మనకి అలసటా? ఎవరికి పట్టింది?

డా|| వీణా శతృఘ్న
ఈ మధ్య మీకు ఎప్పుడూ అలసటగా ఉంటోందా? ఎప్పుడూ పడుకోవాలనిపించటం, ఏడెనిమిది అయినా నిద్ర లేవకపోవటం, ఎంతకీ తెమలని ఇంటి చాకిరీ చెయ్యాలంటే విసుగు, మెట్లెక్కితే ఆయాసం, గబుక్కున లేచి నిలబడితే కళ్ళు చీకట్లు కమ్మటం, జ్వరం లేకపోయినా కాళ్ళు నెప్పులు ఉండటం? అయితే మీకేదో సమస్య ఉందన్నమాటే. బహుశా మీకు ఇంట్లో పని ఎక్కువై ఉండాలి లేదా మీ ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేసైనా ఉండాలి. ఇలాంటప్పుడు, ఆ టి.వి.లో చూపించే ప్రకటనల్లో భర్త షర్టుమీద మరకలు పోయినందుకు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వే ఆడవాళ్ళని చూస్తేనూ, ఏదో నూనెలో (ఏనూనైనా ఒకటే డాక్టర్ల నడిగితే) పది రకాల వంటలు చేసినా కళకళ్ళాడుతూ కనపడే ఆ ఆడవాళ్ళ ముఖాలు చూస్తేనూ ఒళ్ళు మండుకొస్తుంది.
మన శరీరం పంపించే సంకేతాలను మనం గమనించటం మంచిది. కానీ మనలో చాలా మందిమి వీటిని పట్టించుకోం. మన శరీరం పనిచేయటానికి నిరాకరిస్తోందని గ్రహిస్తే మనమేదో తప్పు చేసినట్లు బాధ పడతాం. మన ఆరోగ్యం సరిగా లేదని గ్రహించగలిగినా మొదటి నుంచి అన్ని సమస్యలు నెత్తినేసుకునే ధోరణిలో పెరిగిన వాళ్ళమవటం వల్ల, అనారోగ్యానికి మనని మనమే నిందించుకుంటాం.
”వెధవ నిద్ర! ఎంతకీ మెలకువ రాలేదు!”
”ఈ కాళ్ళకేమొచ్చిందో ఒకటే లాగుతున్నాయి.”
అన్ని విసుక్కుంటూ కూడా తమకన్నా ఇంట్లో వాళ్ళ అవసరాలే ముఖ్యమైనవని ఆడవాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అలాగే అనుకోవాలని ప్రపంచం భావిస్తుంది. అదే స్త్రీ లక్షణం. మరి, చిన్నప్పుడు మనం ముట్టు నెప్పి గురించైనా, పని గురించైనా (చిన్నప్పుడు ఆడప్లిలలేగా తల్లికి పనిలో సాయం చేసేది.) కంప్లైంట్‌ చేస్తే ”అదే అలవాటైపోతుంది. ఓర్చుకోవటం నేర్చుకో. రేపు పెళ్ళై పిల్లలు పుడ్తే అన్నీ పోతాయి”. అని తీసిపారేస్తారు. మనం బాధని దాచుకోటం నేర్చుకుంటాం. దాంతోపాటు మన శరీరాన్ని, శరీర ధర్మాల్ని అసహ్యించుకుంటాం.
”ఆడజన్మే దరిద్రపు జన్మ’ అని తిట్టుకుంటూ బాధల్నీ, అనారోగ్యాన్నీ లెక్క చెయ్యకుండా గడుపుకు పోవటం స్త్రీ లక్షణంగా అందరూ (మనం గూడా) భావిస్తారు. సంవత్సరాల తరబడి సాగిన ఈ అణచివేత మూలంగా స్త్రీలు తమ బాధలు ఇంట్లో వాళ్ళ దృష్టికి తీసుకురారు. ఇంట్లో వాళ్ళు కూడా వారికి విశ్రాంతి, ఆరోగ్యం మీద శ్రద్ధా, మంచి ఆహారం అవసరమని గుర్తించటం మానేస్తారు. ఇంట్లో అందరికి అన్ని సౌకర్యాలూ కలిగించటానికి, ఆడవాళ్ళు తలకిందుల వుతారు. సంవత్సరాల తరబడి సాగిన ఇలాంటి జీవితంలో ఆడవాళ్ళు స్తబ్దంగా నిర్లిప్తతగా ఉండటం జరుగుతుంది. కొంతమంది విషయంలో వృద్ధాప్యం వరకూ కూడా ఇలాగే సాగుతుంది. పనివల్లో, అనారోగ్యం పల్లో శరీరం ఎదురు తిరిగితే ఆడవాళ్ళు వారి శరీరాల్ని అసహ్యించు కుంటారు.
అలసట అనేది ”ప్రత్యేకతలేని” రోగ లక్షణం. గుండెనొప్పి, జ్వరం లాంటి వాటికి స్పష్టమైన రోగలక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఇంట్లో వాళ్ళూ, డాక్టర్లూ అందరూ గుర్తిస్తారు. జ్వరం వస్తే వెంటనే ఆ మనిషిని డాక్టరు దగ్గరికి తీసుకువెళ్తారు. రక్త పరీక్ష, ఎక్స్‌రే పరీక్షలు అన్నీ చేసి రోగనిర్దారణ చేశాక, డాక్టర్లు తమకు ఇష్టమొచ్చినన్ని మందులు ఇస్తారు. ‘అలసట’ అనే మాట ఆడవారి నోట్లోంచి వస్తే డాక్టర్లు వినటం మానేస్తారు. ఆ మాట వారికి ‘అర్థం లేనిది’గా కనిపిస్తుంది. ఇంతలావు వైద్యగ్రంథాల్లో మనం మామూలుగా వాడుకునే అలసట లాంటి పదాలు కనిపించవు. మన శరీరంలో భాగాలని, వేటికవి విడదీసి చూడటానికి డాక్టర్లు అలవాటు పడ్డారు. వారికిచ్చిన తర్ఫీదు అలాంటిది. జబ్బు ఏ శరీర భాగంలో ఉందో అర్థమయ్యేట్లు మనం జబ్బు లక్షణాలు చెప్తే వాళ్ళు వింటారు. ఉదాహరణకి మూత్రం పోసినప్పుడు మండటం, చలితో జ్వరం రావటం, గర్భసంచీ జారటం లాంటివి. నిద్రపట్టక పోవటం, అలసట, పనిచెయ్యలేకపోవటం వాళ్ళకి అర్థం లేనివిగా కనిపిస్తాయి. ఆడవాళ్ళు తమ లాగా శరీర ధర్మశాస్త్రం నేర్చుకోలేదని వాళ్ళు గ్రహించలేరు, పాపం! శరీరాంగాల్ని వేటికవే విడిగా ఉన్నట్లు (వైద్య గ్రంథాల్లో బొమ్మల్లాగా) రోగులు అనుకోలేరు మరి!
అస్తమానం చాకిరీ చేసే ”గృహిణి” అని పిలువబడే ఈ ప్రాణిని గురించి తెలుసుకోవాలనే తపన వాళ్ళకి కలగదు. అందుని పెళ్ళైన ఆడవారి బాధల్తోనూ, తల్లి కావటం వల్ల వచ్చే ఇబ్బందులతోనూ, స్త్రీల అలసటను ముడిపెట్టాలని చూస్తారు. ఈ విషయంలో వీరెంత అజ్ఞానులైనా నోరుతిరగని పేర్లున్న మాత్రల్నో, గొట్టాల్నో బరబరా కాగితం మీద రాసేస్తారు – తమకు అర్థం కాని జబ్బు నయం చేయటానికి! చాలా మంది డాక్టర్లు అర్థంకాని జబ్బుల్ని ‘మానసికం’ అని అనేస్తారు.
దీని ప్రభావం ఆడవారి మీద ఎలా వుంటుందో చూడాలి. వారికి ఎలాంటి వైద్య సహాయం అందుతుంది? తమ అనారోగ్యానికి తమనే నిందించుకునే పరిస్థితిలో, రోజుకి దాదాపు 14 నుంచి 16 గంటలు పనిచేయాల్సిన సందర్భంలో, డాక్టర్ల పరిజ్ఞానం కూడా అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు, ఆడవారి పరిస్థితి దారుణంగా ఉండటంలో ఆశ్చర్యంలేదు. రక్తహీనత, మూత్రంలో ఇన్ఫ్‌క్షన్‌, తెల్లబట్ట గర్భసంచీ జారటం, అధిక రక్తస్రావం, చిన్న వయస్సులోనే రక్తపోటు, డయాబిటీస్‌, థైరాయిడ్‌ సరిగ పనిచేయకపోవటం, ప్రసవం శస్త్రచికిత్స తరువాత వచ్చే సమస్యలు ఇంకా చాలా కారణాలు అలసట, పళ్ళు నొప్పుల రూపంలో పైకి కనిపించవచ్చు, లేక క్షయ ముందు వచ్చే లోజ్వరం, అమీబియాసిస్‌, గాస్ట్రైటిస్‌ వల్ల కూడా కావచ్చు. కొన్ని కారణాలు అర్థమయేవి. కొన్ని అర్థం కానివి. బాక్టీరియా, వైరస్‌ మొదలైన ఇన్ఫెక్షన్లు కలిగినప్పుడు అవి ఉత్పత్తి చేసే విషపదార్థాలు శరీరంలో కణాలకు పాకి, శరీరం మామూలుగా పనిచెయ్యకుండా అడ్డుపడతాయి. ఈ పరిస్థితి అలసటగా మార్పు చెందుతుంది. హార్మోనులు సరిగా పనిచెయ్యక పోవటం వల్ల వచ్చిన శరీరధర్మాల్లో మార్పూ, రక్తపోటూ, జీవకణాల మీద వత్తిడి కలిగిస్తాయి. ఇది కూడా అలసటకు దారి తీస్తుంది. ఇన్‌ఫెక్షన్‌, రక్తపోటు, డయాబిటిస్‌, ఇంటిచాకిరీ, పిల్లల పోషణ, ఉద్యోగపు వత్తిడులు ఇవన్నీ కూడా ఆడవాళ్ళ అలసటకు కారణం కావచ్చు. అప్పుడు వాళ్ళు దాన్ని గురించి కంప్లైంట్‌ చెయ్యటం జరుగుతుంది. డాక్టర్లకి నిజంగానే అర్థంకాదు. ఒక్కొక్కప్పుడు జ్వరం, డయాబిటిస్‌, రక్తపోటు లాంటి కొన్నింటిని మాత్రం సరిగ్గా నిర్ధారణ చెయ్యగలుగుతారు. మిగతావి డాక్టర్లకి అంతుపట్టవు.
అయినా డాక్టర్లు తగిన ప్రశ్నల ద్వారా మన జీవితాల గురించి, మన సమస్యల గురించీ అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తే, వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ళ పుస్తకాల పరిధి లోంచి గిరిగీసుకొని కూర్చున్నంతకాలం వారికేమీ అంతుపట్టదు.  ఉదాహరణకి స్త్రీలపనీ, వారు తీసుకునే ఆహారం, కుటుంబం రాబడి మీద వారికున్న అధికారం, జబ్బు చేసినప్పుడు కుటుంబంలో వారికి లభించే సహాయం – వీటిని తెలుసుకోవటం, వ్యాధి నిర్ధారణ పరీక్షలంత ముఖ్యమైనవి. ఈ రకం దృక్పథంతో చూడటం చాలా అవసరం.
డాక్టర్లు శరీరంలో ఏ భాగానికి జబ్బు చేసిందీ, ఏ సూక్ష్మక్రిమి వల్ల వచ్చిందీ, కనుక్కోవాలని చూస్తారు! ‘వ్యాధికి సంబంధించిన’ విషయాలు మాత్రమే తెలుసుకోవాలని చూస్తారు. అందుకని చివరికి సరైన రోగ నిర్ధారణ చెయ్యలేకపోతారు.
| .    డాక్టర్లు గమనించే విషయాలు :
అ)    ఇన్‌ఫెక్షన్‌కి, జ్వరానికీ కారణాలు : మూత్రం పోస్తున్నప్పుడు నెప్పి, మంటా ఉండటం, తరుచూ మూత్రం పోయాలని అనిపించటం, తెల్లబట్ట, చలితో వచ్చే జ్వరం – ఈ సమస్యలు ఉన్నాయా లేవా అని డాక్టర్లు చూస్తారు. (మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి.) వణుకుతో వచ్చే చలిజ్వరం, మలేరియా వల్ల వస్తుంది. వణుకు విపరీతంగా వుండేది కొద్ది సేపే, అదీ రోజు విడిచి రోజు వస్తుంది. తక్కువ టెంపరేచర్‌తో సాయంత్రం వచ్చే జ్వరం క్షయ వల్ల కావచ్చు. ఈ జ్వరం ఎక్కువగా లేకపోయినా, అలసట విపరీతంగా కలుగుతుంది. దాదాపు 2, 3 నెలల వరకూ దగ్గుతో కానీ లేదా దగ్గు లేకుండా కూడా ఈ జ్వరం రావచ్చు. వైరస్‌ వల్ల వచ్చే జ్వరాలు చాలా ఎక్కువ టెంపరేచర్‌తో, కొద్దిపాటి దగ్గుతో 3 నుంచి 7 రోజుల వరకూ రావచ్చు. టైఫాయిడ్‌ వల్ల వచ్చే జ్వరం, మందులు ఇచ్చినప్పటికీ 10-15 రోజుల వరకూ ఉండొచ్చు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చే జ్వరాల్లో విపరీతమైన దగ్గు ఉంటుంది. ఇదే దీని ముఖ్య లక్షణం. జ్వరంతో పాటూ నీళ్ళ విరోచనాలుంటే, దానికి వైద్యం అవసరం.
ఆ)    డయాబిటిస్‌, రక్తపోటు : పదే పదే డాక్టర్ల దగ్గరికి వెడుతూ ఉంటే, ఎన్నో పరీక్షలు చేశాక (రక్తం, మూత్రం మొదలైనవి). ఈ రోగాలు నిర్ధారించటం జరుగుతుంది. మామూలు మూత్ర పరీక్షలో డయాబిటిస్‌ ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. వెళ్ళినప్పుడల్లా అలవాటుగా బి.పి. చూసే డాక్టర్లు రక్తపోటు ఉన్నట్లు తెలుసుకోగలుగుతారు.
|| .    కొంత తరిచి ప్రశ్నించి తెలుసుకోగల విషయాలు :
అ)    బహిస్టుకి సంబంధించిన సమస్యలు : గైనకాలజిస్టులు మాత్రమే వీటిని తెలుసుకునే తర్ఫీదు పొందుతారు. మిగతా డాక్టర్లు వీటిని చిన్నచూపు చూస్తారు. లేడీ డాక్టర్లు కూడా, రుతుక్రమం, కాల పరిమితి, రక్తస్రావం ఎంత మోతాదులో ఉంది, ముట్టునెప్పి గురించి ప్రశ్నించి తెలుసుకోవచ్చు. అయితే ఈ సమస్యలు పిల్లలు పుట్టకపోవటానికి కారణం అయితే తప్ప లేడీడాక్టర్లు కూడా ఈ సమస్యల్ని పట్టించుకోరు. కాపర్‌-టి వల్ల అధిక రక్తస్రావం కావటం, గర్భసంచీ జారటం గురించి సమాచారం అడిగి సేకరించాలి. అప్పుడు కాపర్‌-టిని తీసివేయాల్సి ఉంటుంది. గర్భసంచీని శస్త్రచికిత్సతో సరిచేయాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో, నడుము నొప్పి లాంటి బాధ గురించి పట్టించుకునేదెవరు?
ఆ)    ప్రసవం, శస్త్రచికిత్స జరిగి ఎంత కాలమైందో డాక్టర్లు పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు పట్టిచ్చుకున్నా చేయగలిగిందేం లేదు. ఇవి శక్తిని పూర్తిగా హరించటమేగాక, దీర్ఘకాల సమస్యలకి దారితీస్తాయి కూడా. ఈ సమస్యల్ని ఫలానా అని గుర్తించి, వైద్యం చేయటం కష్టం. అయినా అడిగి కనుక్కోవటం మంచిది.
||| .    కొన్ని సమస్యల్ని నిర్ధారణచేసే పరీక్షలు చాలా చిన్నవి. ఎక్కువ ఆసక్తికరమైనవి కావు. అందువల్ల వీటిని డాక్టర్లు పట్టించుకోరు. అవి ఏమిటంటే-
1.    రక్తహీనత
2.    నడుము నొప్పి
3.    తెల్లబట్ట
4.    అమీబియాసిస్‌
5.    గ్యాస్ట్రైటిస్‌
6.    థైరాయిడ్‌ లాంటి గ్రంధులు సరిగా పనిచేయకపోవటం.
చాలా మందికి ఉండే రక్తహీనత వారి దృష్టిలోపడదు. నాలుక, కళ్ళు, గోళ్ళు పాలి పోయి వున్నాయా అని చూస్తే చాలు. లేకపోతే హిమోగ్లోబిన్‌ పరీక్ష అనే చాలా చిన్న పరీక్ష చేయిస్తే చాలు. రక్తహీనత సంగతి తెలుస్తుంది. 60 నుంచి 80 శాతం మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నా ప్రైవేటు డాక్టర్లు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోరు. ఇది మగవారి సమస్య కాకపోవటం వల్లనేమోమరి. నిజానికి ఇది కేవలం స్త్రీల సమస్య.
మన సమస్యల్ని జాగ్రత్తగా ఒకదాని తరువాత ఒకటి పరీక్షించే డాక్టర్లు చాలా అరుదు. మనం చెప్పే బాధల్ని వారు గమనిస్తారా లేదా అన్నది, వారి వయస్సు, చదువు, డాక్టరు హోదాని బట్టి వుంటుంది.
జు.    సాధారణ డాక్టర్లు : అలసట అనే మాట చెవిన బడగానే బి-కాంప్లెక్స్‌ ఇంజక్షన్లు తీసుకోమంటారు. మనం ఇంకా కొంత సమాచారం ఇస్తే కొంత నిర్ధారించ గలుగుతారు. కొందరు డాక్టర్లు అలసటకి ఐ.వి. గ్లూకోజ్‌  ఎక్కించమని కూడా చెప్పవచ్చు. బి-కాంప్లెక్సు ఇంజక్షన్‌లో కొన్ని విటమిన్లు ఉంటాయి. కాని ఐదారు గంటల్లో మూత్రంతో పాటు ఇవి శరీరంలోంచి బయటకు పోతాయి! పైగా ఇంజక్షన్‌ మూలంగా ఇన్‌ఫెక్షన్‌ శరీరంలో ప్రవేశించవచ్చు. కామెర్లు (ఇపుడు ఎయిడ్స్‌ కూడా) లాంటివి.
మహానిపుణులు, ఫైవ్‌-స్టార్‌ ఆసుపత్రి డాక్టర్లు : పది రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించకపోతే వారి పరువు పోతుంది. వీరు రోగితో చాలా, తక్కువ మాట్లాడతారు. మందుల పేర్లు మాత్రం కాగితం మీద ఇష్టం వచ్చినట్లు బరికేస్తారు.
ఉదాహరణకి మీరు తలనొప్పి, కళ్ళు తిరగటం గురించి చెప్పారనుకోండి. కాగితం మీద ఇ.ఇ.జి (జూజూస్త్ర) లేదా సి.టి. (్పుఊ) స్కాన్‌ అని వెంటనే పడిపోతుంది. జ్వరం పేరెత్తారా, రకరకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, కళ్ళె పరీక్ష, ఎక్స్‌-రే పరీక్షలు తథ్యం. ఇక దగ్గుకి చెప్పనే అక్కర్లేదు.
(రోగ నిర్ధారణ, ఖరీదైన నిర్ధారణ పరీక్షలు కలిసి ఒక కొత్త సంస్కృతిని తయారు చేశాయి. వీటికి చాలా డబ్బు కావాలి. ఇదివరకు రోగిని ముఖాముఖి పరీక్షించి ప్రశ్నించి వైద్యులు తెలుసుకునే విషయాలు ఇప్పుడు ప్రయోగశాలలో వేరే వైద్యులు రక్తాన్ని, మూత్రాన్ని పరీక్షించి రాసిన రిపోర్టులు చూసి తెలుసుకుంటున్నారు. దీనితో రోగికీ, వైద్యులకీ మధ్య పరస్పర ప్రతిస్పందన మాయమయింది. పల్లెటూళ్ళ నుంచి స్కాన్‌ పరీక్ష చేయించుకోటానికి వస్తారు. వారితో పాటు ఎవరైనా వచ్చి ఈ పరీక్ష చేయిస్తే వారు తమపై ఎంతో ఆపేక్ష చూసినట్లు భావిస్తారు.)
మీరు ఇంటిచాకిరీ గురించీ, మీకు పని అంటే విముఖత కలగటం గురించో చెప్తే, డాక్టర్లు ముందు మీకు నిద్రమాత్రలు (ట్రాంక్వి లైజర్స్‌) ఇచ్చి తరువాత మానసిక రోగ నిపుణుల దగ్గరకు వెళ్ళమని చెప్తారు. ఈ మాత్రలు నిద్రమత్తు కలిగించటమే కాక తరువాత మరింత అలసటగా  అనిపించేట్లు చేస్తాయి. కానీ చాలామంది విషయంలో టానిక్కులూ, నిద్రమాత్రలూ (సెడెటివ్స్‌) విటమిన్లూ గుప్పి చేస్తారు. ఇది ఆడవాళ్ళ నోరు మూయించే తిరుగులేని అస్త్రం. వారు చెప్పే బాధలకి ఏ మాత్రం విలువనివ్వక పోవటం కాకపోతే ఏమిటి? అందుకని ఈసారి మీకు పెద్ద మందుల జాబితా యిచ్చినప్పుడు, మీరు అవి ఒక్కొక్కటి ఏం పని చేస్తాయో కనుక్కోండి. మీరేం మందులు తీసుకుంటున్నారో తెలుసుకునే హక్కు మీకుంది.
(జూలై- సెప్టెంబర్‌ 93)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.