పి. సత్యవతి
అందరికీ అన్నీకొన్నాం. అమ్మకే ఏమీకొనలేదు అవును. అమ్మకేం తీసుకెళ్ళాలి? పగడాల దండలా? ముత్యాల సరాలా? యాభై దాటిన ఆడవాళ్లు వేసుకునే బహుళోపయోగ వైటమిన్బిళ్లల పెద్ద డబ్బానా? ఎలర్జీలు రాని, కడుపులో తిప్పని అతిసున్నితమైన పరిమళమా? ల్యాప్టాపా? ఐ ఫోనా?
రెండేళ్ళయిపోయింది మాతృభూమికి వెళ్ళొచ్చి. ఇంకొక ఆదివారంవుంది కొనడానికీ ప్రయాణానికీ – ఆలోగా ఆలోచించుకోవచ్చులే అనుకుంది నందిని. అమ్మ ఏమీ తనకోసం వుంచుకోదు. అన్నీ ఇచ్చేస్తుంది అందరికీ. కొందరమ్మలు అలాకాదు అమ్మాయి అమెరికానించి తెచ్చిందని అపురూపంగా దాచుకుంటారు. సూట్‌కేసులు ప్యాక్ అయినా అమ్మకేం కొనాలో తెలియనే లేదు. ఆవిడేమో నాకది కావాలి ఇది కావాలని అడిగే అమ్మ కానేకాదు కదా!
”ఇంతకీ అమ్మమ్మకీ, నానమ్మకీ ఏం కొన్నావ్?” అని అడిగింది నందినీసుత.
”అత్తయ్యకి ఏం కొనను?” అని నందిని అడిగితే ”అదేమో నాకేం తెలుసు” అని తెల్లముఖం పెట్టేసాడు నందినీ వల్లభుడు.
”ఈసారి నేను నానమ్మ దగ్గరే ఎక్కువ రోజులుంటాను” అని ప్రకటించాడు సుపుత్రుడు.
”వెళ్లడం మనకిబానే వుంటుంది. అక్క డుండడం ఇంకా బాగుంటుంది. కానీ మనం వెళ్ళే ముందే వొచ్చేముందూ వాళ్ళకి ఎంతపనో పాపం” అంది నీనా, నందినీ సుత. నానమ్మ గుర్తొచ్చి వాళ్ళిద్దరి పట్ల ఆ పిల్ల చూపిస్తున్న చింతకి తనకి సిగ్గేసినట్లనిపించింది. పన్నెండేళ్ల తన కూతురికి వున్న ఆలోచన చదివే కళ్లజోడు కొనుక్కున్నాక కూడా తనకి రాలేదు అనుకుంటూ వుండగా ఫోన్ మోగింది. ఇండియా వెడుతోందంటే అవీ ఇవీ పట్టుకుపొమ్మని బ్రతిమిలాడే వాళ్ళల్లో రాధిక చాలా ముఖ్యమైనది జిగిరీ దోస్తు కూడా – రాధిక వాళ్ళమ్మకి విదేశీ వస్తువులమీద బహుమోజు. ఇండియాలో బాగా దొరికేవైనా సరే అమెరికావి కావాలి అదొక తృప్తి అమ్మాయి పంపించిందంటే అందరికీ చెప్పుకోడానికి కాస్త గర్వంగా పనికి భంగం లేకుండా స్పీకర్ ఆన్ చేసింది నందిని.
”ఈసారి మా అమ్మని బాగా డిజప్పాయింట్ చేశాం. మేం రావట్లేదంటే ఆవిడ నీరసపడిపోయింది. బోలెడన్ని పచ్చళ్ళు పెట్టిందట. మామిడిరసం తీసి ఫ్రీజ్ చేసిందట. నీకు తెలుసా ఉన్నది కాక ఇంకో ఫ్రిజ్ కొనిపెట్టింది. అచ్చంగా పచ్చళ్లకి బయట జాడీల్లో వుంటే రంగు మాసిపోతాయట ప్రిజ్‌లో వుంటే ఫ్రెష్‌గా వుంటాయట. పిల్లలకి టపాకాయలు కొని దాచిందట. బాత్రూముల్లో కమోడ్లు మాసిపోయాయని కొత్తవి వేయించిందట. వంటిల్లంతా బాగా వ్యాక్యూం చేయించి మళ్ళీ పెయింట్ వేయించిందట. ఒకటి కాదు ప్రతి రెండేళ్లకీ ఈ హడావిడంతా వుండేదే – అఫ్కోర్స్ పచ్చళ్ళు నువ్వు తెస్తావనుకో. సరేలే ఆవిడేవేవో అడిగింది అన్నీ ఫెడేక్స్లో వేసేసాను. నీకు రేపటిలోగా వచ్చేస్తాయి పట్టుకెళ్ళివ్వు. నా పేరు చెప్పి మామిడిరసం లాగించెయ్” అని ముక్తాయించింది. ఈ నెచ్చెలికి ఎప్పుడూ సూట్‌కేసులో సగం కేటాయించాల్సిందే.
”ఇవ్వన్నీ మన నానమ్మ కూడా చేస్తుందిగా వాళ్లమ్మ గొప్పేమిటీ” అన్నాడు నందినీ సుతుడు.
”నాకీ స్పెషల్ ట్రీట్మెంట్ నచ్చదు, అందరిలాగా ఫ్రీగా వుండాలి” అంది నీనా.
పడుకుందే కానీ ఎంతసేపటికి కళ్ళు మూతపడలేదు నందినికి. ఇండియా వెళ్ళేముందు ఎప్పుడూ ఉత్సాహంతో పాటు తెలీని ఒత్తిడేదో వస్తుంది – చప్పున తాతయ్యా అమ్మమ్మా మనస్సులోకొచ్చేశారు.
”హైకోర్టులో పని బడిందమ్మా అందుకని ఇట్లా దిగిపోయాను పొద్దున్నే” అనేసి నాలుగయిదు నెలలకోసారి ఉదయం అయిదుగంటలకే కాలింగ్‌బెల్ మోగించేవాడు తాతయ్య – ఆ వెనకే చిన్న సంచీ, రెండు టిఫిన్ క్యారియర్లూ పుచ్చుకుని అమ్మమ్మ – నన్ను విడిచి నువ్వుపోలేవులే అన్నట్టు ఒక విజయగర్వం ఆవిడ మొహాన.
”అట్లా చిక్కిపోయావేమే” అని అమ్మని పరామర్శ చేస్తూంటే నందినికి నవ్వొచ్చేది. అమ్మ ఈ మధ్య బాగా లావయిపోయింది. తగ్గడానికి తంటాలు పడుతోంది కదా మరి!
వచ్చినదగ్గర్నుంచీ అమ్మమ్మ హడావుడిపడేది. అమ్మని ఆఫీస్‌కి పంపించి ఇల్లు సద్దించేది. పొడులు కొట్టేది. మిరపకాయలు తొడిమెలు తీసేది. అమ్మ చీరెలకు గంజి పెట్టించేది. నాన్న కిష్టమని పాలతాలికలు అమ్మకిష్టమని మురుకులూ పిల్లలకోసమని వెన్న వుండలూ ఉన్న నాలుగురోజులూ ఊపిరాడకుండా పొయ్యి పట్టునే వుండేది. అమ్మమ్మ ఇంట్లో పెద్దబాదం చెట్టుండేది. దాని కాయలన్నీ పండి ఎండి నల్లగా అయిపోయి రాలిపడేవి. అవ్వన్నీ ఏరి ఒక గుండ్రాయితో కొట్టి పప్పులు తీసి సీసాలో పోసి తెచ్చేది.
”అమ్మమ్మ పెద్దదైపోయినప్పుడు ఆవిడకి బాగా సేవ చేస్తాను” అనేది అమ్మ. అమ్మమ్మ పెద్దదయింది కానీ సేవలక్కర్లేకుండానే వెళ్లిపోయింది. అమ్మకి చాలారోజులు తను తల్లికి ఏమీ చెయ్యలేకపోయాననే అపరాధభావం వుండేది. అమ్మమ్మ ఇలా వూరికే వెళ్ళిపోలేదు. తన లక్షణాలైనా ప్రేమ శ్రద్ధ, కూతురి గుండెలో నింపి పోయింది. తన ఇంటర్ చదువు మొదలు అమ్మ చేసిన సేవలు అన్నా? ఇన్నా? ఒక పక్క బాగా చదువుకోమని ప్రోత్సాహం, మరోపక్క మార్కులే ముఖ్యం కాదని కౌన్సిలింగూ చేసేది. హాస్టల్లో వుంటే ప్రతి మూడు రోజులకీ ఒక పెద్ద ఉత్తరం వ్రాసేది. ఇంటి దగ్గర విషయాలన్నీ పూసలు గుచ్చేది. పిల్లలు పుట్టినప్పుడు ఈ చలికి తట్టుకుని చెరి ఆర్నెల్ల చొప్పున అమ్మా అత్తయ్యా ఎంత కష్టం చేశారు? ఇండియాలో వుంటే పిల్లల్ని కనడానికి పుట్టిళ్లకి పోతారు. అక్కడ అమ్మలకది స్వంత ఇల్లు. స్వంత వూరు. ఇక్కడ స్వదేశం కాదు స్వంత ఇల్లు కాదు, నూలు చీరెలు కట్టుకోడానికి లేదు. అవి ఉతికి డ్రాయర్లో వేస్తే ఉండలు చుట్టుకుపోతాయి. అలవాట్లేని సింథటిక్ చీరెలతో ఆరేసి నెలలు అవస్థ. అమ్మ ఎప్పుడూ ఆఫీస్‌కి గంజిపెట్టిన బెంగాల్ కాటన్ చీరెలు, వెంకటగిరి చీరెలు, కంచి కాటన్ చీరెలే కట్టేదీ. నెలకోసారి అదొక యజ్ఞం. డాబా కడిగించడం, గంజి ఉడికించడం, నేలమీద వాటిని పట్టడం.
అంతేనా? అమ్మకి ఎంతమంది స్నేహితులో చెప్పా పెట్టకుండా వచ్చేసి కబుర్లు పెట్టుకుంటూ వుంటారు. ఎవరికో అవసరం వచ్చిందని చటుక్కున ఆటో ఎక్కేసి పోతూ వుండేది. ఇక్కడ కంప్యూటరే ఆవిడకి కాలక్షేపం – చాలా గిల్టిగా అనిపించేది. తను తీసుకెడితేనే గడప కదలడం – అలాగే పిల్లలకోసం పదిసార్లు వచ్చింది – సర్దుకుపోవడం, అలవాటుపడ్డం అమ్మల లక్షణం. ఇప్పుడు తను వెళ్ళంగానే స్వంత పనులన్నీ పక్కన పెట్టి తనమీదే శ్రద్ధ పెడుతుంది. అమ్మయినా అంతే అత్తయ్య అయినా అంతే – వాళ్ళు అంటారు ”ఎప్పుడంటే అప్పుడు రారు కదమ్మా?” అని తమని చూడగానే వాళ్ల కళ్ళు తడిగా వెలుగుతాయి. ఏ రోజుకారోజు పిల్లలుండే రోజు ఒకటి తగ్గిందని లెక్కేస్తారు. ఇంతకీ వాళ్లకేం తీసుకువెడితే బాగుంటుందో అర్థం కావటం లేదు.
ఏదో స్ఫురించినట్లై, లేచి కూచుని నెట్లో చొరబడింది నందిని. తెల్లవారుతూనే ఒక నూతనోత్సాహం కలిగింది. విమానం ఎక్కేవరకు అంతా హడావిడే. పిల్లలిద్దరూ కల్పించుకుని సహాయం చేస్తుంటే అనిపించింది. ఆ వయసులో ఇటు పుల్ల తీసి అటు పెట్టనిచ్చారా తనని అని. తన కన్న తన పిల్లలే నయం –
అనుకున్నట్లే అమ్మా నాన్నా అత్తయ్యా మామయ్యా అంతా ఏర్పోర్ట్ కొచ్చారు. అనుకున్నట్లే ఇల్లంతా అద్దంలా పెట్టారు. అనుకున్నట్టే బాత్రూమ్లో టాయిలెట్ పేపర్, డైనింగ్ టేబిల్ మీద పేపర్ నాప్కిన్లు అన్నీ అమర్చింది అమ్మ. అనుకున్నట్లే నెలరోజులకోసం ఒక డ్రయివర్ని, ఒక వంటావిడని పెట్టారు. అంతా అనుకున్నట్లే. కబుర్లూ సూట్‌కేసులు విప్పటాలూ జెట్ల్యాగులూ అయిపోయాక.
”మా అమ్మా నాన్నా రేపు వెళ్ళిపోతారేమో వాళ్లని కాసేపు బయటికి తీసుకుపోతాను” అన్నాడు నందిని సహచరుడు.
”ఎవరూ వెళ్ళరు. నేనీసారి మీ అమ్మనీ మా అమ్మనీ రాధికా వాళ్లమ్మనీ ఇంకో ఇద్దరు వాళ్ళ స్నేహితులనీ కలిపి టూర్ పంపిస్తున్నాను. ఎల్లుండే ప్రయాణం. అదే నేను ఈసారి వాళ్లకోసం తెచ్చిన కానుక” అంది నందిని.
”మీ నాన్న మా నాన్న కాసేపు చెస్సో, పేకో ఆడేసుకుని కబుర్లు చెప్పుకుంటారు. వియ్యపురాళ్లిద్దరూ ఈ టూర్లో బాగా స్నేహితురాళ్ళౌతారు. మనం ఇంకనించీ అన్ని రోజులూ అందరం కలిసే వుంటాం. అమ్మ లిద్దరూ వచ్చాక మనం మీ ఇంటికి పోతాం మా అమ్మా నాన్నా కూడా అక్కడికే వస్తారు. అన్నిరోజులూ అందరం కలిసే వుంటాం వంతులేసుకోకుండా – అది ప్లాను” అంది నందిని.
”మా అమ్మ ఒప్పుకోదు పిల్లలొచ్చినప్పుడు వూరెళ్ళడానికి. నీ ప్లాను బాగాలేదు” అన్నాడతను.
”పిల్లలు రానప్పుడు ఆవిడ వెళ్లడానికి మీ నాన్న ఒప్పుకోడుగా మరి, గుర్తు తెచ్చుకో. మీ అమ్మ నిన్నెన్నిసార్లు ఎక్స్కర్షన్లకి టూర్లకి పంపించిందో? వాళ్లని హాయిగా తిరిగి రానీ… ఇల్లు నేను చూసుకుంటాను. నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను” అంది నందిని, తాంబూలాలివ్వడం అయిపోయిందన్నట్లు.
”మరి నాన్నల్ని కూడా పంపిస్తే పోదా?”
”ఈసారికి ఎంత హాయిగా స్నేహితులతో తిరిగిరానీ వాళ్ల ప్రయివేటు కబుర్లు వాళ్లని చెప్పుకోనీ. వాళ్ల స్పేస్ వాళ్లని ఆస్వాదించనీ. ఇక్కడుండి మనం మన నాన్నలకి సేవ చేసుకుని తరిద్దాం… వాళ్ళు చక్కగా వెళ్ళొస్తారు… పదిరోజులు స్వతంత్రంగా వుంటారు… నాన్నలకి విరహంలోని మాధుర్యం తెలిసొస్తుంది” అంది.
అనుకున్నట్టే అమ్మలిద్దరూ వెళ్ళం పొమ్మన్నారు.
”మీరు మాకు చేసిందాంట్లో ఇది వెయ్యోవంతు. మాకు మీరు ముప్ఫై ఏళ్ళు సేవ చేశారు. మీకు మేము ముప్ఫై రోజులు చేస్తాం. ఈసారి మీరిద్దరూ ఇటు పుల్ల తీసి అటు పెట్టరంతే. వెళ్లకపోతే కుదర్దు” అని నందినితో పాటు నీనా కూడా వంతపాడింది.
”ఈ మధ్యన చాలా కథల్లోనూ అక్కడా ఎన్నారై పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టించుకోటల్లేదనీ అక్కడికి పిలిపించుకుని సేవలు చేయించుకుంటున్నారనీ ఇక్కడికొచ్చినా వీళ్ళే సేవ చెయ్యాలనీ వీళ్ళేమో మమ్మల్నే కదా అమెరికా రమ్మన్నారని ఎగురుకుంటూ పోయి ఇబ్బందులు పడుతున్నారనీ ఒకటే రాసేస్తున్నార్లే, అందుకే మా అమ్మాయి గిల్టిగా ఫీలైపోయి ఇలా ఏర్పాటు చేసుంటుంది” అన్నాడు నందిని తండ్రి.
”పిల్లల్ని విసిగించే తల్లితండ్రులూ వుంటారు, తల్లితండ్రుల్ని విసిగించే పిల్లలూ వుంటారు. అందులో కొత్తేం వుంది? ఇండియాలో పిల్లలు మాత్రం అలా ఎంతమంది లేరు? అదొక ప్రిజుడిస్ అంతే – నామటుకు నాకు వాళ్ళు పడే కష్టం ముందు మనం ఆరునెలలుండి చేసిందొక లెక్కా? అనిపిస్తుంది. గంటలు గంటలు డ్రయివింగ్. ఒకటే పని – ఇక్కడయితే నాలుగురోజులు సెలవుపడేసి అమ్మ దగ్గిరికి రావచ్చు, లేకపోతే అమ్మనే పిలవచ్చు. వంటమ్మాయిని పెట్టుకోవచ్చు. పనివాళ్ళచేత చేయించుకోవచ్చు. అక్కడదంతా కష్టం కదా? ఎక్కడి బాధలు అక్కడివి. ఏం చేసినా కన్న పిల్లలకే కదా? పరాయివాళ్ళకేం కాదుగా?” అంది నందిని అత్తగారు.
”నీది మరీ అత్యుత్సాహంలే అమ్మా! వచ్చేవాళ్ళు నీ పిల్లలే కదా? వాళ్ళనో పెద్ద విఐపీల్లా చూస్తావు. ఆ గారానికి మెచ్చే నీ మనమడు నీ దగ్గరే ఎక్కువ రోజులుండాలన్నాడు” అన్నాడు ఆవిడ కొడుకు.
”చాన్నాళ్లదాకా కనపడరుగదయ్యా! అందులో తప్పేంవుంది – మా మనసుకి అట్లా అనిపిస్తుందంతే. చూసేవాళ్లకి ఎట్టా అనిపిస్తే నాకేమిటి? మీరొచ్చి వెళ్ళిన పదిరోజులూ మనసులో నిలిచిపోవాలని వుంటుంది. మాకు చేతనయినదంతా చెయ్యాలని వుంటుంది. ఇదిగో నీ కూతురు చూడు నా మెడమీద చెయ్యేసి నుంచుంది. ఇట్టా మళ్ళీ దాన్ని నేను ముట్టుకోవాలంటే ఎన్నాళ్ళు ఎదురుచూడాలి చెప్పు? మీరు మాకు ఎన్నారైలు కాదు మా పిల్లలు చాలాకాలం తరవాత మా గడపలో కొచ్చిన పిల్లలు అంతే” అందావిడ కొంగుతో కళ్ళు తుడుచుకుని.
ఎంత గొప్ప అభివ్యక్తి? అనుకుంది నందిని. తనకీ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.
”మీ అలసటలు తీరేదాకా రావద్దులే అనుకున్నాను” అంటూ ఒక పెద్ద సంచీతో వచ్చింది, రాధిక తల్లి సువర్ణ.
”పిల్లలూ ఇదిగో టపాకాయలు కాల్చుకోండి. మా రాధమ్మ పిల్లలొస్తారని కొనిపెట్టా. తెలుసుగా వాళ్ళొచ్చినప్పుడే ప్రతియేడూ దీపావళీ చేస్తాన్నేను. బాంబులు లేవులే అన్నీ పైకి పోయి పూలు రాల్చేవే. చాలా మంచిపని చేసావే. అమ్మడూ జయపూర్ ఉదయపూర్ ఢిల్లీ ఆగ్రా చూడాలని ఎన్నాళ్లబట్లో కోరిక – చూడలేదు నేను – మా ఆయన సరేసరి సన్యాసం పుచ్చుకున్నట్టే వుంటాడు. దేనిమీదా మనసులేదు” అందావిడ గజ్జలు మోగించినట్టు నవ్వుతూ.
”ఇదుగో అమ్మమ్మా, రాధిక ఆంటీ ఇచ్చిన ప్యాకెట్” అంటూ నీనా ఆవిడికో పెద్ద ప్యాకెట్ ఇచ్చింది.
”సువర్ణకి రోజు వాడే వస్తువులు కూడా అమెరికావే కావాలి” అంది నందిని తల్లి గీత.
”అదంతేలే! అది మన సొసైటీలో ఒక గౌరవం, నీకు తెలీదు అట్లా చూపించుకుంటూ వుండాలి. ఏమిటో ఈ ఫాల్స్ ప్రిస్టీజీలకు – వాటితోనూ పనుంది” అంది రాధిక తల్లి మళ్ళీ గజ్జెలు మోగించి.
”భేషజాలకి అత్యుత్సాహాలకీ పేరుపడిపోతున్న అత్తల్లల కళ్లల్లో ఒకింత గర్వం వుంటే వుండొచ్చు కానీ అమ్మాయినో అబ్బాయినో చూడాలనంగానే రైలో బస్సో ఎక్కేసి, ఏ తెల్లవారుఝామునో కాలింగ్‌బెల్ నొక్కేసి అమ్మాయినో అబ్బాయినో ఆశ్చర్యంలో ముంచి తేల్చే అవకాశం లేదనీ విచారం వుంది. ఆ విచారాన్ని కప్పిపుచ్చుకునే అత్యుత్సాహమూ వుంది. అదే అకాల దీపావళీల, ఫ్రోజెన్ మామిడిరసాల అవతారం ఎత్తుతోంది” అనుకుంది నందిని.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
పిల్లల్ని విసిగించే తల్లితండ్రులూ వుంటారు, తల్లితండ్రుల్ని విసిగించే పిల్లలూ వుంటారు. అందులో కొత్తేం వుంది? ఇండియాలో పిల్లలు మాత్రం అలా ఎంతమంది లేరు? –
బాగా చెప్పేరండీ. మంచి పాయింటు.
చాలా బాగుంది. అమ్మ మీద రాసిన కథలన్నింటిలోనూ ఏదో ఆత్మీయ స్పర్శ ఉనట్టుంటుంది. సత్యవతి గారికి అభినందనలు.