అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార

(గత సంచిక తరువాయి…)
10. పని ఎక్కువ ` జీతం తక్కువ
నేను ఇబ్రహీంపట్నంలో వున్నప్పుడు నా స్నేహితులకూ, రాడికల్‌ రాజకీయాలు, పుస్తకాలు, సంస్కృతి గురించి వారితో జరిపే ఎడతెరిపిలేని చర్చలకూ దూరమైపోయాను. ఇక్కడి రోజువారీ విశేషాలను వారితో ఎప్పుడెప్పుడు పంచుకోవాలా అని తహతహగా వుండేది. వారం రోజుల కంటే ఎక్కువ కాలం వాటిని నాలో దాచుకోవాలంటే కష్టంగా అనిపించేది. అందుకే ఇబ్రహీంపట్నం సంగతులపై ‘మెయిన్‌ స్ట్రీమ్‌’ అనే ఇంగ్లీష్‌ వార పత్రికకు వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను.

వాళ్లు వాటిని వెంట వెంటనే ప్రచురిస్తుండేవారు. ఆ పత్రికలోని వాళ్లెవరితోనూ నాకు పరిచయం లేదు. అలాగే వారికి నేనెవర్నో తెలియదు. అయినా సరే మొట్టమొదటిసారి 1985లో మా సంఘం కార్యకర్త బండి శ్రీరాములు గురించి ఒక వ్యాసం పంపిస్తే వెంటనే ప్రచురించారు. ఇక అప్పటి నుంచీ ఆ పత్రికకు వరుసగా ఇబ్రహీంపట్నం గురించిన కథనాలు రాస్తూ వచ్చాను.
ఒకసారి నేను ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ‘సలహా’ సంస్థలోని న్యాయవాద మిత్రులు, సిరిల్‌ కనీస వేతనాల చట్టం, వెట్టి చాకిరీ (నిర్మూలన) చట్టం మీద ఒక వర్క్‌షాప్‌ని నిర్వహిస్తున్నారు. నేను కూడా అందులో పాల్గొన్నాను. వెట్టి చాకిరీ (నిర్మూలన) చట్టం 1976లో అత్యవసర పరిస్థితి సమయంలో అమలులోకి వచ్చింది. అది ఆంధ్ర ప్రదేశ్‌లో సుప్రసిద్ధ పౌర అధికారి ఎస్‌.ఆర్‌. శంకరన్‌ మనసులో పుట్టిన ఆలోచన. అయితే ఆ చట్టానికి పూర్వరంగం 1948లో ఏర్పడిరది. ఆనాటి కనీస వేతనాల చట్టంలో దేశంలోని అన్ని రకాల పనులకు తక్కువ స్థాయిలో అయినా సరే కనీస వేతనాలను నిర్ణయించారు. వాస్తవిక కనీస వేతనాలను నిర్ణయించే పనిని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేశారు. వాటిని ఎప్పటికప్పుడు సవరిస్తూ వచ్చారు. ఆ ప్రాంత స్థితిగతులను బట్టి, అక్కడి ఆర్థిక లావాదేవీలను బట్టి కూడా వేతనాలను నిర్ణయించవచ్చు. ఆంధ్ర ప్రదేశ్‌లో అప్పుడు మూడు జోన్లు వుండేవి. సాగునీటి సౌకర్యం వున్న ప్రాంతాలు, సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాలు, పొడి ప్రాంతాలు. నగరాలలోనూ, సాగు నీటి సౌకర్యం వున్న పాంతాలలోనూ వేతనాలు అత్యధిక స్థాయిలో వుంటే, ఇబ్రహీంపట్నం వంటి పొడి ప్రాంతాలలో వేతనాలు అత్యంత తక్కువ స్థాయిలో వుండేవి. స్వచ్ఛంద సంస్థల, దళిత సంఘాల కార్యకర్తలకోసం సలహా తరచూ అవగాహనా తరగతులను నిర్వహించేది. 1984 చివర్లో నేను అలాంటి ఓ సమావేశంలో పాల్గొన్నాను. అప్పుడు స్వల్ప వ్యవధి పర్యటన కోసం హైదరాబాద్‌కు వచ్చాను. ఇబ్రహీంపట్నంకు త్వరగా వెళ్లాల్సిన తొందరలో వున్నాను. నిజానికి ఆనాటి సమావేశం ప్రొసీడిరగ్స్‌ మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు. అయితే అక్కడ జరిగిన ఒక చర్చ నాకెంతో స్ఫూర్తి నిచ్చింది. కనీస వేతనాల కోసం జనాన్ని సంఘటితపరచడంలోని సాధ్యాసాధ్యాలను వాళ్లు చర్చించారు. అప్పుడు నాకు ఇబ్రహీంపట్నం జనం అన్న మాటలు గుర్తుకొచ్చాయి. తమకు ఎంత తక్కువ కూలీ ఇస్తున్నారో, దానివల్ల అప్పుల్లో ఎలా కూరుకుపోతున్నామో వాళ్లు నాకు చాలాసార్లు చెప్పారు. అందువల్ల కనీస వేతనాల చట్టం గురించిన ఈ చర్చలను వాళ్ల దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యతగా అనిపించింది. ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో సాధారణ వ్యవసాయ కార్మికులకు చట్టం నిర్ణయించిన కనీస వేతనం అప్పుడు రోజుకు ఎనిమిది రూపాయలు. కానీ అక్కడ ఆడవాళ్లకు కాలం లేనప్పుడు రోజు కూలీ కేవలం అర్ధరూపాయి మాత్రమే ఇస్తున్నారు. ఆరోజు నుంచీ నేను వాళ్లకు కనీస వేతనాల చట్టం గురించి వివరించడం, వీలైనప్పుడల్లా వారిని చైతన్య పరిచేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టాను.
నేను గుంగల్‌ గ్రామానికి వెళ్లే నాటికే పాల్‌ దివాకర్‌ ద్వారా శంకరయ్య పరిచయమయ్యాడు. ఒకరోజు అతను జలాల్‌మియాపల్లెకు కిలో మీటర్‌ దూరంలో వుండే తన ఊరు చీదేడ్‌కు నన్ను తీసుకెళ్లాడు. ఆ ఊళ్లో సిపిఎం పార్టీ నిరంకుశ ఆధిపత్యానికి వ్యతిరేకంగా చాలా కాలం నుంచి శంకరయ్య పోరాడుతున్నాడు. ఆ పార్టీవాళ్లు కనీస వేతనాల చట్టం గురించి ఎప్పుడూ మాట్లాడేవాళ్లు కాదట. దాని గురించి మాట్లాడితే తమకు అనుకూలంగా వున్న అక్కడి వాతావరణం దెబ్బతింటుందన్నది వారి ఉద్దేశం. కనీస వేతనాల చట్టం గురించీ దాని అమలుకు తీసుకోవలసిన చర్యల గురించీ తమ గ్రామస్తులకు వివరించమంటూ శంకరయ్య నన్ను వాళ్ల గ్రామానికి ఆహ్వానించాడు. చీదేడు చాలా చిన్న ఊరు. మొత్తం 150 ఇళ్లుంటాయి. ఒకనాడు సాయంత్రం నేను నడచుకుంటూ ఆ ఊరుకి వెళ్లాను. అక్కడ సుమారు ఇరవై మంది వ్యవసాయ కూలీలతో మాట్లాడాను. వాళ్లలో అత్యధికులు మాదిగలు. తెలగ కులానికి చెందినవాళ్లు కూడా చాలామందే వున్నారు. శంకరయ్య కోరినట్టు కనీస వేతనాల చట్టం, వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం, వాటి అమలుకు తీసుకోవలసిన చర్యల గురించి వివరించాను. ఆ తర్వాత వాళ్లంతా తమలో తాము గుసగుసగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొందరు పైకి గట్టిగా మాట్లాడారు. ప్రభుత్వ చట్టాలన్నీ పిచ్చి చట్టాలు, ఆచరణయోగ్యం కావని కొందరంటే, అసలు మనం అంతకంటే ఎక్కువ కూలీ అడగాలని మరికొందరన్నారు. బియ్యం, జొన్నలు, పప్పులు, ఉప్పులు అన్నింటి ధరలు పెరుగుతున్నా మన కూలీ ఎందుకు పెరగడం లేదని ఇంకొందరు ప్రశ్నించారు. ఏ భూస్వామి ఎలాంటి వాడో, ఎన్నెన్ని బాధలు పెడుతున్నాడో పరస్పరం చర్చించుకున్నారు. తమది కార్మికవర్గ పార్టీ అని చెప్పుకునే సిపిఎం ఇలాంటి సమస్యలను ఎందుకు లేవనెత్తదని ప్రశ్నించుకున్నారు. వాళ్లు ఆ మర్నాడే సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. బహుశా అది శంకరయ్యకు చెందిన ఊరు కావడమే వారి సాహసోపేత నిర్ణయానికి కారణం. శంకరయ్య మీదా, అతని మిత్రుల మీదా వారికంత గట్టి నమ్మకం.
ఊరి మధ్య కూడలిలో ఆ వ్యవసాయ కార్మికులంతా మూడు రోజుల పాటు పనులకు వెళ్లకుండా బైఠాయింపు జరిపారు. ఊరికే అలా కూర్చోవడం వల్ల ఏం ఫలితం వుంటుందో, వాళ్ల వ్యూహమేమిటో నాకు తెలియదు. కానీ, నేను కూడా వాళ్లతో పాటు అక్కడ కూచున్నాను. వాళ్లు రోజంతా పాటలు పాడారు, వచ్చే పోయేవాళ్లకి తాము ఎందుకు సమ్మె చేస్తున్నామో చెప్పారు. సలహా వర్క్‌షాప్‌లో నేను నేర్చుకుని వారికి చెప్పిన విషయాలను పొల్లుపోకుండా జనానికి వివరించారు. ఆ వ్యవసాయ కార్మికులు కోరుతున్న వేతనాలు నిజానికి ఆ అర్ధమెట్టభూమి ప్రాంతంలో ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాల కంటే కూడా చాలా తక్కువే. ఆరోజుల్లో ఆడవాళ్లకి రోజుకు రెండు రూపాయల చొప్పున, మగవాళ్లకు మూడు నుంచి నాలుగు రూపాయల చొప్పున కూలీ ఇచ్చేవారు. పొలాల్లో పనిచేసే జీతగాళ్లకు మూడు కుంచాల (కుండల) ధాన్యం అంటే రోజుకు సుమారు రెండు రూపాయల చొప్పున జీతం ఇచ్చేవారు. ఆ మూడు రోజులూ అక్కడ ఎంతో వేడిగా, వాడిగా చర్చలు జరిగాయి. భూస్వాములూ, సంపన్న రైతులూ వచ్చి మాతో చాలా రకాలుగా వాదించారు. ఒకవైపు ఎరువుల ధరలూ, పురుగు మందుల ధరలూ విపరీతంగా పెరిగిపోతుంటే, మరోవైపు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయి, అలాంటి పరిస్థితిలో వ్యవసాయ కార్మికుల జీతాలు పెంచితే తాము ఎలా సాగు చేయగలుగుతామనీ ప్రశ్నించారు. ‘వ్యవసాయం చేయలేకపోతే మానేయండి, లేదా మీ డిమాండ్లతో ప్రభుత్వం మీద పోరాడండి. అంతేకానీ కార్మికుల శ్రమను దోచుకోకండి’ అని నేనన్నాను. మూడోరోజు సంప్రదింపుల కోసం భూస్వాములు వచ్చి చర్చించారు. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాల స్థాయిలో కాకపోయినా కొంతమేరకు కూలీ రేట్లను పెంచేందుకు ఒప్పుకున్నారు. ఆరోజు నుంచీ ఆడవాళ్లకు రోజుకు మూడు రూపాయల నుంచి ఐదు రూపాయల కూలీ, మగవాళ్లకు ఆరు నుంచి ఏడు రూపాయల కూలీ, జీతగాళ్లకు నెలకు మూడు నుంచి నాలుగు కుంచాల వడ్లు అంటే నెలకు దాదాపు అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల జీతం ఇవ్వడం మొదలయ్యింది.
సమ్మె కాలంలో వ్యవసాయ కార్మికులకు సంబంధించిన అనేక ఇతర సమస్యల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించాం. నాకు పెద్దగా అవగాహన లేకపోయినా వాళ్లు తమ సమస్యలను నాతో పంచుకునేందుకు ముందుకొచ్చేవారు. వాళ్ల ఐకమత్యానికి వెట్టి చాకిరీ అనేది ఒక అడ్డంకిగా వుంది. సమ్మెనుంచి వెట్టి జీతగాళ్లు అర్ధంతరంగా వెళ్లిపోతుంటారనేది వ్యవసాయ కార్మికుల ఆరోపణ.
వాళ్లుకూడా తమతో కలిస్తే ఇక తిరుగుండదనేది వాళ్ల ఉద్దేశం. వ్యవసాయ పనులను ఎక్కువ కాలం నిరంతరంగా చేసేది జీతగాళ్లే. నిజానికి వాళ్లది వెట్టి చాకిరీ. పెద్ద జీతగాళ్లకి నెలకి మూడు కుంచాల ధాన్యం, పశువులను కాచే పిల్ల జీతగాళ్లకి అర కుంచెడు ధాన్యం జీతం. నగదు రూపంలో అయితే అది కేవలం నెలకి వంద రూపాయలే. కానీ వారికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం ఆరోజుల్లో నెలకి ఐదువందల రూపాయలు.
వ్యవసాయ కార్మికులు తరచూ అప్పులు తీసుకుంటుంటారు. అందుకు కారణాలు అనేకం. కుటుంబంలో ఎవరో ఒకరు జబ్బుపడటం, పెళ్లిళ్లు, చిన్నపాటి పొలం కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం మొదలైన సందర్భాల్లో అప్పులు చేయక తప్పదు. ఒక యజమాని వద్ద పని మానేసి మరో యజమాని వద్ద పనిలోకి వెళ్లాలంటే ముందుగా పాత యజమాని వద్ద తీసుకున్న అప్పును పూర్తిగా తీర్చాల్సి వుంటుంది. అలాంటప్పుడు కొత్త అప్పులు చేయక తప్పదు. వెయ్యి నుంచి మూడువేల రూపాయల వరకు ఆ అప్పులు వుంటాయి. కొన్ని అప్పులకు వడ్డీ వుండేది. మరికొన్ని అప్పులకు వడ్డీ వుండేదికాదు. పంటకోతల కాలానికి ప్రతీక అయిన ఉగాది పండగ రోజుల్లో ఎక్కువగా అప్పులు తీసుకోవడం జరుగుతుంటుంది. భూస్వామి అవసరాన్ని బట్టీ, ఆ రైతుల శ్రమ నైపుణ్యమూ వారి అవసరాలను బట్టీ అది వడ్డీతో కూడిన అప్పా లేక వడ్డీ లేకుండా ఇచ్చే అప్పా అనేది నిర్ణయించబడుతుంది. భూస్వామి దగ్గర ఒకసారి అప్పు తీసుకున్నాడంటే ఇక ఆ అప్పు తీరేంతవరకూ అతని దగ్గర జీతగాడిగా పడివుండాల్సిందే. అప్పు అనేది జీతగాళ్లకు ముందస్తుగా ఇచ్చే జీతం అన్నమాట. ఈ కారణంగానే వాళ్లు వ్యవసాయ కార్మికుల సమ్మెలో భాగస్వాములు అయ్యేవారు కాదు. పైగా ఆ సమ్మె విరమింపజేయడానికి ప్రయత్నించేవారు. భూస్వాములు జీతగాళ్ల నెలజీతాన్ని లెక్కగట్టి అందులోంచి కొంత బాకీ మొత్తాన్ని మినహాయించుకుని సీజన్‌ చివర్లో చెల్లిస్తుండేవారు. దానికి తోడు ఒక జత చెప్పులు, ఓ గొంగడి, కొంచెం పొగాకు కూడా ఇచ్చేవారు. అయితే అదేదో వారి ఉదారత్వం కాదు. జీతగాళ్లు తెల్లవారక ముందే పొలానికి వెళ్లి నీళ్ల మోటారును ఆన్‌ చేయాలి. ఆ చీకట్లో పాముకాటుకు గురయ్యే ప్రమాదం వుంటుంది. ఇక పంట కోతల రోజుల్లో అయితే వాళ్లు పొలాల్లోనే పడుకోవాలి. కొత్తగా పెళ్లయిన జీతగాడికి రాత్రిపూట తన భార్యతో గడిపేందుకు కూడా అవకాశం వుండదు. ఇబ్రహీంపట్నంకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలోని పోలేపల్లి గ్రామంలో అల్వాల్‌ రెడ్డి అనే భూస్వామి దుర్మార్గాల గురించి నేను కొన్ని కథలు విన్నాను. అతను తనదగ్గర పనిచేసే జీతగాళ్లను రాత్రుళ్లు పొలంలోని మోటారు బావుల దగ్గర పడుకొమ్మని బలవంతంగా పంపించేసి, వాళ్ల భార్యల్ని తన గడీకి రప్పించుకునేవాడట.
జీతగాళ్లు సమ్మె చేయలేకపోయేవారు. మరొక భూస్వామి వద్ద పని చూసుకుందామంటే పాత భూస్వామి వద్ద తీసుకున్న అప్పును పూర్తిగా తీర్చేయాలి. వాళ్లకు ఉన్న దొక్కటే దారి. కొత్త భూస్వామి వద్ద పనిలో చేరి అతని చేత ఆ బాకీని తీర్చేలా ఒప్పందం కుదుర్చుకోవడం. దానర్థం పాత భూస్వామిని వదిలించుకుని మరో కొత్త భూస్వామికి బానిస కావడమే. అంటే వాళ్లలా జీవితాంతం వెట్టిచాకిరీ చేస్తూపోవాల్సిందే. ఆ వెట్టి చాకిరీ అనేది తాతల నుంచి తండ్రులకూ, తండ్రుల నుంచి కొడుకులకూ, మనవళ్లకూ తరతరాలు వారసత్వంగా సంక్రమిస్తూనే వుంటుంది.
చీదేడులో సమస్యను సాగదీయకుండా సత్వర పరిష్కారానికి భూస్వాములు ముందుకు రావడంతో సమ్మె విజయవంతమయింది. ఆ తరువాత మేం వెంటనే మరిన్ని సమస్యలపై దృష్టిని సారించాం. ఈ క్రమంలో మొదటగా గుంగల్‌ గ్రామంలో మాదిగ కులానికి చెందిన బుగ్గయ్య కేసును చేపట్టాం. ఒక భూస్వామి అడవి పందులు రాకుండా తన పొలంలో ఏర్పాటు చేసిన కరెంట్‌ తీగల కంచె కారణంగా బుగ్గయ్య ప్రాణాలు కోల్పోయాడు. బుగ్గయ్యను కావాలనే ఆ తీగల మీదకు నెట్టి హత్య చేశారనేది మాదిగల అనుమానం. మేం వెంటనే క్రిమినల్‌ కేస్‌ ఫైల్‌ చేయాలని పోలీసులను ఒత్తిడి చేశాం. చివరకు బుగ్గయ్య భార్యకు నష్టపరిహారం ఇప్పించాం, ఆమెకు బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉపాధి కల్పించాం.
ఈలోగా సలహా సంస్థ కనీస వేతనాలు, వెట్టి చాకిరీ నిర్మూలనా చట్టాలపై కరపత్రాలనూ, ఆకర్షణీయమైన పోస్టర్లనూ ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలకూ, కార్యశీల సంఘాలకూ పంపిణీ చేసింది. ఇబ్రహీంపట్నంలో మేం వాటిని బాగా ఉపయోగించుకున్నాం. అప్పుడు పాల్‌ దివాకర్‌కు సంబంధించిన వాటర్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సిబ్బంది ఎంతగానో సహాయం చేశారు. నేను అడిగిన అనేక ప్రశ్నలకు వాళ్లు ఓపికగా సమాధానాలు చెప్పేవారు. అయితే ఎందుకో గానీ వాళ్లు చాలా జంకుతున్నట్టు నాకనిపించేది. ఆ తర్వాత కొన్నాళ్లకే వాళ్ల జంకుకు కారణం ఏమిటో తెలిసింది.
ఈ రెచ్చగొట్టే ప్రచారాన్ని ఊళ్లో ఇంత ధైర్యంగా ఎవరు చేస్తున్నారంటూ భూస్వాములూ, స్థానిక సిపిఎం నాయకులూ ఆరా తీయడం, కాస్త తలెత్తుకు తిరిగే వాళ్లని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మళ్లీ ఎవరైనా అలాంటి కరపత్రాలను పంచినా, పోస్టర్లను అంటించినా కాళ్లు విరగ్గొడతాం అంటూ జనాన్ని హెచ్చరించారు. ఒత్తిడి ఎక్కువవడంతో వాటర్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వారు మాకు మద్దతు ఇవ్వడం మానేశారు. హైదరాబాద్‌లోని వారి పైఅధికారులు కూడా వాళ్లని గట్టిగా మందలించారట. భూస్వాములూ, రాజకీయ నాయకులూ హైదరాబాద్‌లో వాటర్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి మీ సిబ్బంది ఇబ్రహీంపట్నంలో విప్లవాన్ని రాజేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. చివరికి వాటర్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సిబ్బందిలో కేవలం శంకరయ్య, బుగ్గయ్యలు మాత్రమే నాతో ఉండిపోయారు. జ్ఞానేశ్వరి, సత్యవతి వేరే చోటుకి వెళ్లిపోయారు. వాటర్‌ డెవెలప్‌మెంట్‌ సొసైటీ ఒక స్వచ్ఛంద సంస్థ కావడం, దానికి విదేశీ సహాయం అందుతుండటంతో సీపీఎం పార్టీవాళ్లు మా ఉద్యమం ప్రమాదకరమైనదనీ, రైతులకూ కూలీలకూ మధ్య గొడవలు సృష్టించి భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ సామ్రాజ్యవాద శక్తులు ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నాయనీ ప్రచారం చేశారు. ఆతరువాత కొన్నాళ్లకే వాటర్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఇబ్రహీంపట్నంలోని తన కార్యాలయాన్నే మూసేసింది. విచిత్రం ఏమిటంటే ఆ సంస్థకు చెందిన పది ఎకరాల స్థిరాస్తిని మాకు శత్రువుగా మారిన మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి తక్కువ ధరకి సొంతం చేసుకున్నాడు. అక్కడ అతను ఒక కొత్త కాలనీని నిర్మించి ఆ తదనంతరం తన తండ్రి స్మృతికి ప్రతీకగా దాని పేరును భూపాల్‌ రెడ్డి నగర్‌గా మార్చాడు.
చీదేడులో స్వల్ప విజయం లభించిన తరువాత చుట్టు పక్కల గ్రామాల జనం శంకరయ్యనూ, బుగ్గయ్యనూ, నన్నూ కలవడం మొదలు పెట్టారు. నేను గుంగల్‌లోనే వుండడం వల్ల అక్కడి మాదిగ వాడలో దాదాపు రోజూ ఓ సమావేశం జరిగేది. అలాగే మమ్మల్ని రమ్మని పిలిచిన ప్రతి గ్రామానికి మేం ముగ్గురం కలసి వెళ్లేవాళ్లం. కనీస వేతనాల చట్టం గురించీ, వెట్టి చాకిరీ నిర్మూలనా చట్టం గురించీ మేం వాళ్లకి వివరించేవాళ్లం. తమ జీవితాలు బాగు పడాలంటే వ్యవసాయ కార్మికులంతా ఏకం కావాలని చెప్పేవాళ్లం.
ఇప్పుడు మేం వ్యవసాయ కార్మికులూ, జీతగాళ్లూ కలిసికట్టుగా నడిచేట్టు చేయాలి. ఇబ్రహీంపట్నంలో ఈ జీతం అనేది 1976 నాటి వెట్టి చాకిరీ నిర్మూలనా చట్టం నియమాలకు పూర్తిగా విరుద్ధమైనది. వెట్టి చాకిరీ కార్మికులను వెట్టి నుంచి విముక్తి చేసే, వారి అప్పులను రద్దు చేసే బాధ్యతను ఆ చట్టం తహశీల్దార్లకు అప్పగించింది. ఆ చట్టం అమలులోకి వచ్చిన తరువాత కూడా సంస్థాగత వెట్టి చాకిరీ కొనసాగితే అది చట్టవ్యతిరేక చర్య కిందకు వస్తుంది. తమ వద్ద వెట్టి చాకిరీ కార్మికులున్న భూస్వాములపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం తహశీల్దార్లకూ, పోలీసులకూ అధికారమిచ్చింది.
మేం గ్రామంలోని వెట్టి చాకిరీ కార్మికుల జాబితాను తయారుచేశాం. అదంత సులభమైన పనేం కాదు. ఆ జాబితాలో పేర్లు నమోదు చేస్తుంటే చాలామంది వెట్టి చాకిరీ కార్మికులు భయపడేవారు. జాబితాను తయారుచేయడాన్ని రెచ్చగొట్టే చర్యగా తమ భూస్వాములు ఎక్కడ పరిగణిస్తారో అని జంకేవారు. వెట్టి చాకిరీపై పిటిషన్లను ఆయా రెవెన్యూ అధికార్లకు లేదా ఇబ్రహీంపట్నం తహశీల్దారుకు ఎలా ఇవ్వాలో వారికి వివరించాం. తొలుత గుంగల్‌, నల్లవెల్లి, మొండిగౌరెల్లి, గడ్డమల్లాయిగూడెం గ్రామాలలో తయారుచేసిన పిటిషన్ల మీద ఒక్కటంటే ఒక్క వెట్టి చాకిరీ కార్మికుడి సంతకం లేదు, అన్నీ వేలి ముద్రలే. అంటే ఎవ్వరికీ సంతకం పెట్టడం రాదు. జీతగాళ్లు తమకు చట్టబద్ధంగా రూ.135ల కనీస వేతనాన్ని ఇవ్వాలంటూ పనిని ఆపి సమ్మెచేశారు. భూస్వాములు ఒప్పుకోలేదు. మేం 1984 డిసెంబర్‌ మొదటివారంలో వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం కింద తహశీల్దారుకు దరఖాస్తులను ఇచ్చాం. శంకరయ్య, బుగ్గయ్య, నేనూ తోడుగా నడవగా వెట్టి చాకిరీ కార్మికులు వాటిని ఆయా కార్యాలయాల్లో ఫైల్‌ చేశారు.
గడ్డమల్లాయిగూడెం గ్రామంలో ఎక్కువగా గొర్రెల్ని కాచే కురుమ కులస్తులు వుంటారు. మా కార్యకలాపాలకు కేంద్రమైన గుంగల్‌కు ఆ ఊరు ఒక కిలోమీటర్‌ దూరంలోనే వుంటుంది. మేం దాదాపు ప్రతిరోజూ ఆ ఊరి మీదుగానే వెళ్తూ వస్తూ వుండేవాళ్లం. మొదట్లో గడ్డమల్లాయిగూడెం నుంచి కొందరు గుంగల్‌లో జరిగే మా సమావేశాలకు హాజరయ్యేవారు. ఇక్కడి భూస్వాములకు గడ్డమల్లాయిగూడెంలో భూములున్నాయి. అందువల్ల గుంగల్‌ లోని వెట్టి చాకిరీ కార్మికులకు గడ్డమల్లాయిగూడెంలోని వెట్టి చాకిరీ కార్మికులతో మంచి పరిచయాలున్నాయి. వాళ్లలో ఎక్కువమంది కురుమ కులానికి చెందినవాళ్లు. కురుమలు, ఇతర వెనుకబడిన తరగతులవారు మాతో చేతులు కలపడంలో వాళ్లే ముఖ్యపాత్రను పోషించారు. మాదిగల మాదిరిగా కాకుండా కురుమలు కొంత భయస్తులు. మొదట్లో ముందడుగు వేయడానికి వెనుకాడారు. వాళ్ల బంధువుల మాటే వాళ్లకు ముఖ్యం. అందువల్ల ఇతర కులస్తులతో కలసి బహిరంగ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇష్టపడేవారు కాదు. గడ్డమల్లాయిగూడెం వెట్టి కార్మికులు మాతో కలసిన తరువాత, ఇతర గ్రామాలలోని వారి బంధువులు కూడా నెమ్మదిగా మావైపు రావడం మొదలయింది. మిగతా మూడు గ్రామాలలోని వెట్టి చాకిరీ కార్మికులు ప్రధానంగా మాదిగ కులానికి చెందినవాళ్లు. తెలగ, మంగలి, చాకలి, మాల కులాలకు చెందిన వాళ్లు కూడా గణనీయంగానే వుండేవారు.
ఆ తర్వాత వెట్టి చాకిరీ కూలీలంతా కలసి హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఒక రిప్రజెంటేషన్‌ను ఇచ్చారు. దాంతో ఇబ్రహీంపట్నం తహశీల్దారు వచ్చి గ్రామ పంచాయితీ కార్యాలయాలలో బహిరంగ విచారణను చేపట్టారు. తనను కాదని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినందుకు తహశీల్దారు చాలా కోపంగా వుంది. చాలామంది వెట్టి చాకిరీ కూలీలకు తహశీల్దారు విచారణ ఎదురుదెబ్బ తగిలేలా, తమ దరఖాస్తుల్ని వెనక్కి తీసుకునేలా చేసింది. గ్రామ సర్పంచి, పట్వారీ, భూస్వాముల గుంపు ఇలా అన్నివైపుల నుంచీ వారి మీద తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయి. కొందరు కూలీలు విచారణ సమయంలో భయపడి తహశీల్దారు ముందుకే రాలేదు. కొద్ది మంది కూలీలు మాత్రమే చివరి వరకూ గట్టిగా నిలబడ్డారు. దాంతో గ్రామానికి పది పదిహేనుమంది కూలీలు వెట్టి చాకిరీనుంచి విముక్తులయ్యారు. 1985 జనవరి 10న వెట్టి చాకిరీ నిర్మూలనా చట్టం కింద వారిని వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేస్తున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ఆ చర్య జనంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడిన ఒక కీలకమైన పరిణామం. అంతకు పూర్వమైతే వ్యవసాయ కూలీలను ప్రభుత్వ కార్యాలయాల వరకు తీసుకువెళ్లాలంటేనే కష్టమయ్యేది. ఆరోజుల్లో ఊళ్లోకి తహశీల్దారు వస్తున్నాడని తెలిస్తే చాలు తమ తల్లిదండ్రులు ఇంట్లోంచి పారిపోయి ఎక్కడో దాక్కునేవారన్న సంగతి అక్కడి వాళ్లకి ఇప్పటికీ గుర్తుంది. నలభై ఏళ్ల క్రితం తహశీల్దారు ప్రధాన బాధ్యత భూమి శిస్తు వసూలు చేయడమే. శిస్తు వసూలుతో పాటు ఆయన మామూళ్లను దండుకునేవాడు, మేకలను తీసుకుపోయేవాడు, స్త్రీలను వేధించేవాడు. కాలక్రమంలో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. దాంతో జనం రేషన్‌ కార్డులు, కులం సర్టిఫికెట్లు, ఆదాయం సర్టిఫికెట్లు మొదలైనవాటిని పొందేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం అనివార్యమైంది. అయితే పైరవీకార్ల సహాయం లేకుండా పేద ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు సాహసించేవారు కాదు. వాళ్లకి పెద్ద మొత్తంలో కమిషన్‌ ఇవ్వాల్సి వచ్చేది. ఊళ్లల్లో సాధారణంగా ఏ భూస్వామి కొడుకో పైరవికారుడిగా వ్యవహరించేవాడు. క్రమంగా ఇతర కులాలలోని చదువుకున్నవారు కూడా పైరవీకారులుగా రంగప్రవేశం చేశారు. నేను గుంగల్‌లో వుంటున్నప్పుడు అక్కడ దళితులు స్థానిక ప్రభుత్వంతో తమ పనులకోసం ఒక బైండ్ల (మాదిగలలో ఒక ఉపకులం) యువకుడితో పైరవీ పనులను చేయించుకునేవారు.
నేను ఇబ్రహీంపట్నం వెళ్లిన తొలినాళ్లలో నందివనపర్తి గ్రామానికి చెందిన బండి శ్రీరాములు అనే మాల కులానికి చెందిన నిర్భయస్తుడైన వ్యక్తి గురించి విన్నాను. నందివనపర్తి యాచారంకు పశ్చిమం వైపున మూడు కిలోమీటర్ల దూరంలో వుంది. బండి శ్రీరాములు ఒక మాజీ సైనికోద్యోగి. తన తోటి దళితులను ఆయా సందర్భాలలో పోలీస్‌ స్టేషన్‌కూ, ప్రభుత్వ కార్యాలయాలకూ తీసుకెళ్తుండేవాడు. అతనూ ఒకరకంగా పైరవీకారే. ఎలాంటి మొండి అధికార్లకైనా, మొండి కేసులకైనా భయపడేవాడు కాదు. నేను ఆయన గురించి ఎంతో ఆసక్తిగా వివరాలు సేకరించాను. శ్రీరాములు తండ్రి రామయ్య నందివనపర్తిలోనే ఒక వెట్టి చాకిరీ కూలీ. చదువురాని, అనాథ అయిన రామయ్యను బలవంతంగా తీసుకుపోయి ఆనాటి నిజాం సైన్యంలో చేర్చుకున్నారు. 1948లో భారత సైన్యం నిజాం రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత రామయ్య తన గ్రామానికి తిరిగి వచ్చి పశువుల కాపరిగా పనిచేస్తుండేవాడు. నందివనపర్తి గ్రామానికి పశ్చిమాన ఓంకారేశ్వర స్వామి దేవాలయం వుంది. ఆ దేవాలయంలో గర్భగుడిలోని శివలింగానికి ఎదురుగా నంది ఏకశిలా విగ్రహం వుంది. దాని మూలంగానే ఆ గ్రామానికి నందివనపర్తి అన్న పేరు వచ్చింది.
ఒక రోజు ఆ దేవాలయం ముందు ఏదో నాటక ప్రదర్శన జరుగుతోంది. ఎప్పటిలాగానే రెడ్డి, బ్రాహ్మణ కులస్తులు గుడి మెట్ల మీద కూర్చుని, దళితులు నేల మీద కూర్చుని ఆ నాటకాన్ని చూస్తున్నారు. అప్పుడు బండి రామయ్య అక్కడికి వచ్చి తను కూడా మెట్ల మీద కూర్చున్నాడు. రెడ్డి కులానికి చెందిన ఓ పోలీసు పటేల్‌ కోపంతో ఊగిపోతూ ‘ఇక్కడ పటేళ్లంతా కూర్చున్నారు. కండ్లు కనిపిస్తలేవారా?’ అని గద్దించాడు. రామయ్య తాపీగా ‘అయ్యా నేను అంటరానివాడినైతే దేవుండ్లు నన్ను మీ కండ్ల ముందు నుంచి మాయం చెయ్యమనండి’ అటూ లేవడానికి నిరాకరించాడు. దాంతో అగ్రకులస్తులంతా రుసరుసలాడుతూ కట్టకట్టుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రామయ్య మాజీ సైనికోద్యోగి కావడం వల్ల అక్కడి నుంచి ఈడ్చిపారేయడానికి సాహసించలేకపోయారు. చట్టప్రకారం తమకా అధికారం లేదని సబ్‌ ఇన్స్‌పెక్టర్‌కు తెలుసు. అందుకే జోక్యం చేసుకోలేదు. ఆ వార్త ఊరంతా పాకిపోయింది.
బండి రామయ్య కొడుకు బండి శ్రీరాములు ఆ ఊరి బడిలోనే చదువుకునేవాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తున్న తండ్రి కోసం ఆ కుర్రవాడు టిఫిన్‌ తీసుకుని పొలానికి వెళ్లాడు. తాగడానికి నీళ్ల కోసం అతను పక్కనే వున్న అగ్రకులస్తుల బావి వద్దకు వెళ్లాడు. అదిచూసి అగ్రకులస్తులు మా బావిని మైలపరిచేందుకు వచ్చావారా అంటూ ఆ కుర్రవాడి చెంప చెళ్లు మనిపించారు. శ్రీరాములు ఏడుస్తూ వెళ్లి తండ్రికి జరిగిన సంగతి చెప్పాడు. అప్పుడు రామయ్య పరుగున వెళ్లి అదే బావిలో దూకేశాడు. ‘నేను అంటరానివాన్నైతే ఈ నీళ్లన్నీ మాయమైపోవాలి’ అంటూ బావిలోంచే అరిచాడు. ఈ సంఘటన గురించి కూడా ఊళ్లో కథలు కథలుగా చెప్పుకునేవారు.
బండి శ్రీరాములు జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన 1971లో జరిగింది. ఊళ్లో ఓ అగ్రకులస్తుడు నడిపే చిన్న హోటల్లో దళితుల కోసం విడిగా పధ్నాలుగు గ్లాసులుండేవి. గుర్తుగా మాలలకు కేటాయించిన గ్లాసులకు పసుపు రంగు, మాదిగలకు కేటాయించిన గ్లాసులకు ఎరుపు రంగు వుండేది. బండి శ్రీరాములు ఆ హోటల్‌కు వచ్చి, పైసలిచ్చి మాల గ్లాసులో చాయ్‌ తీసుకుని, తాగకుండా అక్కడే పారబోసి వెళ్లి పోయాడు. ఆరేళ్లపాటు ఇలాగే చేస్తూపోయాడు. ఒకరోజు అతని మనసు ఎందుకో మారింది. మాల గ్లాసులో చాయ్‌ తీసుకుని తాగేసి ఆ హోటళ్లోని మొత్తం పద్నాలుగు ప్రత్యేక గ్లాసులను పగులగొట్టేశాడు. ఆతర్వాత ఇంకో చాయ్‌ ఇవ్వమని అడిగాడు. హోటల్‌ యజమాని కోపంగా నీకు ఇవ్వడానికి ఇంక గ్లాసులు లేవు అన్నాడు. దాంతో పక్కన రెడ్డికులస్తుడి ముందు పెట్టిన గ్లాసును తీసుకున్నాడు. చాయ్‌ తాగి వెళ్లిపోబోతుంటే అగ్రకులస్తులు అతడి మీద విరుచుకుపడ్డారు. శ్రీరాములు వెంటనే పొయ్యిలోంచి ఓ మండుతున్న కట్టెను తీసుకుని కసిగా ఆ హోటల్‌ లోని మొత్తం గ్లాసులన్నింటినీ పగులగొట్టాడు. ఈలోగా ఊళ్లోంచి మరికొందరు రెడ్డి కులస్తులు సైకిల్‌ చైన్లు, కర్రలు పట్టుకుని పరుగెత్తుకుని వచ్చారు. శ్రీరాములుని స్పృహతప్పేంతవరకూ చితక్కొట్టి ఈడ్చుకుంటూ ఓ పాడుబడ్డ ఇంట్లో పడేశారు. ఈ విషయం తెలిసిన రామయ్య దెబ్బతిన్న తన కొడుకు కోసం వెళ్లకుండా నేరుగా హోటల్‌ వద్దకు వచ్చి దానికి నిప్పంటించాడు. ఒక రెడ్డి కులస్తుడు రామయ్యను అడ్డుకోబోయాడు కానీ రామయ్య ధాటికి ఆగలేక వెనుతిరిగి పరుగందుకున్నాడు. రామయ్య అతడిని వెంబడిరచి పట్టుకుని చితకబాది ఆతరువాత గాయపడిన తన కొడుకును వెతుక్కుంటూ వెళ్లాడు.
ఇది జరిగిన మూడేళ్ల తర్వాత బండి శ్రీరాములు భారతీయ సైన్యంలో చేరాడు. పదేళ్లపాటు సైన్యంలో బుల్‌డోజర్‌ డ్రైవర్‌గా బెంగళూరు, నాగాలాండ్‌, చండీఘర్‌లలో పనిచేశాడు. పదవీ విరమణ అనంతరం తన ఊరుకు తిరిగి వచ్చి సిపిఎం పార్టీలో చేరాడు. అయితే ఊళ్లో ఒక ముస్లిం యువకుడూ, ఓ కురుమ యువతీ ప్రేమించుకుంటే సిపిఎం పార్టీ వారిని విడదీసేందుకు ప్రయత్నించడం చూసి ఆగ్రహించి ఆ పార్టీ లోంచి బయటికి వచ్చేశాడు. 1985లో బండి శ్రీరాములు మాతో కలసి సంఘంలో చురుకుగా పనిచేశాడు.
ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘం తరఫున ప్రధానంగా దళితులు తలెత్తుకుని ఎలా నడవాలి, ఏదైనా ఆఫీసుకు వెళ్లినప్పుడు అక్కడున్న కుర్చీల్లో ఎలా నిర్భయంగా కూర్చోవాలి, వచ్చిన పనిగురించి అక్కడి అధికార్లకు జంకూ గొంకూ లేకుండా ఎలా చెప్పాలి వంటి విషయాల్లో తర్ఫీదు ఇచ్చేవాళ్లం. ఇకనుంచీ ఎవరి ముందూ చేతులు జోడిరచ కూడదనీ, తలగోక్కుంటూ నిలబడొద్దనీ, భయంతో తలుపు వెనక దాక్కోవద్దనీ, అజ్ఞానాన్నీ ఆత్మన్యూనతనీ వదిలించుకోవాలనీ బోధించేవాళ్లం. మొండి రకం వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో చెప్పేవాళ్లం. పహానీ కోసమో, కులం సర్టిఫికెట్‌ కోసమో రెవెన్యూ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఏ అధికారి అయినా ‘పందుకివ్వాలి మీకు’ అని దబాయిస్తే ‘ఎందుకివ్వరు’ అని మీరూ ఎదురు ప్రశ్నించాలి. ‘మాకు ఇవ్వకూడదని ఎక్కడైనా రాసివుందా? వుంటే చూపించండి వెళ్లిపోతాం’ అనాలి. ఒకవేళ ఎవరైనా ‘గెట్‌ అవుట్‌’ అని అరిస్తే ‘ఇదేం మీ ఇల్లు కాదు, ప్రభుత్వ కార్యాలయం. మేం కడుతున్న పన్నులతోనే ఈ కార్యాలయం నడుస్తోంది. ఇక్కడ మీరు ప్రభుత్వ సేవకులు మాత్రమే, మేం దీని యజమానుల్లో అంతర్భాగం’ అని చెప్పాలి అంటూ వారిని చైతన్యపరిచేవాళ్లం.
క్రమంగా అక్కడ చాలామంది యువకులు సాంప్రదాయిక పంచెలు కట్టుకోవడం మానేయడాన్ని, నాయకులవగానే పాంట్లు, షర్టులు ధరించడాన్ని నేను గమనించాను. పంచెలు కట్టుకుని వెళ్లినప్పటికంటే ప్యాంట్లు వేసుకుని వెళ్లినప్పుడు మండల కార్యాలయ సిబ్బంది ఎక్కువ మర్యాద ఇస్తున్నట్టు వాళ్లు నాకు చెప్పారు. యుక్త వయసులో నేను కూడా అలాగే పాంట్లూ షర్టులూ వేసుకోవాలకునేదాన్ని. 1960లలోనైతే మా కుటుంబం ఆ కోరికను నిరాకరించింది. నేను పట్టుదలగా బట్టలు కుట్టడానికి సంబంధించిన ఒక పుస్తకం కొనుక్కుని, కుట్టడం నేర్చుకున్నాను. నా పాంట్లను నేనే కుట్టుకుని, అవి అంత బాగా రాకపోయినా వాటినే ఇష్టంగా వేసుకునేదాన్ని.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.