అడివిలో… పిడుగు

డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి
ఆకాశం బ్రద్దలౌతున్నట్లు, కొండలు విరిగి పడుతున్నట్లు, ఉరుములు మెరుపులు, మండువేసవిలో వడగళ్లవాన, దగ్గర్లో పిడుగు పడిన శబ్దం. కరెంటు ఆగిపోయింది. అమావాస్య చీకటి.
”కమలా!” అన్నపూర్ణమ్మ అరిచింది. గదిలో చీకట్లో మంచమ్మీద కూర్చుని వొణికిపోతూ, తొంభైఐదేళ్ల వయసులో….
కమల టార్చిలైటు తీసుకుని, తల్లి పడకగదివైపు పరిగెత్తింది.
”ఎందుకమ్మా ఆ గావుకేక? నాకు కాళ్లక్రింద వొణు కొచ్చింది…” అంటూ అన్నపూర్ణమ్మ చేతులు గట్టిగా పట్టుకుంది. అన్నపూర్ణమ్మ చేతులు చల్లగావున్న స్పర్శ.
”నాకు భయమేస్తుంది కమలా! నాపైన పిడుగు పడినట్లయింది.”
”ఇంత పెద్ద మేడలో, గదిలో కూర్చున్న నీ మీద పిడుగు పడు తుందా? మరీ చిన్నపిల్లలా…” నవ్వుతూ కమల.
”సరేలేవే, నా భయం నాది. ఆ లచ్చిమి యాడకు బొయ్యిందే. నాకాణ్ణే కూసోమంటే కూసోదు… దానికి పొగరుబట్టింది.”
”నేనే ఆమెను మందులు తీసుకరమ్మని చౌకుకు పంపించానమ్మా! స్టౌ మీద అన్నంపెట్టి వచ్చాను… ఇప్పుడే వస్తా!” చేతులు విదిలించుకుని పోబోయింది కమల.
”కమలా! నువ్వు పోవద్దే… నాకు భయం.”
”అదిగో లక్ష్మి వస్తూందిలే, నీతో కూచుంటుంది” లక్ష్మికి తల్లిని అప్పజెప్పి వెళ్లింది కమల.
వృద్ధాప్యంలో, వాకర్‌ మీద నడక, కంటిచూపు తగ్గి, చెవిలో హియరింగ్‌ ఎయిడ్‌తో, అన్నపూర్ణమ్మ, కూతురు కమలవద్దే ఉంటున్నది. కమల భర్త గెజిటెడ్‌ ఆఫీసర్‌గా రిటైరే, పుట్టపర్తి ప్రశాంతినిలయంలో పదేళ్లుగా… భజన చేసుకుంటూ… అన్నపూర్ణమ్మా, కమలా, లక్ష్మి ముగ్గురున్న ఆడవాళ్ల మేడ ”శాంతినివాసం”. లక్ష్మిగా శాంతి నిలయంలోనే పేరు మారిన లచ్చుమమ్మ పదేళ్ల నుండి అన్నపూర్ణమ్మకు కేర్‌టేకర్‌గా.. ఆమెకు సర్వసపర్యలలో… ”ఎందుకమ్మా మీకు భయం.. అలా వొణికి పోతున్నారు.. సేతులు సల్లబడ్డాయి” లక్ష్మి అన్నపూర్ణమ్మను మంచం మీది నుండి దింపి కుర్చీలో కూర్చోపెట్టి, తనూ నేలపై కూర్చుంది.
”నీకేం! నాభయం నాది.. పెద్దగా ఉరిమితే పిడుగు నామీద పడ్డట్టనిపించింది”
”నేనుండగా పిడుగులు మీమీద పడనిస్తానామ్మా! నన్ను తప్పించి పిడుగు మీమీద పడ్డానికి దానికంతా ధైర్నమా?” నవ్వుతూ అంది లక్ష్మి.
”సరేలే! నీ నవ్వు నువ్వూనూ. నువ్వేందే. ఈ చీకట్లో, వానలో చేకు కి ఇప్పుడు… మందులు రేపు తీసుకరావచ్చు గదా.. గొడుగన్నా తీసకపోక పొయ్యావా? చూడూ, ఎలా తడిసి వచ్చావో.. నువ్వు నన్నొదిలి పోవద్దు లచ్చిమీ!”
”నేనెల్లేటప్పటికి వానలేదమ్మా. ఇప్పుడు కురస్తావుంది. మీకోసమే లగెత్తుకొచ్చేసా!” చీరకొంగుతో తడిసిన, తల,ముఖం తుడుచుకుంటూ అంది లక్ష్మి.
”వానలో తడిసి నీకేమన్నా అయితే, నన్ను చూసేవాళ్లెవరే!”
”నాకేమౌతుందమ్మా! నాదిగెట్టి శరేళం.. అన్నిటినీ ఓర్సుకుంటుంది”
”అట్లా అనొద్దు… అన్నీ మన రోజులు కావు”
”మన రోజులనుకున్నప్పుడే ఎన్నో గండాలు దాటేశాను. ఈడికి రాకముందు కత యింటే మీరు ఆచ్చర్యపోతారు”
”సెప్పు సెప్పు… ఈ చీకట్లో నీ కత అయినా వింటుంటాం! ఈలోగా కరెంటు పోయి వస్తుంది. అన్నం పట్టుకొద్దువుగానీ” కథ మొదలుపెట్టింది లచ్చుమమ్మ.
అప్పుడు నాకు ఇరవై ఐదేళ్ళు. నా కూతరు సిన్నమ్మకి ఆరేళ్లు. నా మొగుడు నన్నొదిలేసి దేశాలు పట్టిపోయాడు. తిరిగి రానేలేదు. అసలు ఎక్కడుండాడో, అసలు బతికున్నాడో లేదో ఆ సచ్చినోడు” మెటికలు విరిచి కథలోకెళ్ళింది.
మొగుడొదిలేసిన ముండను అమ్మగారింట్లో సిన్నపిల్లతో తల దాసుకుంటున్నా! ఇద్దరు తోడబుట్టినోళ్లు.. పెద్దోడు ఎగసాయం సిన్నోడు కూలీనాలీకి పోతూ… నేదరోదు. మా కుల్లూరు నాలుగొందల గడప.. పక్కనే ఎర్రాయపల్లి, ఎంకరెడ్డి పల్లి, మూడూళ్ల కస్పా. మా ఊళ్ళో మా గొల్లోళ్ల కొంపలే ఇరవై… ఇంటింటికీ గొర్లుండేవి. మాకూ ఇరవై గొర్లుండేవి పైన ఒక సంవత్సరం గొర్రె పిల్ల- దాన్ని సిన్నమ్మ పెంచుకుంటూంది… మావోళ్లు నన్ను గొర్లకాడికి మేతకు పంపించేవోళ్లు”
”అదేందే! మొగముండాకొడుకులకేమైంది. ఆడ కూతుర్ని గొర్ల కాపరిగా పంపడానికి వాళ్లకు సిగ్గులేదా!”
”అదే గదమ్మా! ఇంటాయన ఎంట లేకపోతే… నాబోటోళ్లకు దొరికే మరియాదా”
కమల వచ్చింది… కరెంటూ వచ్చింది
”ఏమిటి లక్ష్మీ? పురాణం పెట్టుకున్నారు.. లే… లే… వెళ్లి అమ్మకు అన్నం పెట్టుకురా! మళ్లీ కరెంటు పోకముందే ఆమె తింటుంది” లక్ష్మి లేచి వెళ్లింది.
కమల టీ.వీ. ఆన్‌ చేసింది. ఫ్లాష్‌ న్యూస్‌.. ”ఈరోజు రాష్ట్రంలో భారీ వర్షాలవల్ల, పిడుగుపాటుకు పదహారు మంది మృతి. సర్కారులో పది, తెలంగాణలో రెండు, రాయలసీమలో నాలుగు మరణాలు.. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి మరణించిన వారి కుటుంబాలకు, యాభైవేల చొప్పున. గ్రాంటు ప్రకటించారు”.
లక్ష్మి అన్నం తాలీ పట్టుకొచ్చింది. అన్నపూర్ణమ్మ తినడం మొదలుపెట్టింది.
మళ్ళీ కరెంటు పోయింది.
”ఇదేం నాశనమే! నాలుగు చినుకుల పడితే కరెంటు ఆగిపోతాదే! చీకట్లోనే పెద్ద అన్నం ముద్ద మింగబోయింది అన్నపూర్ణమ్మ. పొరబోయింది.
ఆమె మాడు మీద నిమిరింది లక్ష్మి.
”అమెరికాలో మీ సిన్న మనవరాలు తలుసుకుంటా వుందేమోనమ్మా”
”కావచ్చునే… ఆ పిల్లకు పిడుగు అంటే తగని భయం. పిల్లప్పుడు గజగజ వొణికి నా ఒడిలో దాక్కునేది” … అన్నం ముగించి బక్కెట్లో చెయ్యి కడుక్కుంది. ప్లేటు తీసుకుని వెళ్లి క్యాండిల్‌ వెలిగించి తీసుకొచ్చింది. కూర్చుని లక్ష్మి కథ కొనసాగించింది.
మా కుల్లూరు చిట్వేలి.. రాపూరు మద్దెలో పెంచలుకోన దాటి పోవాలి. ఊరికి రెండు మైళ్లలో అడివి. ఎలగసెట్లు, ఉసిరి, బిక్కి సెట్లు, కొండ ఈత సెట్లు.. ఎర్రసెందనం గూడా ఉందంటారు. అడివిలో కట్టెలు కొట్టుకోవాలన్నా, గొర్లుమేపుకోవాలన్నా ఏరియా పారెస్టోళ్లకు మామూల్లియ్యాల్సిందే. మాలాంటి వొయసు ఆడోళ్లు అడివికొస్తే పారెస్టు గార్డులకు పరాసికాలు.. చెట్లసాటు సరసాలు…”
”కథ చెప్పమంటే ఏందే సోది చెప్తున్నావు?” అన్నపూర్ణమ్మ అసహనంగా ”నాకు నిద్ర రాకముందే కథ ముగించు” ఆవులిస్తూ అంది.
”వొస్తున్నా తల్లీ… వొస్తున్నా! గొర్లు మేపడం నాకేసినారు గదా మావోళ్లు… ఆ రోజు… అడివిలో నేను సిక్కని పొయ్యిన రోజు… గొంతు మారింది లక్ష్మికి… విసనకర్ర తీసుకుని అన్నపూర్ణమ్మకు విసిరింది ”ఏందీ! అడివిలో చిక్కుకున్నావా?
”అవునమ్మా! మద్దేనంనుండే పైన మొబ్బులేసుకున్నాయి దట్టంగా… వానొచ్చేట్టుంది. అడివికి పోనన్నాను. ఊర్లో ఐదారు మందలు పోతున్నాయి… ఏం భయ్యిం లేదులే పో! అని నన్ను తోలారు. గొర్లు దోలుకుని, తాటాకు ‘గూడ’ ఎత్తుకుని అడివిదారి బట్నా. గొర్ల ఎనకాలే సిన్నమ్మి గొర్రిపిల్ల. దాన్ని దోలుకుని పొయ్యేటప్పటికి ఆల్చిమైంది. గొర్లు బాగా మేస్తున్నాయి. కొన్ని చెట్లాకులు తుంచిపోసినా… కాలవ కాడికి తోలినా… కడుపునిండా నీళ్లు తాగాయి. నేనూ నాలుగు దోసిళ్లు తాగినా…
ప్రొద్దు వాలింది. మిగతా మందలోళ్లు పెందరాళే ఊరిముకం పట్టారు. వాన…జడివాన… గూడేసుకున్ని కూసున్నా. అంతే… ఫెళ…ఫెళమంటూ వురుములు. ధగ…ధగ మెరుపులతో చీకటి కమ్ముకుంది. గొర్లు సెల్లాసెదురైపొయ్యాయి. వోట్ని అదిలించుకుంటూ పరిగెత్తినా… దారి తెల్డంల్యా… ఎటు పోతున్నానో తెల్వల్యా… ఢమ… ఢమా… ఢమా… ఢమా సెబ్దం… ఎక్కడో దగ్గిర్లోనే పిడుగు పడిందనుకున్నా… బయమేసింది. ఏంజేసేది. గొర్లగుంపునంతా అదిలించి కదిలించి ఒక రాతిగుట్టకాడికి సేర్చినా… అక్కడ పెంచిలయ్య తన నాలుగుగొర్లతో… మెరుపు ఎల్తుర్లో గుర్తుపట్నా…”
”లచ్చుమక్కా!” పరుగెత్తుకుంటూ వొచ్చి వోడు నన్ను కర్సుకున్నాడు. వోడూ మా దాయాదుల పిల్లోడే… పది పన్నిండేళ్లుంటాయి. గుట్టకింద రాతిబండల మీద కూసున్నాం… గొర్లు సొంగకార్సుకుంటా సెల్లాసెదురుగా పడుకున్నాయి.
సగం రాతిరైంది. మద్దేనం తిన్న రాగిసంగటి అరిగిపొయ్యింది. పెంచిలయ్య రెండు పండిన ఎలగపళ్లు రాల్చకొచ్చాడు, మెరిసే మెరుపు ఎల్తుర్లోనే ఇద్దరం ఎలగపళ్లు గుజ్జుదిని, పెంచిలయ్య సొరకాయ బుర్రలో నీళ్లు తాగాం.
అన్నపూర్ణమ్మ ఆవులించింది. నిద్ర ముంచుకొస్తున్న సూచన…
”మీరింక నిద్దరబోండమ్మా! కత రేపు సెప్తాను.”
”ఫరవాలేదు… నిన్ను… అడివిలో వొదిలేసి నేను పడుకుంటే నిద్దరొస్తుందా… చెప్పు… ఆ తర్వాత…”
”ఇంతలోకీ సిన్నమ్మి గొర్రిపిల్ల ఆకలికనుకుంటా… అరుస్తూంది. టుర్ర్‌… టుర్ర్‌… దే… దే…” గొర్రెపిల్లని… అదిలిస్తూ దాని ఎనకబడ్డా…” గొర్రెపిల్ల మీద జడిపించినట్టే అరుస్తూ… విసనకర్రతో అన్నపూర్ణమ్మ కాళ్ల మీద కొట్టింది.
”అబ్బా! మతి ఏడుందే నీకు” కాళ్లు పట్టుకుని మూల్గింది అన్నపూర్ణమ్మ.
”అయ్యో! అయ్యో! తప్పయిపోయిందమ్మా… సెమించండి… ఆ గొర్రిపిల్ల ధేసలో వుణ్ణ్యా…” పెద్దమ్మ కాళ్లు పట్టుకుని వొత్తసాగింది లక్ష్మి.
”సరేలేకానీ…” …ఆ తర్వాత”
కొంచెంసేప్టుకి వాన తెలిపిరిచ్చింది. మసక మసగ్గా ఎల్తురు. అప్పుడర్థమయ్యింది… మేం దారిదప్పామని. అడివికొసకి… రాసపాళెం దగ్గిరుండాం… ఇంకా చీకటుంది. తెల్లార్తే దారి కనుక్కొని పోవచ్చని ఆ బండలమీదే కూసున్నాం. పెంచిలయ్య గురకపెట్టాడు. తెల్లవారింది. మందల్ని కుల్లూరు దారి పట్టించాం… రేపటెండకి యిల్లసేరాం… సిన్నమ్మి పరిగెత్తకొచ్చి నన్ను కరుసుకుని ఏడ్చింది. మానాయన సెప్పినాడు… రాత్రంతా లాంతరెత్తుకొని నాకోసం దారికాసాడంట. వోళ్లకీ ఆ రాత్రి జాగారమేనంట. సిన్నమ్మి మందలోకి పరిగెత్తింది. నేను సద్దికూటి నీళ్లు తాగినా… సిన్నమ్మి ఏడుస్తూ వచ్చి ”అమ్మోయ్‌! నా గొర్రెపిల్ల ”సీతాలు” ఏడే… మందలో లేదే…”
నాకు గుండెలో దడబుట్టింది. ఎల్లి సూసాను. సీతాలు లేదు. ఎక్కడో తప్పిపొయ్యింది… కలలో మెలకవ… అప్పుడు అడివిలో పడిన పిడుగు సీతాలు మీద పడిందా… ఏమో! ఎట్టాగా… మల్లీ పెంచిలయ్యను తీస్కుని పొయ్యి అడివంతా ఎతికినా… యాడా దాని జాడ లేదు… ఇంటికొచ్చినా… సిన్నమ్మి ఏడుపు సూళ్లేకపొయ్నా… ఆ రాత్రి జాగారమే…
రెండ్రోజుల తరవాత తెల్సింది. సీతాలు రాసపాళెం మందలో కలిసిపొయ్యిందని. సిన్నమ్మిని తీస్కొని అడ్డదార్ని రాసపాళెం ఎల్నా… ఏముంది అక్కడ తెల్సింది. ”ఆరోజే గంగదేవర్లలో సీతాల్ని బలిచ్చారు…” లక్ష్మి ఏడుస్తూ చెప్తుంది.
అన్నపూర్ణమ్మ కుర్చీలోనే కూర్చుని నిద్రపోయింది.
ఆమెను పడక మీదికి మార్చి, తనూ నేలమీద చాపేసుకుని పడుకుంది లచ్చుమమ్మ.
జ    జ    జ
ప్రక్కవీధి మసీదులో ”అల్లాహో అక్బర్‌ అల్లాహో అక్బర్‌” తెల్లవారుతున్న సూచనతో అల్లా చదువు వినిపిస్తుంది.
లక్ష్మి మగతనిద్రలో వెక్కివెక్కి ఏడుస్తూంది.
”లక్ష్మీ! లక్ష్మీ… లే… లే… ఏమిటా ఏడుపు” లక్ష్మిని నిద్రలేపింది అన్నపూర్ణమ్మ.
లేచి కండ్లు నులుపుకుంది లక్ష్మి… ఇంకా వెక్కిళ్లలోనే… పైట కొంగుతో కళ్లనీళ్ల తుడుచుకుని…
”నిద్దర్లో కలమ్మా… సెడ్డకల… కాదు… కాదు. కలకాదు. నిజమే…
సీతాల్ని గంగజాతర్లో… మాంసంముద్దగా సూసినప్పటి కల… అప్పటి ఏడుపు… మల్లీ సిన్నమ్మి సచ్చిపొయ్యినప్పుడు ఏడ్సిన ఏడుపు… రెండూ కలిసి… దుక్కమొచ్చిందమ్మా!” మళ్లీ లక్ష్మి ఏడుపు.
”లే… లేచి పోయి ముఖం కడుక్కో. పోయిన గొర్రెపిల్లనీ, చనిపోయిన నీ కూతుర్నీ తలుచుకుని ఏడిస్తే తిరిగొస్తారా?… పో… పో ఈ రోజు శనివారం… నాకు తలస్నానం… గుర్తుపెట్టుకో” చాప చుట్టి లేచి వెళ్లింది లక్ష్మి.
అన్నపూర్ణమ్మకు లక్ష్మి పదేళ్లనాడు తన కేర్‌టేకర్‌గా వచ్చినప్పుడు… అప్పటి లక్ష్మి కథ… గుర్తుకొచ్చింది.
లచ్చుమమ్మ, చిన్నమ్మికోసం అప్పుజేసి కువైట్‌ వెళ్లింది. సంపాదించుకొచ్చి కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చెయ్యాలనే ఆలోచన… కువైట్‌ వెళ్లేటప్పటికి చిన్నమ్మికి పదేళ్లు. ఆరేళ్లు కువైట్లో… ఊడిగం చేసింది. అరవైవేలు కూడబెట్టింది. కుల్లూరు వచ్చి, అప్పు తీర్చి, మంచి సంబంధం కోసం వెతికింది. మగదిక్కులేని లక్ష్మికి… సంబంధాలెవరు వెతికిపెడతారు? రాజీపడి చిన్నతమ్ముడికే ముప్ఫైవేలిచ్చి, పదహారేళ్ల కూతుర్ని కట్టబెట్టి… తిరిగి కువైట్‌ వెళ్లింది…
రెండేళ్లకే… అల్లుడు తాగి, తాగి, కూతుర్ని హింసించసాగాడు. ఫోన్లో కూతురి గోడు విన్నా, సర్ది చెప్పింది. ఒక రాత్రి తాగి వచ్చి పెళ్లాన్ని ఆరడిపెట్టాడు. అంతే… తెల్లారేసరికి నాయుడిగారి తోటలో చిన్నమ్మి ఉరేసుకుని… చెట్టుకు వ్రేలాడుతూ… కువైట్‌కు ఫోన్‌. లచ్చుమమ్మ మీద పిడుగు పడింది. స్పృహ తప్పింది. వెంటనే విమానమెక్కింది. కుల్లూరు చేరింది. ఐస్‌బాక్స్‌లో సిన్నమ్మి శవం… రెండోసారి లచ్చుమమ్మ స్పృహతప్పి పడిపోయింది. ఊరికోళ్లు కూసిన సంగతి ”అల్లుడే చంపేసి చెట్టుకేలాడదీసాడు” పోలీసుకేసు పెట్టమన్నారు పెద్దలు… దుఃఖాన్ని మ్రింగుకుని కర్మకాండలు జరిపించి, సోమశిల ప్రాజెక్టు వద్ద రాములవారి దేవళంవద్ద చేరి రాముడి సేవ చేసుకుంటున్న లచ్చుమమ్మను అన్నపూర్ణమ్మ బంధువు… సోమశిల ప్రాజెక్టు ఇంజనీరు… కడపకు అన్నపూర్ణమ్మకు కేర్‌టేకర్‌గా పంపించాడు. అలా కట్టుబట్టల్తో అన్నపూర్ణమ్మ యిల్లు చేరింది లక్ష్మి. అన్నపూర్ణమ్మను పసిబిడ్డలా చూసుకుంటూ వుంది… చిన్నమ్మితో తెగిపోయిన పేగుబంధాన్ని అన్నపూర్ణమ్మతో ప్రేమబంధంగా ముడివేసింది. లక్ష్మి అన్నపూర్ణమ్మకు తలస్నానం చేయించింది. తల ఆరుస్తూంది.
”ఏమే! నేను చనిపోతే మళ్లీ కుల్లూరెళ్లిపోతావా?”
”అంతమాటనకండమ్మా! మీరు నిండునూరేళ్లూ బతకాలి. నూరేళ్ల పండగ, అమెరికా నుండి మీ మనవడు, మనవరాళ్లొచ్చి గనంగా జరిపిస్తారు… మేమంతా సూడాల్నా.”
అన్నపూర్ణమ్మ మౌనంగా… ”ఆ తర్వాతైనా, నూరేళ్ల తర్వాత మీరు పొయ్యిన తర్వాత, కమలమ్మ గారికీ వొయస్సైపోతుంది గదమ్మా… మళ్లీ ఆయమ్మగారి సేవ సేసుకుంటా గడిపేస్తా. ఒకేళ ఈలోగా నేనే సస్తే… నన్నిక్కడే ఎత్తుబడి చెయ్యించండమ్మా” నవ్వుతూ అన్నపూర్ణమ్మ తలదువ్వింది లక్ష్మి.
”ఇంకోమాటమ్మగోరూ! నేను సస్తే… మీరు నెల్నెలా నాకు బ్యాంకిలో ఏసిన డబ్బు యాభైవేల పైనే వుందనుకుంటా… ఆ డబ్బు, సోమశిలరాముడి గుడికి ఆరాధనకోసం పంపించండమ్మా!” ఈ మాటల్లో గొంతు బొంగురు… ఎక్కిళ్లు లేవు… అన్నపూర్ణమ్మ మనసులో అనుకుంది ”లక్ష్మికి తన బ్రతుకు మీద ఎంత ఆత్మవిశ్వాసం… ఎంత గడుసు నమ్మకం”.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.