(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్ మందార
ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే పథకాల్లో కొన్నింటిని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) నిర్వహిస్తుండేది. వాటి గురించి వివరాలు తెలుసుకునేందుకు 1986లో నేను ఆ కేవీఐసీ కార్యాలయానికి వెళ్లాను. ఖాదీ నూలు వడికే యÖనిట్ ఒకటి పెట్టుకునేందుకు మంచి అవకాశం వుందని వాళ్లు చెప్పారు. దూది తామే సరఫరా చేస్తామనీ నూలుకు మాత్రం మార్కెట్లో బాగా కొరత వుందని అన్నారు. అది వింటూనే మాకో ఆలోచన వచ్చింది.
మేం గనక జనం చేత నూలు వడికించగలిగితే దానికి మార్కెట్ సిద్ధంగా వుంది. వారికి కావాల్సిన ఉపాధీ లభిస్తుందనుకున్నాం. వెంటనే ఎస్సీ కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరిపాం. అప్పుడు అక్కడ పి. రత్నం అని ఓ ఉత్సాహవంతుడైన అధికారి వున్నాడు. మాకు బ్యాంకు అధికారులు, కేవీఐసీ సిబ్బంది అడ్డంకులు పెట్టినా కూడా ఆయన వాటన్నింటినీ పరిష్కరించి, అన్ని విధాలా సహాయం అందించాడు. (ఆయన అంబేడ్కర్ వాది అని ఆ తర్వాత తెలిసింది నాకు. హైదరాబాద్‌లో జరిగే అంబేడ్కరైట్ మీటింగ్‌లలో ఆయనను కలిశాను.) మొత్తానికి ఎండ్లగూడెంలో మేం ఒక ఖాదీ స్పిన్నింగ్ యÖనిట్ని నెలకొల్పాం. అది నాలుగేళ్లపాటు నిరాటంకంగా నడిచింది. దాదాపు 55 మంది మహిళలకి సంవత్సరం పొడవూనా ఉపాధిని కల్పించింది. ఆ రోజుల్లో నూలు వడకటం ద్వారా ఒక్కో మహిళా రోజుకు 15 నుంచి 30 రూపాయల వరకూ సంపాదించుకునేది. కేవీఐసీ తరపున భాగ్యనగర్ ఖాదీ సమితి మాకు దూది సరఫరా చేస్తుండేది. మా మహిళలు నూలు వడికి, దాన్ని తిరిగి వాళ్లకు అందించేవారు.
నూలు యÖనిట్ నిర్వహణ బాధ్యత మొత్తాన్నీ అచ్చయ్యే తన భుజం మీద వేసుకుని, దాన్ని నాలుగు సంవత్సరాల పాటు అద్భుతంగా నడిపించాడు. అతని వయసు అప్పటికి దాదాపు యాభై
ఏళ్లు. పళ్లన్నీ దాదాపుగా ఊడిపోయాయి. అందువల్ల తను మాట్లాడుతుంటే ఒకోసారి సరిగా అర్థమయ్యేది కాదు. కానీ అతని ఆలోచనలు చాలా స్పష్టంగా, అతను చేసే ప్రతిపాదనలు నిక్కచ్చిగా వుండేవి. యÖనిట్ సభ్యుల దగ్గర నూలు అయిపోయినా.. చరఖాలకు మరమ్మత్తులు అవసరమైనా.. మహిళలకు చెల్లించాల్సిన డబ్బులు ఆలస్యమైనా అచ్చయ్య అస్సలు ఆగేవాడు కాదు. భాగ్యనగర్ ఖాదీ సమితి వెంటపడేవాడు. కేవీఐసీ చుట్టూ తిరిగే వాడు. కొన్నిసార్లు మమ్మల్నీ వదిలేవాడు కాదు. మొత్తానికి ఎలాగోలా ఆ పనులు సత్వరమే పూర్తయ్యేలా చూసుకునేవాడు. అలాగే మహిళలంతా ఒక చోట కూచుని పనిచేసుకునేందుకు వీలుగా ఎస్సీ కార్పొరేషన్‌తో ఒక పెద్ద షెడ్డు కట్టించాడు. ఆ షెడ్డు ఇప్పటికీ వుంది. కాకపోతే పని చేసేవాళ్లు లేక ఖాళీగా బోసిపోయి వుంది. ఆ నూలు యÖనిట్ 1993లో మÖతపడింది. 1987 ప్రారంభం నుంచీ నా సమయమంతా ఎక్కువగా భూపోరాటాలకే సరిపోయేది. నేను ఎప్పుడు ఎక్కడ వుంటానన్నది నాకే తెలిసేది కాదు. అలాగని అచ్చయ్యనీ, ఆ స్పిన్నింగ్ యÖనిట్నీ వదిలేయడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ ఏడాది మే నుంచి నవంబర్ వరకూ మా సంఘం భూపోరాట కార్యక్రమాలు చాలా ఉధృతంగా సాగాయి. మా శక్తియుక్తులన్నింటినీ కూడగట్టుకుని అందరం వాటిలోనే నిమగ్నం కావాల్సి వచ్చింది. నవంబర్ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. కానీ అప్పటికే ఆ యÖనిట్‌లో నిర్మాణాత్మక కార్యక్రమాలు దెబ్బతిన్నాయి. పాపం అచ్చయ్యకీ, అలాంటి పనుల్లో ఉన్న ఎంతో మందికీ అండగా నిలబడేవాళ్లు లేకపోవటంతో కార్యక్రమాలు వెనకబాటపట్టాయి. ఒకవైపు పోరాట కార్యక్రమాలు రకరకాల దశల్లో ఉన్నాయి, మరోవైపు నిర్మాణాత్మక కార్యక్రమాలు.. వీటన్నింటి బాధ్యతా నా మీదే ఉండటంతో నాకు ఊపిరాడని పరిస్థితి తలెత్తింది. ప్రతి వాళ్లకీ, ప్రతీ విషయంలోనూ నేనే జవాబుదారీగా ఉండాల్సి రావటంతో నాలో స్వల్పంగా అసహనం కూడా పెరిగింది.
మొత్తానికి మా సంఘం చురుకుగా ఉన్న చాలా గ్రామాల్లో` సవాళ్లు ఎదురైనా, అవకాశాలు అందివచ్చినా జనం మాత్రం ఎదురొడ్డి నిలబడేవాళ్లు, దేనికైనా సరే మేమున్నామంటూ ముందుకొచ్చేవాళ్లు. అటవీ శాఖ ప్రజల వినియోగం కోసం భూములను కేటాయించబోతోందన్న వార్త తెలుస్తూనే పేతుల గ్రామానికి చెందిన మహిళలంతా సంఘటితమయ్యారు. తమకు తాముగా బచ్చమ్మ అనే మహిళ నాయకత్వంలో ఒక బృందంగా ఏర్పడ్డారు. తొలి అవకాశం తమకు కల్పించాలని అధికార్ల వెంటపడ్డారు. వాస్తవానికి వెట్టి చాకిరీ కూలీలతో బచ్చమ్మకు సంబంధమే లేదు. ఆమె మాల. భర్త రైల్వేలో చిన్న ఉద్యోగం చేసేవాడు. అందువల్ల వాళ్ల కుటుంబ పరిస్థితి కాస్త మెరుగ్గానే వుండేది. సహజంగానే బచ్చమ్మకు నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. దానికి తోడు వాళ్ల గ్రామంలో మా ఉద్యమం సాగుతున్నప్పుడు తను చాలా ఆసక్తి కనబరిచింది. తనంతట తానే మా సంఘంలో క్రియాశీల పాత్ర పోషించేందుకు ముందుకొచ్చింది. భిన్న రూపాల్లో, రకరకాల స్థాయుల్లో ముమ్మర ప్రయత్నాలు చేసిన తర్వాత బచ్చమ్మ బృందం అనుకున్నది సాధించుకుంది. వాళ్ల పోరు ఫలించి అధికారులు వంద ఎకరాల అటవీ భూమిని అనుభవ హక్కులతో ఆ మహిళలందరికీ సమానంగా పంచి ఇచ్చారు. గుంతలు తవ్వి మొక్కలు నాటుకోవటం, నీరుపెట్టటం వంటి పనుల కోసం ఆర్థిక సాయం కూడా అందించారు. వాళ్ల బృందంలోని వాళ్లంతా కష్టపడి పనిచేయడంతో అందరికీ మంచి ఆదాయం లభించింది. అక్కడి అద్భుత ఫలితాలు చూసిన తర్వాత అటవీ అధికారులు రాష్టంలోని ఇతర అటవీ ప్రాంతాల్లో కూడా మహిళల కోసం ఇదే తరహా పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు.
పేదలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండేవారు. ఒక వయసు దాటిన స్తీ పురుషులంతా కూడా అనివార్యంగా మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు. నాట్ల కోసం, కలుపుల కోసం దశాబ్దాల తరబడి పొలాల్లో వంగి పని చేయడం వల్ల చాలామంది ఆడవాళ్ల నడుములు శాశ్వతంగా వంగిపోయివుండేవి. వాళ్లు తినే ఆహారంలో పోషక పదార్థాలు చాలా తక్కువ. అందుకు బీదరికమే కారణం అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. కాకపోతే ఇదే ప్రాంతంలో పండుతున్న, అందుబాటులో ఉన్న ఆహార పదార్ధాలూ, ఉత్పత్తులతో ఆ పోషకాహార లోపాన్ని చాలావరకూ ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. ఆ చుట్టు పక్కల అంతటా బొప్పాయి చెట్లు పుష్కలంగా వుండేవి కానీ జనం బొప్పాయి (పొప్పడి) పండ్లను తినరు. అలాగే అక్కడ ఎటుచూసినా మునగ చెట్లు కనిపిస్తాయి. కానీ అత్యధిక పోషకాలుండే ఆ మునగాకును వాళ్లు అస్సలు వాడరు. గోంగూర కూడా పుష్కలంగా దొరుకుతుంది. దాన్ని ఏదో కారం పచ్చడికి తప్పించి రోజువారీ కూరల్లో ఉపయోగించరు. ఇక నేటి తరం యువతీ యువకులైతే చౌకగా లభించే అత్యంత బలవర్ధకమైన గొడ్డు మాంసాన్ని (బీఫ్‌ని) తినడం చాలావరకు మానేస్తున్నారు. ఆ మాంసం పట్ల అగ్రవర్ణ సంస్కృతి కల్పిస్తున్న చులకన భావన, దానిపై జరిగే దుష్ప్రచారం ప్రభావమే అందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. 1980లలో కూడా ఆ చుట్టుపక్కల ప్రకృతి సహజంగా లభించే సీతాఫలాల వంటి బోలెడన్ని రకాల అడవి పండ్లు పుష్కలంగా దొరికేవి. కానీ అడవులను నిర్మూలించడం, పంట పరిస్థితులను మెరుగుపరిచేందుకు చెట్లను నరికివేయడం వంటివి ఊపందుకున్న తర్వాత పండ్ల లభ్యత క్రమేపీ తగ్గిపోతోంది. దీనికి తోడు 1983 అక్టోబరులో ఎన్.టి.రామారావు ప్రభుత్వం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. అది దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఎంతోమంది పేదల ఆకలి తీర్చి ఆహార భద్రత కల్పించిన మాట నిజమే కానీ, తెలంగాణాలో అత్యధికులు తినే ఆహారంలో.. వారి ఆహారపు అలవాట్లలో అది సమÖలమైన మార్పులు తీసుకొచ్చింది. అంతకు ముందు తెలంగాణాలో పోషకాలు అత్యధికంగా వుండే జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామల వంటి చిరుధాన్యాలను విరివిగా ఉపయోగించేవారు. ఒకవిధంగా ఈ చిరుధాన్యాలు పరిపూర్ణమైన, ఆరోగ్యవంతమైన ముడి ఆహారం. వాటిలో మాంసకృత్తులు, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు సమృద్ధిగా వుంటాయి. బియ్యాన్ని చేసినట్టు వాటిని తెల్లగా పాలిష్ చేయరు. బియ్యంతో పోలిస్తే చిరుధాన్యాల గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) కూడా చాలా తక్కువ. దానర్థం` మన రక్తంలో చక్కెర స్థాయిలు బియ్యం తిన్నప్పుడంత వేగంగా వీటిని తింటే పెరగవు. గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే బియ్యం వంటివి తిన్నప్పుడు అవి చాలా త్వరగా జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచేస్తాయి. ఇప్పుడు జనమంతా చౌకగా దొరుకుతున్న తెల్లబియ్యాన్నే వాడుతుండటం వల్ల ప్రజల పోషకాహార పరిస్థితులు దిగజారాయనే చెప్పవచ్చు. 1990ల నుంచీ మన ప్రాంతంలో మధుమేహం గణనీయంగా పెరిగిపోతుండటం దీనికో నిదర్శనం కావొచ్చు. మన సమాజంలో మొదట్నించీ కూడా బియ్యం తినటాన్ని గొప్పగా భావించటం పరిపాటిగా వస్తోంది. అలాంటి ధాన్యం లభ్యత పెరగటం, అది చౌకగా అందుబాటులోకి రావటంతో అందరికీ అదే ప్రధాన ఆహారంగా మారిపోయింది.
యాచారంలోనూ, ఇబ్రహీంపట్నంలోనూ ప్రభుత్వ ప్రజారోగ్య కేంద్రాలు వున్నాయి. కానీ అక్కడ డాక్టర్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఎవరికీ తెలిసేది కాదు. వచ్చినప్పుడు కూడా చాలా నిరాసక్తంగా, అలసిపోయినట్టు విసుక్కుంటూ` ఏదో ఒక మాత్ర చేతిలో పెట్టి జనాన్ని పంపించేద్దామన్న ధోరణిలోనే ఉండేవాళ్లు. ‘జ్వరం అయితే ఓ ఎర్ర గోలీ, మిగతా జబ్బులైతే తెల్ల గోలీ’ అన్నట్టు చాలా యాంత్రికంగా మందులు ఇచ్చేవారు. ఇక గర్భిణులైతే సాధారణ ప్రసవాలకు తప్పించి ఏ చిన్న సమస్య తలెత్తినా హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి వెళ్లాల్సిందే.
డా. వాసుదేవన్ కిడాంబి నా చిరకాల మిత్రుడు. 1980ల నుంచీ అతను హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఓ వ్యక్తిలా కాకుండా.. ఓ వ్యవస్థలా పని చేసేవాడు. తను నాకు కాలేజీలో చదువుకునే రోజులనుంచే పరిచయం. ఇద్దరం సైన్స్ క్లబ్లో ఒకే గ్రూపులో వుండేవాళ్లం. తను చాలా అరుదైన, సేవా దృక్పథం కలిగిన వైద్యుడు. నేను అతని వద్దకు వెళ్లి మాకు ఇబ్రహీంపట్నంలో నీ సేవలు కావాలని చెప్పగానే సంతోషంగా ఒప్పుకున్నాడు. అలా 1987 నుంచి 1994 వరకూ` ప్రతి శని, ఆదివారాల్లో ఇబ్రహీంపట్నం వచ్చి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించాడు. తన స్నేహితుడు డా. ఆర్ముగంను కూడా వెంటబెట్టుకుని హైదరాబాద్ నుంచి స్కూటర్ మీద వచ్చేవాడు. ప్రతి వారం మా సంఘం కార్యాలయంలోనో.. అందుబాటులో వున్న మరేదైనా గదిలోనో క్లినిక్‌ను నిర్వహిస్తూ రోగులను పరీక్షించి, వారికి ఉచితంగా మందులిచ్చేవారు. డా. ఆర్ముగం ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో శిక్షణ పొందారు. వాళ్లిద్దరూ రోగులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా ఓపికగా, వివరించేవారు. వాసు అనుసరించే కొన్ని చికిత్సా పద్ధతులు చాలా చిత్రంగా వుండేవి. తన మారేడ్‌పల్లి క్లినిక్‌కి స్థూలకాయులెవరైనా వస్తే ఎలాంటి మొహమాటం లేకుండా` ముందు తిండి కాస్త తగ్గించి, బరువు తగ్గించుకోండని ముఖం మీదే చెప్పేవాడు. ఇబ్రహీంపట్నంలో చాలామంది తన దగ్గరకు మలబద్ధకం సమస్యతో వచ్చేవారు. వాళ్లందరికీ రోజూ కాస్త తౌడును తినిపించి, ఆ సమస్యను తేలికగా పరిష్కరించే వాడు. ప్రతి చిన్న సమస్యకీ గోలీలకు, ఇంజెక్షన్లకు అలవాటుపడిపోయిన గ్రామస్తులకు వాసు చేసే వైద్యం చాలా వింతగా, ఆశ్చర్యంగా అనిపించేది. తను అంటువ్యాధులకు; మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు, పిల్లల సమస్యల వంటి వాటన్నింటికీ వైద్యం చేసేవాడు. పులిమామిడికి చెందిన కుసుమ రెడ్డి అనే మహిళకు తనే దగ్గరుండి గుండె ఆపరేషన్ కూడా చేయించాడు. అది జరిగి నలభై ఏళ్లు కావొస్తున్నా ఆమె ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా వుంది. ఆనాడు వాసు చేసిన ఆ సహాయం గురించి నేటికీ చెప్పుకొంటుంది. ఇవేకాదు, ప్రజారోగ్యానికి సంబంధించి మా సంఘం మరికొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా డా. వాసు అండగా నిలuడ్డాడు. 1988లో మేం హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీకాప్డ్ (మానసిక వికలాంగుల జాతీయ సంస్థ` ఎనఐఎంహెచ్)’తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాం. దీని ప్రకారం ఆ సంస్థ నిపుణులు ఇబ్రహీంపట్నానికి వచ్చి, పరీక్షలు చేసి` మానసిక, శారీరక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పిల్లలను గుర్తించారు. ఆ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ఆయా సమస్యల పట్ల వారిలో అవగాహన పెంచేందుకు కృషి చేశారు. కొందరికి ప్రత్యేక తరగతులు నిర్వహించటంతో పాటు తదుపరి చికిత్సల కోసం వారిని బోయిన్‌పల్లిలోని ఎనఐఎంహెచ్కు పంపించారు. అక్కడి వరకూ వెళ్లివచ్చేందుకు వీలుగా వారికి బస్ పాసులు కూడా ఇప్పించారు. డా. వాసు అప్పుడప్పుడు సీనియర్ డాక్టర్లను తీసుకువచ్చి వాళ్లతో ఇబ్రహీంపట్నంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను నిర్వహించాడు. 1988లో యాచారంలో నిర్వహించిన అలాంటి ఓ శిబిరంలోనే` ఇతర డాక్టర్లతో పాటు నా చిరకాల మిత్రురాలు, గైనకాలజిస్ట్ అయిన డా.సరోజినీ రెడ్డిని చూసి నేనెంతో సంభ్రమానికి గురయ్యాను. ఎమర్జెన్సీ తర్వాత నేను దిల్లీలో ఉంటున్న రోజుల్లో ఆమె నాకు ఎంతో సాయం చేశారు.
1988లోనే నేను అనంతపురం జిల్లా పెనుకొండలో ‘యాక్షన్ ఆన్ డిజెబిలిటీ అండ్ డెవలప్మెంట్ (ఎడీడీ), ఇండియా’ అనే సంస్థ నిర్వాహకుడైన బి.వెంకటేశ్‌ని కలిశాను. ఆయన తన బృందాలతో కలిసి అనంతపురం జిల్లా అంతటా తిరుగుతూ వికలాంగులను సంఘటితపరిచి, వారితో సంఘాలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఒక విధంగా అవి స్వయం సహాయక బృందాల (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) వంటివి. వికలాంగుల హక్కుల పట్ల అవగాహన కల్పించేందుకు, ఎలాంటి వివక్షా లేకుండా వాళ్లు గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండేలా ప్రజా చైతన్యం తీసుకువచ్చేందుకు వాళ్ల బృందాలు కృషి చేస్తుండేవి. ఎడీడీ సంస్థ ఎంత ప్రభావశీలంగా పని చేస్తోందో చూస్తే ముచ్చటేసేది. వాళ్లను చూసి నేను కూడా చాలా ప్రభావితమయ్యాను. ‘వికలాంగులు’ (హ్యాండీక్యాప్డ్) అన్న పదాన్ని ఎక్కడా ఉపయోగించ కూడదనేది వాళ్ల మొట్టమొదటి డిమాండ్. అయితే ఆ రోజుల్లో వారికి సంబంధించిన వ్యవహారాలను చూసే ప్రభుత్వ శాఖ పేరే ‘ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సంక్షేమ, సహకార ఆర్థిక సంస్థ (ఆంధ్రప్రదేశ్ హ్యాండీకాప్డ్ పర్సన్స్ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్)’. ఆ శాఖే వ్యక్తులను పరీక్షించి, నిర్ధారించి, వారికి కావాల్సిన గుర్తింపు పత్రాలను జారీ చేసేది. ఆ పత్రాల ఆధారంగానే వారికి ఉచిత ఆర్టీసీ బస్ పాస్‌లు, వివిధ ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యత వంటివి లభిస్తాయి. అందువల్ల ‘వికలాంగులు (హ్యాండీక్యాప్డ్)’ అన్న పదం బాగా వాడుకలోకి వచ్చింది. మా సంఘం వాళ్లు కూడా అదే పదాన్నే ఉపయోగించేవారు. ఏడీడీ సంస్థ మాత్రం అవకాశం లభించిన ప్రతి వేదిక మీదా ‘దయచేసి వికలాంగులు (హాండీకాప్డ్)’ అనే పదాన్ని ఎక్కడా వాడకూడదని అందరికీ పదే పదే విజ్ఞప్తి చేసేది.
ఆ సంస్థ నిర్వాహకులైన బి. వెంకటేశ్ స్వయంగా అంధత్వాన్ని (విజువల్లీ ఛాలెంజ్డ్) ఎదుర్కొంటున్నారు. ఏదైనా అనుకుంటే పట్టు వదలకుండా సాధించే రకం. అతను ఒక రోజు నాతో మాట్లాడుతూ “మీ సంఘం శారీరకంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వారితో ఎందుకు కలిసి పనిచేయడం లేదు? అలాంటి పిల్లల కోసం మీరు కూడా ఏదైనా చెయ్యొచ్చుగా! మీరలా చేస్తే అన్ని సామర్థ్యాలూ వున్నవాళ్లూ, సవాళ్లను ఎదుర్కొంటున్న విభిన్న సామర్థ్యాలు వున్నవాళ్లూ అందరూ కలసి ముందుకు సాగేందుకు వీలవుతుంది కదా” అన్నారు. అప్పుడు నేను ‘మా ప్రాంతంలో అలాంటి పిల్లలు పెద్దగా లేరు’ అని చెప్పాను. ముందు సర్వే చేయండి తెలుస్తుంది అని ఆయనే సూచించారు. వెంటనే మేం పనిచేసే గ్రామాల్లోని 10,000 కుటుంబాలలో సర్వే చేశాం. వచ్చిన ఫలితాలు చూస్తే మాకు మతిపోయినంత పని అయింది. ఇక్కడి మొత్తం పిల్లల్లో దాదాపు 10 శాతం మంది ఏదో ఒక సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది పాక్షిక అంధత్వం, సంపూర్ణ అంధత్వం, చెముడు, మాటలు రాకపోవటం, అవయవాల కదలికలు లేకపోవడం వంటి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఇన్నాళ్లూ ఈ పిల్లలంతా ఎక్కడున్నారు, మా దృష్టికి ఎందుకు రాలేదని మాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడు మేం ఏడీడీని ఇబ్రహీంపట్నానికి రావాల్సిందిగా ఆహ్వానించాం. ఆ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు తగిన శిక్షణ, సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారిని కోరాం. వాళ్లు వెంటనే అంగీకరించారు. 1988`1999 మధ్య బి. వెంకటేశ్, ఆయన సహచరుడు ఐజాక్ న్యూటన్ ఎన్నో సార్లు మా గ్రామాలకు వచ్చి ఆ సహాయ శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షించారు.
మా సంఘం తరపున హస్మత్పురకు చెందిన కుంటి రాములు ఆ కార్యక్రమాలను చూసేవాడు. అతనికి ఒక కాలు లేదు. జైపూర్ కాలు పెట్టించుకున్నాడు. అతని ఆధ్వర్యంలో, ఎడీడీ స్ఫూర్తితో మేం విభిన్న రకాల శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా ‘ఇబ్రహీంపట్నం తాలూకా వికలాంగుల సంఘం’ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశాం. ఇది కొద్ది రోజుల్లోనే పూర్తిగా, స్వతంత్రంగా పని చేయటం ఆరంభించింది. మా ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘమే చాలా ఉధృతంగా పని చేస్తుందనుకుంటే.. ఈ సంఘం అంతకు మించి పనిచేసేది. రుణాల మంజూరు కోసం, ప్రభుత్వ పథకాల సక్రమ అమలు కోసం, సమాజంలో వారిపట్ల వున్న వివక్షలను నిర్మూలించడం కోసం విస్తృతంగా పోరాడేది. ఎప్పుడైనా అత్యవసరమనిపిస్తేనే అది మా సంఘం మద్దతును కోరేది. రాములు తన పూర్తి కాలాన్ని ఆ సంఘం కోసమే వెచ్చిస్తూ, ఎంతో అంకిత భావంతో పనిచేసేవాడు. వాళ్ల నిబద్ధత, పోరాట స్ఫూర్తి మాకు గొప్ప ప్రేరణగా నిలిచాయి!
19. దండుమల్కాపురంలో నాపై హత్యాయత్నం
1988లో ఎండాకాలం మొదలవక ముందే భూమి కోసం పోరాటం ఉధృతమయింది. వనరుల లేమి, కార్యకర్తల కొరత వల్ల మేం కొంత సతమతమయ్యాం. జబ్బార్గూడెం, పులిమామిడి, మీర్ఖాన్పేటల భూపోరాటాలకు తోడు చౌటుప్పల్ మండలం, దండుమల్కాపురంలో కూడా ఉద్యమం పెల్లుబికింది. తమ హక్కుల కోసం ఎంతకైనా తెగించి పోరాడేందుకు జనం సిద్ధపడుతున్నారు. అన్ని చోట్లా వారిలోంచి ఎక్కడికక్కడే నాయకులు ఆవిర్భవిస్తున్నారు. పులిమామిడిలో మొత్తం గ్రామస్తులంతా ఏకంకావడం వల్ల అక్కడి భూములలో ఎదురులేనివిధంగా సాగు చేసుకోగలుగుతున్నారు. భూస్వాములకు ఆ గ్రామంలో ఏ ఒక్కరి మద్దతు లభించకుండా పోయింది. అయితే అలా సాగుచేసుకుంటున్న వారి పేర్లను రెవెన్యూ కార్యాలయంలోని పహాణీ పత్రాలలో నమోదు చేయడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. రెవెన్యూ అధికారులు అందుకు మొండిగా నిరాకరించారు. మరోపక్క పోలీసులు మా మీదా, ఆ భూములను సాగు చేస్తున్న వారి మీదా ఎన్నో కేసులు పెట్టి మేమంతా కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ తిరుగుతుండేలా చేశారు. నా మీద నిఘా వుంచాలని పహాడీ షరీఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్‌వర్ధన్ రెడ్డిని ఆదేశించడంతో అతను నాకు రోజూ ఫోన్ చేసి ఆరాతీస్తుండేవాడు. ఆ వేధింపులతో విసిగిపోయిన నేను ఒక దశలో భూస్వామి గడీకి నాలుగువైపులా బాంబులు పెట్టి పేల్చి పారేయండి అన్నాను. కానీ అదృష్టవశాత్తు ఆ మాటను మా సంఘంలో ఎవరూ పట్టించుకోలేదు.
జబ్బార్గూడెం గ్రామంపై సంఘం ఎప్పటిలాగే ప్రత్యేక దృష్టిని పెట్టింది. కింది కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిన ప్రతిసారీ భూస్వాములు హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తీసుకొచ్చేవారు. నా పాత మిత్రుడు పి. ఇంద్రారెడ్డి అప్పుడు ఈ జిల్లాకు చెందిన మంత్రి. అతనితో పాటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మరో నలుగురైదుగురు శాసన సభ్యులు కలసి జిల్లా అధికార్ల మీద ఒత్తిడి తెచ్చి పేద ప్రజలకు ఏ చిన్న మేలూ జరగకుండా అడ్డుకునేవారు. మరోపక్క మంచిరెడ్డి కిషన్ రెడ్డి తండ్రి భూపాల్ రెడ్డి ఎప్పటిలా గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండేవాడు. వివాదంలో వున్న భూమి పక్కనే మంచిరెడ్డి భూమి వుండేది. అందువల్ల గ్రామానికి వచ్చిపోయే వారి మీద వాళ్లు ఎప్పుడూ ఒక కన్నేసి వుంచేవారు. ఒంటరిగా వెళ్లే గ్రామస్తుల మీదా, సంఘం సభ్యుల మీదా దాడులు చేసేవారు. వీరయ్యను కూడా ఆ భూస్వామి తొత్తులు అలాగే కొట్టారు. పోలీసులు ఎప్పుడూ భూస్వామి పక్షమే వహించేవారు. పైగా మా మీదే అక్రమ కేసులు బనాయించేవారు. మావాళ్లనే అరెస్టు చేసేవారు. అందుకు నిరసనగా మా సంఘం అనేక ప్రదర్శనలను చేసింది. 1988 ఆగస్ట్‌లో ఆంధ్ర ప్రదేశ్ దళిత మహాసభ, బొజ్జా తారకంల సారథ్యంలో హైదరాబాద్‌లో శాసన సభ ఎదుట కూడా నిరసన ప్రదర్శనను నిర్వహించింది. అప్పుడు స్పీకర్‌కు నివేదన పత్రం సమర్పించేందుకు చిన్న ప్రతినిధి బృందాన్ని లోపలికి అనుమతించారు. మమ్మల్నెవరినీ లోపలికి అడుగుపెట్టనివ్వలేదు. అప్పుడు శాసన సభ వెలుపల వున్న మమ్మల్నందరినీ ఉద్దేశించి సీపీఐకి చెందిన చండ్ర రాజేశ్వర రావు, జనతా పార్డీ శాసన సభ్యుడూ, ప్రముఖ ట్రేడ్ యÖనియన్ నాయకుడూ అయిన నాయిని నర్సింహా రెడ్డి ప్రసంగించారు.
మొత్తం మీద ఆ భూస్వామి కబంధహస్తాల్లోంచి మేం బతికి బయటపడ్డాం. వాళ్లు మా మీద ఇలాగే కేసుల మీద కేసులు పెడుతుంటారనీ.. దాడులు చేస్తుంటారనీ.. చివరికి మమ్మల్ని అంతం చేస్తారనీ అనుకునేదాన్ని. మేమిలా బయటి వారి సహాయంతో ఎంత కాలం బయటపడుతూ వుండగలం? మా అసలైన బలం బయట కాదు గ్రామంలోనే వుందని త్వరలోనే తెలుసుకున్నాం. ఒక గ్రామం తరువాత మరో గ్రామం అక్కడి భూస్వాములను ఎదురించడం మొదలుపెట్టింది. చౌదరిపల్లి గ్రామంలో అనంత రెడ్డి అనే ఒక బడా భూస్వామి వుండేవాడు. అతనే మాదిగలకూ రెడ్లకూ మధ్య సంధి కుదిర్చేందుకు మధ్యవర్తిగా రంగంలోకి దిగాడు. అతనొక రాజకీయవేత్త. రెడ్లకూ మాదిగలకూ మధ్య ఈ విభేదాలు ఇలాగే కొనసాగుతూ పోతే రెడ్లకే ఎక్కువగా నష్టం జరుగుతుందని అతను ముందుగానే గ్రహించాడు.
1988లో చౌదరిపల్లి గ్రామ మాదిగలు మా సంఘం వద్దకు వచ్చారు. తమ గ్రామంలో అనంత రెడ్డి అనేక భూములను ఎలా ఆక్రమించుకున్నాడో వివరించారు. చౌదరిపల్లి గ్రామం యాచారంకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే వుంటుంది. అయినా సరే అంతవరకు ఆ గ్రామ మాదిగలు దాదాపు నాలుగు సంవత్సరాలుగా మా సంఘానికి దూరంగా వుంటూ వచ్చారు. వాళ్లంతా భూస్వామి అనంత రెడ్డికి చాలా విధేయంగా వుంటారని వాళ్ల బంధువులు మాకు చెప్పేవారు. అనంత రెడ్డి 1972 ` 1978 మధ్య ఇబ్రహీంపట్నం శాసన సభ్యుడిగా వున్నాడు. అతనికి ఊళ్లో 280 ఎకరాల భూమి వుంది. ఐదు బావులున్నాయి. కొన్ని ద్రాక్ష తోటలు కూడా వున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఐదు భవనాలున్నాయి. అక్కడ అనేక వ్యాపారాలున్నాయి. అతని పెద్ద కొడుకు అమెరికాలో వుండేవాడు. మిగతా ముగ్గురు పిల్లలు ఇక్కడే ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. అసలు అనంత రెడ్డి చౌదరిపల్లి గ్రామస్తుడే కాదు. వేరే ఎక్కడో ఒక బీద కుటుంబంలో పుట్టినవాడు. చౌదరిపల్లి గ్రామానికి చెందిన భూస్వామి అతణ్ని చిన్నప్పుడే దత్తత తీసుకుని పెంచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి క్రమంగా ఆ పార్టీ ప్రముఖ నాయకుల్లో ఒకడిగా ఎదిగాడు. శాసన సభ్యుడుగా ఎన్నికయ్యాడు. అంతకు ముందు రెండు సార్లు స్థానిక పంచాయితీ సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. అనంత రెడ్డి పంచాయితీ సమితి ప్రెసిడెంట్‌గా వున్నప్పుడే ప్రభుత్వం ఇబ్రహీంపట్నం తాలూకాలో రాత్రి బడులను నిర్వహించాలని ప్రతిపాదించింది. అప్పుడు అనంత రెడ్డి “మాదిగ పోరగాండ్లు కూడ చదువుకుంటే మన పశువులను ఎవరు కాస్తర్రా?” అన్నాడు. “ఇయాల బడికి పోయి చదువుకుంటం అంటరు, రేపు భూములు కావాలని అడుగుతరు” అంటూ తన గ్రామంలో రాత్రి బడిని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నాడు.
1973లో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో లాండ్ సీలింగ్ ఆక్ట్ (భూపరిమితి చట్టం) బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అనంత రెడ్డి శాసన సభ్యుడిగా ఆ బిల్లును సమర్థించాడు. కానీ తన భూమి మీద ఆ చట్టం ప్రభావం ఏమీ పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. డెబ్బై మÖడు ఎకరాల భూమిని అప్పటికప్పుడు ఎక్కడో దూరాన వున్న తన అసలు తండ్రి పేరు మీదకు మార్చేశాడు. ఊరి పట్వారి కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి పన్నెండేళ్ల రెవెన్యూ రికార్డులను సృష్టించాడు. తన ఇద్దరు మైనర్ కొడుకులను మేజర్లుగా చూపించి మరో డెబ్బై మÖడు ఎకరాల భూమిని వాళ్ల పేర్ల మీదకు మార్పించాడు.
కానీ లాండ్ సీలింగ్ అధికారులు అలాంటి బేనామీ బదలాయింపులను ఆమోదించలేదు. కోర్టు కేసులు అనేక సంవత్సరాల పాటు సాగిన తరువాత అతని మొత్తం భూమిలో కేవలం పన్నెండెకరాలు మాత్రమే భూపరిమితి చట్టానికి మించి వున్నట్టు తేల్చారు. అప్పుడా భూస్వామి తన దగ్గరున్న భూమిలో రాళ్లు రప్పలతో కూడిన ఆరు ఎకరాలను, సాగుకు ఏమాత్రం పనికి రాని మరో ఆరు ఎకరాల బంజరు భూమిని వ్యవసాయ కార్మికులకు ఇచ్చాడు. ఆ తర్వాత తన 45 ఎకరాల భూమిని తనే కొనుగోలు చేసినట్టు చూపించుకున్నాడు.
పతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఫోన్ నం. 93815 59238/040-2352 1849
mail:hyderabadbooktrust@gmail.com
