సామాజిక చింతనా మాతృమూర్తి – డా॥ గూడూరు సీతా మహాలక్ష్మి

డా. విజయభారతిగారి గురించి చెప్పాలంటే గొంతుకేదో గీరబోయినట్లు అనిపిస్తోంది. చాలా వేదనగా కూడా వుంది. నిన్న మొన్న కలిసిన మనిషి, కళ్ల ముందు సజీవంగా నిలిచిపోయిన మనిషి, ఇవాళ భౌతికంగా మనమధ్య లేరు అనేది నాకైతే వ్యక్తిగతంగా జీర్ణించుకోలేని అంశం.

ఈ ఇరవై సంవత్సరాలలో ఎంతోమంది పార్ధివ దేహాలను అనేక మెడికల్‌ కాలేజీలకు అప్పగించిన సందర్భాలు ఎన్నో వున్నాయి నాకు. ఎప్పుడూ కూడా నాలో ఇంత బాధ, వేదన, ఆవేదన గూడుకట్టుకోలేదు. కేవలం విజయభారతిగారి విషయంలోనే ఎందుకింత బాధపడుతున్నాను అంటే తను నాకు మాతృమూర్తి లాంటి వ్యక్తి. నా మనసుని, నా ఆలోచనలను చాలా దగ్గరగా అర్థంచేసుకున్న మనిషి ఆవిడ. తల్లిలాగానే ఫీల్‌ అయ్యాను. అదీ ఆవిడకు నాకూ వున్న సంబంధం. బహుశా చాలామందికి తెలుసో తెలియదో నేను చెప్పలేను కానీ నేను విద్యార్థి దశలోనే అంటే 80వ దశకంలోనే డా. విజయభారతిగారితో కనెక్ట్‌ అయ్యాను.
వ్యక్తిగతంగా వారింట్లో ఒక మనిషిగా మెలగటం మొదలయింది మాత్రం కారంచేడు ఉద్యమం తర్వాత. 80- 85 ప్రాంతంలో నేను హేతువాద ఉద్యమంలో క్రియాశీలకంగా పశ్చిమగోదావరి కార్యదర్శిగా పనిచేస్తూ వుండేదాన్ని. అప్పుడు అనేక మీటింగులకు పౌరహక్కుల ఉద్యమనేతగా బొజ్జా తారకంగారిని వక్తగా ఇన్వైట్‌ చేయటం జరిగింది. చాలా మీటింగులు జరిగేవి. ఆయన వక్తగా వచ్చేవారు. ఆయన నుంచి హక్కులఉద్యమం చైతన్యాన్ని, స్పూర్తిని అందుకున్నాను. డా. విజయభారతిగారు గత ఏడాదిన్నర నుంచి చాలా రెగ్యులర్గా ఫోన్‌ చేస్తున్నారు. నాకు అర్థంకాలేదు. ‘లక్ష్మీ నువ్వు హైదరాబాద్‌ వస్తావా? ఎప్పుడు వస్తున్నావు? వస్తే నన్ను ఒక్కసారి కలువు’ అనేవారు. ‘నువ్వు హైదరాబాద్‌ వస్తున్నావు, మీటింగులు పెడుతున్నావు, నేను ఫేస్‌ బుక్‌ లో చూస్తున్నాను, కానీ నువ్వు నన్ను కలవకుండా వెళ్లిపోతున్నావు. ఈసారి మాత్రం నన్ను కలిసి వెళ్లాలి. తప్పకుండా నువ్వు మా ఇంటికి రావాలి. రాహుల్‌ వాళ్ల క్వార్టర్స్‌లో, కుందన్‌బాగ్‌లోనే వుంటున్నాను. నువ్వు కచ్చితంగా రావాలి. కుదరదు అంటే నేను వొప్పుకోను’ అని తరచూ ఫోన్లు చేస్తున్నారు.
‘మీరు ఎలా వున్నారు’ అని మామూలుగా కుశల ప్రశ్నలు వేస్తే, ‘లక్ష్మీ నువ్వు అందరి చేతా శరీర ఆవయవదానాన్ని చేయిస్తున్నావు, నాచేత ఎప్పుడు చేయిస్తావు, నేను నీ ద్వారా చేద్దామనుకుంటున్నాను. నువ్వు వచ్చి విల్లురాసి, అది సబ్మిట్‌ చేసే పని నువ్వే తీసుకోవాలి, అందుకోసం నువ్వు రావాలి’ అన్నారు. ‘దానికోసం తొందరెందుకమ్మా, ఇంకా చాలా టైమ్‌ వుంది కదా’ అని నేను అంటూ వుండేదాన్ని. ‘లేదు నాకు నిన్ను చూడాలని వుంది, చాలా కాలమయింది’ అన్నారు. అప్పుడెప్పుడో ఒకసారి రవీంద్రభారతిలో గీతగారు. ఈశ్వరీబాయి పేరు మీద అమ్మకు విశిష్ట మహిళా పురస్కారం ఇచ్చినప్పుడు అమ్మతో, డా. మహితతో కలిసి రవీంద్రభారతికి వెళ్లటం, ఆ రోజంతా ఆవిడతో గడపటం నాకు చాలా అపురూపం. ఆ జ్ఞాపకాలు ఇంకా చెదరిపోలేదు. అమ్మ నాతోనే వున్నారులే అనుకుంటూ వున్నాను. కానీ ఇంతలోనే అమ్మ తొందరపెట్టారు. ‘నువ్వు రావాలి, నా దగ్గర అప్లికేషన్‌ తీసుకోవాలి, నేను మహితతో మాట్లాడాను, నేను నా నిర్ణయాన్ని చెప్పాను, తను సంతకం పెడతారు, విట్నెస్లు ఎంతమంది వుండాలి, ఇవన్నీ నేను కనుక్కున్నాను, తను చెప్పింది, నువ్వు రావాలి, నువ్వే నాకు ఈ పని చేసి పెట్టాలి’ అన్నారు. దానితో వెళ్ళక తప్పలేదు. గత కొద్దిరోజులుగా అనుకుంటూ వున్నాను, మా హైదరాబాద్‌ యూనిట్‌ సెక్రెటరీ గురుప్రకాష్‌ గారిని, తమ్ముడు తిరుపాల్‌ ని, నా దత్తపుత్రిక రజనీని తీసుకుని నేను అమ్మ దగ్గరికి వెళ్లాను. అదే మొదటిసారి నేను కుందన్‌ బాగ్‌ వెళ్లటం. వాళ్ల అబ్బాయి రాహుల్‌ గారి క్వార్టర్స్‌ లోనే కింద వుంటున్నారు. చాలా ఆనందంగా కౌగిలించుకున్నారు. ఆ రోజంతా చాలా హ్యాపీగా అమ్మతో గడిపాము. అమ్మ పెట్టినవన్నీ తిన్నాము. అమ్మ చేసి పెట్టిన కాఫీ తాగాము. చాలా కబుర్లు, ఎప్పటినుంచో వున్నవన్నీ చెప్పుకున్నాము. తారకంగారి విషయం వచ్చినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోక తప్పలేదు. ఆయన విషయం వచ్చినప్పుడల్లా అమ్మా, నేనూ కన్నీటి పర్యంతం అయిపోతాము ఎప్పుడూనూ! ఎందుకంటే సార్‌ సమాజానికి ఎంత అవసరం అనేది మా ఇద్దరికే కాదు సమాజం అందరికీ తెలుసు. మన హక్కుల గొంతుక ఆయన. నేను వ్యక్తిగత జీవితంలో చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్న సమయాల్లో నాకు కష్టం వచ్చిన ప్రతి సమయంలో తారకంగారు, విజయభారతిగారు నా వెనుకాల నిలబడ్డారు. ‘92లో టాడా యాక్ట్‌ పెట్టిన వెంటనేనా సహచరుడు రాజేంద్రప్రసాద్‌ గారిని అరెస్టు చేసినప్పుడు దిక్కుతోచని స్థితిలో నా ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకుని తారకంగారి ఇంటికి వెళ్ళినపుడు, ఒక కన్నబిడ్డ కష్టంతో ఇంటికి వస్తే ఎట్లా ఆదరిస్తారో, ఎలా అక్కున చేర్చుకుంటారో అలా నన్ను వీరిద్దరూ అలా ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. నాకున్న ఏకైక దిక్కు వారే. చాలా ఫైట్‌ చేశాను. విశాఖపట్నంలో చాలా పెద్ద యుద్ధమే చేశాను. కానీ ఆ కేసులో బెయిలు జిల్లా కోర్ట్‌ లో గానీ హైకోర్టులో గానీ రాదు, సుప్రీంకోర్టుకే వెళ్లాలి అని తెలిసిన తర్వాత, నాకు గైడ్‌ చేయటానికి తారకంగారు తప్పించి ఎవరు వున్నారు? తారకంగారు బాలగోపాల్‌ గారి ద్వారా సుప్రీంకోర్టులో వేయించారు. బాలగోపాల్‌ గారి ద్వారా రాజేంద్రప్రసాద్‌ గారికి బెయిలు వచ్చేలా చేశారు. తారకంగారు చాన్నాళ్ల క్రితమే రాసిన ‘పోలీసులు అరెస్టు చేస్తే’ అనే పుస్తకాన్ని చదివి వుండకపోతే రాజేంద్రప్రసాద్‌ గారిని బూటకపు ఎన్కౌంటర్‌ లో హతమార్చే ప్రమాదం నుంచి తప్పించలేకపోయేవాళ్ళం. ఆ పుస్తకం ఇచ్చిన అవేర్నెస్‌ తోనే కలెక్టర్‌ దగ్గర్నుంచి అందర్నీ కదిలించి ఆయన్ని సజీవంగా కోర్టుకి సబ్మిట్‌ చేయగలిగామంటే అది తారకంగారు రాసిన ఆ పుస్తకం వల్లనే సాధ్యం అయింది. అమ్మ మాత్రం అంత కష్ట సమయంలో నన్ను ఆదుకున్న తీరు, వోదార్చిన తీరు నేనెప్పటికీ మర్చిపోలేను.
అమ్మ నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో నాకు తెలుసు. తను తెలుగు అకాడెమీ డైరెక్టర్‌ గా వున్న ఆ రోజుల్లో ప్రతిరోజూ నన్ను అక్కడికి తీసుకెళ్ళి, ‘లక్ష్మీ ఈ పుస్తకం చదువు, ఆ పుస్తకం చదువు’ అని చెప్పేవారు. 85 కారంచేడు ఉద్యమంలో నేను పాల్గొనే నాటివరకూ, ఆ పోరాటంలో క్రియాశీలకంగా వున్నప్పటికీ కూడా, కారంచేడు కుల సమస్య అని ఎజండా మీదికి తీసుకువచ్చిన తర్వాత, కులం ఎంత ప్రమాదకరమైనదో, కులం లోతులు ఎంతగా పాతుకుపోయి వున్నాయో, కుల దురహంకారం ఈ దేశంలో ఎంతగా జడలు విప్పుకుందో, అదంతా ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని కాబట్టి, కులం గురించి నేను చదువుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అమ్మ 82లోనే రాసిన అంబేడ్కర్‌ జీవిత చరిత్ర, అంబేడ్కర్‌ గారి అనువాదాలు, మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలేగారి జీవిత చరిత్ర.. ఇవన్నీ నాకు పరిచయం చేసింది అమ్మే! హైదరాబాద్‌ వెళ్ళినప్పుడల్లా అమ్మ దగ్గరే వుండి ఆ పుస్తకాలన్నీ అమ్మ దగ్గరే చదువుతూ, సందేహాలు తీర్చుకుంటూ వుండేదాన్ని. సాహిత్యపరంగా, సామాజికపరంగా అన్ని విషయాల్లో అవేర్నెస్‌ కలిగించటంలో, అటు హక్కుల ఉద్యమాల్లో, ఇటు సామాజిక పోరాటాల్లో తారకంగారు అమ్మా ఇద్దరూ నాకు ఎంతో గైడ్‌ చేస్తూ వచ్చారు. నాకు ఎంతో వెన్నుదన్నుగా వుండేవారు. చాలా ఇన్‌స్ఫయిరింగ్‌ గా వుండేది. రామాయణ, భారతాల్లో స్త్రీల పాత్రలను అమ్మ తనదైన శైలిలో చెప్పే విధానం నన్ను చాలా ఆకట్టుకునేది. ఇవన్నీ మా పరిధిని ఎంతో విస్తృతపరిచాయి.
అమ్మలో వున్న గొప్ప సుగుణమేమంటే, ఎప్పుడూ తను మితభాషి. వాదన వచ్చినా, చర్చ వచ్చినా గానీ ఏ రోజూ అమ్మ మొహంలో నేను కోపాన్ని చూడలేదు. అప్రసన్నతనీ చూడలేదు. చిరునవ్వుతోనే, మృదువుగా, సౌమ్యంగా, సున్నితంగా ఒక విషయాన్ని ఎలా వొప్పించి చెప్పాలో అమ్మకి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. అమ్మ దగ్గర నేర్చుకున్నది అదే! మనం విభేదించే వ్యక్తులతో కూడా, వ్యతిరేకించే వ్యక్తులతో కూడా ఎంత సున్నితంగా, స్నేహంగా మాట్లాడాలో, వొప్పించాలో ఇవన్నీ నేను అమ్మ దగ్గర నేర్చుకున్నవి. విశాఖపట్నంలో మా ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు ఆ క్షణాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను. తారకంగారి సోదరుడు బొజ్జా కృష్ణశాస్త్రిగారు చనిపోయినప్పుడు, వారి అమ్మాయి పావని మ్యారేజ్‌ విషయం వీరి భుజస్కంధాల మీదే పడినప్పుడు వీళ్లు మా ఇంటికే వచ్చివున్నారు. ఎంత అపురూపమైన క్షణాలో అవి. అమ్మతో కూర్చుని మాట్లాడుతూ, ఆవిడతో తింటూ ఇలా అనేక విషయాలు ఇంకా నిన్నా మొన్నా జరిగిన సంగతులుగా వుంటాయి. అప్‌ అండ్‌ డౌన్‌ గా వున్న మా ఇల్లు చూసి తారకంగారు చేసే వ్యాఖ్యానాలకు ఎంత పడిపడి నవ్వుకునేవాళ్లమో చెప్పలేను. ఎందుకంటే వాస్తుకు విరుద్ధంగా, మూఢనమ్మకాలకి విరుద్ధంగా ఇల్లు అలా కట్టడం చూసి, ‘హేతువాదంగా జీవించటం అంటే ఇది కదా లక్ష్మి అనటం, వాస్తు విరుద్ధంగా విన్న ఇల్లుని, స్థలాన్ని ఎవరూ కొనని కాలంలో కొని, కులనిర్మూలనా నిలయం అని పెట్టుకోవటం నాకు చాలా నచ్చింది’ అన్నారు. కొండ పక్కన ఒక గుంటలాగా వున్న స్థలంలో మా నాన్నగారు తోటలాగా పెంచిన స్థలం తారకంగారికి కూడా చాలా నచ్చింది. ఎప్పుడూ అక్కడే వుండటానికి ఇష్టపడేవారు. ఈ కాంక్రీట్‌ జంగిల్లో, ఈ వీధులు రోడ్ల మధ్య వూపిరాడని పరిస్థితుల మధ్య, ఇక్కడికి వస్తే బాగుందని, ఇక్కడే ఈ మొక్కలలో చల్లగా కూర్చుని మాట్లాడుకుందామని, లోపల కూర్చోనని అక్కడే కూర్చునేవారు తారకంగారు.
విజయభారతి అమ్మ గురించి ఇక్కడ నేను చెప్పాల్సిన ప్రత్యేక విషయాలేమిటంటే ఆవిడ ప్రతీ విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకుంటారు. నేను చిన్నప్పటినుంచీ కూడా ఉదయాన్నే పెరుగన్నం అదీ చద్దిఅన్నం తినటానికి ఇష్టపడేదాన్ని. మేము ఆరుగురం సంతానం కాబట్టి టిఫిన్లు అంటూ ఏమీ వుండేవి కాదు. అమ్మ అందరికీ మజ్జిగన్నం పెట్టి నంజుకోవటానికి ఏదో పచ్చడి పెట్టి మమ్మల్ని స్కూల్‌కి పంపేది. అదే అలవాటు నాకు పెళ్లయినా, ఉద్యమాల్లో తిరుగుతున్నా, పెద్దయినా గానీ వుంది. ఇడ్లీలు, దోశలు లాంటి టిఫిన్లు అంటే అస్సలు అపేక్ష వుండేది కాదు. తినాలనిపించేది కాదు. ఎప్పుడయినా మా అమ్మగారు పెసలు రుబ్బి పెసరట్లు వేసేవారు. నేను ఇష్టపడి తినే ఏకైక టిఫిన్‌ అది. ఏదో మాటల సందర్భంలో మా అమ్మ గురించి చెబుతూ ఈ విషయం విజయభారతి అమ్మకు చెప్పాను. ఆవిడ దాన్ని బాగా గుర్తు పెట్టుకున్నారు. నేను ఎన్ని పర్యాయాలు వెళ్లినా నాకు పెసరట్లే టిఫిన్‌ గా పెట్టేవారు. నేను ఎంత ఆశ్చర్యపోయేదానినంటే, నేను వస్తున్నానని తెలియగానే పెసలు నానబెట్టటం, పెసరట్లు వేయటం, అందులో అల్లం పచ్చిమిర్చి వేయటం, అసలు అమ్మ ప్రేమను తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తుంటాయి. ‘నువ్వు తినేది ఇదొక్కటే కదా, ఇదన్నా నేను చేసి పెట్టకపోతే ఎలా’ అనేవారు అమ్మ నాతో. ఆ ప్రేమని ఎలా మర్చిపోగలను.
కులాన్ని పరిచయం చేసినా, అంబేడ్కర్‌ని, సావిత్రీబాయిని, పరిచయం చేసినా, మహిళల గురించి అంబేడ్కర్‌ చేసిన అసామాన్య పోరాటాలు, త్యాగాలు, మహిళల హక్కుల గురించి ఆయన దృక్పథం, పోరాడిన విధానం ప్రతిదీ కూడా అమ్మ ద్వారా తెలుసుకున్నాను. అమ్మ సాహిత్యం కన్నా అమ్మతో జరిగిన చర్చల ద్వారా తెలుసుకున్నాను. అంబేడ్కర్‌ అంత గొప్ప వ్యక్తిని నేను చాలా కాలం పాటు తెలుసుకోలేకపోయాను. ఆయన సాహిత్యం నాకు పరిచయం కాలేదు. నేను వామపక్ష కుటుంబంలో పుట్టాను కాబట్టి, వూహ తెలిసిన కాడనించి తాతయ్యగారి వద్ద వున్న పుస్తకాలు చదువుతూ పెరిగాను. వామపక్ష సాహిత్యం తప్పించి ‘85 వరకూ నాకు అంబేడ్కర్‌ సాహిత్యం అసలు పరిచయమే ఏర్పడలేదు అని చెప్పటానికి నేను సిగ్గుపడటం లేదు. అమ్మ పుస్తకాల ద్వారా మాత్రమే నాకు అంబేడ్కర్‌ పరిచయం ఏర్పడిరది. ఆవిడ సాంగత్యం వల్ల, ఆవిడతో జరిగిన చర్చల వల్ల మాత్రమే ఆయన్ని తెలుసుకోగలిగాను. అంబేడ్కర్‌గారి విషయంలో నా తొలిగురువు అమ్మ డా. విజయభారతి. అలాగే జ్యోతిరావ్‌ ఫూలే గురించి చదువుకున్న తర్వాత, సావిత్రీబాయి గురించి మరింత అర్థమయ్యాక, భారతదేశంలో సావిత్రిబాయి పేరు చిరస్మరణీయం చేయాలంటే ఆవిడ పేరు మీద ఒక ఉద్యమాన్ని, ఒక సంస్థను ఏర్పాటు చేయాలని అనుకున్నాను. ఆవిడ వ్యక్తిత్వం గురించి నేను అంతలా ఇన్‌స్పయిర్‌ అవటానికి నాకు అవగాహన కలిగించింది విజయభారతి అమ్మ. విజయభారతిగారి స్పూర్తితోనే, ఆవిడ ప్రేరణతోనే నేను సావిత్రీబాయి పేరు మీద 2003లో సావిత్రిబాయి ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ని స్థాపించటం జరిగింది.
అశోక్‌ నగర్లో వున్నంతకాలం, నేను హైదరాబాద్‌ ఏ పని మీదైనా వచ్చినప్పుడు తప్పనిసరిగా విజయభారతి అమ్మ వాళ్ళింటికి వచ్చేదాన్ని. అమ్మ నన్ను చాలా ఇస్టంగా, ప్రేమగా అన్నీ చేసిపెట్టేవారు. కారంచేడు ఉద్యమంలో నేను చాలా యాక్టివ్‌ గా పనిచేశాననే విషయం ఇప్పటి తరానికి తెలియక పోవచ్చు గానీ, అప్పటి వాళ్లకు చాలా మందికి తెలుసు. జులై 17 నుంచి నేను అక్కడే వున్నాను. అక్టోబర్‌ 6వ తారీకున విజయవాడలో జమ అయిన వేలమందిని కెఎస్‌ వ్యాస్‌ లాఠీచార్జి చేసి చెదరగొట్టి కత్తి పద్మారావుగారిని విశాఖపట్నం సెంట్రల్‌ జైల్‌ కి తరలించిన తర్వాత, ఇంక లీడర్స్‌ ఎవరూ లేరు, ఉద్యమం చల్లారిపోయింది, బయటవాళ్ళు అందరూ వెళ్లిపోయారు అని పోలీసులు అనుకుంటున్న సందర్భం. లీడర్స్‌ అందరినీ అరెస్టు చేశారు. ఆరెస్యూ స్టూడెంట్స్‌, యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులు అందర్నీ అరెస్ట్‌ చేసేశారు. తారకంగారి మీద మీసా కేసు పెట్టడంతో ఆయన కూడా అండర్‌ గ్రౌండ్‌ లోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితిలో ఉద్యమాన్ని లీడ్‌ చేయాల్సిన బాధ్యత నా మీద పడిరది. నేను జనంలో జనంగా వున్నందున నన్ను బయటి వ్యక్తిగా ఎవరూ పోల్చుకోలేకపోవటం వల్ల. అక్టోబర్‌ 27వరకూ నేను మెయిన్‌ శిబిరంలోనే వున్నాను.
కారంచేడు బాధితులతో పాటు లాఠీ దెబ్బలు తిన్న మేమందరం మళ్లీ శిబిరానికి చేరుకున్నాం, అక్టోబర్‌ 6 నుంచి 27 వరకూ రహస్యంగా సమావేశాలు, అందర్నీ మొబలైస్‌ చేసుకుంటూ 600 మందితో ముఖ్యంగా మహిళా బాధితులతో హైదరాబాద్‌ రావటం జరిగింది. ఎన్టీఆర్‌ ఇంటి ముందు ఆయన బయటకు వచ్చి మాట్లాడే వరకూ ధర్నాకి కూర్చున్నాము. మాకు అన్ని విధాలా డైరెక్షన్‌ తారకంగారే! ఆ జనంలో, తెల్ల బట్టల్లో ఆయన తళుక్కుమని కనిపించగానే నా మొహంలో కనిపించిన వెలుగు, ఆ సంతోషం చెప్పలేనిది.
నా సంతోషాన్ని ఆ తర్వాత మాప్‌ టివి వాళ్లతో పంచుకున్నాను. ఎంవీఎఫ్‌ వెంకటరెడ్డి గారు నన్ను గంటన్నరపాటు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ లో ఇవన్నీ చెప్పాను. ఆ ఇంటర్వ్యూని అమ్మ కూలంకషంగా విన్నారు. చాలా సంతోష పడిపోయారు. అది విన్న తర్వాత వెంటనే నాకు ఫోన్‌ చేసి, ‘లక్ష్మి నువ్వు ఎంత బాగా చెప్పావు, కారంచేడు ఉద్యమం మొత్తాన్ని తిరిగి కళ్ల ముందుకి తీసుకు వచ్చావు, తారకంగారి గురించి ఎంత చక్కగా వివరించావు, నేను అసలు మర్చిపోలేకపోతున్నాను, నువ్వు రాయాలి, తారకంగారు కూడా అలాగే అశ్రద్ధ చేశారు, నువ్వు కూడా అశ్రద్ధ చేస్తున్నావు, వాస్తవ చరిత్ర ప్రజలకి తెలియాలి, ఎవరో వోన్‌ చేసుకుని కారంచేడు ఉద్యమ నాయకులుగా చెలామణి అవటం కాదు, ఈ ఉద్యమంలో ఇంత త్యాగాలు, పోరాటాలూ చేసిన మీరందరూ కూడా చరిత్రని రాయకపోతే, వాళ్లు చెప్పిందే చరిత్ర అనుకుంటారు, అదే చరిత్ర అనుకుంటారు, ఎన్నో విషయాలు మాప్‌ టీవీలో వెలికితీసుకు వచ్చావు, నాకు చాలా సంతోషం అనిపించింది’ అని చాలాసేపు చెప్పారు. నువ్వు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా గ్రంధస్థం చేయాలి, రాయాల్సిందే అని అమ్మ నాతో చివరి వరకూ పోరాడుతూనే వున్నారు. నేను ఉద్యమకారిణిగా, సామాజిక అంశాలలో ఈనాటి వరకూ బిజీగా వుండటంతో కలం పట్టుకుని రాయటానికి కుదరలేదు. అమ్మ ఈ విషయంలో ఎంత పోరాడినా గానీ నేను అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ అమ్మ కోసం ఎప్పటికైనా సరే, తారకంగారితో, అమ్మతో, ఆ కుటుంబంతో, కారంచేడు ఉద్యమంతో నాకున్న అనుబంధాన్ని, అనుభవాలను తప్పకుండా రాస్తాను. వివరంగానే రాస్తాను. అమ్మకోరిక అది.
అమ్మని ఆఖరిగా కలిసింది బాడీ డొనేషన్‌ కి సంబంధించి వివరాలు తీసుకోవటం కోసమే. అప్పటికే రాయలేకపోతున్నారు గానీ ఒక భూతద్దం పెట్టుకుని కష్టపడుతున్నారు. అక్షరాలు సరిగా కనిపించటం లేదు. ఒక హెల్పర్‌ ఎవరైనా సహాయంగా వుంటే రాద్దాము, తన ఆలోచనలను పేపర్‌ మీద పెడదాము అని ఇంకా తపన పడుతూనే తాపత్రయ పడుతూనే వున్నారు. తాను రాసిన కాగితాలూ, అముద్రితంగా వున్నవి కొన్ని ఇచ్చి వీటిని పబ్లిష్‌ చేయాలి అని అన్నారు. కవర్లో పెట్టి నాకు ఇచ్చారు. నేను తప్పకుండా బుక్‌ వేసినప్పుడు నేను వీటి గురించి రాస్తాను అని భద్రంగా తీసుకొచ్చి వుంచాను. అమ్మను నేను అదే కలవటం, అదే చివరిసారి అయిపోయింది. తర్వాత అమ్మ లేరనే విషయాన్ని డా. మహిత నాకు ఫోన్‌ చేసి చెప్పగానే యుద్ధ ప్రాతిపదికన నేను అమ్మని చివరిసారి చూడటానికి రావటం, నివాళులు అర్పించడం జరిగింది. అశేషమైన అభిమానులు, అన్ని ప్రజాసంఘాల వాళ్లు, హక్కుల సంఘాల వాళ్లు, ఎంతోమంది ప్రజాస్వామికవాదులు, ఆత్మీయుల కన్నీటి వీడ్కోలు మధ్య అమ్మని గాంధీ మెడికల్‌ కాలేజీకి అప్పగించటం జరిగింది. నాకున్న ఇంకొక మరపురాని జ్ఞాపకం, కాటంరాజు, అతని భార్య స్వర్ణ, నేనూ కలిసి అమ్మతో పాటు ఆ అంబులెన్స్‌ లో ఆవిడను చూసుకుంటూ ఆవిడతో ఆ చివరి ప్రయాణం చేయటం మరిచిపోలేని అంశం. అమ్మ జ్ఞాపకాలు మనసు నిండా ముప్పిరిగొన్నాయి. అమ్మ ప్రేమ, అమ్మ సాహిత్య కృషి, అమ్మ సామాజిక అవగాహన, ముఖ్యంగా అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే పట్ల ఆవిడకున్న పర్స్పెక్టివ్‌ నన్ను ఈ లైన్‌ లోకి తీసుకువచ్చాయి. అమ్మ గైడెన్స్‌ తోనే సావిత్రీబాయి ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ పెట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో చదువుకు దూరమవుతున్న వందలాదిమంది పేదబిడ్డలను చేరదీసి ముఖ్యంగా ఆడపిల్లలను, ఆర్ఫన్‌, సెమి ఆర్ఫన్‌ పిల్లలను చదివించడం జరుగుతోంది. ఆడపిల్లలకు చదువు ముఖ్యమని అమ్మ ఎప్పుడూ నాతో అనేవారు. ప్రతి విషయాన్ని అమ్మతో స్వేఛ్ఛగా షేర్‌ చేసుకోవడం నాకు అలవాటు. నా ప్రతీ కష్టం వెనుకా అమ్మ వెన్ను దన్నుగా వున్నారు. ఉద్యమ ఒడిదుడుకులు, నా జీవిత సహచరుడి విషయంలో ప్రభుత్వపరంగా, కోర్టు పరంగా, రాజ్యం పరంగా ఎదుర్కొన్న హింస అణిచివేతలు, అవి నాపై చూపించిన దుఃఖాన్ని, బాధను కేవలం అమ్మ దగ్గర మాత్రమే నేను ఓపెన్‌ అయి చెప్పుకునేదాన్ని. ఒక బిడ్డ ఎలా అయితే తల్లితో చెప్పుకో గలుగుతుందో అలా చెప్పుకునేదాన్ని. విజయభారతిగారు నా సామాజిక చింతనా మాతృమూర్తి అయితే, తారకంగారు నా ఉద్యమ మార్గదర్శి. చివరివరకూ కూడా వారిచ్చిన ప్రేమనూ, ఆప్యాయతను, స్ఫూర్తిని మర్చిపోలేను. వారిచ్చిన ఆశయాల కోసం పనిచేయటమే వారి స్మృతికి ఇచ్చే వినమ్ర నివాళి అని భావిస్తున్నాను.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.