తెలుగు సాహిత్యంలో మహిళలు వ్రాసిన స్వీయ చరిత్రలు అతి తక్కువ. అందుకే కొండపల్లి కోటేశ్వరమ్మ గారి స్వీయ చరిత్ర ‘నిర్జన వారధి’ని మనం హృదయపూర్వకంగా ఆహ్వానించి చదవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈ మధ్య వచ్చిన రెండు స్వీయచరిత్రల గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అందులో కోటేశ్వరమ్మ గారి ‘నిర్జన వారధి’ (2012) మొదటిది.
నంబూరి పరిపూర్ణ వ్రాసిన ‘వెలుగు దారులులో’ (2017) రెండవది. ఇద్దరూ కమ్యూనిస్టు కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళే. తమ తమ జీవితాల్లో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన వాళ్ళు. వాళ్ళ జీవితానుభవాల నుంచి మనం నేర్చుకోవలసినది ఎంతో ఉన్నదని ఈ రెండు స్వీయ చరిత్రలను చదువుతున్నప్పుడు మనకనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ‘నిర్జన వారధి’ని చదివి విశ్లేషించడం, కోటేశ్వరమ్మ ఏ సామాజిక పరిస్థితుల ప్రభావంతో ఉద్యమాల్లో పాల్గొన్నారో పరిశీలించడం అవసరం. అందుకే ఈ చిన్న ప్రయత్నం.
ముందుగా ఉద్యమాలతో ముడిపడిన ఆమె జీవితంలోని ముఖ్య సంఘటనలను తెలుసుకుందాం.
బాల వితంతువు: కోటేశ్వరమ్మ 1920వ సంవత్సరం, కృష్ణా జిల్లా పామర్రులో జన్మించింది. ఏడేళ్ళ వయసులోనే వితంతువు అయింది. తాను వితంతువునన్న విషయం ఆమెకి మొదట్లో తెలిసేది కాదు. తల్లిదర్రడులు, బంధువర్గాల ప్రేమానురాగాలతో పెరిగింది. రాగయుక్తంగా పాడినందుకు, నాటకాల్లో చక్కగా నటించినందుకు స్కూల్లో టీచర్ల ప్రశంసలు పొందింది. తోటి పిల్లలకు అసూయగా ఉండేది. దీని మొగుడు చనిపోయాడట, అందుకే దీన్నంత బాగా చూస్తున్నారు అందొక అమ్మాయి. అప్పుడే మొదటిసారిగా కోటేశ్వరమ్మకు తాను వితంతువునన్న నిజం తెలిసి వచ్చింది.
స్వాతంత్య్రోద్యమం: గాంధీగారి నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో మహిళా ఉద్యమకారులు ఊళ్ళోకొస్తే వారితో పాటు ఖద్దరు ప్రచారం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి కార్యక్రమాల్లో పాల్గొనేది కోటేశ్వరమ్మ. కల్లుని వ్యతిరేకిస్తూ, అంటరానితనాన్ని నిరసిస్తూ జరిగే సభల్లో కూడా పాల్గొనేది. పదిమందితో కలిసి తిరుగుతూ వేదికలెక్కి పాడేది. 1931లో గాంధీగారు పామర్రు వచ్చారు. ఆయన వేదిక మీద ఆశీస్సులయినప్పుడు స్త్రీలంతా నగలను ఒలిచి బాపూజీకివ్వడం కోటేశ్వరమ్మను
ఉత్తేజపరిచింది. ఆమె కూడా తన నగలను తీసి తన చిన్ని చేతులతో మహాత్ముని దోసిలిలో పెట్టింది. వేదిక దిగుతున్న ఆ బాలికను పెద్దలంతా వింతగా చూశారు. చిన్న వయస్సు నుండే కోటేశ్వరమ్మలో ఆత్మవిశ్వాసం, ఆశయాలకు అనుగుణంగా పనిచేసే మనోధైర్యం ఉన్నట్లు మనకీ సంఘటనల వలన తెలుస్తుంది.
వివాహం: ఆమె ఏడేళ్ళ వయస్సులో వితంతువయింది. తర్వాత ఆమెకు కొండపల్లి సీతారామయ్య (అసలు పేరు సీతారామిరెడ్డి. కులాన్ని తెలిపే ‘రెడ్డి’ పదాన్ని తన పేరు నుండి తీసేశాడు)తో వివాహం జరిగింది. వితంతువుకు పెళ్ళి జరిగితే సమాజంలో ఎదుర్కొనే కష్టాలకు సిద్ధపడే ఆమె పెళ్ళికి ఒప్పుకుంది. ఎదురైన కష్టాలను ఓర్పుతో భరించింది. అత్తగారు తనపై జరిపే ఆధిపత్యాన్ని సహించింది. సీతారామయ్య కమ్యూనిస్టు కార్యకర్త. సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు అడుగుజాడలలో నడిచేవాడు. పెళ్ళయిన తర్వాత కోటేశ్వరమ్మ కూడా కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావానికి లోనయినట్లు తెలుస్తుంది. ఇతర స్త్రీలలా ఇంట్లో కూర్చోకుండా బయటకు వెళ్ళి కమ్యూనిస్టు కార్యకర్తలా పనిచేసింది. భర్తకు తన సంపూర్ణ సహకారాన్ని అందజేసింది.
కమ్యూనిస్టు కార్యకర్త: కమ్యూనిస్టు పార్టీకి ఆమె చేసిన సేవలనేకం. పార్టీ పని, మహిళా సంఘం పనులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనేది. తాపీ రాజమ్మ, మానికొండ సూర్యావతి అనే మహిళలతో పాటు పార్టీ పత్రిక ‘ప్రజాశక్తి’ని పురవీథులలో అమ్మేది. ఆమెకి, రాజమ్మకి బాగా వెనుకబడిన తిరువూరు, నందిగామ తాలూకాలలో పార్టీ పనిని అప్పజెప్పగా, స్రీలకు పుస్తకాలు, పార్టీ పత్రికలు ఇచ్చి, మహిళా సంఘం సభ్యత్వాన్ని ఇప్పించేవారు. నందిగామ తాలూకా శనగపాడులో పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నా, అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టి, పాటలు పాడి, మహిళలను ఆకర్షించి, 20 మందిని సభ్యులుగా చేర్చారు. విజయవాడ వెళ్ళిన తర్వాత పార్టీ సభ్యురాలిగా సెల్ సమావేశాలకు వెళ్ళేది. మే డే, అక్టోబర్ విప్లవ దినాలలో ఊరేగింపులు, బహిరంగ సభలు జరిగినపుడు కోటేశ్వరమ్మ వాటిలో పాల్గొనేది.
మహిళా సంఘం మీటింగులలో స్త్రీల హక్కుల గురించి, ఆరోగ్యం, ప్రసూతి శిశువుల జాగ్రత్తల గురించి చెప్పేది. నీరుళ్ళపాడులో మరుగుదొడ్ల కార్యక్రమం తీసుకున్నప్పుడు అవి లేకపోతే ఆరోగ్య సమస్యల గురించి స్త్రీలలో అవగాహన కలిగించింది. కులాలు, అంటరానితనం లాంటి దురాచారాల గురించి బోధించేది. కృష్ణ కాలువ పూడిక తీసే పనిలో యువకులతో కలిసి పాల్గొంది.
ఇతర పార్టీ మహిళలతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది. ఆ కార్యక్రమంలో గురజాడ రాసిన ‘కన్యాశుల్కం’, ‘పూర్ణమ్మ’, ‘కన్యక’ కథా గీతాలను వినిపించేవారు. గురజాడ, కందుకూరి వర్థంతులను, జయంతులను జరిపేవారు. వారి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేవారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర పార్టీ మహాసభలో జానపద కళారూపాల ప్రదర్శనలిచ్చారు. బెంగాల్ కరువు దృశ్యాలను చూపే ‘ఇదీలోకం’ నాటకంలో నటించి కోటేశ్వరమ్మ ఉత్తమ నటిగా ఎంపికయింది. ఆమె నటన చూసి ప్రేక్షకులు విరివిగా విరాళాలిచ్చారు.
తెలంగాణ సాయుధ పోరాటం: తెలంగాణ సాయుధ పోరాటం 4 జులై 1946న మొదలైంది. 1947లో నెహ్రు ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిరది. కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ పోరాటానికి సహకరిస్తోందని, పార్టీని, పార్టీ నడిపే పత్రిక ‘ప్రజాశక్తి’ని ప్రభుత్వం నిషేధించింది. వాటితో పాటు మహిళా సంఘం వెలువరించే ‘ఆంధ్ర మహిళ’ పత్రికను కూడా నిషేధించింది. విజయవాడలో జరిగిన రాష్ట్ర మహిళా మహాసభ ఆ నిషేధాన్ని తొలగించాలని తీర్మానం చేసింది. సభలు, ఊరేగింపులు జరపరాదని సెక్షన్ 144 పెట్టింది ప్రభుత్వం. నిషేధాన్ని తొలగించాలని వేల మంది స్త్రీలు ఊరేగింపు చేశారు. కోటేశ్వరమ్మ లాంటి 16 మంది మహిళలపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి వేధించింది ప్రభుత్వం.
పార్టీని నిషేధించడం వలన కమ్యూనిస్టు పార్టీ నాయకులందరూ రహస్య జీవితంలోకి వెళ్ళిపోయారు. సీతారామయ్య కూడా రహస్య జీవితం గడుపుతున్నాడు. కోటేశ్వరమ్మ ఇంటిపై రోజూ పోలీసు దాడులు జరిగేవి. వస్తువులను ధ్వంసం చేయడం, సీతారామయ్య ఎక్కడున్నాడని వేధించడం వారికి నిత్యకృత్యమైంది. కోటేశ్వరమ్మ పిల్లలూ, తల్లి చాలా అవస్థలు పడ్డారు. సిద్ధాంత పరిజ్ఞానమున్న స్త్రీలనూ, నాయకుల భార్యలను రహస్య స్థావరంలో పనిచేయడానికి పార్టీ ఆహ్వానించింది. కోటేశ్వరమ్మ కూడా అజ్ఞాతంగా పని చేయడానికి వెళ్ళింది. కమ్యూనిస్టు పార్టీ ‘డెన్స్’కి రాత్రిపూట కామ్రేడ్స్ వచ్చి కొద్దిరోజులుండి వెళుతుండేవారు. కోటేశ్వరమ్మ వారికి వండిపెడుతూ, రహస్య పత్రాలను కాపీ తీస్తూ ఉండేది.
కోటేశ్వరమ్మ బందరు, ఏలూరు, విశాఖపట్నం, పూరీ (ఒడిషా), నాగపూర్ (మహారాష్ట్ర), రాయపూర్, గోందియా (ఛత్తీస్‌గఢ్)లలో అజ్ఞాతవాసం గడిపింది. భర్త సీతారామయ్య అప్పుడప్పుడూ ‘డెన్స్’కి వచ్చేవాడు. కానీ ఆమె తన తల్లి అంజమ్మకి, పిల్లలకి దాదాపు దూరంగానే బతికింది. కానీ వారిని అజ్ఞాత కామ్రేడ్స్ భద్రత కోసం ఉపయోగించుకున్నప్పుడు మాత్రం కొన్నిసార్లు ‘డెన్స్’లో కలుసుకునేది. ఒకసారి బందరు ‘డెన్’లో ఉన్నప్పుడు ఆమె గర్భవతి అయింది. గర్భం పోవడానికి నాటు మందులిచ్చారు. గర్భం పోయింది కానీ బ్లీడిరగ్ ఆగలేదు. డాక్టర్ లక్ష్మి రహస్యంగా వచ్చి చూసి, తను రావడం ఓ గంట ఆలస్యమైతే ప్రాణాపాయం జరిగేదని, ఇలా నాటు మందులివ్వొద్దని పార్టీ వారిని హెచ్చరించింది.
17 సెప్టెంబరు 1948న భారతసేన నిజాం సేనను, రజాకార్లను ఓడిరచి హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేసింది. ఆ తర్వాత రైతుల పోరాటాన్ని కూడా అణచివేసింది. తెలంగాణ సాయుధ పోరాటం (1946`51) కమ్యూనిస్టు పార్టీ చరిత్రలోనే ప్రముఖమైనది. 1951 ప్రారంభం నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీతో సంప్రదింపులు జరిపింది. కాంగ్రెస్ సర్కారునెదుర్కొనే బలం పార్టీకి లేదు కాబట్టి పోరాటం ప్రస్తుతానికి ఆపడం క్షేమమని పార్టీ నిర్ణయించి, 21 అక్టోబర్ 1951లో పోరాటాన్ని విరమించింది.
ఎన్నికలు: 1952లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. కోటేశ్వరమ్మ కూడా ఇతర కార్యకర్తలతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. కమ్యూనిస్టు పార్టీని హైదరాబాద్‌లో నిషేధించడం వలన పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఎన్నికలలో పోటీ చేసింది. కొంతమంది జైళ్ళనుంచే పోటీ చేశారు. 42 మంది కమ్యూనిస్టులు హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలామంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఎన్నికయ్యారు. లోక్‌సభ కమ్యూనిస్టు పార్టీ చండ్ర రాజేశ్వరరావు నాయకుడిగా ప్రముఖమైన ప్రతిపక్షంగా ఎన్నికయింది.
విద్యాభ్యాసం: ఆ తర్వాతి సంవత్సరాలలో కోటేశ్వరమ్మ జీవితంలో అనుకోని సంఘటనలు అనేకం జరిగాయి. భర్త సీతారామయ్య పార్టీకి చెందిన మరొక మహిళతో సంపర్కం పెట్టుకుని కోటేశ్వరమ్మను వదిలేశాడు. అంతేగాక కూతురు కరుణను, కొడుకు చందూలను కూడా తన దగ్గరికి రప్పించుకున్నాడు. కోటేశ్వరమ్మ ఒంటరిదయింది. అయినా బాధను దిగమింగుకుని ఆంధ్ర మహిళా సభ వారు ఆసరా లేని స్త్రీలకు చదువు చెప్పించి, ట్రైనింగ్ ఇప్పిస్తున్నారని విని, దరఖాస్తు పెట్టుకుని, సీటు రాగా హాస్టల్‌లో చేరింది. ప్రభుత్వం వారిచ్చే స్టైఫండ్ కేవలం ఫీజులకు సరిపోగా, రేడియో నాటికల్లోనూ, నాటకాల్లోనూ పాల్గొని, వచ్చిన డబ్బులతో కాలం గడిపేది.
ఉద్యోగం: నాలుగేళ్ళు ఆంధ్ర మహాసభలో ఉన్న తర్వాత కాకినాడ బాలికల పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ బాధ్యతలను చేపట్టింది. 20 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత, 1983లో రామారావు ప్రభుత్వం వచ్చి, 55 సంవత్సరాలు దాటిన వారిని ఉద్యోగ విరమణ చేయమనగా, కాకినాడ వదిలి విజయవాడకు తల్లి దగ్గరికెళ్ళి విజయవాడ ‘వికాస విద్యావనం’ అనే స్కూలు హాస్టల్‌లో వాలంట్రీగా నాలుగేళ్ళు పనిచేసింది. అక్టోబరు 2, 1999లో హైదరాబాద్‌లో చండ్ర రాజేశ్వరరావు పేరున ప్రారంభించిన వృద్ధాశ్రమానికి వెళ్ళి చేరింది. ఇక తన పనులు తను చేసుకోలేని పరిస్థితిలో 2010లో విశాఖలోని మనవరాండ్ర పంచన చేరింది.
విషాద సంఘటనలు: ఆర్థికంగా నిలదొక్కుకుని, స్వతంత్రంగా జీవించిన ఆమె జీవితంలో ఎన్నో విషాద సంఘటనలు జరిగాయి. 1964 తర్వాత పశ్చిమ బెంగాల్‌లో నక్సల్‌బరీ ఉద్యమం ఆవిర్భవించింది. దానికి ప్రభావితులై వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, చందూ లాంటి యువకులు శ్రీకాకుళం పోరాటానికి చేయూతనిచ్చారు. సీతారామయ్య కూడా ఆ ఉద్యమ బాధ్యతలు స్వీకరించి పనిచేశాడు. చందూ ఆ తర్వాత పట్టుబడి, పోలీసుల చేత చంపబడినట్లు పత్రికల్లో వార్త వచ్చింది. డాక్టరయిన అల్లుడు రమేష్ విజయవాడ వచ్చి వడదెబ్బతో మరణించాడు. కోటేశ్వరమ్మ తల్లి, మనుమరాలు కరుణ బాధ చూడలేక మంచమెక్కి చనిపోయింది. భర్త ఎడబాటును తట్టుకోలేక కూతురు ఎవ్వరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.
సీతారామయ్య మరణం: పీపుల్స్ వార్‌ను స్థాపించిన సీతారామయ్య సిద్ధాంతం, ఆచరణలో వేరే రూపం తీసుకుందన్న వేదనతో, నమ్మి నాయకుడిని చేసిన వారు పక్కకు నెట్టారన్న బాధలో దాన్నుండి విడిపోయి మరో పార్టీని నిర్మించాడు. ఆ పార్టీ పనిమీద గుడివాడ వచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న స్థితిలో పోలీసులకు పట్టుబడ్డాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక ఉద్యమించలేడని, మతి సరిగ్గా లేదని గ్రహించి రామారావు ప్రభుత్వం సీతారామయ్యను జైలు నుంచి విడుదల చేసింది. మనుమరాలు సుధ, ఆమె భర్త గంగాధర్‌లు ఆయన్ను విజయవాడ తీసుకొచ్చారు. 36 సంవత్సరాల తర్వాత, చివరి దశలో భర్త తనతో ఉండమని అడగ్గా, కోటేశ్వరమ్మ నిరాకరించింది. దూరంగా ఉండే తనకు చేతనైన సహాయం చేసింది. ఆయన పార్టీ వాళ్ళెవరూ ఆయన్ని చూడడానికి రాలేదని బాధపడుతూ, ‘‘సీతారామయ్య నన్ను తిరస్కరించినట్లుగానే… సీతారామయ్య నిర్మించిన పార్టీ కూడా సీతారామయ్యని తిరస్కరించి ఓ పక్కకు నెట్టింది గదా? ఇంతేనేమో కొంతమంది జీవితాలు’’ అనుకుని ఆయనకు నివాళులు అర్పించింది.
విశ్లేషణ: స్త్రీవాది: ఈ పుస్తకం చదివిన తర్వాత కోటేశ్వరమ్మ స్త్రీవాది అనిపించక మానదు. పైకి బాహాటంగా చెప్పుకోకపోయినా ఆమె జీవించిన విధానం మనకు అలా అనిపించేలా చేస్తుంది. భర్త వదిలేసిన తర్వాత, పిల్లలు దూరమైన తర్వాత మొదట్లో ఎంతో బాధపడినా, తర్వాత తన జీవిత గమనాన్ని తనే మలచుకుంది. స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ముఖ్యమని గ్రహించి, మెట్రిక్ పాసయి, కాకినాడ బాలికల కళాశాలలో హాస్టల్ మేట్రిన్‌గా 20 ఏళ్ళు పనిచేసింది. ఇతరులకు తను సహాయం చేసిందే గాని, ఇతరుల నుంచి ఆర్థిక సహాయాన్ని పొందలేదు. చివరివరకు పుస్తక పఠనాన్ని, రచనా వ్యాసంగాన్ని సాగించి, తన ఒంటరితనాన్ని చాలావరకు మర్చిపోగలిగింది.
సీతారామయ్య జైలు నుంచి విడుదలయిన తర్వాత, ఆయనకు నిన్ను చూడాలని ఉంది వస్తావా అని అడిగితే… ‘‘ఆయనకు నన్ను చూడాలని ఉంటే… నాకు ఆయన్ను చూడాలని ఉండొద్దా! లేదు, కాబట్టి రాలేను’’ అని బదులిచ్చింది. పార్టీ మిత్రులు కొందరు ఆమెని ఒప్పించడానికి ప్రయత్నించినపుడు ‘‘మను సిద్ధాంతం, హిందూ మనస్తత్వం నాలో జీర్ణమై ఎన్ని బాధలు పడినా, పతివ్రతలా భర్తను చూస్తానని నేనొక వేళ అంటే కూడా వద్దని కమ్యూనిస్టుల్లాగా వారించాల్సిన మీరు, అణచబడ్డ స్త్రీజాతికి అన్యాయం చేస్తావా అంటూ చీవాట్లు పెట్టాల్సిన మీరు, ఆయన్ను చూడమని నాకు చెప్పటం వింతగా ఉంది’’ అని నిష్కర్షగా మాట్లాడిరది. చివరికి ఎలాగో ఒప్పించి తీసుకెళితే, ఆమెను చూసి సీతారామయ్య ఏడిస్తే, ‘‘ఎందుకు ఏడుస్తావు? నీ కోసం, నీ పిల్లల కోసం, తిండి కోసం, అండ కోసం ఏడ్చి… ఏడ్చి… నా కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడో ఇంకిపోయాయి’’ అంది.
ఆమె ధైర్యం, స్వతంత్ర భావాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. 1964లో తనకు విడాకులిమ్మని కోరిన సీతారామయ్యను తిరిగి భర్తలా అంగీకరించలేకపోయిన ఆమె ఆత్మాభిమానం మనల్ని ముగ్ధులను చేస్తుంది. కమ్యూనిస్టు పార్టీ స్త్రీలకిచ్చిన స్వేచ్ఛ వలన స్త్రీలు ఎన్నో పనులు చేయగలిగారు. అయితే పురుషుల కంటే స్త్రీలు ఎక్కడయినా ఒక అడుగు ముందుకు వేస్తే మాత్రం వారిలో పురుషాధిక్య భావం కనిపించేదని కోటేశ్వరమ్మ పేర్కొంది. దీనివలన ఆమె సునిశిత పరిశీలనా దృష్టి, పార్టీలోని స్త్రీల పరిస్థితి మనకు తెలుస్తుంది.
కులవ్యవస్థ వ్యతిరేకత: ఆమె కులవ్యవస్థని, అంటరానితనాన్ని వ్యతిరేకించింది. స్కూల్లో మాలలు మాత్రం మనుజులు కారా? అన్న పాటలు పాడేది. చిన్నప్పుడు బ్రాహ్మణ బాలిక కామేశ్వరి ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళేది. వాళ్ళ బామ్మ, కోటేశ్వరమ్మ శూద్రుల పిల్ల, ఇంట్లోకి రానివ్వద్దు అనేది. అప్పుడు కోటేశ్వరమ్మకి అనిపించేది, ‘‘భూసురుల ఇళ్ళల్లోకి వాళ్ళ కులం వాళ్ళు కాకపోతే వెళ్ళగూడదా? కులం తెలియని కుక్కలు, పిల్లులు వెళ్ళొచ్చా? మనుషులెళితే అంటుకునే దోషం జంతువులెళితే… అంటదా?’’ అని. అంత చిన్న వయసులో ఆమెకలాంటి ఆలోచనలు రావడం మనల్ని చకితులను చేస్తుంది.
అత్తగారింట్లో ధర్ముడు అనే మాలవాడుండేవాడు. ఇంటి పనులు మాల వాళ్ళ చేత చేయించకూడదని, ఒకవేళ చేయిస్తే, పక్కవాళ్ళు చూసి, ‘‘ముండను ముత్తైదువును చేసింది చాలక, అంటరాని వాళ్ళతో ఇంటి పనులు చేయిస్తున్నారని ఎగతాళి చేస్తారు’’ అని అత్తగారు సణిగేది. ఒకరోజు పొయ్యి మీద గుగ్గిళ్ళ కుండను వారుస్తుంటే వేడినీళ్ళు కాళ్ళమీద పడ్డాయి. బాధతో కుండను వదిలేసి, ధర్మడుని పిలిచి, నీళ్ళు వంచేసి గుగ్గిళ్ళను బుట్టలో పెట్టమంది. నేను మాలవాడ్ని, కుండను ముట్టుకోరాదన్నాడు ధర్మడు. ‘‘నీవు మాలవాడివని కుండకు తెలియదంది’’ కోటేశ్వరమ్మ. చివరలో ధర్మడు నీళ్ళు ఒంపేసి మనసున్న మనిషిలా, మౌనంగా గుగ్గిళ్ళను బుట్టలో పెట్టుకుని ఎడ్ల దగ్గరకెళ్ళాడు అని వ్రాసింది.
1952లో ఎన్నికల ప్రచారం కోసం కోటేశ్వరమ్మ, రాజమ్మ కృష్ణాజిల్లా, వీరుళ్ళపాడు గ్రామానికి వెళ్ళారు. ప్రచారం తర్వాత ఓ ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు. కోటేశ్వరమ్మను బ్రాహ్మణ యువతి అనుకుని లోపల కంచం పెట్టి వడ్డించారు. రాజమ్మ నల్లగా ఉండటం వలన ఆమెని మాలదనుకొని ఆమెకి, డ్రైవర్‌కి బయట అరుగుమీద వడ్డించారు. కోటేశ్వరమ్మ కోపంతో ‘‘రాజమ్మే బాపనమ్మ, నేను కాదు. ఇలాంటి ఆచారాలున్నాయని తెలిస్తే ఆమె మీ ఇంటికి రాదు. మరో విస్తరి వేసి ముగ్గురికి బయట వడ్డించ’’మంది.
ఆర్థిక పరిస్థితుల వలన విజయవాడలోని ఇంట్లో ఒక పోర్షన్‌ను విశాలాంధ్రలో పనిచేస్తున్న సత్యమూర్తి (శివసాగర్)కి అద్దెకిచ్చింది. ఇరుగుపొరుగు వారు ‘‘అంటరానివాడు నీ ఇంట్లో ఉంటే రేపటినుండి మేం రాము’’ అని తూటాల్లాంటి మాటలతో ఆమెని బాధపెట్టారు. ఆమె తట్టుకుని నిలబడిరది. సీతారామయ్య పార్టీవాడయినా సత్యమూర్తికి, ఆమెకి మధ్య స్నేహం చివరి వరకు సాగింది.
కమ్యూనిస్టు పార్టీ సి.పి.ఎం, సి.పి.ఐ.గా చీలిపోవడం ఆమె అంగీకరించలేకపోయింది. ఒక పార్టీ వారింటికి వెళ్తే, రెండో పార్టీ వారికి కోపం వచ్చిన సందర్భాలెన్నో చూసింది. ఆ ధోరణి ఆమెకి నచ్చేది కాదు. కమ్యూనిస్టులందరూ ఐకమత్యంతో తమ సిద్ధాంతాల కోసం పనిచేస్తే మంచి ఫలితాలుంటాయని ఆమె నమ్మింది. ఈ పుస్తకంలో పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, ముద్దుకూరి చంద్రశేఖరరావు, సుంకర సత్యనారాయణ, తల్లి అంజమ్మ, మోటూరి ఉదయం, తాపీ రాజమ్మ మీద ఆమె వ్రాసిన వ్యాసాలు ఆమెకు వారితో గల అవినాభావ సంబంధాన్ని, వారి సహచర్యం వలన కమ్యూనిస్టు కార్యకర్తగా ఆమె జీవితం మరింత పరిపూర్ణమైనదన్న విషయాన్ని తెలియపరుస్తాయి.
కళాసేవ: ఆమె సాహిత్య, నాటక రంగాల్లో రాణించింది. స్కూల్లోనూ, జాతీయోద్యమ సందర్భాల్లోనూ, కమ్యూనిస్టు కార్యకర్తగాను పాటలు పాడిరది, పాటలు వ్రాసింది కూడా. ఆమె రాసిన ‘‘మనది తెలుగు దేశమమ్మా/ మనది తెలుగు జాతి తల్లీ’’ అనే పాట ఆ రోజుల్లో ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకుంది. మొట్టమొదట ‘కన్యాశుల్కం’ నాటకాన్ని స్త్రీలతో వేయించినపుడు ఆమె ఒక స్త్రీ పాత్ర వేసింది. రేడియోలో నాటికలు, నాటకాలు వేసింది. ‘‘ముందడుగు’’ నాటకంలో హీరోయిన్ పాత్ర వేసింది. ‘‘ఇదీ లోకం’’ నాటకంలో నటించి
ఉత్తమ నటిగా ఎంపికయింది. కొత్త నటులతో ‘భూమికోసం’ నాటకంలో వేసింది. ‘మొల్ల’, ‘రుద్రమదేవి’, బుర్రకథల్లో పాల్గొంది. ఆంధ్రమహాసభలో ఉన్నప్పుడు కథలు రాసేది. కాకినాడ సాహిత్యలహరి సమావేశాలకు కవితలు రాసి గానం చేస్తుండేది. కొన్ని రచనలు విశాలాంధ్రలో వచ్చాయి. వృద్ధాశ్రమంలో కూడా రచనలు చేసింది. ఆమెవి రెండు కథల సంపుటాలు, ఒక కవితా సంపుటి వెలువడ్డాయి.
ముగింపు: జాతీయోద్యమం, విప్లవోద్యమం, సంఘ సంస్కరణోద్యమం, మహిళోద్యమాలతో ముడిబడిన ఆమె జీవితం మనల్ని ప్రభావితం చేస్తుంది. ఒక స్త్రీ ఇన్ని ఉద్యమాలలో పనిచేయడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆనాటి రాజకీయాల గురించి, ముఖ్యంగా కమ్యూనిస్టు రాజకీయాల గురించి మనకు అవగాహన కలిగిస్తుంది ఆమె పుస్తకం. కమ్యూనిస్టు సిద్ధాంతాలతో మనం ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, సిద్ధాంతాల ఆచరణ కోసం కమ్యూనిస్టులు పడిన బాధల్ని, త్యాగనిరతిని మనం మెచ్చుకోకుండా ఉండలేం. సమానత్వం అన్న భావం కమ్యూనిస్టు పార్టీయే కలిగించింది. స్త్రీలు, పురుషులు, దళితులు అందరూ ఒకటేనని చెప్పింది. స్త్రీలను ఇళ్ళలోనుంచి బయటకు తీసుకొచ్చి ఎన్నో పనులు చేయించింది. పార్టీలో పురుషాధిక్యం ఉన్నప్పటికీ మమూలు పురుషుల కంటే వారే మేలని అంటుంది కోటేశ్వరమ్మ.
సమాజంలో కులవ్యవస్థ, అంటరానితనం ఎంతలా పాతుకుపోయాయో తెలియజేస్తుందీ పుస్తకం. అప్పటి పరిస్థితులపై అధ్యయనం, పరిశోధన చేసేవారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని ఈనాటి తరం, ముఖ్యంగా స్త్రీలు చదవడం ఎంతో అవసరం. ముందు ముందు ఇటువంటి మహిళల స్వీయచరిత్రలు ఎక్కువ వస్తే బావుండునన్న భావన కూడా మనలో కలిగిస్తుంది ‘నిర్జనవారధి’. ఎందుకంటే ఉద్యమాల పట్ల, సంఘటనల పట్ల, రాజకీయాల పట్ల మహిళల దృక్పథం ఎలా
ఉంటుందో మనకు తెలుస్తుంది కాబట్టి!