డా. ఎం. గంగాధర
ఏప్రిల్ 1, 2010 నుండి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి రావడానికి కొద్దిరోజుల ముందు నుండి అమల్లోకి వచ్చిన రోజు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విద్యాశాఖలు జాతీయస్థాయి నుండి గ్రామస్థాయి వరకు సమావేశాలను పెట్టించి, ర్యాలీలను తీయించి, ఏదో మార్పుకు నాందీ పలుకుతున్నట్లు కొంత అలజడిని సృష్టించడానికి ప్రయత్నించాయి.
ఉచిత, నిర్బంధ విద్య పట్ల బాల బాలికలకున్న హక్కు, 2009, అనే పేరుతో ఉన్న ఈ విద్యా హక్కు చట్టం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు వయసున్న బాలబాలికలకు విద్యను ప్రాథమిక హక్కుగా చేసినట్లు చెప్పింది. అంటే 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుకోవడాన్ని ప్రాథమిక హక్కుగా చేసింది. దేశంలోని పేదరికం, వెనుకబాటుతనం, నిరక్షరాస్యతలను దృష్టిలో పెట్టుకొని చూస్తే పేద కుటుంబాల నుండి వచ్చే బాలబాలికలకు ఎంతో ప్రయోజనకారిగా కనిపించే ఈ చట్టం, 10వ తరగతి చదివినా, ఇంటర్మీడియట్ చదివినా సరియైన ఉద్యోగమేదీ దొరకని వ్యవస్థలో ఎవరికి మేలు చేస్తుందనే ప్రశ్నను మన ముందుంచుతుంది.
1951లో దేశంలో 18.33 శాతం మంది ప్రజలు అక్షరాస్యులుగా ఉన్నారు. 1961 జనాభా లెక్కల నాటికి వారు 28.3 శాతానికి చేరుకున్నారు. ఈ రెండు అంకెలను చెప్పుకోవడానికి కారణముంది. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్‌లో దేశంలోని 14 ఏళ్ల లోపు బాలబాలికలకు నిర్బంధోచిత విద్యను ప్రభుత్వాలు అందించాలని, ఈ లక్ష్యాన్ని పదేళ్లలోపు, అంటే 1960 నాటికి చేరుకోవాలని చెప్పబడింది. కాని ఈ పదేళ్లలో పది శాతం అక్షరాస్యతను మాత్రమే ప్రభుత్వాలు పెంచగలిగాయని ఈ అంకెలు తెలుపుతున్నాయి. ఈ గడవును పదే పదే పెంచుతూ వచ్చారు. అరవై ఏళ్లు గడిచినా లక్ష్యం దరిదాపుల్లోకి మన బాలబాలికలు చేరుకునే పరిస్థితి లేదు. 2001లో దేశ అక్షరాస్యతా శాతం 64.84. 2011 జనాభా లెక్కల్లో ఇది మరో పది శాతం పెరగవచ్చు.
దేశంలోని బడికి వెళ్లే వయస్సులోవున్న బాలబాలికల ఎన్‌రోల్‌మెంట్‌ను వంద శాతం దరిదాపుల్లోకి తెచ్చామని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. కానీ ప్రభుత్వాల లెక్కల ప్రకారమే ఒకటవ తరగతిలో చేరిన బాలబాలికలు ఐదవ తరగతికి వచ్చేసరికి 25.67 శాతం మంది బడి మానేస్తున్నారు. ఏడవ తరగతికి వచ్చేసరికి 48.80 శాతం మంది బడి మానేస్తున్నారు. అంటే సుమారు సగం మంది బాలబాలికలు ఎలిమెంటరీ విద్యను కూడా పూర్తి చేయలేకపోతున్నారు. బడి మానివేసిన ఈ బాలబాలికలు ఒకటో తరగతో, రెండో తరగతో చదివి ఉంటారు కనుక వారు అక్షరాస్యులుగానే లెక్కించబడతారు. మనం సాధించిన అక్షరాస్యతలోని గుణం ఈ పాటిది.
ఆంధ్రప్రదేశ్‌లో 2001 జనాభా లెక్కల ప్రకారం 60.47 శాతం అక్షరాస్యత ఉంది. అది దేశ సగటు అక్షరాస్యత కంటే తక్కువ. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత విషయంలో 28వ స్థానంలో ఉంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో కంటే మహిళల్లో, ఒ.సి., బి.సి. వర్గాల్లో కంటే ఎస్.సి., ఎస్.టి. వర్గాల్లో అక్షరాస్యత తక్కువగా ఉంటుంది.
అనేక చారిత్రక దశలను అధిగమించి, ఎలిమెంటరీ విద్య 2009 నాటికి రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కుగా మారింది. బ్రిటిష్ వలస ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత విద్యా కమిషన్ (హంటర్ కమిషన్)కు మహాత్మా జ్యోతిరావు పులె 1882లో ఒక మెమోరాండంను సమర్పిస్తూ దేశంలోని కులీన వర్గాల విద్యా ప్రయోజనాలను ఈడేర్చడం కొరకే ప్రభుత్వ విద్యారంగం పాటు పడుతున్నదని విమర్శించి దళిత, బలహీన వర్గాల విద్యావసరాల మీద దృష్టిని సారింపజేసే ప్రయత్నం చేశారు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 1911లో గోపాల్‌కృష్ణ గోఖలే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. కాని అసెంబ్లీలో ఉన్న సభ్యులు దేశంలోని పరిస్థితులు ఈ బిల్లుకు అనుకూలంగా లేవని బిల్లును తిరస్కరించారు. ఈ సభ్యులందరు కులీన సంపన్న వర్గాలకు చెందినవారే. బాలబాలికలందరు బడికి పోతే మా వ్యవసాయం భూముల్లో ఎవరు పనిచేస్తారని, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీహార్‌లోని దర్భాంగా మహారాజు 11 వేల మంది భూస్వాముల, సంస్థానాధీశుల సంతకాలను సేకరించి, ప్రభుత్వానికి ఒక మెమోరాండాన్ని సమర్పించారు. దేశంలో ప్రాథమిక విద్యావ్యాప్తికి పాలక, సంపన్న వర్గాల ప్రయోజనాలు ఎంతగా అడ్డుతగిలాయో ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఈ పాలక సంపన్న వర్గాలే ఈ వైఖరినే వేర్వేరు రూపాల్లో ఇప్పటివరకూ కొనసాగిస్తూ వస్తున్నారని విద్యారంగ చరిత్ర పరిశీలిస్తే అర్థమవుతుంది.
భారత చట్టం, 1935, ప్రకారం జరిగిన ఎన్నికల్లో దేశంలో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. 1937లో వార్ధాలో జరిగిన నేషనల్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్‌లో హాజరైన 9 రాష్ట్రాల విద్యామంత్రులను నయీ తాలిమ్ (బేసిక్ ఎడ్యుకేషన్)ను అమలుచేయాలని గాంధీ కోరాడు. నయీ తాలిమ్‌ను అమలుచేయడానికి అవసరమైన నిధులు తమ వద్దలేవని ఆ విద్యామంత్రులు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ (పాలకవర్గాలు) నైజం కొత్తదేమీ కాదు. పుట్టుకతోనే దానికా నైజం అబ్బి, అది కొనసాగుతూ వచ్చింది.
14 ఏళ్ల వయస్సు నిండేవరకు దేశంలోని బాలబాలికలకందరికి నిర్బంధోచిత విద్యను అందించాలనే ఆర్టికల్ 45కు అంబేద్కర్ పట్టుదలే కారణం. రాజ్యాంగసభలో 1948-49లలో ఈ అంశం మీద చర్చ జరిగినపుడు చాలామంది సభ్యులు ఈ నిర్బంధోచిత విద్యను 11 ఏళ్ల వరకే పరిమితం చేయాలని చూశారు. ఆదేశిక సూత్రాల్లో మిగిలిన వాటికి లేని కాలపరిమితిని ఆర్టికల్ 45కు విధించడానికి కూడ అంబేద్కరే కారణం.
దేశంలోని బాలబాలికల విద్యాభ్యాసం గురించి అంబేద్కర్ పట్టుదల కారణంగా భారత రాజ్యాంగంలో పదేళ్ల కాలపరిమితి కలిగిన ఆర్టికల్ 45 చేరింది. కాని భారత ప్రభుత్వాలకు ఆ ఆర్టికల్ మీద పట్టింపు లేకుండా పోయింది. 1980లలో ఆర్థిక సరళీకరణ విధానాలు వచ్చిన తరువాతనే మార్కెట్ అవసరాల కొరకు నిరక్షరాస్యతను తగ్గించాలని, అక్షరాస్యతను పెంచాలని ప్రభుత్వాలు అనుకున్నాయి. అప్పటి నుండి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ మొదలుకొని అనేక అక్షరాస్యతా పథకాలు అమలవుతూ వచ్చాయి.
అయితే 1993లో ఉన్ని కృష్ణన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జీవించే హక్కులో విద్యా హక్కు ఇమిడి ఉందని, విద్య లేకుండా జీవించే హక్కుకు అర్థం లేదని, అందువలన దేశంలోని బాలబాలికలకు 14 ఏళ్ల వయస్సు వచ్చేవరకు విద్యను ఒక ప్రాథమిక హక్కుగా భావించాలని, 14 సంవత్సరాల వయస్సు తరువాత కూడా విద్య ఒక హక్కుగానే ఉంటుందని, అయితే అది ప్రభుత్వం వద్దనున్న నిధుల లభ్యతను బట్టి పరిమితం చేయబడుతుందని చెప్పింది. విద్యారంగంలో పేద ప్రజల హక్కుల కొరకు పోరాటం చేస్తున్నవారికి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఒక ఆయుధంగా పనికివచ్చింది. ఈ ఆయుధాన్ని ప్రభుత్వాల మీద ప్రయోగించి విద్యాహక్కు కొరకు వారు పోరాటం చేశారు. ఈ ఒత్తిళ్లకు లొంగిన అప్పటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 1997లో రాజ్యసభలో 83వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కాని ఆ బిల్లు బిల్లుగానే ఉండిపోయింది. విద్యారంగానికి తగినన్ని నిధులను కేటాయించడానికి ఇష్టపడని కేంద్ర ప్రభుత్వ వైఖరే అందుకు కారణం. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వమే సుప్రీంకోర్టు తీర్పును అమలుచేస్తే ఎన్ని నిధులు కావాలో అంచనా వేయడానికి తపస్ మజుందార్ కమిటీని నియమించింది. 1997 జూన్‌లో నియమితమైన ఆ కమిటీ 1999 జనవరిలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. రానున్న పదేళ్ల కాలంలో 1,37,000 కోట్ల రూపాయలు ఖర్చుపెడితే సుప్రీంకోర్టు తీర్పును ఆచరణాత్మకం చేయవచ్చునని ఆ కమిటీ చెప్పింది. అంటే సంవత్సరాని సగటున 13,700 కోట్ల రూపాయలు. ఇది ఆనాటి జిడిపిలో 0.86 శాతం మాత్రమే. కాని దేశంలోని బాలబాలికల భవిష్యత్తు కొరకు ఈ మాత్రం ఖర్చు చేయడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకు రాలేదు.
యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం విద్యారంగం మీద పెడుతున్న ఖర్చు 6 శాతంకు చేరుకోవడానికి ఒక హాస్యాస్పదమైన మార్గాన్ని ఎంచుకుంది. ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యతల నుండి తప్పుకోవడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ సూత్రాన్ని వల్లెవేస్తున్నాయి. ఈ సూత్రానికి అనుగుణంగా విద్యారంగం మీద ప్రైవేట్ పాఠశాలల్లో జరిగే ఖర్చుతో కలుపుకొని, విద్యారంగం మీద జిడిపిలో 6 శాతం నిధులను ఖర్చు చేయాలనే లక్ష్యాన్ని చేరుకుంటామని ఎన్‌డిఎ ప్రభుత్వం 2001లో అన్నది.
విద్యారంగానికి జిడిపిలో 6 శాతం నిధులను ఖర్చుచేయాలనే దానికి ఒక చరిత్ర ఉంది. దేశంలోని పాఠశాల విద్యారంగాన్ని అధ్యయనం చేసి తగిన సిఫారసులు చేయడం కొరకు భారత ప్రభుత్వం 1964లో డా. డి.ఎస్. కొఠారీ అధ్యక్షతన ఒక విద్యా కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌కి సభ్యులు రెండేళ్లపాటు దేశవిదేశాల్లోని పాఠశాల విద్యారంగాన్ని అధ్యయనం చేసి 1966లో ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించారు. ఇది చాల ప్రామాణికమైన నివేదికగా పేరు పొందింది. విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం జిడిపిలో 6 శాతం నిధులను ఖర్చు చేయాలని ఈ నివేదికలో కొఠారీ సిఫారసు చేశారు. కాని అప్పటినుండి ఈ నాలుగు దశాబ్దాలకుపైగా గడిచిన కాలంలో ఏనాడూ 3-4 శాతానికి మించి విద్యారంగానికి నిధులను కేటాయించలేదు. 2004లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2 శాతం విద్యా సెస్సును విధిస్తూ వచ్చింది. అయినా విద్యారంగానికి నిధుల కేటాయింపు మాత్రం పెరగలేదు.
ఎన్‌డిఎ ప్రభుత్వం హయాంలోనే 2002 డిసెంబర్‌లో 86వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల విభాగంలో 21ఎ అనే కొత్త అధికరణం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చోటు చేసుకున్నది. 14 సంవత్సరాల వరకు బాలబాలికలందరికి నిర్బంధోచిత విద్యను అందించాలని ఉన్న 45 అధికరణను కుదిస్తూ 6-14 సంవత్సరాల మధ్యనున్న బాలబాలికలకు మాత్రమే విద్యను ప్రాథమిక హక్కుగా 21ఎ అధికరణ చెప్పింది. బాలబాలికల ఎదుగుదలలో అత్యంత కీలకమైన 0-5 సంవత్సరాల మధ్యనున్న బాల్యాన్ని దేశ ప్రజలందరికి ప్రాతినిధ్యం వహించే భారత పార్లమెంట్ గాలికి వదిలేసింది. అప్పటివరకు నైతికంగానైనా తన మీద ఉన్న బాధ్యత నుండి ప్రభుత్వాలు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా నిస్సిగ్గుగా తప్పుకున్నాయి. 14 సంవత్సరాల పైన ఉండే బాలబాలికల విద్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కల్పించిన వెసులుబాటు వలన ప్రభుత్వాలు పూర్తిగా జారుకున్నాయి. పారిపోతున్న దొంగను పట్టుకున్నట్లుగా సుప్రీంకోర్టు తీర్పు భారత ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప ఆ ప్రభుత్వం అతికష్టంమీద 6-14 సంవత్సరాల మధ్య బాలబాలికలను విద్య ప్రాథమిక హక్కుగా అంగీకరించలేదు. అందుకే రాజ్యాంగ చట్టం వచ్చిన పదేళ్లకు గాని ఆ రాజ్యాంగ చట్టాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిన విద్యాహక్కు చట్టం రాలేదు.
విద్యాహక్కు చట్టం, 2009 : ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు చట్టం, 2009 (35/2009) అనే పేరుతో పార్లమెంట్ ఈ చట్టాన్ని చేసింది. ఈ చట్టం 26 ఆగస్ట్ 2009 నాడు భారత రాష్ట్రపతి ఆమోదాన్ని పొంది, 27 ఆగస్ట్ 2009 నాడు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రచురించబడింది. 6-14 సంవత్సరాల మధ్యనున్న బాలబాలికలకు విద్యను ప్రాథమికహక్కుగా పేర్కొన్న ఈ చట్టం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యను ఎలిమెంటరీ విద్యగా నిర్వచించి, ఆ ఎలిమెంటరీ విద్యను ఉచితంగానూ, నిర్బంధంగానూ ఇవ్వడానికి ఉద్దేశించింది. ప్రభుత్వం ఇచ్చే ఈ తరహా విద్యకు సంపన్నవర్గాల పిల్లలు, చివరకు మధ్యతరగతి వర్గాల పిల్లలు కూడా, ఎదురుచూడడం లేదు. కాబట్టి ఈ విద్య ప్రధానంగా పేదవర్గాలకు చెందిన పిల్లలకు, కొంతమేరకు దిగువ మధ్యతరగతి పిల్లలకు ఉద్దేశింపబడింది.
భారతదేశపు భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకోవాలని 1960లలో కలలు గన్న కొఠారీ కమిషన్ సంపన్న వర్గాల, పేదల పిల్లలు ఒకేచోట చదవగల కామన్‌స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పింది. కొఠారీ కమిషన్ కాలం నాటికి, ఆ తరువాత మరికొంత కాలం వరకు, పరిమితమైన అర్థంలోనైనా, ఏదో ఒక రూపంలో ఉన్న ‘కామన్ స్కూల్’ ధ్వంసమైపోయింది. ప్రభుత్వ పాఠశాలకు పోటీగా ప్రైవేట్ పాఠశాల వచ్చింది. ఇప్పుడు ఆ ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలను మింగే స్థాయికి ఎదిగింది. ప్రభుత్వ రంగంలోనే ఉన్న పాఠశాలలు బహుళ రూపాలను పొంది విద్యారంగంలో ఒక అంతరాల దొంతరను సృష్టించింది. విద్యారంగం పాఠశాలల పరంగా, విద్యార్థుల పరంగా, వసతుల పరంగా, మీడియం పరంగా విభజింపబడింది. ఏ పాఠశాల గదిలో సామాజిక సామరస్యాన్ని నిర్మించాలని కొఠారీ కమిషన్ కలగన్నదో ఆ పాఠశాల గదినే సామాజిక వైమనస్య బీజాలను నాటడానికి మన ప్రభుత్వాలు వేదికగా మార్చివేశాయి. ఈ విద్యా హక్కు చట్టం ఈ అంతరాల దొంతరను ఏ మాత్రం కదలించకుండా, పేద విద్యార్థులకు పేద విద్య మీదనే హక్కును కల్పించింది.
ఎస్.సి., ఎస్.టి.లను, సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారిని, అల్పాదాయవర్గాల వారిని విద్యా హక్కు చట్టం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇలాంటి వారి కోసమే ఈ విద్యా హక్కు చట్టం అన్నట్లుగా ఈ ప్రస్తావన ఉంటుంది. శతాబ్దాలుగా వెనుకబడిన ఈ వర్గాలకు ఎలాంటి విద్యను అందించాలని ప్రభుత్వం అనుకుంటున్నదో, ఈ చట్టానికి ఉన్న షెడ్యూల్‌ను చూస్తే అర్థమవుతుంది. తగినంత మంది ఉపాధ్యాయులను ఇవ్వడంలో, మెరుగైన వసతులను కల్పించడంలో ప్రభుత్వాలు సాధారణంగా కనబరిచే పిసినారితనం ఇక్కడ కూడా కనబడుతోంది. మెరుగైన విద్యాబోధనను అందించడానికి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక గది తప్పనిసరి అవసరం. కాని తరగతులతో నిమిత్తం లేకుండా 30 మందికి ఒక ఉపాధ్యాయుడనే ప్రమాణాన్ని పెట్టడం వలన ఇప్పుడున్న బహుళ తరగతి బోధన విద్యా హక్కు చట్టం వచ్చిన తరువాత కూడా కొనసాగుతుందని అర్థం. అలాగే తరగతికి ఒక గది అని కూడా ఉపాధ్యాయునికి ఒక గది అనడం వలన కూడా మెరుగైన వసతి లేకుండా పోయింది. అనేక కారణాల వలన ఇప్పటికే తక్కువ స్థాయి ప్రమాణాలతో ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న విద్యాబోధన ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుందని అర్థం.
ఈ చట్టంలో ప్రభుత్వ పాఠశాల, స్థానిక సంస్థల పాఠశాల, ఎయిడెడ్ పాఠశాల, ప్రత్యేక తరహా పాఠశాలలతో పాటు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు కూడా చోటు ఉంది. అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాల వసూలు చేసే ఫీజు మీద నియంత్రణ ఏదీ లేదు. కాకపోతే ఆ ఫీజును ప్రకటించకుండా వసూలు చేయకూడదు. అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాల తన సీట్లలో 25 శాతం సీట్లను పేద కుటుంబాల పిల్లలకు ఇవ్వాలి. ఈ పిల్లల స్కూలు ఫీజులు ప్రభుత్వమే కడుతుంది. ఇది ఇంతకు ముందు చెప్పబడిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌కు ఒక రూపం. ప్రభుత్వ నిధులను ప్రైవేట్ యాజమాన్యాలకు తరలించి, ప్రభుత్వ పాఠశాలలను నిరుత్సాహపరిచే చర్య ఇది.
పాఠశాలల వ్యవహారాల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ పాత్రను చట్టంలో పెంచారు. ఈ కమిటీ పాఠశాలను పర్యవేక్షిస్తుంది. విద్యార్థుల మీద, ఉపాధ్యాయుల మీద కొంతమేరకు అజమాయిషీని కలిగి ఉంటుంది. పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారుచేస్తుంది.
0-5 సంవత్సరాల మధ్యనున్న బాలబాలికలకు విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించని ఈ చట్టంలో పూర్వ ప్రాథమిక విద్యను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని చెప్పింది. జాతీయ పాఠ్య ప్రణాళికను కేంద్రప్రభుత్వం రూపొందిస్తుందనీ, దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు తమ విద్యా ప్రణాళికలను రూపొందించుకోవాలనీ, ఎలిమెంటరీ విద్యను సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే చెప్పాలనీ, బడిలో చేరనివారు, బడిలో చేరి మధ్యలో మానివేసినవారు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి ప్రతేయక చర్యలు చేపట్టాలనీ, విద్యా హక్కు చట్టం అమలును పర్యవేక్షించడానికి జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ సలహా సంఘాలను ఏర్పాటు చేయాలనీ, ఈ చట్టాన్ని అమలు చేయడానికి అయే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలనీ ఈ చట్టం చెప్పింది. దేశ విద్యారంగ చరిత్ర తెలియని వారికి, బాలబాలికల విద్య పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక దశాబ్దాలుగా చూపుతూ వచ్చిన నిర్లిప్త వైఖరి తెలియని వారికి ఈ చట్టం ఒక అద్భుతంగానే కనబడుతుంది. కాని ఇలాంటి అద్భుతాలను జీవచ్ఛవాలుగా మార్చివేయగల నైపుణ్యం మన ప్రభుత్వాలకు పుష్కలంగా ఉంది.
అనేక పార్శ్వాలుగా ఉన్న సామాజిక జీవితంలో విద్యారంగం కీలకమైంది. సంపదను ఉత్పత్తి చేసే నైపుణ్యాన్ని మనుషులకు ఇచ్చేది విద్యయే. మానవ సంబంధాలను అర్థవంతమైన రీతిలో కొనసాగించడంలో విద్య బాగా ఉపయోగపడుతుంది. దేశీయమైన ప్రకృతి సంపదను, మానవ వనరులను దేశీయమైన అభివృద్ధి కొరకు ఉపయోగించుకునే క్రమంలో విద్య మనుషులను అందుకు తగిన విధంగా తయారు చేయాలి. విద్య మీద స్వదేశీ, విదేశీ గుత్త సంస్థల ఆధిపత్యం వారి ప్రయోజనాలను కాపాడడానికే పనికి వస్తుంది. అందుకే విద్యారంగం మీద ఆధిపత్యం కొరకు పురాణకాలం నుండి పాలకవర్గాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మెకాలే విద్యా విధానం గురించి మనకు తెలిసిందే. విద్యారంగం లాభసాటియైన వ్యాపార రంగంగా మారిన ఈ కాలంలో, వివిధ కార్పొరేట్ సంస్థలు విద్యారంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఈ కాలంలో, విద్యారంగంలోకి నేరుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ బహుళజాతి సంస్థలకు ఊడిగం చేయడానికి మన ప్రభుత్వాలు ఉబలాటపడుతున్న ఈ కాలంలో పేద ప్రజలకు నిజంగా ఉపయోగపడగల విద్యారంగం గురించి మనం ఆలోచించాలి. సామాజిక అంతరాలకు తావులేని, పేదలు, సంపన్నులు ఒకేరకమైన అవకాశాలతో, వసతులతో చదువుకోగలిగే కామన్ స్కూల్ విద్యావిధానం, విద్యాహక్కును పేద ప్రజల అనుభవంలోకి, జీవితంలోకి తీసికొనివస్తుంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, జపాన్ దేశాలలోని పెట్టుబడిదారీ వ్యవస్థలు తమ దేశస్తులకు తరతమ భేదాలతో కూడిన కామన్ స్కూల్ విధానాన్ని ఇస్తూ, భారతదేశం వంటి దేశాల్లో విద్యారంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడంలోని దుర్మార్గాన్ని మన దళారీ పాలకవర్గ ప్రభుత్వాలు ఆమోదిస్తున్నాయి.
పాఠశాల విద్యనుకూడా గ్యాట్స్ ఒప్పందంలో చేర్చడం ద్వారా మన విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విపణిలో పెట్టింది. పాఠశాల విద్యను గ్యాట్స్ ఒప్పందం నుండి తొలగించాలి. విద్యారంగం మీద పెట్టే పెట్టుబడి అంతిమ పరిశీలనలో ఉత్పాదక వ్యయమే అవుతుంది. కాబట్టి విద్యారంగానికి జిడిపిలో కనీసం 6శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లలో 30 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలి. పూర్వ ప్రాధమిక విద్యను, +2 స్థాయి వరకు విద్యను బాలబాలికలందరికి ఉచితంగా అందించాలి. అన్ని పాఠశాలల్లో మెరుగైన వసతులను కల్పించాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ దాన్ని అన్ని రూపాల్లో నిరోధించాలి. మాతృభాషలో విద్యా బోధన ఉండాలి. ఆ విధంగా చదువుకున్న వారికి ఉద్యోగాల విషయంలో ప్రాధాన్యం ఉండాలి. తరగతికి ఒక గది, ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత విస్తరించి, పేద విద్యార్థులకు మంచి పోషకాహారాన్ని అందించాలి. పేదరిక నిర్మూలన కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలి. కామన్ స్కూల్ కొరకు, విద్యారంగానికి తగిననిన నిధులు కేటాయింపు కొరకు, ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా బలోపేతం చేయడం కొరకు, విద్యా వ్యాపారాన్ని అరికట్టడం కొరకు ఒక విద్యారంగ ఉద్యమ ఆవశ్యకతను ఆలోచనాపరులు గుర్తించవలసిఉంది
(వీక్షణం మే,2010 సౌజన్యంతో)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
మాత్రుభాషలో విద్యాబోధనను సమర్థించింనందుకు ధన్యవాదాలు.. తెలియజేస్తున్నాను..
..8099991076