కందాల శోభారాణి
ఆధునిక తెలుగుకథ ఆరంభ వికాసాల చరిత్రలో రచయిత్రులు రాళ్ళెత్తిన కూలీల వలెనే నిర్లక్ష్యానికి గురయ్యారు. తొలి తెలుగు కథకుడుగా ప్రసిద్ధుడైన గురజాడకు పూర్వం నుండే స్త్రీలు కథలు వ్రాశారు. ఆ కథలు ఆషామాషిగానో, కాలక్షేపంకోసమో రాసినవి కాదు. స్త్రీలు రచనా రంగంలోకి రావటం అంటేనే అదివాళ్ళ చైతన్యానికి గుర్తు. కుటుంబంలోని పరిస్థితుల పట్ల అనుకూల ప్రతికూల స్పందనలెన్ని ఉన్నా, తరతరాలుగా ఇవ్వబడుతున్న పితృస్వామిక శిక్షణ కారణంగా అలవడిన సంస్కారముతో స్త్రీలు చాలా కాలం తమ మనోభావాలు అణచి ఉంచుకున్నారు.
ఆధునికయుగస్వభావం చదువుకోటానికి భావాలు ఏర్పర్చుకోటానికి కల్సివచ్చిన అవకాశం వ్యక్తీకరించటానికి అందుబాటులోకి వచ్చిన పత్రికారంగం మొదలైనవి స్త్రీలను రచయిత్రులుగా చేశాయి. ఆ క్రమంలోనే స్త్రీలు కౌటుంబిక సమస్యల పట్ల మాత్రమేగాక సమకాలీన సామాజిక, రాజకీయ ఉద్యమాల పట్ల కూడా ప్రతిస్పందన గల్గిన కొత్త చైతన్యాన్ని పొందారు. ఆ చైతన్యంతో స్త్రీలు వ్రాసిన కథలు పరిశీలించటం ఈ వ్యాసం ఉద్దేశం.
1940-1990 మధ్యకాలంలో కథలు వ్రాసిన తొలితరం కథా రచయిత్రులకు ప్రతినిధులుగా ఆరుగురిని స్వీకరించటం జరిగింది. వారు 1) బండారు అచ్చమాంబ, 2) ఆ భాస్కరమ్మ, 3) గుమ్మడిదల దుర్గాబాయి, 4) శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ, 5) శ్రీమతి బసవరాజు వెంకట రాజ్యలక్ష్మి, 6) తాడినాగమ్మ.
బండారు అచ్చమాంబ వ్రాసిన కథలు రెండు 1) స్త్రీ విద్య (భార్యా భర్తల సంవాదము), 2) ధనత్రయోదశి. ఈ రెండు కథలు 1902లో వచ్చాయి. సంస్కరణోద్యమానికి ప్రతినిధి రచనలివి. అనేక మూఢాచారాలతో, అంధ విశ్వాసాలతో కునారిల్లుతున్న సమాజానికి తొలిచికిత్సగా వచ్చిన సంస్కరణోద్యమం స్త్రీ సమస్యపైననే ఎక్కువగా కేంద్రీకృతమైంది. స్త్రీల జీవిత దౌర్భాగ్యాలను వ్రాస్తూ స్త్రీలలో వున్న సహజ జీవశక్తులను గౌరవంతో ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తూ స్త్రీలలో చైతన్యం నింపటానికి స్త్రీలను సంబోధిస్తూ వచ్చాయి ఈ ఉద్యమాలు ఈ నేపథ్యంలో చూడవలసిన కథలు అచ్చమాంబ కథలు.
వీరేశలింగంపంతులుగారి సంఘసంస్కరణోద్యమం ప్రభావంతో స్త్రీలకు విద్య అవసరమని, స్త్రీ, విజ్ఞానవంతురాలయితే కుటుంబం, దేశంఅభివృద్ధి చెందుతుందని గుర్తించిన వారిలో బండారు అచ్చమాంబ ఒకరు. కొందరు ఛాందస భావాలతో స్త్రీలు చదువుకుంటే చెడిపోతారని తప్పుతోవపడ్తారని విశ్వసించే కాలంలో తమ్ముడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావుకు ఉపాధ్యాయుడు వచ్చి పాఠాలు చెబుతున్నప్పుడు పక్కనే చేరి అచ్చమాంబ శ్రద్ధగా విని వ్రాయటం, చదవటం అభ్యాసం చేసింది. కట్టుబాట్లు నియమాల యుగంలో పుట్టిన అచ్చమాంబ ఆనాటి యుగధర్మాన్ని పాటిస్తూనే అభ్యుదయ మార్గంలో ఆలోచించింది. వీరేశలింగం ప్రభావంతో ఆయన ఆశయాన్ని కొనసాగింపచేయటానికి ఏర్పడిన అనేక స్త్రీ సమాజాలలో బండారు అచ్చమాంబ 1902 సంవత్సరంలో బందరులో ఏర్పరచిన ”బృందావన స్త్రీ సమాజము” ఒకటి.
సామాజిక, సాంస్కృతిక సేవారంగాలలో కృషిచేస్తూ అచ్చమాంబ 1898 నుంచి 1904 మధ్యకాలంలో వ్రాసిన పన్నెండు కథలలో ”స్త్రీ విద్య, ధన త్రయోదశి” అనే ఈ రెండు కథలు వున్నాయి. మంచి సందేశంతో వ్యక్తిత్వ నిర్మాణం చేసే విధంగా వున్న కథలివి.
చదువుల రీత్యాగాని, ఉద్యోగరీత్యాగాని వేరే ప్రాంతాలకు వెళ్ళిన భర్తతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటానికి కుటుంబం గుట్టును కాపాడటానికి స్త్రీలకు విద్య అవసరం అన్నది వీరేశలింగంగారి అభిప్రాయాలలో ఒకటి, దీనికి కథా రూపమే స్త్రీ విద్య కథ.
సంస్కరణోద్యమం నుండి ఎదిగిన స్త్రీ బండారు అచ్చమాంబ 1903 లో దేశమంతా పర్యటించి పండితులతో, మేధావులతో చర్చించి ఎంతో సమాచారాన్ని సేకరించింది. తన రచనలన్నింటి నిండా స్త్రీ విద్య ఆవశ్యకత గురించి ప్రస్తావిస్తూ, స్త్రీల ఉద్యమాన్ని నిర్మించడానికి, ప్రోత్సహించడానికే తన రచనలను ఉపయోగించింది. స్త్రీ విద్య, స్త్రీల అభివృద్ధి అంటే ఎంతో శ్రద్ధాసక్తి కనబరిచినట్లు తన రచనల వల్ల తెలుస్తుంది. స్త్రీ విద్య ఆ కోవలోని కథే.
ఈ కథలో భర్త పరీక్షల రీత్యా రెండు సంవత్సరాలు వేరే వూరు వెళ్ళే పరిస్థితి వచ్చింది. భార్య ఆయన క్షేమ సమాచారాల గురించి ఎప్పటికప్పుడు తెలియచేయాలని ఉత్తరాలు రాయమని అడుగుతుంది. భర్త ఆమెకు చదువు రాదన్న విషయం మనసులో పెట్టుకొని నీ ఇష్టప్రకారమే నాక్షేమ సమాచారము నీకు తెల్పుతాను. మరి నీ కుశలం నాకెట్లా తెలియపరుస్తావు అంటాడు. నాకు చదువు వచ్చి ఉంటే సంతోషంగా ఉత్తరాలు వ్రాసేదాన్ని అయినా అప్పుడప్పుడు తమ్మునిచే వ్రాయించి పంపుతాను అంటుంది. తాను ఉత్తరం వ్రాసినా చదువుటకు భార్య అసమర్థురాలు అన్నది ఆయన బాధ. తన మనసులోని మాటలు ఉత్తరంలో పూర్తిగా వ్రాయలేక పోవటానికి కారణం కూడా అదే. ఆమె అసమర్థత భార్యభర్తలిద్దరికి మాత్రమే చెందిన ఉత్తరాన్ని మూడో మనిషి ముందు బహిర్గతం చేస్తుంది. అది భర్తగా ఆయనకు సుఖకరము కాదు. అందుకే పెళ్ళి అయిన మొదలు విద్య నేర్చుకోమన్నా వినని ఆమెపట్ల గౌరవం కాదు, భార్య మూర్ఖత్వంపై విసుక్కుంటాడు. ఆ తర్వాత భార్యభర్తలిద్దరి మధ్య స్త్రీ విద్యను గురించి సాగిన సంభాషణలో భార్య స్త్రీ విద్యకు అభ్యంతరంగా లోకంలో ఉన్న వాదాలను వినిపిస్తుంది. అవి 1) స్త్రీ విద్య నేర్చుకుంటే భర్త ఆయుష్షు తగ్గుతుంది. 2) గృహకృత్యాలు కుంటుపడ్తాయి. 3) ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు కనుక చదువుకోనక్కరలేదు. వీరేశలింగం వంటి ఆనాటి సంస్కర్తలంతా ఇలాంటి వాదాలను తిప్పికొట్టటానికి తమ శక్తి యుక్తులను పాండిత్యాన్ని వెచ్చించారు. వారికి ప్రతినిధిలాగానే ఈ కథలో భర్త మాట్లాడ్తాడు. స్త్రీలు చదువుకుంటే భర్త ఆయుష్షు తగ్గుతుందనటం ముసలమ్మల మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు అంటాడు. స్త్రీలు చదువకూడదని శాస్త్రాలలో ఉందని ఒకరు చెప్పింది నమ్మడం సరికాదంటాడు. చదువువచ్చి ఉంటే శాస్త్రాలలో ఏముందో స్వయంగా తెల్సుకోవచ్చన్నది అతని అభిప్రాయం. అట్లాగే అతను చదువుకోవడమంటే ఇతర పనులు మానుకోవటం అనే అర్థం కాదంటాడు. గృహ కృత్యములు ఆడువారు చేయకతప్పదు అని అంటూనే ఆ పనులైన పిదప ఇరుగుపొరుగులతో వ్యర్థ ప్రసంగాలు చేసే కాలాన్ని చదువుకు వినియోగించటం సరియైందంటాడు. చదువుకోవటం కేవలం ఉద్యోగం కోసం కాదు అన్నది భర్త అభిప్రాయం. విద్యవలన బుద్ధి వికసిస్తుంది. సద్గ్రంధాలలోని అమూల్యమైన ఉపదేశాలు మనసులో నాటుకొని మనుషులు ఉదాత్తవంతులవుతారని మనిషిలోని దుర్గుణాలు తొలగి సద్గుణాలు పొందుతారని, యోగ్యులవుతారని మనసుకు ఆహ్లాదం కల్గుతుందని, సంసారంలోని కష్టాలు మరిచి ఆనందిస్తారని, అన్ని ఆనందాలను మించింది విద్యానందమే అని అతను విద్యాప్రయోజనాలను పేర్కొంటాడు. కార్యాకార్య వివేకం ఇచ్చేది కూడా చదువేనని చదువులేక అజ్ఞానాంధాకారాల్లో ఉన్న స్త్రీలు జ్ఞానులైన పురుషులకు సముజ్జీలు కారన్న అచ్చమాంబ భావన భర్త మాటల ద్వారా వ్యక్తం అయింది.
అంతేకాదు పిల్లలకు సద్గుణాలు అలవరచే ఉత్తమ గురువు తల్లి అని అందుకోసం స్త్రీలు విద్యావంతులగుట ఆవశ్యకమని ఈ కథలో అచ్చమాంబ అభిప్రాయపడుతుంది. భర్త వాదనలన్ని విన్న తర్వాత భార్య విద్య నేర్చుకోడానికి సంసిద్ధురాలవుతుంది. పతికంటే అన్యదైవం లేదని పతి ఆజ్ఞను శిరసావహించటం తమ ముఖ్య కర్తవ్యమని నమ్మిన స్త్రీగా, భార్య స్త్రీ విద్యా విషయంలో భర్త ఆశయాన్ని అంది పుచ్చుకోడానికి సిద్ధపడుతుంది. తాను చదువుకొని అతన్ని సంతోషపెట్టాలనుకుంది. స్వయంగా అతనికి ఉత్తరం వ్రాస్తానని వాగ్దానం చేస్తుంది. ఉత్సాహం చూసిన అతని కళ్ళముందు సుందర భవిష్యత్ చిత్రపటం కనబడుతుంది. భార్య కాగితం, కలం, సిరాబుడ్డి తీసుకొని ఉత్తరం రాయడానికి కూర్చున్నట్టు ఒక కల. తాను ఒక కుర్చీలో విశ్రాంతి తీసుకొనుచుండగా మరొక కుర్చీలో ఆమె ఒక మాసపత్రికలోని వ్యాసం చదివి వినిపించటం మరొక కల. పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని చదువు నేర్పటం మరొక కల. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబ జీవితం ఎంత సహజీవన సౌందర్యంతో ఉంటుందో అచ్చమాంబ తన బుద్ధిశక్తి చేత ఊహించింది. ఆ ఊహలే భర్త భవిష్యత్‌లోకి తెర్చుకున్న కళ్ళతో కన్న కలల రూపం ఈ కథలో భాగమయ్యాయి.
విద్య అంటే అక్షరములను గుర్తుపట్టటం, వ్రాయటం అనే వాటికే పరిమితమైంది కాదు, అది అక్షరాస్యత విద్య. అక్షరాస్యులందరూ విద్యావంతులు కాజాలరు అని అచ్చమాంబ 1902 లోనే ఈ కథలో చెప్పింది. ”ఉద్గ్రంథాలు చదివి వాటి తాత్పర్యాన్ని గ్రహింపగలవారలే విద్యావంతులనబడుదురు” అని అచ్చమాంబ ఘంటాపధంగా చెప్పింది. ఆమె ఆ మాటలు చెప్పి వంద సంవత్సరాలు దాటింది. అయినా ఈనాటికి ప్రజలను అక్షరాస్యులనే చేయటం ప్రభుత్వాల ఆశయంగా ఉండటం కొన్నిఅక్షరాలను గుర్తుపట్టి ఏదోఒక విధంగా తమ పేరును రాయబడిన వాళ్ళను అక్షరాస్యులుగా ప్రకటించటం ఈనాటి దౌర్భాగ్యం.
”ధనత్రయోదశి” కథ బతుకుతెరువుకు బొంబాయి వెళ్ళిన వెంకటరత్నం భార్య విజయలక్ష్మి వ్యక్తిత్వం ఈ కథలోని కీలకాంశం. త్రయోదశి దీపావళికి ముందరి త్రయోదశి అదికూడా పర్వదినమే. లక్ష్మీపూజ చేసే రోజది దరిద్రం తాండవించే విజయలక్ష్మీ వ్యక్తిత్వ నేపథ్యాన్ని చక్కగా వాడుకొన్నది రచయిత్రి. పదిరూపాయల జీతానికి గుమాస్తా పనిచేస్తున్న భర్తకు చేదోడుగా విజయలక్ష్మీ కుటుంబ నిర్వహణ కోసం రవికలు కుడుతు సంసారాన్ని గడుపుతూ ఉంటుంది. పిల్లలకు పండుగకు కొత్తబట్టలు కొనిపెట్టలేని, దీపావళి మందులు కొనిపెట్టలేని దుస్థితికి లోలోపల దుఃఖమున్నా అదిపైకి కనబడనీయదు. సంపదలేని విచారం తనకేమీ లేదంటుంది. ”సత్యమార్గం” విడువక నడుచుటలోనే అమితానందాన్ననుభవించే వ్యక్తిత్వం. అందువల్ల లేమివల్ల లోభపడి దొంగసొమ్ముకు ఆశపడిన భర్తను ఆమె మందలించగలిగింది. పతిని దండించుట యుక్తం కాదన్న సంప్రదాయభావం కలిగిందయినా, ఉపేక్షచేయటం అతనిని దుర్నడవడిలోకి ప్రవేశపెడుతుందని అతనట్లా చెడిపోతుంటే చూడటం వివేకం కాదన్న కర్తవ్య దీక్షతో న్యాయ మార్గాన్ని గురించి అతనికి ఉద్భోధించింది. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుందనే నానుడిని నిరూపించిన కథ. మనిషికి నిజమైన ధనం సత్యమార్గం, విలువలతో కూడిన జీవితం. ఆ జీవితాన్ని నిర్మించుకొనటానికి ప్రతికూల పరిస్థితులలో సంఘర్షించటంలో విజయలక్ష్మీ వ్యక్తిత్వం రాటుతేలింది. ఆ రకంగా తర్వాత కాలంలో అటు గురజాడ భర్త ప్రవర్తనను చక్కదిద్దుకున్న కమిలిని పాత్రను చిత్రించటానికి గానీ, ఇటు మాడపాటి హనుమంతరావు భర్త అనుమాన ప్రవృత్తిని దీటైన జవాబు చెప్పగలిగిన ధీరవనితను సృష్టిస్తూ ”నేను” కథ వ్రాయటానికి గానీ ధనత్రయోదశి ఒక వేగుచుక్క అయిన కథ.
సంఘ సంస్కరణోద్యమం వల్ల స్త్రీలు చదువుకోడానికి అవకాశం కల్గింది. అది భావ విప్లవానికి దారి తీసింది. గతానుగతికమైన ఆచారాలను, సంప్రదాయాలను ప్రశ్నించడం ప్రారంభమైంది. సంస్కరణోద్యమం ముందుకు తెచ్చిన స్త్రీ విద్య పునర్వివాహం మొదలైన అంశాలు మానవ సమాజ సంస్కారంలో భాగం కావలసిన సమయం ఆసన్నమైంది. 1919లో వీరేశలింగం మరణం, జాతీయోద్యం ముమ్మరం కావటం ఏక కాలంలో సంభవించాయి. స్త్రీల సామాజికాభివృద్ధి రాజకీయ స్వతంత్రంతో ముడిపడి వుందన్న ధోరణి ప్రబలసాగింది. సంస్కరణోద్యమం, జాతీయోద్యమంగా సమగ్రరూపాన్ని తీసుకొంటున్న ఈ సంధికాలంలో ఆ భాస్కరమ్మ వ్రాసిన కథ ‘ప్రభావతి’ (1926).
‘ప్రభావతి’ విషయం రీత్యా ప్రధానంగా సంస్కరణోద్యమ కథ. పదేళ్ళకు పెళ్ళయి ఏడాది తిరగకుండానే భర్తను కోల్పోయింది ప్రభావతి అనే అమ్మాయి. వైధవ్యం పేరుతో పాపిష్ఠురాలు అంటూ నిందావాక్యాలు భరింపవలసి రావటం ఆ పిల్లకు దుర్భరమైంది. ”ఇతరులచే నింత మాటయైన పడుటకు సహింపదు. అట్టి బాలిక ఇప్పుడకారణముగా నిట్టి నిందావాక్యముల సహింపగలదా? ఇందు ‘తానొనర్చిన తప్పేమిగలదు?’ అంటూ స్త్రీకి భర్త చనిపోతే ఆచారాల పేరుతో వైధవ్య దుస్థితి కల్గించటం తన ప్రమేయం లేకుండా ఏ తప్పు చేయకుండానే స్త్రీకి విధించే శిక్షగా గుర్తించి నిరసించింది భాస్కరమ్మ.
స్త్రీ ఎప్పుడు వితంతువులైనా రజస్వల కానిదే జుట్టు, పసుపు కుంకుమలు తీయించటం వంటి పనులు చేయరు. ప్రభావతి పదేళ్ళకే వితంతువైంది. రజస్వల అయ్యేనాటికి రెండు మూడేళ్ళయినా కనీస పక్షం కాలం గడుస్తుంది. ఆ కాలంలో ప్రభావతి పత్రికలు పుస్తకాలు చదువుకుంటూ స్త్రీ స్వాతంత్య్రం కొరకు తన జీవితాన్ని అంకితం చేయాలన్న చైతన్యాన్ని పొందింది. లోకాచారం ప్రకారం తండ్రి తనను వితంతువును చేసి వికృతంగా మార్చటానికి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసే కర్మకాండను తలపెడితే ఆ దుస్థితిని తలచుకొని భరించలేక ఆత్మహత్య చేసుకుంది.
సంస్కరణోద్యమ ఫలితంగా స్త్రీలు తమ జీవిత సమస్యల గురించి తమే ఆలోచించుకోవటం, సామాజిక పరిష్కారం వుందని గుర్తించడం అందుకొరకు తామే సంసిద్ధులయ్యే చైతన్యాన్ని అభివృద్ధిపరుచుకొనే ప్రత్యేకాంశం ప్రభావతి మనసులో మొగ్గ తొడిగింది. కాని ఆ భావాలను తల్లిదండ్రులకో, బంధువులకో, ఇతరులకో చెప్పే సాహసం కనిపించదు. స్త్రీకి భర్తపోయిన దుఃఖమే పూడ్చలేనిది. అందుకు ఓదార్పు లేకుండా వారి హృదయాలను దహించి వేసే, అవమానకరమైన కర్మకాండ పేరుతో బాధించ వలయునా? అన్నది ప్రభావతి ఆవేదన. తలగొరిగించే ఘోరకార్యాన్ని ఎంతో తప్పుచేసిన వారికి విధించే శిక్షగా భావిస్తుందామె. భర్త చనిపోవటంలో తానుచేసిన నేరమేమున్నది అన్నది ఆమె ప్రశ్న. అందుకే భర్తలు మరణించిన స్త్రీలను సామాజిక రంగాలలోకి రానీయకుండా శరీరాన్ని వికృతం చేసి వదిలే సామాజికాచారం పట్ల నిరసన ప్రభావతి ఆత్మహత్యగా చిత్రించబడింది.
భార్య పోయిన పురుషునికి ఏ శిక్ష లేకుండా పన్నెండు రోజులకే తిరిగి పెండ్లికుమారుడిని చేస్తారు. భర్త పోయిన స్త్రీకి పదవనాటి అవస్థ తలచుకుంటే ఎంతటి కఠిన హృదయానికైనా గుండె కరిగి నీరవుతుంది. పురుషులకక్కరలేని మార్పు స్త్రీలకెందుకు? అని స్త్రీ పట్ల ఉన్న దమననీతిని నిరసిస్తూ అవయవ నిర్మాణములో స్త్రీపురుషులకు భేదముండవచ్చు. మానసిక విషయాలలో ఇరువురు సమానులే అని లింగ వివక్షతను ప్రశ్నిస్తుంది రచయిత్రి.
ఈ కథలో దురాచారాలకు నెలవైన సంఘాన్ని ఉద్దేశించి ”ఓ సంఘమా? అసమాన ప్రజాధురీణులై యుండి పరోపకార పారీణలు, దేశసేవా పరాయణులు కావలయునని యెక్కుడాసతో నున్న మానవతుల నెందరినింతవరకు నీపొట్ట బెట్టుకుంటివో” అని ప్రభావతిఅన్న చివరిమాటలు దేశ స్వాతంత్య్రోద్యమానికి ఉపయోగపడకుండా వృధా అవుతున్న స్త్రీ జనశక్తిని గురించి ఆలోచించమని హెచ్చరిస్తాయి.
స్వాతంత్య్రోద్యమం స్త్రీల సమస్యలను కలుపుకొని పరిష్కారదిశగా విస్తరించాలన్న ఆకాంక్ష కూడా అందులో కనబడుతుంది. గాంధీ పిలుపునందుకొని సహాయనిరాకరణోద్యమంలో స్త్రీలు కూడా భాగస్వాములవుతున్న సందర్భంలో స్త్రీలలో కొంతమంది వితంతువులనే నెపంతో బహిష్కృతులుగా, తిరస్కృతులుగా చేయబడితే జాతీయోద్యమానికి అవసరమైన మానవ వనరులు సరిగా సమకూడవన్న ఆలోచన కూడా ఇందులో గర్భితమైవుంది.
గుమ్మడిదల దుర్గాబాయి వ్రాసిన ”నేధన్యనైతిని” (1929), కనుపర్తి వరలక్ష్మమ్మ వ్రాసిన ”ప్రేమప్రభావము” (1927), ”ఐదుమాసముల ఇరువది దినములు” (1931), బసవరాజు వెంకటరాజ్యలక్ష్మీ వ్రాసిన ”ఎవరిదదృష్టం” (1931), తాడి నాగమ్మ వ్రాసిన ”ఒక ముద్దు” (1939) అయిదు కథలు జాతీయోద్యమ నేపథ్యంలో వచ్చాయి. జాతీయోద్యమంలో స్త్రీల క్రియాశీలక పాత్రను చిత్రించిన కథలుగా వాటికి ఒక ప్రత్యేకత వుంది.
1909 సం|| జులై 15వ తేదీన రాజమండ్రిలో జన్మించి, 1920లో గాంధీ ఆంధ్రదేశంలో స్వాతంత్య్రోద్యమ ప్రచారం కోసం విరాళాలు పోగుచేయాలనే ఉద్దేశంతో రాజమండ్రి వచ్చినపుడు బహిరంగసభలో ఆయన చేసిన ఉపన్యాసంతో ప్రభావితురాలైన వ్యక్తి దుర్గాబాయి దేశ్‌ముఖ్.
ఆ చిన్న వయసులోనే ఆమె గాంధీ టోపి ఒకటి సంపాదించి దాన్ని తిప్పి జోలెగా తయారుచేసి అందర్నీ డబ్బులు అడిగి గాంధీజీకి అందచేసినది. అప్పుడు గాంధీ ఆ సంచీ తీసుకొని డబ్బులు బాగానే పోగుచేశావు మరి నీ చేతికున్న గాజుల మాటేమిటి అనగానే తన చేతికున్న బంగారుగాజులు తీసి జోలెలో వేసిన బాల్యం గడిచి జాతీయోద్యమంలోకి మహిళాభ్యుదయ దృష్టితో దూసుకువచ్చిన స్త్రీ దుర్గాబాయి. ఆ నేపథ్యంతోనే ఆమె ఈ కథను 1929లో వ్రాసింది. బాలవితంతువైన శారదాబాయి సంప్రదాయాలను ధిక్కరించి పూనాకు వెళ్ళి చదువుకొని వచ్చి పాఠశాల స్థాపించి నడుపుతున్న చైతన్యశీలి. ‘నేధన్యనైతిని’ అన్నది ఈ కథలో ఆమె పలికిన అంతిమ వాక్యం. శ్యామసుందరుడు సైమన్ కమీషన్ బహిష్కరణ సందర్భం నుండి జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొంటున్న యువకుడు. ”ప్రపంచమున దైవసృష్టిలో స్వాతంత్య్రదేవతలుగా పరిగణింపబడు చుండు పురుషులు తాము తన స్వేచ్ఛా జీవనమును నిగళబద్ధముగా నొనర్చుకునుటయే కాక తమ భార్య పుత్రికలు గూడ దాస్యవృత్తిని ప్రబోధించి విద్యావిధానములకే దోసి లొగ్గింపజేయుచుండ, ఇక వారల యందు జాతీయతా బీజములు మొలకెత్తుడెట్లు” అని ఆందోళన పడతాడు. శ్యామ సుందరుడు జాతీయోద్యమ క్రియాశీలత వల్ల పాఠశాల నుండి బహిష్కరించబడతాడు. అది అతనిని పోషిస్తున్న అన్నగారికి కంటగింపు అయింది. అన్నగారి ఆజ్ఞకన్నా మాతృదేశ రక్షణ ముఖ్యమన్న ఆలోచనలో అన్నగారి దౌష్ట్యం, జాతీయోద్యమ వ్యతిరేకత సహించలేక ఇల్లు వదిలి ఆ వార్త అక్క శారదాబాయికి ఉత్తరం వ్రాసాడు.
శ్రీనివాసరావు కమలాబాయి దంపతుల పుత్రిక లీల. జాతీయోద్యమ చైతన్యశీల స్వభావం. ఇంట నూలు వడకటం జాతీయోద్యమ గీతాలు పాడటం ఆమెకు సహజంగా అలవడ్డాయి. లీల తండ్రి శ్రీనివాసరావు జబ్బుపడి మరణిస్తూ కూతురికి మాతృభూమిని మరువద్దు, భారతాంబ ఋణం తీర్చు అని సందేశమిచ్చాడు. ఆ తరువాత లీల తల్లి మరణిస్తూ ”చదువుల సరస్వతివై విద్యలేక దేశమన్న నెట్టిదియో యెరుంగక భర్తయున్నతాశయముల కెంతయు ఆటంకమును గల్గించు వృధా ప్రలాపముల యందే కాలమంతయు గడిపి అవిద్యాంధకారమందు మునిగి తేలుచున్న స్త్రీల నుద్ధరింపుము” అని సందేశమిచ్చింది. స్త్రీ విద్య కథలో స్త్రీలుపనులైన పిదప ఇరుగుపొరుగులతో వ్యర్థ ప్రసంగాలు చేస్తూ వృధాపరిచే కాలాన్ని చదువుకు వినియోగించాలని బండారు అచ్చమాంబ చెప్పిన విషయమే ఈ కథలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ తల్లితో చెప్పించిన మాటల సారం గమనించదగింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయిని శారదాబాయి లీలను చేరదీస్తుంది. ఇల్లు వదిలిన శ్యామసుందరుడు అక్కగారి దగ్గరకు వచ్చి తన కార్యకలాపాలు కొనసాగిస్తాడు. లీల, శ్యామసుందరుల మధ్య అనురాగం పెరుగుతుంది. పరులకు చేయూతనిస్తూ స్వార్థరహితమైన సేవను అందిస్తూ ఫలాపేక్షలేని దృక్పథం కలిగి, దేశభక్తి కలిగి, మానవసేవ చేయటంలోనే జన్మసార్థకత పొందుతుందని దుర్గాబాయి గారి భావన.
తాను వితంతువై పూనాకువెళ్ళి విద్యనభ్యసించి ఆంధ్రదేశానికి తిరిగివచ్చి స్త్రీ విద్య కోసం పాఠశాల నడుపుతున్న శారదాబాయికి తాను జబ్బు పడ్డప్పుడు తన తరువాత తన ఆశయం కొనసాగటం గురించి కలిగిన సందేహానికి లీలా శ్యామసుందరుల ప్రవర్తన ఒక సమాధానమవుతుంది. తను జబ్బుపడి అశక్తురాలైతే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళిద్దరూ అతిసహజంగా చేపట్టారు. శారదాబాయి స్త్రీ జీవిత ధన్యత్వం స్త్రీ విద్యా ఉద్యమ నిర్వహణలో స్త్రీల అభివృద్ధి కొరకైన కార్యాచరణలోనే వుందని నమ్మింది. కనుకనే తాను జీవించినంత కాలం తానాపనిలోనే వున్నా తన మరణానంతరం తన ఆశయాన్ని ముందుకు తీసుకొనిపోగల యువతరం తయారుకావటం మరింత తృప్తినిచ్చింది. నేటికి నేను ”ధన్యనైతిని” అన్న ఆమె ఆఖరి మాటలో ఆ తృప్తే వ్యక్తమవుతుంది.
గాంధీజీ విజయవాడలో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి కలకత్తా నుంచి వస్తూ తెలుగుదేశంలోని అనేక పట్టణాలలో ప్రసంగించాడు. అందులో భాగంగానే మద్రాస్‌లో గాంధీజీ ఉపన్యసించాడు. విదేశీ వస్త్రాలను బహిష్కరించమని పిలుపునిచ్చాడు. స్వరాజ్య స్థాపనకు దౌర్జన్య రహిత సహాయ నిరాకరణమే శరణ్యమని అభిప్రాయపడ్డాడు. ఆ స్ఫూర్తితోనే కనుపర్తి వరలక్ష్మమ్మ ”ప్రేమప్రభావము” అనే కథను 1927లో వ్రాశారు.
లక్ష్మీ వెంకయ్యనాయుడు దంపతుల కొడుకు రామస్వామి చదువురీత్యా మద్రాస్‌లోఉంటాడు. గాంధీజీ సహాయనిరాకరణో ద్యమంలో భాగంగా మద్రాస్‌కు వచ్చి ఉపన్యసించినపుడు రామస్వామి ఆ ఉపన్యాస ప్రభావంతో సహాయనిరాకరణోద్యమంలో చేరాలని నిశ్చయించుకుంటాడు. ఆ సంకల్పంతో చదువుకు స్వస్థి పలికి నిర్ణయించుకున్న ప్రకారం స్వగ్రామం చేరతాడు. తండ్రి వెంకయ్యనాయుడుకు కొడుకు ఉద్యోగము చేయాలని, పెద్ద మొత్తం వరకట్నంతో అతనికి పెళ్ళి చేయాలని ఉంది. తండ్రి అభిప్రాయాన్ని తిరస్కరిస్తాడు రామస్వామి. కోపించిన తండ్రి కొడుకును ఇంట్లో ఉండొద్దంటాడు. తల్లి లక్ష్మీ రామస్వామి అభిప్రాయాన్ని అంగీకరించి ప్రోత్సహిస్తూ ఇల్లు, ఒళ్ళు గుల్ల అయ్యే చదువెందుకు? పూర్వులు వ్యవసాయం చేసుకొని పాడిపంటలతో సుఖించలేదా! సొంతంగా రాట్నం మీద నూలు వడుక్కొని నేయించుకొంటె గుడ్డలు మన్నుతాయి. డబ్బు వస్తుంది. మా నాయనమ్మ వడికిన నూలుతో కోకలు నేయించుకుంటే మూడేళ్ళు కట్టేవాళ్ళము. సన్న చీరలు అని గొప్పే కాని మూడు నెళ్ళైనా వుండవు అని నేను కాపురానికి వచ్చేటప్పుడు మా నాయనమ్మ కట్టెడు నూలు వడికి దుప్పటి నేయించి యిచ్చింది. పాతికేండ్లయింది, ఇప్పటికి మాయలేదని ఖద్దరు గొప్పతనాన్ని తెలియపరుస్తుంది. అయినప్పటికి భర్త నిరాకరిస్తాడు.
గాంధీ మద్రాస్ సభలో చెప్పిన అసహాయోద్యమమునకు మూల సూత్రాలైన సత్యము, త్యాగము, అహింస, ఐకమత్యము అను నాలుగు సూత్రాలను గూర్చిన గాంధీ ఆలోచనలు రామస్వామి హృదయంలో గాఢంగా నాటుకొని పోయాయి. దేశహితైక చింతతో మనస్సాక్షి ప్రేరితుడై అతడసహాయోద్యమమును చేపట్టినందులకు తండ్రి కోపిస్తున్నాడు, తల్లి దుఃఖిస్తుంది. జననీ జన్మభూములు రెండు అతనికి సమాన గౌరవపాత్రలుగానే ఉన్నవి. కాన తల్లిని సమ్మిత పరిచి జన్మభూమిని సేవింప నిశ్చయుడై తల్లి సన్నిధికి వెళ్ళాడు. ఉద్యమతత్వం ఆమెకు బోధపరచాడు. తల్లి సమ్మతించింది. ఇల్లు వదిలి అసహాయోద్యమ ప్రచారకుడై రామస్వామి ఆంధ్రదేశమంతా పర్యటించాడు. వానిని చూసి తల్లియే కొడుకు ఉద్యమ నిబద్ధత కఠినుడయిన తండ్రిని కరిగిస్తూ వచ్చింది.
రామస్వామి జాతీయగీతాలు పాడుతూ స్వదేశీ వస్త్రాలు విక్రయిస్తుండగా పట్టుకొని కఠినశిక్ష వేసి జైలుకు పంపిన విషయం తెలిసాక వెంకయ్య నాయుడు తన విలువైన వస్త్రములను తీసి ఆవలపారవేసి, అధికారం వదిలి తన రావుసాహెబ్ బిరుదు వద్దని తిరస్కరించి ఖద్దరు వస్త్రధారియై, ఖద్దరు వస్త్రాలను విక్రయింపవెళ్ళాడు. సంవత్సరం తర్వాత రామస్వామి విడుదల రోజు పుష్ప వర్షం కురిసి జయధ్వానాలు మారుమ్రోగాయి. అపరిచిత వ్యక్తిగా తలచిన తండ్రి దగ్గరకొచ్చి ప్రేమ పూర్వకముగా కౌగిలించుకొంటాడు. అప్పుడు తండ్రిని గుర్తించి తండ్రి చరణాలపై ఆనంద బాష్పాలను వదిలి ఆనందిస్తాడు. రామస్వామి దేశం మీద ప్రేమతో కంకణ బద్దుడు కావటమే కాకుండా తన తండ్రిలో కూడా దేశంపట్ల ప్రేమాంకురాన్ని మొలిపించాడు. ఈ కథ కనుపర్తి వరలక్ష్మమ్మగారి జాతీయోద్యమ చైతన్యాన్ని సూచిస్తుంది. గాంధీ నిర్విహించిన చారిత్రక పాత్రను రచయిత్రి ఈ కథలో నమోదు చేయటం విశేషంగా చెప్పవచ్చు.
కనుపర్తి వరలక్ష్మమ్మ వ్రాసిన మరో కథ ”ఐదు మాసముల ఇరువది దినములు” (1931) మహాత్మాగాంధీ పిలుపునందుకొని విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చేరతాడు గోపాలరావు. అతని భార్య రుక్మిణి ఆమె ఏడోనెల పురిటికి పుట్టింటికి వెళ్ళిన భార్యను పిల్లవాడు పుట్టిన ఐదు నెలల వరకు కూడా చూడలేనంత తలమునకలుగా అతను సత్యాగ్రహోద్యమంలో పని చేస్తుంటాడు. పిల్లవాడితో పుట్టింటి నుండి తన కోసం వచ్చిన భార్య విదేశీ వస్త్రాలు ధరించి వుండటం వల్ల గోపాలరావు ఆమెను పలకరించనయినా పలకరించలేకపోతాడు. ఆ రాత్రికి రాత్రే గోపాలరావును బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. విదేశీ వస్త్ర వ్యతిరేక బోధ చేస్తున్నందుకు ఆరు నెలల కారాగార శిక్ష విధించింది. ఈ సంఘటన చీరలు, నగలు జీవితం అనుకునే మామూలు స్త్రీల ప్రపంచం నుంచి రుక్మిణిని బయటకి తీసుకువచ్చి దేశ స్థితిగతుల గురించి ఆలోచించేటట్లు చేసింది. స్వదేశీవస్త్రాలనే ధరించమని భర్త ప్రబోధించటమే నేరమైనందుకు ఆశ్చర్యపడింది. ఆలోచించే కొద్దీ విదేశీ వస్త్రాలలోని పరాధీనత, అవి ధరించిన తన పట్ల భర్త ప్రదర్శించిన ఉదాసీన వైఖరి అన్నీ అర్థమయ్యాయి రుక్మిణికి. భర్త ఆశయాన్ని అర్థం చేసుకున్న రుక్మిణి స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా ఖద్దరు కట్టి, నూలు వడకటం మొదలు పెట్టింది. సావిత్రిగౌరి నోము నోచుకొనాలని తలపెట్టి ఆ నోము నోచేందుకు తన ఇంటికి వచ్చే యువతులు ఖద్దరు వస్త్రాలనే ధరించాలని షరతు పెట్టింది. స్వదేశీ ఉద్యమం పట్ల ఆమె సంసిద్ధురాలు కావటమే కాకుండా చుట్టూ ఉన్న స్త్రీలను సమీకరించి కార్యోన్ముఖుల్ని చేసింది. భర్త జైలు నుండి వచ్చేసరికి అతని ఆదర్శాలకు, అభిరుచులకు అనుగుణమైన ప్రవర్తనతో తయారైంది. రుక్మిణి భర్త జైలు కెళ్ళిన రోజు నుండి తిరిగి వచ్చే రోజు వరకు ఐదుమాసముల ఇరువది దినములు. ఈ కాలంలో స్వదేశీ ఉద్యమాన్ని ఆశయంగా చేసుకొని తాను నూలు వడకటానికి, భర్తకు అవసరమైన దుస్తులను తాను తీసిన నూలుతో నేయించి పెట్టటానికి ఖద్దరు వస్త్రాలు ధరించిన స్త్రీలతో కలిసి స్త్రీలు చేయదగినవిగా సమాజం నిర్దేశించిన నోములు, వ్రతాలు చేయటానికి ఆమె తనను తాను మార్చుకొంది.
స్త్రీలు భర్తల ఉన్నతాశయానికి భంగం కలిగించని రీతిలో స్త్రీలు విద్యావంతులు కావాలని ”నేనుధన్యనైతిని” కథలో లీల తల్లితో చెప్పించిన మాటల సారాన్ని ఆచరణ రూపంగా వ్యాఖ్యానించిన కథ ఇది. జాతీయోద్యమ ఆశయాలతో కార్యశీలురైన పురుషులకు దీటుగా సహాయకారులుగా వారి సహచరులు కూడా సుశిక్షుతులైనప్పుడే ఉద్యమం బలోపేతం కావటానికి వీలవుతుంది. కనుపర్తి వరలక్ష్మమ్మ ఈ కథ వ్రాసి స్త్రీలకు ఆదర్శంగా చూపదగింది. భర్తల ఉన్నతాశయాల తత్త్వమెరిగి నడుచుకొనటమేనని నిరూపించింది.
శ్రీమతి బసవరాజువేంకటరాజ్యలక్ష్మీ వ్రాసిన ”ఎవరిదదృష్టం” కథలో సరళ, కమల ఇద్దరు స్నేహితులు. బాల్య వివాహా నిరోధానికి పాటుపడుతూ స్త్రీలు కూడా పురుషులతో సమంగా ఉండవలెనన్న ఆలోచన కలిగిన తల్లిదండ్రుల బిడ్డ సరళ. సనాతన సంప్రదాయ జీవన మార్గంలో నడిచే తల్లిదండ్రుల బిడ్డ కమల. ఆ నేపథ్యంలో వారి చైతన్యాలు కూడా ఆ రకంగానే వికసించాయి. తల్లిదండ్రుల ఇష్టానుసారం బాల్యంలోనే వివాహం చేసుకొని యుక్త వయస్సు రాగానే చదువు మానేసింది కమల. సరళ చదువు కొనసాగించి స్కూల్ ఫైనల్ ప్యాసు అయింది. మద్రాస్‌లో జరిగే టెన్నీస్ పందెములు చూడ్డానికి వెళ్ళి అక్కడ టెన్నీస్ ఆటగాడు బేగ్‌ను పెళ్ళి చేసుకోవాలనుకొని అందుకు తల్లిదండ్రుల ఆమోదం పొందగల్గిన స్వేచ్చ, స్వతంత్రాలను అనుభవించే స్థితిలో సరళ వుంది. అయితే ఆమె చేసుకొన్న మతాంతర వివాహం వరుడి పక్షం వాళ్ళకు సమ్మతం కాకపోవటంతో ఆమె వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగుస్తుంది. బాల్యవివాహం చేసుకొన్న కమలదా అదృష్టం? తను చదువుకొని కోరుకొన్న పెళ్ళి చేసుకొన్న సరళదా అదృష్టం? అంటే బాల్య వివాహం చేసుకున్నప్పటికి కమల అత్తమామలకు, భర్తకు శుశ్రూష చేస్తూ నూలు వడకటం పిల్లలందర్ని చేర్చుకొని హిందీ నేర్పటం, వంట, జాతీయోద్యమ కార్యకలాపాలకు సాగిస్తూ ఇంటిని భూలోక స్వర్గంలా చేసుకొన్న కమలదే అని రచయిత్రి అభిప్రాయంగా కనబడుతుంది. బాల్య వివాహాలు తప్పు కాదనేది రచయిత్రి భావన. సరళ, కమల దగ్గరికి చేరి పరిస్థితి తెల్పి ”నా గతి యిల్లా అయినదని” తన మీద తానే జాలిపడుతున్నట్లు అన్న మాటలలోను మతాంతర వివాహాల పట్ల రచయిత్రి విముఖతే కనిపిస్తుంది. కమల భర్త దామోదరం కూడా సరళను ఆదరిస్తాడు. ఇంతలో సహాయనిరాకరణోద్యమంలో దామోదరం జైలుకు వెళ్తాడు. తిరిగి వచ్చేవరకు సరళ, కమల ఆయన పని చేయదల్చుకున్నారు. సరళ ఇదివరకు పాశ్చాత్య వ్యామోహమున కొన్న జపాను, బెంగుళూరు సిల్క్ చీరలు అన్నీ అగ్ని సంస్కారం చేసింది. ఖద్దరు చీర ధరించి, ఖద్దరు కున్న గౌరవం విదేశీ బట్టలకు లేదని ప్రచారం చేస్తూ ఖద్దరు బట్టల మూట నెత్తిన బెట్టుకొని ఖద్దరమ్మేది. సంసారంలో వైఫల్యం చెందిన స్త్రీలకు జాతీయోద్యమ ఒక ప్రత్యామ్నాయ ఆదర్శం కార్యక్రమం కావటం గమనించవచ్చు.
సరళ పేరు ప్రఖ్యాతులు ప్రతి పత్రికలో చదివి పశ్చాత్తాపంతో బేగ్ సరళను వెతుక్కుంటూ వచ్చాడు. సరళ ”ఇకరాను” దేశమే నాకు సంసారం, నీకిష్టమైతే దేశసేవ చేయమని మాతృదేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాతే మనకు సంసారం, అనటంలో ఆమె స్వాతంత్య్ర కాంక్షను బలంగా చూపించింది రచయిత్రి. ఒకరోజు బెజవాడలో విదేశీబట్టల దుకాణం దగ్గర పికెటింగ్‌లో అరెస్టయి ఆరునెలలు శిక్షతో రాయవేలూరు జైల్లో వేస్తే ఆహార నియమాలు పడక 21 రోజులు ఉపవాసం ఉంటుంది. దేశం కోసం ప్రాణాలు ధారపోయటం నా అదృష్టమని తల్లిదండ్రులకు, స్నేహితురాలికి తెలియజేస్తూ దేశసేవ మాత్రం ఏనాటికి మరువద్దని ఆఖరు మాటగా చెప్పి ప్రాణాలు వదులుతుంది.
సరళ ఉన్నతాశయాల కొరకు పనిచేసి ప్రాణాలు వదిలినందున కమల తన కూతురికి సరళ అని పేరు పెట్టుకొంటుంది. సకాలంలో పెళ్ళి చక్కని సంసారం భర్త ఆశయాలకనుగుణమైన ఆశయాలు ఆచరణ వున్న కమలదా అదృష్టం సంసారం జీవితం విఫలమైనా జాతీయోద్యమంలో సార్థకమైన జీవితం గడిపిన సరళదా అదృష్టం అన్న ప్రశ్న పాఠకులను వెన్నంటుతూనే వుంటుంది. ఒకసారి ఒకరివైపు, మరొకసారి మరొకరి వైపు మొగ్గుతుంది మనసు. ఆ ఇద్దరూ ఒకే వ్యక్తిత్వంలో భాగం కావటం రచయిత్రి ఆకాంక్ష.
జాతీయోద్యమ నేపథ్యం నుంచి వచ్చిన స్త్రీలు వ్రాసిన కథలలో మరింత విలక్షణమైంది. తాడి నాగమ్మ వ్రాసిన ఒక ముద్దు కథ. జాతీయోద్యమ కార్యకలాపాలలో చైతన్యంతో చొరవతో పాల్గొంటున్న స్త్రీల చరిత్రను ప్రస్తావిస్తూ సామాజిక రంగాలలోకి వచ్చే స్త్రీలు ఎదుర్కొనే సున్నితమైన సమస్యను మన ముందు పెట్టిందీ కథ.
కథలోని యువతికి 18 ఏళ్ళు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొంటూ స్వదేశ వస్త్ర విక్రయం తన పనిగా చేస్తున్నది యువతి. ”నేధన్యనైతిని” కథలో లాగ శారదబాయిలాగ వితంతువు కాదు. కనుపర్తి వరలక్ష్మమ్మ గారి ”ఐదు మాసముల ఇరువది దినముల” కథలో లాగ స్త్రీ వలె ఇల్లాలు కాదు. ”ఎవరిదదృష్టం” కథలోని సరళలాగ విఫలమైన సంసారం కలది కాదు. పెళ్ళికాని యువతి స్వతంత్రంగా, స్వచ్ఛందంగా ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తి. స్వదేశీ ఉద్యమం వెనుక ఉన్న దేశీయ ఆర్థికబలం గురించి తెల్సిన విద్యావంతురాలు, మేధావి.
విదేశీ వస్త్రాల కొనుగోలు వల్ల సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని కొంత కాలం తర్వాత భారతీయులందరూ బిక్షాందేహి అనే స్థితికి వస్తారని ఆవేదనతో స్వదేశీ వస్త్రాలు మాత్రమే కొనమని ప్రజలను వేడుకుంటుంది. అప్పుడు ఆమె ఉపన్యాసం విన్న ధనమదాంధుడైన ఒక పురుషుడు ఒక ముద్దు ఇస్తే స్వదేశీ దీక్ష అవలంభిస్తానంటాడు.
సామాజిక ఉద్యమాలలోకి ప్రవేశించే స్త్రీలకు మాత్రమే ఎదురయ్యే ప్రత్యేక అనుభవం ఇది. స్త్రీలను లైంగిక దృష్టితో చూడటానికి మాత్రమే అలవాటు పడ్డ పురుషుల నుండి ఉద్యమాలలోకి వచ్చే స్త్రీలకు ఎదురయ్యే సమస్యను తాడి నాగమ్మ 1930 లలోనే ఊహించటం గమనించదగింది. ఇక్కడ ఆ యువతి ఒక దేశభక్తురాలుగానో వలసపాలస మీద ధిక్కారం ప్రకటించిన తిరుగుబాటుదారుగానో, మేధావిగానో ఆ పురుషుడికి కనబడలేదు. తన అనుభవానికి, సిద్ధంగా ఉన్న, తాను హేళన చేయడానికి, అవమానించడానికి అనువుగా ఉన్న రెండవస్థాయి పౌరురాలుగా మాత్రమే కనబడింది. అందువల్లనే ఒక ముద్దు ఇస్తే ఉద్యమానికి పని చేయగల్గుతానని అనగలిగాడు. ఇలాంటి పరిస్థితులలో యువతులు అవమానంతో దుఃఖపడటం కాదు చేయాల్సింది. ఆత్మగౌరవంతో అలా అన్నవాళ్ళను ధిక్కరించగల్గాలి. ఈ కథలో యువతి చేసిన పని అదే. ఆమె మొక్కవోని ధైర్యంతో నా కిరువురు అన్నలు గలరు. అనుదినము నన్ను ముద్దిడుకొని ఆశీర్వదించి శాంతి సమరానికి పంపుచున్నారు. తరతరాల నుండి దాస్యమును అనుభవిస్తున్న మాతృభూమి విముక్తికోసం విదేశీ వస్తువులనే విషానికి ఆహుతి అవుతున్న నీలాంటి సోదరున్ని రక్షించుకోడానికి ఒక ముద్దు ఇవ్వలేనా? నీవు నా మూడవ తోబుట్టువు. ఒకటి కాదు, ఎన్నైనా పొందమని ఆమె తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ముద్దు అతని దృష్టిలో ఒక లైంగిక చర్య. ఆమె దృష్టిలో స్నేహాన్ని, సానుభూతిని, ఆప్యాయతను వ్యక్తీకరించే చర్య. ముద్దును దాని లైంగికత్వ ముద్ర నుండి విముక్తం చేసి ఒక మానవీయ సంస్పందనగా నిలబెట్టటం ఆ యువతి వివేకానికి, ఔన్నత్యానికి గుర్తు. ఉద్యమాలలో స్త్రీల భాగస్వామ్యం జాతీయాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని కల్పుకొని సాగాల్సిన స్థితి గురించి ఈ కథ చెప్పింది.
తాడి నాగమ్మ గారు వ్రాసిన ”ఒక ముద్దు” కథలో దేశీయ స్వాతంత్య్రఆకాంక్షతో పాటు, విదేశీ వస్తు బహిష్కరణ పెనవేసు కున్నాయి. స్త్రీలను జాతీయోద్యమంలోకి సమీకరించటమే కాక, సామ్రాజ్యవాద సంస్కృతిని వ్యతిరేకించే చైతన్యాన్ని, స్త్రీగా స్వతంత్ర వ్యక్తిత్వ చైతన్యాన్ని కూడా రచయిత్రి ఇందులో కనబరచారు.
ఈవిధంగా స్త్రీల కథలు సంఘసంస్కరణోద్యమ, జాతీ యోద్యమ ఆదర్శాలను ఆయా ఉద్యమాలలో క్రియాశీలక భాగస్వామ్యాన్ని చైతన్య చరిత్రను నమోదు చేశాయి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
తొలి తరం కథా రచయిత్రులు రాసిన కథల పరిచయం, విశ్లేషణ చాలా బాగుంది.
కథల విశ్లేషణ అర్ట్టవంతంగా, ఆలోచనాత్మకంగా ఉంది.
వ్యాసం చాలా బాగా రాశారు.
శోభారాణి గారూ,
ఆధునిక తెలుగు కథకి సంబంధించినంతవరకూ స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా అందరూ తమవంతు కృషి చేశారు. కానీ కథా విమర్శదగ్గరకి వచ్చేసరికి మాత్రం స్త్రీలు వెనుకబడి పోయారు. ఎందుకంటారు ?