స్థిరీకృతరూపం

డా. శిలాలోలిత
ఈ ప్రపంచంలో
పుట్టడమే నీ ఘనత
నిన్ను మోసి, కని, లాలించి ప్రేమించి
నీ చేతే ఛీత్కరింపబడడం ఒకప్పటి స్థితి
రెండు హృదయాల
రెండు జీవితాల
రెండు సూత్రాల కలయిక పెళ్ళి
ఆ పెళ్ళప్పుడే నువ్వు నేర్చుకున్న మొదటిమంత్రం
యూజ్‌ అండ్‌ త్రో
ఉపయోగించుకో, ఆనక విసిరి పారేసుకో
అన్ని చట్టాల, చుట్టాల అండదండలు నీకున్నాయ్‌
నువ్వేం చేసినా, నిన్ను మోసే మహా మహులున్నారు
నా శరీరం
నిన్ను కొనుక్కున్నా
గుత్తాధిపత్య మంతా నీదే
‘దిస్‌ ఏరియా బిలాంగ్స్‌ టు మి’
అని అనుకునే నా అధికారపు పట్టా
సమాజం నీకెప్పుడో ఇచ్చేసింది.

అందుకే చాన్నాళ్ళుగా
పుడుతూ, పుడుతూ, మళ్ళీ పుడుతూ
స్త్రీ శరీరాన్నీ, బుద్ధీనీ ఏలుతూనే ఉన్నావు
మరి, ఇప్పుడో
విసిరి పారేస్తే మూలాన పడి వుండదు
అంతే వేగంగా ప్రశ్నతో మొలకెత్తిన
శిరసెత్తిన స్త్రీ కన్పిస్తుంది
ఈ శరీరాన్ని అనుభవిస్తాను
కాల్చి కూల్చివేసే హక్కునాదే అన్న నీ కేకకి
పొలికేకలు జవాబిస్తున్నాయి.
ఈ శరీరం మీద సమస్త హక్కులూ నావే
ఈ మనసు నాదే
నా ఊహాల రూపశిల్పిని నేనే
నువ్వూ నేనూ కలిసుందాం అంటేనే
సమభాగస్థులమంటేనే
నీకూ నాకూ సంధి లేకుంటే
నువ్వూ నేనూ విడి విడి మనుషులమే

డబ్భే విలువనుకుని
మనసు విలువ, మనిషి విలువ
తెలీని అజ్ఞానాహంకారంలో ఉన్నంత కాలం
నువ్వంతే-
రక్తసిక్తదేహాలతో మొర పెట్టుకోవడం లేదిక
స్వేచ్ఛా విత్తనంతో మొలకెత్తి నిలిచిన మహావృక్షాన్ని
ప్రశ్నించే చూపుడు వేలు
ఇప్పుడు నోటి మోహాన్ని తొడుక్కుంది
మాట్లాడుతోంది.
అక్షరంతో మాట్లాడుతోంది.
వినబడడంలేదా?
మరో ప్రపంచంపు ఆ శబ్ద ఘోష? నేను మనిషిని
వ్యక్తిత్వ స్థిరీకృతరూపాన్ని
పరిపూర్ణ వ్యక్తినిప్పుడు
సమాజంలో జీవించాల్సింది కూడా మనుషులమే
ఇప్పుడు శరీరమంతా కళ్ళు, చెవులు నిండి వున్నదాన్ని
శరీరపు భాషను వినగలుగుతున్నాను.
ప్రకంపనాలను చూడగలుగుతున్నాను
నువ్వు చెప్పిన ఆడదానిగాకాక
మనిషిగా స్ధిరపడినదాన్ని
ఇవ్వాల్టి ‘మానవి’వి నేను.
రేణుక అయోల
కవిలోకం
కవులు ఎప్పుడూ ఏదో లోకంలో
విహరిస్తూ కనిపిస్తారు
చరిత్రలు తిరగవేస్తూ కాలాన్ని నమిలేస్తూ
జనం చుట్టూ జనం మధ్య తిరుగుతుంటారు
లోకం చుట్టూ దారాలల్లుకుంటూ
సాలెగూడులో ఈగల్లా చిక్కుకుపోతుంటారు
కవిత్వదాహంతో అలమటిస్తూ
పుస్తకాల దొంతరల్లో మగ్గి పోతుంటారు
కవిత్వంతో నవ్వుతూనే ఆగిపోతారు
నిశ్శబ్ధంగా తిరుగుతుంటారు
ఆగిపోని కవిత్వం లోపల ఏరులై ప్రవహిస్తుంటుంది
కవులు పసితనపు పక్షులను ఎగురవేస్తారు

పసిపిల్లల నవ్వులని పక్షులలో చూసుకుంటారు.
పువ్వులను పిల్లలుగా భావిస్తారు
ఎండిపోయిన పూలగింజలను ఏరుకుని
మళ్ళీ కవిత్వాన్ని పూయిస్తారు
తేమలేని జీవితంలో కవిత్వాన్ని నాటుకుంటారు
కవిత్వం నీటి తడితో లోలోపల దాక్కుంటారు
చిట్టి మొలకలవైపు, గడ్డి పువ్వుల వైపు చూసి సంబరపడి పోతారు.
కవులు ఏ కాలంలో నడుస్తున్నా
వారు పాతిన గింజలవంటి
చరిత్రలు తిరగవేస్తూ
జీవితంమీద నమ్మకాన్ని కల్గిస్తుంటారు.

డి.గాయత్రి
నేను నేనేనా!
నేను నేనుగానే పుట్టాను
అందరిలాగే పెద్దయ్యాక అదవ్వాలని ఇదవ్వాలని
ఎన్నెన్నో..కలలు కన్నాను
పదిమందికీ చెప్పాను కూడా
నా ముద్దు ముద్దు మాటలకు అప్పుడందరూ మురిసిపోయారు
ఏమెందో ఏమో…

బాల్యం కరుగుతున్న కొద్దీ…
పెరుగుతున్న ఆశలకు అడ్డు కట్టవేసి
నా భవిష్యత్తును కట్టడి చేసింది అమ్మ
ఎదుగుతున్న కొద్దీ…
ఆడపిల్ల’ఆడ’ పిల్లే కాని ‘ఈడ’ పిల్ల కాదని
నా అక్షరజ్ఞానానికి కళ్ళెం వేశాడు నాన్న
యౌవనంలో అడుగుపెట్టేసరికి..
ఆడపిల్లకు ఒక ముద్ద అన్నం పెట్టినా దండగేనని
‘మూడు ముళ్ళు’ వేయించి చేతులు దులుపుకున్నాడు అన్న

ఇప్పుడైనా నా ఆలోచనలకు ప్రాణం పోద్దామంటే
నిద్రలేచింది మొదలు తిరగి నిద్రపోయేవరకు
ఇంటిచాకిరీతో పాటు తప్పని అత్తామామలు సాధింపులు
ఇది చాలదన్నట్లు
భర్త వేధింపులు…ఆడపిల్లల చాడీలు…
ఎంతైనా వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ కదా!
చివరికి నా పిల్లలకు కూడా నేనంటే లోకువే
నా కన్నీటి పర్వాన్ని అమ్మనాన్నలకు వినిపించినా…
అన్నకు చెప్పినా…ఫలితం శూన్యం
ఇప్పుడేం చేయాలి?
నా బ్రతుకిలా తెల్లవారాల్సిందేనా?
జీవితమంటే ఇంతేనా ??
పుట్టినింట్లోనూ..మెట్టినింట్లోనూ..ఎక్కడా..
నా ఆశలకు ఆలోచనలకు విలువే లేదా?
నేనూ ఒక మనిషినేగా??
నేను చేసిన తప్పేంటి?
ఆడపిల్లగా పుట్టడమేనా?
ఏదీ.. నే కలలు కన్న నా అందమైన జీవితం?
ఎక్కడ?
ఎలా ఉండాలనుకున్నాను?
ఎలా ఉన్నాను?
ఏమిటిది?
క్రమక్రమంగా ఇంత మారిపోయాను
కాదు కాదు మార్చారు నన్ను
రూపురేఖల్లో… ఆలోచనల్లో…
నేను నేనులా లేనే?
నేను నేనేనా???
ఏమో???

డా. సూర్యా ధనంజయ్‌
బంజారా నానీలు
గుండె నిండా
‘తండా ‘ జ్ఞాపకాలు
ఎన్నటికీ వాడని
మమతల పూలు

పెప్సీలెందుకు పనికొస్తాయి
యాడి చ చేతి
లాప్సిచచ ముందు ( చ = అమ్మ  చచ = పాయసం)

కట్టెలమోపులకే
పైసలిచ్చారు
మరి అంతదూరం
మోసుకొచ్చినందుకు?

ఆడపిల్ల
అమ్మకు బరువైంది
పేదరికం
ఎంత పని చేయించింది!

ఆ తండా నిండా వితంతువులే
మద్యం చెట్టుకు వేళ్ళాడే
జీవచ్ఛవాలే!

ఆమె చెంపలకు
‘టోప్లీ’లుచ  అందం
గుండెలో మాత్రం
కష్టా గుండం (చ=ఆభరణం)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.