భారతదేశాన్ని పట్టి పీడిస్తోన్న క్షయవ్యాధి – రితాయన్‌ ముఖర్జీ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ప్రపంచంలోని మొత్తం క్షయవ్యాధి రోగులలో దాదాపు మూడోవంతు మంది భారతదేశంలోనే ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంత మురికివాడలకు చెందినవాళ్ళు. ఈ రోగులలో చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. దీని నుంచి కోలుకున్న రోగుల కుటుంబాలు ఒకవైపు తమ ఆర్థిక భారాన్ని, ఇతర ఖర్చులను భరిస్తూనే, ఈ రోగుల పట్ల నిరంతర సంరక్షణను, శ్రద్ధను తీసుకోవాలి.

జమిల్‌కు సన్నని జరీ (బంగారం) దారాన్ని ఉపయోగించి చేసే ఎంబ్రాయిడరీలో నైపుణ్యం ఉంది. హౌరా జిల్లాకు చెందిన ఈ 27 ఏళ్ళ కార్మికుడు ఖరీదైన వస్త్రాలకు మెరుగులు, మెరుపులూ అద్దుతూ గంటల తరబడి నేలపై కాళ్ళు ముడుచుకుని కూర్చునేవాడు. కానీ, అతను తన ఇరవైల వయసులోనే ఎముకల క్షయవ్యాధి బారిన పడడంతో, ఈ సూదీదారాలను దూరం పెట్టాల్సి వచ్చింది. ఈ వ్యాధి అతని ఎముకలను బలహీనం చేసినందువల్ల అతను ఎక్కువసేపు కాళ్ళను మడత పెట్టుకుని కూర్చోలేడు.
‘‘ఇది నేను పనిచేయాల్సిన వయస్సు, (నా) తల్లిదండ్రులు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. కానీ దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. నా వైద్యం కోసం వాళ్ళు పనిచేయాల్సి వస్తోంది’’, అని హౌరా జిల్లాలోని చెంగైల్‌ ప్రాంతంలో నివసిస్తూ, చికిత్స కోసం తరచూ కోల్‌కతాకు వెళ్ళే ఈ యువకుడు వాపోయాడు. ఇదే జిల్లాలో అవిక్‌, తన కుటుంబంతో కలిసి హౌరాలోని పిల్‌ఖానా మురికివాడలో నివసిస్తున్నాడు. ఈ టీనేజ్‌ బాలునికి కూడా ఎముకల క్షయ వ్యాధి ఉంది. దీనివలన అతను 2022 మధ్య నుంచి పాఠశాలకు వెళ్ళకుండా ఆగిపోవాల్సి వచ్చింది. అతనిప్పుడు కోలుకుంటున్నా, ఇప్పటికీ పాఠశాలకు వెళ్ళలేకపోతున్నాడు.
నేను 2022లో ఈ కథనాన్ని ప్రారంభించినప్పుడు జమిల్‌, అవిక్‌, ఇంకా కొంతమందిని మొదటిసారి కలిశాను. వారి రోజువారీ జీవితం గురించి ఫోటోలు తీస్తున్న క్రమంలో వారి గురించి తెలుసుకోవడం కోసం పిల్‌ఖానా మురికివాడల్లోని వాళ్ళ ఇళ్ళకు తరచూ వెళ్ళేవాడ్ని.
ప్రైవేట్‌ వైద్యశాలలకు వెళ్ళే స్థోమత లేని జమిల్‌, అవిక్‌లు మొదట దక్షిణ 24 పరగణాలు, హౌరా జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక ప్రభుత్వేతర సంస్థ రోగుల కోసం నిర్వహించే సంచార క్షయవ్యాధి వైద్యశాలకు పరీక్షల కోసం వచ్చారు. వాళ్ళలాగా చాలామంది ఇలా పరీక్షల కోసం వస్తుంటారు. ‘‘క్షయవ్యాధి ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మళ్ళీ ఉద్భవించింది’’ అని ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019`21 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌`5) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం క్షయవ్యాధి కేసులలో 27 శాతం భారతదేశంలోనే ఉన్నాయి. (నవంబర్‌ 2023లో ప్రచురించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ టి.బి. నివేదిక) కోల్‌కతా లేదా హౌరాకు రాలేని వారికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం కోసం ఇద్దరు వైద్యులు, 15 మంది నర్సులతో కూడిన సంచార బృందం ఒక రోజులో దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించి, నాలుగైదు ప్రదేశాలను సందర్శిస్తుంది. సంచార వైద్యశాలలకు వచ్చే రోగులలో దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, రాళ్ళను పగలగొట్టే పని చేసేవాళ్ళు, బీడీలు చుట్టేవాళ్ళు, బస్సులు, ట్రక్కుల డ్రైవర్లు ఉన్నారు. ఈ సంచార వైద్యశాలలను కోవిడ్‌ కాలంలో ప్రత్యేకంగా ప్రారంభించారు, ఆ తర్వాత అవి ఆగిపోయాయి. అవిక్‌ లాంటి క్షయవ్యాధి రోగులు ఇప్పుడు తర్వాతి చికిత్సల కోసం హౌరాలోని బ్యాఁట్రా సెయింట్‌ థామస్‌ హోమ్‌ వెల్ఫేర్‌ సొసైటీకి వెళ్తున్నారు. ఈ పిల్లవాడిలాగే, ఈ సొసైటీకి వచ్చే ఇతరులు కూడా అట్టడుగు వర్గాలకు చెందినవారు. రద్దీగా ఉండే ప్రభుత్వాసుపత్రులకు వెళితే, వీరికి ఆ రోజు సంపాదన పోతుంది. క్షయవ్యాధి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స, సంరక్షణల సంగతి అటుంచి, చాలా కొద్దిమందికే అసలు ఆ వ్యాధి గురించి తెలిసని రోగులతో మాట్లాడుతున్నప్పుడు నాకర్థమైంది. చాలామంది క్షయ రోగులు వేరే ప్రత్యామ్నాయం లేనందువల్ల తమ కుటుంబాలతో కలిసి ఒకే గదిలో నివసిస్తున్నారు. కలిసి పనిచేసేవాళ్ళు కూడా ఒకే గదిలో ఉంటున్నారు. ‘‘నేను నా సహోద్యోగులతో కలిసి ఉంటున్నాను. వాళ్ళలో ఒకరికి క్షయ ఉంది, కానీ ఉండడానికి ప్రత్యేకంగా గదిని తీసుకునే స్థోమత నాకు లేదు కాబట్టి అతనితో కలిసి ఒకే గదిలో ఉంటున్నాం,’’ అని 13 సంవత్సరాల క్రితం దక్షిణ 24 పరగణాల జిల్లా నుంచి హౌరాలోని జనపనార ఫ్యాక్టరీలో పనిచేయడానికి వలస వచ్చిన రోషన్‌ కుమార్‌ చెప్పారు.
మొత్తం ప్రపంచంలో క్షయవ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో మన దేశంలోనే 28 శాతం మంది ఉన్నారని, కౌమార దశలోని పిల్లలు, క్షయవ్యాధిపై ఏర్పాటు చేసిన 2021 జాతీయ ఆరోగ్య మిషన్‌ నివేదిక పేర్కొంది. అవిక్‌కు టి.బి. ఉందని నిర్ధారణ అయినప్పుడు, అతను తమ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న పాఠశాలకు నడవలేక పోవడంతో చదువు ఆపేయాల్సి వచ్చింది. ‘‘నేను బడినీ, నా స్నేహితులనీ మిస్సవుతున్నాను. ఇప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి, నాకంటే ఒక తరగతి పైన ఉన్నారు. ఆటలు ఆడలేకపోతున్నందుకు కూడా బాధగా ఉంది,’’ అని 16 ఏళ్ళ అవిక్‌ అన్నాడు. భారతదేశలో, ప్రతి సంవత్సరం 0`14 సంవత్సరాల మధ్య వయసున్న 3.33 లక్షలమంది పిల్లలు క్షయవ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ఇది అబ్బాయిలకు సోకే అవకాశమే ఎక్కువ. ‘‘పిల్లల్లో టి.బి.ని నిర్ధారించడం చాలా కష్టం. అవి పిల్లల్లో కనిపించే ఇతర చిన్ననాటి అనారోగ్య లక్షణాల మాదిరిగానే ఉన్నాయి…’’ అని ఎన్‌.హెచ్‌.ఎం. నివేదిక చెబుతోంది. చిన్నవయసు క్షయ రోగులకు ఎక్కువ మోతాదులో మందులు అవసరమని ఈ నివేదిక పేర్కొంది.
పదిహేడేళ్ళ రాఖీ శర్మ క్షయవ్యాధితో సుదీర్ఘ యుద్ధం చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమె ఇప్పటికీ ఎవరో ఒకరి సహాయం లేకుండా నడవలేదు, ఎక్కువ గంటలు కూర్చోలేదు. ఆమె కుటుంబం మొదటినుండీ పిల్‌ఖానా మురికివాడలోనే నివసిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఆమె ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయింది. హౌరాలోని ఒక దుస్తుల తయారీ కర్మాగారంలో పనిచేస్తోన్న ఆమె తండ్రి రాకేశ్‌ శర్మ, ‘‘మేం తన కోసం ఇంట్లోనే ఒక ప్రైవేట్‌ ట్యూటర్‌ని పెట్టాలని ప్రయత్నిస్తున్నాం. వీలైనంతవరకు ఆమెకు సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నా, మాకు ఆర్థిక పరిమితులున్నాయి’’ అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో టి.బి. కేసులు ఎక్కువగా ఉన్నాయి. వంట చెరకుగా గడ్డిని లేదా ఎండుగడ్డిని ఉపయోగించే ఇళ్ళల్లో నివసించేవారు, ప్రత్యేకమైన వంటగది లేనివారు, వాటికి దగ్గరగా నివసించే వారికి టి.బి. వచ్చే అవకాశం ఉందని ఇటీవలి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌`5 నివేదిక చెబుతోంది.
పేదరికం వలన కలిగే ఆహార, ఆదాయ లేమి వల్ల క్షయ వ్యాధి రావడంతో పాటు ఈ వ్యాధి రావడం వలన బాధితుల పేదరికం మరింత పెరుగుతుందనేది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల సాధారణ అభిప్రాయం. క్షయ రోగి కుటుంబాలు, తమని వెలిగా చూస్తారనే భయంతో దాని గురించి బైటికి చెప్పుకోరని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌`5 పేర్కొంది. ‘‘…ప్రతి ఐదుగురిలో ఒక కుటుంబ సభ్యుడు తమ కుటుంబ సభ్యుల క్షయ వ్యాధి స్థితిని బయటకు చెప్పకూడదని అనుకుంటాడు.’’ టి.బి. ఆసుపత్రిలో పనిచేయడాని ఆరోగ్య కార్యకర్తలు కూడా ముందుకు రారు. భారతదేశంలోని క్షయ రోగులలో నాలుగవ వంతు పునరుత్పత్తి వయస్సులో (15 నుండి 49 సంవత్సరాలు) ఉండే మహిళలే అని జాతీయ ఆరోగ్య మిషన్‌ నివేదిక (2019) తెలిపింది. పురుషుల కంటే స్త్రీలకు క్షయవ్యాధి తక్కువగా సోకుతున్నా, అది సంక్రమించినవాళ్ళు తమ ఆరోగ్యం కంటే కుటుంబ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు.
‘‘నేను వీలైనంత త్వరగా (ఇంటికి) తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. నా భర్త వేరొకరిని పెళ్ళి చేసుకుంటాడేమోనని భయంగా ఉంది,’’ అని బీహార్‌కి చెందిన క్షయ రోగి హనీఫా అలీ తన వివాహ బంధం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె మందులు తీసుకోవడం మానేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని హౌరాలోని బ్యాట్రా సెయింట్‌ థామస్‌ హోమ్‌ వెల్ఫేర్‌ సొసైటీ వైద్యులు అన్నారు.
‘‘మహిళలు తమ బాధలను ఎక్కువగా బైటికి చెప్పుకోరు. వారు రోగ లక్షణాలను దాచిపెట్టి పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళకు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది,’’ అని సొసైటీ కార్యదర్శి మోనికా నాయక్‌ చెప్పారు. ఆమె క్షయవ్యాధి రంగంలో 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారు. క్షయ నుంచి కోలుకోవడం సుదీర్ఘ ప్రక్రియ అనీ, మొత్తం కుటుంబంపై దాని ప్రభావం పడుతుందనీ ఆమె వివరించారు.
‘‘రోగి కోలుకున్నప్పటికీ, వారి కుటుంబం వారిని తిరిగి అక్కున చేర్చుకోకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేం కుటుంబ సభ్యులను ఒప్పించడానికి చాలా కష్టపడాలి’’ అని మోనికా చెప్పారు. క్షయవ్యాధి నివారణ రంగంలో చేసిన అవిశ్రాంత కృషికి గాను ఆమె ప్రతిష్టాత్మకమైన జర్మన్‌ క్రాస్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ను అందుకున్నారు. సుమారు 40 ఏళ్ళ వయసున్న ఆలాపి మండల్‌ క్షయ నుంచి కోలుకున్నారు. ‘‘నేను నా కుటుంబాన్ని తిరిగి చేరడానికి రోజులు లెక్కబెట్టుకుంటున్నాను. ఈ సుదీర్ఘ పోరాటంలో వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలిపోయారు…’’ అని ఆమె వాపోయారు.
… … …
ఆరోగ్య కార్యకర్తలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాస్క్‌ ధరించడం తప్పనిసరి. సొసైటీ నిర్వహిస్తోన్న వైద్యశాలలో క్షయవ్యాధి ముదిరిన రోగులను ప్రత్యేక వార్డులో
ఉంచుతారు. ఔట్‌ పేషెంట్‌ విభాగం రోజుకు 100`200 మంది రోగుల చొప్పున వారానికి రెండుసార్లు సేవలందిస్తుంది. వీరిలో 60 శాతం మంది మహిళా రోగులు. క్షయవ్యాధికి సంబంధించిన మందులను దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల చాలామంది రోగులలో క్లినికల్‌ డిప్రెషన్‌ లాంటి దుష్ప్రభావాలు
ఉంటాయని ఈ రంగంలో పనిచేస్తున్న వైద్యులు అంటున్నారు. సరైన చికిత్స అనేది సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. డిశ్చార్జ్‌ అయిన తర్వాత, రోగులు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి, వాళ్ళకు ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. చాలామంది రోగులు తక్కువ ఆదాయ వర్గాలకు చెందినవాళ్ళు కాబట్టి, తరచుగా మందులను మధ్యలోనే ఆపేస్తుంటారు. దీని వలన వారికి ఎండిఆర్‌ టిబి (మల్టీ`డ్రగ్‌ రెసిస్టెన్స్‌ ట్యూబర్‌క్యులోసిస్‌) వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్‌ టోబాయాస్‌ వోట్‌ అన్నారు. జర్మనీకి చెందిన ఈ వైద్యుడు, గత రెండు దశాబ్దాలుగా హౌరాలో క్షయవ్యాధికి చికిత్స చేస్తున్నారు.
మల్టీడ్రగ్‌ రెసిస్టెంట్‌ టిబి (ఎండిఆర్‌ టిబి) ప్రజారోగ్య సంక్షోభంగానూ, ఆరోగ్య భద్రతకు ముప్పుగానూ మారింది. 2022లో డ్రగ్‌ రెసిస్టెంట్‌ టిబి ఉన్న ఐదుగురిలో ఇద్దరు మాత్రమే చికిత్స తీసుకున్నారు. ‘‘2020లో 214,000 మంది హెచ్‌ఐవి రోగులతో పాటు, 15 మిలియన్ల మంది టిబితో మరణించారు’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) గ్లోబల్‌ టిబి నివేదిక వెల్లడిరచింది.
‘‘క్షయవ్యాధి ఎముకలు, వెన్నెముక, కడుపు, మెదడుతో సహా శరీరంలోని ఏ భాగాన్నైనా దెబ్బతీయగలదు. ఈ వ్యాధి బారినపడి కోలుకున్న పిల్లలున్నారు, కానీ వాళ్ళ చదువులు మాత్రం దెబ్బతిన్నాయి’’ అని డాక్టర్‌ వోట్‌ అన్నారు. అనేకమంది క్షయవ్యాధి రోగులు తమ జీవనోపాధిని కోల్పోయారు. ‘‘నేను ఊపిరితిత్తుల క్షయవ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నా కూడా ఇప్పుడు పని చేయలేకపోతున్నాను. నా బలమంతా పోయింది’’ అని గతంలో రిక్షా లాగే షేక్‌ సహాబుద్దీన్‌ చెప్పారు. ఒకప్పుడు హౌరా జిల్లాలో ప్రయాణీకులను రిక్షా ఎక్కించుకుని వారి గమ్యాలకు చేర్చిన బలమైన వ్యక్తి ఇప్పుడు నిస్సహాయంగా మారిపోయారు. ‘‘మా కుటుంబంలో ఐదు మందిమి ఉన్నాం. మేమెలా బ్రతకాలి?’’ అని ఈ సాహాపూర్‌ నివాసి ప్రశ్నించారు. పాఁచు గోపాల్‌ మండల్‌ బ్యాఁట్రా హోమ్‌ వెల్ఫేర్‌ సొసైటీ వైద్యశాలకు చికిత్స కోసం వచ్చే ఒక వయసు మళ్ళిన రోగి, భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు. కానీ ఇప్పుడు, ‘‘నా వద్ద రూ.200 కూడా లేవు, నిలబడే శక్తి కూడా లేదు. నా ఛాతీ పరీక్షల కోసం ఇక్కడికి వచ్చాను. కొన్నాళ్ళ నుంచి నాకు గులాబీ రంగు కఫంతో దగ్గు మొదలైంది,’’ అని ఈ 70 ఏళ్ళ హౌరా నివాసి చెప్పారు. తన కుమారులంతా పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళారని ఆయన అన్నారు. క్షయవ్యాధి నియంత్రణ కోసం అంతర్జాలం ద్వారా రోగులకు సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ, ని`క్షయ్‌. ఇది చికిత్స ఎలా సాగుతుందో పరిశీలించే సమగ్ర, సింగిల్‌ విండోగా పనిచేస్తుంది. క్షయ రోగులను గుర్తించడం, వాళ్ళు కోలుకుంటున్నారని నిర్ధారించుకోవడం, సంరక్షణలో కీలకమైన అంశం. సొసైటీ ప్రధాన పరిపాలనాధికారి సుమంత ఛటర్జీ మాట్లాడుతూ, ‘‘మేం దానిలో (ని`క్షయ్‌) రోగులందరి వివరాలను నమోదు చేసి, ట్రాక్‌ చేస్తాం’’ అన్నారు. పిల్‌ఖానా మురికి వాడలలో క్షయ సోకినవారు అధిక సంఖ్యలో ఉన్నారు, ఎందుకంటే, ఇది ‘‘రాష్ట్రంలో అత్యంత ఇరుకైన మురికివాడలలో ఒకటి’’ అని ఆయన చెప్పారు. క్షయవ్యాధిని నయం చేయొచ్చు, నివారించవచ్చు అన్నది వాస్తవమే అయినా, ప్రపంచవ్యాప్తంగా, కోవిడ్‌`19 తర్వాత టిబియే రెండో ప్రధాన ప్రాణాంతకమైన అంటువ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది.
అంతేకాకుండా, కోవిడ్‌`19 ఆవిర్భావం తర్వాత దగ్గు, అనారోగ్యంగా కనిపించడం అనేవి సమాజంలో భయం కలిగించే అంశాలుగా మారాయి. ఆ భయం వల్ల క్షయరోగులు తమ అనారోగ్యాన్ని దాచిపెడుతుండడంతో వ్యాధి ముదిరి, అంటువ్యాధి తీవ్రతరం అయ్యే అవకాశం ఏర్పడుతోంది. నేను క్రమం తప్పకుండా ఆరోగ్య సమస్యల గురించి రాస్తున్నాను, కానీ చాలామంది ఇప్పటికీ క్షయవ్యాధితో బాధపడుతున్నారని నాకు తెలీదు. ఇది ప్రాణాంతక వ్యాధి కాకపోవడం వల్ల, దీని గురించి ఎక్కువగా చర్చించడం జరగడం లేదు. ఇది అన్నిసార్లూ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ, ఈ వ్యాధి కుటుంబాన్ని పోషించే వ్యక్తులపై ప్రభావం చూపి, ఆ కుటుంబానికి తీవ్ర ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతోందని నేను గుర్తించాను. అంతేకాదు, వ్యాధి నుంచి కోలుకోవడమనేది సుదీర్ఘమైన ప్రక్రియ. ఇది అప్పటికే అంతంత మాత్రంగా జీవనం సాగిస్తోన్న కుటుంబాలపై ఆర్ధికంగా పెనుభారాన్ని మోపుతుంది.
గోప్యత కోసం ఈ కథనంలోని కొన్ని పేర్లను మార్చాం.
ఈ కథనానికి సహకరించిన జయప్రకాశ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ చేంజ్‌ (జీూIూజ) సభ్యులకు రిపోర్టర్‌ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. క్షయతో బాధపడుతోన్న పిల్లలతో జీూIూజ సన్నిహితంగా పనిచేస్తోంది, వారికి నిరంతరాయంగా విద్య లభించేలా చూసేందుకు ప్రయత్నిస్తోంది.
(ఈ వ్యాసం https://ruralindiaonline.org/en/articles/tb-in-india-the-scourge-continues-te/) ఫిబ్రవరి 17, 2024 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.