ప్రేమ కథలు చదవడం కానీ చూడటం గాని నాకు ఎప్పుడూ ఇష్టమే. ఇంత కాలంగా ప్రేమ గురించి కవిత్వాలు, కథలు ఎందరో చెప్పారు. ఇంకా ఇంకా చెప్తూనే ఉన్నారు. అయితే మళ్ళీ చెప్పాలనుకునే వాళ్ళు ఎంతో ప్రతిభావంతులైతే తప్ప ఆ ప్రేమకథ మనల్ని కదిలించలేదు. అలాంటి ఒక ప్రత్యేకమైన మర్చిపోలేని ప్రేమకథ ఉన్న కన్నడ సినిమా ఈ మధ్య చూశాను. ఒకటికి రెండుసార్లు చూశాను.
నిజానికి మళ్ళీ చూడాలని ఉంది. ఆ సినిమా గురించి రెండు మూడు విషయాలు మీతో పంచుకున్నాక మరోసారి ఎలాగూ చూస్తాను.
రెండు మూడు నెలల కంటే ఎక్కువ సమయం లేని రోగులను దగ్గర పెట్టుకొని చూసుకునే ఆశ్రయ అనే ఒక సంస్థ. అందులో ప్రేరణ అనే అమ్మాయి కౌన్సిలింగ్ అనే పేరుతో వారికి ధైర్యం చెప్పే ఉద్యోగం చేస్తూ ఉంటుంది. నిజానికి అది ఉద్యోగంలా కాకుండా జీవితంలో భాగంగా చేసుకుంటుంది. ఆమెకు ఇంట్లో అనుకూలమైన దాంపత్య జీవితం లేదు. పిల్లలు లేరు. అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళ్ళే తల్లి ఉంది. భర్తకు వేరే వేరే సంబంధాలు. ఉదయమే లేచి ఇంటి పనిలో భాగంగా వాకిలి ఊడ్చుకుంటూ, వాకిట్లో రాలిన నందివర్ధనం పూలను కూడా నిర్వికారంగా చీపురుతో ఊడ్చే దినచర్య ఆమెది. ఆమె పనిచేసే సంస్థలో ఆమెతోపాటు అక్కడ పనిచేసే అటెండర్ ప్రభాకర్ కూడా సున్నిత మనస్కుడు. అక్కడ ఇంచుమించు రెండు నెలలకు ఒకసారి జరిగే మరణాలకు తట్టుకోలేక ఒక రోజంతా తాగి కదలకుండా పడి ఉంటూ ఉంటాడు. ఒకనాడు ఆ సంస్థకు మరొక కొత్త పేషెంట్ వస్తాడు. అతను మొదట తన వివరాలు ఇవ్వటానికి నిరాకరిస్తాడు, కానీ తప్పనిసరిగా ఇవ్వాలని చెప్తే ఇస్తాడు. కౌన్సిలింగ్ అవసరం లేదని చెప్తాడు. కానీ ప్రేరణ తనే అతని కాటేజ్‌కి వెళ్ళి మాట్లాడబోతే అతని ప్రవర్తన ఆమెకు వింతగా అనిపిస్తుంది. తన ప్రశ్నకు సీరియస్‌గా సమాధానం చెప్పమని అడుగుతుంది. రెండు నెలల్లో చనిపోయే వాడికి సీరియస్‌గా ఉండటం ఏమిటి నువ్వేమి కౌన్సిలర్‌వి అంటాడు. ఆమె మాట్లాడలేక వెనక్కి వచ్చేస్తుంది. అతను ప్రత్యేకమైన వ్యక్తి అని ఆమెకు అర్థమవుతుంది. గది కిటికీలోంచి ఎదురుగా ఉన్న చెట్లను, పూలను, సరస్సును చూస్తూ ఉంటాడు. అతని భావుకత క్రమంగా మనకు, ఆమెకు కూడా అర్థమవుతుంది. అతను రాసిన ఒక కవిత ఆమెను చాలా కదిలిస్తుంది. ఒక సరస్సును వర్ణిస్తూ అతను రాసిన కవిత అది. ఈ సరస్సు అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు లేదు. కానీ ఇది అదే. అప్పటి అందాలేవీ మిగిలి లేవు. కానీ ఇది ఇంకా సరస్సుగానే ఉంది. ఇప్పటిలాగే అప్పుడూ ఉన్నా కూడా ఈ సరస్సుకు పోయేదేమీ లేదు. ఇలాంటి భావనతో రాసిన కవిత అది. ఏ పని చేస్తున్నా ఆ కవిత ఆమెను వదలదు. గడచిన కాలంలా ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు కూడా లేనిది ఏముంది అన్న తాత్విక భావమేదో ఆమెను కదుపుతుంది.
క్రమంగా ఆమె అతని పట్ల ఒక ప్రేమ భావానికి లోనవుతుంది. అతన్ని కూడా దగ్గర చేసుకుంటుంది. రెండు నెలల్లో చనిపోయే వ్యక్తితో ఆమె ప్రేమలో పడుతుంది. వారిద్దరి మధ్య మాటలు, వెనుకనుంచి సున్నితమైన సాహిత్యం తోటి నేపథ్య సంగీతంగా పాటలు, ఊటీ, మైసూర్, కొడైకెనాల్ లొకేషన్‌లు. నీరు, అడవులు, సంగీతం, ఆకాశం, వర్షం వాటి మధ్య వారిద్దరి మనసుల దగ్గర.
ఇదీ ఆ సినిమాలోని ప్రేమ కథ. ఒకనాడు ఆమె అతను ఉండే కాటేజ్‌కి రాగానే ఎప్పుడూ కిటికీ వైపు చూస్తూ కూర్చునే అతను గుమ్మం వైపు చూస్తూ కూర్చుంటాడు. అదేమిటని అడిగితే ఒక్కొక్కసారి అందమైన దృశ్యాలు తలుపు తీసుకుని కూడా వస్తాయంటాడు. ఇటువంటి క్లుప్తమైన సంభాషణలు వారి ప్రేమను మన మనసులో నాటుతాయి. ఈ ప్రేమ కథలో అతని చివరి రోజు ఆమె అతని గదిలోనే ఉంటుంది. అతని కోరిక మీద అతని పక్కనే పడుకుని చెంపమీద ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు అతను తను ఇచ్చిన తన అడ్రస్ ఫేక్ అనీ, తన పేరు కూడా అక్కడ చెప్పినట్లు అవినాష్ కాదని, ఇలా అనామకంగా చనిపోవడమే తన ఇచ్ఛ అని చెప్తాడు. స్ట్రీట్ డాగ్ మరణమంత బ్యూటిఫుల్ డెత్ మరేదీ ఉండదని తను అదే కోరుకుంటాడు. ఇదంతా అయిన తర్వాత ఆ సంస్థ అధిపతి అయిన డాక్టర్ ఆమెను ఆరా తీస్తూ ప్రశ్నించబోతాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం వినడం కోసమైనా సినిమా చూడండి. అలాగే బయట రకరకాలుగా తిరిగే ఆమె భర్త అడిగిన ప్రశ్నకు కూడా ఆమె ఒకే ఒక మాటతో సమాధానం చెబుతుంది. అది కూడా నిజానికి సమాధానంగా కాదు, అది వినటానికి కూడా సినిమా చూడాలి.
రెండు గంటల నిడివి కూడా లేని చిన్న సినిమా. దీన్ని 18 రోజుల సింగిల్ షెడ్యూల్‌లో తీశారట. రెండు నెలల్లో చనిపోయే ఒక కవి, భావుకుడు, అతని భావాలు, వాటి తాత్వికత, వాటి లోతులు మన లోపలికి తీసుకోవటానికి కూడా ఈ సినిమా చూడాలి. ఆమె మొదట్లో చీపురుతో ఊడ్చిపారేసే నందివర్ధనాలను అతను తాత్వికమైన దృష్టితో విశ్లేషిస్తాడు. ఇవి తమ కోసమే విరగబూస్తాయి. వాటికి సువాసన లేకపోవచ్చు, కానీ పూయడం మానవు. మనం కూడా ఇలా మనకోసమే బతకవచ్చు కదా అంటాడు. నాకు నిజమే అనిపించింది. పారిజాతాలు కూడా చెట్టు నిండా పూస్తాయి. అవి ఉదయానికి రాలిపోతాయి కానీ వాటిని కీర్తిస్తాం కదా అనిపించింది. వాటి జీవితం మనకోసమే అని మనం అనుకుంటాం, అవి ఏమనుకుంటాయో మరి. మరువలేని మాటలు. తాత్వికతను సులువుగా తెలిపే మాటలు. వాటికోసం కూడా మళ్ళీ చూడాలి. జీవితపు మలుపుల దగ్గర మాత్రమే మనుషులు మనుషులుగా మారతారట. మిగిలిన సమయమంతా రొటీన్‌లో పడి నలిగిపోతూ ఉంటారు. మలుపులు కష్టం కలిగించినా అక్కడే మనకు నిజమైన మనిషి కనిపిస్తాడు. అక్కడే నా చితాభస్మం చల్లమని ఆ ప్రేమికుడు ప్రేరణను కోరుతాడు.
ప్రేమ అంటే ఒక రకమైన ధ్యానస్థితి కదా అనే పల్లవి వినిపిస్తూ ఉంటుంది. కాసిన్ని రోజుల ప్రేమ. అదీ మరణానికి మరీ చేరువగా
ఉన్న వ్యక్తి. ఇలాంటి ప్రేమకథలు చెప్పి ఒప్పించడం కష్టం. కానీ, మనం ఒప్పుకోవడం ఏమిటి, కరిగి, నీరై, కలిసిపోతాం. విరగబూసిన ఆ నందివర్ధనం పూల చెట్టులా మిగులుతాం. దుఃఖమే కానీ వికాసం నింపిన దిగులు అది. నేను అందుకోసమే ఈ సినిమా మళ్ళీ చూస్తాను అన్నది. ఒక సన్నివేశంలో ‘కూడలిసంగమ దేవా’ అనే మకుటంతో ఉన్న కన్నడ వచనం వినిపిస్తూ ఆ సన్నివేశాన్ని మరింత బరువుగా చేసి విరక్తితో ఆ బరువును గుండెలకు చేరుస్తుంది. ఇలాంటి సినిమాలో (బహుశా అక్క మహాదేవిది కావచ్చు) కేవలం ఆ వచనం వల్లనే అవసరమైన తాత్వికత తాలూకు మూడ్ వచ్చింది. అది దర్శకుడికి దృష్టికోణంలో ఉన్న వైవిధ్యానికి ఉదాహరణ. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రాజ్ బి శెట్టి. ఇందులో ప్రేమికుడిగా కూడా ఇతనే నటించాడు. సిరి రవికుమార్ అనే నటి ప్రేరణగా మనని మరిచిపోనివ్వదు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. (ఉదయిని పత్రిక సౌజన్యంతో…)