బండివాడి వద్ద కాయగూరలు కొని ఇంట్లోకి వెళ్తున్న సుజనకు, పక్కింటి ఇద్దరు పిన్నిగార్లు తనను గురించి మాట్లాడుకోవటం విని, ఆగిపోయింది. తమ ఇంటి మెట్ల వద్ద.
వదినా! ఈ మనుష్యులకు సిగ్గు, ఎగ్గు ఏమి లేవా? ఇంత జరిగినా ఏమి జరగనట్టు ఎలా తల ఎత్తుకొని జీవిస్తున్నారో చూడు.
భరితెగించారు వదినా! కలికాలం అంటే ఇదే మరి. మనకాలంలో ఇలాంటివి మనం ఎరుగుదుమా? చక్కగ ఇంట్లో కూచొని పనీపాటలు చేసుకొనేవారం. ఉద్యోగం అంటూ బయట చెడు తిరుగుళ్ళు తిరగటం అనేది లేదు మనకు.
సరేలే, అదేదో ఫేసుబుక్ అంట. అందులో ముక్కు మొహం తెలియని వారితో స్నేహం చేయడమే గాక, ప్రేమ అంట ప్రేమ,
అంతేనా… వాడు రమ్మన్న చోటుకు వెళ్ళటం, వాడేమో కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇవ్వడం… ఈవిడ త్రాగడం…
మరే…. వాడేమో దీనిని అనుభవించడం. మరీ చోద్యం.. దీనికి కడుపు రావటం… ఆసుపత్రుల చుట్టూ వీరు తిరగడం.
ఇదేకదా ఈ సుజనకు జరిగింది. చెప్పుకొంటే సిగ్గుచేటు.. ఆ తల్లికైనా బుద్ధి వుండ వద్దా? అన్నంలో విషం కలిపి చంపేసి ఉంటే సరిపోయేది. ఇలా తలవంపులు ఉండేవి కావు. మనం ఇన్ని మాటలంటుంటే మనవైపు, సంకోచం లేకుండా ఎలా చూస్తువుందో చూడు. కాలేజీకి కూడ వెళ్తోంది. ఎలా బ్రతుకుతారు వదినా! ఇలా సిగ్గు వదలి? అదే నా కూతురైతే ఎప్పుడో చంపేదానిని.
సరేలే, రోజూ నీతిలేని వీరిని చూడడం మనం చేసుకొన్న పాపం. ఇంతలో పోలిసు జీపు వచ్చి ఆగింది వారి ముందు. ఆడ ఇన్స్పెక్టర్ దిగి కానిస్టేబుల్స్ వీరిని అరెస్టు చేయండి అని పురమాయించింది. మమ్ములనెందుకు అరెస్టు చేస్తున్నారు? మేమేమి తప్పుచేశాము? ఆ అమ్మాయి గురించి మీరు మాట్లాడినదంతా ఆ అమ్మాయి వీడియో తీసింది. మమ్ములను రమ్మని ఫోను చేసింది.
ఏదో నాలుగు మాట్లాడితే అరెస్ట్ చేస్తారా?!
ఔను.. కొత్తగ వచ్చిన రూలు మీకు తెలియదా? ఎదుటి మనిషి బలహీనతపై ఇలా అవాకులు చవాకులు పేలితే, మిమ్ములను అరెస్టు చేసి, మూడు నెలలు జైలులో పెడ్తారు. నోరు ఉందికదా అని ఇతర్లు బాధపడేలా మాట్లాడటము పెద్ద నేరం. పదండి. జైలులో 3 నెలలు చిప్పకూడు తింటే, ఆ నోరు మూత పడ్తుంది.
పదండి… పదండి… మనకు ఈ రూలు తెలిదేమిటి వదినా?!… కొత్తగ వచ్చిందని చెబుతున్నారుగా..
కథ చదివి, నిట్టూర్చి, ప్రక్కనపెట్టి, మనకు ఇలాంటి శిక్షలుంటే ఎంత బాగు, అనుకొంది ముపై ఏళ్ళ సుమన. ఇప్పుడు ఒక నాలుగేళ్ళ అబ్బాయికి తల్లి. భర్త ఆఫీసుకు, కొడుకు ప్రీ స్కూలుకు వెళ్ళారు. పదేళ్ళ క్రితం జరిగిన సంఘటన తలచుకొంటే, ఇప్పటికీ
ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది. ఎంత ఘోరం జరిగింది అనుకోకుండా.
ఆనాడు కాలేజీలో ఫంక్షన్ అయ్యాక రాత్రి 9 గంటలకు బస్సు దిగి తమ కాలనీ వైపు నడుస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు. కాలనీ అంటే, ఓ 10 ఇళ్ళు ఉన్నాయి. ఇంకా చాలా ఇళ్ళు కట్టుకొంటున్నారు. అప్పుడు ఓ 60 ఇళ్ళు ఉంటాయి. వీధిలో దీపాలు వెలగటంలేదు, అంటే తిరిగీ ఏదో రిపేరన్న మాట. మరురోజు కంప్లెయింట్ చేస్తే రిపేరు చేస్తారు. అందరూ చిన్నవయసు వారే ఉన్నారు. ఏదో ఒకటి రెండు ఇళ్ళల్లో పెద్దవారు ఉన్నారు తమ కొడుకులతో. అలా ఉన్న వారిలో సుమన, సుప్రియలు. ఇద్దరూ ఒకే కాలేజి, ఒకే గ్రూపు ఇద్దరూ మంచి స్నేహితులు. మామూలుగ ఆ సమయంలో అందరూ తమ పిల్లలతో ఇంట్లో ఉంటారు. చిన్న పిల్లలు కాబట్టి రాత్రిళ్ళు బయట ఆడుకోరు. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. సడన్‌గా వారి ముక్కులపైన, కర్చీఫ్ అదిమి పెట్టారు ఎవరో. అంతే వారిద్దరూ స్పృహ తప్పారు. అరగంట కారులో బయలుదేరి ఒక పాడుబడ్డ బిల్డింగ్ వద్ద కారు ఆపారు. ఆ అమ్మాయిలు ఇద్దరికీ స్పృహ వచ్చింది.
మీరెవరు? మమ్ములని ఎందుకు కిడ్నాప్ చేశారు? కాస్త ధైర్యస్తురాలైన సుమన అడిగింది. ఆగండాగండి, ఓరే వీరూ! కాస్త వీరిని కనిపెట్టు పారిపోకుండా. వారిని ఆ పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్ళారు. అయితే రవీ, గిరీ మీరు కారులో నుండి సరంజమా తేండి.
తాళ్ళు తేవటం మరవకండి. వీరిని నేను చూసుకొంటాను. ఆ ఇద్దరూ వెళ్ళాక, వాడి మణికట్టు కొరికి, సుప్రియా పరిగెత్తు అని అరుస్తూ, సుమన వేగంగా పరుగెత్త సాగింది. సుప్రియ తన దుపట్టా కాళ్ళకు అడ్డం పడటంతో, అక్కడే పడిపోయింది. ఈ విషయం తెలియని సుమన ఆ చిన్న వెలుతురులోనే పరుగుపెట్టింది. ఈ హడావిడిలో తన ఫోను క్రింద పడింది కూడ చూసుకోలేదు.
వీరేశ్ అరవసాగాడు. రవీ.. గిరీ..ఓ అమ్మాయి తప్పించుకొంది అని వారు తమ సామాన్లు అక్కడ వదలి భవనం వైపు వచ్చారు. ఒకరు సుప్రియ దగ్గర కాపలాగ ఉంటే, మిగిలిన ఇద్దరు సుమనను వెతకసాగారు. ఆ తొందరలో సుమన కారుకు గుద్దుకొంది. అది బియండబ్ల్యు కారని తెలిసింది. అంటే ఏదో గొప్ప ఇంటి అబ్బాయిలు. బాగా డబ్బు ఉండి, చెడు అలవాట్ల అబ్బాయి. చెప్పులు అడ్డమని, వాటిని అక్కడనే వదిలి, పరుగు స్పీడ్ పెంచింది. అలా పది, పదిహేను నిమిషాలు ఎటుపోతుందో తెలియకుండా పరుగెత్తి, ఓ పొదలో దాక్కుంది. దూరం నుండి వారు మాట్లాడుకోవటం వినిపించింది. పద గిరి వెళ్దాం. ఎక్కడికి పోయిందో, ఒక దానితోనే సరిపెట్టుకొందాం. ఒకటే చెమటలు, దాహం సుమనకు. ఆయాసపడుతోంది. భగవాన్! సుప్రియను కాపాడు. వెయ్యి దేవుళ్ళకు మొక్కుకొంది. 2-3 గంటలు తర్వాత, కారు బయలుదేరిన శబ్దం విని, నెమ్మదిగా బయటకి వచ్చింది. తనెక్కడ ఉందో తెలవదు. ఎలా వచ్చిందో ఆ రాత్రి, ఆచిన్న వెలుతురులో దేవుడిని తలుచుకొని అలా అలా నడుచుకొంటూ వెళ్ళింది. చెప్పులు లేని కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని, రాళ్ళు తగిలి రక్తం కారుతోంది. ఆమె కంగారంతా సుప్రియ గురించి. తను తప్పించుకోలేదని అర్థం అయింది. భగవంతుడా ఏమిటీ పరీక్ష?! తన చెప్పులు కనబడ్డాయి. అంటే పాడుబడ్డ భవనం దగ్గరిలో ఉందన్నమాట. అక్కడ ఓ వాటర్ బాటిల్ కనిపించింది. దేవుడా అనుకొంటూ నీరు త్రాగితే, కాస్త శక్తి వచ్చించి. నెమ్మదిగా వెళ్తుంటే దారి కనిపించింది. ఫోన్ కూడ కనిపించింది. ఓ పది అడుగు లేస్తే భవనంలోకి వచ్చింది. బీభత్సంగా ఉన్న లోపలి దృశ్యం చూసి, నిశ్చేష్ఠురాలయింది సుమన. సుప్రియ స్పృహలో లేదు. మొదట ఫోను తీసుకొని, ఆంబులెన్సుకు, పోలీసులకు ఫోను చేసి, లొకేషన్ పెట్టింది. అక్కడున్న బాటిల్లోని నీటిని, సుప్రియ ముఖంపైన చిలకరించింది. నెమ్మదిగా కళ్ళు తెరచిన సుప్రియ, సుమనను చూసి, కౌగలించుకొని, ఒకటే ఏడుపు. ఆమె తల నిమురుతూ, వీపు రాస్తు 5 నిమిషాలు ఏడ్వనిచ్చింది.
నెమ్మదిగా సుప్రియను కూర్చోబెట్టి, నీళ్ళు త్రాగించింది. నా పరిస్థితి ఏమిటి సుమనా.. నా మొహాన్ని ఎలా చూపను. నేను బ్రతికి ప్రయోజనం లేదు. చచ్చిపోతాను, అంటూ అక్కడ ఉన్న బాటిల్‌ను పగలగొట్టి, ఆ గాజు ముక్కతో కంఠానికి గుచ్చి, చనిపోబోయింది. సుమన దానిని లాక్కొని, నీకు మేమందరం లేమా, మేము నీకేమి కామా? కష్ట సమయంలో మేము నీకు తోడుగా ఉంటాం. సుప్రియా ధైర్యంగా ఉండు. అంతలో పోలీసు జీపు, అంబులెన్స్ కూడ వచ్చాయి. సుప్రియను ముందుగా హస్పటిల్‌కు తీసికెళ్ళారు. డాక్టరు తనను పరీక్షిస్తుంటే సుమన ఇద్దరు తల్లిదండ్రులకు ఫోను చేసింది.
సుప్రియ పరిస్థితి తెలుసుకొని, ఆమె తల్లి సుమనను నిందించసాగింది. నీవు ఎలాంటి స్నేహితురాలవు. నీవు మాత్రం తప్పించుకొన్నావు. నీ స్నేహమే లేకపోతే, తను నీతో కాలేజీకి వచ్చేదేకాదు. నిన్ను నమ్మితే నీవు నా కూతురికి ఇంత ద్రోహం చేస్తావా? సుమన తల్లి ఏదో జవాబు చెప్పబోతే వద్దని వారించింది. అమ్మా! ఆంటీ బాధలో నాలుగు మాటలు నన్ను అంటే నాకు బాధగా లేదమ్మా. నేను కూడా గిల్టీగా ఫీలవుతున్నాను. సుమన తప్పించుకొందనే నేను అనుకున్నాను. తన చున్ని కాళ్ళకు అడ్డం పడిందని తను చెప్పేదాకా నాకు తెలీదు.
డాక్టరు వచ్చి, తనకు ఇంజక్షన్ ఇచ్చాను. రేపు ప్రొద్దుటి వరకు నిద్రపోతుంది. మీరు వెళ్ళి, రేపు రండి అన్నారు. కాని, సుప్రియ తల్లి మాత్రం అక్కడనే ఉండిపోయింది ఆ రాత్రి. అందరం ఇంటికెళ్ళిపోయాం విచారంగా. నాలుగవ రోజు డిస్చార్జ్ చేశారు. కాని సుప్రియను ఇంటికి తీసుకుని రాక, కలకత్తాలో ఉన్న తన మేనత్త ఇంటికి తీసికెళ్ళింది వాళ్ళ అమ్మ. అక్కడ వారు ఏమీ జరగనట్టు ప్రవర్తించారు. వాళ్ళకు ఒక అబ్బాయి. అక్కడ ఒక ప్రైవేట్ కంపినీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తనను అతనికిచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించారు. కాని వారు ఏదీ పట్టించుకోలేదు.
సుప్రియ నాలుగేళ్ళు అక్కడనే కాలేజిలో చదువు ముగించాక, ఇద్దరి తల్లిదండ్రుల సమక్షంలో కలకత్తాలోనే రిజిస్టర్ పెళ్ళి జరిగింది. సుమనకు కూడ చెప్పలేదు. తరువాత సుప్రియ చెబితే, చాలా సంతోషించింది సుమన. కంపెనీ వారు సుప్రియ భర్తను అమెరికా పంపితే, తను కూడ వెళ్ళి అక్కడ ఓ ఉద్యోగంలో చేరింది. ఇది 5 ఏళ్ళు క్రితం జరిగింది. ఇప్పుడు తనకు ఒక కూతురు. ఆ అమ్మాయికి 3 ఏళ్ళు వయసు. అన్ని విషయాలు సుమనకు చెబుతూనే ఉంటుంది సుప్రియ. వారి స్నేహం అలాంటిది. అంతా సుఖమయం. కాని, సుమన ఆలోచిస్తున్నది, బాధితులైన అందరి జీవితాలు ఇలా ఉండవు కదా! అసలు ఇరుగుపొరుగు స్త్రీలే ముఖ్యంగా కించపరిచే మాటలతో బాధిస్తుంటారు. అసలు ఇలాంటి బాధలు భరించలేక సుప్రియ కుటుంబం ఆ ఇల్లు అమ్మేసి, వేరే ఊరుకి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయారు.
మరి ఈ బాధితులకు ఆత్మహత్యే శరణ్యమా? మొండిగా ఎవరైనా బ్రతికితే, వారు చనిపోయేలాగా గుచ్చి గుచ్చి జరిగిపోయిన విషయాలనే పదే పదే గుర్తు చేసి అవమానిస్తారు. ఈ సమాజం మారదా? దీనికి పరిష్కార మేమిటి? మన ప్రజలలో ఎలానూ మార్పురాదు. ఆ పుస్తకంలోని కథలో లాగ భయం అయినా ఉండాలి. మరి దీనికి ప్రభుత్వం ఏమి చేస్తుంది? ఏమి చేయాలి?
అసెంబ్లి, పార్లమెంట్లలో దీని గురించి చర్చించాలి. రిజర్వేషన్ వాళ్ళను ఏమైనా అంటే, ఎలా అరెస్టు చేస్తారో అలాగ అవాకులు చవాకులు పేలే వారిని కూడ అరెస్టు చేయాలని బిల్లు పాస్ చేయాలి. రేప్స్కు సంబంధించి విచారించేందుకు విడిగా కోర్టు ఉండి, ఈ నేరస్తులను కఠినంగా శిక్షించాలి. కేసులను తొందరగా ముగించాలంటే, ఇలా స్పెషల్ కోర్టులు ఉండాలి. పనికిరాని వాటికి బందులు, ధార్నాలు, స్ట్రయికులు చేస్తారు. మరి ఇలాంటి వాటికి చేయండి. మీకు అక్క, చెల్లెళ్ళు, ఆడపిల్లలు ఉండే ఉంటారు. వారికి, అందరికి భద్రత కలిగిస్తుందీ బిల్లు.
