రాము
ఒక పాతికేళ్ళు టూ వీలర్ మీద, మరొక పదేళ్ళు టూ వీల ర్‌తో పాటు ఫోర్ వీలర్ మీద తిరిగి విసుగెత్తి.. స్పాండిలిటీస్ తిరగబెడుతుందన్న భయంతో… ఈ మధ్య పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్ వ్యవస్థను విపరీతంగా వాడుతున్నాను. బస్సు, రైలు ఎక్కుతుంటే.. చాలామంది పరిచయం అవుతున్నారు. చాలా విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళ జీవితాలు, అభిప్రాయాలు, బతుకు పోరాటాలు చాలా ఆసక్తికరంగా, విచిత్రంగా ఉంటున్నాయి. ‘సిటిజెన్ జర్నలిజం’ పేరిట అవి రాయడానికి వేరే బ్లాగు పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అంతకన్నా ముందు…అన్ని బహిరంగ ప్రదేశాలలో రోజు రోజుకు ఎక్కువవుతున్న ఒక పెద్ద బెడద గురించి ప్రస్తావించడం ఈ పోస్టు అసలు ఉద్ధేశ్యం. ఇది పూర్తిగా ఈవ్ టీజింగు కాని ఈవ్ టీజింగు, ఒక మానసిక దౌర్భల్యం, జబ్బు, ఒక సంస్కార రాహిత్యం లేదా కుసంస్కారం. మహా ఉన్మాదం.
ఈ బహిరంగ ప్రదేశాలలో…కనిపించిన ప్రతి అమ్మాయిని/ మహిళను కొరుక్కు తినేట్లు చూసే మగ పిల్లలు, కాలేజీ కుర్రోళ్ళు, పురుష పుంగవులు మరీ ఎక్కువయ్యారు. అసలీ అమ్మాయిలు ఎలా భరిస్తున్నారో కానీ… నాకైతే ఈ వారంలోనే రెండు మూడు సంఘటనలు ఒళ్ళు మండేలా చేసాయి.
నిన్నటికీ నిన్న ఒక బేరావ్స్‌గాడు రైలు ఆగినప్పుడు చలాకీగా వెళ్ళిపోతున్న ఒక అమ్మాయిని చూసి నా పక్కన వుండి విజిల్ వేసి వెకిలిగా నవ్వాడు. దానికి ఆ చిట్టి తల్లి అపరాధం చేసిన దానిలాగా తలవంచుకుని వెళుతుంటే…బాధేసింది. వాడు, వాడి చుట్టూ ఒక ఆవారా మూక ఉంది. అందరూ వెకిలి వెధవలే. ‘ఇదేమి పని.. ‘అందామా? అంటే అది ఒక గొడవకు దారి తీసేట్టు ఉంది. అపుడు వాళ్ళతో ఫైట్ చేసే బలం, టైం నా దగ్గర లేవు. బాధ్యతాయుత పౌరుడికి అదొక నిస్సహాయ పరిస్థితి.
మొన్నా మధ్యన ఇంకొకడు…సీటు ఉన్నా నిలబడి పక్క సీట్లో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న అమ్మాయిని తదేకంగా తొంగి తొంగి చూస్తూ…వేరే సీట్లో ఉన్న ఫ్రెండ్‌తో సైగలతో మాట్లాడుతూ వెకిలిగా నవ్వుకుంటున్నాడు. అది మానపసిక రోగం కాక మరేమిటి? వాడికి మాత్రం నవ్వుతూనే .. ‘ఏమన్నా…తన్నులు తినకుండా రైలు దిగేట్టు లేవు.” అని అన్నాను. వాడు గప్చిప్ అయిపొయాడు.
కాస్త శుభ్రంగా, అందంగా ఉన్న అమ్మాయిలు ముస్తాబై తమ పాటికి తాము రోడ్డు పక్కన పోతుంటే…అదే పనిగా కళ్ళార్పకుండా గుచ్చినట్లు చూసే చిత్తకార్తె శునక సంతతిని ఏమి అనాలి? భార్యా బిడ్డలతో షాపింగుకు వెళ్ళినా, హోటల్స్‌కు వెళ్ళినా మనం గమనించవచ్చు.. ఇలాంటి కుసంస్కారులను. అదే పనిగా.. కింది నుంచి పైదాకా అమ్మాయిలను ఎగాదిగా చూస్తుంటారు. ఆ పరిస్థితి వికారంగా ఉంటుంది చూసే సంస్కారవంతులకు. కాలేజ్ స్టూడెంట్స్ తోపాటు, కొందరు మధ్య వయస్కులు కూడా ఈ వెకిలి చూపులు చూస్తూ..ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు. యాసిడ్ దాడి చేస్తేనే హింస అనుకునే స్థాయికి దిగజారాం మనం. ఇప్పుడు జులాయిల చూపులతో అమ్మాయిలు నిత్యం పడుతున్న హింస అంతకన్నా ప్రమాదకరమైనది. మహిళలు ఎప్పటికీ నిస్సహాయులుగా, బాధితులుగా మిగిలిపోయి…మానసికంగా కుంగిపోయే దారుణం ఇది.
అందంగా ఉన్న వాళ్ళను చూడడం…చూసి వదిలెయ్యడం మానవ సహజం కానీ.. కసిగా, కామంతో చూడడం మరీ ఎక్కువైపోతున్నది. నా చిన్నప్పుడు ఎవడైనా.. మా అమ్మ వంక అలా చూస్తే…బలంగా వెళ్ళి గట్టిగా తగలడమో, ”ఏం..బే..’ అన్నట్లు గుర్రుగా చూడడమో చేసే వాడిని. కాస్త దిట్టంగా ఉండే క్రీడాకారుడిని కాబట్టి…అవతలి జులాయి చూపు మరల్చుకొని తనదారిన తాను వెళ్ళిపోయేవాడు.
కాలేజీలో అలా అమ్మాయిలను తదేకంగా సినిమా లెవల్లో చూసే వాళ్ళకు నేను, రఫీ (వీడి పేరు నా కొడుకు పేరులో ఒక భాగం) కొద్దిగా పాఠాలు నేర్పే వాళ్ళం. అమ్మాయిల వంక మరీ వెర్రిగా చూస్తున్న ఒకడు నా దృష్టిలో పడడం, రఫీ వాడిని పక్కకు తీసుకువెళ్ళి ‘హితబోధ’ చేయడం నాకు గుర్తు. మా వీధిలో ఒక అమ్మాయి మీద ‘సరసం’ గా ఒక చిన్న రాయి విసిరిన ఒకడిని నేనూ.. నా మిత్రుడు మోహన్ రావు పట్టుకోవడం, శిక్షగా మేము వాడి సైకిలును మురికి కాలువలోకి విసరడం, వాడు గూండాలతో మా ఇంటి మీదికి రావడం, విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం నాకు గుర్తున్నాయి. ఇలాంటి కోతులు, కామాంధుల విషయంలో బలప్రయోగం తప్పదేమో!
ఈ వెకిలి చూపుల సమస్య మనందరికీ అనుభవమే అయి ఉంటుంది. ఎందుకోగానీ ఇలాంటి కీలకమైన అసభ్య అంశాల గురించి మనం మాట్లాడుకోం. ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించం. మన ఆడపిల్లలకు స్వేచ్ఛ లేని అభివృద్ధి అదేమి అభివృద్ధి? అదేమి సివిలిజేషన్? ఈ సంస్కృతి ప్రబలడానికి.. ఈ దుర్మార్గపు సినిమా జనం ప్రధాన కారణం అని.. అనిపిస్తుంది. నీతి జాతీ లేని ఈ డబ్బు పిచ్చిగాళ్ళు…సృజనాత్మకత ముసుగులో..సినిమాలలో ఈ దొంగ చూపుల సీన్లు బాగా పెడుతున్నారు. అది ఈ మూర్ఖపు యువత, చంచల స్వభావులు ఒంట పట్టించుకుంటున్నారు.
అలాంటి సీన్లను.. బుద్ది తక్కువ టి.వీ. ఛానల్స్ వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతున్నారు. పైగా.. ఈ తతంగాన్ని సిస్సిగ్గుగా గ్లామరైజ్ చేస్తున్నారు. ఈ పోకడను అనుకరించడానికి యువతరం పోటీ పడుతున్నారు.
ఈ బెడద మరీ వెర్రి తలలు వేస్తున్నట్లు నాకు బోధపడింది… పలువురు తెలిసిన అమ్మలక్కలతో మాట్లాడాక. మీరు ఒక్క క్షణం ఆలోచించండి లేదా మీ పక్కన ఉన్న మీ సతీమణినో, కూతురునో, తోబుట్టువునో అడిగి చూడండి… ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందో తెలుస్తుంది. ఇది నిజానికి ఆడ పిల్లలపై జరుగతున్న కనిపించని అమానుష దాడి, చిత్ర హింస. దీనికి అర్జెంటుగా నివారణోపాయం చూడాలి. నాకు తోచిన సలహాలు ఒక ఐదు..చర్చ కోసం.
1. సినిమా వాళ్ళు, టివీ వాళ్ళు కాస్త సంఘాన్ని, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి. ఆడపిల్లలను టీజ్ చేసే ప్రోగ్రామ్స్‌ను నిలిపివేయాలి. అవి పరోక్షంగా స్త్రీలమీద ప్రభావం చూపుతున్నాయని గమనించాలి.
2. వెకిలి చూపులతో హింసించే వారిపై అక్కడిక్కడ ఫిర్యాదు చేయడానికి ప్రతి ప్రధాన రహదారి పైనా ప్రత్యేక పోలీస్ పోస్టులు ఏర్పాటు చేయాలి. దీనికోసం ప్రత్యేక సిబ్బంది ఉండాలి.
3. రోడ్ల మీద జులాయి వెధవలు చూస్తున్నారు కదా… అని తాను అందగత్తెనో, అతిలోక సుందరినో అని అనుకోవడం ఈ ఆడపిల్లలు కూడా ఆపెయ్యాలి.
4. తల్లి దండ్రలు ఇళ్ళలో పిల్లలకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వాలి. అలా పదే పదే చూడడం తప్పని మగ పిల్లవాడికి నూరి పోయాలి. అలాంటి ఇబ్బందికర పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో ఆడపిల్లలకు టిప్ప్ ఇవ్వాలి.
5. ఈవ్ టీజర్లను మన తోటి ప్రయాణికుడు/ప్రయాణీకు రాలు ఒంటరిగా నివారిస్తుంటే లేదా అడ్డుకుంటూ వుంటే.. అతనికి/ ఆమెకు మనం మద్దతు పలకాలి. ఉమ్మడి గళంతో ఈ జబ్బును నివారించవచ్చు.
అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగితే స్వరాజ్యం వచ్చినట్లు.. అన్న ఆ పెద్దాయన మాట అలా వుంచండి. మన ఆడపిల్లలు పగలే రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. కాదంటారా? (ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు బ్లాగ ు సౌజన్యంతో)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags