స్త్రీల ప్రాతినిధ్యం: ప్రస్తుత పరిస్థితి – ఎ. సునీత

రాచరిక వ్యవస్థ నుండి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు జరిగిన ప్రయాణం దాదాపు ఐదు శతాబ్దాలు పట్టింది. భారత దేశంతో సహా, ప్రాచీన కాలంలో వివిధ రకాల సామూహిక పాలనా వ్యవస్థలు ప్రాచీనకాలం నుండి ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఏర్పడినప్పటికీ, అవి ఎక్కువకాలం నిలబడలేదు, నిలబడినా అవి ప్రాచీన గ్రీసు, భారత ఉపఖండంలోని మగధ సామ్రాజ్యంలో లాగా అతి చిన్న పాలక వర్గానికి పరిమితమయ్యింది తప్ప అత్యధిక ప్రజానీకాన్ని, ముఖ్యంగా శ్రామికులు, స్త్రీలు, అణగారిన సమూహాలని ఎప్పుడూ పరిగణన లోకి తీసుకోలేదు. వీళ్ళందరూ కేవలం పాలితులు, సేవకులు, బానిసలూ మాత్రమే.

వాణిజ్య పెట్టుబడిదారీ విధానం ఊపందుకున్న సమయంలో, ఐరోపాలో, ముఖ్యంగా బ్రిటన్‌లో ప్రవేశించిన ప్రాతినిధ్యం అనే భావనరాజులు దేవుడి ప్రతినిధులనే భావనని సవాలు చేసింది. రాజ్య పెత్తనం దేవుడిచ్చిన అధికారం కాదని, దాన్ని రాజులు లౌకిక ప్రపంచంలో పాలితులప్రాణం, ఆస్తి, స్వేచ్చని కాపాడటానికి పొందారని అంటూ అసలు కుటుంబంలో తండ్రి/భర్త పెత్తనం కూడా షరతులతో కూడుకుందేనని బ్రిటిషు రాజనీతిజ్ఞుడు థామస్ హాబ్స్ రాసాడు. ప్రభుత్వం/రాజ్యాన్ని ఒక విస్తృత పితృస్వామ్య వ్యవస్థగా, రాజు/ప్రభుత్వ అధినేతలని తండ్రి/కుటుంబ పెద్దగా అర్ధం చేసుకునే ధోరణిని ప్రశ్నిస్తూ 17వ శతాబ్దంలో మొదలయిన ఆలోచనా ధోరణిది. వాదన కోసమయినా సరే రాజకీయ సిద్ధాంత వేత్తలు కుటుంబంలో భర్త/తండ్రికి భార్య/పిల్లల పైన సంపూర్ణమైన అధికారం
ఉండదనిచెప్పిన సందర్భడం.
1790లలో ఫ్రాన్స్‌లో బూర్జువా విప్లవం వచ్చే సమయానికి, ఐరోపాలో వివిధ రకాల శ్రామిక ప్రజలని క్రింది నుండి ఉబికిన మత, సామాజిక ఉద్యమాలు చైతన్యవంతులని చేశాయి. స్త్రీపురుష సమానత్వం వీటిలో ఒక చర్చ. ఎంత డబ్బు వున్న ఆడవాళ్ళకయినా స్వతంత్రం లేకపోవటంతో వివిధ వర్గాల ఆడవాళ్ళూ ఫ్రెంచి విప్లవానికి దారి తీసిన అనేక నిరసనల్లో అనేక రకాలుగా భాగమయ్యారు. అటువంటి ఒక డబ్బున్న స్త్రీ దగ్గర ఆశ్రయం తీసుకున్న ఫ్రెంచి సిద్ధాంత కారుడు రూసో తన ముందు తరాల సిద్ధాంత కర్తలు ప్రాతినిధ్య ప్రభుత్వం, కుటుంబం, రాచరిక వ్యతిరేక ఆలోచనల్ని చాలా ముందుకు తీసుకెళ్లి వున్న రాజ్యం నుండి వ్యక్తులు హక్కులు సంపాదించుకోవడం బదులు సామూహిక శక్తి ఆధారంగా సర్వ సత్తాక రిపబ్లిక్‌ని నిర్మించుకుని దాని ద్వారా సరయిన చట్టాలని ఏర్పర్చుకున్నప్పుడే స్వేచ్ఛ లభిస్తుంది అని వాదించాడు. అయితే ఫ్రెంచి విప్లవానికి సిద్ధాంత పురుషుడిగా చెప్పుకునే ఈ మహానుభావుడు స్త్రీలు, పురుషులకి ఆ సామూహిక శక్తిలో భిన్న పాత్రలు ఇవ్వాలని, మగవాళ్ళు పౌరులుగా జన హితం గురించి ఆలోచించాలని, ఆడవాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితమయ్యి తమ ఇంటి నుండి భవిషత్తు పౌరులని, ఇంటిపట్టు నుండే స్త్రీలని తయారుచేయాలని చెప్పాడు. 18వ శతాబ్దపు చివర్లో ఏర్పడిన ఫ్రెంచి రిపబ్లిక్, అయన అనుకున్నట్లే, అందరికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వ భావనల్ని ప్రసాదించిన, శ్రామిక వర్గ పురుషులతోపాటు, స్త్రీలందరినీ కట్ట కట్టి ఆ రిపబ్లిక్ నుండి పక్కకి పెట్టింది.
సరిగ్గా ఈ శతాబ్దంలోనే ఈ ఐరోపా దేశాలన్నీ సామ్రాజ్యాలుగా రూపుదిద్దుకుని ఆసియాలో వివిధ దేశాలని దండయాత్రల ద్వారా తమ పాలనలోకి తెచ్చుకునే క్రమంలో ఆయా సమాజాలు ఆడవాళ్ళని అణచివేసి పెట్టాయని, తాము వారికి ఆడవాళ్ళని మంచిగా ఎలా చూడాలో నేర్పించి, నాగరీకులని చేస్తామని ప్రచారం చెయ్యటం ప్రారంభించాయి. బ్రిటిషు పాలకులు ఇదొక తెల్లజాతి మొయ్యాల్సిన బరువుగా చెప్పుకున్నారు. ఆచరణలోకి వచ్చే సరికి ఉపఖండ కులీన వర్గాలు, అగ్ర వర్ణాల వారితో అంటకాగి తమ పాలనని సుస్థిరం చేసుకునే క్రమంలో, కావాల్సినంత సద్దుబాట్లకి, సవరణలకు గురయ్యి, తప్పని సరి అయినపుడు మాత్రమే, అది కూడా స్థానిక మేధావులు, సంస్కరణ వాదులు దానికోసం కొట్లాడినప్పుడు మాత్రమే తగినంత మార్పులు చేశారు. బ్రిటిషు పితృస్వామ్య ఆలోచనలు, స్థానికకుల, వర్గ పితృస్వామ్యంతో కలిసి ఇక్కడ వర్గాల ఆడవాళ్ళ జీవితాలని నిర్ణయిస్తూ వచ్చాయి. వీళ్ళు నిర్ణయించిన ప్రపంచంలో అన్ని వర్గాల ఆడ వాళ్ళు – టి తోటల్లో పనిచేసేవాళ్ళు, ఓడలెక్కి దూర దేశాలకెళ్ళే వాళ్ళు, ఫ్యాక్టరీలలో, గనుల్లో పని చేసేవాళ్ళు, ఇళ్లల్లో అన్ని రకాల చేతి పనులు చేసేవాళ్ళు, పొలాల్లో పనిచేసే వాళ్ళు, అప్పుడప్పుడే ఇంగ్లీషు చదువులోకి ప్రవేశించి మధ్యతరగతిగా రూపుదిద్దుకుంటున్న అగ్ర కులాల వ్యవసాయ కుటుంబాలోని ఆడవాళ్ళూ, లైంగిక శ్రమలో వుండేవాళ్ళు – అన్ని రకాల ఆడవాళ్లు ఏదో ఒక మగవారి అధికారంలో ఉండేలా చూసుకున్నారు. లేనిచోట తామే మగ అధికారులుగా రూపొందారు. ఈ సందర్భంలో భారత ఉపఖండ పితృస్వామ్యం, బ్రాహ్మణీయత, విక్టోరియన్ భావజాలం కలిసి ఒక కొత్తరూపు దిద్దుకుంది.
వలస పాలనా కాలం నుండి మహిళా కోటాల ప్రయాణం
బ్రిటిషు పాలనా వ్యవస్థలో భారతీయుల ప్రాతినిధ్యం 1890ల్లో ప్రారంభమయి, వివిధ రకాల ఆసక్తులు గల సమూహాలకు అవకాశం ఇచ్చింది. జమీందార్లు, టి ఎస్టేట్ యజమానులతో సహా, డిప్రెస్డ్ క్లాసెస్, ముస్లింలకి కూడా అవకాశం లభించింది. ఇది తర్వాతి రెండు దశాబ్దాలలో ప్రొవిన్సియల్ కౌన్సిల్స్‌లోకి, మునిసిపల్ కౌన్సిల్స్‌లోకి కూడా ఇది వ్యాపించింది. ప్రతినిధులని ఎన్నుకోవటానికి ఈ ప్రత్యేక సమూహాలకు తమవయిన ఎలెక్టోరెట్లు కూడా ఏర్పాటయ్యాయి. సరిగ్గా 1920ల చివర్లో, సంస్కరణ ఉద్యమాలలో ఎదిగి తమ గురించి తామే మాట్లాడుకునే స్థితికి చేరిన స్త్రీలు వివిధ స్త్రీల సంఘాలు పెట్టుకుని ఆడవాళ్ళకి కూడా ఓటు హక్కు అడిగారు. ప్రధానంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ ఉన్నత వర్గాల, అగ్ర వర్ణాల స్త్రీలు వీటిల్లో సభ్యులుగా ఉన్నప్పటికీ, కొంత మంది దళిత, ఆదివాసీ, ఇతర సమాజాల స్త్రీలు కూడా 1930లలో వివిధ సాంఘిక సంస్కరణ సంఘాలలోనే కాక, డిప్రెస్డ్ క్లాసెస్ సంఘాలలో, హరిజన సంఘాలలో, కాంగ్రెస్ పార్టీలో కూడా క్రియాశీలక పాత్ర పోషించటం కూడా మొదలు పెట్టారు.
స్వతంత్ర భారత ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషించబోయే రిజర్వేషన్లు 1930లో ముస్లిములకు ఉన్నట్లు దళితులకు కూడా, సాధారణ ప్రతినిధులతో పాటు, దళిత ప్రతినిధులని తమ వాడల్లో ఎన్నుకునే అవకాశం కావాలని అంబేడ్కర్ రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పెట్టిన ప్రతిపాదనని తీసేయించేందుకు, గాంధీ ఆమరణ నిరాహార దీక్షచేసాడు. స్వంత ప్రతినిధులకు బదులుగా, 15% సీట్లని అంటరాని వారికి కేటాయించేందుకు ఒప్పుకున్నాడు. 1920లలో కొంత మంది స్త్రీల సంఘాల ప్రతినిధులు, అప్పటికే కొన్నిచోట్ల అమలవుతున్న నామినేషన్ల స్థానంలో, స్త్రీలకూ సీట్ల రిజర్వేషన్లు వుండాలని అడిగారు. కానీ గాంధీ దీక్షకి దిగిన సందర్భంలో సరోజినీ నాయుడు వంటి మహిళా నాయకత్వం ఆ ప్రతిపాదనని వదిలేస్తూ, ‘ఆడవాళ్లు తమ సమర్ధత మీద ఆధార పడి ఎన్నుకోబడాలి తప్ప, ఇటువంటి గ్యారంటీలు అడగ కూడదు’ అనే వుమ్మడి ప్రకటన చేసి, దీక్ష చేస్తున్న గాంధీకి పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనతో ముస్లిం, దళిత స్త్రీలు ఏకీభవించలేదు.
ఈ భేదాలు స్వాతంత్య్రానంతర భారత దేశంలో కొనసాగాయి. పంచాయితీల్లో, మునిసిపల్ కౌన్సిళ్లలో క్రియాశీలక స్త్రీలని నామినేట్ చెయ్యగలిగే అవకాశం 1960లలో పంచాయతీ చట్టాలు చేసినపుడు కల్పించబడింది. అతి కొద్దీ చోట్ల నామినేషన్లు జరిగుండొచ్చు కానీ, ప్రధానంగా దీన్ని ఎవరూ ఉపయోగించుకోలేదు. 1975లో భారతదేశంలో స్త్రీల పరిస్థితుల గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సామాజిక శాస్త్రవేత్తల కమిటీ తయారు చేసిన ‘టువార్డ్స్ ఈక్వాలిటీ’ నివేదికలో రిజర్వేషన్ల గురించి సభ్యులు ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. స్త్రీల పరిస్థితులు స్వాతంత్ర సమయం కంటే దిగజారాయని రాసిన సభ్యుల్లో మెజారిటీ రిజర్వేషన్లు వద్దనే అభిప్రాయానికి వస్తే, ఇద్దరు సభ్యులు పరిస్థితులు చూసిన తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకున్నామని, పంచాయితీ నామినేషన్ కోటాలో స్త్రీలని తప్పక నియమించాలని చెప్పారు. కేంద్ర మంత్రిత్వ శాఖ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ కమిటీ సభ్యులని అడిగితే చెయ్యొచ్చు అని చెప్పారు, కానీ అసలు వత్తిడి వేరే కారణాల వల్ల క్రింది స్థాయి నుండి వచ్చింది.
1980లో రామకృష్ణ హెగ్డే ఆధ్వర్యంలోని కర్ణాటక ప్రభుత్వ సామజిక న్యాయశాఖా మంత్రి తీసుకున్న చొరవతో 25% సీట్లని స్త్రీలకి, దళిత, ఆదివాసీ మహిళల కోసం కోటాతో సహా, కేటాయించింది. ఆ తర్వాత ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కోటాలని ప్రవేశ పెట్టి అమలు చేశాయి. 1980ల చివర్లో మహారాష్ట్రలో షేత్కారి మహిళా సంఘటన స్త్రీల ఉద్యమ స్పూర్తితో ఈ సమస్యని ఎత్తుకుంది. శరద్ యాదవ్ ఆధ్వర్యంలో పని చేసే ఈ రైతు సంఘాని¿ ìచెందిన మహిళా సంఘటన గెయిల్ ఆమ్వేట్ వంటి కుల వ్యతిరేక స్త్రీవాద
ఉద్యమ కారులతో కలిసి అణగారిన వర్గాల స్త్రీలతో సహా గ్రామీణ స్త్రీలని ఎన్నికలకి సిద్ధం చేసింది. కొన్ని పంచాయితీల్లో పోటీకి సిద్ధమయిన ఆడవాళ్ళని మాత్రమే నిలబెట్టి గెలిపింపచేసింది. అలా మొదటిసారి పూర్తి మహిళా పంచాయితీలు వచ్చాయి. రాష్ట్రాల్లో ఈ అనుభవాలు, రాజకీయంగా కాంగ్రెసేతర పార్టీలకి పంచాయితీలు పార్టీలకు తమ ఓటర్ బేస్ పెంచుకోవటానికి మంచి సాధనంగా కనపడ్డంతో,1993లో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీల్లో, ఆ తర్వాత మునిసిపాలిటీల్లో మహిళా రిజర్వేషన్లని ప్రవేశ పెట్టారని మహిళా ఉద్యమకారిణ ìదేవకీ జైన్ విశ్లేషించారు. ఈ కోటాలు ఇప్పుడు 331/2 శాతం నుండి 50% అయ్యాయి.
పార్లమెంటులో మహిళా కోటాల ప్రయాణం
1995లో బీజింగ్ సమావేశం తర్వాత, అనేక దేశాల్లో ఈ కోటాలు ప్రవేశించాయి. ఇవి అనేక పద్ధతుల్లో- మెక్సికో నుండి దక్షిణ ఆఫ్రికా వరకు, నార్వే నుండి పాకిస్తాన్ వరకూ ఏ రకమైన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమున్నా – వాటిలో స్త్రీలకూ కోటా ఉండాలనేది ఒక డిమాండుగా మారింది. గత పదేళ్లలో, ఇది ప్రత్యేక కోటా నుండి సమాన కోటా వరకూప్రయాణించింది. మెక్సికోలో అన్ని స్థాయిల్లో తప్పనిసరిగా 50% స్త్రీలు ఎన్నుకోబడేట్టు చర్యలు తీసుకున్నారు. వివిధ దేశాల్లో – అవి ఏ విధమయిన ప్రతినిధ్యమయినా కావచ్చు- ఓట్ల నిష్పత్తి భూమికపై పార్టీలకి సీట్లు కేటాయించేదయినా, ప్రత్యక్షంగా ప్రతినిధులని ఎన్నుకునేదయినా – అన్నిట్లో ఎన్ని రకాల అడ్డంకులుంటాయో వాటిన్నంటినీ ఎదుర్కునే ప్రయత్నం జరుగుతోంది. కోటాలు రాజకీయాల్లోనే కాక, అన్ని రకాల ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం కొన్ని దేశాల్లో జరుగుతోంది.
మన దేశంలో స్థానిక సంస్థల్లో కోటాలు ప్రారంభమయిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టమని అడగటానికి పెద్ద సమయం పట్టలేదు.1995లో ప్రారంభమయిన మహిళా కోటాల లక్ష్యాలు, పద్ధతులు, ప్రాతినిధ్య న్యాయం గురించి, తీవ్ర విభేదాలు, భిన్న ప్రతిపాదనలు, లోతయిన చర్చలు జరిగాయి. ఒకపక్క మహిళలలో అసమానతలని, భిన్నత్వాన్ని ఈ కోటాలు ఎలా ప్రతిబింబిస్తాయి అనే ప్రశ్న, ఇంకో పక్క మహిళా కోటాలతో మహిళల జీవితాల్లో ఏ మార్పు వస్తుందనే ప్రశ్న రెండూ తీవ్రమయిన భిన్నాభిప్రాయాలు దారి తీశాయి. సూత్రప్రాయంగా అన్ని పార్టీలు దీన్ని ఒప్పుకున్నా, పధ్ధతి గురించి ఏకాభిప్రాయం కుదరకపోవటంతో పార్లమెంటులో అనేక సార్లు బిల్లు వీగిపోయింది. అయితే పార్లమెంటులోనే కాక బయట కూడా దీని పట్ల ఏకాభిప్రాయం కుదరలేదు.
మొదటి సవాలు – దేశ రాజకీయాల్లో అన్ని పార్టీల్లో కూడా సవర్ణ, ఆధిపత్య కుల సమూహాలు అతి ఎక్కువగా ఉండటాన్ని ఈ కోటాలు కొనసాగిస్తాయి అన్నది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో 1990లలో సవర్ణ -ఆధిపత్య కుల యేతరపార్టీలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి, పార్లమెంటు రూపాన్ని మార్చేశాయి. మహిళా రిజర్వేషన్లలో అన్ని సామాజిక అసమానతలు, వర్గాల భిన్నత్వాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే డబ్బు, అధికారం, ఆధిపత్యం వున్న మహిళలకే పార్టీలు టికెట్లు ఇవ్వటం, వాళ్ళే పోటీ చేసి ఎన్నుకోబడితే మళ్ళా పార్లమెంటు సవరణ-ఆధిపత్య సామాజిక వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఆందోళన అనేక దళిత బహుజన సంఘాలు, పార్టీలనే కాకుండా స్త్రీవాదులని కూడా కలవర పరిచింది. కొన్ని వామపక్ష మహిళా సంఘాలు ముందుగా మహిళా కోటా వచ్చిన తర్వాత ఈ సమస్యని చూసుకుందాం, వెనుకబడ్డ సామజిక వర్గాల మగవాళ్ళకి రిజర్వేషన్ లేకుండా ఆయా మహిళలకి కోటా కల్పించటం చట్టపరంగా అసాధ్యం అని వాదించారు. కానీ కొంత మంది స్త్రీవాదులు వివిధ వర్గాల మహిళలకి చోటు కల్పించకుండా మహిళా రిజర్వేషన్లే అనవసరం అని కూడా అభిప్రాయం పడ్డారు.
మొదటి సవాలుతో కలిసిన రెండవ సవాలు – మహిళలు ఉన్నంత మాత్రాన మహిళల సమస్యలని వాళ్ళు లేవనెత్త గలుగుతారా అన్నది. ఇది అధికారికంగా మార్పు నిజమైన మార్పుకి దారితీయగలదా అని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. స్త్రీల ఉద్యమంలో పార్లమెంటరీ రాజకీయాలంటే వున్న అపనమ్మకం దీనికి కొంత కారణమయితే రాజకీయ పార్టీల ప్రాధాన్యతలేని అధిగమించి మహిళా ప్రతినిధులు ఏమి చెయ్యగలరు, ఇప్పటి వరకూ మహిళా ప్రతినిధులు మహిళల విషయాల గురించి ఎంత వరకు చేయగలిగారు అన్న విషయాల గురించిన విశ్లేషణ కూడా దేనికి మరొక కారణం. ఇది కేవలం భారతదేశ సమస్యే కాదు, అన్ని దేశాల్లో ఇదే సమస్య. ఎన్నుకోబడిన తర్వాత ఎటువంటి అధికారిక పాత్రలోకి వెళ్ళగలరు, వాళ్లకి ఎటువంటి మంత్రిత్వశాఖలు ఇస్తారు, ఆయా మంత్రిత్వ శాఖలకు ఎంత నిర్ణయాధికారం ఉంటుంది, అసలు సమాజంలో ఈ సమస్యలపై బలమైన వత్తిడి ఏర్పడకుండా ఎన్నికÁయిన మహిళా ప్రజా ప్రతినిధులు ఎలా ఈ సమస్యలని ఎత్తుకోగలరు అన్నవి కీలక ప్రశ్నలు.
అధికారిక ప్రాతినిధ్యానికి వాస్తవిక ప్రాతినిధ్యానికి మధ్య ఈ అంతరాన్ని గురించి విశ్లేషణ జరిపిన అనేక మంది చెప్తున్నదేమిటంటే – మహిళలు ఎక్కువ మంది ఉండటంతో పాటు – వారు కలిసి పని చేసినప్పుడే మహిళల సమస్యలని తీసుకోవటం సాధ్యపడుతుంది. నార్వే కావొచ్చు, దక్షిణ ఆఫ్రికా కావొచ్చు మహిళా ప్రతినిధులు సాధారణ సమస్యలపై మగ ప్రజాప్రతినిధుల్లాగే అంతే ప్రభావశీలంగా పని చేస్తున్నారు. జెండర్‌కి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు మగ ప్రజా ప్రతినిధుల వ్యతిరేకతని అధిగమించటానికి కలిసి పని చెయ్యాల్సి వస్తుంది. అది వాళ్లలో కొంత మంది చొరవ తీసుకుంటే సాధ్యపడుతుంది. అలా మహిళల ప్రత్యేక సమస్యలని మహిళా ప్రతినిధులు తీసుకున్న సందర్భాలు వున్నాయి కానీ, చాలా సార్లు బయట వుండే సామాజి¿ £ఉద్యమాలు వారిని రాజకీయంగా సమస్యలని తీసుకునేలా వత్తిడి చెయ్యటం కూడా అంతే అవసరం. అటువంటి సందర్భంలోనే మహిళా ప్రతినిధులు మహిళలపై హింస, వారి ఆర్ధిక, సామాజిక హక్కులు, ఇతర సమస్యల పైనా ఎక్కువ పని చెయ్యగలిగారని పరిశోధనలు చెబుతున్నాయి.
ముగింపు: 2023లో పార్లమెంటులో పాసయ్యిన బిల్లు దళిత, ఆదివాసి మహిళలకి కావాల్సిన కోటాని కల్పించింది, కానీ దీన్ని జనాభా లెక్కలతో, డీలిమిటేషన్‌కి ముడి పెట్టింది. అనేక మంది స్త్రీవాదులకి ఓబిసి మహిళలకి, ఇతర మైనారిటీలకు అవకాశం కల్పించని ఈ బిల్లుతో సమస్యలు ఇప్పటికీ వున్నాయి. 2026లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తన ఇతర రాజకీయ ఎజెండాకి వాడుకోవాలని, దానితో ప్రతిపక్ష పార్టీలని మహిళా వ్యతిరేకిగా చూపెట్టాలని చూసింది. కానీ ఈ విషయం పట్ల నిజాయితీతో కాదు. అందుకే అనేక మంది సభ్యులు ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని, దానితోపాటు దీనిలో ఓబిసి మహిళలకి ప్రాతినిధ్యం కల్పించే విషయాన్నీ చర్చించాలని అన్నారు. పార్లమెంటులో మహిళలకి కోటాలు కల్పించటం కేవలం అధికారిక ప్రాతినిధ్యం మాత్రమేననీ, నిజమైన ప్రాతినిధ్యం చాలా దూరంలో ఉందనీ, సాధికారత సాధించటానికి చాలా ప్రయాణం చెయ్యాలని ఈ సందర్భంలో మళ్ళా
గుర్తు తెచ్చుకోవటం చాలా అవసరం.

Share
This entry was posted in ఇంకు పెన్ను. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.