిక ఎప్పటికీ ‘హిందుస్తాన్‌’కు తిరిగిరామని చెప్పి వెళ్లిపోయారు. బాబర్‌కా, గత్యంతరం లేదు. ఎలాగైనా చేసి ఇక్కడే వుండాలి. అందుకే భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఢల్లీి సుల్తానుల కాలంలో మిన్హజ్‌ సిరాజ్‌ రాసిన చరిత్ర గ్రంథం తబాకత్‌ అల్‌ నాసిరీని చదివాడు. అంతేకాకుండా, భారతదేశాన్ని చాలా జాగ్రత్తగా, దగ్గరగా గమనించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగానే స్థానికులు పవిత్రంగా భావిస్తున్న జంతువుల్నీ, పక్షుల్నీ చంపకూడదనీ, గాయపరచకూడదనీ నిర్ణయించుకున్నాడు.
1527 మార్చి 17న జరిగిన ఖాణ్వా యుద్ధంలో చిత్తోడ్‌ రాజు రాణా సంగ్రామసింప్‌ాను బాబర్‌ ఓడిరచాడు. యుద్ధ ప్రారంభంలో తాను ఓటమికి గురయ్యే పరిస్థితులు కన్పించడంతో సైనికుల్లో సమరోత్సాహ ఉద్వేగాల్ని నింపడానికి 1527 ఫిబ్రవరి 25న మద్యం ముట్టనని ప్రతిజ్ఞ చేశాడు. తద్వారా రెలిజియస్‌ ఎమోషనలిజమ్‌ రగిల్చి, దాన్ని తనకనుకూలంగా మలచుకున్నాడు. కానీ, తాగనని ప్రమాణం చేసినందుకు తర్వాత రోజుల్లో పశ్చాత్తాప పడ్డాడు! త్రాగుడు వ్యసనం బాబర్‌కు అతని తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించిందన్నారు ఫర్హత్‌ నస్రీన్‌. విపరీతంగా తాగేవాడట. మద్యపానం ఇస్లామిక్‌ జీవన విధానానికి పూర్తిగా వ్యతిరేకమైనదైనప్పటికీ, తాగి తూలాడుÑ తూలుతూ తాగాడు. మతం కోసం మధురాతిమధురమైన మదిరను వదులుకోలేకపోయాడు! ఇష్టమైన వాటిని వదులుకోవడం కష్టమే!!
బాబర్‌ పెద్దగా రాచరిక భేషజాలు ప్రదర్శించని సింపుల్‌ మనిషి. తన సైన్యంలోని సాధారణ సైనికులను కూడా బాగా ప్రేమించేవాడు.
ఉదాహరణకు, ఒకసారి హీరట్‌ నుండి కాబూల్‌కు వచ్చేటప్పుడు, భయంకరమైన మంచు తుఫాను రేగింది. దాన్నుంచి రక్షణ పొందడానికి ఒక గుహలో తలదాచుకొమ్మని బాబర్‌కు సలహా యిచ్చారు అధికారులు. కానీ, ఆ గుహ అందరికీ, అంటే సామాన్య సైనికులు సహా తన వాళ్ళందరికీ, సరిపోయేదిగా లేకపోవడంతో అధికారుల అభ్యర్థనను నిరాకరించాడు బాబర్‌. తర్వాత అందరికీ సరిపోయే గుహ దొరికింది. అందరితో కలిసి తలదాచుకున్నాడు. అలాగే, సాధారణంగా మధ్యయుగాలనాటి పాలకుల్లో పెద్దగా కన్పించని క్షమాగుణం బాబర్‌లో ఎక్కువగా వుండేది. తన స్వీయచరిత్ర అయిన బాబర్‌నామా లో క్షమతత్వపు గొప్పదనం గూర్చి రాయడంతోనే సరిపెట్టుకోకుండా, వాస్తవ జీవితంలో తనకు ద్రోహం చేసిన ఎందరినో క్షమించి వదిలేశాడు. ఉదాహరణకు, 1506`07లో తనని రాజ్యభ్రష్టున్ని చేయడంలో కుట్రపన్నిన ముహమ్మద్‌ హుసేన్‌ మీర్జా దుఘ్లత్‌ కుమారుడైన ఎనిమిదేళ్ల మీర్జా హైదర్‌ దుఘ్లత్‌కు 1508 నుంచి 1512 వరకు ఆశ్రయం ఇచ్చి, సొంత కొడుకులా చూసుకున్నాడు. ఈ విషయాన్ని మీర్జా హైదర్‌ తన పుస్తకం తారీఖ్‌`ఇ`రాషిదీలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రస్తావించాడని ఫర్హత్‌ నస్రీన్‌ పేర్కొన్నారు. అలాగే, తనని విష ప్రయోగం ద్వారా చంపించాలని కుట్ర పన్నిన ఇబ్రహీం లోడీ తల్లి అయిన బువాను కూడా క్షమించి, ప్రాణాలతో వదిలేశాడట.
వివిధ మాధ్యమాల పుణ్యమా అని మనకు తెలియకుండానే అలవాటైపోతున్న మతతత్త్వ చారిత్రక అవగాహన వల్ల, సాధారణంగా ముస్లిం రాజుల్ని ‘క్రూరులు’గానూ, ‘నిర్దయులు’గానూ చిత్రీకరిస్తుంటారు. (అంటే వాళ్ళలో క్రూరులూ, పాతకులూ లేరని కాదు). కానీ, వాళ్ళలో కూడా మానవత్వం పరిమళించిందనీ, వాళ్ళూ సాధారణ మనుషుల్లానే ప్రవర్తించేవారనీ నిరూపించడానికి అనేక ఉదాహరణలిచ్చారు చరిత్రకారిణి ఫర్హత్‌ నస్రీన్‌. ఆమె ప్రకారం, బాబర్‌లో మానవత్వం పాళ్లు ఎక్కువÑ చాలా సున్నిత మనస్కుడు. ఒకసారి ఒక మిత్రుడు కాబూల్‌ నుండి కర్బూజా ఫలాన్ని తెస్తే, దాన్ని తింటూ కన్నీళ్లు పెట్టుకున్నాడట. బాబర్‌ తన కుటుంబాన్ని చాలా ప్రేమించేవాడు. రాచకార్య నిర్వహణలో ఎంతగా తలమునకలై వున్నప్పటికీ, కుటుంబం కోసం సమయం వెచ్చించేవాడు (యిప్పుడు దీన్నే మనం ‘నబaశ్రీఱ్‌వ ్‌ఱఎవ’ అని ముద్దుగా పిల్చుకుంటున్నాం). తన తల్లితో కలిసి బంధువులను సందర్శించడంÑ భార్యలతో, పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్లడం మొదలైనవి చేసేవాడు. కొడుకు హుమయూన్‌ ఆరోగ్యం కోసం తన ప్రాణం తీసుకొని కొడుకు ప్రాణాన్ని కాపాడమని అల్లాని ప్రార్థించి తండ్రి మనసు చాటుకున్నాడు. తన అనారోగ్యం దృష్ట్యా సాధారణ తండ్రిలా ఆలోచించి కుమార్తెలైన గుల్‌రంగ్‌, గుల్‌చెహ్రాల వివాహాలు త్వరగా చేసేశాడు. ముఖ్యంగా, వయసు రీత్యా పెద్దవాళ్ళైన బంధువులతో బాబర్‌ ఎంత ప్రేమగా వుండేవాడంటే, కనీసం వారానికొకసారైనా వారిని పలకరించి యోగక్షేమాలు కనుక్కునేవాడు. తన పిల్లల అభివృద్ధిలో అత్యంత శ్రద్ధ కనబరిచేవాడు. అసాధారణ పుస్తక ప్రియుడైన బాబర్‌, తన పిల్లలకు పుస్తకాలను బహుమతులుగా యిచ్చేవాడు. తన కొడుకు హుమయూన్‌ బదక్షాన్‌ను పాలిస్తున్నప్పుడు ఉత్తరాలు అక్షర దోషాలు లేకుండా బాగా అర్థమయ్యేలా ఎలా రాయాలో సలహా యిచ్చాడు. ‘సోమరితనమూ, విలాసవంతమైన జీవితమూ రాచరికానికి సరిపడవ’నీ, వేగమున్న వాడిదే లోకమని తెలుసుకొమ్మనీ హుమయూన్‌ను హెచ్చరించాడు.
చదవడం, రాయడం మొదలైన బౌద్ధిక కార్యకలాపాల్లో బాబర్‌కు ఆసక్తి ఎక్కువగా వుండేది. తన మాతృభాష అయిన తుర్కీలో స్వీయచరిత్ర తుజుక్‌`ఇ`బాబరి/బాబర్‌నామా ను రచించాడు. ఖురాను ప్రతిని రాసి మక్కాకు పంపించాడు. ముబయ్యిన్‌ అనే మత గ్రంథాన్నీ, మధ్య ఆసియా సూఫీ గురువు రచన అయిన రిసాలా`ఇ`వలీదియా నూ పద్య రూపంలో రచించాడు. ఉత్తమ సాహిత్యాభిలాషి అయిన బాబర్‌, మంచి సాహిత్య విమర్శకుడని కూడా ఫర్హత్‌ నస్రీన్‌ పేర్కొన్నారు.
బాబర్‌ స్నేహశీలి. తొమ్మిదిమంది కన్నా పదిమంది మిత్రులుండడం మేలనుకున్న భోళాశంకరుడు. ‘మిత్రులతో కలిసి మరణించడాన్నీ పండుగ’గానే భావించాడు. పిసినిగొట్టుల్నీ, వందిమాగధుల్నీ దగ్గరికి రానిచ్చేవాడు కాదు. మాటలు కూడా జాగ్రత్తగా వాడాలనేవాడు. విజయాలు సాధించి, రాజ్యం స్థాపించినప్పటికీ, ఏదో ఒకరోజు ఈ భౌతిక ప్రపంచాన్ని ఖాళీ చేసి వెళ్లాలనే స్పష్టమైన అవగాహన ఉన్నవాడు కాబట్టే, మనుషులు ఉత్తమ గుణాల్ని కలిగి వుండాలనీ, అవే వాళ్ళు మరణించాక కూడా వాళ్ళను గుర్తుంచుకునేలా చేస్తాయనీ భావించాడు. మత ప్రాతిపదికన బాబర్‌ ఎవరి పట్లా వివక్ష చూపలేదని స్పష్టం చేసిన ఫర్హత్‌ నస్రీన్‌, రాజకీయపరంగా ముస్లింలైన ఆఫ్ఘన్లూ, ఉజ్బేగ్లూ అతనికెంత శతృవులో హిందువులైన రాజపుత్రులు కూడా అంతే శత్రువులని చెప్పడం గమనార్హం. భారతదేశాన్ని హృదయపూర్వకంగా ప్రేమించిన బాబర్‌ 48 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. భారతదేశాన్ని పాలించిన కాలాన్ని కూడా కలుపుకొని మొత్తం 36 సంవత్సరాలు రాజ్యాన్నేలాడు.
బాబర్‌, మహమ్‌ బేగంల పెద్ద కుమారుడైన నాసిరుద్దీన్‌ ముహమ్మద్‌ హుమయూన్‌ (1508`1556) బాల్యం కాబూల్‌లో గడిచింది. 12 సంవత్సరాల వయసులో బదక్షాన్‌ రాజప్రతినిధిగా నియమించబడ్డాడు. భారతదేశంలో మొఘల్‌ సామ్రాజ్య స్థాపనలో తండ్రికి సహాయం చేశాడు. యింకా పూర్తిగా సంఘటితం కాని మొఘల్‌ సింహాసనాన్ని 1530 డిసెంబరు 29న అధిష్టించిన హుమయూన్‌, తీవ్రమైన రాజకీయ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఒకవైపు ఆప్ఘన్లనూ, గుజరాత్‌ సుల్తాన్‌ బహదూర్‌ షానూÑ ఇంకోవైపు బీహార్‌`బెంగాల్‌ల కోసం షేర్షా (ఫరీద్‌ ఖాన్‌)నూ ఎదుర్కొన్నాడు. గుజరాత్‌ను గెలిచి తమ్ముడు అస్కారీని రాజప్రతినిధిగా నియమించినప్పటికీ, త్వరలోనే ఆ ప్రాంతాన్ని కోల్పోయాడు. 1540 మార్చి 17న జరిగిన కనౌజ్‌ యుద్ధంలో షేర్షా చేతుల్లో ఓడిపోవడంతో హుమయూన్‌ కష్టాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, ఒక రకంగా దేశద్రిమ్మరిలా తయారయ్యాడు. తర్వాత ఎంతో కష్టపడి గాని పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోలేకపోయాడు.
పరిపాలనలో ‘న్యాయం’ అనే అంశానికి అధిక ప్రాధాన్యమిచ్చాడు హుమయూన్‌. తన అంతఃపురం వెలుపల న్యాయగంట (‘తబ్ల్‌`ఇ`అదల్‌’)ను ఏర్పాటు చేశాడు. న్యాయం కోరుకున్న వారు తమకు జరిగిన అన్యాయం తీవ్రతను బట్టి ఒకసారో, రెండుసార్లో, మూడుసార్లో ఈ గంటను మ్రోగించేవారు. పోగొట్టుకొని మళ్ళీ సంపాదించుకున్న రాజ్యాన్ని నిలుపుకోవడానికి ఎంతలా అష్టకష్టాలు పడ్డప్పటికీ, సామాన్య ప్రజలకు న్యాయాన్నందించే విషయంలో మాత్రం హుమయూన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడలేదు. జౌహర్‌ అఫ్తాబ్చి అనే అతన్ని హైబత్‌పూర్‌ తహసీల్దారుగా నియమిస్తూ అవినీతిపరుడైన ఒక మొఘల్‌ అధికారి కథను చెప్పాడు. జిల్లాధికారిగా నియమించబడిన మొదటిరోజే దుర్మార్గుడైన ఆ అధికారి ఒక పేదవాడి దుప్పటిని బలవంతంగా లాక్కున్నాడట. ఆ పేదవాడు ప్రతిఘటించినప్పుడు తనని అలాంటి పనుల కోసమే, అంటే ‘‘లాక్కునే’’ పనుల కోసమే, ప్రభుత్వం నియమించిందని తెలుసుకోవాలని గద్దిస్తూ పెడసరంగా సమాధానమిచ్చాడట. ఇందులో వున్న వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న జౌహర్‌ తను అలా అవినీతికరంగా, అన్యాయంగా ప్రవర్తించనని వాగ్దానం చేశాడు. దీనికి సమాధానంగా హుమయూన్‌ ‘మంచి మంచినీ, చెడు చెడునూ సృష్టిస్తుంది’ అని అన్నాడు. తర్వాత కాలంలో జౌహర్‌ తన పరగణాలో అప్పుల కారణంగా రైతుల భార్యలూ, పిల్లలూ షాహుకార్ల బానిసలుగా చేయబడ్డారనీ, ధాన్యం చట్ట వ్యతిరేకంగా నిలువ చేయబడిరదనీ, తాను దాన్నమ్మించి, బానిసలుగా మార్చబడిన ప్రజల్ని బానిసత్వం నుండి విడిపించాననీ హుమయూన్‌కు తెలిపాడు. దీంతో సంతోషపడ్డ హుమయూన్‌ ఆ అధికారి హోదాను పెంచాడు.
హుమయూన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడే మనిషి. ఒకసారి షేర్షా సైన్యం తనపై మెరుపుదాడి చేసినప్పుడు, నిజాముద్దీన్‌ అనే నీళ్ళు మోసే సేవకుడు హుమయూన్‌ను రక్షించాడు. హుమయూన్‌ మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. దానికి ప్రతిఫలంగా హుమయూన్‌ అతన్ని ఒకరోజు తన సింహాసనంపై కూర్చోబెడతానని వాగ్దానం చేసి, ఎంత మంది పెద్ద పెద్ద అధికారులు వారించినప్పటికీ వినకుండా ఆ సేవకున్ని సింహాసనంపై కూర్చోబెట్టి తన వాగ్దానాన్ని నిలుపుకున్నాడు. ఆడి తప్పని మనీషి!
ఃఖఱఅస్త్రంష్ట్రఱజూ సఅశీషం అశీ సఱఅంష్ట్రఱజూః అనేది నానుడి. కానీ, హుమయూన్‌ విషయంలో యిది సరికాదు. అతను రక్తసంబంధాలకు చాలా విలువనిచ్చేవాడు. తనకు మాటిమాటికీ అడ్డు తగులుతున్న సోదరుడు కమ్రాన్‌ని చంపించమని ఆస్థానంలోని ఉన్నతాధికారులు సలహా ఇచ్చినపుడు ‘నశ్వరమైన ఈ ప్రపంచం కోసం’ సోదరుడి రక్తంతో తన చేతిని కళంకితపర్చుకోలేననీ, తన తండ్రికి యిచ్చిన మాట ప్రకారం సోదరులకు హాని తలపెట్టలేననీ సమాధానమిచ్చాడు. అలాగే, యింకో సోదరుడైన హిందాల్‌ చనిపోయినపుడు కన్నీరుమున్నీరుగా యేడ్చాడు.
పెళ్లికి ముందు హుమయూన్‌కూ, అతని భార్య అయిన హమీదా బానూ బేగంకూ మధ్య జరిగిన రసవత్తరమైన ప్రేమ వ్యవహారాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది. మొదట హమీదా హుమయూన్ను అస్సలు పెళ్లాడదలచుకోలేదు. కానీ, హుమయూన్‌ పట్టు వదలని ప్రేమమార్కుడయ్యాడు. అతని తరఫున వివిధ వ్యక్తులు సుమారు 40 రోజులపాటు మధ్యవర్తిత్వం నెరిపిన తర్వాత పెళ్లికి ఒప్పుకుంటుంది! (ఈ ప్రేమ వ్యవహారమంతా ఒక సినిమా కథలా హృదయానికి హత్తుకునేలా వుంది). వీరి కుమారుడే ప్రఖ్యాతి వహించిన అక్బర్‌, ద గ్రేట్‌. ‘అక్బర్‌’ అనే పదానికి ‘గొప్పవాడు’ అని అర్థం.
1556 ఫిబ్రవరిలో పట్టాభిషిక్తుడయ్యేనాటికి జలాలుద్దీన్‌ ముహమ్మద్‌ అక్బర్‌ (పాలనా కాలం: 1556`1605) వయస్సు కేవలం 14 సంవత్సరాలు. బైరాంఖాన్‌ సంరక్షణలో పెరిగాడు. తనకిష్టంలేని వారందర్నీ అక్బర్‌కు దూరం చేసిన బైరాంఖాన్‌, సర్వ శక్తివంతుడుగా ఎదగడమే కాకుండా, వాస్తవంలో చక్రవర్తిగా వ్యవహరించేవాడు. అయితే, ఎంత శక్తివంతుడుగా ఎదిగాడో, అంతే తీవ్ర వ్యతిరేకతనూ ఎదుర్కొన్నాడు. అది సహజమే! ఎట్టకేలకు బైరాంఖాన్‌ పట్టు నుండి బయటపడదల్చుకున్న అక్బర్‌ ‘వకీల్‌’ పదవిని రద్దుచేస్తూ ఫర్మాన్‌ జారీచేసి, అతని వెన్ను విరిచాడు. తిరగబడ్డ బైరాంఖాన్‌ను 1560 ఆగస్టు 23న సయ్యద్‌ మొహమ్మద్‌ అట్కా ఓడిరచాడు. బైరాంఖాన్‌ మక్కా వెళ్లాలనుకున్నాడుÑ కానీ, మార్గమధ్యంలోనే 1561లో చంపివేయబడ్డాడు. మొఘల్‌ దర్బారులోని వివిధ అధికార వర్గాల మధ్య రాజుకుంటున్న అంతర్గత వైషమ్యాలను అత్యంత నిపుణతతో పరిష్కరించిన అక్బర్‌, పరిపాలనను గాడిలో పెట్టడానికి చాలా మంచి పనుల్ని చేపట్టాడు.
అక్బర్‌ చేపట్టిన అనేక అభ్యుదయకరమైన పనులను వివరించి, అతన్ని ‘ఉదారుడి’గా నిరూపించారు చరిత్రకారిణి ఫర్హత్‌ నస్రీన్‌. ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మారువేషంలో ఆగ్రా వీధుల్లో తిరిగేవాడు అక్బర్‌. యుద్ధంలో పట్టుబడిన సైనికులను బానిసలుగా మార్చే విధానాన్ని 1562లో నిషేధించాడు. 1564లో అత్యంత హేయమైన జిజియా పన్నును తొలగించాడు. 1565లో అనేక హిందూ దేవాలయాలకు భూములు దానం చేశాడు. హిందువులు పవిత్రంగా భావిస్తారు కాబట్టి, గోరక్షణ కోసం ఫర్మాన్‌లు జారీచేశాడు. సమర్థుడైన తోడర్‌మల్‌ తోడ్పాటుతో భూమిశిస్తు విధానాన్ని సంస్కరించి, సాధ్యమైనంత వరకు, జమీందార్లు రైతుల్ని చిదిమేయకుండా చూశాడు. సైనిక వ్యవస్థను చక్కబెట్టడానికి గుర్రాలకు ముద్రలేసి సైనికుల వివరాలను నమోదు చేసే ‘దాహో చెహరాల్‌ దాఘో మహాల్‌’ అనే వ్యవస్థను ప్రవేశపెట్టి, అవినీతిని కట్టడి చేసి, అవినీతికి పాల్పడ్డ అధికారులను శిక్షించాడు.
రాజపుత్ర స్త్రీలతో వివాహం అక్బరు వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని నిరూపించారు ఫర్హత్‌ నస్రీన్‌. అక్బర్‌ ఆస్థాన చరిత్రకారుడూ, అత్యంత అంతరంగికుడూ అయిన అబుల్‌ ఫజల్‌ ప్రకారం, ఇంట్లో వున్నా, ప్రయాణంలో వున్నా, హిందువులు పవిత్రంగా భావించే గంగాజలాన్నే త్రాగేవాడు అక్బర్‌ (పు. 81). యమునా లేదా చీనాబ్‌ నీళ్లతో వంట చేసినప్పటికీ, అందులో కొంచెం గంగాజలాన్ని కలిపేవారట (పు. 81`82). గంగమ్మ తల్లిని అంతగా ఆరాధించాడు.
మొదట్లో ఛాందస ఉలేమాల ప్రభావంలో వుండి, షియాలు మొదలైన వారి పట్ల అన్యాయంగా ప్రవర్తించినప్పటికీ, క్రమక్రమంగా
ఉదారవాదం వైపు మొగ్గాడు అక్బర్‌. అతనికి ఉదారవాద దృష్టికోణం అలవడ్డంలో ఖ్వాజా మొయినుద్దీన్‌ చిష్తీ (అజ్మీర్‌), షేక్‌ సలీం చిష్తీ (ఫతేపూర్‌ సిక్రీ) మొదలైన సూఫీ గురువుల ప్రభావం కూడా ఎంతో వుంది. షేఖ్‌ ముబారక్‌, అతని కుమారులైన అబుల్‌ ఫజల్‌, ఫైజీలు కూడా అతని ప్రాపంచిక దృష్టినీ, ఆధ్యాత్మిక ఆచరణనూ తీవ్రంగా ప్రభావితం చేశారు. హిందూమతం పట్ల పూర్తిస్థాయి సానుకూల దృక్పథం కనబరిచిన అక్బర్‌, దాన్ని స్వయంగా అర్థం చేసుకోవడానికీ, పర్షియన్‌ ప్రపంచానికి హిందూ సంస్కృతిని పరిచయం చేయడానికీ ‘మక్తబ్‌ ఖానా’ అనే అనువాద విభాగాన్ని 1573లో యేర్పాటుచేసి, అనేక సంస్కృత గ్రంథాలను ఫారసీలోకి అనువదింపజేశాడు. అలా ‘అథర్వణ వేదం’ (అథర్బణ్‌), ‘మహాభారతం’ (రజ్మ్‌నామ), ‘రామాయణం’, ‘హరివంశ పురాణం’ (హరిబన్స్‌), ‘లీలావతి’, ‘రాజతరంగిణి’, ‘పంచతంత్రం’ మొదలైనవి సంస్కృతం నుండి పర్షియన్‌లోకి అనువదించబడ్డాయి. అక్బర్‌ హయాంలో ఇలా అనువదించబడ్డ సంస్కృత గ్రంథాల చిట్టా చాలా పొడుగ్గానే వుంది! సంకుచితత్వం కారణంగా ముస్లింలు హిందూ సంస్కృతిని అధ్యయనం చేయడం లేదనీ, ముస్లింలు సంకుచితత్వం నుండి బయటపడాలనీ అక్బర్‌ ఆస్థాన చరిత్రకారుడైన అబుల్‌ ఫజల్‌ నొక్కిచెప్పాడు. అతని ఐన్‌`ఇ`అక్బరీ లో ఒక అధ్యాయం మొత్తం హిందూ మతం, సంస్కృతి, ఆలోచనా విధానం, ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయాలను చర్చించింది. భారతీయ సంస్కృతిలో హిందువులు, జైనులు, బౌద్ధుల్లాగే ముస్లింలు కూడా విడదీయరాని భాగమని ఈ అధ్యాయం నొక్కి వక్కాణించిందనీ, ఆవిధంగా భారత ఉమ్మడి సంస్కృతిని ప్రస్ఫుటంగా ప్రకటించిందనీ వివరించారు ఫర్హత్‌ నస్రీన్‌.
1575లో ‘ఇబాదత్‌ ఖానా’ అనే విశాల ఆధ్యాత్మిక వేదికను యేర్పాటు చేయడం ద్వారా మతం విషయంలో ఒక క్రొత్త ప్రయోగాన్ని చేశాడు అక్బర్‌. ఇందులో మత విశ్వాసాలూ, ఆచరణా మొదలైనవాటికి సంబంధించిన అనేక విషయాలను తీవ్రంగా చర్చించేవారు. ప్రారంభంలో ‘ఇబాదత్‌ ఖానా’ కేవలం ముస్లింలకే పరిమితమైనప్పటికీ, తర్వాత కాలంలో ముస్లిమేతరులను కూడా ఆహ్వానించారు. వివిధ శాఖలకూ, భావజాలాలకూ సంబంధించి ముస్లింలలోనే వున్న అనేక అంతర్వైరుధ్యాలను చక్కగా గ్రహించిన అక్బర్‌, సంకుచితత్వానికీ, ఛాందసత్వానికీ బాగా దూరంగా జరిగాడు. ఇబాదత్‌ ఖానా సమావేశాల్లో ఛాందసవాద ఉలేమాలతో తలపడ్డానికి ఉదారవాదులను ఎగదోసేవాడు. తను జడ్జ్‌గా వుండి వారి వాగ్వాదాలను ఆస్వాదించేవాడు. చక్రవర్తి అయినప్పటికీ చిలిపితనం పోలేదు! అక్బర్‌ ఆచరణ వల్ల అతనేమతానికి చెందుతాడనే విషయంలో సమకాలీనులు షశీఅటబంవ అయిపోయారు. ఛాందస ముస్లింలు అతన్ని ఇస్లాం వ్యతిరేకి అని ఈసడిరచారు. క్రైస్తవులు తమ మతంలోకి వస్తాడని ఆశించారు. కానీ, తనెక్కడున్నాడో అక్బర్‌కు స్పష్టంగా తెలుసు! అక్బర్‌ ‘అనాచారాల్ని’ ఎంతమాత్రమూ ఇష్టపడక తీవ్రగా విమర్శించిన ముల్లా అబ్దుల్‌ కాదిర్‌ బదౌని ప్రకారం, క్రైస్తవ మతంలో విశ్వసించిన అక్బర్‌, రాజకుమారుడైన మురాద్‌ను క్రైస్తవ ధర్మం తెలుసుకోమని చెప్పాడు. ప్రజల భావోద్వేగాల పట్ల సున్నితత్వం ప్రదర్శించిన అక్బర్‌, హిందువులు పవిత్రంగా భావిస్తారు కాబట్టి, గోవధను నిషేధించాడు. అర్ధరాత్రీ, తెల్లవారుజామునా హిందువులు ఉచ్చరించే మంత్రాలను ఉచ్చరించేవాడట. తన హిందూ రాణుల అంతఃపురాల్లో హోమం చేసేవాడు. హిందూ పండగలప్పుడు నుదుట తిలకం దిద్దుకునేవాడు. బ్రాహ్మణులు అతని మణికట్టుకు మంత్రించిన దారాలు కట్టేవారు. హిందూ ఆచారాలైన ‘రaరోకా దర్శన్‌’, ‘తులాదాన్‌’ (శ్రీకృష్ణ తులాభారం) మొదలైన వాటిని అక్బర్‌ కొనసాగించాడు. ‘సుల్హ్‌`ఇ`కుల్‌’ (‘అందరికీ శాంతి’) అనేది అక్బర్‌ ఆధ్యాత్మిక సూత్రం. సమ్మిళితత్వమే తప్ప అందులో సంకుచితత్వానికి తావులేదు. సాంస్కృతిక వైవిధ్యంతో విలసించిన హిందుస్తాన్‌లో భావసమైక్యతను సాధించడానికి ఈ సూత్రం అత్యంత ఆవశ్యకమైందని అక్బర్‌ సరిగ్గానే గుర్తించాడు. అందరినీ కలుపుకుపోవడం ద్వారా, యివాల మనం దేన్నైతే భారతీయ ‘లౌకికవాదం’ అంటున్నామో ఆ వైపు అడుగులు వేశాడు. సాధారణంగా అందరూ భావిస్తున్నట్టుగా అక్బర్‌ ఏ కొత్త మతాన్నీ స్థాపించలేదనీ, ‘దీన్‌`ఇ`ఇలాహీ’ని ఏ సమకాలీన అధికారిక రికార్డూ నమోదు చేయలేదనీ ఫర్హత్‌ నస్రీన్‌ తెలిపారు (పు. 89).
వేల సంఖ్యలో వుండిన తన సొంత బానిసలను బానిసత్వం నుండి విముక్తి కలిగించాడు అక్బర్‌. సామాన్య ప్రజల శ్రేయస్సు కోసం తన దగ్గరి అధికారులూ, అనధికారుల నుండి 1582లో సలహాలూ, సూచనలూ ఆహ్వానించాడు. నేరాలకు శిక్షలు కఠినతరంగా వుండకుండా చూశాడు. 1582లో ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేశాడు. స్త్రీల సమస్యల పట్ల అసాధారణ సున్నితత్వాన్ని ప్రదర్శించాడు అక్బర్‌. బాల్య వివాహాలు దేవునికి ప్రీతికరమైనవి కావన్నాడు. (అతని కుమారుడైన సలీం (తర్వాత జహంగీర్‌) బాల బాలికల కనీస వివాహ వయసు 12 సంవత్సరాలు వుండాలన్నాడు). స్వయంగా చాలా మంది భార్యల్ని కలిగివుండినప్పటికీ, అక్బర్‌ ఏకపత్నీవ్రతాన్ని ప్రోత్సహించాడు. వితంతు వివాహాలను సమ్మతించాడు. యింకా గర్భాదానం జరగని స్త్రీలు సతీ సహగమనాన్ని పాటించడాన్ని నిరసించాడు. 1583లో స్వయంగా ఒక వితంతువును ‘సతి’ నుండి కాపాడాడు. వేశ్యల (సెక్స్‌ వర్కర్స్‌) కోసం రాజధానిలో ఒక ప్రత్యేక ప్రాంతాన్ని (‘షైతాన్‌పురా’) కేటాయించడంతోపాటు, వారి సంరక్షణార్థం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. అక్బర్‌ మేనమామ అయిన ఖ్వాజా ముఆజ్జమ్‌ పట్టరాని ఆవేశంలో తన భార్యను చంపేసినప్పుడు అగ్రహోదగ్రుడైన అక్బర్‌ అతన్ని కట్టెలతో మోదించీ, కాళ్ళతో తన్నించీ ఖైదు చేయించాడు. 1594లో బానిసల వ్యాపారంపై కఠినమైన ఆంక్షలు విధించాడు. అక్బర్‌ రాజప్రాసాదపు రక్షకభట సిబ్బంది అధికారి ఒక ‘‘అంటరాని’’ కులానికి చెందినవాడు. అతని సేవల్ని మెచ్చుకున్న అక్బర్‌, ‘‘ఖిద్మత్‌రాయ్‌’’ అనే బిరుదుతో సత్కరించాడు. 1598లో సిక్కుల ఐదవ గురువు అయిన అర్జున్‌సింగ్‌ను సాదరంగా సందర్శించాడు. 1578 తర్వాత స్వయంగా వేటాడటం మానుకోవడమే కాకుండా, రాజ్యంలో ఎక్కడేగాని జంతువుల్నీ, పక్షుల్నీ వేటాడకూడదని ఆజ్ఞాపించాడు. 1580 నుండి శుద్ధ శాకాహార భోజనాన్ని అలవాటు చేసుకున్న అక్బర్‌, శాకాహార భోజనాన్ని ‘‘సూఫియానా’’ అని పిలిచాడు. అతని ప్రకారం, మన కడుపు జంతువుల పాలిట సమాధి కాకూడదు! తన కోసం చేసిన వంటలోని కొంతభాగాన్ని ముందు అన్నార్థులకు అర్పించేవాడు. ప్రతి భోజనానికి ముందు తనకు అన్నం ప్రసాదించినందుకు దేవుడికి ధన్యవాదాలర్పిస్తూ వినమ్రంగా మోకరిల్లేవాడు చక్రవర్తి అయిన అక్బర్‌. ‘అన్నం పరబ్రహ్మ స్వరూప’మని సరిగ్గానే గుర్తించాడు. (ఇంకా ఉంది)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.