నిర్ణయం – డా॥ ఎ.ఆర్‌.సత్యవతి

‘ట్రింగ్‌… ట్రింగ్‌…’ కాలింగ్‌ బెల్‌ మోగడంతో ఉలిక్కిపడి లేచింది నీరజ. అప్పుడే పాలవాడు వచ్చేసాడు అనుకుంటూ డోర్‌ ఓపెన్‌ చేసి పాలు తీసుకుంది. స్టవ్‌ మీద పెట్టి ‘అమ్మో! ఆరయిపోయింది. ఈ రోజూ ఆఫీసుకి లేటే…’ అనుకుంటూ కిచెన్‌ సర్కస్‌ మొదలుపెట్టింది.

‘ట్రింగ్‌… ట్రింగ్‌…’ కాలింగ్‌ బెల్‌ మళ్ళీ మోగడంతో ‘అబ్బా! ఎవరు ఇంత పొద్దున్నే, పని తెమలనీయరు….’ అనుకుంటూ డోర్‌ తీసింది. ‘సమ్మక్కా నువ్వా! ఏంటి అప్పుడే వచ్చావ్‌. నాలుగు రోజులు రెస్ట్‌ తీసుకోమన్నాను కదా’ అంటూ పక్కకు జరిగి లోపలికి దారిచ్చింది. ‘ఫర్వాలేదమ్మా అదే తగ్గిపోతుంది. అయినా పొద్దున్నే మీరు హడావుడిగా అన్నీ చేసుకోలేరు. అందరినీ పంపించి మీరు టిఫిన్‌ కూడా తినకుండా వెళ్ళిపోతారు. నేను రెండు రోజులు ఇంట్లో ఉన్నానే కానీ మీరే గుర్తొచ్చి వచ్చేశానమ్మా’ సరాసరి వంట గదిలోకి వెళ్ళి సింక్‌లోని అంట్లు తోముతూ బదులిచ్చింది సమ్మక్క.
నీరజ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆమె భర్త సునీల్‌ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఆఫీసర్‌. వారికి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు శశాంక్‌ ఎనిమిది, చిన్నవాడు కౌశిక్‌ ఆరు తరగతులు చదువుతున్నారు. జీతం కంటే బయటి సంపాదనే ఎక్కువ ఉండే సునీల్‌ గత సంవత్సరమే సిటీకి దూరంగా గేటెడ్‌ కమ్యూనిటీలో మూడు కోట్ల రూపాయలతో విల్లా కొన్నాడు. అతని అదనపు ఆదాయం గురించి తెలిసిన నీరజ, సామరస్యంగానే కాక గట్టిగానే వారించింది. ఇద్దరమూ ఉద్యోగులమే కనుక మన ఆదాయం మనకు సరిపోతుందని, అత్యాశకు పోవద్దని చెప్పింది. అయినా ‘నీ పాత చింతకాయ మాటలు ఆపు. ఈ రోజుల్లో డబ్బుతోనే మనిషికి విలువ. రేపు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా. నీకు చేతనైతే ఉద్యోగం చెయ్యి లేదా నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. అంతేకానీ నాకు నీతులు చెప్పకు. నా సంగతి నేను చూసుకుంటా’ అని ఆమె నోరు మూయించాడు. ఏ సీట్‌ అయితే సంపాదన బాగుంటుందో దాని కోసం పైరవీ చేసుకుని మరీ దానిలోకి మారతాడు. సిటీలో ఉన్న సొంత ఫ్లాట్‌లోనే ఉందామని ఎంతగానో బ్రతిమాలుకుంది నీరజ. అతను కొన్న కాస్ట్లీ ఫర్నిచర్‌ ఆ ఫ్లాట్‌లో సరిపోవటం లేదంటూ బలవంతంగా ఇక్కడికి షిఫ్ట్‌ చేశాడు.
సునీల్‌ తొమ్మిదికి ముందు లేవడు. ఆఫీసుకి లేటుగా వెళ్ళి ఇంటికి లేటుగా వస్తాడు. ఆఫీసు పని వేళలు దాటిన తర్వాతే ఎక్కువ సంపాదన ఉంటుందనే లాజిక్‌ నెమ్మదిగా అర్థమయింది నీరజకు. ఇల్లు పెద్దగా, విశాలంగా ఉండటంతో చాకిరీ పెరిగింది నీరజకు. సిటీకి దూరంగా ఉండటంతో పని మనుషుల సమస్య. సిటీ నుంచి రావడానికి కొందరు ఒప్పుకున్నా ఎనిమిది గంటలకైతే వస్తామని కండిషన్‌ పెడుతున్నారు. అప్పటికి పనులన్నీ పూర్తి చేసుకుని తాను బయలుదేరాలి. ఇంట్లోనే ఉండేలా ఒక మనిషిని మాట్లాడిరది చివరికి. భర్త పోయిన ఇరవై ఎనిమిది సంవత్సరాల సరోజని కుదుర్చుకున్నప్పుడు సునీల్‌ మాట్లాడిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేదు తను.
‘ఏమిటీ పదివేలా? నెలకా? ఏడాదికా? డబ్బులు రోడ్డు మీద దొరుకుతున్నాయనుకుంటున్నావా? నాలుగైదు వేలైతే సరే’
‘అదేంటండీ. ఇక్కడే ఉండి పని చేసేవాళ్ళు అంత తక్కువకు ఎలా చేస్తారు. ఇంటి పనంతా చేయాలి కదా’
‘రోజూ వచ్చి ఒక గంట పనిచేసి వెళ్ళేవాళ్ళని వెదుక్కో. ఇల్లు ఇలాంటి వాళ్ళకి అప్పగించావంటే సాయంత్రం వచ్చేసరికి మొత్తం ఖాళీ చేసి ఉడాయిస్తారు’.
‘లలితా వాళ్ళింట్లో ఐదేళ్ళనుంచీ చేస్తోందంట. వాళ్ళకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యి బెంగుళూరు వెళ్ళిపోవడం వల్ల మనిల్లు ఒప్పుకుంది. లలితే చెప్పింది. చాలా నమ్మకమైన అమ్మాయట. ఒప్పుకోండి ప్లీజ్‌’.
‘అయితే సరే. కానీ ఆరువేలకి ఒప్పించు. పదివేలంటే నా పది రోజుల జీతం…’ పది రోజులు అనే మాటను ఒత్తి పలుకుతూ అన్నాడు.
‘ఆరువేలకి ఇంత దూరం వచ్చి రోజంతా ఎలా ఉంటానమ్మా. సిటీలో నాలుగిళ్ళు చూసుకున్నా. నాకు ఎనిమిది వేలొస్తాయి. మధ్యాహ్నానికల్లా ఇంటికి వెళ్ళొచ్చు. లలితమ్మ చెప్పిందని వచ్చాను కానీ…’
ఏమనాలో అర్థం కాలేదు నీరజకి. సరోజ చెప్పిన దాంట్లో తప్పు కూడా కనిపించలేదు.
వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌ వచ్చిన నీరజ తల్లి, కూతురి పరిస్థితి అర్ధం చేసుకుంది. నీరజ పుట్టినప్పుడు తమ ఇంట్లో పనిచేసిన సమ్మక్క గుర్తొచ్చింది ఆమెకి. సమ్మక్క కష్టం తెలిసిన మనిషి. పెళ్ళైన మూడు సంవత్సరాలకే భర్త కాలం చేస్తే, ఇళ్ళల్లో పనిచేసుకుంటూ కొడుకులిద్దరినీ బాగా చదివించింది. పెద్ద కొడుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయ్యాడు. చిన్న కొడుకు కూడా ఉద్యోగరీత్యా పూణెలో ఉంటున్నాడు. సమ్మక్క పెద్దకొడుకు దగ్గర హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఆ మధ్య తమ ఊరికి వచ్చినప్పుడు చెప్పింది. ‘ఆ సిటీలో తనకేమీ తోచటం లేదని, ఖాళీగా ఉండటం ఇబ్బందిగా ఉంటోంద’ని చెప్పింది. ఫోన్‌ నెంబర్‌ కూడా ఇచ్చింది.
ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక సమ్మక్కకి ఫోన్‌ చేసి, నీరజ సమస్య చెప్పింది. కూతురు ఇబ్బంది పడుతోందని, ఎవరైనా నమ్మకమైన వాళ్ళని చూడమని అడిగింది. సాయంత్రం ఫోన్‌ చేస్తానని చెప్పిన సమ్మక్క మర్నాడు ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. ‘ఎవరో ఎందుకమ్మా నేనే చేస్తాను. మీరు ఇవ్వాలనుకున్నంత ఇవ్వండి’ అంది. ‘వద్దు సమ్మక్కా! ఆ రోజుల్లో అంటే పిల్లల బాధ్యతతో నీకు పని చేసుకోక తప్పలేదు. వాళ్ళని ప్రయోజకులను చేశావు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకో. పైగా నీ కొడుకు కూడా ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు. నువ్విలా పనులు చేసుకుంటున్నావంటే బాధ పడతాడు’. ‘లేదమ్మా, నిన్న మీకు వెంటనే సమాధానం ఇవ్వనిది ఎందుకంటే మా పిల్లలతో మాట్లాడడానికి. కోడళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు ఒప్పుకున్నాకే నేను ఇక్కడికి వచ్చాను. మా అబ్బాయే నన్ను ఇక్కడ దించి వెళ్ళాడు. ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు. పైగా మీ కుటుంబం అంటే నా పిల్లలిద్దరికీ ఎంతో గౌరవం. నేను వాళ్ళ ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడినప్పుడల్లా మీరూ, అయ్యగారూ చేసిన సహాయం వాళ్ళకి తెలుసు. వాళ్ళ పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం మీరే బట్టలు కొనేవారు. నీరజమ్మ విషయం చెప్పగానే వాళ్ళేమన్నారో తెలుసా. మాకే అక్క ఉంటే నువ్వు ఈ సమయంలో సహాయం చేయడానికి వెళ్ళవా? అలాగే అనుకో అని. నిజమేనమ్మా నీరజమ్మ నా కూతురులాంటిది కాదూ… ఇది పరాయి ఇల్లు ఎలా అవుతుంది?’’
తల్లీ కూతుళ్ళు సమ్మక్కని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు. ఎంత కృతజ్ఞత. ఆమె పిల్లలు కూడా ఎంత బాగా ఆలోచించారు. మొత్తానికి సమ్మక్క పనికి రావడం ప్రారంభించింది.
సునీల్‌ ఇస్తానన్న ఆరువేలు నెలాఖరులో నీరజ సమ్మక్కకి ఇవ్వబోతే ‘ఆరువేలు ఎందుకమ్మా? నాలుగు వేలు ఇవ్వండి చాలు. ఊరు మారినంత మాత్రాన ఆశకి పోకూడదు కదా’ అందామె.
ఉదయం ఆరు గంటలకి వచ్చి సుమారుగా ఇంటి పనంతా చేస్తుంది. నీరజ వంట చేసే సమయంలో పిల్లలకి యూనిఫాం సిద్ధం చేయడంతో పాటు వాళ్ళు ముందురోజు స్కూల్‌ నుంచి రాగానే తలోవైపు విసిరేసిన సాక్స్‌ తీసి, షూ పాలిష్‌ చేసి పెడుతుంది. సునీల్‌ లేచేసరికి డైనింగ్‌ టేబుల్‌ మీద టిఫిన్‌ అంతా నీట్‌గా సర్ది ఉంచుతుంది. అందరికీ లంచ్‌ బాక్స్‌లు సర్ది పెడుతుంది. తను చెప్పినట్లు పనిమనిషి కంటే ఇంటి మనిషిలాగే అన్ని పనుల్లో సహాయంగా ఉన్న సమ్మక్కని చూసి ఆశ్చర్యపోతుంది నీరజ. ఈ వయసులో కూడా పనులన్నీ చకచకా చక్కబెడుతుంది. ముఖంలో ఎక్కడా అలసట కానీ, చికాకు కానీ మచ్చుకైనా కనిపించదు. ‘అలా ఎలా ఉండగలవు సమ్మక్కా…’ అని అడిగితే ‘జొన్నన్నం తిన్న మనిషినమ్మా. కండకంటే బలమే ఎక్కువ. ఇక కోపం అంటారా? అది మనిషికి పెద్ద శత్రువమ్మా. దానివల్ల ఎదుటి వాళ్ళమీద పైచేయి సాధించటం అటుంచి అందరినుంచి మనల్ని దూరం చేస్తది, మన ఆరోగ్యాన్నీ చెడగొడతాది’.
వేమనలాంటి శతకకర్తలు చెప్పిన మాటలని ఒక చదువురాని మనిషి తన అనుభవంతో ఎంత బాగా చెప్పింది.
సునీల్‌ గుర్తొచ్చాడు నీరజకి. అతనికంటే ఆఫీసులో తనకే బాధ్యతలు ఎక్కువ. పైగా ఇల్లు, పిల్లల పనులు మొత్తం తానే చూసుకోవాలి. తను ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి వచ్చినా, మళ్ళీ తనే కాఫీ కలుపుకుని రిలాక్స్‌ అవ్వాలి. ఎప్పుడైనా సునీల్‌ ఇంట్లో ఉన్న రోజు కూడా చిన్న సహాయం చేయడు. పైగా ఆఫీస్‌ నుంచి రాగానే అక్కడ చికాకులన్నీ తనమీదే చూపిస్తాడు. పలకరించినా చిరాకు పడతాడు. ఏదైనా అడిగితే ‘నీకవసరమా. ఏదో అదృష్టంకొద్దీ ఉద్యోగం వచ్చింది కానీ లేకపోతే దేనికీ పనికిరావు’ అంటాడు. తాను మగవాడిననే అహం ప్రతి మాటలో చూపిస్తాడు. అన్నీ చెప్పి డబ్బుల దగ్గర మాత్రం ఆడా, మగా తేడా ఉండవేమో. తన జీతం పడే అకౌంట్‌ ఏటీయం కార్డు అతని దగ్గరే
ఉంటుంది. ఖర్చులకి లెక్కకట్టి ఇస్తాడు. అదనపు అవసరాలున్నా, వాటితో సర్దుకోవాల్సిందే. ఎప్పుడైనా ఈ విషయాలు ప్రస్తావించినా ‘ఒకరి చేతితో ఖర్చు పెడితే సరైన ప్లానింగ్‌ ఉంటుంది. అందుకే కదా తక్కువ కాలంలోనే ఇంత మంచి ఇల్లు కొన్నాము. అయినా ఇల్లు, ఆఫీస్‌ తప్ప ఇంకేమీ తెలియని నీకేమి ఖర్చులుంటాయి’ అంటాడు.
ఇవన్నీ తల్లిదండ్రులకు చెప్పుకోలేక, పిల్లల ముందు బయటపడలేక యాతన పడుతున్న నీరజకు, సమ్మక్క ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా ఉంది. మాటల్లో తన కొడుకు, కోడళ్ళ గురించి ఆమె చెప్పే విషయాలు సమ్మక్క మీద గౌరవాన్ని మరింత పెంచాయి. ఎందుకంటే ఒకరోజు ఆమె ‘కష్టాన్ని గురించి మనం ఆలోచించేకొద్దీ, అది పెద్దగా కనిపిస్తదమ్మా. మనం చేయగలిగినదంతా చేయాలి. మన చేతుల్లో లేనప్పుడు, దాని గురించి మర్చిపోవాలి’ అని చాలా సింపుల్‌గా చెప్పేసింది. తన కాపురంలోని సమస్యలు ఎప్పుడూ ఆమెతో చెప్పుకోలేదు కానీ, సమ్మక్క వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచించటం తగ్గించింది నీరజ. ఆ విధంగా ప్రశాంతంగా ఉంది ఆమె జీవితం ఇప్పుడు.
అంతేకాదు, ఏ రోజూ పనికి రావటం మానదు సమ్మక్క. ఎప్పుడైనా తన ఆఫీసుకి వరస సెలవులు వచ్చినప్పుడు ‘నేను చేసుకోగలనులే సమ్మక్కా. రేపు రావద్దులే’ అన్నా కూడా ‘ఇంట్లో కూర్చుని చేసేదేముందమ్మా. కోడలు అన్ని పనులు చేసుకుంటాది. నాకేమీ తోచదాయె…’ అని వస్తూనే ఉంటుంది.
అప్పుడప్పుడూ సమ్మక్క గురించి సునీల్‌ దగ్గర గొప్పగా చెబితే ‘ఆ… అంతగా నమ్మేయొద్దు. తక్కువ జీతానికి ఒప్పుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడివన్నీ ఆషాఢభూతి వేషాలు. నిన్ను బాగా నమ్మించాక ఏదో పెద్దదానికి ఎసరు పెడుతుంది. ఇలాంటి వాళ్ళను చాలామందిని చూశాను. నువ్వేమీ మురిసిపోకు…’ అని తీసిపారేశాడు. అప్పటికి ఏమీ అనలేక ఊరుకుంది నీరజ. ఎప్పుడైనా ఏదైనా వస్తువు కనపడక వెతుకుతూంటే ‘ఇంకెక్కడ ఉంటుంది. ఎప్పుడో సమ్మక్క ఇంటికి చేరేసి ఉంటుంది. ఇలాంటివాళ్ళకి ఎక్కువ చనువివ్వద్దంటే వినవు’ అంటాడు. ఆ వస్తువు ఇంట్లోనే ఎక్కడో దొరుకుతుంది తర్వాత. అప్పుడేమీ మాట్లాడడు.
ఆ రోజు ఆదివారం. డైనింగ్‌ హాల్‌ సింక్‌ దగ్గర నేలపై ఉన్న తడి కనిపించక జారిపడిరది సమ్మక్క. కాలు బెణికింది. లేపి కుర్చీలో కూర్చోబెట్టి ఆయింట్‌మెంట్‌ ఇచ్చింది నీరజ. రాసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక, ఆమెకి టిఫిన్‌ పెట్టి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్ళి ఒకసారి టెస్ట్‌ చేయించింది. ఎక్కడా విరగలేదు కానీ ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు డాక్టర్‌. ఆమెని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపి, జాగ్రత్తలు చెప్పి వచ్చింది నీరజ. పది రోజుల వరకు రావద్దని, తాను చేసుకోగలనని చెప్పింది. సమ్మక్క వింటేనా. రెండు రోజులకే పరిగెత్తుకుని వచ్చింది.
… … …
ఆ రోజు వచ్చిన దగ్గర నుండి పనిచేస్తూనే ఉంది సమ్మక్క. తాను ఆఫీసుకి వెళ్తూ సమ్మక్కని వాళ్ళింట్లో దించి వెళ్ళింది నీరజ. ఆ రోజు తన కొలీగ్‌ శ్రీదేవికి సమ్మక్క గురించి చెబుతూనే ఉంది. ‘నాకు కూడా పంపించవే సమ్మక్కని. కావలసినంత జీతం ఇస్తాను. ఈ పనివాళ్ళతో వేగలేకపోతున్నాను. నాకెప్పుడు బాగా అవసరమో అప్పుడే మానేస్తారు’ అంది శ్రీదేవి.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సునీల్‌ ముందే వచ్చి ఉన్నాడు. ‘ఏంటి ఇంత తొందరగా. ఒంట్లో బాలేదా’ ప్రేమగా పలకరించింది నీరజ. ‘ఏ, ఆరోగ్యం బావుంటే ముందుగా ఇంటికి రాకూడదా’ కోపంగా అన్నాడు.
‘అదికాదు. ఇంత తొందరగా ఎప్పుడూ రారు కదా అని’ చిన్నగా అంటూ ‘ఉండండి కాఫీ తీసుకొస్తా’ అని కిచెన్‌లోకి వెళ్ళబోయింది.
‘అవసరంలేదు ముందిక్కడ కూర్చో’ గద్దించాడు.
ఏమైందో అనుకుంటూ మెల్లిగా, కొంత భయంగా సోఫాలో కూర్చుంది.
‘ఈ ఫోన్‌ చూడు…’ ఇస్తూ అన్నాడు.
చాలా కాస్ట్‌లీ ఫోన్‌. ‘బావుంది’ ముక్తసరిగా అంది.
‘ఇది బావుందా లేదా అని నిన్నడగలేదు. దీని కాస్ట్‌ ఎంతో తెలుసా. యాభై వేలు. ఒక క్లయింట్‌ ఒక ముఖ్యమైన ఫైల్‌ మూవ్‌ చేసినందుకు ఇలాంటివి రెండు ఫోన్లు నాకు గిఫ్టుగా ఇచ్చాడు. వచ్చేవారం నీ పుట్టినరోజు నాడు నీకు ఇద్దామని ఒకటి దాచిపెట్టి రెండోది నా కోసం బయటికి తీసి లాప్‌టాప్‌ దగ్గర పెట్టాను. నేను లేచేసరికి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు తీశావా?’
‘లేదండి. నేను ఇప్పుడు మీ చేతిలో చూడడమే. నాకు తెలియదు. పిల్లలేమైనా చూశారేమో అడుగుదాం.’
‘అడగాల్సింది వాళ్ళని కాదు. నువ్వు నెత్తికెక్కించుకున్న ఆ పనిమనిషిని. నా లాప్‌టాప్‌ పక్కనే మార్నింగ్‌ తను పిల్లలకి స్నాక్స్‌ బాక్సులు సర్దుతుంటే నేను చూశాను. జాగ్రత్తగా ఉండమని చెబితే విన్నావా…’ దొరికిన అవకాశం వదులుకోకుండా అరుస్తూనే ఉన్నాడు.
‘ఎందుకండీ సమ్మక్కని అంటారు. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. మళ్ళీ వెదుకుదాం.’
‘నేను ఉదయం నుంచీ ఆఫీసుకి వెళ్ళకుండా వెదుకుతూనే ఉన్నా. నాకు నచ్చచెప్పడం మాని సమ్మక్కకి ఫోన్‌ చేసి అడుగు. ఈ రోజు నేను వదిలిపెట్టను. నువ్వు అడగకపోతే నేను పోలీస్‌ కంప్లెయింట్‌ ఇస్తా.’
‘ఎలా అడుగుతానండి. తను అలాంటిది కాదు.’
‘నోర్ముయ్‌…’ అతను గట్టిగా అరిచిన అరుపుకి అప్పుడే స్కూల్‌ నుంచి వచ్చిన పిల్లలిద్దరూ భయపడి డోర్‌ దగ్గరే ఆగిపోయారు.
బయటికి రాబోతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళ లంచ్‌ బాక్స్‌ అందుకుంటుంటే, చిన్న కొడుకు అడిగాడు ‘ఏంటమ్మా నాన్న చాలా కోపంగా ఉన్నారు’ అని.
‘నాన్న లాప్‌టాప్‌ దగ్గర కొత్త సెల్‌ఫోన్‌ పెట్టారట. అది కనిపించడం లేదని కొంచెం కోప్పడ్డారంతే. మీరు స్నానం చేసి రండి. స్నాక్స్‌ తిందురు గాని…’ భర్త కోపాన్ని పిల్లలకు తెలియకుండా జాగ్రత్తపడుతూ చెప్పింది.
‘ఓప్‌ా! అదా అమ్మా. ఉండు నేను నాన్నకి చెబుతా’ షూ విప్పి లోపలికి పరిగెత్తాడు.
సునీల్‌ దగ్గరికి వెళ్ళి స్కూల్‌ బ్యాగ్‌లోంచి ఒక బాక్స్‌ తీస్తూ… ‘ఇదేనా నాన్నా మీరు వెదుకుతున్న ఫోన్‌’ అన్నాడు.
సునీల్‌ కళ్ళు మెరిశాయి. ‘నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా’ దెబ్బతిన్న అహంతో నీరజ ముందు నిలబడలేక దాన్ని కప్పిపుచ్చుకుంటూ అరిచాడు.
‘ఉదయం లాప్‌టాప్‌ దగ్గర ఉన్నప్పుడు అన్నయ్య, నేను చూశాం నాన్నా. అదేంటో మాకు తెలియదు. కానీ స్నాక్స్‌ బాక్స్‌లు పెడుతోంటే చెయ్యి తగిలి ఇది బాస్కెట్‌లో పడిపోయింది. మీరు మా కోసం ఏదో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ తెచ్చారేమో, స్కూల్‌లో ఓపెన్‌ చేద్దామని తీసుకువెళ్ళాం. కానీ మర్చిపోయాం. సారీ డాడీ…’ ఇద్దరు పిల్లలూ ఒకేసారి అన్నారు.
ఏమనాలో తెలీక ఫోన్‌ అందుకుని విసవిసా నడుచుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు.
పిల్లలకు ఫలహారాలు పెట్టి కొద్దిసేపు టీవీ చూడండని చెప్పి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళింది నీరజ.
‘ఇప్పటికైనా తెలిసిందా ఆలోచించకుండా ఎదుటివాళ్ళపై నిందలు వేయకూడదని. తెలిసినా ఒప్పుకుంటారా మీరు. మగవాడినని, ఉన్నత కుటుంబం నుంచి వచ్చానని అహం. ఎదుటివాళ్ళని నీచంగా చూడటమేనా మీ కుటుంబం మీకు నేర్పింది. పేదవాళ్ళకి విలువలుండవని నమ్మడమేనా మీ చదువు మీకు నేర్పిన సంస్కారం. మరి ఆ విలువలు మీకెన్ని ఉన్నాయి. మీ సంపాదనలో మీ కష్టార్జితమెంతో ఎప్పుడైనా లెక్కలేసుకున్నారా. క్లయింట్‌ గిఫ్టుగా ఇచ్చాడని ఎంత సిగ్గు లేకుండా చెప్పారు. అది గిఫ్ట్‌ కాదండీ, లంచానికి పెట్టుకున్న అందమైన పేరు. మీరు అక్రమ సంపాదనని ఆశిస్తారు కాబట్టి అందరినీ అదే దృష్టితో చూస్తారు. అవును, సమ్మక్కని నెత్తిమీద పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా, వేలకి వేలు జీతాలు వస్తున్నా పై సంపాదనకి కక్కుర్తిపడే మనలాంటి వాళ్ళకంటే ఆమె ఎంతో ఎత్తులో ఉంది కాబట్టి. మనలా చదువులు లేకపోయినా, డబ్బులో పెరగకపోయినా, పెద్ద కుటుంబంలో పుట్టకపోయినా ఆమె ఆలోచనా విధానం ఎంత ఉన్నతంగా
ఉంటుందో తెలుసా. అసలు సమ్మక్క ఎవరో తెలుసా. ఆమె కొడుకు ఎవరో తెలుసా. మీ డిపార్ట్‌మెంట్‌లోనే నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్న నాగరాజు. ఇప్పుడు మీకు బాస్‌ కూడా…’
సునీల్‌ అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూశాడు నీరజ వైపు.
‘మరి ఇక్కడెందుకు పని చేస్తోందో తెలుసా. మా అమ్మానాన్నల మీద కృతజ్ఞతతో. అంతేకాదు, ఆమె కోడలు సరిత, భర్త వదిలేసిన, ఆధారం లేని స్త్రీలకి ఉపాధి శిక్షణా సంస్థని ఏర్పాటు చేసింది. దానికి తన వంతుగా నెలనెలా కొంత సాయం చేయాలని సమ్మక్క మన దగ్గర జీతం తీసుకుంటోంది తప్ప, లేకపోతే పైసల కోసం ఆశించి కాదు. మీ బాస్‌ నాగరాజు కూడా తన జీతంలో సుమారు సగభాగాన్ని ఆ సంస్థ కోసమే విరాళమిస్తాడట. ఇవన్నీ ఎవరితోనూ చెప్పొద్దని నన్ను కోరింది కాబట్టి ఇంతకాలం మీకు చెప్పలేదు. ఒకవేళ నేను చెప్పినా, మీరు మనుషుల గురించి పాజిటివ్‌గా ఏనాడైనా ఆలోచిస్తారా… మీది డబ్బు ప్రపంచం. మీవన్నీ డబ్బు సంబంధాలు. ఇలాంటివన్నీ మీకు ఎప్పటికీ అర్థం కావు. కానీ, ఒకటి గుర్తుంచుకోండి. ఎదుటివారిని వారి వేషాన్ని బట్టి, భాషను బట్టి, కులాన్ని బట్టి, డబ్బుని బట్టి అంచనా వేయకండి. వీటన్నింటిని దాటిన ప్రపంచం ఒకటుంది. దానిలోకి మీరు ఎప్పటికీ వెళ్ళలేరు. నన్నయినా ప్రయత్నం చేయనివ్వండి. అర్థం కాలేదా. వచ్చే నెల నుంచి నేను కూడా నా జీతంలో ఇరవై శాతం సేవా కార్యక్రమాలకి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే, నా చదువు, ఉద్యోగం ఇవన్నీ నా కృషితో నేను సాధించుకున్నవి. వీటిమీద మీకెలాంటి అధికారం లేదు. భర్తగా మీకు నేను అన్ని విధాలుగా గౌరవం, సేవలందిస్తాను. కానీ నా సంపాదనని ఇకనుంచి నేనే ఖర్చు పెట్టుకుంటాను. సమాజానికి కొంత ఉపయోగిస్తాను. అలా అయినా మీ లంచగొడితనం వల్ల పోగుచేసుకుంటున్న పాపాలు నా బిడ్డలను దహించకుండా కాపాడుకుంటాను.’
ప్రతి విషయంలో తన అనుమతి లేనిదే చిన్న పని కూడా చేయని ఆమె తన నిర్ణయాన్ని అంత గట్టిగా చెప్పేసరికి జీర్ణించుకోలేక, అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.
(వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు, ఎస్‌.ఆర్‌ డ బి.జి.యన్‌.ఆర్‌. ప్రభుత్వ అటానమస్‌ కళాశాల, ఖమ్మం)

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.