సాయి పద్మ 2015లో కాళ్ళకి బ్రేసెస్ తీసుకోవడానికి వచ్చింది. నాకు మీ ఇంటికి రావాలని ఉంది, వచ్చి వెళ్ళొచ్చా అని అడిగింది. ఫిలడెల్ఫియాకి వస్తే ఎక్కడ ఉంటున్నారు, మాకు ఉండడానికి ప్లేస్ లేదు, నిన్ను చూసేసి వెళ్తాం అంటే అదేంటి అలా అంటావు, మా ఇంటికి వచ్చి నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండు అని చెప్పాను.
అప్పటికి మేము క్రింది ఫ్లోర్‌లో ఉన్న ఫ్లాట్‌లో ఉంటున్నాము. తను వీల్‌చెయిర్‌లో ఉంటుంది కదా అందుకని తనకి కంఫర్టబుల్‌గా ఉండడానికి ఇల్లంతా రెడీ చేసి ఉంచాము. నాకు అప్పుడే ఆన్‌లైన్‌లో ఏదో చిన్న జాబ్… కానీ చాలా గంటలు పనిచేయాల్సి వచ్చేది. శ్రీనివాస్ బ్రేక్‌ఫాస్ట్, కాఫీ చేసేవాడు. ఆనంద్ గారు తనకి కాఫీలు, టీలు ఆయనే కలుపుకునేవారు. సాయిపద్మకి తగ్గ భర్త ప్రజ్ఞానంద్ గారు. ఆమెని బాత్రూమ్‌కి తీసుకెళ్ళడం, స్నానానికి అన్నీ రెడీగా పెట్టడం చేసేవారు. సాయిపద్మకి పూజలంటే చాలా ఇష్టం. రోజూ పూజలు చేసేది. మంచి ఎండలు మొదలయ్యాయి అప్పుడే. నేను సాయంత్రానికి కానీ ఫ్రీ అయ్యేదాన్ని కాదు. అన్ని గంటలు పని చేసి వాళ్ళతో టైం గడపడం లేదని చాలా బాధగా ఉండేది. ఆనంద్ గారు ఇక్కడ ఉన్న హిమాలయన్ యోగా సెంటర్ చూడాలంటే, మా చైతన్య డ్రైవ్ చేస్తే శ్రీనివాస్ కూడా తోడుగా వెళ్ళాడు. ఆయనకి ఆ ప్రదేశం చూడాలని ఎప్పటినుంచో కోరికట. చాలా సంతోషించారు. అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి చూసి వెళ్ళారు. సాయిపద్మ నాతో, ‘నాకు పోలియో వచ్చి నా జీవితం ఒక రకంగా మారింది. దానికి ఒక రకంగా అలవాటు పడ్డాను. స్కూల్‌కి వెళ్ళినపుడు బాత్రూంకి వెళ్ళకూడదని, బ్రెడ్ తింటే బాడీలో నీళ్ళని పీల్చేస్తుందని బ్రెడ్ తినేదాన్ని. నిన్ను చూస్తే నాకు చాలా బాధేస్తుంది దుర్గా! ఎందుకంటే, నాకు మంచి లైఫ్ తెలియదు. కానీ, నీకు పాంక్రియాటైటిస్ వచ్చేవరకు నార్మల్ లైఫ్ తెలుసు. ఇప్పుడు తిండి లేకుండా ట్యూబ్ ఫీడిరగ్స్ పైన, పెయిన్ మెడిసన్స్ పైన బ్రతుకుతూ కూడా ఇంట్లో అందరూ నార్మల్‌గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటావు. నీకు బాధగా ఉండదా?’ అని అడిగింది. ‘ఎందుకుండదూ? ఉంటుంది. కానీ, నాకు ఎక్కువ బాధగా ఉన్నప్పుడు, క్యాన్సర్ హాస్పిటల్స్‌లో అంత చిన్న వయసులో భయంకరమైన ట్రీట్‌మెంట్స్ తీసుకుంటూ బ్రతకడానికి చిన్నపిల్లలు ఎలా ప్రయత్నిస్తున్నారో తల్చుకున్నప్పుడు నా బాధ అంత పెద్దగా అనిపించదు. నువ్వు మాత్రం చిన్నప్పటి నుండి ఇన్ని ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ, ఎన్నో సర్జరీలు చేయించుకుంటూ, పిల్లలకు, శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారికి స్కూల్ పెట్టి నడుపుతున్నావు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నావు కదా పద్మా! నువ్వే నాకు స్ఫూర్తి తెలుసా!’ అన్నాను. ఇలాగే అప్పుడప్పుడూ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూనే గడిచిపోయాయి రోజులు.
వీకెండ్‌లో వారితో కలిసి ఫిలడెల్ఫియాకి వెళ్ళాం. చాలా సరదాగా గడిచింది. మాతో ఉన్నన్ని రోజులూ ఆనంద్ అన్నయ్య మాకు మిల్లెట్స్ రొట్టెలు చేసి పెట్టారు. మళ్ళీ రెండేళ్ళలో వస్తాం అన్నారు. రానే లేదు. నేను వెళ్ళినపుడు సమయం ఎక్కువ లేక కలవలేకపోయాను. కానీ మా చైతన్య ‘నారి’ డాక్యుమెంటరీ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లోనే ఉన్నాడు. ఆనంద్ అన్నయ్య తనని అన్ని చోట్లకి తీసుకెళ్ళి, కెమెరా పట్టుకుని సహాయం చేశారు. చైతన్య, అమ్మని తీసుకెళ్ళి సాయిపద్మని పరిచయం చేశాడు. అమ్మ, పద్మ ఇద్దరూ చాలా కబుర్లు చెప్పుకున్నారు. రెండేళ్ళ క్రితం ఫోన్‌లో మాట్లాడితే, మేము ఈ ఏడాది వస్తున్నాం అన్నారు. నేను చాలా సంతోషించాను. ‘మనింటికి వచ్చేటపుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని చెప్పలేదు. టికెట్స్ బుక్ అయ్యాక చెప్దామనుకున్నాము’ అన్నారు ఆనంద్ అన్నయ్య.
2022లో అమ్మ పోవడం నాకు పెద్ద షాక్ అయితే, ఈ జనవరిలో నా జీవిత సహచరుడు శ్రీనివాస్ పోవడం మరింత షాక్. ‘అంతలా బాధపడకు దుర్గా! శ్రీనివాస్ అన్న నీ దగ్గరే ఉన్నాడు’ అని నాకు ధైర్యం చెప్పిన తను ఇలా చెప్పాపెట్టకుండా పోవడం నా గుండెను కోసేస్తున్నట్లుగా ఉంది. 2015లో వచ్చినపుడు నేను ఈసారి వచ్చినపుడు చక్కగా ఎవరి సాయం లేకుండా నడుచుకుంటూ వస్తాను, చూస్తూ ఉండు దుర్గా అంది. నేను ఎదురుచూస్తూనే ఉన్నాను, తను వెళ్ళిపోయింది. ఆనంద్ అన్నయ్యా! నేను నీ బాధను అర్థం చేసుకోగలను. నేనూ అదే నావలో ప్రయాణిస్తున్నాను. కానీ, నీ బాధ పచ్చి పుండు. నేనే కోలుకోలేక అవస్థ పడుతున్నాను. స్కూలు పిల్లల బాధ తల్చుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఇది చాలా అన్యాయం… బంగారు సాయిపద్మా!
`