మనుషులందరూ సమానమేనని ఎన్నిసార్లు వల్లెవేసినా, ఎల్లప్పుడూ సమానం కాదని మాత్రమే నిరూపిత మవుతూనే ఉంది. ఎన్నెన్ని విభాగాలుగా మనుషులని విడదీసినా జెండర్ వద్దకు వచ్చే సరికి ఒక మొండివాదన మన ముందు నిలబడిపోతుంది. శరీరాలు, ఇష్టాలు ఏవిధంగా రూపు దిద్దుకుంటాయి అనేది మనకు తెలీదు కానీ జెండర్ మాత్రం మన చుట్టూ ఉన్న అధికార భావజాలాల వలనే ఏర్పడ్డాయి.
మతం, ఆచారాలు, వ్యవహారాలు, ఆహరం, కులం ఇలా ప్రతిదీ ఆ అధికారాన్ని బలపరిచే సాధనంగా మారిపోతుంది.
ఈ అసమానతలు ఏయే పద్ధతిలో పుడతాయో తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. కానీ అసమానత మూలలను తెలుసుకుని నిర్మూలించడం కన్నా, పిల్లలకు ట్రిగ్నోమెట్రీ లేదా పీరియాడిక్ టేబుల్ నేర్పించడమే ముఖ్య మనుకునే విద్యా విధానాలు ఇంకా మారలేదు. సామజిక బాండిరగ్‌ని నేర్పకుండా కెమిస్ట్రీలో కోవలెంట్ బాండ్ మీదనే శ్రద్ధ పెడితే ఎలా?
… … …
ప్రేమ అతీతమని, అద్వితీయమని, ఆధ్యాత్మికమని చెబుతూంటాం. కానీ దానికి షరతులు వర్తిస్తాయి. వివాహం ఆత్మలదని చెబుతాం కానీ దానిని పునరుత్పత్తికి ముడిపెడతాం. అంటే ప్రేమ దేహాలకు సంబంధించినదే అని నిర్ధారిస్తాం.
ప్రాచీనం, సనాతనంపై మిక్కిలి ప్రేమ. మన సంస్కృతి ఎంత గొప్పదో చెబుతున్నప్పుడు అందులో భాగంగా
ఉండే విశాలత్వాన్ని తిరస్కరిస్తాం. కిన్నెర, కింపురుష, యక్షులు ఎవరు వీరంతా? బ్రిహన్నల, శిఖండి, మోహిని, అర్ధనారీ శ్వరుడు ఎవరు వీరంతా? దేవాలయాలు, శిల్పాలు, చిత్రపటాలు, కామసూత్రాలు ఇన్ని రుజువులున్నా సమాజం ఆడ, మగా ఈ రెండు ఇరుకు సందులలోనే వెళ్ళడానికి ఇష్టపడుతుంది.
అసలు ఆడ మగా అంటే ఎవరు? శరీరాలా, పనులాÑ వారికి ఆపాదించిన నీతులా, నియమాలా? కావ్యాలలో వర్ణించిన కందిరీగ నడుము, విశాల జఘనము, ఎత్తైన ఊరువులు లేదా విశాల పాలభాగము, దీర్ఘ బాహువులు, ఉక్కు శరీరంÑ సున్నితమైన దేహాలు, రాతి కండెలు నుండి మార్కెట్టు నిర్దేశించిన బాడీ సైజుల వరకు ఎవరు తల్లీ, ఎవరు ఇచ్చారు ఈ లెక్కలు?
… … …
మనుషులను ప్రేమింపుము కానీ అందులో జెండర్‌ను చూసుకొనుము. ఆడపని మగపని అని విడదీయడమే తప్పు అని మాటలాడుతున్నాం. మరి ఆడవారిపై ప్రేమ, మగవారిపై ప్రేమ ఏమిటి? వ్యక్తీకరణకు కూడా జెండర్ ఆధారితంగా శరీర భాషను అలవరిచే సమాజంలో మనిషితో మరో మనిషి గౌరవంగా
ఉండటం అనేది అన్నిటి కన్నా కష్టతరమ వుతోంది.
యుద్ధాలు, పౌరుషాల, అణు బాంబులు, AIలు ఉన్నా సరే మన ఆలోచనారీతికి అట్టగట్టి పట్టిన చీడని వదిలించుకునే పాఠాలేలేవు. అందుకు తగిన బడులు లేవు. ఎందుకంటే బడులు కూడా విభజించబడ్డాయి.
… … …
మగవాడు ఎలా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ప్రవర్తించాలి, ప్రేమను వ్యక్త పరచాలి, ఏయే బాధ్యతలను తలకెత్తు కోవాలి, ఎలా కొందరిని చీదరించు కోవాలి, ఎలా హింసించాలి ఇవన్నీ చెప్పి దీనిని మగతనమని, ఆడవారి అలంకరణ, ప్రవర్తన, శీలం, మాతృత్వం, సేవలను గురించి చెప్పి ఆడతనమని ఇద్దరికీ కిరీటాలు పెట్టేసాక, వీటిని కాలితో తన్ని చావమని చెప్పి తమకు నచ్చినట్లుగా బ్రతికే వీరిని ఏమనాలి?
ఊహించుకున్న జెండర్ను స్వంతం చేసుకొనేందుకు అమ్మ, నాన్నలే చంపివేసే సంఘటనలు, కుటుంబంలో వారితోనే లైంగిక హింసను సహకరించే సంఘట నలు, ఆస్తిని కబళించే సహోదరులు, వదిలేసుకున్న కుటుంబాలు, పట్టించుకోని పాలన పద్ధతులు అన్ని ఉండి అనాథలైన వారు ఇదంతా ఈ ద్వైత్యపు భవనాల నుండి వచ్చినదేనా!
ఈ ప్రైడ్ నెల సందర్భాన మగతనం లేదంటే చావే దిక్కనుకునే సమాజంలో, ఆడతనపు బండ బరువు మోయమని ఆమెను భూమిలోకి వత్తిపెట్టే సమాజంలో మగతనాన్ని వదిలించుకునే కొందరు, మేము మగవారిమే అనే కొందరు, మేము అందరికి చెందిన వారిమని కొందరు, మేము ఏ జెండర్‌కి చెందినవారము కామని కొందరు, మాకు ఎవరిపై ప్రేమ కలిగితే వారిని ప్రేమిస్తామనే ఇంకొందరికి సమాజం ఏమని చెబుతోంది?
మనుషులను విడదీసినందుకు,
స్వేచ్ఛను హరించినందుకు,
హింసను ప్రేరేపించినందుకు –
క్షమించమని అడుగుతోందా?
