‘‘వివక్ష’’ – డా. మజ్జి భారతి

సీరియస్సుగా ఓపీ పేషెంట్లను చూస్తుంటే, సెల్యూట్‌ చేసి నిలబడ్డాడు పోలీస్‌ కానిస్టేబుల్‌.
‘‘యాక్సిడెంటా, కొట్లాటా?’’ తలెత్తకుండానే అడిగాను. ఓపీ చేంతాడంత వుంది మరి. బదులుగా ఒక కాగితం చేతిలో పెట్టాడు. సారాంశం… అనుమానితున్ని, బయటకు తరలించడంలో యిబ్బందులున్న దృష్ట్యా, నన్నే కోర్టుకొచ్చి, ఒక పేషెంటుని పరీక్షించవల్సిందిగా మేజిస్ట్రేట్‌ దగ్గర నుండి వచ్చిన కాగితమది. ఇలా రావడం, నా సర్వీసులో యిదే మొదటిసారి.

నా భ్రుకుటి ముడిపడిరది.
మూడు రోజుల నుండి, ఈ ప్రాంతంలో అట్టుడికిపోతున్న నక్సలైట్ల ఏరివేత కార్యక్రమానికి, దీనికి యేమైనా సంబంధముందా? పోలీసులకు సంబంధమున్న కేసుల్లో, కేసుని చాలా జాగ్రత్తగా డీల్‌ చెయ్యాల్సి వుంటుంది. నిపుణత కలిగిన సాక్షిగా (ఎక్స్పర్ట్‌ విట్నెస్‌) కోర్టుకెళ్లాల్సి వుంటుంది. ఏ చిన్న పొరపాటు చేసినా, పోలీసులతో కుమ్మక్కైన వైద్యురాలన్న అపఖ్యాతి కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఆలోచనలో పడ్డాను.
నక్సలైట్లను పట్టుకోవడానికి కొండ ప్రాంతానికి వెళ్ళిన పోలీసులకు, వారిని అడ్డుకోబోయిన ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణల్లో, కొంతమంది పోలీసులు గాయపడ్డారని, ఆ కోపంతో వాళ్లు దొరికిన వాళ్లను దొరికినట్టు తెచ్చి స్టేషన్లో పడేశారని, పెద్దవాళ్లని అరెస్టు చేసినట్టు చూపించి కోర్టులో హాజరు పరిచారని, పేపర్లో, టీవీల్లో చూస్తూనే వున్నాను. పెద్ద యెత్తున పాల్గొన్న విద్యార్థులను నాలుగు తన్ని, బెదిరించి, యింకోసారి యిటువంటి గొడవలకు దిగబోమని వాళ్లచేత బలవంతంగా రాయించుకొని పంపించేశారని, అనధికార వార్త. ఎంత కొట్టినా, ఒక్కడు మాత్రం, వాడు చేసింది తప్పని ఒప్పుకోవడం లేదట. ‘‘మీరు మా గూడెంలోకి వచ్చి మా వాళ్లను కొట్టారు, కాబట్టి ఎదురు తిరగాల్సొచ్చింది. అన్యాయంగా నన్ను తీసుకొచ్చింది చాలక, తప్పు చేసినట్టు నన్ను రాసివ్వమంటే, నేనెలా రాసిస్తాను? కొట్టుకుంటారా, మీ లాఠీలు విరిగినంత వరకు కొట్టుకోండంటున్నాడని, ఆ అబ్బాయి పేరు కృష్ణుడని, గిరిజన వాసులకు జరుగుతున్న అన్యాయాలను సహించలేక ఇంటర్‌ మధ్యలో ఆపేసి, ఊర్లో బడిపెట్టి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాడని, గొడవ జరిగినప్పుడు ఆ అబ్బాయక్కడ లేకపోయినా తెచ్చి, పోలీసులు చావగొట్టారంటూ జనం అనుకుంటున్నారని… అందులో నిజమెంతంటూ మీడియాలో డిబేట్లు, ఇంటర్వ్యూలు. అందర్నీ కోర్టులో హాజరు పరిచామని, రూల్స్‌ ప్రకారం నడుచుకుంటున్నామని సిఐ స్టేట్మెంట్‌ కూడా యిచ్చాడు. మరిప్పుడీ మేజిస్ట్రేట్‌ తాఖీదు దేనికోసం? ఓపి కేసుల్ని యింకొక డాక్టరుకి అప్పచెప్పి, అసిస్టెంటుని తీసుకొని బయలుదేరాను.
ఆ కృష్ణుడిని బాగా చితక్కొట్టేశారట. వాడిప్పుడు లేవలేకపోతున్నాడట. అరెస్ట్‌ చూపించలేక, పోలీస్‌ స్టేషన్‌ ముందు వాడికోసం ధర్నా చేస్తున్న గిరిజనవాసులు చూస్తుండగా కృష్ణుడిని విడిచి పెట్టలేక, దొంగ కేసు బనాయించి… తనింట్లో దొంగతనం జరగబోతుంటే చూసి పట్టుకున్నానని, ఒకడి చేత కంప్లైంట్‌ యిప్పించి, దొంగ తన మీద కర్రతో దాడి చెయ్యబోతే, ఆత్మరక్షణ కోసం తానూ దొంగ మీద దాడి చేసి పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పించి, కావల్సిన ఆధారాలు సృష్టించి, ఆ పిల్లాడిని జువినైల్‌ కోర్టులో హాజరు పరిచారని… అసిస్టెంట్‌ నా చెవిలో వూదాడు.
నేను వెళ్లేసరికి ప్రజాహక్కుల సంఘాలు, మీడియా కూడా అక్కడే వుంది. మొన్న అందరితో పాటు గూడెం నుండి తెచ్చారు, యిప్పుడు దొంగతనం మోపారు, రేపు యింకేమి చేస్తారో! కృష్ణుడిని చూపించాలి. పోలీసుల నుండి రక్షణ కల్పించాలని, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు… అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా వుంది. అదనపు బలగాలున్నాయి. ఐనా, యే నిముషం యేమి జరుగుతుందోనని, పోలీసులు భయపడుతున్నారన్న విషయం అర్థమవుతోంది.
… … …
కుర్రవాడని ముందే తెలిసినా, ఆ అబ్బాయిని చూడగానే చలించిపోయాను. నూనూగు మీసాల వాడు, ముఖం చూస్తే ముద్దొస్తున్నాడు. ఆ చూపుల్లో లెక్కలేనితనం. నన్ను చూసి కూడా ఓ నిరసన, మీరంతా ఒకటే అన్నట్టు. పలకరింపుగా నవ్వబోతే, ముఖం తిప్పుకున్నాడు. పన్నెండేళ్ల తన కొడుకు గుర్తుకొచ్చాడు. కోపమొస్తే వాడూ అంతే. ముఖం తిప్పేస్తాడు. ఒంటినిండా దెబ్బలు, చర్మం చిట్లని ప్రదేశం లేదు. దెబ్బలు ప్రమాదకరమైనవి కావు. కాని, గాయాలు మానడానికి చాలా కాలం పడుతుంది. కారణమేమీ లేకుండానే అన్ని దెబ్బలు కొడుతుంటే, ఆ అబ్బాయి మనసెంత రగిలిపోయిందో? దాన్నుండి కోలుకోవడానికెన్నాళ్ళు పడుతుందో!
‘‘పేషెంటుని ఎగ్జామిన్‌ చెయ్యాలి. అందరినీ బయటికి పంపించు’’ అసిస్టెంటుకి చెప్పాను.
‘‘మేడమ్‌! వాడు చాలా డేంజరస్‌’’ అభ్యంతరం చెప్పాడు ఎస్సై. ఈ మధ్యనే ఇక్కడికి బదిలీమీద వచ్చాడు. ఇదే మొదటిసారి నాతో ముఖాముఖి మాట్లాడడం. ‘‘గట్టిగా బుద్ధి చెప్పకపోతే, వాడి ఫ్యూచర్‌ దెబ్బతింటుందని, మావాళ్ళు కాస్త అతి చేశారు. ఈసారి కొంచెం వదిలెయ్యండంటూ’’ ఫోనులో ఉదయమే మాట్లాడాడు. ఉన్నదున్నట్టు రాయొద్దని, అభ్యర్థనతో కూడిన హెచ్చరిక. పాత ఎస్సై అయితే, చెప్పే ధైర్యం చెయ్యడు, తనేమిటో తెలుసు కాబట్టి. ఇతనికింకా కొత్త. పోలీసువాళ్ళు బయటెంత జులుం చలాయించినా, డాక్టర్ల దగ్గర కాస్త ఒదిగినట్టు నటిస్తారు. రిపోర్ట్‌ యివ్వాల్సింది డాక్టర్లే కాబట్టి.
దెబ్బలను శుభ్రం చేస్తుంటే, నొప్పికి శబ్దం బయటికి రాకుండా ఓర్చుకుంటున్నాడు. ‘‘ఇంత ఓర్చుకుంటున్నవాడివి, యింకొక్క యేడెనిమిదేళ్లు ఓపిక పట్టలేవా?’’ గాయాలకు మందు రాస్తూ అడిగాను.
‘‘ఓపిక పడితే యేమి జరిగిపోతుందేమిటి?’’ నిర్లక్ష్యంగా వచ్చింది జవాబు.
‘‘ఏమో! ఏమైనా జరగవచ్చు. ఎవరు చూడొచ్చారు?’’ దెబ్బల వివరాలు వ్రాసుకుంటూ, వాడి ముఖం చూడకుండానే అన్నాను.
‘‘హాయిగా చదువుకోక, ఎందుకీ అవస్థలు? ఇన్ని దెబ్బలు తినడమవసరమా?’’ అన్న నా ప్రశ్నకు ‘‘హాయిగా చదువుకోవాలా? అక్కడెలా వుంటుందో తెలుసా!’’ ఆవేశంగా అన్నాడు. ‘‘ఇంటి దగ్గరకాదు. హాస్టల్లో…’’ మాట తూలాను. అంతే ఆ అబ్బాయిలో క్రోధం భగ్గుమంది. ‘‘అసలెప్పుడైనా ట్రైబల్‌ హాస్టల్స్‌ యెలా వుంటాయో వెళ్లి చూశారా? అక్కడ ప్రతివాడికీ మేమంటే లోకువే. వాళ్ల బాబు సొమ్ము మాకు ధారపోసినట్టు వాళ్ళ మాటలు. అవి వింటే తినాలని కూడా అనిపించదు. అసలు తినడానికి యేముంటుందక్కడ. పురుగుల అన్నం, నీళ్లలాంటి పప్పు… మీకేమి? యెన్నైనా చెప్తారు. ఆకలెరుగని, అవమానమంటే తెలియని బతుకులు మీవి’’ అన్నాడు ఉక్రోషంగా.
కోపంలో కూడా ఎంత ముద్దొస్తున్నాడో! వీడిని కొట్టడానికి వాళ్లకు చేతులెలా వచ్చాయో! బాధతో మూల్గింది నా మనసు. ‘‘నా ఉద్దేశమది కాదు’’ ఏదో చెప్పబోయాను. ‘‘ఏం తెలుసు మీకు? మీ పల్లపోళ్లు తాత తండ్రుల నుండి దున్నుకుంటున్న భూమి, మీ ఆస్తంటారు. దాన్నేదైనా చేసుకునే హక్కు మీదంటారు. తాతతండ్రుల నుండే కాదు, ముత్తాతల, తాతల కాలం నుండీ కొండలనే నమ్ముకుని బతుకుతున్నాం. ఆ కొండలనే సాగు చేసుకుంటున్నాం. అటువంటప్పుడు అది మా ఆస్తెందుకు కాదు? మేము హక్కుదారులమెందుకు కాదు? క్రింద, పొలాల మీది హక్కు, అనుభవదారులదా? ఆ కొండల మీద హక్కు, ప్రభుత్వానిదా? ఎంత దుర్మార్గం? ఇదేమని అడిగితే దౌర్జన్యమా? మా నేలమీద మమ్మల్నే కూలీల్ని చేస్తూ, ఆకలికాగలేక రెండు పళ్ళు కోసుకుతింటే అది దొంగతనమా? కొండభూమిని సాగు చేస్తే అది చట్ట విరుద్ధమా? అదేమనడిగితే ప్రభుత్వానికి వ్యతిరేకమా? ఎక్కడి న్యాయమిది? అన్యాయమని ఎలుగెత్తినవాళ్లు, మా హక్కుల గురించి మాకు తెలియ చెప్పేవాళ్ళు, తిరుగుబాటుదారులా?’’ ఆ మాటలంటున్నప్పుడు రగులుతున్న అగ్నికణంలా ఆ అబ్బాయి. ఆ అగ్నికణం వెలుగివ్వదు, వెలుగవ్వదు. జీవితాల్ని మసి చేస్తుంది. నిట్టూర్చాను.
నా నిట్టూర్పు ఆ అబ్బాయిలో మరింత ఆవేశాన్ని పెంచింది. ‘‘మా భూమిలో మమ్మల్ని కూలీలను చేశారు. దొంగల్ని చేశారు. రిజర్వేషన్లని, ఫ్రీగా చదివిస్తున్నామని, ప్రభుత్వం మమ్మల్ని అడుక్కున్న వాళ్ళని కూడా చేసింది. ఇవన్నీ చెయ్యమని మేమడిగామా? ఎండకెండాం. వానకి తడిసాం. ఆకలేస్తే పస్తులున్నాం. దేహీ అని యెవర్నీ అడగలేదే! ఎవరిదైనా దోచివ్వమంటున్నామా? మా బతుకు మమ్మల్ని బతకనివ్వమంటన్నాం? దానికింత రాద్ధాంతమెందుకు? మా బతుకు మమ్మల్ని బతకనివ్వక, మీ బాధ్యత మాదని కిందకి దించారు. అక్కడ మమ్మల్నెలా చూస్తారో తెలుసా? మేమేదో ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టేస్తున్నట్టు ‘అదృష్టమంటే మీదేన్రా’, అని మమ్మల్ని పురుగుల్ని చూసినట్టు చూస్తారు.
‘గవర్నమెంటుకి ముద్దుబిడ్డల్రా! మీకోసమెన్ని చట్టాలు, హాస్టల్లు, పిలిచి మరీ ఉద్యోగాలు. ఒడ్డూ, పొడుగూ వున్నావేమో, చదువైపోగానే పోలీసుద్యోగం రెడీరా నీకని’ వేళాకోళాలు. ప్రభుత్వమేసిన ముష్టితో చదువుకొని, ఉద్యోగం తెచ్చుకొని, రేపు నావాళ్ళ మీదే నేను లాఠీ యెత్తాలా?’’ కోపంతో ఊగిపోతున్నాడు వాడు. జరిగింది తలచుకునా? లేక భవిష్యత్తులో జరగబోయేది ఊహించుకునా? నాకర్థం కాలేదు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణ యేనాటికైనా అంతమయ్యేనా? మాట్లాడకుండా గాయాలకు ఆయింట్మెంట్‌ రాస్తున్నాను. వాడి ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వాళ్లకి రిజర్వేషన్లనే తెలుసుగాని, దాని వెనక యెవరికీ తెలియని వ్యథ యింతుందని యిప్పుడే తెలిసింది. వాడిలో రగులుతున్న అగ్ని చల్లారకపోతే, వాడినే కాల్చేస్తుంది. అది వాడికి వెలుగవ్వాలి. మరో నలుగురికి వెలుగునివ్వాలి. ఏ రకంగా సాధ్యపడుతుందది. వాడికి ట్రీట్మెంట్‌ యిస్తున్నంతసేపూ, ఆలోచిస్తూనే ఉంది మనసు.
‘‘నీ ఆవేశంవల్ల నీకు గాని నీ వాళ్ళకి గాని, మేలేమైనా జరుగుతుందంటావా?’’ ఒకపక్క నా పని చేస్తూనే, సంభాషణ మొదలుపెట్టాను. ‘‘అలాగని అన్యాయం జరుగుతుంటే వూరుకోవాలా?’’ ‘‘దెబ్బలే మిగిలాయి కదా!’’ ‘‘నాల్రోజులు పోతే అవే పోతాయి’’ ఒంట్లో వుడుకునెత్తురు.
‘‘ఆ నాల్రోజులే కళ్ళు మూసుకుంటే, నీకంటూ ఓ గుర్తింపు వస్తుందేమో! అప్పుడు నీ మాటకు విలువుంటుందేమో?’’ ‘‘గుర్తింపు తెచ్చుకొని ప్రభుత్వానికి బానిసవ్వమంటారా?’’
‘‘గుర్తింపొచ్చిన వాళ్ళందరూ బానిసలయ్యారంటావా?’’ ఎవరు గుర్తొచ్చారో, సమాధానం చెప్పలేదు. ‘‘ఆలోచించు. నెగ్గాలంటే, యెప్పుడు తగ్గుండాలో కూడా తెలిసుండాలి.’’ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడేమో! ఇనుము వేడెక్కినప్పుడే దెబ్బ వెయ్యాలి. ‘‘ఒకవేళ నీలాంటి వాళ్లే, మీ ఐటిడిఏ కి పీవోలుగా వచ్చారనుకో!’’ వేళాకోళమా అన్నట్టు చూసాడు.
‘‘అహ! వచ్చారే అనుకో! అప్పుడు పరిస్థితులింత అధ్వానంగా వుండవేమో! మీలో ఒకరు ఎస్పీ అయ్యాడనుకో, పోలీసులు యింకొంచెం బాధ్యతగా వుంటారేమో!’’ గాయాలకు కట్లు కడుతూ అన్నాను. జరిగే అవకాశముందని ఆలోచిస్తున్నాడా? వాడి ముఖాన్ని పరికించి చూశాను. ఆలోచనల్లో మునిగిపోయాడు. ‘‘సాయుధ పోరాటమే మార్గమైతే, ఈ సారికెప్పుడో విముక్తి వచ్చుండేది కదా! జరగలేదంటే యెక్కడో పొరపాటుంది. నీలాంటి వాళ్ళైనా బాగా చదువుకొని, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే, మరో నలుగురికి దారి చూపించగలరేమో!’’ వాడి ముఖం చూసాను. సీలింగ్‌ వైపు చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో కనిపిస్తున్నది ఆశేనా! నాలో చిన్న ఆశ.
‘‘నువ్వు మంచివాడివని, తెలివైన వాడివని విన్నాను. నీలాంటి వాళ్ళు చదువుకుంటే, నలుగురికి మంచి జరుగుతుంది. ఏడెనిమిదేళ్లు నీవి కావనుకుని… అన్నిటినీ దిగమింగుకొని… ఒక స్థాయికి చేరుకున్నాక, నువ్వు ఇప్పుడనుకుంటున్నది, కొంతవరకైనా సాధించగలవేమో?’’ నా ఆలోచనలను వెళ్ళబుచ్చాను. ఆలోచిస్తూనే వున్నాడు.
‘‘ఏమంటావు?’’ అన్నాను.
కాస్సేపయ్యాక తల విదిలించుకొని, ‘‘యివన్నీ జరిగేవికావు. అందినట్టే వుంటాయి. అందవు’’ వాడిలో నిస్పృహ. ‘‘గట్టిగా ప్రయత్నిస్తే అందుతాయేమో?’’ నేనొదల్లేదు. ‘‘నా మీద దొంగతనం కేసుందిప్పుడు’’ వాస్తవంలోకి వస్తున్నాడు. ‘‘నీ చదువైనంతవరకు యిటువంటి వాటిల్లో తలదూర్చనంటే, హామీ నేనుంటాను’’ ఉద్యోగం తప్పించి వేరే విషయాల్లో తల దూర్చని నాకు, ఎదుటి వాళ్ల గురించి ఆలోచించమని, మార్గనిర్దేశం చేస్తున్నాడు కృష్ణుడు. అందుకే నాలో ఈ నిర్ణయం. కృష్ణుడి కళ్ళల్లో ఆశ్చర్యం, నిజమేనా అన్నట్టు. తలూపాను. వాడి ముఖంలో ఆనందం. దాంతోపాటు సాధించగలనన్న నమ్మకం.
… … …
కృష్ణుడి ప్రస్తుత పరిస్థితి, వాడి శరీరం మీదున్న దెబ్బలెప్పుడు తగిలాయన్న విషయం, రిపోర్టులో రాస్తే, వీళ్లు దొంగ కేసు బనాయించారన్న విషయం అర్థమైపోతుందని, దానికి పోలీసులు మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని, దాని బదులు యే కేసూ లేకుండా కృష్ణుడ్ని నాకప్పచెప్తే, భవిష్యత్తులో వాడిలాంటివి చెయ్యకుండా నేను షూరిటీ వుంటానని, ఇది విన్‌ విన్‌ సిట్యువేషనని, ఆలోచించుకోమని ఎస్సైకి డీల్‌ పెట్టాను. చక,చకా పావులు కదిలాయి. నిద్ర మత్తులో దొంగనుకొని, ఆ త్రోవన పోతున్న ఈ అబ్బాయిని పట్టుకున్నానని, తన తప్పు మన్నించమని, వస్తువులేవీ పోనందున, కేసు కూడా విత్‌ డ్రా చేసుకుంటున్నానని, కేసు పెట్టినతనితో ఇంకొక స్టేట్మెంట్‌ తీసుకున్నారు పోలీసులు.
… … …
ఈ నాల్గురోజుల సంఘర్షణాత్మక సంఘటనల తర్వాత, స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ, ఆశగా రేపటిలోకి అడుగు పెట్టాడు కృష్ణుడు. జాతి, మత, కుల, వర్గ, ప్రాంత బేధాలనే వివక్ష సమసి పోవాలని, ప్రజలందరూ సమజీవనం గడిపే కాలం రావాలని, తరతరాల ఈ సంఘర్షణకు, సమాప్తం కార్డు పడాలని, సాయుధ పోరాటాల నుండి విముక్తి కలగాలని కృష్ణుడితో పాటు, భవిష్యత్తులోకి ఆశగా చూస్తూ నేను.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.