గురుజాడ సాహిత్యం .. స్త్రీ అభ్యుదయ దృక్పథం – మమత వేపాడ

కవి శేఖర బిరుదాంకితుడు ఉత్తరాంధ్రకే కాకుండా యావత్‌ ఆధునిక తెలుగు సాహిత్యానికే యుగకర్తగా నిలిచినవాడు గురజాడ. గురజాడ తన రచనలు అభ్యుదయ కాంక్షతో చేసినవే. సమాజంలోని పేరుకుపోయిన రుగ్మతలను వేలెత్తి చూపిన వాడు గురజాడ అప్పారావు. ‘అభ్యుదయం’ అనే పేరు గురజాడ తర్వాత కాలరచనల్లో ఏర్పడిరది.

మరి గురజాడ అప్పారావు గారి రచనల్లో అభ్యుదయ దృక్పథాంశాలు ఉన్నాయా? లేవా అనే అంశాలు గురించి తెలుసుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. గురజాడ గురించి తెలుసుకునే ముందు అభ్యుదయం అంటే ఏంటో తెలుసుకోవాలి.
ఉపోద్ఘాతం:
సాహిత్యానికి సమాజానికి ఎప్పుడూ విడదీయరాని సంబంధం ఉంటుంది. సమాజం లేకుండా సాహిత్యం లేదు. ఏ కాలంలోని సమాజం గురించి తెలుసుకోవాలన్న ఆకాలంలో వచ్చిన సాహిత్యమే ఎక్కువ ఉపయోగపడుతుంది. అందుకే సమాజ దర్పణమే సాహిత్యం అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత రచయిత మాక్సిమ్‌ గోర్కి.
అభ్యుదయం అంటే ఏంటి?
అభ్యుదయం అంటే అభివృద్ధి, ఎదుగుదల, ఉన్నతి, శ్రేయస్సు అనే అర్ధాలు ఉన్నాయి. అభ్యుదయం అనే మాటకు మంగళం, శుభం అనే నైఘంటికార్థాలున్నాయి. ప్రోగ్రెస్‌ అనేది ఇంగ్లీషులో అభ్యుదయ పదానికి అర్థంగా చెప్పుకుంటాం.
నిర్వచనం: ‘‘పీడిరపబడేవాళ్లు, పీడిరచేవాళ్ళు ఉన్న ఈ వర్గ సమాజం ఉండాలని ఎవరూ కోరుకోరు. రానున్న విధానంలో సాధారణ మానవుడే మకుటదారి. పురోగమిస్తున్న లోకాన్ని ప్రతిఘటింపజూచేవారు ఎప్పుడు అభ్యుదయవాదులు కాజాలరు. ఈ ధనిక సమాజం పోవాలనుకోవడమే అభ్యుదయం. ఇది మనసులో పెట్టుకొని రాసేది అభ్యుదయ రచన’’ అనే నిర్వచనాన్ని కృష్ణశాస్త్రి ఇచ్చారు.
అభ్యుదయ సాహిత్య లక్షణాలు:
1) సాహిత్యం కేవలం ఒక వినోద వస్తువు కాదని ప్రజలను చైతన్యవంతమైన బాటలో నడిపించాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతతో రచనలు చేయడం అభ్యుదయ సాహిత్యం.
2) సమాజంలో పురోగతిని మార్పును కోరుతూ విప్లవాత్మక పరిణామాలకు స్వాగతం పలుకుతూ ప్రగతిశీల దృక్పథంతో రచనలు చేయడం అభ్యుదయ సాహిత్యం.
3) ధనిక, పేద వర్గాల మధ్య ఉన్న వర్గ పోరును అసమానతలను ప్రశ్నిస్తూ పేదల పక్షాన నిలబడి వారి జీవితాల్లో మార్పు కోసం రచనలు చేయడం అభ్యుదయ సాహిత్యం.
4) ధనిక సమాజం పోయి అందరికీ సమాన న్యాయం జరిగే సమాజం కోసం అహర్నిశలు కోరుకుంటూ విప్లవాత్మక మార్పులను కోరుతూ రచనలను చేయడం అభ్యుదయ సాహిత్యం.
శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణ బాబు లాంటి వారు అభ్యుదయ కవిత్వానికి ఆరంభ గీతాన్ని ఆలపించారు.

‘‘ఏ దేశ చరిత్ర చూసినా పరపీడన పరాయణత్వం’’ (శ్రీ శ్రీ.మ.ప్ర. దేశ.110)
ఏమున్నది గర్వకారణం ……
నరజాతి చరిత్ర సమస్తం ‘‘తాజ్‌ మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ (దేశ.114)
అంటూ అంతవరకు మానవుని మస్తిష్కానికి ఆలోచనలో కూడా రాని ఆలోచనను శ్రీ శ్రీ తెప్పించగలిగాడు. సాధారణంగా తాజ్‌ మహల్‌ సోయగానికి ముగ్దులవ్వని వారెవ్వరూ ఉండరు. అంత అందమైన పాలరాతి సౌధం తయారు కావడానికి శ్రమించిన ఆ శ్రామికుల గురించి ఎవరికీ ఆలోచన లేదు శ్రీ శ్రీ చెప్పే వరకు!
అభ్యుదయ సాహిత్య కవిత్వమే విప్లవ కవిత్వంగా స్త్రీవాద, దిగంబర, మైనారిటీ, బిసి వాద, దళిత కవిత ఉద్యమాలుగా తమ ఉనికిని తమ జాతి కడగండ్లను చెప్పుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాయి. అలా వచ్చిన స్త్రీవాద కవిత ఒకటి చూద్దాం.
‘‘చీర ఒక అంచును గుండెలపౖ పదిలంగా అమర్చుకున్నట్లు
అమ్మ తమ్ముడిని హృదయానికి హత్తుకుంటుంది కాళ్లకు తగిలే అడ్డుపడే అంచుల నన్ను మాటల్లో తంతుంది’’ (నేను అమ్మలో ఉన్నప్పుడు శ్రీమతి) స్త్రీవాద రచయిత్రి శ్రీమతి రాసిన ఈ కవిత వింటుంటే మన హృదయం ద్రవించకమానదు. ఎన్ని తరాలు మారినా ఆడా, మగా మధ్య వ్యత్యాసాలు అలానే ఉండిపోయాయి. ఇప్పటికీ కూడా వంశోద్ధారకుడిగా మగ బిడ్డనే చూస్తారు కానీ ఆడబిడ్డను కాదు.
అభ్యుదయ కవిత్వం దాదాపు రెండు దశాబ్దాల పాటు అంటే 1935-1955 వరకు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. సాహిత్యం ఒక భోగ వస్తువు కాదని ప్రజలను సర్వతోన్ముఖులుగా చేయడానికి రచయితలు విప్లవాత్మక పరిణామాలను తీసుకురావడానికి ప్రయత్నించారు. మార్క్సిస్టువాద దృక్పథంతో రచనల చేయడం అభ్యుదయ సాహిత్యం.
అన్ని రంగాల్లో అభ్యుదయ సాహిత్యం అడుగులు వేసుకుంటూ ముందుకు సాగింది. అలా సినిమా సాహిత్యంలో కూడా చాలా గేయాలు వచ్చాయి అందులో ఒకటి. ఆచార్య ఆత్రేయ గారు తోడికోడళ్ళు సినిమాలకి రాసిన పాట గుర్తొస్తుంది.
‘‘కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడిదాన
బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా (2)
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో..
…….
నిలిచి విను నీ బడాయి చాలు తెలిసుకో ఈ నిజా నిజాలు
…….
చలువ రాతి మెడలోనా కులుకుతావే కుర్రదానా
మేడ కట్టిన చలువ రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా’’

ఈ విధంగా అభ్యుదయ సాహిత్యం సమాజ దర్పణంగా నిలిచిన సినిమా సాహిత్యంలో కూడా తన ముద్రను వేసింది. అభ్యుదయ సాహిత్యం అని ఆ దశాబ్దానికి పేరు పెట్టక మునుపే ప్రోగ్రెసివ్‌ ఆలోచనలతో రచనలు చేసిన అపర మార్గదర్శకుడు గురజాడ. బాల్యవివాహాలు, వేశ్యా వృత్తి నిర్మూలన, వితంతు వివాహాలు గురించి రచనలు చేసాడు.
తెలుగు సాహిత్యంలో నాటకానికి, కవిత్వానికి, కథానికకు శంకుస్థాపన చేసిన మహానుభావుడు గురజాడ అప్పారావు. ఆధునికతను తాను నమ్మిన అభ్యుదయాన్ని చాలా ఖచ్చితంగా చెబుతాడు గురజాడ . సమకాలీన జీవితాన్ని కథల్లో చిత్రీకరించడం స్పష్టంగా ఆధునిక యుగ లక్షణం. ఈ లక్షణం అప్పారావు గారి రచనల్లో కనిపిస్తుంది. ఈయన కన్యాశుల్కం అనే నాటకాన్ని వ్యవహారిక భాషలో రాయడం విశేషం. దిద్దుబాటు, సంస్కర్త హృదయం, మెటిల్‌ డా, మీ పేరేమిటి, మతము విమతము వంటి కథలు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, లవణరాజు కథ, ముత్యాలసరాలు, కన్యక, దేశమును ప్రేమించమన్నా వంటి దేశభక్తి గేయం తో పాటు డామన్‌ పిథికస్‌, నీలగిరి పాటలు, లంగరెత్తుము వంటి రచనలు చేశారు.
బెంగాలుకు రవీంద్రుడు, తమిళనాడుకు సుబ్రహ్మణ్య భారతి, కేరళకు వాళ్లథోల్‌ లాగా ఆంధ్రదేశానికి వేగుచుక్క గురజాడ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గురజాడ భావజాల వికాసం జాతీయోద్యమ కాలంలోనే జరిగింది. జాతీయ కాంగ్రెస్‌ 1885 పుట్టేసరికి గురజాడకి 20 సంవత్సరాలు.
దిద్దుబాటు: దిద్దుబాటు కథ చదువుతుంటే నన్నయ కవితా లక్షణమైన అల్పాక్షరముల అనల్పార్ధ రచనా లక్షణం కనిపిస్తుంది. చాలా చిన్న కథలోనే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, నిక్కచ్చిగా చెప్పేసాడు. దిద్దుబాటను కథ అనండీ! కథానిక అనండీ! ఇలాంటి కథ మరల రాదు రాబోదు.
ఆధునిక యుగానికి ముందు ఉన్న కథలు పాతకాలపు జీవితానికి, చరిత్రకు సంబంధించి ఉండేవి. అనగనగా ఒక రాజు… ఇలా ఆరంభమవుతుంది. సమకాలీన జీవితాన్ని కథల్లో చిత్రించడం ఆధునిక యుగ లక్షణం. ఈ లక్షణం గురజాడ వారి రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆరంభ వాక్యాలు గమనిస్తే .. తలుపు! తలుపు! దిద్దుబాటు కదా ఇలా మొదలవుతుంది. అప్పుడు గురజాడ చేసిన ఆ ప్రయోగమే నేటి వరకు తెలుగు కథా సాహిత్యంలో కొనసాగుతుంది అనటంలో సందేహమే లేదు.
కథ… తలుపు.. తలుపు..
ఎవరూ తీయరు.. దగ్గరగా వేసి ఉంటుంది…
‘‘అర్ధరాత్రి ఒంటిగంట అవుతుంది చాలా ఆలస్యం అయింది రేపటి నుంచి తొందరగా రావాలి. ఆ సాని దాని పాట సరదాలో మనసు లగ్నం అయిపోయింది రేపటి నుంచి వెళ్ళకూడదు. ‘‘మెల్లిగా తలుపుతట్టి రాముడని లేపగలిగిన చడి లేకుండా పక్క చేరి పెద్దమనిషి వేసిన వేయవచ్చును’’ అనుకుంటాడు గోపాలరావు.
తలుపు తోయగానే విడిపోయింది ఇంటిలోకి వచ్చి చూస్తే కమలిని ఉండదు. దీపం వెలిగించి చూస్తాడు. మంచం మీద కూడా ఉండదు. దాసి రాముడు కూడా కనిపించడు. వారికి తగిన శిక్ష ఉరే అనుకుంటాడు. ఇంటికి ఈ నాలుగు వైపులా వెతుకుతాడు. ఎక్కడ కమలిని కనిపించదు. వీధి గుమ్మంలో ఆకాశం వైపు చూస్తూ దాసి రాముడు కనిపిస్తాడు. రామా! అని గోపాలరావు పిలుస్తాడు రాముడు చుట్ట పారేసి బాబూ! అని వస్తాడు.
ముందే సూచనప్రాయంగా గోపాలరావు పాత్ర ఎలాంటిదో గురజాడ ముందే చెప్తాడు. కోపం తట్టుకోలేక రాముడు వీపుపై పిడుగులు గుద్దుతాడు గోపాలరావు. అమ్మ సచ్చాన్రోయ్‌ అనుకుంటూ నేల మీద పడతాడు రాముడు. గురజాడ మాటల్లో, ‘‘గోపాలుడు సదయ హృదయుడు అక్రమాచరించితినను జ్ఞానము వెంటనే పొడిచి ఆగ్రహావేసము దిగజారి పశ్చాత్తాపము కలిగెను’’ (పు.ట8 గురజాడ కథానికలు) గురజాడలో అభ్యుదభావాలతో పాటు చమత్కారాలు కూడా ఎక్కువే!
ఉదా!
మీ అమ్మేదిరా!
మాయమ్మా! యింటున్నది బాబూ!
మీ అమ్మ కాదురా, బుద్ధిహీనుడా, నా భార్య
అమ్మగారా! ఎక్కడుంటారు బాబు
పడుకున్నారు… (పు.7)
గురజాడ ఈ కథలో చెప్పిన గొప్ప వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు వజ్ర, వైడూర్యాలు కంటే చాలా విలువైనవి.
కమలిని ఎక్కడికి వెళ్ళిందో తెలియక బహుశా ‘‘పుట్టింటికి వెళ్ళియుండునా..
1) అంతవారు కారనా! బాబు కోపగించితే చెప్పలేను గాని ఆడారు చదువు నేరిస్తే ఏటౌతది?
అని రాముడు అంటే విద్య విలువ నీకేం తెలుసురా రామా’’
అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా కమలని రాసిన ఉత్తరం ఒకటి దొరుకుతుంది.
అయ్యా!
‘ప్రియా’ పోయి అయ్యా! కాడికి వచ్చెనా
పెయ్యపోయిందా బాబు
మూర్ఖుడా! ఊరుకో…
అయ్యా పది రోజులు అయింది.. రాత్రులు మీరు ఇంటికి రావడమే నాకు తెలియదు మీటింగ్లకు వెళ్తున్నారు. లోకోపకారాలు నిద్ర మానుకుని మరీ చేస్తున్నారు. మా స్నేహితుల వలన నిజం తెలిసింది. నేను ఇంట్లో ఉండడం వలన కదా మీరు అబద్ధాలు ఆడవలసి వస్తుంది. నేను పుట్టింట్లో ఉంటే మీకు నిర్బంధించేవాళ్ళు ఉండరు. అసత్యాలు పలకవలసిన అవసరం ఉండదు. మీతోవకు అడ్డుగా లేకుండా ఉండడమే భర్త మేలు కోరే భార్య కర్తవ్యం కదా! అందుకే నేను కన్నవారి ఇంటికి వెళుతున్నాను. మీరు సంతోషించండి! ఇది ఉత్తర సారాంశం.ఉత్తరం ముగించిన తర్వాత ‘నేను పశువును’ అని గోపాలరావు అంటాడు
అదేటి బాబు అలా సెలవిస్తారు..
శుద్ధ పశువును
రాముడు వస్తున్న నవ్వుని ఆపుకుంటుంటాడు.. ఇక్కడ మనకు తెలుస్తుంది రాముడికి కమలిని ఎక్కడ ఉందో అని!
‘‘గుణవతి, విద్యావతి, వినయ సంపూర్ణురాలు నా చెడు బుద్ధికి తగిన శాస్తి చేసినది’’
ఏటి చేసినారు బాబు
పుట్టింటికి వెళ్ళిపోయింది.. కానీ నీకు తెలియకుండా ఎలా వెళ్ళిందిరా
‘‘రాముడు రెండు అడుగులు వెనక్కి నడిచి నాను తొంగున్నాను కావాల బాబు!
2) అలకచేస్తే చెప్పచాల్నుగాని గాని బాబు ఆడదాయి చెప్పకుండా పుటినారింటికి యెళ్తానంటే లెంపలూగించి కూకో పెట్టాలి గాని, మొగోరిలాగా రాతలు కోతలు మప్పితే ఉడ్డోరం పుట్టదా బాబు’’… (పు.ట.9.గు.క.ని)
ఈ మాటలు గురజాడ చదువు లేని ఒక పాత్ర ద్వారా చెప్పించడంలోనే ఉంది.. దిద్దుబాటు కథలో స్పష్టంగా ఆ మహాకవి ఏనాడో సంష్కార రహితమైన భావాలను నౌకరు రాముడి నోట పలికించడం గమనించదగింది. ఈనాడు చదువుకున్న వాళ్ళల్లో ఎంతమందికి లేవు ఇలాంటి భావాలు కానీ… సమాజంలోని ఆడ మగ అనే బేధం లేకుండా కూడా ఇలాగే ఆలోచిస్తారు.. గురజాడ కాలమే కాదు.. ఇప్పుడు పెద్దగా వచ్చిన మార్పు ఏమీ లేదు. భర్త ఎన్ని తప్పులు చేసినా లోకం ఏమీ అనదు. ఆడదానికి ఎందుకు అంత దురాభిమానం అంటుంది.. సమాజ నాడిని పట్టుకోవడం అంటే ఇదే కదా! గోపాల్‌రావు చేత పలికించిన మాటలు వింటే ఆడపిల్లకి చదువు ఎంత ముఖ్యమో ఆనాడే గురజాడ చెప్పాడన్నది అర్థమవుతుంది.
‘‘ఓరి మూర్ఖుడా భగవంతుని సృష్టిలోకల్లా ఉత్పృష్టమైన వస్తువుగా విద్య నేర్చుకున్న స్త్రీ రత్నమే. శివుడు పార్వతికి సగం దేహము పంచి ఇచ్చాడు. ఇంగ్లీషువాడు భార్యను బెటర్‌ హాఫ్‌ అన్నాడు. అనగా పెళ్ళాము మొగుని కన్నా దొడ్డది అన్నమాట’. బోధపడ్డదా నీ కూతురు బడికి వెళుతున్నది కదా విద్య విలువ నీకే బోధపడుతుంది అంటాడు. స్త్రీకి విద్య అవసరం లేదని అనుకున్న రోజుల్లో ఈ మాటలు చెప్పడానికి గురజాడ వారికి ఎంత గొప్ప మనసు కావాలి.
నువ్వు చెప్పాల్సిన మాటలు చెప్తాను విను ‘‘పంతులుకి బుద్ధి వచ్చింది. రాత్రులు ఇల్లు కదలరు ఇది ఖరారు! తెలిసిందా మిమ్మల్ని గడ్డం పట్టుకుని బ్రతిమాలు ఉన్నారని చెప్పమన్నారు. దయతలచి ఆయన లోపాలు బయట పెట్టకుండా మూడు రోజుల్లో వచ్చే మని చెప్పు. మీరు లేని రోజు యుగంలో గడుస్తున్నాయని నైపుణ్యంగా చెప్పు తెలిసిందా.. తెలిసింది బాబు! ఏమని చెబుతావో నాతో ఒక మాటు చెప్పు. రాముడు తల గోక్కుంటూ యేటా! యేటా! అదంతా నాకేం తెలదు బాబూ! నానంతాను అమ్మా! నా మాట వినుకోండి కాలం గడిపిణోన్ని- ఆడోరు యజమాని చెప్పినట్టల్లా యిని పల్లకుండాలి. లేకుంటే మా పెద్ద పంతులార్లాగా అయ్యగారు కూడా సానమ్మ నుంచుగుంతారు. మీ శెవులో మాట, పట్టంలోకి బంగారు బొమ్మలాంటి సానమ్మ వొచ్చింది మరి పంతులు మనసులు మనసులో లేదు. ఆపై మీ సిత్తం. అంతాను..’’
ఓరి వెధవ అని గోపాలరావు కోపంతో కుర్చీ నుండి లెగుస్తాడు రాముడు బయటకు పరిగెత్తాడు అప్పుడు మంచం కింద నుండి కిలకిల నవ్వుతో పాటు గాజులు చప్పుడు వినపడుతుంది..
వివరణ: సంసారాన్ని పట్టించుకోకుండా వేశ్య గృహాల్లో గడిపే గోపాలరావుని తన తెలివితేటలతో మార్చుకున్నది. అది ఎలా సాధ్యపడిరదో తెలుసా గురజాడ మనకి ముందే చెప్పాడు గోపాల్‌రావు, సహృదయుడు. తాను చేసింది తప్పు అని తెలిసిన వెంటనే పశ్చాత్తాపం చెందే మనసు కలవాడు అని,! అలాంటి వ్యక్తి అవ్వడం వల్లనే కమలిని మార్చుకోగలిగింది. అదే గోపాలరావుకి స్త్రీల పట్ల చదువు పట్ల అంత గౌరవం లేకపోతే ఆమె మార్చుకోక లేకపోయేది. అందుకే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ అర్థం చేసుకునే తత్వం ఉండాలి. ఒకరిలో మాత్రమే అర్థం చేసుకునే తత్వం ఉండి మరొకరిలో లేకపోతే ఎంత ప్రయత్నించినా మూర్ఖుల్లో మార్పులను తీసుకురాలేము.
వసుదేవుడు అంతటోడు గాడిద కాళ్లు పట్టుకున్నాడు. మనం పెళ్ళాం కాలు పట్టుకుంటే ఏమవుతుంది అనుకుంటే.. అలా అనుకున్న మగాడు ఆ క్షణానికి మారినా మరల తన కుక్క తోక బుద్ధి మాత్రం మారదు. గోపాల్‌రావులా తను చేసిన తప్పును మనస్ఫూర్తిగా ఒప్పుకుని పశ్చాత్తాపపడ్డ కుటుంబాలు నిలుస్తాయని గురజాడ ఉద్దేశం.
సంస్కర్త హృదయం: ఈ కథను అప్పారావు గారు ఇంగ్లీషులో తీఱంఱఅస్త్ర ్‌శీ ర్‌శీశీజూ అనే కథకు అవసరాల సూర్యరావు గారు తెలుగులోకి అనువదించిన కథ. ఆధునికత యొక్క మరొక ప్రత్యేక లక్షణం వాస్తవికత.
వాస్తవికత అనే లక్షణం సమకాలీనతను ఆశ్రయించుకున్నదే! గురజాడ కథల్లో వాస్తవికత నూటికి నూరుపాళ్ళు మనకు కనిపిస్తుంది.
పాత్రలో సన్నివేశాలు వాస్తవికంగా ఉండాలంటే పాత్రలు మనస్తత్వ చిత్రనా స్వాభావికంగా ఉండాలి. దురదృష్టవశాత్తు ఆధునిక కవులు రాసే సామాజిక కథలు కూడా పాత్రలకు ముఖ్యంగా నాయకా నాయకులు కొన్ని ఆదర్శ లక్షణాలు అంటగట్టి ఆ పాత్రలు నలుగురికి గుణవంతంగానూ ఆదర్శవంతంగా ఉండేలా చేయాలనే వైఖరి అప్పుడప్పుడు కనిపిస్తుంది. ముఖ్యంగా సమాజం నుండి ఎదురయ్యే అన్యాయాలకు గురి అయ్యే పాత్రలను చిత్రించేటప్పుడు కథకులు పాఠకుల సానుభూతిని ఆ పాత్రలపై మళ్లించడానికి ఆ పాత్రలకు తోమిన గిన్నెల్లా తయారు చేస్తారు. ఇటువంటి ధోరణి గురజాడ వారి కథలలో కనిపించదు.
ఈ కథలో రంగనాథయ్యరు భోగవృత్తిని నిర్మూలనకు నడుంబిగించి పోరాడుతుంటాడు. యాంటి నాచ్‌ గురించి పేపర్లో వ్యాసాలు రాస్తుంటాడు. ఆఖరికి వేశ్య అయిన సరళను ఆ మురికి కోపం నుంచి లాగబోయి అందులోనే అతను చిక్కుకుంటాడు. ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండాలి. అలాంటి వారినే సమాజం ఆదర్శంగా తీసుకుంటుంది. చంచలమైన మనసు ఉండకూడదు. ఎంత మంది ఏ విధంగా ప్రయత్నించినా గుణాన్ని వీడకూడదు. ఒక ప్రొఫెసర్‌ హోదాలో ఉండి స్టూడెంట్‌ పెట్టిన పరీక్షలో ఫెయిల్‌ అవుతాడు. రంగనాథయ్యరు బుద్ధి బలహీనమైంది అని అర్థమవుతుంది.

అనే వాక్యాలు ఈ కథకు వర్తిస్తున్నాయి. ఏవో ఉద్యమాలను పైపై పూతగా పూసుకున్నాడు తప్పితే ప్రొఫెసర్‌కి సరైన మనో నిర్మాణం లేదని స్పష్టం అవుతుంది. పడుపు వృత్తిని నిర్మూలించాలనుకున్న ప్రొఫెసర్‌ గారి ఆశయం నిష్కలంకమైనదే. అతని పతనం మేనకని చూసిన విశ్వామిత్రుడి పతనం లాంటిది కాదు.. మనం రంగనాథయ్యరును సానుభూతితో చూస్తాం. అతను స్థితి స్వాభావికమైనది. భార్య గయ్యాలిది. మనిషి అస్తమానం విజ్ఞాన ప్రపంచంలో విహరిస్తూ ఉత్సాహం ఉడికిన జీవితం జీవిస్తూ ఉంటాడు. గురువుల బోధనలు యధాతధంగా నిజాలుగా స్వీకరించినవాడు. అతనికున్న సిద్ధాంతాలు నమ్మకాలు జీవిత సంఘర్షణ నుంచి జనించినవి కావు. ఈ కారణం చేత జీవితం సరళ రూపంలో ఎదుట నిలిచేసరికి బోల్తాపడ్డాడు. అత్యంత స్వాభావిక చిత్రణ. సరళను ఉంచుకున్న అతని విద్యార్థి నిక్షేపంగా ఉన్నాడు. మాకు వచ్చే లైన్లలో అత్యధిక భాగం ఈ భోగం పడుచులే కదా అన్న ప్లీడర్‌ నిక్షేపంగా ఉన్నాడు. వారిలో అంత సంఘర్షణ లేదు పతనమయ్యే స్థితి లేదు.
సరళ పాత్ర కూడా చాలా వాస్తవిక మైంది. సరళ రుషిలాంటి ప్రొఫెసర్‌ని తన సౌందర్యంతో ముగ్థున్ని చేసిన మనుషి. ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమను తెలివిని, కరుణను, చివరకు ధనాన్నైనా సరే ధారపోసి ఆమెని ఉద్ధరించాలి.. అన్న భావన ఆయనలో రేపింది. సరళ చక్కగా వీణ వాయిస్తుంది. హాయిగా పాడుతుంది. ఆ పాత్రను ఉదాహరణగా చేయాలని నలుగురు మెచ్చుకునేలాగా పాత్ర పోషణ చేయాలని మామూలు ప్రేక్షకుడులో కనిపిస్తుంది. కానీ అలాంటి స్థితి అప్పారావులో లేదు. అమాయకుడైన సంఘసంస్కర్తలు సరళ గుడికి రావడం చూసి తను చేసిన పాపాలకు ఆ అమ్మాయి పశ్చాత్తాప పడుతోంది. వచ్చే జన్మలోనైనా సరళ గౌరవప్రదమైన గృహిణిగా పుడుతుంది అనుకున్నారు. కానీ కథకుడు హరిహరీ సరళకి ఎన్నటికీ ఆ తలంపే లేదని ఆమె దేవాలయానికి రావడం ప్రొఫెసర్‌ అతని స్నేహితులును ఆకర్షించడానికేనని నేను చూశాయిగా చెప్పవలసి వస్తున్నందుకు పాపం క్షమించుగాక! అని స్పష్టంగా చెప్పేస్తాడు గురజాడ. పాత్ర సృష్టి వాస్తవికంగా ఉండేటట్టు చూడటంలో అప్పారావులో గల ఖచ్చితత్వం ఈ కథలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది.
మీ పేరేమిటి: (దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటి)
‘‘పురాణముల గురించి మేము శంకలు వేస్తే మా గురువుగారు ‘‘వెధవ చదువులు మీ మతులు పోతున్నాయి. మీరు ఒట్టి బౌద్ధులు అనేవారు. బౌద్ధులు ఎటువంటి వారు శాస్త్రులు గారు అని రామ్మూర్తి అడిగాడు..
గురజాడ తన కథలో ఆంటీ నాచ్‌, మతము అనే సమస్యలను ప్రధానంగా తీసుకున్నాడు. మెటిల్‌ డా… దిద్దుబాటు కథలు కూడా సంఘసంస్కరణకు సంబంధించినవే.. మతం గురించి మీ పేరేమిటి?, పెద్ద మసీదు కథలలో మనం తెలుసుకుందాం..
మీపేరేమిటి కథలో మతం తాలూకు సాంఘిక స్వరూపం సమగ్రంగా చర్చించబడిరది. ఆ సమస్య మీద మరొకరు కొత్త విషయాలు చెప్పడానికి వీలు లేకుండా చేశాడు. గురజాడ ఆనాటికి మతం పేరిట ఉపద్రవాలు కలిగిస్తున్నది గుంటనక్కలే కానీ నిజమైన మతాభిమానం గల వాళ్లు కాదు. వాళ్ళలో ఆవేశానికి సమపాలలో మౌఢ్యం కూడా ఉండి తీరుతుంది. ఊర్లో శైవులు, వైష్ణవులు ఉన్నారు. ఊరి జంగాలు పాలరాతి బుద్ధ విగ్రహాన్ని బౌద్ధ శిలల నుంచి సంపాదించి అదే శివుడని కొలుస్తారు. ఒక ఇంగ్లీషు దొర వచ్చి ఆ విగ్రహం విలువ గ్రహించి తనకు ఇవ్వమని అడిగితే ప్రాణాలున్న ఇస్తానని ఆ విగ్రహాన్ని ఇవ్వమంటారు జంగాలు. కానీ వారికందరికీ నాయకుడైన శరభయ్యే ఒక రాత్రి విగ్రహాన్ని పీక్కొనిపోయి దొరకు అమ్ముతానంటాడు. దొంగ సొమ్ముని దొర కొనను అంటాడు. ఏమిటి ఈ దొరకే బుద్ధి తక్కువ.! దాంతో అయినా జంగాల కళ్ళు తెరుచుకున్నాయా! అంటే అలాంటిదేమీ లేదు. భక్త వాత్సల్యం గల శివుడు శరభయ్యను విగ్రహం తీసుకోవడానికి అనుతించాడనుకుంటారు. దొర గారి డేరా నుంచి వెళ్ళిపోయేటప్పుడు వృషభ రూపం ధరించి రంకె వేసి దాటేసాడని, మళ్లీ నేడో రేపో అతడు వీరాశనం వేసుకొని ఏ కొండమీదనో గోపురం మీదనో ఆవిర్భవిస్తాడని నమ్ముతారు.
శైవులు ఈ విధంగా ఉంటే వైష్ణవులు మరొకరకంగా ఇదే ధోరణిలో ఉంటారు. విష్ణు ఆలయానికి ధర్మకతృత్వం రంగాచార్యులు కుటుంబానిది. కానీ వైష్ణవుల నాయకుడు సాతాని మనవాళ్ళయ్య. శరభయ్య తాను సాక్షాత్తు వృషభవతారం అని చెప్పుకుంటే మనవాలయ్య తాను గరుడాల్వార్‌ అత్యల్ప అంశవల్ల జన్మించినట్లు నలుగురు ఒప్పుకుంటే నిజమే అదే చాలంటాడు.
ఇలాంటి పరిస్థితుల్లో శైవ, వైష్ణవ రగడ తీవ్ర పరిస్థితికి రావడానికి కారణం లక్షాధికారి సారధి నాయుడు. ఇతని బావమరిదికీ గ్రామ మునసబు అయిన రామినాయుడు దక్షిణ దేశపు అయ్యవార్లందరి చేత చక్రాంకితాలు వేయించుకొని శివుని కోవెలకేసి చూడటం మానేశారు. ఇంతలో హైదరాబాదు నుంచి శివాచార్యులు కొందరు గ్రామం వచ్చారు. శరభయ్యకు ఒక మంచి అవకాశం చిక్కింది. శైవులు రోజు అర్ధరాత్రి శివార్చన చేయటం శంఖాలు ఊదటము హడావిడి చేయటము వలన పామరులను సైతం శైవం కేసి లాగాయి. శివాచార్యులు గుండం తొక్కుతున్నారు. సారధి నాయుడు కూడా జారిపోతాడని మనవాళ్ళయ్యకి దిగులు పుట్టింది. రంగాచార్ల వారితో విషయం ప్రస్తావిస్తే ఆయన వైష్ణవుడు, శివుడు కావాలని కోరితే అడ్డి ఏమి కార్యం? రాముడు ఆజ్ఞ ఎలా ఉంటే అలా జరుగుగాక! అని ఊరుకున్నాడు. ఈ బ్రాహ్మణుడికి వైష్ణాభిమానం తక్కువ అనుకుని మనవాళ్ళయ్యే రచ్చబండ దగ్గర సాతానులను చేర్చి మీటింగ్లు పెట్టి కర్తవ్యం ఆలోచించమన్నారు. ‘‘సారథి నాయుడు ఈ రాత్రి వెళ్లి శైవుల ఘౌరకృత్యములు చూశెను.. మరి మన వాడు కాడు అన్నాడు.’’
వాళ్ళు చేసిన పని మనమేల చేయరాదు? శ్రీ మత్గరుడాల్వార్‌ అవతారమైన మనవాళ్ళయ్యే రాగి ధ్వజం చేత పట్టుకుని నాలాయిరం పటిస్తూ గుండం తొక్కితే సరే అన్నాడు రామానుజయ్య. ఈ విపత్తు నుంచి బయటపడటానికి మనవాళ్లయ్య ఎన్ని ఎత్తులైనా వేస్తాడు. చివరకు నాంచారమ్మ మనవాళ్లయ్యను కాపాడుతుంది. వైష్ణవం గొప్పదని రుజువు చేయడానికి పీరు సాయీబు జేత గుండం తొక్కిస్తారు. సాయిబు చేత పట్టుకున్న పీరు వైష్ణవ నామము అని వైష్ణవులు, త్రిశూలం అని శైవులు అంటారు. ఏమైనా శివ వైష్ణవుల స్పర్థలు వెనుకబడి ఊరి జనం పీరుకు ముక్కనారంభించారు. ఏమి మత సంఘర్షణ ఎలాంటి పరిణామం.
కథ అంతా విని పాతకాలపు వాడైన గురువుగారు ఔరా కలికాలంలో మనుషులే కాదు దేవుళ్ళు కూడా సంకరం అవుతున్నారు. అయినా తప్పేమీ శివుడన్నా విష్ణువన్నా, పీరన్నా, బుద్దుడన్నా ఒక్కడే కదా! అంటే వెంకయ్య ఊరుకుంటాడా అందరూ దేవుళ్ళు ఒకరే అయితే ఆ పీనుగుల్ని అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి పూజ చేసి తగలబెట్టరాదు అంటాడు.. మనం వెంకన్న లాంటి మనుషులను కూడా సమాజంలో చూస్తూ ఉంటాం.
బౌద్ధమతం విషయం ఉపన్యాసం ఉపక్రమించాడు శాస్త్రి పది నిమిషాలు అయ్యేసరికి రామ్మూర్తి తన చేతున పుస్తకం విప్పి చూసి శాస్త్రులు గారు మీరు చెప్పేదంతా సర్వదర్శన సంగ్రహము లోనిది కదండీ! అవురా నీకెలా తెలుసురా. హ అదేం తర్జుమా కాదు కదా అన్నాడు అవునండి. ఈ ఇంగ్లీషు వాడు ఉద్దండ పిండం రా! రెండవ పుస్తకం ఏమిటో? బుద్ధ చరిత్ర అండి! ఎక్కడ సంపాదిస్తారు రా! ఈ అపూర్వ గ్రంథాలు ఏదీతే .. శాస్త్రి గారి పుస్తకం అందుకుని అతి మధురమైన కంఠంతో చదివి అర్థం చెప్పడం ప్రారంభించారు నాలుగు రోజుల తర్వాత శాస్త్రీ గారు క్లాసులో ఎలా సెలవిచ్చారు. ఈ పుస్తకం చదివిందాకా బుద్ధుడి మహిమ నాకు తెలియలేదు రా! తప్పకుండా ఈ మహానుభావుడు శ్రీమహావిష్ణు అవతారమే!
బుద్ధుడి బోధనలను అంగీకరించని వారు తర్వాత దశావతారాలలో ఒక అవతారంగా మార్చి వేయ డాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది.
గురజాడ కథలలో నాయక అనే పదానికి అర్హురాలైన పాత్ర నాంచారమ్మ. ఒక ఘనమైన పని చేసిన నాంచారమ్మను కూడా మామూలు మనిషిని చేయకుండా విడిచిపెట్టలేదు. ‘‘కష్ట సాధ్యము సాధించిన నాంచారమ్మ కరదీపం తిరిగి చేత భూని, యింటికి సవిలాసంగా నడిచి పోవుచుండగా, పెనిమిటి యెదురైనప్పుడు ఆమె ప్రేమ పరిహాసములు పెనుగను దృష్టితో చూసెను’’. కృష్ణమాచారి వీరుడైన కాడు. పిచ్చి మీరిపోతున్న సాతాని వైష్ణవులను తన భార్య ఒంటరిగా ఎదుర్కొని వారి వెర్రికి విరుగుడు చేస్తుంటే అటక ఎక్కిన దద్దమ్మ!
మతము.విమతము:(పెద్ద మసీదు)
కథ.
పెద్దమశీదు కథలో మతస్పర్ధలు, మతావేశాలు లేవు గాని మతానికి మనిషి పెట్టుకునే కొండ గుర్తులను జీవితం ఎలా చెరిపేస్తుందో సూచించబడిరది. కాశీ నుంచి తన స్వగ్రామమైన శ్రీకాకుళానికి నారాయణభట్టు తిరిగి వస్తాడు. అతని వెంట పుల్లంభట్టనే కుర్రాడు ఉన్నాడు. నారాయణ భట్టుకు ఊరు పొలిమేర నుంచి కాకులేశ్వర స్వామి ఆలయ గోపురం కనిపించదు. మహ్మదీయులు ఆలయం పగలగొట్టి మసీదు కట్టారు. అందుకు నారాయణభట్టు చింతిస్తాడు. కానీ మరుక్షణంలోనే ఇంతకన్నా విడ్డూరం నారాయణమూర్తి తెలిసి వస్తుంది. అతని మేనమామ ఇస్లాంలో చేరిపోయాడని..
‘‘బాయి ఇక్కడే కదా పూర్వం శివాలయం ఉంటూ వచ్చింది’’ తురక ఒక నిమిషమూరుకొని నోటిలోని పొగనూది సైతాన్కా ఘర్‌’’ అని ఉత్తరమిచ్చెను.. సాయిబుగారు ఈ ఊర్లో చేబ్రోలు వారు ఉండాలి ఉన్నారా! ఈ దేవాలయం దగ్గర వారి బస ఉండేది. అంటే ఇప్పుడు మీ మసీద్‌ దగ్గరే! ఆ ముస్లిం స్వచ్ఛంగా తెలుగు నవలంబించి లేదనెను.
అయ్యో మా పెద్ద మామ రామదాసు చిన్నమామ లక్ష్మణ బొట్టు విదేెశాలు పట్టారా? లేదా చనిపోయారా?
సాయిబు చేతి నుండి చిలుము నేలరాలి ముక్కలై నిప్పులు నాలుగు దిక్కులు చెదిరిపడతాయి. నారాయణ అంటూ ఒక పిలుపు వినిపిస్తుంది. అతను ఎవరో కాదు నారాయణ భట్టు మేనమామ.
గోల్కొండ బాదుషాహి పరమాణులు సీలు ఇక్కడ విప్పబడిన చేత సికాకోల్‌ లేదా చికాకోలు అనే పేరు కలిగిందని ఇక్కడ వారంటారు. కానీ అది నిజం కాదు ఈ పట్టణము బహు ప్రాచీనమైనది. దీని పేరు శ్రీకాకుళము. ఒకప్పుడిక్కడ శ్రీకాకుళేశ్వరుని క్షేత్రం ఉండేది. దాన్ని పడగొట్టి షేరు మహమ్మద్‌ పెద్ద మసీదును కట్టాడు. నిజమిది.
ఢల్లీిలో కుతుబ్‌మినార్‌ పక్కన తుప్పు పట్టని ఇనుప స్తంభం అని చరిత్రలో చదువుకుంటాం. ఆ తుప్పు పట్టని ఇనుప స్తంభం ఏమిటో తెలుసా! విష్ణు దేవాలయానికి ముందు నిలపబడిన ధ్వజస్తంభం. ఇప్పటికీ కూడా ఆ ఆలయ శిథిలాలు సజీవ సాక్షాలుగా ఉన్నాయి. ఆ ప్రాంగణంలోనే ధ్వజస్తంభం ముందునే మహమ్మదుల గోరీలు కట్టబడి ఉన్నాయి.
మెటిల్‌ డా: జీవితంలో సంస్కారం ఉన్న మంచివాళ్ళను ఎలా సుడిగుండంలోకి పడేస్తుందో మెటీల్‌ డా కథలో చక్కగా వివరించారు గురజాడ. ఇందులో కథకుడు మెటల్‌ డా ఆమె భర్త కూడా మంచివాళ్లే! జరిగిన పొరపాటు ఏమిటంటే వయసు మళ్ళిన అనాకారి భర్త, అందగత్తైన అమ్మాయిని పెళ్లిచేసుకోటమే! భర్త భార్యను అనుక్షణం అనుమానిస్తుంటాడు. తనని పంజరంలో ఉంచినట్లు ఉంచుతాడు. పులి, ముసలి పులి అనే పేరు తెచ్చుకుంటాడు. తన భార్యను పరాయి వాడి ఎదుట ‘లంజ’ అంటాడు. కానీ అతడు దుర్మార్గుడా కాదు? అకస్మాత్తుగా జ్ఞానోదయం కలిగి తన సమస్యను తాను అర్థం చేసుకొని కథకుడితో ఈ ముండని తీసుకుపో నీకు దానం చేస్తాను. తీసుకుపో! నాకు శని విరగడైపోతుంది అంటాడు.
కథకుడు సజ్జనుడే! అతన్ని బలంగా ఆకర్షించింది మెడిల్లా అందమే! చెడ్డ తలంపు ఉంటే దేవుడే సాక్షి అని అతను మిడిల్‌ నా భర్త దగ్గర ప్రమాణం చేస్తాడు.
మిడిల్‌ డా కూడా యోగ్యురాలే! ఆమె ఆ ముసలి భర్తతో సుఖపడటం లేదు. కానీ ఆమెలో తిరుగుబాటు లేదు. పరిస్థితులకు తలవంచింది. మనసు ఆపుకోలేక ఎప్పుడన్నా భర్త గీసిన గిరి దాటి గుమ్మంలోకి వస్తుంది. కథకుడి మూలాన తనకు ఇబ్బంది ఎక్కువ అయి అతనికి ఉత్తరం రాస్తుంది. ‘‘మీరు మీ నేస్తులు నా కాపురం మన్ననివ్వరా మీకు నేనేం అపకారం చేశాను’’
చివరకు తన భార్య యోగ్యురాలని గుర్తించి భర్త ఆమెకు స్వేచ్ఛ ఇస్తాడు. ఆమె సమస్యలను పరిష్కరించదు. నిరుపయోగం కధకుడుకి మెటిల్‌ డా భర్తతో మంచిగా మాట్లాడే అవకాశం వస్తుంది. అన్ని పక్షాలకు రాజీ కుదిరిపోతుంది.
గురజాడ మానవ స్వభావాన్ని సమాజాన్ని కాచి వడపోసాడు. సంస్కరణ ఎంత కష్టమైనదో ఆయనకు తెలుసు. ఆయన రాసిన కథలు కొంచమే అయినా వాటి నిండా ఆణిముత్యాలు లాంటి సత్యాలు కోకొల్లలుగా ఉన్నాయి.
రామారావు పాత్రతో ఇలా చెప్పిస్తాడు గురజాడ మెటిల్‌ డా భర్త ఎన్నడైనా ఒక దెబ్బ కొట్టాడని విన్నామా! లేదు! తిండికి లోపం లేదు. గుడ్డకి లోపం లేదు. అతను చెప్పినట్లు మసులుకుంటే నెమ్మదిగా కాలం వెళ్లడానికి అభ్యంతరం లేదు. ఈ మాటల్లో ఎంత జీవిత సత్యం ఉంది. ఇవే మాటలు బానిస బ్రతుకులకు వర్తిస్తాయి. వలస ప్రజలకు వర్తిస్తాయి. వచ్చే ఇబ్బంది అంతా హక్కుల కోసం పోరాడితేనే వస్తుంది.
గురజాడ వంటి గొప్ప రచయితలు ఏ భాషలోనైనా అరుదే! అందువల్ల ఆయన మనకు విడిచిన రచనలు మహోన్నతమైన కళాఖండాలు. తొలచిన కొద్దీ వాటిలో మరింత లోతు, మచ్చుతునకలు కనిపిస్తూనే ఉంటాయి.
పూర్ణమ్మ: ముక్కు పచ్చలారని చిన్న పిల్లలకు ముస్లిం వాడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం ఇతివృత్తం.
‘పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ తల్లీ తండ్రీ దీవించ్రీ
దీవన వింటూ పక్కున నవ్వెను పుత్తడి బొమ్మా పూర్ణమ్మ’ !
తల్లి వదినలు అన్నదమ్ములు అందరూ బాధపడతారు. డబ్బుకి దాసోహం అయిన ండ్రి మాత్రమే అల్లుడ్ని చూసి మురిసిపోతుంటాడు. పూర్ణమ్మ తల్లిదండ్రులకు నమస్కరించినప్పుడు వారి దీవెన విని పకాలున నవ్వుతుంది. సాధారణంగా పెద్దల ఆశీర్వాదం తీసుకున్నప్పుడు పెళ్లయిన ఆడవారికి ఏమని దీవిస్తారు!. దీర్ఘ సుమంగళీభవ పిల్లాపాపలతో చల్లగా ఉండమ్మా అని! ఆ కట్టుకున్న భర్త ఎప్పుడు పుటుక్కుమంటాడో తెలియదు. ఆ దీవెనకి విలువే లేదని ఒక పేలవమైన నవ్వుతుంది పూర్ణమ్మ.
ఈ గేయ కథలో పూర్ణమ్మలా సంఘ దురాచారానికి గురైన ముక్కుపచ్చలారని బాలిక ఆత్మాహుతిని అంతకు ముందు తెలుగు కవులెవ్వరూ ఇతివృత్తంగా తీసుకొని రచించలేదు. గురజాడ ఆడపిల్లలను అమ్మే పద్ధతికి వ్యతిరేకం. బాల్య వివాహాలకు వ్యతిరేకం. వితంతు వివాహాలకు అనుకూలంగా రచనలు చేశాడు.
దేశభక్తి…
దేశభక్తి అంటే ఏమిటో మొదట తెలియజెప్పిన మహానుభావుడు గురజాడే! తర్వాత ఈ పలుకుబడిని రాయిప్రోలు, విశ్వనాథలో కనిపిస్తుంది. దేశం గురించి చెప్పిన ఈయన ప్రతి మాట ఉద్రేకపూరితంగానూ, ఉజ్వలంగానూ ఉంటుంది.
‘‘ఈసురోమని మనుషులంటే దేశమే గతి బాగుపడునోయ్‌’’
దేశం కోసం పోరాడాలంటే దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అలా ఉంటేనే స్వరాజ్యం సాధించుకోగలమని చెప్తున్నారు గురజాడ.
ఆడంబరంగాను, గొప్ప కోసము దేశాభిమానం చూపే వారిని చూస్తే ఈయనకు చాలా అసహ్యం.
‘‘దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌’’
లవణరాజు కల: ఇంద్రధనస్సు లాగా అన్ని రంగుల తోటి మెరిసిన కావ్యం లవణరాజు కల. హరిజనోద్ధరణ సమయంలో ఈ కావ్యంలో గురజాడ చర్చించాడు. ఒక సిద్ధాంతంలో పొందుపరిచాడు.
‘‘మంచి చెడ్డలు మంజులందున ఎంచి చూడగ రెండు కులములు
మంచి అన్నది ‘మాల’ అయితే మాలనే అగుదున్‌’’
అసలు అంత గంభీరమైన మాట అనడానికి గురజాడకి ఆనాటికాల పరిస్థితులకు ఎంత ధైర్యం కావాలి కదా! సంఘసంస్కరణ అంటే పైపై పూతలు కాదు దాన్ని మనలో ఐక్యం చేసుకోవడం ఆ లక్షణమే గురజాడలో కనిపిస్తుంది.
కన్యక : ఈమెను కోమట్లు కన్యకా పరమేశ్వరి అని ఇప్పటికీ పూజిస్తారు. ఈ కథ సామాన్యంగా అందరికీ తెలుసు. గురజాడ చేతుల్లో పడి గొప్ప కావ్యం అయింది. దీనిలో కవి మూడు రకాల తత్వాలను చిత్రించాడు.
యవ్వన వేళలో పొగరెక్కినతనం
‘‘పట్టవలెరా దీని బలిమిని కొట్టవలనా మధుని రాజ్యం’’
సమయం తప్పితే స్త్రీ నల్లత్రాచు అవుతుంది. ఆ అమ్మాయి హృదయం పరాభవం చేత నిప్పుల వాన కురుస్తుంది.
ఈ తత్వమే రెండవది ‘‘కండకావరమెక్కి నీవీ
దుండగుము తలపెట్టినందుకు ఉండడా ఒక దేవుడంటూ ఉండి ఊర్కొను నా’’
మూడవది అధర్మ పర్యవసానం ‘పట్టమేలే రాజు పోయెను
మట్టి కలిసెను కోటపేటలు పదం పద్యం పట్టి నిలిచెను కీర్తు లపకీర్తుల్‌’’
కన్యాశుల్కం: కన్యాశుల్కం నాటకం మహాకవి గురజాడ అద్భుత సృష్టి. పాత్రోచితమైన వ్యవహార శైలిలో వచ్చిన తొలి నాటకం కన్యాశుల్కం.
ముక్కుపచ్చలారని పసిపిల్లలను కాటికి కాలు చాచుకున్న ముసలి వాళ్లకి వివాహం చేయడం అనే నికృష్టమైన సాంప్రదాయంపై ఆ నాటకంలో ఆయన నిప్పులు చేరిగాడు. ముద్దు ముద్దు మాటల మురిపాల చిన్నారులం ముసలి వాళ్లు కొనుక్కొనే ఆ దురాచారంపై గురజాడ కన్యాశుల్కం నాటకంలో తన పదునైన వాక్యాలతో కత్తులను జులిపించాడు.
సజీవ పాత్రలతో రాయబడిన మహత్తర నాటకం కన్యాశుల్కం.
యువకర్త గురజాడ కన్యాశుల్కం నాటకంలో తీసుకొన్న సమస్యలు, బాల్య వివాహాలు, వేశ్యా వృత్తి, కన్యాశుల్కం, నాటి న్యాయ వ్యవస్థ ప్రధాన సమస్యలు. కన్యాశుల్కాన్ని అగ్నిహోత్రావధాన్లు లుబ్ధావదాన్లు సమర్థిస్తే మధురవాణి, సౌజన్య రావు పంతులు, కరటకశాస్త్రి, వెంకమ్మ, బుచ్చమ్మలు వ్యతిరేకిస్తారు. గిరీశం గోడమీద పిల్లిలా ఏ ఎండకా గొడుగు పడుతూ తన బబ్బం గడుపుకుంటూ ఉంటాడు. రామప్ప పంతులు మధురవాణి మెప్పుకోసం మధ్యవర్తిగా తనకు దక్కే డప్పు కోసం ఆ సమస్యను వ్యతిరేకిస్తాడు.
కన్యాశుల్కం నాటకంలో సృష్టించిన స్త్రీ పాత్రలో మధురవాణి పాత్ర మహోన్నతమైనది. మానవతా విలువలకు మణిహారమైన పాత్రను సృష్టించాడు. వృత్తి రీత్యా ఆమె వేశ్య. సంస్కారం, మానవత్వం ఆమె ఆభరణాలు. సమకాలీన సమాజానికి ఆమె ఎన్నో సవాల్లు విసిరింది. సుబ్బి పెళ్లి తప్పించడంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తుంది. సానిదానికి మాత్రం నీతి ఉండొద్దా అని రామప్పని ప్రశ్నిస్తుంది. తన మేనకోడలు పెళ్లి తప్పిస్తే కరటక శాస్త్రి ఎంతో కొంత డబ్బు ఇస్తానంటే, వేశ్యను గనుక చేయవలసిన చోట డబ్బును తీసుకుంటున్నాను. కానీ మధురవానికి దయాదాక్షిణ్యాలు సున్నా అని తలిచారా! మీ తోబుట్టువుకు ఆపద వచ్చినప్పుడు డబ్బుకు ఆశిస్తావా అంటుంది. వేశ్య శరీర భాగం తగిలితే ఆ శరీర భాగాన్ని కోసేసుకుంటానని అన్న సౌజన్యరావు మధురవాణి సంస్కారానికి మెచ్చి షేక్‌ హ్యాండ్‌ ఇస్తాడు.
కన్యాశుల్కం ఒక నాటకంలో అతి ప్రధానమైన పాత్ర గిరీశం. అబద్దాలకోరుగా మోసగాడిగా రంగులు మార్చే ఊసరవెల్లి కనిపిస్తాడు. ఘటికుడైన అగ్నిహోత్రావతాలను తన చాతుర్యంతో బుట్టలో వేసుకుంటాడు. ఎన్నో విధాల అమాయకురాలైన బుచ్చమ్మను లొంగదీసుకోవాలని విఫల యత్నం చేస్తాడు. మధురవాణి సౌజన్యరావు సమక్షంలో గిరీశం అసలు రంగు బయటపెడుతుంది. డామిట్‌ కథ అడ్డం తిరిగింది అంటూ నిష్క్రమిస్తాడు. కన్యాశుల్కంలో బుచ్చమ్మకి గురజాడ ఎలా న్యాయం చేసాడంటే గిరీశం లాంటి వాడి చేతిలో పడి జీవచ్ఛంగా జీవించే కంటే శరణాలయంలోనే స్వేచ్ఛగా బ్రతుకుతుంది. అప్పుడే వితంతు వివాహాలు ప్రారంభవుతున్న తరుణంలో లేనిపోని అపోహలు పాత్రల్లో చూపించి మనుషులందరూ చాలా మంచి వాళ్ళు అని చెప్పడం గురజాడ తత్వం కాదు. గురజాడ సమాజంలోని మగాళ్ళ తత్వాలను ఎరిగిన మహాకవి. ఈ ఉద్ధరణ కార్యక్రమం ఒక్కరోజులో అయ్యేది కాదని గురజాడకి తెలుసు.
గిరీశం లాంటి మేక వన్నె పులులు అవసరాల కోసం అభ్యుదయం ముసుకు వేసుకుంటారు తప్పితే వారిలో ఏకోసానా అభ్యుదయ ఛాయలు ఉండవు. మనం గురజాడ కథల్లో ఆంతర్యాన్ని గమనిస్తే ‘సంస్కర్త హృదయం’ కథలో వేశ్యలు ఆంటీ నాచ్‌ గురించి ఉద్యమాలు చేసేవారిని చూసి నవ్వుకుంటారు. వీళ్ళకు శృంగారం విలువ తెలీదని, వేశ్యా వృత్తి అసలు తప్పు ఎలా అవుతుందని తిరిగి ప్రశ్నిస్తారు. అదే మధురవాణి దగ్గరకు వచ్చేసరికి చాలా ఔదార్యం కలిగిన పాత్ర.. అప్పటికి వేశ్యా వృత్తిపై వేశ్యల ఆలోచనల్లో మార్పు వచ్చిందని ‘కన్యాశుల్కం’ ద్వారా తెలుస్తోంది. ఆరంభం ఒక్క అడుగుతోనే అన్నట్టు! గురజాడ అభ్యుదయ ఆలోచనలతో తెలుగు జాతిని తట్టి లేపి, ‘గురజాడ మన అడుగుజాడ’ అయ్యాడనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు!
గురజాడ లాంటి ఎంతోమంది మహానుభావులు చేసిన కృషి ఫలితంగా ఆడవారు ఈమాత్రం అయినా స్వేచ్ఛ వాయువుల పిలుస్తున్నారు… వారందరికీ హృదయపూర్వక నివాళులు.
ఆధార గ్రంధాలు:
1) సారస్వత వివేచన – రాచమల్లు రామచంద్రారెడ్డి.
2) పరిశోధన విధానం – జయ ప్రకాష్‌
3) గురజాడ కథానికలు – ఎమెస్కో ప్రచురణలు
4) శ్రీ.శ్రీ – మహాప్రస్థానం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.