మరపురాని, మరువలేని వ్యక్తిత్వం గల సాయిపద్మ, పరిచయమైన ప్రతి ఒక్కరి హృదయంలోనూ నిలిచి ఉంటుంది.
పది సంవత్సరాల పైమాటే… కొందరు మిత్రులం కలిసి ఒక సాహితీ సమావేశానికి విశాఖపట్నం వెళ్ళాము. అప్పటికే ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా పరిచయమైన సాయిపద్మతో ఫోన్లో మాట్లాడాను.
‘‘వెంటనే వచ్చేయండమ్మా ఇంటికి’’ అంటూ అడ్రస్ చెప్పింది.
చిరునవ్వుతో వెలిగిపోతూ స్వాగతం పలికింది.
ముచ్చటైన ఇల్లు, మంచి కాఫీ ఇచ్చిన సహాయకురాలు… కాలం ఇట్టే గడిచిపోయింది. మధ్యలో ప్రజ్ఞానంద్ కూడా కొంచెంసేపు పాల్గొన్నారు.
వైద్యుల కుటుంబంలో పుట్టినా కూడా విధికి ఎదురీదలేమన్న సత్యానికి సాయిపద్మ ఉదాహరణ. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తమ పసిపాపని పోలియో వ్యాధి నుంచి రక్షించలేకపోయారు. కానీ, వ్యాధిని అధిగమించి ఒక ధ్యేయాన్ని ఏర్పరచుకునేలాగా, ఆ ధ్యేయాన్ని అందుకునేలాగా చెయ్యగలిగారు తల్లిదండ్రులు… ఇద్దరూ డాక్టర్లే.
ఎన్నో సర్జరీలు! పద్మ మాటల్లోనే 16 సార్లు… కదలకుండా మంచం మీదనే ఉంటూ, విపరీతమైన నొప్పులు భరిస్తూ ఆశతో గడిపింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎం.కాం, ఎల్ఎల్బి చదివి ప్రముఖ న్యాయవాదిగా పేరు తెచ్చుకుంది. వికలాంగుల సమస్యలపై, వారి సదుపాయాల కొరకై పోరు సలిపింది. చక్కని గాయకురాలు. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి సంగీతంలో డిప్లొమా సాధించింది. అమెరికాలో పాటలు పాడి, వసూలైన మొత్తం వికలాంగుల సంక్షేమానికి వినియోగించింది.
ఎన్నో కథలు, కవితలు రాసిన రచయిత్రి. ఒకసారి కలిశామంటే తన మిత్ర బృందంలోకి చేరవలసిందే.
సాయిపద్మకి అయిన సర్జరీల వలన కాళ్ళు తప్ప మిగిలిన భాగాలు బాగా పనిచేయడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా తను అనుకున్నది సాధించడానికి ఆమె రోజంతా శ్రమించింది.
సాయిపద్మ అనేక సంక్షేమ కార్యక్రమాలలో పాలు పంచుకుంది. అటువంటి కార్యక్రమాలలోనే పరిచయమైన ప్రజ్ఞానంద్ ఆమెకు జీవిత భాగస్వామి అయి, తోడుగా నిలిచాడు.
భార్యాభర్తలిరువురూ కలిసి గ్లోబల్ ఎయిడ్ (ఎబిలిటీ ఇన్ డిజెబిలిటీ) సంస్థని స్థాపించి వికలాంగుల సంక్షేమానికి కృషి చేశారు. చక్రాల కుర్చీలు, హియరింగ్ ఎయిడ్స్, చేతి కర్రలు వంటి, వారికి కావలసిన సదుపాయాలను అమర్చగలిగారు.
ఎయిడ్స్ బాధితులకు, జబ్బు పడిన పేదవారికి వైద్య సదుపాయాలను కలుగజేశారు. పేద విద్యార్థులకు, గిరిజనులకు ఉచిత విద్య, వైద్య సదుపాయం కల్పించటానికి కృషి చేశారు.
హుద్‌హుద్ తుఫాను సమయంలో కూడా భార్యాభర్తలు ఎంతో సేవ చేశారు. ఇళ్ళు కట్టించడానికి నిధులు సేకరించడం, బట్టలు, మందులను సేకరించడం… ఎవరేం అడిగినా లేదనకుండా, కాదనకుండా చేయడం వారి ప్రత్యేకత.
కష్టపడి ఫిజియోథెరపీ చేయించుకుని, రెండు కాళ్ళతో నడవగలిగినప్పుడు సాయిపద్మ ఆనందం చూసి తీరవలసిందే. చాలా శ్రమపడి నడనవటం ప్రాక్టీస్ చేయసాగింది.
ఎప్పుడూ నవ్వుతూ, కబుర్లు చెబుతూ ఉండే నేస్తం… హఠాత్తుగా వెళ్ళిపోవడంతో అందరికీ షాక్ కలిగింది. ఇంకా అమ్మా అని పిలుస్తున్నట్లే ఉంది. ఇంకా మన మధ్య ఉన్నట్లే అనిపిస్తుంది. అందుకే పద్మ గురించి రాయడానికి సమయం తీసుకున్నాము.
` , (రచయిత్రి, విశ్రాంత అధ్యాపకురాలు)