మరో కోణంలో ‘మంచి పుస్తకం’ – పద్మ వంగపల్లి

మంచి పుస్తకం ప్రస్థానం 2003 హైదరాబాద్‌ బుక్‌ ఫేర్‌లో పాల్గొనటంతో మొదలయింది. 2004 ఏప్రిల్‌లో పబ్లిక్‌ ట్రస్ట్‌గా నమోదయింది. దీని పునాదులు 1989లో మొదలై, పదేళ్ళ పాటు పనిచేసిన ‘బాల సాహితి’ అన్న ట్రస్టులో ఉన్నాయి. ఆ పదేళ్ళకాలంలో బాల సాహితి 40కి పైగా పుస్తకాలు ప్రచురించింది. మంచి పుస్తకం వ్యవస్థాపక ట్రస్టీలుగా కె.సురేష్‌, ఎ.రవీంద్రబాబు ఉన్నారు.

2010 నుంచి ట్రస్టీగా కొనసాగుతున్న ఎస్‌.ఎస్‌.లక్ష్మి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2007 నుంచి తన పూర్తి సమయాన్ని ఇస్తున్న పి.భాగ్యలక్ష్మి పుస్తకాలను పిల్లలకు చేరువ చేయటంలో ఎంతో కృషి చేస్తున్నారు. పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమను కలిగించటం, తెలుగులో పఠనా సామర్ధ్యాన్ని పెంచటం ప్రధాన ఉద్దేశ్యాలుగా మంచి పుస్తకం పనిచేస్తోంది. మొదట కొన్ని సంవత్సరాలు హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో పాల్గొనటం ప్రధాన కార్యక్రమంగా ఉండేది. తెలుగులో అందుబాటులో ఉన్న పిల్లల పుస్తకాలను తెచ్చి పాఠకులకు పరిచయం చేసేవాళ్ళం. తల్లిదండ్రులు, టీచర్లతో పుస్తకాల గురించి, వాటి ఎంపిక గురించి మాట్లాడటం ప్రధాన కార్యక్రమంగా ఉండేది. దీంట్లో సి.ఎ.ప్రసాద్‌, రఘుబాబు, భాగ్యలక్ష్మి , శ్రీ కుమార్‌ వంటి ఎంతోమంది వాలంటీర్లుగా సహకరించారు. ఇప్పుడు మంచి పుస్తకం తన ప్రచురణలే కాకుండా సి.బి.టి, విజ్ఞాన ప్రచురణలు, పీకాక్‌ క్లాసిక్స్‌, కావ్య పబ్లిషింగ్‌ హౌస్‌, హెచ్‌బిటి వంటి ఎంపిక చేసిన సంస్థల ప్రచురణలు అందుబాటులో ఉంచుతోంది. వెరసి 400కి పైగా టైటిల్స్‌ నుంచి ఎంచుకునే అవకాశం పాఠకులకు ఉంది.
పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమ, తెలుగులో చదివే సామర్థ్యం పెంచే ఉద్దేశాలతో మొదలైన ‘మంచి పుస్తకం’ ప్రయాణంలో ఇరవై వసంతాలు గడిచాయి. ఈ క్రమంలో 500 పుస్తకాలను సంస్థ ప్రచురించింది. వివిధ వయస్సుల వారికి, వివిధ ఆంశాల పుస్తకాలు ఇందులో ఉన్నాయి. మంచి పుస్తకం అన్ని ప్రచురణలను పరిచయం చేయటం సాధ్యం కాదు కాబట్టి జెండర్‌ కోణం నుంచి కొన్నింటిని చూసే ప్రయత్నం చేద్దాం.
ఆడపిల్లలు కథానాయికలుగా ఉన్న పుస్తకాలు:
ఈ కోణంలో మంచి పుస్తకం ప్రచురణల్లో మొట్టమొదట పేర్కొనవలసిన ‘అనార్కో’. దీనికి రెండు విశిష్టతలు ఉన్నాయి. హిందీలో రాసిన ఈ కథలు మొదట ఆ భాషలో కాకుండా తెలుగులో ప్రచురితమయ్యాయి. రెండవది, పుస్తకంగా కంటే ముందు అనార్కో ఏడు రోజుల కథలు ‘భూమిక’ మాస పత్రికలో 1997లో సీరియల్‌గా ప్రచురించారు. ‘‘అనార్కో ఓ ఆడపిల్ల. ఇది తను వేసుకునే బట్టలని చూసి చెప్పొచ్చు. బట్టలు వేసుకోకపోయినా చెప్పొచ్చనుకోండి’’ అన్న వాక్యాలతో మొదటి రోజు కథ మొదలవుతుంది. ఈ వాక్యాల కారణంగానే హిందీలో దీనిని ప్రచురించడానికి ప్రచురణ కర్తలు నిరాకరించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. మొత్తం ఏడు రోజుల కథలు అనార్కో వ్యక్తిత్వాన్ని మన కళ్ళముందు ఆవిష్కరిస్తాయి. మొదటి కథలోనే ‘అధికారం’ మూలాల్లోకి వెళ్ళే అనార్కో దేనినీ వదిలిపెట్టకుండా ప్రశ్నిస్తుంది. దయ్యాల భయంలో ఉండే మజా నాన్న భయంలో లేదని అనార్కోకి అర్థమవుతుంది. ‘ప్రధాన మంత్రికి నా పేరు తెలుసా?’ అని అడగగల గడుగ్గాయి అనార్కో.
దేవుడు అంతటా ఉన్నాడా? చేప పిల్లలకి కూడా బడా? పిల్లలకి నీతులు? పెద్దవాళ్లందరినీ బుర్ర తాలిచే పురుగు కుట్టిందా? బడిలో పరీక్షలు ఉండాలని ఎవరు నిర్ణయిస్తారు? నిజంగా దెయ్యాలు ఉన్నాయా? వంతెన ప్రారంభించడానికి ప్రధాని ఎందుకు వస్తున్నాడు? ఆ ప్రధానికి ఒంటేలు వస్తే ఎక్కడ పోసుకుంటాడు? దొడ్డికి కూర్చునేటప్పుడు తనలాగే, బట్టలు మొత్తం తీసేసి కూర్చుంటాడా? ఇలాంటి ప్రశ్నలు ఓ పదేళ్ళ చిన్నారికి, ఆమె స్నేహితుడికి వస్తే అందులో ఆశ్చర్యమేముంది? ఇవన్నీ అనార్కో కథలలో మనకు కనిపించే ప్రశ్నలు. ఇవన్నీ పిల్లలకు వచ్చే సహజమైన ప్రశ్నలని మనలో ఎంతమంది అనుకుంటారు? నిజం చెప్పాలంటే, అలా అనుకున్నప్పుడే మనం పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు.
‘అనార్కీ’ అన్న ఇంగ్లీషు పదం నుండి ఈ అమ్మాయికి రచయిత అనార్కో అని పేరు పెట్టాడు. ‘అనార్కీ’ అన్న పదానికి తెలుగులో అరాచకత్వం అన్న అం్థం చెలామణిలో ఉంది. కానీ అనార్కీ అంటే ‘ఎటువంటి అధికారాన్ని అంగీకరించకపోవడం’ నిజానికి అలాంటి తత్వమే ఉన్న అమ్మాయి మన అనార్కో. లండన్‌లో పుట్టి, నెల్లూరు దగ్గర పల్లెటూరులో ‘సృజన’ బడిలో, తరువాత హైదరాబాద్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తూ గడిపిన ఎలీనా వాట్స్‌ ‘అజంతా అపార్ట్‌మెంట్స్‌’ పేరుతో 8 పుస్తకాలు రాశారు. ఇందులో రెండు పుస్తకాలను ఇక్కడ పేర్కొనాలి. ‘అల్లరి జ్యోతి’లో ఆడపిల్ల అని తనని నిర్లక్ష్యం చేసి, తమ్ముడిని గారాబం చేస్తుంటే తన నిరసనని తెలియచేస్తూ తాతతో సహా అందరితో అల్లరి జ్యోతి అని అనిపించుకుంటుంది. ఆ అల్లరికి శిక్షగా జ్యోతిని తాత దగ్గరే ఉంచి, తమ్ముడిని తీసుకుని అమ్మానాన్నలు సినిమాకు వెళతారు. ఇంట్లో జొరబడిన దొంగలను జ్యోతి తెలివిగా పోలీసులకు పట్టిస్తుంది. పోలీసుల మెప్పు పొందుతుంది. దాంతో జ్యోతి వాళ్ళ నాన్న మగపిల్లలు ఆడుకునేవి అని అంతకు ముందు కొనివ్వని ఆట వస్తువులను అప్పుడు కొనిస్తాడు. ఇక రెండవ పుస్తకం ‘జ్యోతి, పక్కింటి మనిషి’ జ్యోతిష్యం చెప్పేవాళ్ళ మీద చెణుకు లాంటిది. ఖాళీగా ఉన్న జ్యోతి వాళ్ళ పక్క ఫ్లాట్‌లోకి జ్యోతిష్యాలు చెప్పే వ్యక్తి వస్తాడు. ‘జ్యోతి ఒక మంచి అమ్మాయి అవుతుంది. ఆమె ప్రశ్నలు వేయడం ఆపుతుంది’, అని జ్యోతి వాళ్ళ అమ్మతో జ్యోతిష్యుడు చెప్తాడు. వీళ్ళ విషయంలో అతను చెప్పిన మరో రెండు విషయాలు తప్పయ్యాయని తెలియజేసిన తరువాత, ‘‘మరి జ్యోతి విషయంలో ఏమయింది? మీరు ఏం అనుకుంటున్నారు?’ అంటూ కథ ముగుస్తుంది.
కథ నీతి చెపుతున్నట్టు ఉండకూడదన్నది మంచి పుస్తకం సంస్థ బలమైన అభిప్రాయం. సందేశాత్మక కథల పట్ల కూడా ప్రయోజనం ఉండదు. కథ నచ్చి, అది మనస్సుకు హత్తుకుంటే దానిలో నచ్చిన అంశంతో ఆ వ్యక్తి ప్రభావితం కావచ్చు, వాళ్ళల్లో ఆలోచనలు కలిగించవచ్చు. పెద్దవాళ్ళపై
ఉన్నట్లే పిల్లలపైన కూడా కథల ప్రభావం ఉంటుంది.
భారతదేశంలో పిల్లల కోసం రాసేవాళ్ళల్లో రస్కిన్‌ బాండ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తూ
ఉంటుంది. ఆయన రాసిన ఃుష్ట్రవ Aఅస్త్రతీవ Rఱఙవతీః, ఃుష్ట్రవ దీశ్రీబవ ఖఎపతీవశ్రీశ్రీaః అన్న రెండు కథల అనువాదాలను (‘శివమెత్తిన నది’, ‘నీలం రంగు గొడుగు’) ఒక పుస్తకంగా మంచి పుస్తకం ప్రచురించింది. ఈ రెండు కథలలోనూ అమ్మాయిలే కథానాయికలు. సీత, బిన్యా. కొండ ప్రాంతాల మహిళల్లో ఉండే స్వాతంత్రత, దేహ దారుఢ్యం, దృఢ చిత్తాన్ని ఈ ఇద్దరు అమ్మాయిలు కనబరుస్తారు. అనేక ఉద్వేగాలతో నిండిన ఈ రెండు కథలు, ఆ పాత్రలు అలా గుర్తుండిపోతాయి.
మంచి పుస్తకం ప్రచురించిన మరో పుస్తకం ‘వెండి గిట్ట’. రష్యన్‌ కథలోని పాత్రలకు తెలుగు పేర్లు పెట్టి చేసిన ప్రయోగాలలో ఇది ఒకటి. ఇందులో కోటయ్య ఒంటరివాడు. మగ పిల్లవాడిని దత్తత తీసుకుందామని అనుకుంటాడు (మగ పిల్లవాడు అయితే అతనికి పనిలో ఆసరాగా ఉంటాడని). గంగయ్య పిల్లలు అనాథలై, చిన్న కూతురు తార ఒక్కటే దత్తతకి ఉందని తెలిసి ఆమెను చూడడానికి వెళతాడు కోటయ్య. ఆ పిల్ల నచ్చటంతో ఆమెనూ, ఆమెతో ఉన్న పిల్లినీ తెచ్చేసుకుంటాడు. ముందు కుడి కాలుకి వెండి గిట్ట ఉండే ఒక ప్రత్యేకమైన జింక అడవిలో ఉందని, జింక ఆ గిట్టను తాటిస్తే రత్నాలు, వజ్రాలు రాలతాయని తారతో చెపుతాడు కోటయ్య. అప్పటినుంచి తారకి ఆ జింక గురించే ఆలోచనలు, ప్రశ్నలు. తార పట్టుబట్టడంతో తనతో పాటు అడవికి తీసుకుని వెళుతున్న కోటయ్యను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటారు. ఆ అడవిలో పిల్లితో తార ఒంటరిగా ఉన్నప్పుడు ఆ జింక నిజంగానే వచ్చి చెంగు చెంగున దూకుతూ రత్నాలను కురిపిస్తుంది. అదే సమయంలో తిరిగి వచ్చిన కోటయ్య సగం సంచిని రత్నాలతో నింపేసరికి ఆ దృశ్యాన్ని మరునాటి సూర్యకాంతిలో చూడాలని తార ఆపుతుంది. మరునాడు బయట రత్నాలు మాయం! ముందు రాత్రి నింపిన సగం సంచి రత్నాలతో కోటయ్య, తార సంతృప్తి చెందుతారు. జానపద శైలిలో అద్భుతమైన కథ ఇది.
‘మానస డైరీ’లో డిఫ్లెక్సియాతో చదవటానికి ఇబ్బంది పడే మానస, తనకి ఎదురైన అనుభవాలను, అనుభూతులను డైరీలో పొందుపరుస్తుంది. ఆ అమ్మాయి మనసులోని సంఘర్షణని రచయిత టి.వి.రామకృష్ణ చక్కగా చిత్రీకరించారు.
1940ల నాటి అమెరికా చారిత్రక నేపథ్యంలో యొషికో ఉచిద రాసిన ‘కలల ముంత’లో జపాన్‌ మూలాలు ఉన్న పదకొండేళ్ళ రింకో ఉత్తమ పురుషలో కథ చెపుతుంది. పొట్ట చేత పట్టుకుని జపాన్‌ నుంచి వలస వచ్చిన షింటారో కూతురు రింకో. ఆమెకి ఒక అన్న, ఒక తమ్ముడు ఉంటారు. వాళ్ళ జాతి మూలాలు, ఆర్థిక స్థితి కారణంగా వివక్షను ఎదుర్కొంటూ ఉంటారు. తమను చూడటానికి విధవరాలైన పిన్ని జపాన్‌ నుంచి వస్తోందని తెలిసి రింకో ఏ మాత్రం ఇష్టపడదు. కానీ, తాను ఉన్న కొన్ని వారాల్లోనే రింకో కుటుంబంలో ఎన్నో మార్పులకు వాకా పిన్ని కారణమవుతుంది. రెండు సంస్కృతుల మధ్య ఘర్షణ ఒకవైపు, ‘కలల దేశం’గా అందరూ కొనియాడే అమెరికాలో తమ కలలను నిజం చేసుకోటానికి వివక్షతను ఎదుర్కొంటూ పడే ఘర్షణ మరొకవైపు రింకోలో చక్కగా చిత్రీకరించింది రచయిత్రి.
‘నేను కాదు’, ‘అన్నీ తెలిసిన అక్క’, ‘నేను’, ‘ఠాప్‌’, ‘ధైర్యం అంటే’, ‘నేను బుడ్డిగానే ఉంటాను’ అన్న బొమ్మల కథల పుస్తకాలకు కథ, బొమ్మలను అక్కా చెల్లెళ్ళయిన సిరి మల్లిక, గాయత్రి వెన్నెలలు సమకూర్చారు. వీటన్నిటిలో ప్రధాన పాత్రలు అమ్మాయిలే. రాయటం, గీయటం మొదలు పెట్టిన 2019 సంవత్సరంలో వీళ్ల వయసులు 11, 13 సంవత్సరాలు.
ఇటీవల కాలంలో మంచి పుస్తకం ప్రచురించిన ‘ఆనంది ఆశ్చర్యం’, ‘ఆరుద్ర పురుగు అమ్మాయి’, ‘ఏడు రంగుల పువ్వు’ బొమ్మల కథ పుస్తకాలలో కూడా ప్రధాన పాత్రలు అమ్మాయిలే. ‘ఆరుద్ర పురుగు అమ్మాయి’లో అమ్మా నాన్నలు బయటకు వెళ్ళటంతో, తమ ఆటలో కలుపుకోటానికి అన్నయ్య మోహిత్‌ నిరాకరించటంతో రోజంతా తన కుక్కతో ఏవేవో పనులలో మునిగిపోతుంది తాన్సి. ఆ ఒక్క రోజులోనే ఎంతో పెద్దగా అయిపోయినట్టు ఆమెకు అనిపిస్తుంది.
బాగా చదవటం అలవాటు కావటానికి 16 పేజీల చొప్పున పది పుస్తకాల సెట్లను ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో మంచి పుస్తకం పలు పుస్తకాలను ప్రచురించింది. వీటిలో నాజీ జర్మనీకి బలైపోయిన ‘ఆన్‌ ఫ్రాంక్‌’, హిరోషిమా అణుబాంబు దాడి కారణంగా ఎన్నో సంవత్సరాలు క్యాన్సర్‌ బారిన పడిన సడాకో (‘సడాకో, కాగితపు పక్షులు’), మాట్లాడటం రాని చెల్లి (‘మా చెల్లి బంగారు తల్లి’), 20వ శతాబ్దపు తొలి దశకాలలో మారుమూల ప్రాంతాలకు గ్రంథాలయ పుస్తకాలను అందించటానికి గుర్రాలపై వెళ్ళిన మహిళలు (‘పుస్తకాల మహిళ’), అన్న చిన్ని పుస్తకాలు ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ‘నస్రీన్‌ రహస్య పాఠశాల’. తాలిబన్ల ఆఫ్ఘనిస్థాన్‌లో అమ్మా నాన్నలు ఏమైపోయారో తెలియని నస్రీన్‌ తనలో తాను ముడుచుకుపోతూ ఉంటుంది. ఆమెను బయటి ప్రపంచంలోకి తీసుకుని రావాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మిన నాయనమ్మ నస్రీన్‌ని ఒక రహస్య పాఠశాలలో చేరుస్తుంది. ఆమె నమ్మకం వమ్ము కాదు.
జెండర్‌ స్టీరియోటైప్‌ నుంచి బయటపడటం:
ఇక్కడ ఎవరూ అంతగా పట్టించుకోని ఒక విషయం గురించి చెప్పాలి. సమాజంలో మహిళల పని ‘కనపడనట్టే’ చాలా కథలలో స్త్రీల పాత్రలకి పేర్లు లేకుండా ఉండిపోతాయి. పైన పేర్కొన్న ‘కలల ముంత’ నవలలో కూడా ఇదే పరిస్థితి. రింకో వాళ్ళ అమ్మ ఏ పేరూ లేకుండా రింకో అమ్మగానే ఉండిపోతుంది. అమ్మ పాత పెట్టెలో ఆమె ఫోటోలు, చదువు తాలూకా సర్టిఫికెట్లు చూసి అమ్మకి కూడా ఒక కథ ఉందని రింకో గుర్తించిందని పేర్కొన్న రచయిత్రి ఇలా ఆ పాత్రకి పేరు లేకుండా చేయటం కొంచెం బాధగానే అనిపిస్తుంది.
బాల్యంలోనే ‘తీర్చి దిద్దితే’ పిల్లల్లో ఉన్నత ఆశయాలు రూపుదిద్దుకుంటాయని చాలామంది భావిస్తారు. అందుకు బాల సాహిత్యం ఒక ఉపకరణంగా ఉంటుందని వాళ్ళు చెపుతారు. అయితే పిల్లల పుస్తకాల పట్ల మంచి పుస్తకం దృక్పథం వేరేగా ఉంది. చదవటం రాని మూడేళ్ళ అమ్మాయి కూడా ఇంట్లో మగవాళ్ళు బట్టలు ఉతుకుతుంటేనో, అంట్లు తోముతుంటేనో, ‘‘నువ్వు చేస్తున్నావేంటి?’’ అని అడుగుతారు. ఒక్కొక్కసారి అవహేళన కూడా చేస్తారు. అంటే, మూడేళ్ళ వయసుకే ఆ అమ్మాయి జెండర్‌ స్టీరియోటైప్‌ని చుట్టుపక్కల వాళ్ళ నుండి వంటబట్టించేసుకుంది. ఈ స్టీరియోటైప్‌లో అమ్మ అంటే ఇంటి పని చేస్తుందని, నాన్న అంటే ఉద్యోగం చేస్తాడని ఈ రోజుల్లో కూడా బలంగా ఉంది. పిల్లల పుస్తకాలలో నాన్న పేపరు చూస్తూ ఉంటే, అమ్మ వంట చెయ్యటాన్ని చిత్రీకరించటం ‘సహజంగా’ జరిగిపోతూ ఉంటుంది.
వ్యక్తులలో మార్పుకి పుస్తకాలు దోహదం చేస్తాయని అనటంలో సందేహం లేదు. సమాజంలో వస్తున్న మార్పులను సాహిత్యం రీయిన్‌ఫోర్స్‌ చెయ్యగలదు. అందుకు, పిల్లల కోసం రాస్తున్న వాళ్ళు, బొమ్మలు వేస్తున్న వాళ్ళు మనసు పెట్టి ఆలోచించాల్సి ఉంటుంది.
సమాజం మారితే మనుషులు మారతారా, మనుషులు మారితే సమాజం మారుతుందా అన్న చర్చలోకి దిగకుండా సమాజం మౌలికంగా మారితేనే అధిక శాతంలో మార్పు వస్తుందనీ, అయితే మార్పు కోరుకునే వ్యక్తులు దాని కోసం ఎదురు చూడకుండా ఆ మార్పును తమ ఆచరణలో చూపాలనీ, సాహిత్యంలో ఈ అంశాలు చోటు చేసుకుంటే ఈ భావాలు బలోపేతం కావటానికి దోహదపడుతుందన్న అవగాహనతో మంచి పుస్తకం పని చేస్తోంది.
ఈ సందర్భంగా జెండరైజ్డ్‌ పనులకు భిన్నంగా మంచి పుస్తకంగా చేసిన చిన్న ప్రయత్నాలను పేర్కొనాలి. బాగా చిన్న పిల్లల కోసం ఒక మాంటిస్సోరి టీచర్‌ రాసిన ఒక పుస్తకంలో ‘ఇన్ని రొట్టెలు ఎవరికి?’ అన్న ప్రశ్నకు చివరిగా వచ్చిన, ‘నాన్నకి, నీకు’ అన్న సమాధానాన్ని ‘నాన్నకి, నీకు, నాకు’ అని మారిస్తే బాగుంటుందన్న సూచనను ‘భారతీయ మహిళ అలా ఆలోచించలేదు’ అన్న సమాధానంతో రచయిత్రి తిరస్కరించారట. పైన పేర్కొన్న ‘పుస్తకాలతో స్నేహం’ సిరీస్‌లోకి దీనిని తీసుకున్నప్పుడు మంచి పుస్తకం ఆ మార్పును చేసింది. అంతే కాదు, ఒక బొమ్మలో నాన్న పిండి కలుపుతున్న బొమ్మను వేశారు. ఇదే సిరీస్‌లో ‘నాన్నగారి పేపరు’ని ‘అందరూ చదివే పేపరు’గా మార్చారు.
ఈ రోజు చాలామంది పిల్లలు సింగిల్‌ పేరెంటుతో ఉండాల్సి వస్తోంది. ఇక్కడ సింగిల్‌ పేరెంట్‌ అంటే అనివార్యంగా అమ్మలే కావడం బాధాకరం. కారణాలేమైనా విడాకులు తీసుకుంటున్న వారు, మనస్పర్థలతో దూరంగా ఉంటున్న తల్లిదండ్రులు రోజురోజుకీ పెరుగుతున్నారు. ఇలాంటి కుటుంబాల్లో పిల్లల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల బాధ్యత కూడా తల్లుల మీదే పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, అమ్మలు ఒంటిచేత్తో కుటుంబాన్ని నెట్టుకురావడం, పిల్లల ఎదుగుదలకు టైం పెట్టి, వారితో సన్నిహితంగా మెలగడం అంత సులువైన విషయం కాదు. సాధారణ కుటుంబాల్లో కూడా, పిల్లల పెంపకం బాధ్యత తల్లులమీదే పడుతోంది. పిల్లల మాట వినకపోతే, తల్లుల పెంపకం సరిగ్గా లేదని నిందించడం పరిపాటిగా మారింది. ఇలాంటి ఆలోచనల ధోరణే, మన చుట్టూ కుటుంబాల్లో ఉంటుంది. అందుకు భిన్నంగా ఒక అమ్మ, ఒక కూతురు మధ్య ప్రేమ పూర్వక సంభాషణ సాగితే, మనసుకి ఎంత హాయిగా ఉంటుంది కదా! అలా హాయినిచ్చే కథ ‘కల జారిపోయింది’. తల్లీ కూతుళ్ళ అనుబంధం ఎంత లోతైనదంటే, దాని వేళ్ళు కలలోకి కూడా పాకిపోయాయి. మేలుకుని ఉంటే వాళ్ళు మెలకువగా కలుస్తారు. నిద్రపోతే కలలో కలుస్తారు. ఇవీ పుస్తకం చివర్లో మనని మరింత ఆకర్షించే వాక్యాలు. తల్లీ కూతుళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంటుందో చెప్పే కథలు.
అన్ని రకాల వివక్షతలను ప్రజలు, సమాజాలు సృష్టించాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అనేక పాఠ్య పుస్తకాల్లోనూ, బైట దొరికే సాహిత్యంలోనూ లింగ వివక్షత నిండి ఉంటుంది కదా! అలా హాయినిచ్చే కథ ‘కల జారిపోయింది’ ‘తల్లీ కూతుళ్ళ అనుబంధం ఎంత లోతైందంటే, దాని వేళ్ళు కలల్లోకి కూడా పాకిపోయాయి. మేలుకుని ఉంటే వాళ్ళు మెలకువలో కలుస్తారు. నిద్రపోతే కలలో కలుస్తారు. ఇవీ పుస్తకం చివర్లో మనని మరింత ఆకర్షించే వాక్యాలు. తల్లీ కూతుళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంటుందో చెప్పే కథలు.
అన్ని రకాల వివక్షతలను ప్రజలు, సమాజాలు సృష్టించాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అనేక పాఠ్యపుస్తకాల్లోనూ, బైట దొరికే సాహిత్యంలోనూ లింగ వివక్షత నిండి ఉంటుంది. స్కూల్‌ పాఠాల్లో కుటుంబమంటే, అమ్మ వంట చేస్తుంటే, నాన్న పేపర్‌ చదువుతుంటే, పిల్లాడు ఆడుకుంటుంటే, ఆడపిల్ల అమ్మకి సాయం చేస్తూ, నాన్న పేపర్‌ చదువుతుంటే, పిల్లాడు ఆడుకుంటుంటే, ఆడపిల్ల అమ్మకి సాయం చేస్తూ ఉండే చిత్రాలతో పిల్లల మెదళ్ళను నింపేస్తున్నారు. ఇలాంటి భావజాలంతో నిండిన కథనాలను, వివక్షత నేర్చే పాఠాలను లేకుండా చేయాలంటే, అన్ని వైపుల నుండి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరగాలి.
శరీరం, రుతుస్రావం, లైంగికతకి సంబంధించిన పుస్తకాలు:
చాలా తక్కువ మంది మాత్రమే పిల్లలతో తగినంత సమయం గడుపుతుంటారు. వాళ్ళతో స్నేహంగా ఉంటారు. వాళ్ళ శారీరక, మానసిక, ఉద్వేగపరమైన అవసరాలను తీరుస్తుంటారు. మరి పిల్లల ఆలోచనలు, అనుమానాలు, అపోహలు, ఆకాంక్షలు, అభిప్రాయాలు ఎక్కడ వ్యక్తం చేయాలి? ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా వారిలో జరిగే మార్పులను వాళ్ళకు ఎవరు అర్థం చేయించాలి? సున్నితమైన ఆ విషయాలను ఇంట్లో అమ్మానాన్నలు సరిగ్గా చెప్పక, స్కూళ్ళల్లో టీచర్లు కావాల్సినంత సమాచారం ఇవ్వక, ఆ చిన్నారులు ఏమయిపోవాలి? ఎక్కువ వాళ్ళ అనుమానాలకు, ఆలోచనలకు తెరపడాలి? ఈ ఆలోచనలతోనే ఎదిగే క్రమంలో బాలల శరీరంలో జరిగే మార్పులను, మనసులో కలిగే భావాలను అర్థం చేయించేందుకు, ప్రత్యేక పుస్తకాలను ‘మంచి పుస్తకం’ ప్రచురించింది. కౌమార వయసు పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోదగిన కొన్ని పుస్తకాలను ప్రచురించింది. పిల్లలకు శరీర ధర్మాన్ని, ప్రకృతి నియమాలను అర్థం చేయించేటప్పుడు, అక్షరాలకన్నా బొమ్మలతో వారికి అర్థం చేయించేందుకు ‘మంచి పుస్తకం’ నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ పుస్తకాల జాబితాలో మొదటగా పేర్కొనవలసినది ‘మీ శరీరం’. సాధారణంగా శరీరానికి సంబంధించిన పుస్తకాలలో పునరుత్పత్తికి సంబంధించి వివరాలు సరిగ్గా ఉండవు. ఇందులో కౌమార వయస్సులో అబ్బాయిలు, అమ్మాయిలలో వచ్చే మార్పులు, గర్భధారణ, ప్రసవం, పిల్లల పోషణ వంటి అంశాలు ఉన్నాయి. ఇక ఆడపిల్లల కోసం రుతుస్రావం గురించి తెలియచేసే పుస్తకం ‘నాకు నేను తెలిసే’. హిందీలోని రుతుస్రావానికి సంబంధించి అన్ని అంశాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఏ మాత్రం ఇబ్బందికరంగా అనిపించని విధంగా బొమ్మలు వేసిన కారెన్‌ హెడ్జాక్‌, పొందుపరిచిన ప్రచురణకర్తలు అభినందనీయులు. ఇదే వరసలో కమలా భసిన్‌ రాసిన పుస్తకాల గురించి ప్రస్తావించాలి. పిల్లల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం కమలా భసిన్‌ చేసిన కృషి మనందరికీ తెలుసు. అలాంటి కమలా భసిన్‌ కౌమార వయసు పిల్లల కోసం రాసిన నాలుగు పుస్తకాలలో రెండిరటిని ‘కౌమార వయసు బాలలతో ముచ్చట్లు, జీవన నైపుణ్యాలు: జీవన కళ’, ‘కౌమార వయస్కులని, లైంగికతని అర్థం చేసుకోవచ్చు’ అన్న పేరులతో ‘మంచి పుస్తకం’ ప్రచురించింది. పిల్లలకి కొన్ని విషయాలు తెలియజేయకపోతే, వారి భావి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ జీవన నైపుణ్యాలు ఎదిగే క్రమంలో పిల్లలకి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మన జీవితంలో నైపుణ్యాల పాత్ర భోజనంలో ఉప్పు వంటిది అంటారు కమలా భసిన్‌. అందుకే పిల్లలకి జీవన నైపుణ్యాలు, అన్నమంత అవసరం అంటారు. ఈ మాటని ‘మంచి పుస్తకం’ కూడా విశ్వసించడం వల్లే, పిల్లల కోసం ఇలాంటి సాహిత్యాన్ని ప్రచురిస్తోంది. కమలా భసిన్‌ స్వీయ అనుభవాలతో రాసిన ‘మౌనాన్ని ఎవరైనా ఛేదించి ఉంటే’ అన్న పుస్తకాన్ని కూడా మంచి పుస్తకం తెలుగులో ప్రచురించింది. చిన్న పిల్లలపై జరిగే లైంగిక దూషణ (షష్ట్రఱశ్రీస ంవఞబaశ్రీ aపబంవ)కి సంబంధించిన పుస్తకం ఇది. పిల్లలు తమపై జరిగే హింస, లైంగిక దాడుల గురించి మౌనంగా ఉండొద్దు, మాట్లాడాలి అన్నది పిల్లలని ప్రేమించే పెద్దవాళ్ళు చెప్పాల్సిన మాట. వారి మాటలను వినేందుకు, పెద్దలు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి, నమ్మాలి. మా మాటలు ఒకరైనా ప్రేమతో, నమ్మకంతో వింటారనే భరోసా పిల్లలకి ఇవ్వాలి.
అలాగే గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి తేలికగా అర్థమయ్యే రీతిలో ‘‘జర భద్రం’’ అన్న పుస్తకాన్ని ‘మంచి పుస్తకం’ ప్రచురించింది. ఈ పుస్తకంలో పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం సూచనలు ఉన్నాయి. తమ శరీరం కారణంగా పిల్లలెవరూ అవమానానికి గురి కాకూడదు. పెద్దవాళ్ళు అనుచితంగా ప్రవర్తిస్తే అందుకు దోషులు పిల్లలు కారు. పిల్లల్ని పెద్దవాళ్ళు నిత్యం గమనిస్తూ ఉండాలి. రోజువారీ ప్రవర్తనలో… అంటే వాళ్ళు సరిగ్గా అన్నం తినకపోయినా, చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నా, దిగులుగా ఉన్నా, భయపడుతూ ఉన్నా, ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నా విషయం ఏమిటో పెద్దవాళ్ళు కనుక్కోవాలి. వెంటనే చెప్పకపోతే ఓపికగా, ప్రశాంతంగా, ఒంటరిగా మళ్ళీ మళ్ళీ అడగాలి. ఈ అంశంపై అవగాహన కల్పించడానికి కాకినాడలోని పడాల ఛారిటబుల్‌ ట్రస్ట్‌, హైదరాబాద్‌లోని గ్రామ్య రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌ ఈ పుస్తకాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నాయి.
ఇక ‘రెక్కల గుఠలీ’ ఒక విస్తృతమైన కథ. ఇది ‘జెండర్‌’ గుర్తింపునకు సంబంధించిన అంశం. అబ్బాయిగా పుట్టిన గుఠలీకి తన అక్క బట్టలు వేసుకోవటం ఇష్టం. ‘నువ్వు అబ్బాయివి, అబ్బాయి బట్టలే వేసుకోవాలి’ అని మొదట ఒత్తిడి చేసిన తల్లిదండ్రులు తర్వాత అర్థం చేసుకుని ఆడపిల్లల బట్టలను బహుకరిస్తారు. దాంతో గుఠలీ ఎంతో సంతోషపడుతుంది. ‘ఆమె మెల్లగా ప్రపంచాన్ని మార్చివేస్తుంది. ఇప్పటికి ఇది చాలు’ అన్న వాక్యాలతో కథ ముగుస్తుంది. పిల్లల కోసం ప్రపంచాన్ని మార్చాలి కానీ, ప్రపంచం కోసం పిల్లలు మారాల్సి రాకూడదు. పిల్లలకు లింగ వివక్ష గురించి, స్త్రీ పురుషుల మధ్య ఉండే అసమానతల గురించి అవగాహన కల్పించడం అవసరమని ఇలాంటి సాహిత్యాన్ని ప్రచురించే ప్రయత్నాలను మంచి పుస్తకం చేస్తోంది. పిల్లల మనసుల్లో గూడుకట్టుకున్న ప్రశ్నలకు సమాధానాలు దొరక్కపోతే అలాంటి వాతావరణం పెద్దవాళ్ళు కల్పించకపోతే, జరిగే పరిణామాలకు బాధ్యత పెద్దవాళ్ళే వహించాల్సి ఉంటుంది. అంతకంటే ముందు యువత స్వేచ్ఛగా ఎదిగే వాతావరణాన్ని, శాస్త్రీయ విద్యను, సాహిత్యాన్ని అందించకపోతే, సమాజం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమ, చదివే సామర్ధ్యంపై దృష్టి పెడుతూనే కథలు ఆసక్తికరంగా ఉంటూ అందులో అంతర్భాగంగా కొన్ని అంశాలు కూడా ఉండేలా ప్రయత్నం చేస్తోన్న ‘మంచి పుస్తకం’ అభినందనీయం.
మంచి పుస్తకం ప్రయాణం ఒక విధంగా చెప్పాలంటే సుదీర్ఘమయినది. అడుగులో అడుగేసుకుంటూ, హడావిడి, ఆర్భాటాలు లేకుండా స్థిరంగా, లక్ష్యం దిశగా సాగుతూ వచ్చింది. ఈ రోజు మంచి పుస్తకం ఒక ట్రస్ట్‌గా, పుస్తకాలను అనువదిస్తూ, ప్రచురిస్తూ ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలున్నాయి… చదవడమే తగ్గింది. అందులోనూ తెలుగు పుస్తకాలు మరీనూ… పిల్లల పుస్తకాలు… తెలుగులో అయితే ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు అంటున్న సమయంలో కూడా గుండె మీద చెయ్యి వేసుకుని మా పుస్తకాల ద్వారా పిల్లలు తెలుగు నేర్చుకోవటం, వాళ్ళలో పుస్తకాల పట్ల ప్రేమ కలగటం మాకు సంతృప్తిని ఇచ్చే విషయంÑ ఇది ఎంత తక్కువ సంఖ్య అయినప్పటికీ మేం సగర్వంగా, సంతోషంగా ఉన్నాంÑ ఈ తోవలోనే ముందుకు వెళ్తాం అంటున్న మంచి పుస్తకం సంస్థకు శుభాకాంక్షలు.
(‘మంచి పుస్తకం’ ప్రచురించిన పుస్తకాలు, పి.భాగ్యలక్ష్మి, కె.సురేష్‌లతో ఇంటర్వ్యూల ఆధారంగా)

Share
This entry was posted in పుస్తకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.