సూర్యుడు నిద్రలేవక ముందే లేచి
బోసిపోయిన వాకిలిని
చుక్కల ఆకాశంలా
చూడముచ్చటగా తీర్చిదిద్ది
ఇల్లును అద్దంలా మెరిపిస్తుంది
పొద్దు పొడిచే లోపే
పదిపన్నెండు పనుల ఖాళీలను
హుటాహుటిన పూరించేసి
పొగలు కక్కుతున్న పొయ్యి దగ్గర
కాకెక్కి ఉన్న పెనంపలక మీద
దోశల్ని అక్షరాల్లా గుండ్రంగా దిద్దుతుంది
నుదుటి మీద పేరుకున్న చెమటపొరను
చీరకొంగుతో సుతారంగా దులిపి పారేస్తుంది
తనెంత ఆదరా బాదరాగా వండినా
లంచ్ బాక్స్‌లో పెట్టిచ్చిన భోజనమైతే
నాకెప్పుడూ అరుచిగా అనిపించలేదు
ఆమె పడే శ్రమను చూసిన కళ్ళు
నా నాలుకకు బుద్ధినిచ్చినట్టున్నాయి
ఇంకా బడికే వెళ్తున్నందుకేమో
నన్నూ ఓ పసివాడిలాగే చూస్తుంది
భాషా బోధకుడిగా
నేను బళ్ళో పాఠాలు చెప్పొస్తే
ఇంట్లో నాకు పాఠాలు చెప్తుంటుంది
నాకున్న మతిమరుపు రోగానికి
అప్పుడప్పుడు అవసరమేలెండి
ఆమె చెప్పే ఆ గుణపాఠాలు
ఇల్లును చక్కదిద్దడమే కాదు
మనుషుల్ని సరిదిద్దడమూ వచ్చామెకు
బండెడు చాకిరీ వల్ల
కాళ్ళు-రెక్కలు గుంజుతున్నా
ఏ రోజూ ఎవరి మీదా గింజుకోదు
నవ వధువుగా ఇంట్లోకి
అడుగేసిన నాటి నుండి
బాధ్యతల గంపను నెత్తికెత్తుకొని
ఏ చుట్టకుదురు లేకున్నా నొచ్చుకోక
చకచకా గడియారంలా నడుస్తూనే ఉంది
కుటుంబానికి భరోసాగా నిలుస్తూనే ఉంది
పగటిపూటంతా మితి లేని ఓపికతో
ఇంటిల్లిపాదికి నిస్వార్థ సేవలందించి
కీచురాళ్ళ చప్పుడు తప్ప
ఏ అలికిడీ ఉండని రాత్రిపూట
తన అలసిన దేహానికి
కాసింత విశ్రాంతినిచ్చుకుంటూ
రేపటి గురించిన ఆలోచనలను
బుర్రగిన్నెలో కలియతిప్పుతూనే
నిదురమడుగులోకి జారుకుంటుంది
చిన్ని తాబేలుపిల్లలా
అప్పుడప్పుడు నా మెదడుబిళ్ళ
అదుపుతప్పి గింగిరాలు కొడుతుంటే
భవితవ్యమేమిటని బెంగెందుకు?
కాలమెప్పుడూ ఒకేలా ఉండనట్టే
జీవితమెప్పుడూ ఒకేలా ఉండదని
శిశిరపత్రం పండి రాలిపోయి
వసంతచిగురు మొలవక తప్పదని
ఓ అద్భుత తత్వ గీతం పాడుతూ
పాటగాన్నైన నన్నూరడిస్తుంది
కొందరు మగవాళ్ళకు
మనసు గొంతుకలో అహంగింజ అడ్డుపడి
అసలు ఒప్పుకోరేమోగానీ
ఆడవాళ్ళది
ఏ మగాడూ… ఏ మగాడూ
అంత సులువుగా చేయలేని
ఉద్యోగం కాని ఉద్యోగం
భార్యంటే
సూర్యోదయానికి ముందే ఉదయించే
మరో సూర్యుడు!
పగటి వేళ విచ్చుకొని ఊగే
చల్లని వెన్నెలపువ్వు
తనదనుకున్న ఇల్లును
చీకటిపరదా కింద మగ్గనీయక
వెలుగురేఖలు చిమ్మేలా చేసే
ఆరిపోని లాంతరు దీపం!!