లక్ష్మి మాధవ్
”హలో! సుధాకర్‌రావ్ స్పీకింగ్” అని ఫోన్‌లో ప్రతీవారితోను మాట్లాడి నప్పుడల్లా ఒత్తి ఒత్తి పలికి సుధామయి మనస్సుని గాయపరుస్తున్నాడు సుధాకర్ రెండు నెలలుగా.
అసలు వారిద్దరి పరిచయం జరగటానికి వారి పేర్లే కారణమని చెప్పాలి. వారి పరిచయం చిగురించి, ప్రేమగా పల్లవించి, పెళ్ళిగా రూపుదిద్దుకుంది. పెద్దలు హర్షించకపోయినా పట్టు పట్టి పెళ్ళికి ఒప్పించారు వారిద్దరూ.
”ఈ రోజునుంచి ‘సుధ’ అన్నా ఉమ్మడి రెండక్షరాలతో మనం చలామణి అవ్వటమే మన సాన్నిహిత్యానికి తార్కాణం” అన్నాడు హానీమూన్‌కి బయల్దేరుతూ సుధాకర్.
”అన్ని విధాలా కలిసే అభిరుచులు, ఆలోచనలు గల్గిన మనం జీవితాన్ని ఓ హనీమూన్ లాగే గడిపేయాలి… సుధా…” అంది సుధామయి తదేకంగా అతని కళ్ళలోకి చూస్తూ.
అఫీషియల్ రికార్డులలో తప్ప మిగతావారంతా వారిని వారి ఇష్టప్రకారం వారితో ఎవరినైనా సుధా అనే పిలిచేవారు. వారిలో ఎవరికి ఫోన్ చేసినా కూడా ‘సుధా స్పీకింగ్’ అన్న జవాబే వచ్చేది. ఇలా ఒకే చోట పనిచేస్తూ, ఒకే జీవం రెండు శరీరాలులా అన్యోన్యంగా వారి లోకంలో వారు, మధురంగా వారాలు, నెలలూ గడిపేస్తున్నారు వారు. పెళ్ళికి వ్యతిరేకించిన వారిరువురి తల్లితండ్రులూ కూడా వారి అన్యోన్యతానురాగాల్ని చూసి సంతృప్తులయ్యారు.
పేపర్లో మంచి జీతం, మంచి సదుపాయాలు వీటన్నిటినీ తలదన్నే పర్క్‌లు గల ఓ కొత్త ఉద్యోగం ఆడ్ చూసిన సుధామయి వెంటనే ఆ సంస్థకి తన రెస్యూమ్‌ను పంపింది. సుధాకర్‌ని కూడా అప్లై చెయ్యమని బలవంతం చేసింది. కాని సుధాకర్‌కిగల క్వాలిఫికేషన్స్‌కి, ఆ ఉద్యోగం అతనికి వస్తుందన్న నమ్మకం అంతగా లేకపోవటంతో అతను వెనకడుగు వేసాడు. అతనికి తెలిసినవారిలోనూ, స్నేహితులలోనూ కొందరు వైవాహిక జీవితాల్లో ఏర్పడిన కలతలవల్ల బాధపడడాన్ని కళ్ళారా చూసిన అతను, ఆమె ఉద్యోగం మారే ప్రస్తావనకు చాలా అభద్రత చెందటం మొదలుపెట్టాడు.
”ఉద్యోగం చేసే చోట్లలోని దూరమే, క్రమేపీ మన మధ్య దూరంగా పరిణమిస్తే…!” అంటూ తన అయిష్టతను వ్యక్తం చేసాడు మెల్లిగా.
”జాబ్ వచ్చినప్పటి విషయం కదా… కమాన్ రిలాక్స్! అయినా ఇంత చిన్న కారణానికి మనవంటి సిసలైన ప్రేమికులు బెదరకూడదు సుధా…”అంది తేలికగా అతని భయాన్ని కొట్టి పారేస్తూ.
అనుకోకుండా ఆమె జాబ్‌కి వెంటనే సెలెక్ట్ అవ్వటంతో, అతని ఆదుర్దా అధికమైంది. నిశ్శబ్దంగా ఆమె ప్రతిక్రియని గమనించాడు సుధాకర్.
సుధామయి తన ప్రతిభకు లభించిన ఈ గుర్తింపుకు చాలా సంతోషించింది. ఆమె మారు ఆలోచించక వెంటనే కొత్త ఉద్యోగంలో చేరటానికి సన్నాహాలు చేసుకుంది. సున్నిత మనస్కుడైన సుధాకర్‌కు నచ్చచెప్పింది.
”సుధా….! మనమిద్దరం, ముగ్గురమయ్యేలోపు, మనం కలలు కన్నవిధంగా ఇల్లు అమర్చుకోవటానికి ఈ ఉద్యోగం మారటం ఎంతో మేలుని చేస్తుంది” అంది నెమ్మదిగా.
సుధాకర్ మౌనంగా విన్నాడు కాని నిస్పృహతో ఆమె చర్యకు చాలా పదునుగా ప్రతిస్పందించాడు. ఆమె జాబ్ మారిన నాటినుండి ఆమెతో సరదాగా వ్యవహరించటం పూర్తిగా మానివేసాడు. చాలా ముభావంగా మారిన అతని తీరు చూసిన సుధామయి తల్లడిల్లిపోయింది. కొత్త జాబ్ రావటం తన అదృష్టమని మురిసిపోయినామె, అది తన పాలిట శాపంగా మారుతున్నందుకు తత్తరపాటు చెందింది.
తల్లితండ్రుల్ని ధిక్కరించి చేసుకున్న వివాహం ఛిద్రమైందని వారిచే మాటలు పడటం ఇష్టం లేక అతని ప్రతిస్పందనను మౌనంగా భరించింది. ఒకే ఇంట్లో ఉంటూనే విడాకులు తీసుకున్న వారిలా మసలటం మొదలు పెట్టారు ఇద్దరూ.
”భర్త ప్రేమకోసం ఎంతటి త్యాగాన్నైనా చేస్తుందని అంచనా వేసుకున్న నా ఆలోచనలకి విరుద్ధంగా ఇంత అల్పంగా వ్యవహరిస్తుందని అనుకోలేదు” అనుకునేవాడు చేదుగా సుధాకర్. అందుకనే అనుక్షణం తను ఆమె పాత సుధాకర్‌ని కాదని, ఆమెను వేరు చేస్తూ తను దూరంగా ఉంటూండేవాడు. నిశ్శబ్దంతోనే కోల్డ్‌వార్ సాగింది వారి మధ్య.
”హలో! సుధా… స్పీకింగ్… అవును రేపు జాయిన్ అవుతున్నాను. అంటూ కొత్త ఉద్యోగం వివరాలు చెప్తున్నాడు సుధాకర్ స్నేహితుడికి. రోజూలాగే యాంత్రికంగా ఆఫీసుకి రెడీ అవుతున్న ఆమెకి ‘సుధా… స్పీకింగ్’ అన్న అతని మాటలు వినగానే ఆశ్చర్యం కలిగింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. కాని పాత రోజులు కళ్ళముందు కదలగా దుఃఖం పెల్లుబుకింది. కసిగా మనస్సు లోలోనే ఆక్రోశించింది.
”స్వతంత్రంగా నా వ్యక్తిత్వానికి దొరికిన గుర్తింపును సద్వినియోగం చేసుకున్న చిన్న కారణానికి మాటలు మానేసిన వ్యక్తితో జీవితాంతం ఇంకెలా కాలక్షేపం చెయ్యటం?” అని నిట్టూర్చింది.
అతను ఫోన్లో మాట్లాడటం ముగించి హుషారుగా పాటలు హమ్ చేస్తూ… బట్టలు ఇస్త్రీ చేస్తున్నామె ముందుకు వచ్చి
”హాపీ బర్త్‌డే… ! సుధా… మరిచావా?” అంటూ పూలబొకే అందించాడు. లోపల ఆశ్చర్యం కలిగినా నిర్లిప్తంగా అందుకుని పక్కన పెట్టి తన పనిని కొనసాగించిందామె. నిస్తేజంగా ఉన్న ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు సుధాకర్. నవనవలాడుతూ గుభాళిస్తున్న పువ్వుల పరిమళం ఆఘ్రాణించాలని మనస్సు ఆరాటపడినా, వీటిలోని జీవకళైనా పరిసర పరిస్థితుల ఫలమే… ఇది తాత్కాలికం.. అయితే… అన్న భావన ఆవరించగా మౌనంగా ఉండిపోయిందామె. వాచీ చూసుకుని వడి వడిగా దువ్వెనతో జుట్టు బ్రష్ చేసుకుంటూ అద్దం ముందుకు వచ్చింది. అద్దంలోని ఆమె ప్రతిబింబం వెనకగా అతను వచ్చి నిల్చుని ఆమెనే చూస్తూండటం గమనించిందామె. మరుక్షణంలో చిన్న పిల్లాడిలా ఆమెను వెనకనుంచి చుట్టేస్తూ ఆవేదనగా చెప్పాడు సుధాకర్.
”సారి… సుధ… ఒకరి ఉన్నతికి మరొకరు అడ్డుగా ఉండకూడదని మనం ఎన్నో వాగ్దానాలు చేసుకున్నాం. కాని నాలో తెలియకుండానే పాతుకుపోయిన కొన్ని భావాలవల్ల నువ్వు నీ విజయాన్ని నాకోసం వదులు కోవాలని అపోహ పడ్డాను. నీ జయాన్ని హర్షించలేక పోయాను. నా ఉక్రోషాన్ని ప్రేమపేరుతో వెల్లడి చేసి నిన్ను బంధించాలని చూసాను. నా ప్రయత్నాలు ఫలించినప్పుడు సంతోషం పంచుకోవటానికి తోడు లేక బాధపడినప్పుడు కాని నాకు నా తప్పు అర్థం కాలేదు. అంటూ ప్రాధేయ పూర్వకంగా ఆమెను అర్థించాడు.
అకారణంగా శృతితప్పిన అనురాగ సుధ రాగరంజితమైంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
నమస్సులు కొండవీటి సత్యవతి గారు..
కొన్ని నెలలుగా భూమిక చదువుతున్నా. ఇది పత్రిక మాత్రమే కాదు.. ఓ ఉద్యమ0 అనిపిస్తోంది. నేను సైత0 ఎందుకు పాలుపంచుకోకూడదనిపించింది. మొన్నీ మధ్య ఫోను చేసి మెడికో శ్యాం గారు కూడా నా మనసులో ఉన్న మాటనే ప్రస్తావించారు. నా కథలు కొన్ని కౌముది,వాహిని (వెబ్ పత్రికలు), రచన, ఆ0ధ్రప్రదేశ్, ఆ0ధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈనాడు ఆదివార0,విపుల పత్రికల్లో వచ్చాయి. నా అనువాద కథలు విపులలో వచ్చాయి. నేను కొన్నాళ్లు ఈనాడులో పనిచేసిన అనుభవ0 కూడా వుంది.
దయచేసి భూమిక పత్రికలో అనువాదకథలు రాసేందుకు అవకాశ0 కల్పించవల్సిందిగా కోరుతున్నాను. నేను ఇంగ్లిష్, హింది కథలు అనువాద0 చేయగలను.
విత్ రిగార్డ్స్
చింతలచెరువు సువర్చల
23/8/2011.