సుజాతపట్వారి
అనాదిగా
తపస్సు చేసుకుంటున్న
ఋషిలా
పురాతన ఆలయం
గర్భగుడి చీకటిని
పరిమళాల్తో వెలిగిస్తున్న
రంగురంగుల పూలు
ద్వారానికి చేయి ఆన్చి
కొక్కేనికి తగిలించిన
విల్లులా
గిరిజన యువతి
శఠగోపాలు, ఆచారాలు
పూజారికి కానీ
మనిషికి, ప్రకృతికి నడుమ
ఓ స్పృహ
ఓ అనుభవం చాలు
ఎక్కడున్నా, ఎక్కడైనా
కొప్పర్తి వసుంధర
బొమ్మలం, అమ్మలం
ప్రేయసులం, ధర్మచారిణులం
విద్యార్థినులం, ఉద్యోగినులం
గృహిణులం, వినమ్రులం
ఎక్కడున్నా, ఎక్కడైనా
అన్నెం పున్నెం ఎరుగని అబలలం
గృహహింసో, లైంగిక వేధింపో
కట్నమో, యాసిడ్‌దాడో, ప్రేమోన్మాదమో
ఏదో ఒక దాడికి గురవుతున్న బాధితులం
మనకంటూ వేదిక కావలసినవాళ్ళం
కలసికట్టుగా ఆవేదనకు కలబోసుకోవలసిన వాళ్ళం
గళం విప్పి మరో తరాన్ని మనలాకాకుండా
కాపాడవలసిన వాళ్ళం.
రొట్టె మరియు రోజాపూలు
ఆంగ్లమూలం : ‘జేమ్స్ ఒప్పెన్ హీమ్’
తెలుగు అనువాదం : డా|| ఎస్వీ సత్యనారాయణ
లక్ష చీకటి పాకశాలల్ని
వేలాది బూడిదవర్ణపు మిల్లుల ధాన్యపుగదుల్నీ స్పృశిస్తూ
హఠాత్తుగా వచ్చి సూర్యుడు వెలిగించే
అందమైన ఉషోదయాన
మేం వస్తాం కదం తొక్కుతూ – పదం పాడుతూ
మా పాటల్ని జనం వింటారు
”మాకు రొట్టె కావాలి – వికసించే కుసుమాలు కూడా కావాలి
మాకు రొట్టె కావాలి – రోజాపూలు కూడా కావాలి”.
మేం కదం తొక్కుతూ పదం పాడుతూ
పురుషుల కోసం కూడా పోరాడుతాం
వాళ్లు మా సంతానమే కదా!
మేం వాళ్లకు తల్లులమే కదా!
పుట్టుక మొదలుకొని బతుకు ముగిసేదాకా
అలుపెరుగక సాగుతాం
మా దేహాలే కాదు – హృదయాలు కూడా
ఆకలితో అలమటిస్తై
”మాకు రొట్టెలివ్వండి
వికసించే కుసుమాల నివ్వండి”.
మా ఈ మహాప్రస్థానంలో అమరులైన
అసంఖ్యాక మహిళల దుఃఖం ధ్వనిస్తూ ఉంటుంది
అనాదిగా వేస్తున్న వాళ్ల ఆకలికేక ప్రతిధ్వనిస్తూ ఉంటుంది
ఒక చిన్న కవిత కళ, కాసింత ప్రేమ మరియు సౌందర్యం
వారి బానిస ఆత్మలకు తెలుసు
అవును మేం పోరాడేది రొట్టెకోసం
అంతేకాదు వికసించే కుసుమాల కోసం.
కదం తొక్కుతూ పదం పాడుతూ
మేం మంచి రోజుల్ని సాధిస్తాం
స్త్రీలు వెలిగిపోవడమంటే
జాతి ప్రకాశించడమేనంటాం
ఇకపై బానిసత్వానికి వీల్లేదు
పదిమంది కష్టంతో
ఇకడు సుఖించడానికి వీల్లేదు
జీవనమాధుర్యాన్ని అందరమూ కలిసి ఆస్వాదిద్దాం
”మనకు రొట్టె కావాలి
వికసించే కుసుమాలు కూడా కావాల”ని నినదిద్దాం
అవును మనకు రొట్టె కావాలి
రోజాపూలు కూడా కావాలి.
నాడు-నేడుటపెళ్ళిళ్ళు.కామ్
బుచ్చిరెడ్డి
ఆ రోజే పెళ్లి
ఆ రోజే విందూ
ఆ రోజే మొదటి రాత్రి
బంధుమిత్రులు రావడం
గంటలో మాయమవడం
మారిన కాలం
మారుతున్న ప్రపంచం – రోజులు
లాస్‌వెగస్‌లో
30 నిమిషాల్లో మూక ఉమ్మడి పెళ్ళిళ్ళు
అంతే సమయంలో విడాకులు??
నేడు
డేటింగ్‌లు – డిన్నర్లు – షాపింగ్‌లు
ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కోసం
కలిసి కాపురాలు చేస్తూ – ఏండ్లూ గడుపుతూ
ఫిఫ్టీ-ఫిఫ్టీ చాన్స్‌లతో
కొన్ని క్లిక్ అవుతాయి – ముడి పడుతాయి
కొన్ని తిరిగి విడిపోవడాలు
మళ్లీ వేట – వెతుకులాట
కొత్త బోయ్ ఫ్రెండ్ – కొత్త గర్ల్ ఫ్రెండ్ కోసం ??
కులాల పట్టింపులు అంతరించిపోయినా
ఆరు అంకెల ఆదాయం – స్టాటస్
గుర్తింపు గల వాళ్ళతో
జోడీ కోసం – గాలింపు
నాడు –
ఆస్తుల కోసం
బంధుత్వాలు నిలబడటం కోసం
తాతలు ఉన్నపుడే – వాళ్ళ కళ్ళముందు
పెళ్ళిళ్ళు జరపాలని
వరకట్నం కోసం లావాదేవీలు
తాహతు – విద్య – కాన్ధాన్‌లను బట్టి
వరుని రేటు నిర్ణయం
దానికీ తోడు
ఆలు కట్నం
ఆడబిడ్డ కట్నం –
వీటికి ముందు
పెళ్లి చూపులు
అమ్మాయితో ఇంటర్‌వ్యూలు
నడక
మాట
పాట – టెస్ట్‌లు
ఎవరు – ఎంత – ఏ తీరుగా పెట్టాలో
పెళ్లి ఎలా చేయాలో నిర్ణయాలు
జెనీవా వొప్పందాలు
అన్ని ముట్టే వరకు
ఇరువైపులా –
ఇచ్చి పుచ్చుకొనే చర్చలు
కుదిరేదాక – శిఖరాగ్ర సమావేశాలు
తేదీ నిర్ణయంతో
పెళ్లి పత్రికలు అచ్చు వేయడం (దేవుని బొమ్మలతో)
వాటికి పసుపు – అత్తరు పెట్టి
సుంకరితో
బంధుమిత్రులకు పంపకాలు
పందిళ్ళు – షాపింగ్‌లు
కంచి పట్టుచీరల గిరాకీ
నిశ్చితార్థం చీర
పెళ్లి చీర – నాగవల్లి చీర
మొదటి రాత్రి చీర
ఆడబిడ్డలకు చీరలు – ఇలా కొనుగోలుతో
ఇచ్చేవారి గొప్ప
తీసుకొనే వారి గొప్ప
ఇవి ప్రదర్శించుకోవడం కోసం
ఉబులాటం – తాపత్రయం
అట్టహాసంగా విందులూ – కానుకలు
కోట్ల రూపాయిల ఖర్చుతో
గౌరవాలకు
మర్యాదలకు
ఆదరణలకు లోటు లేకుండా
జరుగుతున్న – జర్పుతున్న పెళ్ళిళ్ళు
నిలుస్తాయా-
నిలువకపోతే –
కాలం నిర్ణయిస్తుంది
సమాన హక్కులు – ఫెమినిస్ట్‌లు
గగ్గోలు పెట్టినా
మారని సాంప్రదాయాలు
అవసరం లేని
అక్కరలేని
అసలే లేని –
విలువలు – చాదస్థాలతో
మార్పు ఎప్పుడు?? ఎన్నడు???
(హార్యానాలో ఒక నాయకుడు – తన కొడుకు పెళ్లి – 250 కోట్లతో ఆవార్త చదివీ….)