బోయి విజయ భారతి గారిని చూడడం అదే మొదటి సారి. నా సహచరుడు బొజ్జ తారకం గారి వద్ద అతి కొన్ని నెలలు మాత్రమే అప్రెంటిషిప్ చేయడం వలన ఒకసారి వాళ్ళింటికి వెళ్లడం జరిగింది. అప్పుడు ఆమెతో అయిన పరిచయం ఆవిడ గారు జీవించి ఉన్నంత వరకు నిలకడగా అలాగే ఉంది. ముఖ్యంగా ఆవిడ మృదుభావిని. మంచి ఆత్మీయురాలు.
చాలసార్లు ఆవిడను అనేక సభల్లో పలకరించడం వలన ఆవిడ ఎప్పుడైనా నేను కనబడగానే ఏమ్మా! విజయా! ఎలా ఉన్నావు? ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ అతి సున్నితంగా పలకరించేవారు. వారు రాసిన ాసావిత్రిభాయి ఫూలే్ణ చదివి మరొకసారి వాళ్ళింటికి వెళ్లడం జరిగింది. ఆమెతో అనేక గంటలు గడిపి ఆమె చెప్పే ప్రాచీన సాహిత్యంలోని స్త్రీల పత్రాలు, విడమరచి చెబుతుంటే ఆశ్చర్యంగా వినేదాన్ని. ఆమె అంబేద్కర్ రాజ్యాంగంలో స్త్రీలను ఎలాంటి చట్టాలు, హక్కులు ఉండాలో రాసిన విషయాలు చెబుతుంటే ఆమె ఒక పెద్ద నిఘంటువు అనిపించేవారు. నా మొదటి కథల పుస్తకం ాగణిక్ణకు ముందుమాట రాయవల్సిందిగా ఆవిడ దగ్గరికి నేను వెళ్ళాను. తప్పకుండా రాస్తాను. విజయా! అంటూ ఆవిడ రెండు రోజులు కూడా గడవకుండా ావిజయ్ణ వచ్చి నీ ముందుమాట తీసుకుని వెళ్ళమని ఫోన్ చేసారు. ఏంటి మేడం ఇంతా త్వరగా రాసేశారు. ఒక్కొక్కరు ముందుమాట రాయడానికి ఒకటి నుండి ఎన్ని నెలలు తీసుకుంటారో తెలియదు. అలాంటిది ఇంత త్వరగా ఇచ్చారు అని ఆశ్చర్యపోతూ అడిగితే అందులో ఏముందమ్మా! కథలు చదివాను చాలా బాగున్నాయి. అన్నిటిలో నీ శ్రమ, నీ తపన, నీ పోరాటం కనబడిరది. ఒక రోజు చదివాను. పాయింట్స్ గుర్తు పెట్టుకొని మరునాడు రాసేసాను. అందులో నా గొప్పతనం ఏం లేదు. నీ కథలు అలా చదివించాయి. కథల్లో ఏముందో పాఠకులు చెప్పాలి. ఆ కథలు రాయడం వెనుక నీ శ్రమ ఎంతో నేను చెప్పాలని అనుకున్నాను. అదే చెప్పాను. నీకు నచ్చితే వేసుకో! లేకుంటే వద్దు… అన్నారు. అయ్యో! మేడం అలా అంటారేంటి? నేను మీరే రాయాలని ఎందుకు కోరుకుంటాను అని అడిగితే … నీ అభిమానం అమ్మా! కథలు బాగున్నాయి వదలకుండా రాస్తూ ఉండమ్మా! అన్నారు. ఆ తర్వాత ఆమె చాలా అనారోగ్యంగా ఉండడం వలన, కళ్ళు ఎక్కువగా కనబడకపోవడం వలన పెద్దగా బయటకు వచ్చే వారు కాదు. అలాంటి సమయాల్లో నేను డా. సమతా రోష్ని గారు కలిసి నాలుగైదు సార్లు వెళ్లి ఆమెతో కబుర్లు చెప్పి వచ్చేవాళ్ళం. నేను ాస్వయంసిద్ద్ణ సింగిల్ ఉమెన్ కాన్సెప్ట్ మీద కథలు రాయిస్తున్నాను అని చెప్పినప్పుడు వారు ఎంతో సంతోష పడ్డారు. మంచి సబ్జెక్టు తీసుకున్నావు విజయా! ఓపిక ఉంటే సభకు వస్తానమ్మా అన్నారు. కానీ ఆమె అనారోగ్యం ఆవిడను రానీయలేకపోయింది. అంతకు ముందు ఒకసారి అమ్మా! రవీంద్ర భారతిలో మీటింగ్ అంటే లిఫ్టులో ఎలా అలా రాగలను. కానీ, అక్కడ మహిళలకు పైన టాయిలెట్స్ లేవమ్మా! అక్కడికి వెళ్లాలంటే భయంగా ఉంది. నాకేమో వయసు రీత్యా చాలా కష్టం అమ్మా రాలేను అన్నారు. ఆ సమయంలో నేను ామామిడి హరిక్రిష్ణ గారికి్ణ ఇదే విషయం చెప్పడం జరిగింది. అవునా! అంత పెద్దావిడ అలా అనడం అంటే తప్పకుండా చేయిస్తా అని మొదటి అంతస్తులో టాయిలెట్స్ ను బాగు చేయించారు. అదే విషయం ఆవిడకు చెబితే అవునా? అమ్మా! ఆ అబ్బాయి మంచి వాడమ్మా! అని అన్నారు. అలాంటి అల్ప సంతోషి, మేధావి మహిళల పక్షం వహించి తన ఆలోచనలను, అభిప్రాయాలని నిక్కచ్చిగా చెప్పడంలో ఆమె ధైర్యశాలి. ధీశాలి.. వారి పరిపూర్ణ జీవితం జీవించిన గొప్ప మహిళా. వారి మరణం జీర్ణించుకోలేనిది. వారికి నా హృదయపూర్వక జోహార్లు! చెబుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.