ముఖాముఖి కన్నా ఉత్తరాల ద్వారా, టెలిఫోన్ ద్వారానే డా. బోయి విజయభారతి గారు పరిచయం. దశాబ్దంన్నర క్రితం తనను నేరుగా కలిసినప్పుడు ఇంత మృదువుగా, ఆప్యాయంగా వీరు ఉంటారా అని అనిపించింది!
మూడున్నర దశాబ్దాల క్రితం నాకు తెలుగు అకాడమీ ఉత్తరం ద్వారా ఆవిడ పరిచయం. నేను ఆకాశవాణి పణజి (అంటే గోవా) కేంద్రంలో పనిచేసే కాలంలో తెలుగు అకాడమీ వారి ‘తెలుగు’ వైజ్ఞానిక మాసపత్రిక కోసం నార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘నవయుగాల బాట’ పద్యాలకు సంబంధించి రాసిన ఒక సుదీర్ఘ వ్యాసం ప్రచురణకు ఆమోదించినట్టు తెలియజేస్తూ నాకు వచ్చిన పోస్ట్ కార్డు మీద ఆమె సంతకం తొలిసారి గమనించాను. ఆ తేదీ నాకు గుర్తులేదు, ఉత్తరం కూడా ఇప్పుడు అందుబాటులో లేదు. కానీ ఆ వ్యాసం ప్రచురణ అయింది 1989 డిసెంబర్ నెల` అంటే ఆ ఉత్తరం అంతకుముందే నాకు చేరి ఉంటుంది. అప్పటికి స్థిరమైన ఉద్యోగంలో చేరి ఒకటిన్నర సంవత్సరం అయింది కనుక రచనావ్యాసంగం పట్ల నేను కొంత దృష్టి నిలిపే సమయం కూడా అదే. అంతకుమించి నార్ల వెంకటేశ్వరరావు రచనలు ఒక అరడజను దాకా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే మా హిందూపురంలోని ఎస్.డి.జి.ఎస్ కాలేజీ లైబ్రరీ కారణంగా చదివి, వాటి ఆధారంగా నోట్స్ చాలా రాసుకున్నాను. హేతుబద్ధంగా, తార్కికంగా నార్ల వాదించే విధానమూ, దానికి ఆయన వేమన రీతిలో అలవోకగా పద్యాన్ని సృజించడమూ నాకు మహా ఇష్టంగా ఉండేది. ఆ సుదీర్ఘమైన వ్యాసాన్ని నేను ఎంఎస్సీ చదివే కాలంలో అంటే నార్ల వెంకటేశ్వరరావు చనిపోయిన తర్వాత (1984-85 సమయంలో) రాశాను. పేరెన్నిక కన్న, వివాదాస్పదమైన ప్రముఖ ఎడిటర్ చేసిన పద్య రచన గురించి సుమారైన నిడివిగల కొత్త రచయిత సాహిత్యవ్యాసాన్ని దిన, వారపత్రికల్లో ప్రచురించే అవకాశం చాలా తక్కువ. కనుక ఈ వ్యాసం ‘తెలుగు’ మాసపత్రికలో ప్రచురణ అనేది నా వరకు నాకు చాలా విలువైనది, తృప్తి కలిగించింది. ఈ కారణంగా డా. విజయభారతి కూడా బాగా గుర్తుండిపోయారు.
అది మొదలు అప్పుడప్పుడు పర్సనల్ ఉత్తరాలు రాసే సాన్నిహిత్యం లభించింది. తర్వాత 1991లో అనంతపురం వచ్చాక ఫోన్లో మాట్లాడుకున్న సందర్భాలు కూడా బాగానే ఉన్నాయి. తర్వాతనో, ముందుగానో ఇప్పుడు గుర్తులేదు కానీ, విజయభారతి తను డా॥ బి.ఆర్.అంబేడ్కర్ గురించి రాసిన పుస్తకాన్ని నాకు పంపారు. ఆమె అనుమతితో ఆ రచనను ఆకాశవాణి అనంతపురం కేంద్రంద్వారా ధారావాహిక పుస్తకపఠనంగా ప్రసారం చేశాం. ఆమె ఉత్తరం చాలా కాలం నా అనంతపురం ఆకాశవాణి ఆఫీస్ ఫైల్‌లో ఉండిరది. అంతేకాదు ఆకాశవాణి పారితోషికాన్ని కూడా తిరస్కరించి, దాన్ని సేవగా భావించారు. సాహితీవేత్త బోయి భీమన్న పెద్ద కుమార్తె అని గాని, న్యాయవాది బొజ్జా తారకం సహచరి అని గాని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ విషయాలు మా సంభాషణలలో ఎప్పుడూ తారస పడలేదు కనుక తెలియలేదు. 2004లో విశాఖపట్నం బదిలీ అయిన తర్వాత మా ఆకాశవాణి సహోద్యోగి శ్రీమతి పావని, పెద్దలు బొజ్జా తారకం బంధువు అని తెలుసుగానీ ఆమె డా విజయభారతికి బంధువు అవుతారని నాకు అప్పటికి తెలియదు. కడసారి చూపు కోసం వెళ్ళినప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన పావని గారిని కలిసాను. తర్వాత ఇతరుల రచనలలో కాకతాళీయంగా ఈ విషయాలు బోధపడ్డాయి.
కొంతకాలం క్రితం ఫోన్లో మాట్లాడడమే చివరి కలయిక. వారు 28 సెప్టెంబర్, 2024 ఉదయం గతించారనగానే చాలా అర్థవంతమైన ప్రయోజనకరమైన జీవితాన్ని గడిపిన మహాతల్లి విజయభారతి గారని అనిపించింది. వారి అబ్బాయి రాహుల్ బొజ్జా ఇంట్లో అంతిమ నివాళులు అర్పించి వచ్చాను. అది ఉమానగర్ ప్రాంతం. అంటే ఆ చోటుకూ మేమున్న బ్రాహ్మణవాడికి రైలు పట్టాలే అడ్డంకి. ఆరేళ్ళుగా ఇంత దగ్గరగా ఉన్నా డా.విజయభారతి గారిని నేరుగా కలిసి, వారు చెప్పిన విషయాలు తెలుసుకునే అవకాశం కోల్పోయాను కదా అని కించిత్ ఖేదం కూడా కలిగింది. ఈ సమయంలో మహానగర నివాసిగా నాకున్న ఒక మూఢవిశ్వాసం గురించి కూడా అవగాహన కలిగింది. ఇది చాలా పెద్ద నగరం, ఇక్కడ మనుషులను కలవడం చాలా చాలా కష్టమనే అభిప్రాయం నాలో ఎంతగానో స్థిరపడిపోయింది. లేకపోయి ఉంటే విజయభారతి గారు కుమారుడి ఇంటికి వచ్చినప్పుడు, కాలినడకన వెళ్లి కలిసి ఉండేవాడిని. వయసు పైబడిన అనుభవజ్ఞులను ఏమాత్రం అవకాశం కలిగినా కలిసే అవకాశాన్ని వదలుకోను. ఎందుకంటే అలా కలవాలని అనుకున్న వారు కనుమరుగైన సందర్భాలు కూడా బాగానే ఉన్నాయి. పుస్తకాల ద్వారా తెలియని లేదా ఏర్పడిన దీవుల వంటి సమాచార లోపాన్ని ఇలాంటి అనుభవజ్ఞులు సులువుగా పూరిస్తారు.
డాక్టర్ విజయభారతి తన అధ్యయనం, పరిశోధనల ద్వారా తెలుగు సాహిత్యానికి లోతైన, సమగ్రమైన చూపును అందివ్వగలిగారు. వారి ‘దక్షిణ దేశీయాంధ్ర వాజ్మయం-సాంఘిక జీవనం’ సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’కు అద్భుతమైన కొనసాగింపే కాదు, పటిష్టమైన పూరణ. జీవించిన కాలం, రచయిత సామాజిక నేపథ్యమనేవి సురవరం వారి రచనకు పరిమితులయితే కల్పించి ఉండవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో బాల్యం గడిపి, తర్వాత భాగ్యనగరానికి వచ్చి, అట్టడుగు వర్గాల సామాజిక నేపథ్యమున్న మహిళగా విజయభారతి చేసిన పరిశోధన సురవరం ప్రతాపరెడ్డి కొనసాగించిన పరిశోధనాకృషికి అద్భుతమైన జోడిరపుగా, పూరకంగా మారింది. ఈ విషయాన్ని సాకల్యంగా ఇప్పుడు గమనించినా గమనించకపోయినా ముందు ముందు మరింత అధ్యయనం చేయక తప్పదు. ఆ మేరకు ఇంకొంత కీర్తి సంపద విజయభారతికి సొంతమవక మానదు.
విజయభారతి నుంచి మనందరం అదనంగా నేర్చుకోవలసిన అంశాలు నమ్రత, మృదుభాషణం. సంస్కృత పండితుల నుంచి ఇప్పటి కాలపు హేతువాదం, ప్రగతిశీల మార్గం వగైరా ధోరణులతో పాటు కులం, వయసు, వృత్తి, హోదా వంటి వాటితో ఎంతోమంది గౌరవప్రదంగా కనబడుతూనే ఉంటారు. అయితే ఎదుటివారు తమకన్నా ఏ విషయంలోనైనా తక్కువ స్థాయిలో ఉన్నారని వారు నిర్ణయించుకోగానే ఒక రకమైన తిరస్కారం, హేళన, అధికారం వంటివి వారి మాటలను పెళుసుగా, దురుసుగా మార్చేస్తూ ఉంటాయి. ఇలాంటి వైఖరికి పూర్తి కారణాలు ఏమిటో నాకు ఇంకా బోధపడలేదు. కానీ డా. విజయభారతి పాటించిన వైఖరి వారి పాండిత్యానికి, పరిశోధనకు కూడా వన్నెతెస్తుంది. ఈ విషయం ఆమె జీవితం నుంచి సులువుగా నేర్చుకోవచ్చు.