జనవరి 2012కి భూమికకు ఇరవై ఏళ్ళు నిండుతాయి. నా జీవితంలో రెండు దశాబ్దాలు భూమికతోనే పెనవేసుకుపోయాయి. నా ఇంటిపేరు భూమికయ్యింది. భూమిక నాశ్వాసలో భాగమయ్యింది. ఉదయం లేచిందగ్గర నుండి నా తొలి ఆలోచన భూమిక. నిద్రపోయేముందు కలవరపరిచేది భూమిక (హెల్ప్‌లైన్ కేసులు) ఇంతగా నాతో కలగలిసిపోయిన భూమిక మూతబడితే…
ఈ ఊహ కూడా నన్ను భయపెడుతుంది. భూమిక పత్రికలోంచి హెల్ప్‌లైన్‌లోకి మొదలైన ప్రయాణం, హెల్ప్‌లైన్ ఏర్పాటు భూమికను బలోపేతంచేసిన తీరు నేను తప్పక మననం చేసుకోవాలి. హెల్ప్‌లైన్ లేకపోతే పత్రిక మూతపడేదన్నది కఠోరవాస్తవం. ఐదారు సంవత్సరాల క్రితం భూమిక ఆర్థిక పరిస్థితి ఎలా వుందో ఇపుడూ అలాగే వుంది. హెల్ప్‌లైన్‌కి ఆక్స్‌ఫామ్ ఆర్థిక సహకారం దొరకడంతో భూమిక బతికిపోయింది. ఇలా ఎక్కువ కాలం జరిగే అవకాశం లేదు.
నిజానికి ఈ రోజు ఒక సంస్థగా భూమిక ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. గృహహింసచట్టం అమలుకోసం ఎన్నో డిపార్ట్‌మెంటులతో కలిసి పనిచేస్తోంది. ఉచిత న్యాయం బాధితులకు అందేలా లీగల్ సర్వీసెస్ ఆథారిటీతోను, రక్షణాధికారుల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి మహిళా,శిశు అభివృద్ధి శాఖతోను నిరంతరం కలిసి పనిచేస్తోంది. ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించని జ్యుడిషియరీలోకి,ి పోలీస్‌శాఖలోకి వెళ్ళగలిగాం. మేజిస్ట్రేట్‌లకి, పోలీసులకి జండర్ స్పృహ మీద శిక్షణ నిస్తున్నాం. జండర్ స్పృహ అనే పాఠం వారి పాఠ్యాంశాల్లో (కరికులమ్)లో భాగం చేయించగలిగాం.
ఈ రోజు మేము పత్రికా నిర్వహణ దాటి ఎన్నో కార్యకలాపాల్లోకి విస్తరించాం. భిన్నమైన పనుల్లోకి వెళ్ళ గలిగాం. స్త్రీలఅంశాలమీద-అవి ఆసిడ్ దాడులవ్వొచ్చు, పనిచేసేచోట లైంగిక వేధింపులవ్వొచ్చు. 498ఏ మీద కావొచ్చు, గృహహింస చట్టం అమలు గురించి కావొచ్చు, ఈ అంశాల మీద ప్రధమంగా స్పందించే సంస్థగా మేము ముందుకొచ్చాం. స్త్రీల అంశాల మీద రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించాం. జాతీయస్థాయిలో మా గొంతు వినిపించాం.ఈ పనులన్నీ చేయడం వెనుకవున్న లక్ష్యం ఒక్కటే. బాధిత మహిళలకి అండగా నిలబడడం. ప్రభుత్వ,ప్రభుత్వేతర సంస్థలు నడుపుతున్న సహాయ, సపోర్ట్ సంస్థలను బాధితులకు అందుబాటులోకి తేవడం.
స్త్రీల అంశాలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యడం భూమిక పత్రికద్వారా చేస్తున్నాం. దీనికోసమే నవంబర్-డిశంబర్‌సంచికని స్త్రీలు-చట్టాలు-సపోర్ట్ సిస్టమ్స్ పేరుతో మహిళా శిశు అభివృద్ధిశాఖ సహకారంతో ప్రత్యేకసంచికగా వెలువరించాం. పదివేల కాపీలు ప్రింట్ చేసి జిల్లా కలక్టర్ మొదలుకొని, అట్టడుగున పనిచేసే అంగన్‌వాడి వర్కర్ వరకు ఈ ప్రత్యేక సంచికను పంపించాం. బాధిత మహిళలు సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్ళినపుడు వారికి కావలసిన సహాయాన్ని అందించడంలో ఈ ప్రత్యేక సంచిక ఎంతో ఉపయోగపడుతుంది.
ఇరవై ఏళ్ళుగా భూమికను ఎక్కడా రాజీ పడకుండా నడపగలగడం నా జీవితంలో నేను నిర్వహించిన ఒక సామాజిక బాధ్యత. ఈ బాధ్యతని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎన్నో ఒడిదుడుకుల్ని, వ్యక్తిగతంగా ఎంతో సంఘర్షణని అనుభవించాను. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఆర్ధికంగా భూమిక పరిస్థితి అలాగే వుండడం నన్ను చాలా ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరికి ఎవరూ కానీ ఈనాటి సామాజిక నేపధ్యం, ఒక చిన్న పత్రిక ఆగిపోతే ఏమౌతుందిలే అనే నిర్లిప్తత నా కలవరానికి దోహదం చేస్తున్నాయి. ఆర్ధిక సమస్య ఒక వేపు, భూమిక స్థాయిని చేరుకునే రచనలు అందకపోవడం మరో కారణం. ఎప్పటికప్పుడు వేట. రచనల కోసం వేట. ప్రతి నెలా పదో తారీఖునాటికి నలభై నాలుగు పేజీలు నింపాల్సిన ఒత్తిడి. ఏదో ఒకటిలే పేజీలు నింపుదామంటే కొండంత చెత్త దొరుకుతుంది. అదంతా నింపితే అపుడు అది భూమిక అవ్వదు కదా!ఎనభైలలో ఉప్పెనలాగా విరుచుకుపడిన రచయిత్రులు ఎందుకనో రాయడం తగ్గించేసారు. కవయిత్రులైతే అడపా దడపా తప్ప రాయడమే లేదు. నిజానికి నలువేపులా విధ్వంసం చుట్టుముడుతున్న వేళ రాయడం ఒక బాధ్యత. ఎంతో విస్తృతమైన వస్తువు మనముందుంది. భూమిపోరాటాలు, పెచ్చుమీరిపోతున్న హింస, కనుమరుగవుతున్న ఆడపిల్లలు, ‘అభివృద్ధి’విధ్వసం, కూలుతున్న మానవసంబంధాలు, సరిహద్దులు చెరిగిపోతున్న సెక్స్‌వృత్తి..ఇలా ఎన్నో ఎన్నో అంశాలు మనముందున్నాయి. వీటన్నింటి మీదా విశ్లేషణాత్మక రచనలు రావాల్సిన అవసరం వుంది. సీరియస్‌గా రాసే రచయితల కలం కునుకు తీస్తే…
ఇరవై ఏళ్ళు నిండిన సందర్భంగా వచ్చే మార్చి 2012 సంచికని ప్రత్యేక సంచికగా ప్లాన్‌చేద్దామని ప్రసన్న (నాతో పాటు ఇరవై ఏళ్ళుగా భూమికలో పనిచేస్తున్నది) అన్నప్పుడు నా మనస్సులో మెదిలిన ఆలోచనలివి. భూమిక భవిష్యత్తు గురించి నా ఆందోళన ఇది. భూమిక మనందరిదీ… మీ ఆందోళన మాది కూడా.. భూమికను నిలుపుకోవడం అందరి బాధ్యత అని ఎవరైనా మనస్ఫూర్తిగా అంటారని, అలా అనేవాళ్ళు చాలామందే వున్నారని బలంగా నమ్ముతూ… ఆశావహంగానే…
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags