అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…)
అనువాదం: ప్రభాకర్‌ మందార

9. ఇబ్రహీంపట్నం స్థితిగతులు
నేను 1984 ఆగస్ట్‌లో మొట్టమొదటిసారి ఇబ్రహీంపట్నం వెళ్లాను. అప్పుడు జలాల్‌మియాపల్లెలో పాల్‌ దివాకర్‌ వాళ్లింట్లో వున్నాను. జలాల్‌మియాపల్లె ఇబ్రహీంపట్నం టౌన్‌కు పద్దెనిమిది కిలో మీటర్ల దూరంలో రంగాపూర్‌లోని ఓ చిన్న పల్లెటూరు.

పాల్‌ దివాకర్‌ వుండే ఇంటి యజమాని పేరు జలాల్‌ మియా. ఉర్దూలో మియా అనేది గౌరవ వాచకం. 1948నాటి పోలీస్‌ యాక్షన్‌లో నిజాం రాజ్యం పతనమవడానికంటే ముందు జలాల్‌ మియాకు అక్కడ వెయ్యి ఎకరాలకంటే ఎక్కువ భూమి వుండేది. అందుకే ఆ ఊరికి జలాల్‌మియాపల్లె అనే పేరొచ్చింది. ఆ ఊళ్లో ఆయన తన కోసం ఒక పెద్ద భవంతిని, తన సేవకుల కోసం ఒక చిన్న కాలనీనీ నిర్మించాడు. ఆ కాలనీలో కుమ్మరి, కమ్మరి, మంగలి, మాల తదితర కులాల వాళ్లంతా వుండేవాళ్లు. ఆ ప్రాంతం మొత్తంలో ఆయన ఒక్కరే ముస్లిం మతానికి చెందినవాడు. అందుకే 1948 నాటి పోలీస్‌ యాక్షన్‌ తర్వాత అక్కడ వుండటం ఏమాత్రం క్షేమకరం కాదన్న ఉద్దేశంతో ఆ కుటుంబం తమ భవనాన్నీ ఇతర ఇళ్లనీ అద్దె కిచ్చేసి హైదరాబాద్‌కు తరలివెళ్లింది. నేను 2020లో ఈ పుస్తకాన్ని రాస్తున్న సమయంలో నాకీ వివరాలు తెలిశాయి. 1984లో నేను ఇబ్రహీంపట్నంలో వుండటానికి చోటు వెతుకుతున్నప్పుడు మిత్రుడు పాల్‌ దివాకర్‌ ఈ జలాల్‌మియా ఇంట్లోనే అద్దెకుండేవారు. వాళ్ల నాన్న ఎన్‌.డి. ఆనందరావు శామ్యూల్‌ చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (సీఎస్‌ఐ) బిషప్‌గా పనిచేసేవారు. ఆయన తరచూ జలాల్‌మియాపల్లెకు వచ్చివెళ్లేవారు. జనంలో ఆయనకు చాలా గౌరవ మర్యాదలుండేవి. మహిళలకు కూడా బిషప్‌గా పనిచేసే హక్కును సాధించడం కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. ఒక బిషప్‌గా, మాడరేటర్‌గా ఆ అంశంపై చర్చికి సంబంధించిన అనేక వేదికల మీద తన వాదనలు వినిపించారు, చర్చలు చేశారు. చివరికి 1980లో క్రైస్తవ ధర్మశాస్త్రపరమైన శిక్షణ పొందిన మహిళలకు బిషప్‌గా పనిచేసే హక్కును సిఎస్‌ఐ ప్రసాదించింది. అయితే ఆరోజుల్లో నాకు ఇదంతా తెలియదు, ఆతరువాతే తెలిసింది. పాల్‌ దివాకర్‌ తండ్రి చాలా నిరాడంబరంగా, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించేవారు. పాల్‌ దివాకర్‌ తమ్ముడు సాలమన్‌ కూడా అన్న దగ్గరే వుండేవాడు. ఇరవై రెండేళ్ల వయసులో ఉన్నత చదువులకోసం అతను అమెరికా వెళ్లే ప్రయత్నంలో వున్నాడు. నేను అక్కడికి వెళ్లిన మొదటి రెండు రోజులు వాళ్లింట్లోనూ, ఊళ్లోనూ అటూ ఇటూ తిరిగాను. బుగ్గయ్యనూ, అతని కుటుంబాన్నీ, అతని మేనత్తనీ కలుసుకున్నాను. మొత్తం ఇబ్రహీంపట్నంలో నాగలి పట్టుకుని పొలం దున్నిన ఏకైక మహిళ ఆమె. ఆ తరువాతి కాలంలో నేను బుగ్గయ్యతో కలసి పనిచేశాను. నాకు ఏమీతెలియని ఈ ప్రదేశంలో… ఈ ఇంట్లో నేనేం చేస్తున్నానని ఒకోసారి చింత కలుగుతుండేది. నగరం నుంచి వచ్చి నేనిలా ఒక పల్లెటూళ్లో నివసిస్తాననీ, పల్లె జనంతో కలసి నడుస్తాననీ ఎప్పుడైనా అనుకున్నానా?
ఒక పుస్తక రచనలో భాగంగా, బడుగు వర్గ స్త్రీల ఆరోగ్య సమస్యలను పరిశోధించే నిర్దిష్ట లక్ష్యంతో ఇబ్రహీంపట్నంకు వెళ్లాను. ముందే సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిని పట్టుకుని జలాల్‌మియాపల్లెలోనూ, పక్కనే వున్న చీదేడు గ్రామంలోనూ విస్తృతంగా తిరిగాను. కానీ మొదట్లో వచ్చిన పనిలో పూర్తిగా నిమగ్నం కాలేకపోయాను. ఎందుకంటే అక్కడి వాతావరణం, శబ్దాలు, వాసనలు, భాషా అన్నీ నాకు కొత్తగా, ఎంతో భిన్నంగా అనిపించేవి. అక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం వుండేవి, నాకేమో అన్నీ ఒక్కరోజులోనే పూర్తిచేయాలన్నంత తొందర.
ఒక వారం రోజుల పాటు ఎలాగోలా అక్కడ గడిపి ఊపిరి పీల్చుకోడానికని హైదరాబాద్‌కు తిరిగొచ్చాను. కానీ ఆ ప్రాంతాన్నీ, అక్కడి మనుషుల్నీ ఒకసారి చూసి వచ్చాను గనుక ఇక దాని లోతుల్లోకి దిగక తప్పదు. నేను అక్కడికి వెళ్లిన కొన్నాళ్లకే పాల్‌ దివాకర్‌ తన కుటుంబంతో పాటు చిత్తూరుకు వెళ్లిపోయే ఏర్పాట్లలో వున్నారు. అంటే ఇక నా దారి నేను వెతుక్కోక తప్పదు. ఆ రోజుల్లో ఇబ్రహీంపట్నంలో పలాంటి ప్రయాణ సాధనాలూ అందుబాటులో వుండేవి కావు. ఆ ప్రాంతంలో తిరగాలంటే సొంతంగా ఏదో ఒక ప్రయాణ సాధనం వుండాలి. అక్కడి గ్రామాలు దగ్గర దగ్గరగా వుంటాయి. కాబట్టి సైకిల్‌ మీదైతే వాటిని చుట్టేసి రావచ్చు. ముప్పై ఏళ్ల వయసులో నేను హైదరాబాద్‌లోనే సైకిల్‌ తొక్కడం నేర్చుకున్నాను. శాంతా సిన్హా దగ్గర సైకిల్‌ తీసుకుని వెస్ట్‌ మారెడ్‌పల్లి వీధుల్లో నా అభ్యాసం మొదలుపెట్టాను. చాలాసార్లు సైకిల్‌ మీదనుంచి పడిపోయి దెబ్బలు తగిలించుకున్నాను. అప్పుడు కస్తూరిబా గాంధీ కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యారాణి నరసింహారావు నా మీద దయతో లేవనెత్తి, నా గాయాలను తుడిచి, అయొడిన్‌ రాసి కట్లుకట్టి అనునయిస్తూ ధైర్యం చెబుతూండేవారు. అప్పటికే నేను పాంట్లు వేసుకోవడం మానేసి చీరలు కట్టుకోవడం మొదలుపెట్టి వున్నాను. అయితే చీర కట్టుకుని సైకిల్‌ తొక్కాలంటే చాలా కష్టంగా వుండేది. దాంతో స్నేహితురాళ్లవద్ద కొన్ని సల్వార్‌ కమీజులను సేకరించాను.
నేను జలాల్‌మియాపల్లెకు తిరిగి వచ్చినప్పుడు పాల్‌ దివాకర్‌ తమ్ముడు సాలమన్‌ చదువు పూర్తయి అమెరికాకు వెళ్లే సమయం కోసం ఎదురుచూస్తూ ఖాళీగా వుండేవాడు. అతణ్ని వెంటబెట్టుకుని ఇబ్రహీంపట్నంలోని అనేక గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాను. సాలమన్‌కు తెలంగాణ యాసలో మాట్లాడటం రాకపోయినా దానిని బాగా అర్థం చేసుకోగలిగేవాడు. మేమిద్దరం రెండు సైకిళ్లమీద, వీపులకు స్లీపింగ్‌ బ్యాగులను తగిలించుకుని బయలుదేరేవాళ్లం. ఎవరు ఏ ఆహారం ఇస్తే దానిని తినేవాళ్లం. అక్కడ సాధారణంగా జొన్న రొట్టెలు, పచ్చడి ఎక్కువగా తినేవారు. అవే మాకు పెట్టేవాళ్లు. అందుకు మేం వాళ్లకి రెండేసి రూపాయలు ఇచ్చేవాళ్లం. ఎవరు చోటు కల్పిస్తే ఆపూట వాళ్లింట్లో విశ్రమించేవాళ్లం. 1984 సెప్టెంబర్‌, అక్టోబర్‌ నాటి సంగతి ఇది. నిజంగా నా కదొక ఆహ్లాదకరమైన కాలం. సాలమన్‌ గానీ, నేను గానీ ఎవరికీ జవాబుదార్లం కాం… స్వేచ్ఛా జీవులం. సైకిళ్ల మీద ఏ రోజు ఎక్కడికి వెళ్లాలో, ఏం పని చేయాలో, ఎక్కడ విశ్రమించాలో అంతా మా ఇష్టం. ఒకోసారి అక్కడి రాళ్ల గుట్టల్ని ఆసక్తిగా పరిశీలిస్తూ గంటల తరబడి అలాగే గడిపేసేవాళ్లం. ఎక్కడ చీకటి పడితే అక్కడ ఆగిపోయి, ఎవరో ఒకరి ఇంట్లో చోటు సంపాదించుకుని మర్నాడు మా పనిని కొనసాగించేవాళ్లం.
సైకిళ్ల మీద జలాల్‌మియాపల్లెనుంచి వెళ్లి వచ్చేందుకు మూడు దార్లుండేవి. వాయవ్య దిశలో రంగాపూర్‌, గడ్డమల్లాయ్‌గూడెం, గుంగల్‌ల మీదుగా 565 నెంబర్‌ జాతీయ రహదారిని చేరుకోవచ్చు. అది హైదరాబాద్‌ నుంచి నాగార్జున సాగర్‌కు వెళ్లే రహదారి. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణా ప్రాంతాలను వేరుచేసే కృష్ణానదిపై నిర్మించిన భారీ డ్యామ్‌ నాగార్జునసాగర్‌లో వుంది. ఆ జాతీయ రహదారిని దాటిన తరువాత పడమర దిశలో పేతుల గ్రామానికి వెళ్లేవాళ్లం. అక్కడినుంచి దక్షిణాన చింతుల, నందివనపర్తి గ్రామాలు, పడమరన యాచారం గ్రామం మీదుగా తిరిగి జాతీయ రహదారికి చేరుకునేవాళ్లం. జలాల్‌మియాపల్లె నుంచి ఉత్తరం వైపున్న దారిలో మేం సైకిళ్ల మీద జాపాల, ఆరుట్ల, మంచాల్‌ వెళ్లేందుకు తిరిగి రంగాపూర్‌ దాటేవాళ్లం. దక్షిణ దిశలో రాళ్లమయమైన రాచకొండ ప్రాంతాన్ని దాటేందుకు చీదేడ్‌, దాడ్‌పల్లి మీదుగా వెళ్లే వాళ్లం. మేం పశ్చిమం వైపు వెళ్లడానికి వీల్లేకుండా రాచకొండ రాళ్లు అడ్డుగా వుండేవి. అందువల్ల ఆగ్నేయదిశలో మొండి గౌరెల్లి, చింతపట్ల, నల్లవెల్లి గ్రామాలకు వెళ్లి తిరిగి అక్కడి నుంచి మేం మాల్‌ వద్ద మళ్లీ 565 నెంబర్‌ జాతీయ రహదారి మీదకు చేరుకునేవాళ్లం.
ఇబ్రహీంపట్నంలో సైకిళ్ల మీద తిరగడం అంటే మాటలు కాదు. నేను సైకిల్‌ మీద బయటకు వెళ్లినప్పుడు దారిలో పిల్లలు ఎదురైనా, దూరంగా పశువులు వస్తున్నట్టు కనిపించినా గాభరాతో బాలెన్సు కోల్పోయి కింద పడిపోయేదాన్ని. అయితే క్రమక్రమంగా సైకిల్‌ తొక్కడం మెరుగవుతూ వచ్చింది. సాలమన్‌ చాలా మంచి స్నేహితుడు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ వుండేవాడు. గ్రామస్తులు కూడా స్నేహపూర్వకంగా వుండేవాళ్లు. మా ఇద్దరికీ ఎలాంటి కులం పట్టింపులు వుండేవి కావు. అందువల్ల దారిలో ఎక్కడ ఆకలివేస్తే అక్కడ ఆగిపోయేవాళ్లం. జనం మమ్మల్ని పన్నో ప్రశ్నలు అడిగేవాళ్లు. మేం వారికి ఏం దాచుకోకుండా సమాధానాలు చెప్పేవాళ్లం. ఇద్దరం కలసి వారం రోజుల పాటు అలా సైకిళ్ల మీద అనేక ఊర్లు తిరిగాం. ఆ తరువాత చదువుకోడానికి సాలమన్‌ అమెరికా వెళ్లిపోయాడు. పాల్‌ దివాకర్‌, అన్నీలు కూడా చిత్తూరు వెళ్లిపోయారు. నేను మాత్రం జలాల్‌మియాపల్లెలోనే వుండిపోయాను. గుంగల్‌ గ్రామంలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాను.
గుంగల్‌ను అక్కడి జనం గునిగుంట అనేవాళ్లు. జలాల్‌మియాపల్లె నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో, నాగార్జునసాగర్‌ రహదారికి ఓ అర కిలోమీటర్‌ లోపులో వుంటుంది గుంగల్‌. అక్కడి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లివచ్చేందుకు గుంగల్‌ చాలా అనువుగా వుంటుంది. పైగా నా గది బయట ఒక గుంత తవ్వి ఏర్పాటు చేసిన మరుగుదొడ్డి కూడా వుండేది. అదొక పెద్ద ఉపశమనం నాకు. ఎందుకంటే లోటా పట్టుకుని ఆరుబయటకు వెళ్లాల్సిన శ్రమ తప్పింది. ఆ మరుగుదొడ్డిని ఉపయోగించిన వెంటనే దానిమీద బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి శుభ్రంగా వుంచడం నేర్చుకున్నాను. కాకపోతే నీళ్ల కోసం కాస్త దూరంలోని బోరుబావి హాండ్‌ పంప్‌ దగ్గరకు వెళ్లాల్సి వుండేది. ఆ ఊళ్లో చిక్కని తాజా పాలు దొరికేవి. నేను కిరోసిన్‌ స్టౌ మీద, మట్టి పాత్రల్లో వంట చేసుకునేదాన్ని. వంట అంటే మరేదో కాదు` అన్నం, ఒక కూరగాయల శాకం లేదా పప్పు అంతే. ఒకోసారి పాలను తోడు పెట్టి రుచికరమైన పెరుగును తయారుచేసుకునేదాన్ని. అప్పుడప్పుడు కోడి మాంసం కొని తెచ్చుకునేదాన్ని. మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద వండుకున్న చికెన్‌ మహా రుచికరంగా అనిపించేది.
నా గదిలో వెలుతురు సరిగా వుండేది కాదు. ఆ పెంకుటింటి పైకప్పును చూస్తే భయమనిపించేది. ఎందుకంటే ఒకోసారి పాములూ, తేళ్లూ జారి పడుతుంటాయి జాగ్రత్త అని ఇరుగుపొరుగు వాళ్లు నన్ను ముందే హెచ్చరించారు. ఆ ఇల్లు మాదిగ వాడలో లేదు కానీ ఆ వాడకు కొద్ది గజాల దూరంలోనే వుండేది. ఇంటి యజమాని ఒక ముస్లిం. ఇబ్రహీంపట్నంలో వుండేవాడు. అది ఏ రెడ్డి కులానికి చెందిన వ్యక్తిదో కానందుకు నాకు చాలా సంతోషంగా అనిపించేది. పందుకంటే నేను చేసే పనులు గమనిస్తే రెడ్లయితే నన్ను తమ ఇంట్లో వుండనిచ్చేవారు కాదు.
పాల్‌ దివాకర్‌ వెళ్తూ వెళ్తూ తన వాటర్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ మిత్రుల్ని నాకు పరిచయం చేశారు. నేను పనిమీద బయట తిరుగుతున్నప్పుడు తోడుగా వుండమని వారికి సూచించారు. ఆ బృందంలో శంకరయ్య, బుగ్గయ్య, రాములు, జ్ఞానేశ్వరి, సత్యవతి ఇంకా మరికొందరున్నారు. శంకరయ్య, బుగ్గయ్య, రాములు ముగ్గురూ స్థానికులు కాబట్టి నా పనులకు సదా చేదోడు వాదోడుగా వుండేవారు. శంకరయ్య జలాల్‌మియాపల్లెకు కిలోమీటర్‌ దూరంలోని చీదేడులో, బుగ్గయ్య జలాల్‌మియాపల్లెలో, రాములు మంచాల్‌ దగ్గరి హస్మత్‌పురాలో నివసించే వాళ్లు. శంకరయ్య, బుగ్గయ్య ఇద్దరూ చిన్నప్పుడు కొంతకాలం బడికి వెళ్లి చదువుకున్నారు. కానీ రాములు మాత్రం అసలు బడికే వెళ్లలేదు. కాకపోతే ఆతర్వాత తనంతట తాను చదవడం, రాయడం నేర్చుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయి ఊతకర్రల సాయంతో నడిచేవాడు. కొన్నాళ్లకు మేం అతడిని జైపూర్‌ కు పంపించి కృత్రిమ కాలును అమర్చుకునేందుకు సహాయం చేశాం. రబ్బర్‌తో, ఆధునిక డిజైన్‌లో రూపొందించిన ఆ కృత్రిమ కాలు రాములుకి బాగా ఉపయోగపడేది. అతనికి ఒక కాలు లేదన్న విషయాన్ని ఇతరులు గుర్తించలేకపోయేవారు. శంకరయ్య రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటూ గ్రామ సర్పంచ్‌ కూడా అయ్యాడు. ఇక బుగ్గయ్య శాంతా సిన్హా సహాయంతో శ్రామిక విద్యా పీఠంలో ఉద్యోగంలో చేరాడు. కానీ చాలా చిన్న వయసులోనే చనిపోయాడు. రాములు ఇప్పటికీ ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య ఒక వారధిలా సేవలు అందిస్తున్నాడు. సత్యవతి సొంతంగా రీడ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. వసంత కన్నబిరాన్‌ 2015లో సత్యవతి జీవిత చరిత్రను ఇంగ్లీష్‌లో రాసి ‘కాన్‌ఫ్రాంటింగ్‌ క్యాస్ట్‌, క్లాస్‌ అండ్‌ జెండర్‌’ పేరుతో ప్రచురించారు.
నాలాగా ఏదో ఒక పనిమీద గ్రామాలకి వచ్చేవాళ్లు నేర్చుకునేందుకు అక్కడ బోలెడు విషయాలున్నాయి. నా నమ్మకాల నన్నింటినీ పక్కన పెట్టి ఎన్నో కొత్తవాటిని నేర్చుకోడానికి తయారయ్యాను. మేం ఎక్కడైనా ఆగినప్పుడు ఇటు మాతో వున్నవాళ్లనూ, అటు మమ్మల్ని కలిసేందుకు వచ్చేవాళ్లనూ అనేక ప్రశ్నలు అడిగేదాన్ని. వాళ్లు ఎందుకలా అన్నారు? ఏం తింటారు? అవే ఎందుకు తింటారు? ఏం పనులు చేస్తారు? వారిలో భార్యల్ని కొట్టేవాళ్లు ఎవరైనా వున్నారా? వాళ్ల జీతాలు ఎలా వున్నాయి? వాళ్లు తీసుకున్న అప్పులకు వడ్డీ ఎంతుంటుంది? భూస్వాములైన రెడ్లతో వారి సంబంధాలెలా వున్నాయి? బ్రాహ్మణ పూజారి మీద వాళ్లకు అంత సానుభూతి ఎందుకుంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు. గ్రామాల్లో జీవితం చాలా ఆసక్తిదాయకంగా, రంగుల మయంగా, ఉత్సాహభరితంగా వుంటుంది. నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పేందుకు వాళ్లదగ్గర కావలసినంత సమయం వుండేది. బస్సుకోసం ఎదురుచూడటం కూడా అక్కడ ఉల్లాసభరితమే. నగరంలో మనకు ఏవేవి విసుగు పుట్టిస్తుంటాయో అవన్నీ ఇక్కడ అత్యంత సహజమైనవి. నేను బస్టాండ్‌లో అనేకమందితో మాట్లాడాను. అన్నింటికంటే బస్టాండ్‌లోనే వాళ్లకి బోలెడంత తీరుబడి వుంటుంది. బస్సు ఎన్నడూ నిర్ణీత సమయానికి వచ్చేది కాదు. ఒకోసారైతే అసలు వచ్చేదే కాదు. ఇబ్రహీంపట్నంలో వున్నన్ని రోజులూ చేతిగడియారం వంక చూసుకోవడమే మానేశాను. నేను అడుగుపెడుతున్న కొత్త ప్రపంచం గురించే ఎప్పుడూ ఆలోచిస్తుండేదాన్ని.
తిండి విషయానికి వస్తే అక్కడ ఉదయంపూట అల్పాహారం తీసుకోవడం మానేశాను. ఏకంగా మధ్యాహ్నమే భోజనం చేసేదాన్ని. ఒకోసారి దానికి కూడా సాయంత్రం నాలుగయ్యేది. ఇక రాత్రి పడుకునేసరికి ఏ రెండో అయ్యేది. అప్పుడప్పుడూ ఎవరో ఒకరు వచ్చి తమ ఊరికి రమ్మని ఆహ్వానించేవాళ్లు. తీరా వెళ్లే సరికి ఆ పిలిచిన వ్యక్తి జాడ వుండేది కాదు. మీరు ఒక ప్రశ్న అడిగితే వాళ్లు దానికి భిన్నమైన ఇంకో సమాధానం చెప్తారు. ప్రతి ఒక్కరూ ప్రతీ దానిలోనూ ఆలస్యమే. వాళ్లు రేపు ఉదయం అన్నారంటే` తెల్లవారు జామున 5 నుంచి మధ్యాహ్నం పన్నెండిరటి వరకూ ఎప్పుడైనా కావచ్చని అర్థం. ఇబ్రహీంపట్నంలో నేను ప్రశ్న మీద ప్రశ్న అడుగుతున్నా ఎవరూ విసుక్కునేవారు కాదు. పైగా చాలామంది నాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపేవారు.
అక్కడ దోమలు లేవు. ఊళ్లన్నీ ఎత్తైన ప్రదేశంలో వుండటం వల్ల శుభ్రంగా వుండేవి. ఎక్కడా మురికి నీళ్లు నిలిచేవి కావు. అక్కడ నాకు తెలియని ఎన్నో రకాల చెట్లూ, పక్షులూ వుండేవి. నేను పాములూ, తేళ్లూ, జలగలూ మొదలైన వాటినుంచి ఎలా తప్పించుకుని తిరగాలో అక్కడే నేర్చుకున్నాను. ఎప్పుడైనా రాత్రి సమయంలో బయటికి వెళాల్సివస్తే తప్పనిసరిగా ఒక చేతికర్ర తీసుకుని వెళ్లాలి. మనం వస్తున్నట్టు గ్రహించి జంతుజాలం పక్కకు తప్పుకునేందుకు వీలుగా కర్రతో నేల మీద కొడుతూ, చప్పుడు చేస్తుండాలి. ఇంటి పై కప్పు వాసాలనూ, దూలాలనూ ఎప్పటికప్పుడు గమనిస్తూ శుభ్రం చేసుకుంటూండాలి. లేకపోతే నిద్రపోతున్నప్పుడు పైనుంచి తేళ్లు మొదలైనవి జారి మీద పడతాయని గ్రామస్తులు చెప్పారు. పంట పొలాలూ, కాలువలూ దాటుతున్నప్పుడు నీళ్లల్లో జలగలు ఏమైనా వున్నాయేమో చూసుకుంటూ నడవాలి. అయితే, అన్నింటికంటే అక్కడ అతి భయంకరమైన సమస్య కోడి పేను. మన కంటికి కనిపించనంత చిన్నగా వుంటాయి కోడి పేన్లు. అక్కడ చాలామంది తమ కోళ్లను గుడిసెల్లోనే కమ్ముకుంటారు. మరి కొందరైతే పశువుల్ని కూడా తమ ఇళ్లలోనే కట్టేసుకుంటారు. మనం ఎంత వెతికినా కోళ్లకు పేన్లు వున్నాయో లేదో పైకి కనిపించవు. కానీ అవి మన శరీరం మీదే పారుతూంటాయి. వాటివల్ల నిద్రలేని రాత్రుల్ని గడపపాల్సి వస్తుంది. ఇల్లంతా పొగబెట్టి, దుస్తుల్నీ, పక్క బట్టల్నీ వేడి నీళ్లలో ఉడకబెట్టి శుభ్రంగా ఉతికి ఎండబెడితే తప్ప కోడి పేను సమస్య పోదు.
అక్కడ ఎటు చూసినా రకరకాల ఆకారాల్లో కనువిందుచేసే రాతి గుట్టలు కనిపిస్తాయి. ఆ బండరాళ్ల పేర్లు కూడా చాలా విలక్షణంగా వుంటాయి. మేకల గుట్ట, నక్కల గుట్ట, కొండెంగుల గుట్ట, బొల్లోని గుట్ట (అందులో అన్నీ తెల్లరాళ్లే వుంటాయి కాబట్టి) ఇలా వాటి ఆకారాలను బట్టి పేర్లుంటాయి. చాలా సర్వసాధారణమైనది దేవుని గుట్ట. అక్కడ ఒక రాయి మీద చిన్న విగ్రహం వుంటుంది. అక్కడ ఒక ముస్లిం ఫకీర్‌ పేరిట బాసావు గుట్ట అనేది కూడా వుంది. భాయ్‌సాబ్‌ గుట్టనే బాసావు గుట్టగా మారిపోయిందంటారు. ఇబ్రహీంపట్నంకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని రాచకొండలో మాదిరిగా ఏ పంటలూ పండని రాతి నేలలు మైళ్లకొద్దీ విస్తరించి వున్నాయి. వాటి మధ్య అక్కడక్కడా చిన్న చిన్న పొలాలు కనిపిస్తాయి. వాటిలో సాధారణంగా జొన్నలు, ఆముదాలు పండిస్తుంటారు. అక్టోబర్‌ తర్వాత ఆ పొలాల్లో పశువులను మేపుతుంటారు. అప్పుడప్పుడు మాకు ఎదురయ్యే మేకల, గొర్రెల కాపర్లు నడచుకుంటూనో, సైకిళ్లమీదనో వెళ్తున్న మమ్మల్ని చాలా ఆసక్తిగా చూస్తుండేవారు. ఆ ప్రదేశంలో ఏ రాతి వెనక్కో, పొదల పక్కకో వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటుంటే ఎంతో స్వేచ్ఛగా అనిపించేది. నేనక్కడ ఒకోసారి ఎవరూ చూడకుండా సిగరెట్లు కూడా కాల్చేదాన్ని. అయితే నేనేమంత పెద్ద స్మోకర్‌ని కాదు. ఇబ్రహీంపట్నంలో ఏరోజూ బహిరంగంగా సిగరెట్లు తాగలేదు. కాకపోతే అప్పుడప్పుడూ జనాల కళ్లుకప్పి రహస్యంగా దమ్ముకొట్టేదాన్ని.
మీది ఏం కులం అని జనం తరచూ నన్ను ప్రశ్నిస్తుండేవారు. ఎవరికైనా ఇక్కడ ఎదురయ్యే మొట్టమొదటి ప్రశ్న ఇదే. నేను వెంటనే మాది డక్కలి కులం అని చెప్పేదాన్ని. డక్కలి అనేది మాదిగల్లో ఒక ఉప కులం. కుల వ్యవస్థలో అన్నింటి కంటే అట్టడుగు కులంగా పరిగణించబడే కులం అది. అందుకే ఆ పేరు చెప్పేదాన్ని. అయితే సిరిల్‌ రెడ్డి నా భర్త అని తెలిసిన తరువాత ‘గదేంది నీ మొగుడిది రెడ్డి కులం కదా?’ అనేవాళ్లు. ‘అవును, వాళ్లది రెడ్డి కులమే కానీ మాది డక్కలి కులం. మా ఇద్దరికీ కులం పట్టింపులు లేవు’ అని చెప్పేదాన్ని. ‘ఇప్పుడు మీరు నాకు అన్నం పెడుతున్నారు కదా మా డక్కలోళ్లు ఎవరొచ్చినా ఇలాగే వారికి కూడా అన్నం పెట్టాలి’ అని చెప్పేదాన్ని. ఆ తర్వాత వాళ్లకి నేను బ్రాహ్మణ కులంలో పుట్టినదాన్ననే సంగతి తెలిసిందో లేదో నాకు తెలియదు. కానీ, కొద్ది నెలల్లోనే వాళ్లు కులం గురించి పట్టించుకోవడం మానేసి నన్ను తమలో ఒకరిగా చూసుకున్నారు.
అక్కడ మల విసర్జనకు వెళ్లడం నాకో పెద్ద సమస్య. ఊరి చివర బహిరంగ ప్రదేశంలో మగవాళ్లు ఒకవైపు, ఆడవాళ్లు మరోవైపు మల విసర్జనకు వెళ్లేవాళ్లు. నేను అద్దెకు వున్న ఏ ఇంట్లోనూ మరుగుదొడ్లు లేవు. ఒక లోటాలో నీళ్లు తీసుకుని వాళ్లు ఎటువైపు వెళ్లమంటే అటువైపునకు వెళ్లాలి. కొన్ని గుడిసెల్లో ఒకే ఒక్క లోటా వుండేది. దానినే మంచినీళ్లకు కూడా ఉపయోగించేవారు. అయితే, 1990ల ప్రారంభంలో ప్లాస్టిక్‌ బాటిళ్లు అందుబాటులోకి రావడం మొదలైన తరువాత ఆ సమస్య పోయింది. అదృష్టవశాత్తు అక్కడ ఖాళీ బంజరు ప్రదేశానికి కొదవలేదు. అదే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అయితే ఎటు చూసినా ఖరీదైన పచ్చని పంట పొలాలుంటాయి. మరుగు వున్న చోటు దొరకడమే కష్టం. తెలంగాణలో దాదాపు అన్ని గ్రామాల్లో కావలసినంత ఖాళీ ప్రదేశం వుంటుంది. మలవిసర్జనకు పురుషులు ఎటు వైపు వెళ్లాలో, స్త్రీలు ఎటు వైపు వెళ్ళాలో ముందే నిర్ణయించబడుతుంది. బహిరంగ ప్రదేశంలో మలమూత్ర విసర్జనను అక్కడ ఎవరూ అవమానకరంగా భావించరు. అలా బహిర్భూమికి వెళ్లేప్పుడు ఇతర మహిళలు కూడా నాతో పాటు వచ్చేవారు. అక్కడ తీరుబడిగా తమ కథలు చెప్తుండేవారు. కొంతసేపు వాళ్ల ముచ్చట్లు విన్న తరువాత ఒకోసారి ఇంక చాలు దూరంగా వెళ్లండి, నాక్కొంచెం ఏకాంతం కావాలి అని గట్టిగా అనాల్సి వచ్చేది. నేను బాగా పరిచయం అయ్యాక క్రమంగా చాలామంది స్త్రీలు పోటీపడి మరీ తెల్లవారు జామున నాతో కలసి బహిర్భూమికి వచ్చేవారు. బహుశ నాకు రక్షణగా వుండాలనే ఉద్దేశంతోనే వాళ్లలా తోడొచ్చేవారేమో. బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన అక్కడ ఒక సామాజిక కార్యంగా మారింది. గ్రామీణ నిత్యజీవితంలో అదొక అంతర్భాగం. స్నేహితులతో కలసి చేసే ఒక సామూహిక కార్యక్రమమది. అయితే నేను మాత్రం దానికి పూర్తిగా అలవాటు పడలేకపోయాను. దొడ్డికి వెళ్లేందుకు ఏ ఇంట్లోనైనా మరుగుదొడ్డి వుందేమోనని తరచూ వెతికేదాన్ని. మాదిగలలో క్రైస్తవులు మొదటినుంచీ సొంత మరుగుదొడ్లను కలిగి వుండేవారు. అందువల్ల తరచూ క్రైస్తవుల ఇళ్లను ఎంచుకుని వెళ్లేదాన్ని. మరుగుదొడ్లను కట్టుకోడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసేది. కానీ ఇంటికి సమీపంలోనే వాటిని నిర్మించుకోవాలి కాబట్టి ఆ అవకాశాన్ని ఎక్కువమంది ఉపయోగించుకోలేక పోయేవారు. అప్పట్లో అన్ని కులాల వాళ్లూ ఇంట్లో మరుగుదొడ్డిని ఒక అరిష్టంగా భావించేవారు. 1990ల చివరి నాటికి ఆ ప్రాంతంలో చదువుకునే ఆడపిల్లల సంఖ్య పెరగడం, ఇంటికి వచ్చే కొత్త కోడళ్లు మరుగుదొడ్ల కోసం డిమాండ్‌ చేస్తుండటంతో ఈవిషయంలో అక్కడ మార్పు మొదలయింది.
శాంతా సిన్హా 1984లో శ్రామిక విద్యా పీఠంలో వున్నప్పుడు సిరిల్‌ ఆమెతో కలసి అందులో చాలా చురుకుగా పనిచేసేవాడు. అది హైదరాబాద్‌ యూనివర్సిటీకి అనుబంధంగా నడిచేది. వయోజన విద్య కోసం ఉద్దేశించిన ఆ సంస్థను శాంతా సిన్హా క్రమంగా బాల కార్మికులకు కూడా విస్తరించారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల గ్రామాల్లోని పేదలకు శ్రామిక విద్యా పీఠం సేవలు అందించేది. 1981లోనే శాంతా సిన్హా కుటుంబం ఆమె తాతగారైన మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్‌ను నెలకొల్పారు. వెంకటరంగయ్య ప్రముఖ విద్యావేత్త, చరిత్ర కారుడు. శాంతా సిన్హా శ్రామిక విద్యా పీఠం నుంచి వెళ్లిపోయి మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్‌ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పూర్తిగా అంకితమయ్యారు. ఆమె చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా మాగ్‌సెసే అవార్డు, పద్మశ్రీ అవార్డు లభించాయి.
మేము 1984లో హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని హెచ్‌బిటి ఆఫీసులోనే నివసించేవాళ్లం. అందులో పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పున్న నాలుగు గదులు, ఒక ఆరు బై నాలుగు అడుగుల చిన్న వంటిల్లు వుండేవి. ఒక గదిలో మేం వుండే వాళ్లం. మిగతా మూడు గదుల్లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆఫీసు నడిచేది. సిరిల్‌ స్థాపించిన సలహా సంస్థ కార్యాలయం కూడా ఆ సమీపంలోని మరో అద్దింట్లో వుండేది. మా ఇల్లూ, హెచ్‌బీటీ ఆఫీసూ రాత్రి పొద్దుపోయే వరకూ ఎప్పుడూ జనంతో సందడిగా వుండేవి.
ఇబ్రహీంపట్నంలో చాలా కాలం పనిచేసిన తరువాత నాకు ఎప్పుడెప్పుడు హైదరాబాద్‌కు వెళ్లిపోదామా అనిపించేది. ఒకోసారి చెప్పాపెట్టకుండా హైదరాబాద్‌కు వచ్చేసేదాన్ని. అలా పదిహేను రోజులకోసారి హైదరాబాద్‌కు వచ్చి ఒకటి రెండు రోజులుండి తిరిగి వెళ్లిపోయేదాన్ని. పండుగలప్పుడు, హైదరాబాద్‌లో కర్ఫ్యూ విధించినప్పుడు మాత్రం ఎక్కువ రోజులు వుండిపోతుండేదాన్ని. గ్రామాల్లో పండుగలప్పుడు జనం విపరీతంగా తాగుతుంటారు. ఆ సమయంలో ఎక్కువగా బయట తిరగొద్దని గ్రామస్తులు నన్ను హెచ్చరించేవారు. ఇబ్రహీంపట్నంలో వున్నరోజుల్లో పుస్తకాలూ, రాజకీయాలూ చర్చించే కోసం వెతికేదాన్ని, అలవాటుపడిన మంచి తిండి కోసం తపించిపోయేదాన్ని. హెచ్‌బీటీలో వుండగా నేను మధ్యతరగతి స్నేహితుల ఇళ్లలో తరచూ అడిగి వెళ్లి మరీ భోజనం చేస్తుండేదాన్ని. రకరకాల వంటకాలని చవిచూసేదాన్ని. రాయలసీమకు పనిమీద వెళ్లిన సందర్భాల్లో బస్సులోనో, ట్రైన్‌లోనో తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు ప్రొద్దుటిపూట కూడా వేడివేడి దోశలు, తాజా నాటుకోడి మాంసం పెట్టేవాళ్లు. ఇక కోస్తాంధ్రలో అయితే గుడ్లతో చేసే రకరకాల వంటకాలను వడ్డించేవారు. తెలంగాణలో చాలాచోట్ల మటన్‌ భోజనం సర్వసాధారణం. మధ్యతరగతి ఇళ్లలో ప్రత్యేకంగా రకరకాల పచ్చళ్లుంటాయి. వాటితో పాటు కూరగాయల శాకం, పెరుగు తప్పనిసరి. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో ప్రధాన ఆహారం జొన్న రొట్టెలూ, మిరపకాయ తొక్కూ. ఒకోసారి హంస రకం బియ్యంతో వండిన అన్నమూ, వెడల్పాటి బిన్నీసుకాయల కూరా పెట్టేవారు. లంబాడీ తాండాల్లో జొన్నరొట్టెతో పాటు కోవా ఇచ్చేవారు. పేదవాళ్లు తమకు కావలసిన శక్తిని పొందేందుకు కేవలం జొన్నలు, బియ్యం మీదే ఆధారపడేవారు. నేను తృణధాన్యాలను తక్కువగానూ, కూరగాయలూ, పళ్లూ, మాంసం ఎక్కువగానూ తీసుకునేదాన్ని. చాలా సంవత్సరాల వ్యవధి తరువాత మేం ఇబ్రహీంపట్నం వెళ్లినప్పుడు ఉదయం పూట అల్పాహారంగా కేవలం చాయ్‌ని మాత్రమే తీసుకునేవాళ్లం. ఒకోసారి హోటళ్లలో భోజనం చేసే వాళ్లం. అక్కడ చల్లారిపోయిన పూరీలు, పప్పు పెట్టేవారు. అన్నం, పప్పు, కూరగాయలతో భోంచేయడానికి చాలా చోట్ల చిన్నపాటి హోటళ్లు కూడా కనిపించేవి కావు. నా పక్కనున్న వాళ్లంతా నిగ్రహం పాటిస్తున్నప్పుడు నేను ఇలా తిండి కోసం వెంపర్లాడటం నాకే సిగ్గుగా అనిపించేది.
ఒకసారి ఇబ్రహీంపట్నం సమీపంలోని నోముల అనే గ్రామంలో ఒక మీటింగ్‌కి వెళ్లినప్పుడు జరిగిన సంగతి నాకు ఇంకా గుర్తుంది. ఆరోజు మీటింగ్‌ అయిపోయిన తరువాత నాకొక బీద వితంతు మహిళ ఇంట్లో బస ఏర్పాటు చేశారు. ఆమె నాకు ఒక జొన్న రొట్టె ఇస్తూ నంజుకోడానికి ఇంట్లో చట్నీ కూడా ఏమీ లేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఆతరువాత కాస్త జొన్నపిండి తీసుకుని, అందులో కొంచెం కారం, ఉప్పు కలిపి ఉడకబెట్టి అంబలి చేసిచ్చింది. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు 1983లో ఎన్‌.టి. రామారావు ప్రభుత్వం సబ్సిడీ రేటుతో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన తరువాత క్రమంగా ఇక్కడి జనానికి జొన్నరొట్టెలకు బదులు వరి అన్నం ప్రధాన ఆహారంగా మారిపోయింది.
కాలక్రమేణా నేను అక్కడ లోటా పట్టుకుని దొడ్డికి వెళ్లడం, బహిరంగ ప్రదేశంలో బట్టలతోనే స్నానం చేయడం అలవాటు చేసుకున్నాను. కాలినడక, సైకిల్‌ తొక్కడం ఎక్కువైనప్పుడు తీవ్ర అలసటకు గురయ్యేదాన్ని. కాస్త వేడన్నం వుంటే చాలు కారం వేసుకునైనా తృప్తిగా తినేదాన్ని. నాకు తెలంగాణ యాస నేర్చుకోడానికి చాలా సమయం పట్టింది. కొన్ని పదాల అర్థం తెలిసేది కాదు.
ఉదాహరణకి ఇక్కడ చాలామంది ప్రతి మాటకి ముందు ‘దెంగడం’ అనే పదాన్ని వాడేవాళ్లు. అన్ని నామవాచకాలకు, క్రియా పదాలకు ముందూ లేదా వెనకా ఆ పదాన్ని ఉపయోగించేవారు. అప్పు ఎగవేతను ‘ఎగ దెంగడం’ అనేవారు. ఇక వెళ్లిపో అనడానికి ‘ఇగ దెంగేయ్‌’ అనేవారు. అతను ఐదింటికే పొలానికి వెళ్లాడని చెప్పేందుకు ‘వాడు ఐదింటికే పొలానికి దెంగేసిండు’ అనేవారు. మొదట్లో ఆ పదం అర్థమేమిటో తెలియక నేను కూడా యధేచ్ఛగా ఉపయోగించేదాన్ని. సుప్రసిద్ధ ప్రజా ఐఏఎస్‌ అధికారి ఎస్‌.ఆర్‌. శంకరన్‌ నాకు గురువులాంటి వారు, అనేక విషయాల్లో సలహాలిచ్చేవారు. ఆయన కూడా నాలాగే అర్థం తెలియక ఒకసారి సభాముఖంగా ఆ పదాన్ని ఉచ్ఛరించారు. 1976 నాటి వెట్టి చాకిరీ కార్మికుల (నిర్మూలన) చట్టాన్ని ఎస్‌.ఆర్‌. శంకరన్‌ ఆ రోజుల్లో ఎంతో చిత్తశుద్ధితో అమలు పరుస్తుండేవారు.1985లో ఒకసారి వెట్టి కార్మికుల విచారణకోసం ఆయన రంగారెడ్డి జిల్లా కలక్టర్‌ జి. సుధీర్‌ని వెంటబెట్టుకుని గుంగల్‌ గ్రామానికి వచ్చారు. అప్పుడాయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా వున్నారు. ఆ సమావేశంలో చాలామంది ‘అప్పు ఎగదెంగడం’ అనే పదాన్ని పదేపదే ఉపయోగిస్తుండటంతో ఆయన కూడా ఒకసారి అదే మాటని యదాలాపంగా అన్నారు. అప్పుడు పక్కనున్న ఇతర అధికారుల మొహాలన్నీ ఒక్కసారిగా ఎర్రబడ్డాయి.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.