టి. శ్రీవల్లీ రాధిక
నా బంగారు కొండలు
ఉష్ అంటూ నా కనురెప్పలమీదికి
వూదినపుడు
అప్రయత్నంగా నేను కనులార్పుతాను
అదిగో అమ్మ భయపడిందంటూ
వాళ్ళు కేరింతలు కొడతారు
అతను క్రోధంతో నా శిగ పట్టబోయినపుడు
అనాలోచితంగా చేయి
అడ్డు పెడతాను
హన్నా నీకసలు భయం లేకుండా
పోయిందంటూ
అతను ఆక్రోశపడతాడు
అందరికీ తెలిసిన పొడుపు కధని
ముసి ముసి నవ్వులతో నాపై సంధిస్తే
ఆలోచించినట్లు నటించి
అలవోకగా విప్పుతాను
అమ్మ ఎంత తెలివైనదోనంటూ
నా బిడ్డలు మురిసిపోతారు
ప్రపంచమింతవరకూ ఎరుగని
ఓ కొత్త సత్యాన్ని
అహరహమూ శ్రమించి ఆవిష్కరిస్తాను
నీ మట్టి బుర్రకు యింత గొప్ప విషయం తోచడం
అదృష్టమేనంటూ అతను అపహసిస్తాడు.
వెల్లువలా ఎగసే ఉత్సాహాన్ని చూసి భయపడి
అల్లంతదూరంలో ఆగిపోతాను
ఏం ఫరవాలేదు
మాతో ఆడితీరాలంటూ నా పిల్లలు నన్ను స్వాగతిస్తారు
నిరాశతో కృంగిన
అతనివదనాన్ని చూసి బాధపడి
అడుగు ముందుకేసి
అనునయించబోతాను
నీ బోడి సలహా
నాకవసరం లేదు పొమ్మంటూ
అతను ఛీత్కరిస్తాడు
రెండు అనివార్యాలమధ్య అనునిత్యం నడుస్తుంటాను
మెడపట్టనన్ని పూమాలలతో
ముళ్ళ చెట్టును అల్లుకుంటాను
అల లేవడాన్నీ జారడాన్నీ
కూడా ఆనందిస్తాను
అశాంతివలయం నల్లగా ముసిరినపుడల్లా
ఆత్మజ్యోతితో నయనాలను వెలిగించుకుంటాను.
ఇంగితమా!!
తమ్మెర రాధిక
ఈ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టిన
సాటి ప్రజలకు
శిక్షగా ఇవ్వాల్సిందేంటో తెల్సా!
ప్రతిపక్ష స్థానం కాదు
ఎదుటి మనిషిని దోషిగా నిలపటానికి స్థలం లేని
హృదయాల్ని!
దోసిలొగ్గి ప్రార్థించు వారి గూర్చి
‘పరనింద పురిటి కందుల్ని
మంగోలియన్ బేబీలుగా’ మార్చమని.
కన్నీటి విలువల్ని కపటత్వంతో మూసెయ్యకండి
అది
కార్చిచ్చై నీ సామ్రాజ్యాల్ని కాల్చివేస్తుంది.
వేలెత్తి చూపించే నీ చేతిని
రేపు
కాలం కాలనాగై కాటేస్తుంది.
పోగు చేసుకున్న సానుభూతి మూటల్ని
మొయ్యలేక వాటి క్రిందే కుప్పకూలిపోవాల్సి
వస్తుందేమో!!
ఈ రోజే ప్రార్థించు
గురివింద గింజవై పుట్టినందుకు.
ఆంక్ష
బండారి సుజాత
చిట్టి చిట్టి చేతులతో
బుడి బుడి నడకలతో
అరవిరసిన విరబూసిన
విరజాజుల నవ్వులతో
అలరించును చిట్టి తల్లి
ఆజ్ఞలేని బాల్యంలో
కొండె చూపు కోరచూపుల
అర్థం తెలియని
వికసించే యవ్వనం కు
అమ్మనాన్న అదుపు వల
అదికనకు, ఇది వినకు
అదుపాజ్ఞల పెరుగుదల
విలువైన కాలానికి
విధిరాసిన చిత్రానికి
మమత పంచి
మనసు నింపు
కమనీయ కాంతి కన్నె పిల్ల
కన్నకలలు పండాలని
ముడుపుకట్టి కూడబెట్టి
కట్నమిచ్చి, కన్నెనిచ్చి
ఎదన బెట్టి చూడమంటు
కంటనీరు రానివ్వక
కాపాడుమన్న బేల తల్లికి
కట్నమొద్దు కానుకొద్దు
కాంతయే వరకట్నమను
ఒక అమ్మ కొడుకు దొరికేనా
ఒక అమ్మ మనసు అలరించేనా
మీది కులం – నాది కలం
రాజీవ
కులం పేరుతో అవకాశాలందుకొని
కులంలోని అర్తుల్ని దీనుల్ని అణగదొక్కి
స్వార్థంతో సమన్వయం లేని బ్రతుకు
తోటివారి కన్నీళ్లతో పన్నీటి జలకమాడుతోంది మీ కులం
గుండె రుధిరంతో పదునైన కలం పాళి
పొడుస్తోంది పొగరుబోతుల దౌర్జన్యాన్ని
అవగాహన లేని అమాయకుల ఉద్యమాల్ని
అమానుషంగా హత్య చేస్తున్న నీచుల్ని నగ్నంగా చిత్రిస్తోంది నాకలం.
పెదవులు పైసలు లక్ష్యంగా మానవత్వం మంటకలిపి
అనుబంధాలు అనురాగాలు అత్యాచారాలకు అమ్మకం చేసి
అడుగడుగున పేదరికం బానిసత్వం కంటే హేయంగా
అంతరాల మధ్య ఘర్షణతో నులిమి పిప్పి చేస్తోంది మీ కులం.
మమతానుబంధాల మల్లెల సుగంధాలు పరిమళింపచేసి,
మాతృత్వపు విలువలతో మహనీయుల మాన నీయత
మందమలయ సమీరంలో రంగరించి ఆక్సిజన్‌గా
సర్వమానవ సౌభ్రాతృత్వం సమతా సౌహర్ధం ఊపిరి పోస్తోంది నా కలం.
కఠినత్వం, కార్పణ్యం, కాలదన్నిన కారుణ్యం
కపట వేషం కుటిల నీతి కానరాని కనికరం
అమ్మా, అక్క, చెల్లి, చివరకు తనువు మనసు ఏకమైన ఇల్లాలు
అంగడి బజారులో ఆసరా లేక ఆక్రోసిస్తుంటే అందలాలు ఎక్కే పాచిక వేస్తోంది మీ కులం
గ్రీష్మంలో బీటలు వారిన గుండెల్లో సుగంధాలు చిరుజల్లులు కురిపించి
తుఫాను భీభత్సంలో సేద తీర్చి మనుసులకు నును వెచ్చని కాంతి కిరణాలతో
అక్కున చేర్చుకొని, ఋతుక్రమము పరిస్థితుల ప్రభావం ఎదురొడ్డే ధీశాలలను చేసి
సదా ఆయూరారోగ్యాలతో బ్రతికే స్థైర్యం, ధైర్యం, శౌర్యంను ప్రోత్సహిస్తుంది నా కలం.
అమ్మ-పువ్వులు
కొప్పర్తి వసుంధర
మా చిన్నతనంలో మా చదువులకోసం
పావలా ఖర్చని అమ్మ పువ్వులు కొనుక్కోలేదు
జడలో అందంగా ముడుచుకోలేదు
మా ఎదిగే వయస్సులో మాకందమని
మాకే ముడిచేది అన్ని పువ్వులు
స్థిమితపడింది ఇప్పుడైనా పువ్వులు పెట్టుకొంటుందంటే
నాన్న ”యాక్సిడెంటల్ డెత్”
అమ్మ జడను పూలకు దూరం చేసేసింది
అయితే ”పువ్వులు” మాత్రం అమ్మకి దూరం కాలేదు
ఇప్పుడవి అమ్మ కట్టే ”మాలలో” కుదురుకొంటున్నాయి
దేవుని మెడలో ఒదిగిపోయేందుకు.