జీవితం ఒక నాటకరంగం, మనమందరం అందులో పాత్రధారులం. ఇలా అనుకుంటే తమ పాత్రను తాము అర్థం చేసుకుని ఘనంగా పోషించేవారు, ఈ జీవిత రంగస్థలిపై బాగా రాణిస్తారు. ఇక్కడ రాణిస్తారు అంటే, తాము అనుకున్న ఫలితాలు సాధిస్తారు అని, ఆ ఫలితాలు (ఇతరులకూ లేదా) సమాజానికి పంచుతారని అర్థం.
అందుకు తమ సామాజిక, వ్యక్తిగత పరిమితులేవో కూడా బాగా అవగాహన కలిగిఉండాలి. డాక్టర్ విజయభారతి అమ్మగారు ఇందుకు సమీప ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఆమె దళిత కులంలో పుట్టారు. అందునా మహిళగా పుట్టారు. మరి ఆర్థిక, సాంఘిక, జెండర్ సంకెళ్లు ఆమె జీవితాన్ని చుట్టచుట్టుకుని ఉన్నట్లే కదా! ఇవి పరిమితులే. తన సహచరుడు సామాజిక ఉద్యమకారుడు అయి ఉండడం కూడా తనకొక పరిమితే. వీటన్ని మధ్య, మరిన్ని అవరోధాల మధ్య తన ఉద్యోగం ఎలా నిర్వహించాలో బాగా తెలుసుకున్నారు, అది నిర్వహిస్తూనే అదే స్థానం నుంచి తను సద్దూ చప్పుడూ లేకుండా ఎలా ఎదిగిరావొచ్చో తెలుసుకున్నారు. ఇంటా, బయటా మంచి సమన్వయకర్తగా వ్యవహరించారు. దీనివల్ల ఆమె ఉన్నత విద్యావంతురాలుగా ఉండడమే కాదు, తన పిల్లల్ని సమాజానికి తమ తమ స్థాయిలలో నాయకత్వం వహించే విద్యావంతులుగా నిలిపారు. తను సామాజిక ఉద్యమాల్లో నేరుగా భాగస్వామ్యం వహించే అవకాశం లేకపోయినా, అలాంటి భాగస్వామ్యం ఉన్న తన సహచరుడికి చేదోడు వాదోడుగా నిలిచారు. ఇన్ని పనులు చేస్తూ మనకేమిచ్చారంటారా? ఆణముత్యాల్లాంటి రచనలు అందించారు. అవి ఎంతటి ఆణిముత్యాలో వాటి మెరుపులను బట్టి తెలుస్తోంది. దేశం నేడు సాంస్కృతిక ఘర్షణలో ఉంది, భావజాల సంఘర్షణలో ఉంది. ఇలాంటపుడు మనకు కావాల్సిన మెరుపులను ప్రతికూల శక్తులపై పోరాటానికి స్ఫూర్తిగా ఆమె రచనలనుంచి అందుకోవచ్చు అని వేరే చెప్పవలసినపనిలేదు. మరొకవైపు, తండ్రి కవిగా ప్రసిద్ధుడైనపుడు, సహచరుడు సామాజిక ఉద్యమకారుడుగా, మేధావిగా ప్రసిద్ధుడైనపుడు వారి ప్రభావం నుంచి బయటపడడం కష్టమే కదా! కష్టమే అయినా, ఆక్రమ పరిణామంలో స్వీయవ్యక్తిత్వం గల మనిషిగా స్ధానం సాధించారు. ఇదివరకు ప్రస్తావించిన సమున్నతపాత్రను పోషించారు.
మనకు కానుకలు డాక్టర్ అంబేడ్కర్, మహాత్మాఫూలే జీవితచరిత్రలు
శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత ప్రగతి సాధించినా మానవ జీవితంపై మత విశ్వాసాల పట్టు బాగానే ఉందని గుర్తించారు భారతమ్మగారు. శ్రీలంకకు తొలిబౌద్ద విగ్రహం ఇండియా నుండే వెళ్లిందని, దేశంలో శాస్త్ర విజ్ఞానమూ జౌనబౌద్ధాలనుండే విస్తరించిందని తన రచనల ద్వారా ప్రచారం చేసారు. ఆమెను గుర్తు పెట్టుకోవలసింది, భారతదేశం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రచనను తెలుగు వారికి అందించి, ఆ రచన పలు ముద్రణలు పొందేలా పాపులర్ అయిన రచయిత్రిగా. ఇంకా చెప్పాలంటే, తొలిసారి మహాత్మా జ్యోతిరావుఫులే జీవిత చరిత్రను, బహుజన నేత గౌతులచ్చన్న గారి నేతృత్వంలోని మహాజన వారపత్రికలో ధారావాహికగా సంవత్సరం పైగా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువదించి, తెలుగు ప్రజలలో స్ఫూర్తిని రగిలించిన రచయిత్రిగా. సత్యహరిశ్చంద్రుడు, దశావతారాలు, షట్చక్రవర్తులు, వ్యవస్థను కాపాడినరాముడు, పురాణాలుా మరోచూపు .. ఆమె విశిష్ట రచనలుగా అందరం తప్పక చదువుకోవాలి. అవి చదవడం వల్ల వచ్చిన చూపుతో భారత చరిత్రను నిర్మించడానికి మనవంతు కృషి చేయాలి.
ఒక జ్ఞాపకం: నేను హైదరాబాద్ నగరానికి వచ్చిన కొత్తలో ఓ అద్దె ఇంటికోసం వెతుకుతూ పోతుండగా, టోలిచౌకిలో రోడ్డుపక్కను ‘బొజ్జాతారకం’ అని బోర్డు ఉన్న ఇంటికి వెళ్లాను. అమ్మగారిని మొదటిసారి చూడడం అదే. తారకంసారు విశాఖలో ఉన్నారని చెప్పారు. అప్పుడే సెల్‌ఫోన్లు ప్రవేశిస్తున్నాయి. సారుతో అప్పుడే మాట్లాడాను. అనంతరం, తారకంసారుతో ఉన్న ఉద్యమ అనుబంధాన్ని పరిచయం చేసుకున్నాను. మెల్లగా వచ్చే మాటలతో, సాహిత్య సంగతులతో, తేనీటితో ఆ తొలి సమావేశం అలా జరిగింది. తరువాత మొన్నమొన్నటి వరకు చిన్నచిన్న సమావేశాల్ల్లో కూడా, శ్రోతల్లో కూర్చుని, వక్తల ప్రసంగాలు శ్రద్ధగా వింటున్న ఆ విద్యాధికురాలిని గమనించాను. మరణానికి వారం క్రితమే, పురాణాలపై ఆమె రచనలు రెఫర్ చేయవలసిన అవరసరం తలుపు తట్టగా, పెద్దామెను కలిసి చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను. పెద్దలు సామాజిక కార్యకర్త గనుముల జ్ఞానేశ్వర్ గారితో తెలిపాను. ఇద్దరం కలిసి వెళ్లాలని కూడా అనుకున్నాము. వూహు… కలవలేకపోవడమే బాధగా మిగిలింది. ఉద్యమకారులు బొజ్జాతారకం గారితో, ప్రత్యేకించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు కార్యమాలలో పాల్గన్నానే గానీ, అమ్మగారితో చాలా తక్కువగానే కలిసానని, ఎన్నో పురాణ సాహిత్య విశేషాలు మాట్లాడలేకపోయానే అనే లోటు మిగిలింది. ఎంత మెల్లిగా మాట్లాడుతారో, అంత సరళంగానూ, సూటిగానూ, ఎలాంటి విశేషణాలు లేకుండానూ రాసే ఆమె రచనా శైలిని గుర్తు చేసుకుంటూ… పెద్దామెకు నివాళి.