ఎన్నో పాత్రలు పోషిించాల్సివుంటుంది.

వై. లీలాకుమారి
నేను బ్యాంక్‌ క్లర్క్‌గా పనిచేస్తున్నాను. నేను బిఎస్‌.సి. చదువుకున్నాను. మాది గుంటూరు.నా భర్త కెనరాబ్యాంక్‌లో ఆఫీసరు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు  బిటెక్‌ చేస్తున్నారు..
సహజంగా ఉద్యోగం చేసే ఆడవాళ్ళకు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ బాధ్యతలు వుంటాయి. ఒక కోడలిగా, భార్యగా, తల్లిగా, ఎన్నో పాత్రలు పోషిించాల్సి వుంటుంది. ఉద్యోగస్తురాలిగా ఎంత ఎత్తుకు ఎదిగినా, కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుకుంటూ, పిల్లల్ని చక్కగా చదివించి పైకి తీసుకొచ్చినపుడు ఎంతో ఆనందంగా వుంటుంది. కుటుంబ సభ్యులు ఆనందంగా వుంటే మనం ఆఫీసుల్లో పడిన కష్టం మర్చిపోతాం కూడా. ఏదైనా చిన్న చిన్న సమస్యలు, వత్తిడి వచ్చినా మన తోటి వారితో చర్చించుకుంటే కొంత పరిష్కారం దొరుకుతుంది. మనం చేయవలసిన పనుల్ని ముందుగా ఆలోచించుకుని ఒక పద్ధతిగా చేసుకుంటే మనకంటూ కొంత సమయం కేటాయించుకోగలం. ఉద్యోగం చేయడంవల్ల గృహిణిగానే కాకుండా సమాజంలో ఒక గుర్తింపు కూడా వుంటుంది.
ఉద్యోగ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు భరించలేని ఆవేదనల్లోంచి ఉద్యోగం చెయ్యడం కన్నా హౌస్‌వైఫ్‌గా వుండడం మేలు అనిపించడం సహజమే. కానీ అదే దానికి పరిష్కారమని భావించను. పెరుగుతున్న జీవన పరిణామంను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగం చేయడం అవసరం. అదీ కాక మనం బయటి ప్రపంచాన్ని చూస్తున్నపుడు బావిలో కప్పలా కాకుండా ఎన్నో విషయాలు తెలుస్తూ వుంటాయి. ఏది మంచో, ఏది చెడో మనం నిర్ణచించుకోగలం. ఇంటిపనిని కుటుంబ సభ్యులు కొంత పంచుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.
ఇంటర్వ్యూ: సీతామహలక్ష్మి

స్త్రీీల  అంశమే  ఊపిరై  కడదాకా  సాగాల్సిందే.
కొండవీటి సత్యవతి

1975 సంవత్సరం. మా నాన్న  మా ఆవుపాలు పిండుతుంటే నేను లేగదూడను పట్టుకుని నిలబడ్డాను. రేడియోలో ఢిల్లీ నుండి వచ్చే ఏడుగంటల వార్తలు వస్తున్నాయి. ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించిందని వార్తల్లో చెబుతూ స్త్రీల కోసం ఎన్నో సరికొత్త కార్యక్రమాలు చేపట్టబోతున్నారని తెలియచెప్పాడు న్యూస్‌రీడర్‌. పాలుపిండడం అయిపోయింది. నేను దూడను వదిలేసాను. అది చెంగుమంటూ ఎగిరి తల్లి పొదుగులో దూరిపోయింది. ఆ రోజు ఉదయం రేడియోలో చెప్పిన మహిళా సంవత్సరం  వార్త మా నాన్న బుర్రలో చేరిపోయింది. నేను డిగ్రీ పూర్తిచేసి ఇంట్లో ఉన్నాను. ‘పద హైదరాబాద్‌ పోదాం నీకు ఉద్యోగం వచ్చేస్తుంది’ అన్నాడు. హైదరాబాదా? నేను అప్పటికి పక్కజిల్లాకి కూడా పోలేదు. సరే అన్నాను. నాకున్న రెండో, మూడో చీరలు బాగులో పెట్టుకుని మా నాన్నతో కలిసి మహానగరంలోకి వచ్చేసాను.
హుస్సేన్‌సాగర్‌ పక్కన పాటిగడ్డ కాలనీ. మా చిన్నాన్న ఇంటికి వచ్చేసాం. అప్పటికే ఆ ఇంట్లో నాలాంటివాళ్ళు నలుగురు ఉన్నారు. మా చిన్నమ్మ, చిన్నాన్నల హృదయాలు విశాలమైనా, క్వార్టర్‌ మాత్రం మహా ఇరుకు. అందరం అందులోనే సర్దుకున్నాం. నన్ను దింపేసి మానాన్న వెళ్ళిపోయాడు. నాకు మంచి ఉద్యోగం వచ్చేస్తుందని మా ఊళ్ళో వుంటూ గొప్ప కలలు కంటూ వుండేవాడు. 1975 మహిళా సంవత్సరమే కాదు మహా అంధకార సంవత్సరమని నాకు అప్పటికి తెలియదు. 76లో గ్రూప్‌ |ఙకోసం సర్వీస్‌ కమీషన్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. అప్పటికి పదేళ్ళుగా రిక్రూట్‌మెంట్‌ లేదు. లక్షలాది అప్లికేషన్‌లు వచ్చాయి. నేను పోటీ పడ్డాను. పేపరంతా ఇందిరాగాంధిమయం. పరీక్ష బ్రహ్మాండంగా రాసాను. కానీ ఆ ఉద్యోగం రావడానికి మూడేళ్ళు పట్టింది. 165 రూ||ల జీతానికి అమీర్‌పేటలో రెడ్‌రోజెస్‌ అనే కాన్వెంట్‌లో చేరాను. ఆ తర్వాత ఇక్రిసాట్‌లో చేసాను. చిన్న చితకా ఉద్యోగాలు చాలానే చేసాను.
నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని కలలు కన్న మా నాన్న 77లో చనిపోయాడు. నేను తీవ్ర నిరాశతో కూరుకుపోయాను. నాకు మా నాన్నతో చాలా అనుబంధం.  ఆయనే నాకు కట్టెలు కొట్టడం, చేపలు పట్టడం, పాలు పిండడం, మొక్కలకు నీళ్ళు పట్టడం లాంటి ‘మగపనులు” చేసే అవకాశం కల్పించాడు. నువ్వు ఆడపిల్లవి, అణుకువగా, ఇంటిపట్టున ఉండాలి లాంటి మాటలు, ఆంక్షలు ఎన్నడూ నేను విని వుండలేదు. నేను మా ఊరి తోటల్లో స్వేచ్ఛగా, హాయిగా తిరుగుతుండేదాన్ని. సాధారణంగా అన్ని ఇళ్ళలోను ఆడపిల్లలు ఎదుర్కొనే వివక్షని నేను నా జీవితంలోని ఏదశలోను ఎదుర్కోలేదు. నన్ను చెట్లమీద పిట్టల్లా, నీళ్ళల్లో చేపలా ఎదగనిచ్చిన మా నాన్న మరణం నన్ను చాలా కుంగదీసింది. ఆయన్ని కడసారి కూడా చూడలేకపోయాను. నేను మా ఊరు తిరిగి వెళ్ళిపోయాను.
ఇక్కడే ఓ స్నేహహస్తం నన్ను ఆదుకుంది. నేను పాటిగడ్డలో వుండే రోజుల్లో జయ, విజయ అని ఇద్దరు ఫ్రెండ్స్‌లుండేవాళ్ళు. నేను ఈ రోజు ఈ స్థితిలో నిలబడి వుండడానికి కారకురాలు జయ. తన స్నేహం, నన్ను మా వూరి నుండి లాగి మళ్ళీ హైదరాబాద్‌కు తెచ్చింది. నేను సంఘర్షిస్తూనే ఎదగడానికి, నాకాళ్ళ మీద నేను నిలబడడానికి తను అందించిన సపోర్ట్‌ను మాటల్లోకి అనువదించడం చాలా కష్టం. నిజానికి నా జీవితం పొడవునా, నేను నడిచివచ్చిన దారికిరువైపులా దివిటీలు పట్టి దారి చూపించిన వాళ్ళు స్నేహితులు, హితులే. నేను చదువుకున్న స్కూల్‌  హెడ్‌మిస్ట్రెస్‌ కన్యాకుమారి గారి పాదాలకు రోజు ప్రణమిల్లినా తక్కువే. నేను చదువుకోవడానికి, ప్రతి సంవత్సరం అది కొనసాగడానికి ఆవిడ చేసిన కృషి అపారం. రోజూ ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్న రోజుల్లో ఆవిడ నన్ను తనింట్లో పెట్టుకుని చదివించారు. నాకు విద్యాభిక్ష పెట్టింది ఆవిడే అని గర్వంగా చెప్పుకుంటాను.
మా వూరు సీతారామపురం. నాలైఫ్‌లైన్‌. నాకు అందమైన, అద్భుతమైన బాల్యాన్నిచ్చిన చిన్న గ్రామం. మామిడి, జీడి, సపోటా, సీతాఫలం, సరుగుడు తోటలతో పచ్చగా, ప్రాణంగా వుండే మా ఊరు. ఒకవైపు గోదావరి, మరోవైపు సముద్రం.  మా ఇల్లు పెద్ద సత్రం. మా అమ్మలు రోజూ ఏభైై, అరవై మందికి వండిపోసేవారు. ఏడుగురు చిన్నాన్నలు, పెద్దనాన్నలు వాళ్ళ పిల్లలు కలిసి వుండే పెద్ద వుమ్మడి కుటుంబం. మా తాత ఈ కుటుంబానికి రాజు. ఇంతమందికి వొండి వడ్డించాక అమ్మలకి ఆఖరున తిండివుండేది కాదు. పిల్లలం ఏదో పెట్టింది తిని ఊరిమీద పడేవాళ్ళం. తోటల వెంబడి తిరుగుతూ, కాయో, కమ్మో తింటూ ఎక్కువ టైమ్‌ బయటే. ఎక్కడి కెళ్ళావ్‌? ఏం చేసావ్‌? లాంటి ప్రశ్నలెప్పుడూ నేను వినలేదు. నా ఇష్టం వచ్చినంత సేపు తిరగడం, తిండికి ఇంటికి రావడం, నిజానికి మేం తిన్నమా లేదా అని ఎవరికి పట్టేది కాదు. అద్భుతమైన బాల్యం. అందరికీ దొరకని అరుదైన బాల్యం నాది. ఇప్పటికీ నాగ్రామం గురించి, నా బాల్యం గురించి పచ్చటి జ్ఞాపకాలే నాలో మెదులుతాయి. ఆ రెంటితోనూ నేటికీ సజీవ సంబంధం నిలుపుకోవడం నేను సాధించిన గొప్ప విజయమే.
ఆడపిల్లల్ని చదివించకూడదన్న మూర్ఖత్వం మా కుటుంబంలో లేదు గానీ ఆర్థికంగా స్తోమత లేదు. అందుకే నా చదువు ప్రతి సంవత్సరం ఆగిపోయేది. టీచర్లు ఉత్తరాలు వ్రాసేవారు. కన్యాకుమారిగారు మా ఊరొచ్చి మా వాళ్ళతో మాట్లాడేవారు. అలా అలా చాలా కష్టంగా బి.ఏ. వరకు లాగాను. మా నాన్నకి తెలియక నన్ను ఓరియంటల్‌ స్కూల్‌లో చేర్చాడు. అంతా సంస్కృత మయం. నేను పదో తరగతి వరకు సంస్కృతం తప్ప వేరే సబ్జక్టులు చదవలేదు. లెక్కలు, సైన్స్‌లాంటివేమీ చదవలేదు. ఓరియంటల్‌ టెంత్‌ అంటే ఎమ్‌.ఏ. స్టాండర్డ్‌ అనేవాళ్ళు. అప్పుడే నేను మహాకావ్యాలన్నీ సంస్కృతంలో చదివాను. మేఘసందేశం, చంపూ రామాయణం, కాదంబరి ఇంకా చాలా చదివాను. అమరకోసం భట్టీ వేసేవాళ్ళం. మేము శ్లోకాలు తప్పు చదివితే మా సంస్కృతం మాష్టారు పరుగులు పెట్టించి కొట్టేవారు. మేం దొరక్కపోతే ఆయన తలగోడకేసి కొట్టుకునేేవారు. చాలా కష్టం మీద నేను, అన్నపూర్ణ అనే ఇంకో అమ్మాయి మాత్రమే టెంత్‌ పాస్‌ అయ్యాము. అది కూడా చాలా కాలం రిజల్ట్సు ఆపిపెట్టి పాస్‌ అయ్యామని ప్రకటించారు. ఇంటర్‌లో ప్రత్యేక తెలుగు. తెలుగును ప్రాణప్రదం చేసింది తెలుగు లెక్చరర్‌ హనుమాయమ్మగారు. ఎంత అద్భుతంగా చెప్పేవారో. డిగ్రీలో ప్రత్యేక ఇంగ్లీష్‌. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు ఇలా చదవడం వల్ల సాహిత్యం పట్ల వల్లమాలిన ప్రేమ. చరిత్రని ప్రేమకావ్యంలా బోధించిన వసంత, లలితగార్ల వల్ల చరిత్ర అంటే మహా ప్రేమ.
నా బాల్యం లాగానే నా చదువు కూడా భిన్నంగా వైవిధ్యంగా సాగింది. చదువు చెప్పడమే కాదు సాహిత్యంవైపు చూపు సారించేలా చేసింది మా లెక్చరర్‌లే. ఆంగ్ల నవలలు చదవమని ప్రోత్సహించింది మా హిస్టరీ లెక్చరర్‌ వసంతగారు. ఆరోతరగతి నుండి బి.ఏ. వరకు చదువులో నా అనుభవాలు రాయాలంటే అదో గ్రంథమే అవుతుంది. అందమైన అపూర్వమైన అనుభవాలు నాలో ఇప్పటికీ సజీవంగా మిగిలే వున్నాయి. నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ”ఆచంట” అనే గ్రామంలో పెద్ద ఎత్తున జరిగే శివరాత్రి ఉత్సవాలలో భగవద్గీత పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి సంపాదించాను. కన్యాకుమారి గారు నన్ను తనతో తీసుకెళ్ళేవారు. అప్పట్లో నేను భగవద్గీత శ్లోకాలు అనర్ఘళంగా చదివి అర్థాలు చెప్పేదాన్ని. వేలాదిమంది ముందు జరిగిన పోటలో నేను ఆపకుండా శ్లోకాలు చదివితే టైమ్‌ మర్చిపోయి అందరూ విన్నారు. నాకు ప్రథమ బహుమతిగా భాగవతం పుస్తకాలిచ్చారు. చాలామంది స్పాట్‌లో ఏదివుంటే అది నాచేతిలో పెట్టారు. అంత బాగా చదివేదాన్ని. మర్నాడు నా ఫోటో పేపర్లో వేస్తే మా నాన్న చూసాడు. అప్పట్లో నేను నర్సాపురంలో ‘గీతాపారాయణం’ చెయ్యడానికి వచ్చిన ఒకాయనతో వెళ్ళిపోవాలని అనుకునేదాన్ని. ఆయన సన్యాసి. ఆయన శిష్యవర్గంలో కలిసి నేను వెళ్ళిపోవాలనుకుని మా కన్యాకుమారిగారితో చెపితే ఆవిడ వారించారు. తెగ పూజలు చేసేదాన్ని. భక్తిరసం నరనరాన పారేది. అయితే ఇంటర్‌లోకి వచ్చేసరికి ఎన్నో పుస్తకాలు చదివిన ప్రభావం వల్ల నూటికి నూరు శాతం నాస్తికురాలిగా మారిపోయాను. సి.వి. రాసిన ‘సత్యకామ జాబాలి’ రాహుల్‌ సాంతృత్యాయన్‌ రాసిన ‘ఓల్గా నుండి గంగాతీరం’ అప్పటికే చదివిన గుర్తు. ఇవన్నీ నాలో భక్తిని చావగొట్టి, నాస్తికత్వం వేపు నడిపించాయి. నాస్తికత్వం నా జీవన విధానమైంది నేటికీ. నా జీవన సహచరుణ్ణి కూడా నాస్తికత్వం పునాదిగానే ఎంపిక చేసుకునేలా నాలో మార్పు తెచ్చింది.
మళ్ళీ కొంచెం వెనక్కి వెళితో 1979లో నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌లో. ఇరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తరాత 2000లో వదిలేసాను. ఆ మధ్యలో 1996లో డిప్యూటీ తాహసిల్‌దారుగా సెలెక్ట్‌ అయ్యి మా ఊరిలో వుండి ఆ ఉద్యోగం చేసాను. యలమంచిలి ఎమ్‌.ఆర్‌.ఓ.గా 1997 సూపర్‌సైక్లోన్‌ను అతి సమీపంగా చూసాను. హైదరాబాద్‌లో ట్రైనింగు సమయంలో వచ్చిన వరద సహాయ కార్యక్రమాల్లో భాగంగా భయంకరమైన మురికివాడల్లో పనిచేసాను. నగరంలో మురికివాడల భీభత్స చిత్రాన్ని అర్థం చేసుకున్నది అప్పుడే. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ లోని అధికారుల అభిజాత్యధోరణి, అవినీతిని తట్టుకోలేక ఎమ్‌.ఆర్‌.ఓ. ఉద్యోగానికి బై చెప్పి మళ్ళీ సర్వీస్‌కమిషన్‌కి వెళ్ళిపోయాను. ‘భూమిక’లో పూర్తికాలం పనిచెయ్యాలనే ఆలోచనతో మొత్తానికే ప్రభుత్వ ఉద్యోగానికి పర్మినెంట్‌గా గుడ్‌బై చెప్పేసాను. అయితే ఆ ఇరవై ఏళ్ళ అనుభవాలు నాకెన్నో పాఠాలు చెప్పాయి. నేను ఎదగడానికి, మరో మార్గంలోకి మళ్ళడానికి అక్కడే పునాది పడింది. సర్వీస్‌ కమీషన్‌లో పనిచేసే రోజుల్లోనే రత్నమాల, సంధ్య వాళ్ళంతా పరిచయమయ్యారు. ‘డౌరీడెత్‌ కమిటీ’ మీటింగులు రెగ్యులర్‌గా విద్యారణ్య స్కూల్‌లో జరుగుతాయని వీళ్ళ ద్వారానే తెలిసింది.
సంధ్యతో పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. నేను బాగులింగంపల్లి బస్టాండులో నిలబడి ‘ఒక తల్లి కథ’ అనుకుంటా చదువుతున్నాను. సంధ్య నా దగ్గరకొచ్చి ఆ పుస్తకం మేమే వేసాం. అంటూ పరిచయం చేసుకుంది. అప్పటినుండి ఇద్దరం ఎన్నో కార్యక్రమాల్లో భాగమవ్వడంతో పాటు మంచి మిత్రులం కూడా అయ్యాం. రత్నమాల రెగ్యులర్‌గా మా ఆఫీసుకు వస్తుండేది. నేను సర్వీస్‌ కమీషన్‌  ఉద్యోగుల సంఘంలో చాలా క్రియాశీలంగా పనిచేసేదాన్ని. ‘నవ్యసాహితీ సమితి’ పేరుతో ఒక సాహిత్య సంస్థను కూడా స్థాపించాం. ప్రముఖ నాటకరచయిత గండవరం సుబ్బరామిరెడ్డి గారు నా సహోద్యోగులు. ఆయన అధ్యక్షులు. నేను కార్యదర్శిగా చాలా సాహిత్య కార్యక్రమాలు చేసేవాళ్ళం. సినారె, దివాకర్ల వెంకటావధాని, నగ్నముని, ఎన్‌.గోపిలాంటిగారి ఎందరినో ఆఫీసుకు పిలిచి ఉపన్యాసాలిప్పించేవాళ్ళం. ఒకసారి ఒకే నివేదిక, మీద సి.నారె, దివాకర్ల వున్నారు. ‘నవ్య సాహితీ సమితి’ అని ఎందుకుపెట్టారు మీరు పాత సాహిత్యం చదవరా అని దివాకర్ల అంటే సి.నారె. ‘అసలు మీరు అభినవ్య అని పెట్టాలి కదా’ అన్నారు. చాలా వాదోపవాదాలు జరిగాయి ఆ రోజు. ఆఫీసులో మంచి సాహిత్య వాతావరణం వుండేది ఆ మీటింగుల ద్వారా.
క్రమంగా నేను ఉద్యోగినుల సంఘం వైపు మళ్ళాను. వుమెన్స్‌వింగు  కన్వీనర్‌గా ఎన్నికయ్యాను. ఉద్యోగినుల సమస్యలపై అధ్యయనం చేసి ఓ పెద్ద మీటింగు పెట్టాం. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల నుండి రెండువేల మంది ఉద్యోగినులు హాజరయ్యారు. 90 రోజుల నుండి 120 రోజులకు పెంచిన మెటర్నిటీ లీవ్‌ జీవో ఆ సమావేశ ఫలితమే!
రెగ్యులర్‌గా డౌరీ డెత్‌ కమిటీ మీటింగులకి హాజరవ్వ సాగాను. అక్కడే నాకు అన్వేషి గురించి తెలిసింది. సజయ, అంబిక, లలిత ఇంకా ఎంతో మంది పరిచయమయ్యారు. ఒకమ్మాయి ఆ మీటింగుకి వస్తుండేది. ఆమె అక్కని వాళ్ళ బావ కిరోసిన్‌ పోసి చంపేసాడు. చాలా ఏడ్చేది కోపంగా అరిచేది. ఆమె కన్నీళ్ళు ఇంకా నాకు గుర్తే. నాకు కళ్ళల్లో నీళ్ళూరిపోయేవి ఆ పిల్లని చూస్తే. కోపంతో, ఉద్వేగంతో రగిలిపోయేదాన్ని. స్త్రీలపట్ల అమలయ్యే హింసల గురించి వారం వారం వింటూ నాలో ఒక కసిని పెంచుకున్నాను.ఏదో చెయ్యాలి? అనే ఆరాటం కలిగేది. స్త్రీల అంశాలు స్త్రీ సమస్య నా ఆలోచనల్లో ప్రథమస్థానంలోకి వచ్చింది. అన్వేషితో అనుబంధం నన్ను జాతీయస్థాయి స్త్రీల సమా వేశాలకు నడిపించింది. జైపూర్‌, కాలికట్‌, రాంచి అన్ని సమావేశా లకు వెళ్ళాను. నా ఆలోచనల పరిధిని పెంచిన సమావేశాలివి. జాతీయస్థాయిలో పనిచేస్తున్న ఎందరో పరిచయమయ్యారు.
జయప్రభతో పరిచయం  ‘లోహిత’ ఆవిర్భావానికి నాంది అయ్యింది. తెలుగులో మొట్టమొదటి స్త్రీవాద కరపత్రిక లోహిత ఇద్దరి ఆధ్వర్యంలో బయటకొచ్చింది. సంవత్సరం పాటు నడిచింది. ఒకటో రెండో సంచికలు వచ్చాక జయప్రభ అమెరికా వెళ్ళిపోవడంతో ఒక్కదాని నడిపాను. పత్రిక నడపడం అంటే ఏమిటో అర్థమైంది అప్పుడే. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయినా నాకు మంచి అనుభవాన్నిచ్చింది లోహిత.
క్రమం తప్పకుండే అన్వేషి మీటింగులకి వెళ్ళడం మొదలుపెట్టాను. లలిత ఆధ్వర్యంలో అన్వేషి నిత్యచైతన్యంలా వుండేది. వీణ, రమా, సూజి, వసంత, భారతి వీళ్ళందరితో మాట్లాడటం ఎంతో బావుండేది. అక్కడి లైబ్రరీ, మీటింగులు, చర్చలు మనసు వికసించడానికి, స్త్రీవాదం నరనరాల్లో ఇంకడానికి చాలానే దోహదం చేసాయి. ఫెమినిజం అంటే ఏమిటో అర్థం చేసుకున్నది అన్వేషిలోనే. ”ఫెమినిస్ట్‌ స్టడీ సర్కిల్‌”లో మాట్లాడగలిగే స్థాయికి నేను ఎదిగింది ఇక్కడే. ఈ మీటింగులోనే అనుకుంటాను ఓల్గా పరిచయమైంది. అస్మిత పరిచయం, వసంత్‌తో పరిచయం కూడా ఇక్కడే. ‘మూడుతరాలు’ పుస్తకాల చర్చలు ఓల్గా రంగనాయకమ్మల వివాదం మీద వచ్చిన పుస్తకాలు ఇవన్నీ నాలో రకరకాల ముద్రల్ని వేసాయి. అప్పట్లో అన్వేషిలో ఒక పత్రిక తీసుకురావాలనే చర్చ జరుగుతుండేది. అన్వేషి టీమ్‌తో కలిసి సారా ఉద్యమ అధ్యయనం కోసం నెల్లూరు వెళ్ళడం జరిగింది. గ్రామ గ్రామాల్లో తిరిగాం. దూబకుంట రోశమ్మను కలిసిన గుర్తు.
చర్చోపచర్చల తర్వాత 1993 జనవరిలో ‘భూమిక’ మొదటి సంచిక బయటకు వచ్చింది. ఒక సామూహిక ప్రయత్నంగా నేను ఎడిటర్‌గా భూమిక మొదలైంది. మొదటి సంవత్సరాల్లో ఎక్కువ పని సజయ చేసేది. మేము సహకరించేవాళ్ళం. డి.టి.పి. డిజైన్‌, ప్రింటింగు, పోస్టింగు అన్నీ కలిసి చేసేవాళ్ళం. అన్వేషిలోనే మాకు చిన్న రూమ్‌ ఇచ్చారు. అక్కడి నుండే భూమిక వచ్చేది. నిజానికి అన్వేషి అండ లేకుంటే భూమిక మనగలిగేది కాదు. చాలా కాలం అన్వేషి ఆఫీసులోనే కొనసాగింది. భూమిక నిలబడడానికి ‘నిర్ణయ’ ద్వారా ఇందిరజెన అందించిన సహకారం ఎంతో వుంది.
1996లో బాగులింగంపల్లికి భూమిక ఆఫీసు మారిపోయింది. ఒక సామూహిక ప్రయత్నంగా మొదలైనా క్రమంగా, వివిధ కారణాల వల్ల వ్యవస్థాపక సభ్యులంతా వెళ్ళిపోయినా భూమిక పట్ల నాకున్న ప్రేమ, నిబద్ధతతో నేను మాత్రం వదలలేక పోయాను. బహుశా నేను కూడా వదిలేసి వుంటే ఖచ్చితంగా భూమిక మూతపడివుండేది. ఎన్నో ఘర్షణలు, సంఘర్షణలు తట్టుకుని ఒక సామాజిక బాధ్యతగా భూమికను కొనసాగించాను. ఇప్పటికీ అదే ఉద్దేశ్యంతో నడిపిస్తున్నాను.
నా ఈ అనుభవాలను మీతో పంచుకోవడానికి నేను చాలా సందేహించాను. ఓ ఉదయాన్నే ఛాయాదేవిగారికి ఫోన్‌చేసి భూమికతో నేను ఎదిగిన క్రమాన్ని భూమిక పాఠకులతో పంచుకోవాలనిపిస్తుంది. ఇది కరక్టేనా అని అడిగినప్పుడు తప్పకుండా రాయండి అని ప్రోత్సహించారు. ప్రతిమ కూడా అదేమాటన్నది. ఇంక ధైర్యంగా రాయడం మొదలుపెట్టాను. ఇరవై ఏళ్ళ అనుభవాలు. నా జీవితంలో సుదీర్ఘకాలం భూమికతోనే గడిచింది. భూమిక నా పేరులో భాగమైపోయింది.
ఒక చిన్న పల్లెటూరులో పుట్టి, పొట్ట చేత పట్టుకుని నగరానికొచ్చిన నేను నా జీవితాన్ని అంచెలంచెలుగా నేనే నిర్మించుకున్నాను. జీవితంలోని ఏ దశలోను ఎక్కడా రాజీ పడింది లేదు. కులాలకతీతంగా, సంప్రదాయ విరుద్ధంగా కట్నప్రశక్తి లేని నాస్తికత్వం జీవన విధానంగా వుండే వ్యక్తినే నా సహచరుడుగా చేసుకోవాలనుకున్నాను. అది నా జీవితకాశయం. అలాంటి వాడు దొరక్కపోతే పెళ్ళే వద్దనుకున్నాను. గమ్మత్తుగా అంతర్జాతీయ నాస్తికసభల్లో నేను కోరుకున్న మనిషి దొరికాడు. అది కూడా చాలా చిత్రంగా నాస్తిక సభల సందర్భంగా విజయవాడ నాస్తిక కేంద్రం  (గోరాగారిది) మహిమలకు వ్యతిరేకంగా నిప్పులమీద నడిచేకార్యక్రమం పెట్టారు. నేను కణ కణ మండే నిప్పుల గుండం మీద నడిచి తూలిపోబోతున్నపుడు ఓ చేయి నన్ను పడకుండా ఆపింది.  నాసికత్త్వం పునాదిగా ఆ చేతిలో చెయ్యేసి అతడినే నా జీవన సహచరుడుగా చేసుకున్నాను. ఆశయాలకోసం, ఆదర్శాల కోసం రాజీ పడని కాలమది. గుండెల్నిండా ఆశయాల అగ్ని రగులు తుండేది. నాస్తికత్వం నేటికీ నా జీవన విధానమే. నా బతుకును నానుండి దూరం కాకుండా చేసుకోవడానికి, నా జీవితం నా చేతుల్లోంచి జారిపోకుండా వుండడానికి నేను చాలా సంఘర్షణే చేసాను. చేస్తూనే వున్నాను.
ఎనభైలలో తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తిన స్త్రీవాదకెరటం నన్నూ బలంగానే తాకింది. నా కథల్లోకి దూకింది. మెల్లగా వ్యాసాల్లోకి, కాలమ్స్‌లోకి మళ్ళింది. కథలు రాయలేకపోతున్నాననే అసంతృప్తి కలుగుతున్నా నేను మొదటి రోజుల్లో రాసినంత వాడిగానే ఈనాటికీ వ్యాసం, ఎడిటోరియల్‌  రాయడం వెనుక వున్నది ఏ మాత్రమూ తగ్గని స్త్రీల మీద హింస మాత్రమే. స్త్రీల మీద నిరంతరాయంగా, నిస్సిగ్గుగా అమలవుతున్న కౄరమైన మానసిక, శారీరకహింస నాలో పెను కోపాన్ని పుట్టిస్తుంది. నా ఆవేశాన్ని, ఆవేదనని వ్యక్తీకరించుకోవాలంటే వాడిగానే రాయాలి. భూమిక ఎడిటర్‌గా నాకున్న అనుభవాలకు భిన్నమైనవి హెల్ప్‌లైన్‌ అనుభవాలు. ఉదయం లేచిన దగ్గరనుండి, రాత్రి నిద్రపోయే వరకు హెల్ప్‌లైన్‌లో బాధిత స్త్రీల కన్నీళ్ళు కౌన్సిలర్‌ల చెవుల్లోకి ఇంకు తుంటాయి. వాళ్ళు మాటల్లోంచి నేరుగా నా గుండెల్లోకి జారు తుంటాయి. నిత్య హింసల కొలుముల్లో ఇంత మంది స్త్రీలు మగ్గు తుంటే అవన్నీ వింటుంటే గుండె భగ భగ మండుతుంది.
ఆ రోజు ‘డౌరీ డెత్‌ కమిటీ’ మీటింగులో ఆ పిల్ల కార్చిన కన్నీళ్ళు నన్నెంతగా కలవరపెట్టాయో ఈనాటికీ ఆ కలవరం, క్రోధం నన్నంటి పెట్టుకునే వున్నాయి. అవే నన్ను నడిపిస్తున్నాయి. పత్రిక నడిపినా, బాధితుల పక్షాన హెల్ప్‌లైన్‌ నిర్వహించినా నా ఆశయం ఒక్కటే. స్త్రీల కోసం పనిచెయ్యడమే. హింస లేని సమాజం కోసం కృషిి చెయ్యడమే ఆ ఆశయం.
ఈ రోజున ప్రపంచం వందేళ్ళ మహిళాదినం జరుపు కుంటున్న నేపధ్యంలోంచి చూసినపుడు, నేను నడిచివచ్చిన మార్గాన్ని వీక్షించుకున్నపుడు నాకు చాలా సంతృప్తిగానే అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేను ఎంచుకున్న మార్గంలోనే నేను  నడస్తున్నాననే అనిపిస్తుంది. అయితే ఈనాటి మహిళ ఎదుర్కొంటున్న హింస మాత్రం తీవ్రంగా నన్ను ఉద్విగ్నపరుస్తుంది. ఇంకా ఎంతో చెయ్యాలనే కర్తవ్యాన్ని బోధిస్తుంది. మరోసారి ఉవ్వెత్తున స్త్రీ ఉద్యమం ఎగిసిపడాల్సిన ఆవశ్యకత గురించి కలలు కనమంటుంది. ప్రపంచీకరణ మాయాజాలంలో మునిగి తేలుతున్న మనం జూలు విదిలించాల్సిన అవసరం ఎంత ఉందో, స్త్రీల మీద అమలవుతున్న నేరాల చిట్టా తేల్చి చెబుతుంది.
అభివృద్ధి ముసుగులో ఛిద్రమైపోతున్న స్త్రీల జీవితాలు ట్రాఫికింగులో తెల్లవారుతున్నాయి. గృహహింసచట్టం వచ్చినా ప్రతిరోజూ వేలాది స్త్రీల బతుకుల్ని మసిబారుస్తూనే వున్నాయి. ఇంత జరుగుతున్న పౌరసమాజం స్త్రీల పక్షాన మాట్లాడక పోవడం వెనుక కారనమేంటో అన్వేసించాల్సిన అవసరం ఈ రోజు చాలా వుంది. చట్టాల కోసం డిమాండ్‌ చేసినంతగా అమలు కోసం ఉద్యమించని స్త్రీల ఉద్యమ వైఫల్యమెంతో అంచనా వేయాల్సి వుంది. కొత్త కొత్త చట్టాలు వచ్చేసాయని సంబరపడిపోతే సరిపోతుందా?ఈ తరానికి స్త్రీవాద భావాలను, మానవీయ కోణాలను అందివ్వలేకపోవడం మన వైఫల్యం కాదా? ప్రపంచీకరణ మిగిల్చిన విధ్వంసంలో అన్ని విలువలు కొట్టుకుపోతున్నా, మునుపెన్నడూ లేని తీవ్ర స్థాయిలో ఇంటా బయటా హింస పెచ్చరిల్లి పోతున్నా మనమెందుకు సామూహిక చర్యలకి దిగలేకపోతున్నాం. నేను లోంచి మనలోకి నడిచిన ఆనాటి తరం, మనలోంచి నేను లోకి జారిపోతున్న ఈనాటి తరం. ఈ మార్పు భీతిగొల్పుతుంది. భయపెడుతుంది. మనల్ని ఏకాకులుగా మార్చేస్తుంది. చుట్టూ ఏం జరుగుతోందో చూడనివ్వని బండ తనంలోకి నెట్టేస్తుంది. ఈ రోజు మీడియా ప్రదర్శిస్తున్న విశృంఖల, వినాశకర ధోరణివల్ల స్త్రీలు మరింత హింసకు గురౌవుతున్నారు. చిన్న పిల్లల్ని సైతం వదలకుండా వేటాడుతున్న వైనం దిగ్భ్రమకు గురిచేస్తోంది.
మార్చి ఎనిమిదికి వందేళ్ళు నిండిన సందర్భంగా మనమెక్కడున్నాం అని సమీక్షించుకుంటున్నపుడు, స్త్రీల ఉద్యమంలో భాగమైన జీవితాన్ని జ్ఞాపకాల్ని, నెమరు వేసుకుంటుంటే ఓ గొప్ప ఉద్వేగంతో పాటు విషాదమూ కలుగుతోంది. చెయ్యాల్సింది ఇంకా కొండంత మిగిలిపోయిందని గోరంతకే పొంగిపోతే అర్ధం లేదని కూడా అర్ధమౌతోంది. ఎవరి కన్నీళ్ళైతే నన్ను కలవరపెట్టి కర్తవ్యబోధ చేసాయో, ఆ కన్నీళ్ళని కొంతైనా తుడవగలిగేలా నన్ను నేను మలుచుకోగలిగాననే గర్వం నా గుండెల్నిండా వుంది. నేను ఎంచుకున్న దారిలోనే గత ఇరవై సంవత్సరాలుగా నడవగలిగిన గుండె నిబ్బరాన్ని నేను అలవరచుకోగలిగాను. ఇది నాకెంతో సంతృప్తిని మిగిల్చింది.
ఓ చిన్న గ్రామంలో మొదలైన నా ప్రయాణం, స్త్రీల ఉద్యమంతో మమేకమై, స్త్రీల అంశమే ఊపిరై కడదాకా సాగాలన్నదే నా కోరిక. ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వున్న వాళ్ళమంతా ఖచ్చితంగా మనమెక్కడున్నాం, ఎవరి పక్షాన వున్నాం అని ప్రశ్నించుకోవాల్సిన సందర్భమిది. ఆ ప్రశ్నని నన్ను నేనే వేసుకుని సమాధానాన్ని అన్వేషిస్తూ సాగిందే ఈ వ్యాసం. నేను పబ్లిక్‌లోనే వున్నాను. ఈ రాతలో తప్పొప్పొలు, అభిజాత్యాలు వుంటే నన్ను నిర్ద్వంద్వంగా నిలదీయండి.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.