గొప్పోళ్ళు నేరం చేసినా అది లోకకళ్యాణం కోసమే అంటార్రా… అదే మనలాంటి తక్కువోళ్ళు మంచి చేసినా, దాన్ని క్షమించరాని నేరంగానే చూస్తారు రా సంజీవ్, మనం జైలుకు పోకూడదు, మనం ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఉండి తీరాలి.
ఇక ముందు ఎవరూ తప్పు చేయకుండా ఉండాలంటే మనం ఉండాలి. తప్పు చేయాలంటే భయం పుట్టాలి. ఆ భయం మనల్ని చూసి పుట్టాలి. కథానాయకుడు చెప్పే డైలాగ్ గుర్తు పెట్టుకోండి. చాలా మాట్లాడుకోవాలి తర్వాత. వెండితెరపై కొన్ని అపురూపాలు ఆవిష్కృతమవుతాయి. ఇక తెలుగు స్క్రీన్‌పై అప్పుడప్పుడూ కొన్ని అద్భుతాలు పుడతాయి. ‘‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేద’’ని చెప్తాడు కదా త్రివిక్రమ్… సరిగ్గా ఇలానే పుట్టిన ఓ అద్భుతం పేరే ‘‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’’. అద్భుతం మాత్రమే కానీ అత్యద్భుతం కాదు. కులం చల్లే కళ్ళాపి, కులం పెంచి పోషించే పితృస్వామ్యాన్ని వెండితెర మీదకు ఎక్కించి, దాన్ని వీక్షకుల కంటితెర మీద ఆవిష్కరించాలంటే చాలా తెగింపు కావాలి. ఆ వైకుంఠపాళిలో సక్సెస్ అయింది ‘‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’’ టీమ్. ఈ సినిమా కథ తెలియక, తెలుగు సినిమా పెద్దలు రిలీజ్‌కు ఒప్పుకున్నారా లేక తెలిసే చూసీ చూడనట్లు వదిలేశారా అనేది తెలియక కాస్త నెర్వస్‌నెస్‌ను క్రియేట్ చేస్తోందిలే కానీ… ‘‘దళితులు’’ ఇంకా ఎంతకాలం కులం గురించి మాట్లాడతారు? ఇంకెన్నాళ్ళు కులవివక్షనే వస్తువుగా తీసుకుని కథలు, కవితలు రాస్తారు? అనే ప్రశ్న కొంతకాలం నుంచి బాగా వినిపిస్తోంది. ఇందులో కన్సర్న్ కనిపించిందంటే మీ కళ్ళజోడు అర్జంటుగా మార్చాలన్నమాట. ఇందులో ‘సాఫ్ట్ కార్నర్ టోన్’ వీనుల విందుగా వినిపించింది అంటే లేట్ చేయకుండా ఈఎన్‌టీ స్పెషలిస్ట్ వద్దకు ఎగేసుకు పరిగెత్తాలన్నమాట. ఎందుకంటే… ఇంకెక్కడ ఉంది బాబు కులం? అంతా కలిసిపోయాముగా, వెలివాడ పిలగాడు మా వాడకట్టు పిల్లను చేసుకోవట్లే! ఊరి అవతల ఉన్నోళ్ళు ఇప్పుడు అందరితో కలిసిపోయి ఉండట్లే? ఇంకా కులం కులం అంటారేమిట్రా అయ్యా అనే ప్రశ్నలకు ఏ మాత్రం తక్కువ కాని కన్సర్న్, సాఫ్ట్ టోన్స్ అవి కనుక. కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే కడుపు మంట ఇట్టే తెలుస్తుంది. ఊరికి అవతల ఉండాల్సిన అలగా నా`కొ`డు`కు`లు, ముం`డ`లు ఇప్పుడు మా పక్కకే వచ్చారు కదరా? మాతో కలిసే చస్తున్నారు కదరా? ఏం చాలదా? మా నట్టింట్లోకి వచ్చి మా మంచాల మీద కూర్చోవాలా ఏమిటి? అనే వికృతపు విసురు సురుకు పుట్టిస్తది. కులం వేళ్ళూనుకు పోయి ఉన్న విషమస్తిష్కాలకు టాలీవుడ్‌లో కొదవ లేదు. అందుకే అసలు ఈ సినిమా రిలీజ్‌కు ఎట్టా ఒప్పుకున్నార్రా, ఎట్లా రిలీజ్ చెయ్యనివ్వగలిగారు అనేది నా నెర్వస్‌నెస్ కమ్ క్యూరియాసిటీ.
హీరో మంగలివాడు, హీరోయిన్ కమ్మోళ్ళ పిల్ల. విలన్ హీరోయిన్‌కు తోడబుట్టినోడు కనుక అతడు కమ్మోడే! ఎదురు చెప్పి, తన పురుషాధిక్యత మీద దెబ్బ కొట్టిందనే కారణంతో ఆమెను (హీరో అక్కను) వివస్త్రను చేస్తాడు. కులం తక్కువది కాబట్టి బట్టలిప్పి వదిలేశాడే కానీ ముట్టుకోడు. అంటే రే`ప్ చేయలేదు. అంత కుల పి`చ్చి అని చూపించాలనుకున్నాడు కానీ… డైరెక్టర్ ఈ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఎన్నో చేదు నిజాలను స`మా`ధి చేశాడు. పై చదువులు చదువుకుంటున్నారని కొందరిని, ఉద్యోగాలు చేస్తున్నారని కొందరిని, అప్పు తీర్చలేకపోతే సరే, వడ్డీ ఇవ్వకపోతే సరే పక్కలోకి వచ్చి కోరిక తీర్చలేదని కొందరు మహిళలను రే`ప్ చేసిన ఘటనలు ఈ దేశంలో కోకొల్లలు. అ`త్యా`చా`రం చేశాక… మా`నంలో గాజుపెంకులు కూరి, రోకలిబండలు దూర్చి, కారప్పొడి కుక్కి, ఇనుపరాడ్లతో పే`గు`లు బయటకు లాగి… ఊరేగించిన కి`రా`త`కాలు ఎన్నో ఎన్నెన్నో… బహుశా ఇది డైరెక్టర్‌కు తెలియదనుకుంటాను. ‘‘నన్ను 10 మంది ఠాకూర్లు వంతులు వేసుకుని మరీ రే`ప్ చేశారు, నాకు 10 రోజుల పాటు న`ర`క`ం చూపించారు, న్యాయం చేయండి సార్ అని ధర్మాసనాన్ని బాధితురాలు వేడుకుంటే…’’ మైలార్డ్… ఈమె క`డ`జా`తి మహిళ, ఠాకూర్లు వీళ్ళ కులం గురించి మాట్లాడేందుకు ఇష్టపడరు, వీళ్ళను ఇంటిలోనికి రానివ్వరు, ఈ జాతివాళ్ళ నీడ కూడా నీ`చంగా భావిస్తారు, అలాంటి ఠాకూర్లు ఈమెను రే`ప్ చేశారంటే ఎలా నమ్మాలి అని డిఫెన్స్ అడ్వకేట్ వాదిస్తే, దాదాపు కన్విన్స్ అయినట్లు కనిపించిన ధర్మాసనం
ఉన్న ధర్మదేశం మనది. బహుశా ఈ కేస్ డైరెక్టర్‌కు కొంచెం తెలిసి ఉండొచ్చు కాబోలు!
ఇక తన చెల్లిని మంగలి హీరో… ప్రేమించాడనే అక్కసుతో హీరో మీద పగ పెంచుకునే కమ్మ విలన్… చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. హీరోకు గుండు కొట్టడం నుంచి వాళ్ళ అక్క బట్టలు విప్పేవరకు అనేక దుర్మార్గాలు ఉన్నాయి. కులం గురించి పూర్తిగా కాకున్నా కొంతమేరకు అంటే… తను పరిధులు విధించుకున్నంత వరకు బాగానే తీశాడు డైరెక్టర్. అందుకే ఇది అద్భుతం మాత్రమే కానీ అత్యద్భుతం కాదు. అయితే మర్చిపోకుండా మాట్లాడుకోవాల్సిన పచ్చి నిజం ఏమిటంటే ‘‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’’ సినిమాలో మంగలివాళ్ళ మీద కమ్మోళ్ళు చూపించే వివక్షను మాత్రమే చూపించారు కానీ… మంగలివాళ్ళు దళితుల మీద చూపించే కులవివక్ష గురించి చూపించలేదు. మాల, మాదిగలకు కటింగ్ చేస్తే కమ్మోళ్ళు, రెడ్లు, బ్రాహ్మణులు ఎక్కడ తమకు పని ఇవ్వరో అనే భయంతో మంగలి మహారాజులు కొందరు దళితులకు హెయిర్ కటింగ్ చేయడమే మానేశారు. మాల మాదిగలు నిలదీస్తే ‘‘మంగళవారం’’ మీకు కేటాయిస్తామన్నారు. ఆ రోజు మంగలోళ్ళు దొరుకుతరా అసలు! మళ్ళీ నిలదీస్తే… మా షాపుల్లో కాదు ఊరి బయట చెట్టు కింద చేస్తామంటూ వేరే కత్తెర, కత్తులతో తల, గడ్డం గొరిగిన దుర్మార్గాన్ని తన కడుపులో పదిలంగా దాచుకున్న చరిత్ర మన కన్నుల ముందే ఉంది. ఆధిపత్య కులాల తర్వాత, కొన్నిసార్లు ఆధిపత్య కులాల కన్నా అంటరానితనాన్ని చూపించేది బీసీలే. ఎస్సీలతో కలిస్తే ఓసీలు తమను దగ్గరికి రానివ్వరనే భయం మాత్రమే కాదు మాల మాదిగోళ్ళ కన్నా తాము ఎక్కువ అని! ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఒడువని ముచ్చట! అందుకే కదా ‘‘నువ్వు తప్పించుకోలేని పెనుభూతం ‘కులం’’ అంటాడు బాబాసాహెబ్. కాబట్టే ‘‘కులం’’ ఉన్నంతవరకు మాట్లాడాలి, మాట్లాడి తీరాలి, కులం గీసిన గీతలను, కులం చేసిన గాయాలను రాయాలి, రాసి తీరాలి అంటాను నేను! ఏది ఏమైనా సరే హీరో సుహాస్, శరణ్య యాక్టింగ్ సూపర్ బాస్! ముఖ్యంగా సుహాస్ స్టోరీ సెలక్షన్, క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసే అతని డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంతే! కానీ టాలీవుడ్‌లో సుహాస్ ఎక్కువకాలం ఉండడు, ఉండనివ్వరు. ణశీ వశీబ సఅశీష షష్ట్రవ? సుహాస్ ‘‘దళితుడు’’ కనుక.
(ఉదయిని పత్రికసౌజన్యంతో…)