‘‘అత్తా.. అత్తా..’’ లోగొంతుకతో పిలుస్తూ గుమ్మంలో నిలబడి లోపలికి తొంగి చూసింది అనిత. కిటికీలోంచి పడుతున్న కొద్ది వెలుతురులో మంచం మీద ముడుచుకు పడుకున్న మల్లమ్మను చూసి ‘‘ఏమైందత్తా’’ అంటూ లోపలికొచ్చింది. ‘మూడు దినాలుగా దినమంతా నిల్సొని పత్తి పీకుడయితాంది. కాళ్ళు, నడుము ఒకటే గుంజుడు, లేవనీకి కావట్లేదు. ఒకటే నీరసం.. వయసైతాన్దిగా బిడ్డా!! సరేగాని, ఏందో అచ్చినవు?’ ప్రశ్నార్ధకంగా అడిగింది 40 ఏళ్ళైనా నిండని మల్లమ్మ.
‘ఏంలేదత్తా, నెల వస్తానే మైల బాగ అయితాన్ది. నాలుగు రోజులు ఎటూ పోలేకుండా చేస్తాంది. దానికి రెండు రోజులు ముందునించే రొమ్ములు సలుపుడు, కడుపులో నొప్పి. పనికి పోకపోడంతో కూలి పైసలు నష్టం ఐతున్నాయని ఇంట్లో ఒకటే పోరు. వారమేసి రోజులు దగ్గరకి రానీయట్లేదని ఆయన కోపం చేస్తుండు. సిగ్గిడిచి చెప్పినా ఇనడు. ఆళ్ళకి చెప్పలేక, ముగ్గురు పిల్లల్ని సాదలేక సావాలనిపిస్తాన్ది. నువ్వేదన్న ఉపాయం చెప్తావని నీకాడికొచ్చిన..’ కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుపు గొంతుతో చెప్పింది అనిత.
ఆధార్ కార్డులో వయసు మార్పించి పదిహేడేళ్ళు నిండకుండానే పెళ్ళి చేశారు అనిత అన్నయ్యలు. పెళ్ళైన ఐదేళ్ళలో ముగ్గురు పిల్లలు పుట్టారు, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. చిన్నోనికి ఇంకా రెండేళ్ళు నిండలా. భర్త మేస్త్రీ పనికి పక్కూర్లతోపాటు పట్నానికి కూడా పోతుంటాడు. పట్నం పనికి పోతే మాత్రం వారానికో, పది దినాలకో ఒకసారి వస్తాడు, రెండు మూడు రోజులుండి పోతాడు. వచ్చినప్పుడు తెచ్చిన పైసలు తిరిగి పోయేనాటికి ఖర్చుపెట్టేసి వందో, రెండొందలో ఇమ్మని అనితనే అడుగుతాడు.
రోజువారీ ఖర్చులకి, అత్తగారి బీపీ, షుగర్ మాత్రాలకి, ఇతర కుటుంబ అవసరాలకి కూలికి పోక తప్పని పరిస్థితి అనితది. చాలాసార్లు పిల్లల్ని అత్త దగ్గర వదిలేసి కూలి పనుల కోసం మిగతా వాళ్ళతో కలిసి పక్కూర్లకి ఎక్కడెక్కడికో పోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో నెల నెలా ఐదేసి రోజులు పనికి పోకపోవడం కష్టమైన విషయం అనితకి. అలాగని ఓపిక తెచ్చుకుని దగ్గరలో దొరికిన పనికి పోయినా రక్తస్రావం ఎక్కువగా అవుతు నప్పుడు బట్ట మార్చుకోడానికి దాపు లేక, మార్చుకోకుండా ఉండే పరస్థితి లేక పనికి పోవడం సాధ్యం కావడం లేదు. అలా అని పని పూర్తయ్యేదాకా ఆగి గంటల తరబడి ఎక్కడా కూర్చోకుండా సాయంత్రం ఇంటికి చేరాలంటే నడవాల్సి రావడంతో తడిబట్ట రాపిడికి తొడలు ఒరుసుకుపోయి అదింకో భరించలేని బాధ అయ్యింది.
అనిత పడుతున్న ఈ నానారకాల బాధలని గమనిస్తున్న పద్మ ఒకరోజు ఇద్దరూ కలిసి పనికి పోయినప్పుడు ఎంతకాలం భరిస్తావు అని అడిగింది. అంతేకాదు, ఏడాది క్రితం తను గర్భసంచి తీయిం చేసుకోడం వల్ల ఇప్పుడెంత హాయిగా ఉందో కూడా చెప్పింది. ఆపరేషన్‌కి అసలు యాభైవేలకి పైనే అవుతుందని, ఆ డాక్టర్ మాత్రం నలభై వేలలోపే బిల్లు వేశాడని, ఇప్పుడేమన్నా కొద్దోగొప్పో పెరిగుండొచ్చని అంది. ఇంకా, మన ఊర్లోనే మూడేళ్ళ క్రితం ఆపరేషన్ చేయించుకున్న ఆశమ్మ ద్వారా తెలుసుకుని వెళ్ళాననీ, మూడు రోజుల్లో పనైపోతుందని, అవసరమైతే మనూరి ఆర్ యం పి డాక్టరు కూడా సాయం చేస్తాడని, నీ బాధలన్నీటికీ విముక్తి ‘దాన్ని’ వదిలించుకోడమే అని పద్మ చెప్పిన మాటలు అమృతంలా అనిపించాయి అనితకి.
ఇక ఆ రాత్రంతా అదే ఆలోచన. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, ఈ విషయం భర్తకి ఎలా చెప్పాలి, అత్త ఏమంటుందో, హాస్పటల్‌లో ఉన్నప్పుడు పిల్లల్ని ఎవరు చూస్తారు, తనకా తల్లి లేదు, వదినలు రారు, చిన్నోడు తనని వదిలి ఉండడు, ఎలా.. ఏం చెయ్యాలి.. ఇవే ఆలోచనలతో నిద్ర పోలేదు. పొద్దున్న లేస్తూనే గబగబా ఇంటి పనులు చక్కబెట్టి, అత్తకి చాయ్ డబల్ రొట్టె, టాబ్లెట్లు ఇచ్చి, తనూ చాయ్ తాగింది. త్వరగా వంట పూర్తిచేసి, పెద్ద పిల్లలిద్దర్నీ రెడీ చేసి అంగన్వాడీ ఆయా దగ్గర వదుల్తూ ‘కాస్త చూసుకో అమ్మమ్మా’ అంటూ చిన్నోడిని చంకనేసుకుని ఇంటికొచ్చింది. ‘ఓసారి బాయికాడికి పొయొస్తా, ఈడ్ని చూసుకో’ అంటూ బట్టలు పిండుతున్న అత్త దగ్గర చిన్న కొడుకుని వదిలి చెప్పులేసుకుని బయటకి నడిచింది.
భర్తతో ఫోనులో చెపుదామని అనుకుంది కానీ ముందు తనవైపు నుండి సెట్ చేసుకోవాల్సినవి చేసుకున్నాక భర్తతో చెప్పాలని నిర్ణయించుకుంది. అందుకే సలహా కోసం మల్లమ్మ దగ్గరికి వచ్చింది. అంతా విన్న మల్లమ్మ తను కూడా అటువంటి పరిస్థితుల్లోనే గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నానని, తనకి తెల్లబట్ట సమస్య కూడా ఉండేదని, ఇప్పటికి ఆరేడేళ్ళు అయిపోయింది అంతా బాగుందని, ఇప్పుడు వయసుతో పాటు కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, నీరసం వచ్చినాయి కానీ లేకపోతే తను చాలా చురుగ్గా ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. ‘నలభై ఏళ్ళకే వయసై పోవడం ఏంటత్తా’ అని అన్నా దానిపైన ఇక పొడిగిం చలేదు, తన సమస్య ముందు అది అంత ప్రాధాన్య మైంది కాదనిపించి అనితకి.
అక్కడి నుండి తిన్నగా ఆశమ్మ ఇంటికెళ్ళింది. సంశయంగా గుమ్మంలోనే నిల్చున్న అనితని చూస్తూ ‘ఏమైంది అనితా ఇట్లొచ్చినావు, చేనుకాడికి పోదామని ఎల్తున్నా..’ అంటూ గడప మీద కూర్చుంది. ఎదురుగా కూర్చుంటూ ‘పెద్దమ్మా! పద్మ చెప్పింది. నేను కూడా ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నా. దవాఖాన వివరాలు అడిగితే అడ్రస్సు సరిగ్గా చెప్పలేకపోయింది. అప్పటి కాయితాలు చూసి ఫోన్ నంబరు కానీ, అడ్రస్సు కానీ చెప్పమంటే అవేవీ లేవంట. మందుల చీటి కూడా లేదంది. నిన్నడిగి వివరాలు తీసుకుందామని వచ్చిన’ అంటూ తన సమస్యలన్నీ చెప్పుకొచ్చింది.
‘మంచి నిర్ణయం. నన్ను చూడు, మూడేళ్ళు దాటింది, హాయిగా పని చేసుకుంటున్నా. పద్మ కూడా ఒక్కరోజూ నాగా లేకుండా పనికి పోగలుగుతోంది. ఏదో మాట మీదొచ్చి మొన్నే ఆ నరసయ్య కోడలు భారతి లేదూ.. ఆర్నెల్లు అయిందంట ఆపరేషన్ చేయించుకుని, పీడా పోయిందని సంతోషంగా చెప్పింది’ అంటున్న ఆశమ్మ మాటలకి అడ్డొచ్చి ‘మరి మల్లమ్మత్తకి నడుము నొప్పి, కాళ్ళు గుంజుడుతో చాలా బాధ పడుతోంది కదా పెద్దమ్మా, దీనివల్ల కాదంటావా’ కాస్త అనుమానంగా అడిగింది. దానికి ఆశమ్మ వయసుతో పాటు కీళ్ళ నొప్పులు రావా అంటూ తేల్చేసింది.
ఆపరేషన్ చేయించుకుందామని నిర్ణయించుకుంటే ఆర్‌యంపి డాక్టరుకు చెప్తానని, తనే దగ్గరుండి తీసుకెళ్తాడని, అవసరమైతే డబ్బు సాయం కూడా చేస్తాడని, కనీసం సగం పైసలు మాత్రం చూసుకోమని, భయపడేదేమి లేదని చెప్తూ ఇక పోవాలన్నట్టు లేచింది.
విషయం భర్తతో చెప్పి, డబ్బు గురించి ఆర్‌యంపి సాయం చేస్తాడని, తను ఇక పని మానుకోవలసిన అవసరం రాదు కాబట్టి ఏడాదిలో తీర్చేద్దాం అని ఒప్పించి, ఆ తర్వాతి ఏర్పాట్లన్నీ చకచకా చేసేసుకుంది అనిత. డైరెక్ట్‌గా ఆపరేషన్‌కి సిద్ధమయిపోయింది. తనతోపాటు తోడుగా హాస్పటల్‌లో ఆర్‌యంపి భార్య ఉండేలా నిర్ణయం అయింది.
టౌన్‌లో హాస్పటల్‌కి వెళ్ళినప్పుడు గోడమీద అతికించిన ‘ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు ఎటువంటి బీమాలు చెల్లవు’ అని చూసి అవేవీ తనకు లేవుగా అనుకుంది. ఒకరిద్దరి దగ్గర స్కానింగ్ రిపోర్టులు ఉండడం చూసి టీవీలో చూస్తారా అని డాక్టర్‌ని అడిగింది. ‘నువ్వు చెప్పినదాన్ని బట్టి చూస్తే అన్నీ స్పష్టంగా అర్ధమవు తున్నాయి, గర్భసంచి తీసేయాల్సిందే, దీనికి మళ్ళీ స్కానింగ్ అని, పరీక్షలని ఇంకో మూడు, నాలుగు వేలు ఖర్చు వేస్టు కదా! చేయాల్సిందే అంటే చెప్పు రాస్తాను’ అన్న డాక్టర్ మాటలకి ‘వద్దులే సారు’ అని ఊరుకుంది.
మూడు రోజుల తర్వాత తన బట్టలు పెట్టుకున్న ప్లాస్టిక్ కవర్‌తో పాటు బలానికంటూ నర్సు ఇచ్చిన మందుల కవర్ పట్టుకుని తనని తీసుకెళ్ళడానికి వచ్చిన భర్తతో కలిసి ‘తేలికైన కడుపుతో’ ఉత్సాహంగా ఇంటికి చేరుకుంది. ‘డబ్బు కట్టిన రశీదు, జాగ్రత్తగా పెట్టు’ అని భర్త ఇచ్చిన కాయితం ఇనప్పెట్టిలో దాచిపెట్టింది. అది అనిత పేరు, తేదీతో పాటు 53,000 చెల్లించినట్టు ఇంగ్లీషులో ఉన్న కంప్యూటర్ ప్రింటవుట్. డాక్టర్ పేరు కానీ, హాస్పిటల్ పేరు కానీ, అడ్రస్ కానీ, ఏమి ఆపరేషన్ చేశారో, ఏమేమి తీసేశారో.. ఎటువంటి వివరాలూ లేని ఎందుకూ పనిచేయని కాయితం ముక్క..
తనకింకా ఇరవై అయిదేళ్ళన్నా నిండని యుక్త వయసు కాబట్టి కొన్నేళ్ళు చాలాకీగానే ఉంటుందని, రాను రాను తనలో జరిగే హార్మోనల్ మార్పులు, దాని ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎవరు చెప్పాలి? మల్లమ్మ పడుతున్న యాతన చిన్నవయసులోనే గర్భసంచి తీసేయడం వల్ల అని ఎలా అర్ధం అవు తుంది!! వీళ్ళందరికి గర్భసంచితోపాటు అండాశయాలు, అండవాహికలు కూడా తీసేశారేమో, అది ఇంకెంత ప్రమాదామో ఎలా తెలుస్తుంది?! ఈ కానరాని హింసకి అంతమెక్కడ? చట్టం ఏది??
