అపరాజిత

బి. కళాగోపాల్‌ 
మరోసారి సునామీ రాలేదు
ప్రకృతి కాళరాత్రిలా విరుచుకపడలేదు.
నిశ్శబ్ద నీరవఝరి
పాశవికతను కరగించలేదు.
ఒక శాడిజం, అమానుషం
బలిపీఠంపై నీ పరిశుద్ధ రక్తం
ఏ పాపులను తడపలేదు.
పంచభూతాలు స్తబ్ధులయ్యాయి
జరిగే దారుణాన్ని చూస్తూ.
దిక్కులు ఘనీభవించాయి
సాక్షులుగా ఉండలేమంటూ
మానవత్వం వివశమైంది
నీవు తలవాల్చేసినపుడు
హింసాజ్వాలలలో
మనస్సాక్షి ఆహుతయింది.
రాలిన రెండు అశ్రుబిందువులు
లెక్కలేనన్ని దీనావస్థల్ని
జనం మొహంపై చరిచాయి.
ఎగిరే సీతాకోకచిలుక
రెక్కల్ని కత్తిరించారు.
కొత్తతరం (అ)నాగరికం
ప్రబలుతున్నది.
జరిగే దుర్గతిని చూడలేమంటూ
సుషుప్తమైంది మినీ సొసైటీ
అపరాజిత హృదయాంతరాల
అంతర్మథన ఆక్రందనలను
వినలేనంటూ ఇంద్రధనుస్సు
వివర్ణమైపోయి, ఒక రంగును
పూల ఎడారిలో వదిలేసింది.
జీవన స్రవంతిలో
ఒక బ్రతుకు నిర్జీవమైనది.
ఆటవికత ముందు ఒక చైతన్యదీప్తి
కొడిగట్టింది.
స్మృతి వనంలో నక్షత్రమై భాసిల్లుతోంది.
(మహిళలపై జరిగే అరాచకాలకు నిరసనగా…)
సుంకోజి దేవేంద్రా
అమ్మలా లేను
ఒకటో పాదం
ఆ కళ్లు… పచ్చిపాలలో నేరేడుపళ్లు
విరిసిన మల్లెలమీద తుమ్మెదలు
సంతకం చేయని తెల్లకాగితాలు
ఆ పెదవులు… శీతల పెట్టెలోంచి తీసిన బాలభాస్కరులు
పల్చటి మంచుకప్పిన గులాబీ రేకులు
తదియనాటి జంటనెలవంకలు
ఆ బుగ్గలు… జున్నుముద్దలు
తేనెకారే రసగుల్లాలు
ఆ వేళ్లు… నునులేత ఈత రెమ్మలు…
అరే… అంతా మీ అమ్మలానే వున్నావే…!
అమ్మ ఫొటోను చేతుల్లో పట్టుకుని కిలాకిలా నవ్వులు
రెండో పాదం
ఆ కళ్లు… ఎక్కుపెట్టిన పుష్పబాణాలు
సమస్తాన్నీ తనవైపు లాక్కునే అయస్కాంతాలు
దేనినైనా ఢీకొనే ఫిరంగులు
అభాగ్యుల ముందు మంచుకొండలు
ఆ పెదవులు… తూటాలు దట్టించిన తుపాకులు
రెండే రేకులున్న గన్నేరుపూలు
కరుణకు కాఠిన్యానికి వాహికలు
ఆ బుగ్గలు… నులివెచ్చని లడ్డూలు
నునుపైన మామిడి పండూలు
ఆ వేళ్లు… ఇంటి పనికోసమే పుట్టిన దశావతారాలు
అరే… అంతా మీ అమ్మలానే వున్నావే…!
అమ్మ ఫొటో ఎదుట నిల్చుని నిశిత పరిశీలన
మూడో పాదం
ఆ కళ్లు… బడబానలం దాచుకున్న సముద్రాలు
అడ్డుకున్నా ఆగని వర్షరుతువులు
జీవంలేని సూర్యచంద్రులు
ఆ పెదవులు… దుఃఖాన్ని బిగబట్టిన నిప్పుకణికలు
అగ్నిపర్వతాలు దాచుకున్న పచ్చటి శిఖరాలు
అయ్యల్లారా… అమ్మల్లారా… అవుతారా మీరు
ఎన్ని శతాబ్దాలు… ఎన్ని తరాలు
అమ్మ… అమ్మ… అమ్మ… అమ్మ అలాగే వుండే
శాంతిమూర్తిలా… దుఃఖాగ్నిలా
కాళ్లు కదలకపోయినా… శరీరం సహకరించకపోయినా
ముల్లుబరగలు… చెర్నాకోలతో బండిలాగే
అమ్మలాగా జీవించడం నాకిష్టం లేదు
నా కళ్లు… మంచీ చెడులను గుర్తిస్తున్నాయి
నా పెదవులు… న్యాయాన్యాయాలను నిలదీస్తాయి
నా బుగ్గలు… మీ ఆగ్రహ ప్రదర్శనకు
నా వేళ్లు… స్వేచ్ఛా సంకెలలు తెంచుకుంటూ
నియంతల పీకలు పట్టుకుంటున్నాయి
నా వెన్నెముక నిటారుగా వుంది
మీరు వంచినా వంగడం లేదు
వంగినా… నారి తెగిన బద్దలా లేస్తోంది
ఇప్పటికైనా…
అమ్మలా లేనని అంగీకరించండి…!
ఎం. లీల
పిరికిపంద
చిట్టి చేతులతో మిమ్మల్ని చుట్టుకునేదాన్ని
వేలందుకుని మీవెంట నడిచేదాన్ని
మీ చేతి నేతిముద్దలే అంకుల్‌
నా బుగ్గల్లో నునుపుదనాలు
ఉరకల పరుగుల అల్లరి నేనైతే
కాలుజారకుండా అడ్డుకునే పెద్దతనం మీది
కథలూ, పాటలు నేర్పేవారు
అమ్మ కోప్పడితే రాగం తీస్తూ
మీ భుజంపై వాలి
మీ బుజ్జగింపు జోలలో నిదురించేదాన్ని
ఆడిపాడి అలసి మీ ఒడిలో సొమ్మసిలేవాళ్ళం
మీ కూతురికి మా నాన్నలో మీరు
నాకు మీలో మా నాన్న
మీ భద్రతా దోసిళ్ళలో వికసించిన
విరజాజులమే కదా
మీ గుండెలపై మా పాదాల సరిమువ్వల
సవ్వడులెన్నో…… బదిలీలు……
మనను దూరం చేశాయి.
అంకుల్‌…
ఆనాటినుండి ఈనాటి వరకు
నా నిరీక్షణ ఫలించి
తిరిగి ఇరుగుపొరుగులమయ్యాము
నాన్న పోయారు… అంకుల్‌…
ఆ దుఃఖంలో గుర్తుకు వచ్చింది మీరే
కన్నీళ్ళలో తడుస్తున్న నా బాధను
మీ గుండెల్లో తుడుచుకోవాలని తపించాను
మీలో….. నాన్నను…..
చిననాటి మనసు మీకు చేరువయింది
ఒకనాటి సమయంలో
కంపిస్తున్న మీ చేయి నన్ను తాకుతూ
వణుకుతో కూడిన అపశృతితో
చూపుల్లో అదృశ్యమైన పితృవాత్సల్యం
అవాంచిత ఆదుర్దా… తాపత్రయం…..
మెరుపులా తృటిలో నన్ను నేను రక్షించుకున్నాను
వెక్కిరించిన మరువలేని బాల్యం
మరొకరితో చెప్పుకోలేని అనుభవం
అవమానంతో హృదయం రగిలిపోయింది
మీ ముఖం చూచే అవసరం నాకు లేకున్నా
ఉపేక్ష అనర్థమని తెలిసి మరునాడు
నిన్ను పిలిపించాను
పన్నీటి పరిమళాల వన్నె వస్త్రాల షోకులతో
విలాసంగా నవ్వుతూ నా ఎదుట నిలిచావు
చాచి కొడదామనుకున్నాను.
పెళ్ళిళ్ళయిన పిల్లలున్న మీ వయస్సు
నా చేతి నడ్డుకుంది.
మనోదారిద్య్రంలో పాపపంకిలంలో
కూరుకుపోయిన మీపట్ల
జాలి చూపితే మాత్రం ఒరిగేదేమిటి
నిలదీసి ప్రశ్నించాను
చీత్కరించాను… మందలించాను
ఆరోగ్యకర సంబంధాల గురించి తెలిపాను
నీ దేహ మానసిక రుగ్మతకు ”చికిత్స”
నందించడం ఎదిగిన పిల్లలున్న ఒక పరిపూర్ణ
మానవిగా బాధ్యతగా భావించాను.
ఆ శని ఘడియ మీ దుర్దినంగా ప్రకటించి
బుద్ధిచెప్పి వదిలేశాను.
మరెప్పుడైనా ఎక్కడైనా ఎదురుపడితే
నేను నీ కళ్ళలోకి నిక్కచ్ఛిగా నిర్భయంగా చూడగలను
నీవు చూడలేవు.
కారణం
నా మాటల ఈటెల అంపశయ్యపై
నీవు స్పృహకోల్పోలేదు.
క్షమాపణ కోరగల చిత్తశుద్ధి
పాపప్రక్షాళన ప్రయత్నం నీలో లేవు
తప్పించుకుపోయే పిరికితనం తప్ప.
మారని నీ బుద్ధికి
మరో నన్ను మించిన ”వెన్నెల తరుణి”
నీకు దేహశుద్ధినందించి మిగిలిన
చికిత్స పూరించాలని… కసిగా కోరుతూ
ఆల్‌ ది బెస్ట్‌.
”పరస్త్రీయే మాతృసమానే
సమయానుకూలే సతీసమానే
అని భావించే భావజాల పురుష పుంగవులకు…”

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.