గతంతో పోల్చితేÑ ఇటీవలి కాలంలో నేత్రదానానికి ప్రసార సాధనాల ద్వారా కొద్దిగా ప్రచారం లభిస్తోంది. అది కూడా కేవలం వార్తల రూపంలోనే తప్ప, వాటి ఆవశ్యకత ` విధి విధానాల గురించిన చర్చ పెద్దగా జరగడం లేదనే చెప్పాలి.
ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్నందున నేత్రదానం, దానికి పాటించాల్సిన విధి విదానాల గురించి పరిశీలిద్దాం. సహజ మరణంలో చెయ్యదగ్గ దానాల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది నేత్రదానం. నేత్రదానం అనగానే చాలామందిÑ మరణానంతరం దాత నుంచి మొత్తం కనుగుడ్డును తొలగించి, వాటిని అమర్చడం ద్వారా మనకు కనిపించే గుడ్డివాళ్లందరికీ చూపును ప్రసాదించవచ్చని భావిస్తుంటారు. ఇది అవగాహనా లోపం. నేత్రదానంలో సేకరించేది కేవలం కంటి నల్లగుడ్డును కప్పి ఉంచే పారదర్శకమైన కార్నియా (శుక్లపటలం)ను మాత్రమే. వివిధ కారణాల వల్ల, ఆ కార్నియా పాడైపోయి పారదర్శకతను కోల్పోయిన కారణంగా చూపు కోల్పోయిన వారికి మాత్రమే నేత్రదానం ద్వారా చూపునివ్వగలం. నేత్రదానం చేయ్యాలంటే మరణానంతరం 6గం.ల లోపు నేత్ర సేకరణ జరిపితే మంచిది. సేకరించిన కార్నియాలను ఎమ్.కె.మీడియంలో భద్ర పరిస్తే, వాటిని 72 గం.ల పాటు నిలువ చెయ్యవచ్చు. ఈ లోపునే వెయిటింగ్ లిస్టులో వున్న వారికి మార్పిడి జరిగిపోతుంది.
అవయవదానం కోసం ఎదురు చూచే అభాగ్యుల్లో కార్నియల్ అంధులది మొదటి స్థానం కాగా, కిడ్నీ బాధితులది ద్వితీయ స్థానం. మన దేశంలో కార్నియల్ అంధుల సంఖ్యపై స్పష్టమైన అంచనాలు లేవు. ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల దాకా పలు అంచనాలున్నాయి. ప్రతియేటా కొత్తగా కార్నియల్ అంధత్వం బారిన పడుతున్న వారి సంఖ్య 25 వేలు అని ఒక అంచనా. దాతల కోసం ఎదురు చూచే వారి సంఖ్య లక్షల్లో వుండి, దానం చేసే వారి సంఖ్య వేలల్లో వుంటున్న కారణంగాÑ ఒక నేత్రదాత నుంచి రెండు నేత్రాలను సేకరిస్తే, ఇద్దరు కార్నియల్ అంధులకు చెరొక కార్నియా చొప్పున అమర్చడం జరుగుతోంది. కార్నియా మార్పిడి చికిత్సలో వచ్చిన అధునాతన విధానాల కారణంగాÑ నేడు పాడైన కార్నియా లేయర్ల స్థానే ఆరోగ్యకరమైన లేయర్లను అమర్చడం ద్వారా, కొన్ని కేసుల్లో ఒక కార్నియాను ఇద్దరు లేదా ముగ్గురికి అమర్చడం వీలవుతోంది. అయినా, మన దేశీయ అవసరాలను తీర్చగలిగే స్థాయిలో నేత్రదానాలు రావడం లేదన్నది బాధాకరమైన వాస్తవం. పైగా సేకరించిన నేత్రాలలో కూడ సుమారు 50 శాతం వరకు మాత్రమే ఇతరులకు అమర్చడానికి పనికి వస్తున్నాయి. సేకరించిన కార్నియాల నాణ్యత (సెల్ కౌంట్) తక్కువగా వుండటమో, మార్పిడి చెయ్యడానికి వీల్లేని జబ్బులను దాతలో (రక్త పరీక్ష ద్వారా) గుర్తించడమో దీనికి కారణం. బాధాకరమైన అంశమేమంటేÑ మన దేశంలో మరణానంతరం నేత్రదానం చేస్తున్న వారి సంఖ్య అసలే అంతంత మాత్రంగా వుంటుండగా, కరోనా కాలం నుంచి ఆ సంఖ్య మరీ దిగజారింది. దిగువ పేర్కొన్న గణాంకాలను పరిశీలిస్తే వాస్తవ స్థితి ఏమిటో అవగతమవుతుంది. 2018లో దేశవ్యాప్తంగా సేకరించిన కార్నియాల సంఖ్య 56,497 (దాతల సంఖ్య కాదు) కాగా, అందులో మార్పిడికి పనికొచ్చినవి 27,049 మాత్రమే. కరోనా కారణంగా నేత్ర సేకరణలు 2019లో 50,958 (26,703)కిÑ 2020లో 18,359 (12,998)కిÑ 2021లో 32,533 (21,709)కిÑ 2022లో 45,987 (28,409)కి తగ్గిపోయాయి.
నేత్రదానానికి వయో పరిమితి లేదు. కంటికి కళ్లజోడు వేయించుకొన్నా, చూపు మందగించినా, కంటిశుక్లం ఆపరేషన్ చేయించుకొన్నా నేత్రదానానికి అర్హులే. కంటి నల్లగుడ్డును కప్పివుంచే పారదర్శకమైన కార్నియాలో రక్త ప్రసరణ వుండదు గనుక, బ్లడ్ గ్రూపుతో నిమిత్తం లేకుండా దాన్ని ఎవరికైనా అమర్చవచ్చు. కార్నియా సేకరణ అనంతరం ముఖం వికారంగా కనిపిస్తుందన్న భయం అవసరం లేదు. ఆ విషయం తెలియని రీతిలో కనుగుడ్డుపై ప్లాస్టిక్ క్యాప్ వేస్తారు. మన దేశంలో తొలి కార్నియా మార్పిడి చికిత్సను చెన్నైకి చెందిన డా॥ ఆర్.ఇ.ఎస్.ముత్తయ్య 1948లో నిర్వహించారు. 1945లో తొలి ‘ఐ బ్యాంక్’ను చెన్నైలో స్థాపించింది కూడ ఆయనే. మరణానంతరం తమ కుటుంబీకుల నేత్రాలను దానం చెయ్యదలచిన వారు, వీలైనంత తొందరగా ఆ విషయాన్ని సమీప ఐ బ్యాంకు వారికి తెలియజెయ్యాలి. మృతుని నేత్రాలను ఎంత తొందరగా సేకరించ గలిగితే, అంత మంచిది. ఆలస్యమయ్యేకొద్దీ కనుగుడ్లు పొడిబారి పోవడం, కార్నియాలో ‘సెల్ కౌంట్’ తగ్గిపోవడం జరుగుతుంది. ఐ బ్యాంకు వారి సేవలు 24 గం.లూ అందుబాటులో వుంటాయి. మృతదేహం ఎక్కడ వుంటే అక్కడికే సొంత ఖర్చులతో హాజరై నేత్ర సేకరణ చేస్తారు. ఇది కేవలం 20ని.లలో ముగిసే ప్రక్రియ. మరణానంతరం నేత్ర సేకరణ జరిగేలోపు కార్నియాల నాణ్యత దెబ్బతినకుండా వుండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవిÑ 1. కనురెప్పలను పూర్తిగా మూసి వాటిపై తడిగుడ్డ లేదా దూదిని వుంచాలి. 2. తల ఆరు అంగుళాల ఎత్తులో ఉండేటట్టు తలకింద దిండ్లు పెట్టాలి. 3. తలకు దగ్గరలో నూనె దీపాలు, విద్యుత్ లైట్లు పెట్టకూడదు. 4. తలపై ఎండ పడకుండా చూడాలి. 5. ఫ్యాను గాలి ముఖానికి తగలకుండా చూడాలి. 6. ఎ.సి వుంటే ఆన్ చెయ్యవచ్చు లేదా మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్‌లో పెట్టవచ్చు.
కొన్ని జబ్బులున్న వారు నేత్రదానానికి అనర్హులు. ఒక వేళ వారి నుంచి కార్నియాలను సేకరించినా, వాటిని ఇతరులకు అమర్చకుండా ప్రయోగాల నిమిత్తం వాడతారు. నేత్రదానానికి గల అనర్హతలేమిటో చూద్దాం. అవిÑ రేబీస్ వ్యాధి, కామెర్లు, కండ్లకలక, నీటిలో మునిగి మరణించడం, ధనుర్వాతం, బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఎయిడ్స్, సిఫిలిస్ లేదా ఇతర సుఖవ్యాధులు, మెదడువాపు వ్యాధి, డెంగ్యూ, పొంగు, కోవిడ్`19, కుష్టు, సెప్టిసీమియా, విషం తాగి మరణించడం. ఇతరులకు అమర్చడానికి వీల్లేని జబ్బులున్నాయేమో తెలుసుకొనేందుకు కార్నియాలతో బాటు మృతుని నుండి రక్త నమూనాను కూడ సేకరించడం జరుగుతుంది. నివారించదగిన అంధత్వంలో ఉన్న అభాగ్యులకు మరణానంతరం చెయ్యదగ్గ నేత్రదానంతో చూపు వచ్చే అవకాశం వుండగా, కోట్లాది మంది మరణానంతరం అమూల్యమైన నేత్రాలను మట్టిపాలు చెయ్యడమో, బూడిదపాలు చెయ్యడమో జరుగుతున్నదంటేÑ మానవతకు అంతకు మించిన అపచారం వుంటుందా? ఆలోచించండి!
నేత్రదానం పట్ల ఆసక్తి వున్న వ్యక్తులు, సంస్థలు మరిన్ని వివరాలకు లేదా సాహిత్యానికి అమ్మ నేత్ర, అవయవ, శరీరదాన ప్రోత్సాహకుల సంఘ అధ్యక్షుడు ఈశ్వరలింగంను 95508 94940 లేదా 94910 74940 నందు గానిÑ వ్యాస రచయితను 94911 84911 నందుగాని సంప్రదించవచ్చు. ఈ రంగంలో సేవలందిస్తున్న సంస్థలకు సాహిత్యాన్ని ఉచితంగానే పంపడం జరుగుతుంది.
– అధ్యక్షుడు: నేత్రదాన ప్రోత్సాహక సంఘం, ప్రధాన సలహాదారు: అమ్మ నేత్ర, అవయవ, శరీరదాన ప్రోత్సాహకుల సంఘం