కల్పన రెంటాల
అజర్ నఫిసీ – ఇరాన్‌కు చెందిన అంతర్జాతీయ రచయిత్రి. ఆమె రాసిన అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్‌గా గుర్తింపు పొందింది. ఆమె కలం నుంచి తాజాగా వెలువడ్డ ఊనీరిదీవీరీ | ఇరాన్లో పుట్టి పెరిగిన ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాల దొంతర. ఇది కేవలం నఫిసీ వ్యక్తిగత జీవితం మాత్రమో, ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర మాత్రమో కాదు. ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర. నఫిసీ కుటుంబ చరిత్ర. ఆమె తల్లిదండ్రుల వ్యక్తిగత సంఘర్షణల నేపథ్యాలు అన్నీ కలగలసిపోయిన మెమొరీస్. మనం సమాజంలోని వ్యక్తులుగా, కుటుంబంలోనూ, రాజకీయ జీవనంలోనూ, సాహిత్యంలోనూ ఎలాంటి విషయాల్ని బైటకు వెల్లడి చేయకుండా నిశ్శబ్దంగా లోపల్లోపలే దాచుకుంటామో బహిరంగంగా ప్రకటించింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా. కుటుంబంలోని రహస్యాల పట్ల ఓ కూతురి మౌనవేదన, ఓ నవయవ్వనవతిగా సాహిత్యంలోని సెన్సువాలిటి పవర్‌ని కనుగొన్న వైనం, ఓ దేశపు స్వాతంత్య్రం కోసం ఓ కుటుంబం చెల్లించిన మూల్యం ఇవన్నీ మనకు ఈ పుస్తకం చదవటం ద్వారా అర్థమవుతాయి.
”చాలామంది మగవాళ్ళు పరాయి స్త్రీల ప్రాపకం కోసం తమ భార్యల్ని మోసం చేస్తారు. కానీ మా నాన్న సంతోషకరమైన కుటుంబ జీవనం కోసం మా అమ్మని మోసం చేశాడు” అంటూ ఈ పుస్తకాన్ని మొదలుపెడుతుంది నఫిసీ. ”ఆయన కోసం నేను బాధపడ్డాను. ఒక రకంగా ఆయన జీవితంలోని ఖాళీల్ని నింపటం అనే బాధ్యతను నాకు నేనే తీసుకున్నాను. నేను ఆయన కవితలు సేకరించాను. ఆయన వాగ్దానాల్ని విన్నాను. మొదట మా అమ్మ కోసం, తర్వాత ఆయన ప్రేమలో పడ్డ స్త్రీల కోసం సరైన బహుమతుల ఎంపికలో ఆయనకు సహకరించాను” అంటూ చెప్పుకొస్తుంది నఫిసీ ఈ పుస్తక ప్రారంభంలో.
అద్భుతమైన కథకురాలు చెప్పిన అందమైన జ్ఞాపకాలు ఈ పుస్తకం. అవి మనసుని మెలిపెట్టి బాధపెట్టే జ్ఞాపకాలు. నఫిసీ ఈ పుస్తకంలో ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో చెప్పటమే కాకుండా మనం ఎందుకు వివిధ దేశాల చరిత్ర చదవటం అవసరమో వివరిస్తుంది. ఏ దేశచరిత్ర తెలియాలన్నా ముందు ఆ దేశ సాహిత్యం చదవటం ముఖ్యమంటుంది అజర్ నఫిసీ. నఫిసీ తల్లి మేధావే కాదు, చాలా కాంప్లికేటెడ్ కూడా. ఆమె తన కలల్లో తనకంటూ ఓ సృజనాత్మక సాహిత్య లోకాన్ని సృష్టించుకొని అందులో బతికింది. ఆమె చెప్పిన కథలు, ఆమె కథనం ఇవన్నీ నఫిసీకి క్రమంగా అర్థమవటం వల్ల ఆ కథనాల్లో దాగివున్న తన తల్లికి సంబంధించిన అసలు విషయాన్ని అవగతం చేసుకోగలిగింది.
నఫిసీ తండ్రి మరో రకమైన ‘నేరేటివ్స్’ వైపు మళ్ళాడు. ఇరాన్ దేశచరిత్ర, సంస్కృతికి సంబంధించిన సంప్రదాయ కథలు ‘షానామే’, (ఐనీబినీదీబిళీలినీ ఁ పర్షియన్ రాజుల గురించిన పుస్తకం) వైపు మొగ్గు చూపి తన పిల్లలను పసితనం నుండి ఆ కథల ద్వారా మంత్రముగ్ధుల్ని చేసేవాడు. నఫిసీ తండ్రి ఇతర స్త్రీలతో పరిచయాలు పెంచుకొని, వారితో సంబంధాలు పెట్టుకోవడం గమనించినా, పసితనం నుంచి నఫిసీ ఈ రహస్యాలన్నింటినీ తల్లి దగ్గర నుంచి దాచిపెట్టింది. ఈ ప్రభావం వల్ల నఫిసీ తర్వాతర్వాత రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, వ్యక్తిగత విషయాల్లో కూడా అన్యాయాల్ని ఎలా మౌనంగా ఎదిరించకుండా వుండిపోయిందో పాఠకులకు అర్థమవుతుంది.
ఈ పుస్తకం బలమైన చారిత్రక అక్షరచిత్రం – ఒక కుటుంబంలోని మార్పు, ఒక దేశంలోని రాజకీయ వ్యవస్థ మార్పు – రెండూ ఎలా కలగలిసి వుంటాయో ఈ ‘మెమోయర్’ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నఫిసీకి ఇష్టమైన ఇరాన్, మనందరం కూడా ప్రేమించే ఇరాన్ క్రమేపీ ఒక మతపరమైన నిరంకుశ, నియంతృత్వ పాలనలోకి ఎలా మళ్ళిందో మనకు తేటతెల్లంగా అర్థమవుతుంది. ఇరాన్లో స్త్రీలకున్న ఛాయిస్‌లపై చాలా లోతైన, వ్యక్తిగత విశ్లేషణ చేసింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా. వీటి ద్వారా నఫిసీ భిన్నమైన జీవితాన్ని ఎన్నుకోవటానికి ఎలా వుత్తేజపరిచిందో చెపుతుంది. ఓ స్త్రీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవి. వ్యక్తిగత, కుటుంబ, కల్లోలిత మాతృభూమి జ్ఞాపకాలివి. కథలు చెప్పటం ఆ కుటుంబంలో అందరికీ వెన్నతో పెట్టిన విద్య. నఫిసీ తల్లి తన అసంతృప్తులను తప్పించు కోవటానికి తన వూహాప్రపంచాన్ని వాస్తవిక ప్రపంచంగా పిల్లలకు కథలుగా చెప్పేది. నఫిసీ తండ్రి ఇరాన్ దేశ రాజుల చరిత్రను, పర్షియను సాహిత్యాన్ని పిల్లలకు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు కథలుగా చెప్పేవాడు. నఫిసీ తల్లి కథలు రాయదు కానీ, తన గత జీవితాన్ని కథలుగా మలిచి పిల్లలకు చెప్పేది. ప్రతి కథ చివర్లో ఆమె ఇలా ముగించేది ”అయితే నేనొక మాట కూడా అనలేదు. నిశ్శబ్దంగా వుండిపోయాను” అని. నఫిసీ తల్లి నిజంగానే బలంగా నమ్మేది ”తనెప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పలేదని”. అయితే తనదైన శైలిలో ఆమె ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంలోని గత స్మృతుల గురించే పిల్లలతో మాట్లాడేది. వ్యక్తిగత విషయాలు బైటకు వెల్లడి చేయకపోవటమనేది ఇరానీ సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశం. నఫిసీ తల్లి ఎప్పుడూ అంటుండేదట… ”మన మురికి దుస్తుల్ని మనం బైట ఆరెయ్యం” అని. పైగా వ్యక్తిగత జీవితాలనేవి అల్పమైన విషయాలతో కూడుకొని ఉంటాయి. వాటి గురించి రాసుకునేంత ఏముంటాయి? అందరికీ ఉపయోగపడే జీవితచరిత్రలు ముఖ్యమైనవని నఫిసీ తల్లి అభిప్రాయం. అయితే నఫిసీకి తెలుసు ఇక ఎప్పటికీ తాను నిశ్శబ్దంగా వుండకూడదని…అందుకే తన గురించి, తన తల్లిదండ్రుల గురించి, తన కుటుంబాన్ని గురించి, తన దేశాన్ని గురించి, ఇరాన్ రాజకీయ వ్యవస్థ గురించి అన్నింటి గురించి బాహాటంగా ఈ పుస్తకంలో మాట్లాడేసింది.
అందుకే నఫిసీ అంటుంది ”మనం నిశ్శబ్దంగా వుంటున్నామనుకుంటాం కానీ నిజంగా వుండం. ఎలాగంటే ఏదో ఒక రకంగా మనకేం జరిగిందో అన్నదాన్నిబట్టి మనమెలా మారామో, మనమెలా రూపుదిద్దుకున్నామో అన్నది మనం ఏదో ఒక రకంగా వ్యక్తీకరిస్తూనే వుంటాము” అని. నఫిసీ తండ్రి పర్షియన్ సాహిత్యంలోని సంప్రదాయ కావ్యాల ద్వారా ఆ దేశ చరిత్రను తన పిల్లలకు కథల రూపంలో అందించాడు. ఆ సాహిత్యం ద్వారానే వాళ్ళకు ఇరాన్ దేశ చరిత్ర గురించి అర్థమైంది. అందుకే నఫిసీ అంటుంది పిరదౌసినీ మర్చిపోవడమంటే ఇరాన్‌ని నిర్లక్ష్యం చేయడం అని. ఇటీవల ఆస్టిన్‌లో యూనివర్సిటి ఆఫ్ టెక్సాస్ వారు అజర్ నఫిసీతో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఇదే మాట చెప్పింది. మన దేశ సాహిత్యకారుల్ని గుర్తుంచుకోవడం, వారి రచనల్ని మననం చేసుకోవడమంటే మాతృదేశంపట్ల మనకున్న భక్తిప్రపత్తులను పరిపుష్టం చేసుకోవడమే అంటుంది నఫిసీ తన ప్రసంగంలో, తన పుస్తకంలో, తన మాటల్లో…
ఈ పుస్తకాన్ని ఒక రాజకీయ లేదా సాంఘిక కామెంటరీ లాగానో, లేదా ఉపయోగపడే జీవితచరిత్రలాగానో వుండాలని నఫిసీ కోరుకోలేదు. ఆమె ఒక కుటుంబ కథ చెప్పాలనుకున్నది. ఆ కథ ద్వారా ఇరాన్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర తెలియచెప్పాలన్నది ఆమె వుద్దేశ్యం. అది ఖచ్చితంగా నూటికి నూరుపాళ్ళు నెరవేరింది. ఇరాన్ వున్నంతకాలం చరిత్ర, సాహిత్యం రెండూ అజర్ నఫిసీని మర్చిపోవు. మర్చిపోలేవు. (తూర్పు-పడమర బ్లాగ్ నుండి)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
అజర్ నఫిసీ ని చదివిన ఫీలింగ్ తెప్పించిన కల్పన కి హౄదయపూర్వక మైన ధన్యవాదాలు !ప్రపంచం లోని ఎంత గొప్ప దేశమైనా సినిమా కళ ను మాత్రం ఇరాన్ నుంచి నేర్చుకోవలసిందే!బోలెడన్ని ఇరాన్ సినిమాలను చూడడం వల్ల ఇరాన్ దేశం ,ఇరాన్ ప్రజలూ చాలా ప్రియమైన వాళ్ళనిపిస్తారు . సాహిత్యాన్ని కూడా పరిచయం చేసిన కల్పనకి థాంక్స్! .