ట్రైనింగ్ హాల్లో 230 మంది ఉన్నారు. వీరంతా శిక్షణలో ఉన్న ఐ పీ ఎస్ లు. అందులో కొందరు విదేశీ పోలీస్ అధికారులు ఉన్నారు. ఈ నెల 11న సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రాంకి రిసోర్స్ పర్సన్‌గా వెళ్ళాను. జెండర్, పనిచేసే చోట లైంగిక నిరోధక చట్టం 2013 మీద సెషన్ తీసుకున్నాను.
ఆ సెషన్‌లో నేను చేయించిన ఒక ఎక్ష్సర్సెజ్ గురించి చెప్పాలి. నేను చేసే ప్రతి పోలీస్ ట్రైనింగ్‌లోను ఈ ఎక్ష్సర్సైజ్ చేయిస్తాను. ఓ రెండు నిముషాల పాటు అందరిని కళ్ళు మూసుకోమని చెబుతాను. డైరక్టర్ స్థాయి అధికారులు అక్కడ ఉంటారు కాబట్టి అందరూ బుద్ధిగా చెప్పింది వింటారు. 230 మంది కళ్ళు ముసుకున్నారు. హాలంతా నిశ్శబ్దం. చీటింగ్ చేయకుండా అందరూ కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో మీకు ఇష్టమైన రొమాంటిక్ అనుభవం గురించి గుర్తు తెచ్చుకోండి. ఆ అనుభవం మీకు ఎంత ఇష్టమో విజువలైజ్ చేసుకోండి. అనగానే ఒకరిద్దరు కళ్ళు తెరిచి నా వేపు గుర్రుగా చూస్తారు. నో చీటింగ్ కళ్ళు మూసుకోవాలి. రెండు నిముషాల తర్వాత కళ్ళు తెరవమని చెబుతాను. కొంతమంది నవ్వుకుంటూ, కొంతమంది కోపం గాను కళ్ళు తెరుస్తారు. ఎలా అనిపించింది అని అడిగితే బాగుంది అనో, బాలేదు అనో అంటారు.
అప్పుడు నేను మీలో ఎవరైనా వేదిక మీద కొచ్చి మీకు ఎంతో ఇష్టమైన మీ రొమాంటిక్ అనుభవాన్ని మీ మితృలతో పంచుకోండి అని పిలుస్తాను. హాల్లో హాహాకారాలు మొదలుతాయి. కొంతమంది నా మీద అరుస్తారు. ఇది చాలా అన్యాయం మేడం. మా నాకిస్టమైన నా అనుభవం నా పర్సనల్ నేనెట్లా అందరి ముందు చెబుతాను. దిస్ ఈజ్ టూ మచ్. మళ్ళీ మళ్ళీ పిలుస్తాను. ఒక్కరూ రారు. పైగా కోపంగా రియాక్ట్ అవుతారు. సైలెన్స్ ప్లీజ్. నిశ్శబ్దంగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. మీ వ్యక్తిగతమైన మీ అనుభవాన్ని ఇక్కడకొచ్చి పంచుకోమన్నందుకు సారీ చెబుతున్నాను. మనకు ఎంతో ఇష్టమైన అనుభవం మన సొంతం. పంచుకోవడం కష్టం. అందరి ముందు పంచుకోవడం ఇంకా కష్టం. మీ కోపాన్ని నేను అర్ధం చేసుకోగలను.
ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. లైంగిక దాడికి గురైన ఒక మహిళా గురించి ఆలోచించండి. తన మీద జరిగిన లైంగిక హింస వల్ల ఆమె పెను దుఃఖంలో, తీవ్రమైన అవమాన భారంతో కుంగిపోయి ఉంటుంది. దిక్కు తోచని స్థితిలో పోలీస్ స్టేషన్‌కు వెళుతుంది. నిందితుడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో పోలీసులు వేసే ప్రశ్నలు ఎంతో అమానవీయంగా ఉంటాయి. ఆ ప్రశ్నల్ని ఎదుర్కొనలేక ఆమె కుమిలి కుమిలి ఏడుస్తుంది. అయినా పోలీసులు దుర్ఘటన గురించి గుచ్చి గుచ్చి అడుగుతూనే ఉంటారు.
న్యాయస్థానాలు, న్యాయవాదులు కూడా ఆమెను జరిగిన సంఘటనను వివరించమని పదే పదే అడుగుతుంటారు. ఆమె తనకు జరిగిన అవమానం, అన్యాయం గురించి ఎంతో మందికి చెప్పాల్సి ఉంటుంది. ఆ ఘోరమైన అనుభవాన్ని పదే పదే వివరించాల్సి రావడం బాధిత మహిళకు ఎంత కష్టమో మీకు అర్థమవ్వాలనే ఈ ఎక్సర్సిస్ మీతో చేయించాను. బాధితులతో సున్నితంగా సెన్సిటివిటీతో ప్రవర్తించాలని చెప్పడమే నా ఉద్ద్యేశ్యం.
మన వ్యవస్థ లైంగిక హింసకి లేదా రేప్‌కి గురైన మహిళతో ఎలా ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా పోలీస్, న్యాయ వ్యవస్థలు ఎలాంటి ప్రశ్నలు వేస్తాయి. తన మీద జరిగిన దౌర్జన్యం వల్ల తీవ్ర నైరాశ్యంలో, దుఃఖంలో ఉన్న బాధిత మహిళతో అత్యంత అమానవీయంగా, ఎలాంటి సెన్సిటివిటీ లేకుండా అడిగే ప్రశ్నలు, ఆమె చెప్పేది నమ్మకుండా హేళనగా ప్రశ్నించే సందర్భాలూ ఒక సారి గుర్తు తెచ్చుకోండి.
న్యాయస్థానాల్లో అడ్వకేట్లు, జడ్జీలు అడిగే పద్ధతులు గుర్తు చేసుకోండి. అత్యాచారానికి, లైంగిక దోపిడీకి గురైన మహిళ పట్ల మన వ్యవస్థలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాయి. మీకు ఇష్టమైన అనుభవాన్నే మీరు షేర్ చెయ్యలేరు. అత్యాచార బాధిత మహిళ తన ఇష్టానికి వ్యతిరేకంగా తన శరీరం మీద జరిగిన దాడి గురించి పదే పదే అడిగే వికృతమైన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పగలుగుతుంది. సీరియస్‌గా ఆలోచించండి. పోలీస్ వ్యవస్థలోకి సున్నితత్వం, సెన్సిటివిటీ తీసుకురావాలనే ఉద్ధేశ్యంతోనే మీతో ఈ ఎక్సర్సైజ్ చేయించాను. హాలంతా నిశ్శబ్దం. కొంతసేపు సైలెంట్‌గా ఉన్న తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. ఒకరిద్దరు లేచి బావుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. మేమెప్పుడూ ఇలా ఆలోచించలేదని కొంతమంది చెప్పారు. మీరందరూ జెండర్ లెన్స్‌తో చూస్తేనే ఇలాంటివి అర్ధమౌతాయి. మహిళల, పిల్లల, ట్రాన్స్ కమ్యూనిటీ అంశాలు అర్ధం కావాలంటే జెండర్ సెన్సిటివిటీ, సున్నితత్వం చాలా అవసరం.
