ప్రత్యామ్నాయ చరిత్రను రాయడానికి పరిశోధన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ప్రచారంలో ఉన్నటువంటి విషయాలను పక్కకుతోసి సత్యాలను నిలబెట్టడానికి గ్రంథవనరులు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇట్లా దొరికిన ఆధారాలను కన్విన్సింగ్‌గా చెప్పడం ఒక కళ. ఈ కళలో నిష్ణాతులు, ఆల్టర్నేటివ్ చరిత్ర నిర్మాత, సబాల్టర్న్ విదుషీమణి బోయి విజయభారతిగారు.
పురాణాలు, రామాయణ, భారతాలను లోతుగా అధ్యయనం చేసి అందులోని అసంబద్ధతల్ని, తాటక లాంటి యోధురాళ్లను విలన్లుగా ప్రచారంలో పెట్టిన విషయాలని, సత్యహరిశ్చంద్రుడు, షట్చక్రవర్తులు, రామాయణ మునులు, మాతంగ సంస్కృతి లాంటి పుస్తకాల ద్వారా బ్రాహ్మణీయ భావజాల ‘మాయలు, మర్మాల’ను ఎత్తి చూపించారు. ‘కబంధుడు’ లాంటి రాక్షస వీరులు చెప్పిన శ్రమశక్తి గొప్పదనాన్ని సైతం తమ రచనల్లో చిత్రించారు. రామాయణ, భారత, పురాణల్లో రాక్షసులుగా చిత్రించబడిన వారి ప్రతిభను, దార్శనికతను తమ రచనల్లో విస్తృతంగా చర్చించారు. అంబేడ్కర్ రాసిన ‘రాముడి కృష్ణుడి రహస్యాలు’ పుస్తకాన్ని భర్త బొజ్జా తారకంతో కలిసి తెలుగులోకి తర్జుమా చేశారు. ఒక రకంగా ఫూలే, అంబేడ్కర్‌ని తెలుగు పాఠకులకు చేరువ చేసింది విజయభారతిగారు అని చెప్పవచ్చు.
‘పురాణాలు-మరోచూపు’ పేరిట రాసిన పుస్తకంలో విజయభారతిగారు ఆ పుస్తకం విశిష్టతను చెబుతూ ‘‘భూమి దైత్యులది’’ అని రామాయణంలో జటాయువు ఒక సందర్భంలో రామునికి చెప్పాడు. దైత్యులు అసురగణాలలోని వారు. ‘‘ఈ భూమి ఇక్ష్వాకులది’’ అని వసిష్టుడు మరో సందర్భంలో రామునికి చెబుతాడు. ఇక్ష్వాకులు సూర్యవంశీయులు- సూర్యుడు దేవగణాలలోని వాడు. రాముడు ఇక్ష్వాకుడు. రాజ్య విస్తరణ కోసం పట్టుదలతో అసురలను చంపుతూ వెళ్ళాడు. భూమిని అసురుల నుండి స్వాధీన పరచుకున్నాడు అని పురాణాల కాలం నుంచి సమకాలీన సమాజం వరకు భూమి ఇరుసుగా జరుగుతున్న పోరాటాల గురించి విజయభారతిగారు లోతైన అధ్యయనంతో విశ్లేషణ చేశారు. అట్లాగే మరో పుస్తకం ‘‘నరమేధాలు-నియోగాలు మహాభారతం పరిశీలన గ్రంథంలో ‘‘మహాభారతం దాయాదుల పోరాటంగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో రెండు వ్యవస్థలకు చెందిన హక్కుల పోరాటాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కనిపించేది దుర్యోధనాదులకూ పాండు పుత్రులకూ జరిగిన రాజ్యాధికార వివాదం. పరోక్షంగా కనబడేది దేవాసుర వర్గాల పోరాటం’’ అని ఒక్క మాటలో మహాభారతాన్ని విప్పి చెప్పారు.
1978లో తెలుగు అకాడెమీలో రీసెర్చ్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరిన తర్వాత గౌతు లచ్చన్న హైదరాబాద్‌లో ప్రారంభించిన ‘బహుజన’ పత్రికలో కాలమ్ రాయడం ప్రారంభించారు. ఈ కాలమ్‌లో అంబేడ్కర్ జీవితాన్ని పాఠకులకు ఈజీగా అర్థమయ్యే భాషలో సరళంగా రాశారు. అంతేగాదు ఆ కాలమ్ ఆగిపోయినా తన రచనను కొనసాగించారు. ఈ విషయాలనే 1982లో అంబేడ్కర్ జీవిత చరిత్ర పేరిట పలు గ్రంథాలను అధ్యయనం చేసి దాదాపు సమగ్రంగా రాసింది. అందుకే ఈ పుస్తకానికి పీఠిక రాసిన సుప్రసిద్ధ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు ‘‘ఆమె (బోయి విజయభారతి) రచనలో ఆలోచనతో పాటు ఆవేదన ఉన్నది. జీవంతో పాటు జవం ఉన్నది. ఇది జీవిత చరిత్ర అయినా నవల వలె సాఫీగా నడుస్తున్నది. కొన్ని కొన్ని ఘట్టాలలో నాటకం వలె ముఖ్య దృశ్యాలను కండ్లకు కట్టినట్టు చూపుతున్నది’’ అని రాసిండు. ఏ ఆంగ్ల పుస్తకంలోనూ దొరకని ‘అంబేడ్కర్ హైదరాబాద్, ఆంధ్ర’ పర్యటన వివరాలు ఇందులో ప్రత్యేకంగా చర్చించారు. 1967` 68 నాటికే యెండ్లూరి చిన్నయ లాంటి వారు అంబేడ్కర్ జీవిత చరిత్ర, మరో ఇద్దరు ముగ్గురు 1980లకు ముందు ‘అంబేడ్కర్’ గురించి రాసిండ్రు. అయితే సరళమైన భాషలో కఠినమైన విషయాలను సైతం కంఠోపాఠంగా చెప్పిన రచన బోయి విజయభారతిగారిది. ఇంకా చెప్పాలంటే బోయి విజయభారతిగారి ‘బాబా సాహెబ్ అంబేడ్కర్’ తర్వాతనే బోయి భీమన్న అంబేడ్కరిజం, అంబేడ్కర్ సుప్రభాతం, పాటల్లో అంబేడ్కర్ అనే రచనలు వెలువరించారు.
అంబేడ్కర్ తన గురువుగా పేర్కొన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే గురించి కూడా తెలుగువారికి మొదట పరిచయం చేసింది విజయభారతి గారే! ‘‘ఓట్లు మావి సీట్లు మీవా?’’ అంటూ దళితులు ఈరోజు రాజకీయాధికారం కోసం పోటీపడుతున్నారు. రాజకీయాధికారం కోసం, సామాజిక న్యాయం కోసం దళితులు ఈనాడు ఇంతగా ముందుకు వచ్చి దైర్యంగా పోరాడుతున్నారంటే అందుకు కారణం ఇద్దరు. ఒకరు మహాత్మ జ్యోతిరావు ఫులే, మరొకరు డా. బి.ఆర్.అంబేడ్కర్.’’ చరిత్రలో వారి స్థానాన్ని ఖరారు చేశారు. ఈ పుస్తకం మొదట 1987లో ‘జనపద విజ్ఞాన కేంద్రం’వారు ప్రచురించారు.
ఇదే సమయంలో కారంచేడు ఘటన, బహుజన సమాజ్ పార్టీ స్థాపన, అనంతర కాలంలో మండల్ కమిషన్ అమలు ప్రకటన, రిజర్వేషన్ అనుకూల` ప్రతికూల ఉద్యమం వీటన్నింటి ప్రభావంతో తెలుగువారు ఉద్యమాలు చేసిండ్రు. ఆ సమయంలో వారికి అందుబాటులోకి వచ్చిన పుస్తకమిది. అట్లాగే గ్లోబలైజేషన్ కాలంలో కూడా బహుజనులకు ఈ పుస్తకం దీపధారిగా ఉపయోగ పడిరది.
అట్లాగే అంబేడ్కర్ ఫెమినిస్టు దృక్కోణాన్ని చిత్రికగడుతూ ‘మహిళల హక్కులు` డా. అంబేడ్కర్ దృక్పథం’ పేరిట విశ్లేషించారు. అంతేగాదు మరుగునపడ్డ తన మేనత్త ద్రౌపది కవిత్వాన్ని తన స్వీయ సంపాదకత్వంలో వెలువరించారు. అట్లాగే తల్లి నాగరత్నమ్మ, తండ్రి బోయి భీమన్న ఇద్దరి జీవిత చరిత్రలను రాసి పుస్తకాలుగా ప్రచురించారు. అముద్రితంగా ఉన్న భర్త బొజ్జా తారకం పుస్తకాలను ‘తారకం ట్రస్ట్’ తరపున వెలువరించారు. ఈ విషయంలో సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తి పనిచేసిందని చెప్పవచ్చు. సావిత్రిబాయి కూడా తన భర్త జ్యోతిబా ఫూలే రచనలను సంకలనం చేసి వెలువరించింది. అట్లా విజయభారతిగారు ఆధునిక చరిత్రను సబాల్టర్న్ దృక్కోణంలో తిరగరాసిన విదుషీమణిగా చెప్పవచ్చు.