‘స్త్రీల చరిత్ర, అనే ప్రశ్న గురించి ఆలోచించటం మొదలుపెడితే అది చిన్నప్పుడు చదువుకున్న చరిత్రపాఠాల వరకు వెళ్తుందనేది మన ఆలోచనల్నే సరిదిద్దే అనుభవం అవుతుంది. తాజ్‌మహల్ కట్టడానికి షాజహాన్‌ను ప్రేరేపించిన ముంతాజ్‌మహల్ సౌందర్యం, తన భర్త సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి పోరాటం చేసిన ఝాన్సీలక్ష్మిబాయి శౌర్యం-మన జ్ఞాపకాల మీద చెరగని ముద్రవేశాయి. చరిత్రపుటల్లోకెక్కిన స్త్రీలు అటు గొప్ప పురుషుల ప్రేమకు పాత్రులయిన వాళ్ళయినా కావాలి లేదా ఎదురైన సమస్యల మూలంగా తప్పనిసరై మగవాళ్ళ రంగాల్లో ప్రవేశించిన వాళ్ళయినా కావాలి.
ఈ విధమైన చరిత్ర స్త్రీలను అంచుల్లోకి నెట్టివేయటమే కాకుండా, మగ ప్రపంచంలో వాళ్ళను కల్పితాలుగా చిత్రించింది. ఒక్కసారిగా మనకు కలిగిన ఈ గుర్తింపుకు స్త్రీల ఉద్యమం తోడవటంతో స్త్రీల చరిత్ర ఈ రోజున ఈ స్థితికి ఎదిగింది. ‘వాస్తవంగా’, ‘తటస్థంగా’ ఉందన్న చరిత్రలో కూడా ఎక్కువ భాగం స్త్రీల జీవితాలూ, వాళ్ళ కృషీ, ఒక పద్ధతిగా మరుగున ఉంచబడినాయి. (చాలావరకు ఇది సంప్రదాయ రాజకీయ చరిత్ర విషయంలో ఎంత నిజమో సాంఘిక చరిత్రలో కూడా అంతే నిజం). కాబట్టి స్త్రీల చరిత్ర అంటే ఈ పద్ధతిని సరిదిద్దడమే. గతాన్ని పదిలం చేసుకోవడమే కాదు – దాని లక్ష్యం రాజకీయ పరమైనది. అది-మన సంస్కృతిలో, మన పాండిత్యంలో జీర్ణించుకొని ఉన్న పక్షపాత వైఖరుల మూలంగా చరిత్ర స్త్రీల ఉనికిని వక్రంగా చిత్రించినా, అసలు నామరూపాలు లేకుండా చేసినా – స్త్రీకి చరిత్ర ఉన్నది – అని నొక్కి చెప్తుంది. చాలావరకు ఇటువంటి కృషి విశ్వవిద్యాలయాల పరిధి బయటనో, అంచుల్లోనో (ఓజీరిదీవీలిరీ) జరిగింది.
ఈ చరిత్రల్ని వెతికి తిరిగి రాసుకోవటంలో మనం ఎదగటానికి, గతాన్ని తిరిగి స్వంతం చేసుకోవటానికీ, ప్రతిఘటనా తిరుగుబాటు సంప్రదాయాల్ని గర్వంగా చెప్పుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. చరిత్రంటూ లేకపోతే వర్తమానం దరిద్రమై పోతుంది. ‘మార్పు’ అంటకుండా భవిష్యత్తు శిథిలమవుతుంది.
యూరపు, అమెరికా దేశాల్లోని స్త్రీల చరిత్రలో మొట్టమొదట జరిగిన పని అంతా ‘నష్టపరిహారం’1 (్పుళిళీచీలిదీరీబిశిళిజీగి) చేసే ప్రయత్న ఫలితమే. ఆ ప్రయత్నం ప్రధాన ఉద్దేశం – చరిత్రలో గొప్ప పురుషుల ప్రక్కన ఆ చరిత్ర మర్చిపోయిన గొప్ప స్త్రీలను వెతికి, కనుక్కొని నిలబెట్టాలని- చరిత్రకారులు ఈ విషయంలో ఒక మేరకు విజయం సాధించారనే చెప్పాలి. జీవితానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ, ప్రతి రంగంలోనూ వాళ్ళ జీవితాలూ వాళ్ళ ఉనికీ వాళ్ళ కృషీ మరుగున పడిపోయిన వందలాది స్త్రీలు దీనివల్ల బయటపడ్డారు. అయితే మొదట్లో ఈ చరిత్ర ఇంకా ‘గొప్ప’ ప్రత్యేకత గల్గిన స్త్రీల చరిత్రగానే ఉండిపోయిందనే విషయం మాత్రం గుర్తింపుకు రాలేదు. ఉదాహరణకి, తెలంగాణా పోరాటంలో కూడా ఇదే పద్ధతిలో నష్టపరిహారం చేయాలనే ఉద్దేశంతో మేం మొదలుపెట్టి ఉంటే, ఉద్యమంలో పేరు తెచ్చుకున్న కొద్దిమందినే గుర్తించి, కలిసి, మాట్లాడటం జరిగేది. వాళ్ళ పరాక్రమాన్ని, పోరాటకర్తలుగా వాళ్ళ విశిష్టతను, వాళ్ళ సృజనాత్మక శక్తిని, ఒక్కమాటలో చెప్పాలంటే – మగవాళ్ళతో సమానంగా వాళ్ళ స్థానాన్ని పొందటానికి చేసే ప్రయత్నాల్ని మాత్రమే రికార్డు చేసేవాళ్ళం.
అయితే ఇటువంటి ప్రయత్నాలకు విలువలేదని కాదు. కాని, నష్టపరిహారం చరిత్ర మనకందించిన విమర్శన తగినంత రాడికల్‌గా లేదని కనిపిస్తూనే ఉంది. దాని మూలంగా స్త్రీలకు కూడా కొంత స్థానం కల్పించాలని సంప్రదాయ చరిత్ర మీద ఒత్తిడి తీసుకురాగలగటం జరిగింది. అయినా, మన సంస్కృతిలో పాతుకుపోయిన పక్షపాత ధోరణులూ, రాజకీయ దృక్పథాలూ, అన్ని రంగాల్లోనూ స్త్రీలను బయటే ఉంచాలనే ఎత్తుగడలూ- ఇవన్నీ కూడా కంటికి కనపడకుండా, ప్రశ్నించడానికి వీలులేకుండా ఉండటంతో – అవి అట్లాగే స్థిరంగా ఉండిపోయినయి. నష్టపరిహార చరిత్ర దృష్ట్యా, చరిత్రలో స్త్రీలు కనిపించకపోవటం ఒక చిన్న లోపం మాత్రమే. కొంచెం విశాల హృదయం, పట్టుదల ఉంటే ఈ లోపాన్ని సరిదిద్దొచ్చు. ఈ దృక్పథంతో, చరిత్రలో స్త్రీలు కనిపించటం అనేది జరక్కపోగా అణచివేతలోని రాజకీయాలు సహితం మరుగున వుంచబడ్డాయి. ఐతే శ్రామికచరిత్ర (ఉబిలీళితిజీ కరిరీశిళిజీగి), సాంఘిచరిత్ర (ఐళిబీరిబిజి నీరిరీశిళిజీగి), పాత రాజకీయ చరిత్రకెట్లయితే తోకలు కావో, స్త్రీల చరిత్ర కూడా ప్రస్తుతమున్న ప్రధాన చరిత్ర (ఖబిరిదీరీశిజీలిబిళీ కరిరీశిళిజీగి)కు తోకకాదని అర్థమవుతుంది.
మనదేశంలో స్త్రీల చరిత్ర కొంచెం వేరే పద్ధతిలో ఎదిగింది. స్త్రీల చరిత్రలని చెప్పుకోదగ్గ వాటిపట్ల మొదట్లో జరిగిన కృషి అంతా ‘సహకార చరిత్ర’ (్పుళిదీశిజీరిలీతిశిళిజీగి కరిరీశిళిజీగి) మాత్రమే అనవచ్చు. అటువంటి (సహకార) చరిత్రల్లో ‘ప్రాముఖ్యత ఇవ్వబడే విషయాలు నష్టపరిహార చరిత్రకంటే కొంచెం వేరుగా వుంటాయి. అంతకుముందు గొప్పఆడవాళ్ళు సాధించిన విషయాల్ని మాత్రమే రాస్తే, ఇప్పుడు సాంఘిక సంస్కరణా ఉద్యమం లేదా సత్యాగ్రహం లాంటి ఉద్యమాల్లో స్త్రీల పాత్ర ఎటువంటిదీ, ఎంతవరకూ అని వివరించి, దాని స్వభావాన్ని అంచనా వేసేంతవరకు ఎదిగింది. స్త్రీలు వ్యక్తులుగానూ మొత్తం గానూ ఉద్యమానికేవిధంగా తోడ్పడ్డారు; వాళ్ళకు అందులో ఎటువంటి స్థానం లభించింది- అనేవి ఇప్పుడడుగుతున్న ప్రశ్నలు కొన్నిసార్లు ఆ ఉద్యమంలో ఆడవాళ్లు ఏ విధంగా అణచివేయబడ్డారు అనే ప్రశ్న కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సహకార చరిత్ర ఎక్కువగా ఆడవాళ్ళ పాత్రను ఘనంగా పొగుడుతుంది. ప్రస్తుతం ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచటానికి బాగా ఉపయోగపడుతుంది. కాని, ఇందులో ఒక ప్రమాదం లేకపోలేదు. ఈ సహకారచరిత్ర కూడా ప్రధానంగా తటస్థంగా ఉంటుందే కాని విమర్శణాత్మకంగా ఉండదు. పరిశీలిస్తున్న ఉద్యమం, స్త్రీల చరిత్రకు దాని ప్రాధాన్యత – రెంటినీ ఈ చరిత్ర ప్రశ్నించే ప్రసక్తి ఉండదు. స్త్రీల ప్రమేయంలేకుండా ఉండే ఉద్యమానికి, వాళ్ళే విధంగా తోడ్పడుతున్నారన్న విషయాన్ని మాత్రమే అది గుర్తిస్తుంది. అంతే కాదు, వాళ్ల ‘సహకారాన్ని’ పరిశీలించటం, అంచనా వేయటంలోకూడా స్త్రీలకది ఏ విధంగా ఉపయోగపడిందనే విషయం వదిలేసి ఉద్యమానికి వాళ్లేవిధంగా ‘ఉపయోగ’ పడ్డారని మాత్రమే అర్థం చేసుకోవటం జరుగుతుంది. విమర్శనాత్మకంగా లేని సహకారచరిత్రకు, రేణూ చక్రవర్తి రాసిన భారత మహిళా ఉద్యమంలో కమ్యూనిస్టులు 1940-1950 (న్యూఢిల్లీ; పి.పి.హెచ్-1980) అనే పుస్తకం కంటే మంచి వుదాహరణ ఇంకొకటి వుండదు. మనకు ఎక్కడాదొరకని అరుదైన సమాచారానికి, స్త్రీలు స్వయంగా వివరించిన విషయాలకు ఈ పుస్తకం ఒక నిధి. తెలంగాణా ఉద్యమం గురించి రాసిన భాగంలో మళ్ళీ మళ్ళీ మనకు విన్పించే వాక్యం – ”వాళ్ళ మగవాళ్ళతో భుజం భజం కలిపి స్త్రీలు, రజాకార్లను, నిజాం పోలీసుల్ని, తర్వాత భారత సైన్యాన్ని ఎట్లా ఎదిరించి పోతారు” ఒక పెద్ద పోరాంట నుండి ఇంకొక పెద్ద పోరాటానికి కదుల్తూ రచయిత్రి మనకు, ”ముసలివాళ్ళు, స్త్రీలు, పిల్లలు – మగవాళ్ళకి రాళ్ళేవిధంగా అందించారో” ; లారీల్ని చుట్టుముట్టి, వాళ్ల మగవాళ్లని విడుదల చేసేంత వరకూ వాటికి కదలకుండా ఎట్లా అడ్డుపడ్డ్డారో; వాళ్ల (మగవాళ్ల) వెనక ఎట్లా నిలబడగలిగారో ; స్వరాజ్యం, ఆరుట్ల కమల తుపాకులతో ”సహితం” ఏ విధంగా పోరాడారో వివరిస్తుంది. ఇందులో మగవాళ్లు ప్రధానం అనీ, వాళ్ళపని మనకొక ఆదర్శం అనే గుర్తింపుకు తిరుగులేదు. అదే కాకుండా, ఈ చరిత్రకు, ”తెలంగాణా ఉద్యమానికి పట్టణాల్నుంచి పల్లెల్లోనుంచి ఏ పద్ధతుల్లో మద్దతు దొరికింది” అనే విషయాల్ని పోల్చి చూడటమే లక్ష్యం. ఇంకో విధంగా చెప్పాలంటే, ఇది నిజానికి స్త్రీల ఉద్యమంలో కమ్యూనిస్టుల గురించి అనే కంటే, కమ్యూనిస్టు ఉద్యమంలో స్త్రీల గురించి రాసిన పుస్తకం అనటం బాగుంటుంది.
రచయిత్రికి స్త్రీల ఉద్యమం గురించి ఉన్న అవగాహనలోని హద్దులు చాలా స్పష్టంగా మనకు తెలుస్తాయనటంలో ఆశ్చర్యంలేదు. తెలంగాణా గురించి రాసేటప్పుడు ఆమె, ”ఈ మహత్తర పోరాటంలో శతాబ్దాలుగా ఫ్యూడల్ బంధాలతో అణిగిపోయిన స్త్రీలు వాటి నుంచి విముక్తులవటానికి ఎంతో గొప్ప పోరాట పటిమ, శక్తి చూపించారు” అంటుంది. ఇక్కడ సమస్యలకే గానీ, ప్రశ్నలకి గానీ అవకాశం లేదు. రచయిత్రి, తను చెప్పుకుపోయిన ధోరణిలో తనకు ఉన్న నిశ్చలమైన నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా అందుకే కావచ్చు – 1921లో లెనిన్ నిర్దేశించిన విషయాన్ని తన ముందు మాటలో అంతే నమ్మకంతో వాడగలిగింది. ”అణచివేతను, అసమానతను తొలగించటానికి ప్రపంచంలో ఏ పార్టీ ఏ విప్లవమూ పనిచేయనంత నిజాయితీతో బోల్షెవిక్, సోషలిస్ట్ విప్లవం కృషి చేస్తున్నదని లెనిన్ గట్టిగా చెప్పాడు” . కాని విప్లవం అంటే స్త్రీలకు పరిమాణంలోనే కాకుండా, స్వభావంలో కూడా మార్పు తీసుకువచ్చేది – అనే చైతన్యం ఇటు రేణూ చక్రవర్తిలోనూ, అటు లెనిన్‌లోనూ కనపడదు. ఉదాహరణకు, చక్రవర్తి చాలా వివరంగా రాసిన ఒక ముఖ్యమైన ఉద్యమాన్ని (స్త్రీలకు) పరిశీలిద్దాం. గెరిల్లా పోరాటం గురించి రాస్తున్న క్రమంలో స్థానిక అధికారులపై, స్త్రీలకు లెట్రిన్లు కట్టాలని ఒక సంఘం నిర్ణయాత్మకంగా పూనుకోవటాన్ని రచయిత్రి వివరిస్తుంది. ఈ సమస్య స్త్రీలనెలా కదిలించిందీ, సంఘాన్ని స్త్రీలకెంత దగ్గరగా తీసుకొచ్చిందీ, అన్నికంటే చాలా విజయవంతమైన ఉద్యమంగా ఎట్లా రూపొందిందీ, రచయిత్రి ఒప్పుకున్నట్టు కనిపిస్తుంది, కాని, మహిళా కార్యకర్తలు ‘అంతముఖ్యం’ కాని చిన్న స్థానిక సమస్యల్ని ఏ విధంగా తీసుకున్నారనే దానికి ఈ సంఘటనను ఒక ఉదాహరణగా మాత్రమే రచయిత్రి గుర్తిస్తుంది. దీన్ని ఒక ముఖ్యవిషయంగా గుర్తించకపోవటం అట్లా ఉంచి, కనీసం స్త్రీల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడ్డానికి కొత్త సమస్యలు, కొత్త పోరాటపద్ధతులు, వాటికున్న అవకాశాల గురించి రచయిత్రిలో చైతన్యం ఉన్నట్టు మనకెక్కడా కనిపించదు. ఈ చరిత్రలో కూడా పితృస్వామ్య విలువలు మనని వెంటాడుతూనే ఉంటాయి. అవే రేణూచక్రవర్తి చరిత్రకు కూడా పునాదులయినై, అయితే, స్త్రీల చరిత్రకు కావలసిన విజ్ఞానపు పునర్‌కేంద్రీకరణ (జీలిబీలిదీశిలిజీరిదీవీ ళితీ దిదీళిగీజిలిఖివీలి) ఇంతవరకూ మనం సృష్టించుకోలేదు.
కాని నిజానికి ఈ రోజు స్త్రీలు వ్యక్తులుగా కాక, ఒక గ్రూపుగా గుర్తించ బడుతున్నారన్న విషయం; అటువంటి చరిత్రల్లో వివిధ వర్గాలకు చెందిన స్త్రీలు ఉద్యమాల్లోని వివిధ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొంటున్నారో వివరించే పద్ధతిలో ఒక కొత్త చైతన్యం – ఈ రెండూ స్త్రీల చరిత్ర రాయటం (నీరిరీశిళిజీరిళివీజీబిచీనీగి) లో ఒక ముఖ్యమైన ముందడుగు.
తెలంగాణా ప్రజల పోరాట చరిత్రలో సుందరయ్య స్త్రీల గురించి రాసిన అధ్యాయం కూడా సహకారచరిత్రకొక మంచి ఉదాహరణ. ఉద్యమంలో స్త్రీల గురించి ఉన్న చరిత్రలన్నింటిలోకీ చాలా జాగ్రత్తగా వివరణ ఇచ్చిన చరిత్ర ఇది. మనం ఆశించినట్టుగానే ఇందులో స్త్రీల పటిమ; నిస్వార్థం; దళాల్లోనూ, నిర్మాణ రంగంలోనూ ముఖ్యమైన పాత్ర వహించటంలోనూ స్త్రీలు చూపిన పరాక్రమం ఇవన్నీ వివరంగా రాయబడ్డాయి. ఆశ్రయం ఇవ్వటంలో వీళ్ళు చూపించిన ధైర్యం గురించీ; నిర్బంధాన్నెదిరించి పోరాటానికి జీవితాల్నంకితం చేయడం గురించీ; వాళ్ళ మగవాళ్ళకు సహకరిస్తూ పార్టీలోకి వచ్చినవాళ్ళ గురించీ; ప్రతిఘటనా ఉద్యమంలో పాల్గొన్న వందలాది స్త్రీల గురించీ- ఆయన వివరిస్తాడు. ‘మృతవీరుల’ వివరాల్లో, చెరచబడి, చంపబడిన ఇరవైమంది స్త్రీల పేర్లు ఆయన జతపరిచాడు. అయితే, ఈ పుస్తకంలో స్త్రీల గురించిన వివరాలన్నీ ఉన్నాయనటానికి వీలులేదు. అట్లా రాస్తున్నానని ఆయన చెప్పుకోనూ లేదు. స్త్రీలు ఉద్యమంలో ఎంతవరకు, ఏ విధంగా పనిచేయగలిగారనే భావం మొదటిసారి ఈ పుస్తకంతో మనకర్థమవుతుంది. కానీ, ఒక్క వివరణగురించే కాకుండా, దాన్ని ఏ పద్ధతిలో రచయిత చెప్పాడనేది కూడా ముఖ్యం. తన తోటి పోరాటయోధుల గురించి ఆయన అభిమానంతో, గర్వంతో మాట్లాడటం మన దృష్టిని తప్పించుకోలేదు.
అయితే, సుందరయ్య రాసినదే సవ్యమైన స్త్రీల చరిత్ర అని అంచనా వేయటం సరైనది కాదు, కాని ఆయన రాసినదానిలో ఒక విమర్శనతో కూడిన అంశం వుండడం మనం గమనించాలి. ఇక్కడ స్త్రీల పాత్ర గురించి అదేపనిగా పొగడటం కాకుండా, స్త్రీలకున్న ప్రత్యేక ఇబ్బందుల్ని పార్టీ ఎదుర్కోలేక పోయిందనే చైతన్యం కూడా మనక్కనిపిస్తుంది. మేం ఇంటర్వ్యూ చేసిన ఎంతో మంది ఇతర నాయకులలాగా కాకుండా, స్త్రీలు పార్టీకి చేసిన సవాల్‌ను పార్టీ ఏ విధంగా ఎదుర్కోలేదనే చైతన్యం కలిగి ఉండటం, దానికి పశ్చాత్తాపపడటం కూడా సుందరయ్యలో మనక్కనిపిస్తుంది. ఉదాహరణకి ఆయన చెప్పిన ఈ మాటలు చూద్దాం. ”స్త్రీలు దళాల్లో చేరడానికి వస్తున్నప్పుడు వాళ్ళని మహిళా సంఘాలుగా ఎందుకు తయారుచేయలేదని మేం దళాల్ని అడిగితే, చాలామంది పిల్లల తల్లులవడం మూలంగా సంఘాలు సరిగ్గా పనిచేయవనే భావం వాళ్ళు వెలిబుచ్చారు,” అని చెప్తాడు. ఈ సాకు ఎంత బలహీన మయిందో, మనకెంత అసంతృప్తిని కలిగించిందో సుందరయ్యకూ అంతే అసంతృప్తిని కల్గించిందనేది వాస్తవం. అయితే, ఆయన కూడా పిల్లల సమస్య, పిల్లలు పుట్టటం సమస్యల్ని ఒక విమర్శనాత్మక పద్ధతిలో అర్థం చేసుకోకుండా చాలా తేలిగ్గా స్త్రీల సమస్యగా తోసేశాడు. సుందరయ్య రాసిన అధ్యాయంలో – ఒక పేద రైతుకుటుంబం నుంచి వచ్చి, 1950లో దళాల్లోచేరి, ఎంతో ఉత్సాహంతో, చరొవతో, పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని సమర్థతతో నిర్వహించిన నర్సమ్మ అనే స్త్రీ పార్టీకి రాసిన ఉత్తరాన్ని జతచేశాడు. ఆమె తన పద్ధతిలోనే చాలా మామూలుగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. పార్టీపైన ఆమెకు గొప్ప నమ్మకం. ఆమె చదువుకోవటానికి, కాడరుకు శిక్షణ ఇవ్వటానికి కూడా ఎంతో కృషి చేసింది. పార్టీకి ఆమె రాసిన ఉత్తరం, ఉద్యమంలో స్త్రీల చరిత్రకు చాలా ముఖ్యమైన డాక్యుమెంటు. ఆమె విమర్శకు సుందరయ్య చాలా ప్రాముఖ్యత ఇచ్చాడనేది మనకు అర్థమవుతుంది. ఆ ఉత్తరం ఇట్లా ఉంది. ”నిజాం రజాకార్ల సమయంలో మనం అన్నీ చేశాం కాని పెద్ద ఎత్తున కదిలి వస్తున్న జనం చొరవను, స్వయంగా వాళ్ళ కర్తవ్యాల్ని నిర్వహించుకోగలిగే శక్తిని మనం గట్టి పరచలేకపోయాం. యూనియన్ సైన్యాలొచ్చిన తర్వాత కూడా ఇదే ధోరణి కొనసాగింది. కాని మనం దాన్ని, నిర్బంధం మూలంగా జనం కదల్లేకపోతున్నారనీ, అందుకని జనం పాల్గొనకపోయినా మనమే ఆ పనులు నిర్వహించాలనీ సమర్థించుకున్నాం. మీరు కాడర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. అది ఇంక కొంత ఆలస్యానికి దారితీసినా ఫరవాలేదు. అట్లా అయితేనే వాళ్ళు ఒక మంచి అవగాహనతో గ్రామాలకెళ్ళి పనిచేయగలుగుతారు. ముఖ్యంగా శత్రువుల్నుండి ఎట్లా తప్పించుకోవాలనేది నేర్పించాలి. కాడర్లకు రక్షణ ఇవ్వటం గురించి సరైన ముందాలోచన, జాగ్రత్తలు చేయటంలేదు. మాకు అర్థమయ్యేట్టుగా ఉండే పుస్తకాలివ్వాలి. అటువంటి పుస్తకాల్ని వెతికి కనుక్కోవటానికి ఇంకా శ్రమపడాలి.” ఆ తర్వాత నర్సమ్మ ఇట్లా అంటుంది. ”మా ఆడవాళ్ళని ఇంకా పాతభావాలతో, తక్కువ వాళ్ళంగానే చూస్తున్నారు. మా తరపున ఏ చిన్న పొరపాటయినా, నాయకులు మా మీద పెద్ద దాడి చేస్తారు. అది వెంటనే విపరీతమైన నిందలకూ, బహిరంగంగా కథలు చెప్పుకోవటానికి దారి తీస్తుంది. మాకు సరైన సహకారం ఇచ్చి మమ్మల్ని అభివృద్ధి చెయ్యాలే కాని మమ్మల్ని అవమానించకూడదు. మేం కొంచెం స్వేచ్ఛ చూపిస్తే చాలు, మమ్మల్ని అనుమానంతో చూస్తారు. మీరు శత్రువుల మీద చేసే గెరిల్లా దాడుల్లో స్త్రీలనెందుకు రానివ్వరు.” పోరాటం మధ్యలో కూడా రాజకీయజ్ఞానానికీ, ప్రజాస్వామ్య పద్ధతులకూ ప్రాముఖ్యత ఇవ్వాలన్న అవసరం గురించి ఒకవైపు; స్త్రీలని అణచిపెట్టటానికి ప్రదర్శించే ద్వంద్వ విలువల గురించి ఒకొకవైపు నర్సమ్మ చేసిన సూచనలు చాలా విలువైనవి.
పార్టీ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా సుందరయ్య అంగీకరిస్తాడు. ”కామ్రేడ్ పద్మ”, తన భర్త అడవుల్లోకి వెళ్ళటానికి, అంటే తను కూడా రహస్యంగా పోవటానికి అనుకూలంగా ఉండేట్టు, తన పాపని ఎవరికైనా ఇచ్చెయ్యాలని పార్టీ నిర్ణయించింది. దీనిగురించి సుందరయ్య ఇట్లా రాశాడు, ”ఈ నిర్ణయం చేసిన తర్వాత ఎప్పుడూ నేను తప్పుచేసినట్లు ఫీలయ్యేవాణ్ణి. నేను పద్మనూ, పిల్లల్నీ ఇంకెక్కడైనా తీసుకెళ్ళి ఉంచి, ఆమె భర్త తిరిగొచ్చిన తర్వాత కలిసి ఉండేట్టు చెయ్యగలిగేవాణ్ణేమో. ఆ సమయంలో విముక్తి అయ్యేవరకు కొనసాగించే దీర్ఘకాల పోరాటం గురించే ఆలోచించాం. శక్తి ఉన్నవాళ్ళు ఉద్యోగాల్లో ఇతరత్రా జీవనాధారం చూసుకొని ఉండిపోతారు. అయినా విప్లవంకోసం వీలయినంత చేస్తునే ఉంటారు. ….కాని ఇది జరిగిన సంవత్సరంలోనే తెలంగాణా పోరాట విరమణ జరిగింది. ఆ విషయం నా మనసులో ఎప్పుడూ రగులుతూనే ఉంది….” . ఇక్కడ మనకు ముఖ్యంగా కనిపించేది-కుటుంబాన్ని విడదీసి తల్లితండ్రుల దగ్గర్నుంచి పిల్లల్ని వేరుచేశాననే సెంటిమెంటుతో బాధ. కాని అసలు పిల్లలు అనే సమస్యకు పరిష్కారం సరిగ్గా ఆలోచించలేదు. (నిజానికి, సెక్సువాలిటీకి, పిల్లలు పుట్టటానికి సంబంధించిన సమస్యలు కూడా). సుందరయ్య రాసిన విషయంలో మరీ లేనిలోతుల్ని చూసే ప్రయత్నం చేస్తున్నామని అనుకున్నా ఫరవాలేదు. కాని, నిజానికి ఆ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం అటువంటి ఉద్యమంలో పెద్దలోపం అని చెప్పకతప్పదు.
ఇటువంటి చరిత్ర సహకార చరిత్రకంటే చాలాముందుకు పోయిందనే విషయం అర్థమవుతూనే ఉంది. కాని ఇంతకుముందే చెప్పినట్టు, మనం చేసే పరిశీలనలో ఉద్యమానికి ఒక ప్రత్యేకస్థానం ఉండడమే కాకుండా, అది ఒక స్థిరమైన ‘పాజిటివిస్ట్’2 భారాన్ని కూడా సంతరించుకుంటుంది.ఉద్యమాన్ని ఒక బాహ్యవిషయంగా చూడటమే తప్ప, ఒక మానవ సంఘటనగా అర్థం చేసుకోవటం జరగదు. చరిత్రను సృష్టిస్తున్నవాళ్లుగా, ఉద్యమానికి ఒకరూపునిచ్చే వాళ్లుగా కాకుండా, స్త్రీలు ఉద్యమానికెట్లా దోహదం చేస్తున్నారని మాత్రమే ఇప్పటివరకు చూశాం. ఉద్యమం వాళ్లపైన ఎటువంటి ప్రభావాల్ని చూపిందీ, వాళ్లు నిలదొక్కుకోవటానికి చేసిన పోరాటాలేమిటి, వాళ్ళ చైతన్యం ఎట్లా పెరిగిందీ (లేదా ఎట్లా మొద్దుబారిందీ) – దాదాపు ఈ విషయాలన్నిటినీ నిర్లక్ష్యం చేయకపోయినా, వాటికున్న రాజకీయ స్వభావాన్ని మాత్రం గుర్తించటం జరగలేదు. ఇంతకు ముందు పార్టీకున్న ప్రధాన లక్ష్యాలు, స్త్రీలుపడ్డ బాధలగురించి నర్సమ్మ చాలా సూక్ష్మంగా చేసిన విమర్శలు చూశాం. సుందరయ్య పుస్తకంలో (ఉద్యమంలోలాగే) ఈ విమర్శల్ని గురించి రాసి వాటికి గుర్తింపునిచ్చినా, ఉద్యమాన్ని అంచనా వేయటంలో మాత్రం వాటిని వినియోగించలేదు. ”దీనితో, పార్టీలో స్త్రీకాడరు భావాలు, వాళ్ల అభివృద్ధి గురించి అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుందని నేను ఇంత పెద్ద లేఖని ఇక్కడ పెడుతున్నానని” సుందరయ్య రాశాడు. అట్లా రాయడంలో స్త్రీల గొప్పతనాన్ని చాటుతున్న ఒక పితృభావమే మనక్కనిపిస్తుంది. వీణ బాగా వాయించగలదనో, క్లాసులో ఫస్టు ఒస్తుందనో చెప్పటానికీ దీనికీ పెద్ద తేడా లేదు. కామ్రేడ్ పద్మ సమస్య అంటే పిల్లల సమస్య – ఉద్యమానికున్న పెద్ద సమస్యల్లో ఒకటయినప్పటికీ, చర్చల్లో మాత్రం కుటుంబ సంతోషాన్ని ఒక నైతిక సమస్యగా పలచన చేయటం, తప్పుచేసినట్టు భావించటం కనిపిస్తుంది. స్త్రీల గురించి ఉద్యమానికే శ్రద్ధ ఉండి ఉంటే దాన్ని ఒక రాజకీయ సమస్యగా తీసుకోవాలని గుర్తించే విశ్లేషణ ఎక్కడా కనిపించదు.
ఇటువంటి మంచి అవగాహన కూడా పితృభావాల చాటునబడి సరిగా చర్చకు రాకపోతే-ఉద్యమం వాళ్ళని ఉపయోగించు కొని, తర్వాత పక్కకి తోసేసిందని స్త్రీలు చాలాసార్లు బాధపడటం కొంచెంకూడా ఆశ్చర్యాన్ని కలిగించదు. స్త్రీలగురించి ఎంత గర్వంగా చెప్పుకున్నా, ఆడవాళ్ళంటే ”సమస్యలే” అనే భావం అంతటా వ్యక్తమవుతూనే వుంది. ఆ సమస్యను రాజకీయం చేయనంతవరకు; దాని ప్రతి అంశాన్ని ప్రతికోణంనుంచీ ఎదుర్కోనంతవరకూ; మిగతా సమస్యలలాగే అది కూడా ఒక ఇబ్బందికరమైన విషయంగా మిగిలిపోతుంది. దానితోపాటుగా, ‘సమస్యని పట్టించుకోకపోతే అదే రూపుమాసిపోతుందిలే’ అనే బలమైన కోరిక బయటికి చెప్పకపోయినా వ్యక్తమవుతూనే ఉంటుంది. ప్రతిరోజూ జరిగే విషయాల్లో స్త్రీలని తీసిపారేసినట్టు చూసే సంఘటనల్ని స్త్రీలందరూ అనుభవించే వున్నారు. మనసుల్ని కొద్దికొద్దిగా నమిలేసే ఆ అనుభవాల్ని స్త్రీలెవరైనా గుర్తిస్తారు. పైన చెప్పినట్టు సమస్య అదే పోతుందిలే అనే ఆశ, మాటల రూపంలోకంటె ఈ చిన్న సంఘటనల్లో ఎక్కువ బయటపడుతుంది. ఈ పుస్తకంలోని జీవిత కథల్లో కనిపించే స్త్రీల విశ్వప్రయత్నాలు కొద్దిమార్పును కూడా తీసుకురాలేకపోయాయని గుర్తిస్తే; ఫలితంగా ఆ స్త్రీలకేమయిందని ఆలోచిస్తే ముచ్చెమటలు పోస్తాయి. ”అది ఒట్టి మనోబలమే” అంటుంది ప్రమీలాతాయి. వచ్చిన స్త్రీలందరూ అదే మనోబలంతో నిబ్బరంగా పనిచేశారనీ నిలదొక్కుకున్నారనీ అర్థం చేసుకున్నప్పుడు నోటమాటరాకుండా అయిపోతుంది.
పైకి చూడటానికి మా ప్రయత్నం కూడా సహకార చరిత్రలాగే కనిపిస్తుంది. తెలంగాణా పోరాటంలో పాల్గొన్న స్త్రీలెవ్వరు? వాళ్ళేం చేశారు, వాళ్ళ అనుభవాలేమిటి, పోరాటం ఆపినప్పుడు వాళ్ళేమైపోయారు? – అని మనం ఇప్పుడడుగుతున్నాం.
అయినా ఇందులో ఒక ముఖ్యమైన తేడా వుంది. దృక్పథాల్లో, విషయాన్ని అర్థం చేసుకునే పద్ధతుల్లో పూర్తి మార్పు వుంది. స్త్రీలను కేంద్రంగా చూసే దృక్పథంవైపు ఈ పరిశీలన తరలించబడ్డది. స్త్రీల దృష్టితో చూస్తే, వాళ్లు నిర్దేశించిన విలువలతో పరిశీలిస్తే చరిత్ర ఎట్లా వుంటుంది, అసలు ఈ ఉద్యమం వాళ్ళకేమిటి, వాళ్ళ అనుభవాలేమి టని-మనం అడుగుతున్నాం. ఈ ప్రయత్నానికి కొత్త సిద్ధాంతాలు, కొత్త విభాగాలు మాత్రమే కాదు. దానికి కొత్త పునాదుల్ని ఏర్పరచటం, పరిశోధనకు కావలసిన కొత్త సాధనాల్ని తయారుచేయడం కూడా అవసరం. మనకు కొంతవరకు డాక్యుమెంట్ చెయ్యబడ్డ ఆధారాలున్నాయి. అవి వార్తాపత్రికల్లో, పార్టీ డాక్యుమెంటుల్లో, పోలీసు రికార్డుల్లో అనుకోకుండా దొరికే విషయాలు. ఇవేవీకూడా మనకు కావలసిన స్త్రీల చరిత్రకు తగినంత న్యాయం చేకూర్చవు. అయితే, స్త్రీలు అనుభవించిన గతాన్ని తిరిగి సృష్టించగలిగే, వాళ్ళ సజీవస్వరాలు మనకున్నాయి. ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన స్త్రీలు మనకున్నారు. సంప్రదాయ చరిత్రలు ఇంతవరకు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయాలు, వీళ్ళు చెప్పిన అనుభవాల్లో మనక్కనిపిస్తాయి. వాళ్ళ సమస్యల్ని ఏ అవగాహనతో చూశారు, వాటికే విధంగా స్పందించారు, ఏ విధంగా పోరాడారు అనే వాటిని మనం ఈ రోజు అర్థంచేసుకోగలుగుతున్నాం!
మా ప్రయత్నంలో చరిత్ర స్త్రీలగురించి మాట్లాడదు. స్త్రీలతోటే మాట్లాడిస్తుంది. మేం శ్రోతలుగా మాకున్న తొందరలను, ఆత్రుతల్ని తాత్కాలికంగా పక్కకిపెట్టి వాళ్లుచెప్పింది వినటం నేర్చుకున్నాం. మేం అడగటంకన్నా వాళ్ళు చెప్పటానికి ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చాం. వాళ్ల జీవితాల గురించి వినటం మూలంగా మెల్లిగా ఆ ఉద్యమం స్త్రీలకెటువంటి ఉనికినిచ్చిందీ; వాళ్ళెటువంటి బాధలకు, ఎంత ఒంటరితనానికి గురయిందీ; వాళ్ళ ధైర్యం, చొరవ, తెలివితేటలు, సమయస్ఫూర్తీ, వాళ్ళ జీవితాల్లోని గొప్ప సృజనాత్మకశక్తీ – ఇవన్నీ గ్రహించగలిగే శక్తి మాకు ఏర్పడింది.
ఇంతవరకెన్నడూ వాళ్ళ జీవితకథల్ని వినిపించని వాళ్లతో ఆ కథల్ని చెప్పమని అడగటంకంటె సులభమైనపని ఏముంటుందని అనిపించొచ్చు. కాని, ఆ విధంగా ఏవో లోతుల్నుంచి మాట్లాడటానికి ఎంతో ధైర్యంకావాలని మనం మరచిపోకూడదు. మేం ఇంటర్వ్యూ చేసిన స్త్రీలందరూ అంతకు ముందు ఏ పరిశీలనకూ బయటపడని కొన్ని అనుభవాల్ని కూడా వ్యక్తంచేయటానికి సందేహించకుండా తమ వ్యక్తిగత జీవితాల్ని మాముందుంచారు. అట్లా చేయడంలో శతాబ్దాలుగా పేరుకుపోయిన నిశ్శబ్దాన్ని వాళ్లు ఛేదించారు.
ఇప్పటివరకు వ్యక్తం చేయని విషయాలగురించి, చెప్పని అనుభవాల గురించీ చెప్పాలంటే కొత్త పదాల్ని ఉపయోగించటానికి భాష కూడా విస్తరింపజేయాల్సి వస్తుంది. ఈ జీవితకథల్ని మనం చదువుతున్నపుడు వినిపించటానికి కృషిచేస్తున్న ”నిశ్శబ్దపుభాష” (ఒక మౌఖిక చరిత్రకారుడు ఉపయోగించిన పదం ”జిబిదీవీతిబివీలి ళితీ రీరిజిలిదీబీలి”) ను వినటం నేర్చుకోవాలి. అక్కడక్కడా ఆగిపోవటాన్ని; వూగిసలాడటాన్ని; అస్పష్టతను; మనం ‘వినితీరాల’నుకున్న ప్రశ్నల్ని పక్కకు నెట్టెయ్యటాన్ని; చెప్పినదాన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పే అవసరాన్ని – మనం అర్థంచేసుకోవటం తప్పనిసరి. దూడల సాలమ్మ గంట కొట్టినట్టు పదే పదే తనకురాని పెన్షను గురించి మాట్లాడటంలో తను త్యాగంచేసిన జీవితంగురించీ, చెదిరిపోయిన తల కలల గురించీ మనకు వినిపిస్తుంది. కాని ఆమెలో ప్రియంవదలాగా కళ్ళకు కట్టినట్టు వర్ణించే శక్తిలేదు. ప్రియంవద అంటుంది – ”మా ఆశలు కోడిగుడ్డు చిదిపితే చితికినట్టు అయిపోయినయి” అని. కానీ దూడలసాలమ్మ మాటలు అదే స్పష్టతతో అంతే బాధను కల్గిస్తాయనటంలో సందేహం లేదు. పబ్లిక్ చరిత్రలకు, పెద్ద విస్తృత (ఖబిబీజీళి) చరిత్రలకు ఒక నిర్ణీతమైన భాష, పద్ధతీ; ఎవరూ ప్రశ్నించలేని ఎదిరించలేని-అధికారయుతమైన స్థానం నుండి వచ్చే ఒక స్పష్టతా, ఉన్నాయి. నిజానికి దానికున్న అధికారంతో అనుభవాన్ని వక్రీకరించి, మొద్దుబారేట్టుచేసి, దాని స్వభావానికి వ్యతిరేకమైన జ్ఞాపకాల్ని తుడిచిపెట్టగలిగే శక్తి ఆ చరిత్రకుంది. ఏ విషయాల్లోనయితే మనకు ప్రోత్సాహం దొరకదో, ఆ విషయాల్నే మనం క్రమంగా మర్చిపోవడం జరుగుతుంది. మేం విన్న జీవితకథల్లో చాలాసార్లు ‘పబ్లిక్’ పరిధిలోకి రాని, సబబైనవనిపించని అనుభవాల్ని, విజ్ఞానాన్ని, తిరిగి ఆలోచనల్లో అందుకోవాలని చేసిన ప్రయత్నాలు కనిపించినై. ‘పబ్లిక్ జ్ఞాపకాల’ అవసరాలకు మించి ఏవైనా ‘చిన్న సంఘటనలు’ ఎక్కడైనా మిగిలి మనకు వినిపిస్తే వాటిని చాలా జాగ్రత్తగా సేకరించి దాచిపెట్టుకొని విలువనివ్వాలి. తన రాజకీయ అభిప్రాయాన్ని వెలిబుచ్చినపుడు తననేవిధంగా ‘ఒక ఆడదానిగా’ తీసిపారేశారని ప్రమీలాతాయి చెప్పినప్పుడు వినిపించిన బాధ, పార్టీ తనకు ఆశ్రయం ఇవ్వటానికి నిరాకరించి హైద్రాబాద్ నించి వెళ్ళిపొమ్మననప్పుడు ఆమె పడ్డ తపన-ఇవన్నీ ‘ఏదో ఊర్కే చెప్పిన వివరాలు కావు. ఇంతవరకు పబ్లిక్ గుర్తింపు (ఆతిలీజిరిబీ రీబిదీబీశిరిళిదీ) పొందని అనుభవాలలో అంశాలను ఎత్తి చూపించే ముఖ్యసూచనలు. మనం విన్న విషయాలన్నీ చాలా బహిరంగంగా, దేన్నో అన్వేషిస్తున్నట్టుగా, ప్రయత్నపూర్వకంగా ఉన్నట్టున్నాయి. ఈ కథల్లో దాగి ఉన్న నిజాల్ని వినడం, ఈ చరిత్ర లోతుల్ని తెలుసుకోవటం – వీటికి ఒకసారి అలవాటుపడితే, ఒకే ధోరణిలో చెప్పుకుపోయే పబ్లిక్ చరిత్రలు చాలా నిస్తారంగా, మొరటుగా, అర్థంలేనివిగా అనిపిస్తాయి. వాటి సూత్రీకరణలు నిజమనిపించినా చాలా తక్కువస్థాయిగా కనిపిస్తాయి. ఆడవాళ్ళ ప్రపంచం ఎంత తెరవెనక దాగివున్నా, మగవాళ్ళ ప్రపంచంతో ముడిపడే ఉంది. ఆడమగ అందరికీ సంబంధించిన సమాజంపట్ల మన అవగాహనను మరింత రాడికల్ స్థాయిలోకి తీసుకెళ్లే అవకాశం – ఈ దృక్పథంతో మనకు కలుగుతుంది. మనం ఒక పరిపూర్ణమైన మానవ చరిత్రను తయారుచేసుకోవాలంటే, అటువంటి భవిష్యత్తువైపు సాగాలంటే, ‘మగవాళ్ళ చరిత్ర’ పక్కన ‘స్త్రీల చరిత్ర’ను నిలబెట్టే ప్రయత్నం సరిపోదు. మన చరిత్ర డిమాండ్ చేసే కొత్త అంచనాల్ని, కొత్త సిద్ధాంత రూపాల్ని, కొత్త మలుపుల్ని – ఏర్పాటుచేసుకునే నమ్రత (నీతిళీరిజిరిశిగి), ఉత్సాహం మనకుండాలి.
మా గతాన్ని అన్వేషించే ఒక గ్రూపుగా, మా దృష్టిలో మౌఖిక చరిత్రకు (ళిజీబిజి నీరిరీశిళిజీగి) ఒక ప్రత్యేకత ఉంది. రాసే భాషల్లో స్త్రీలకు సాంప్రదాయంగా స్థానం ఇవ్వకపోయినా, స్త్రీలు ఎప్పుడూ కథల్ని చెప్తూనే ఉన్నారు. ఒక సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన నియమాల్ని ఆదర్శంగా చెప్పే కథలున్నాయి. అట్లాగే అధికారాన్ని, అన్యాయాన్ని ఎదిరించినవాళ్ళ కథలూ ఉన్నాయి. పితృస్వామ్య సంస్కృతిలో సూర్యోదయాన్ని చూడని కథలు – స్త్రీలు ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నారు. సంప్రదాయంగా తల్లులు వాళ్ళకు తెల్సిన విషయాల్ని, జ్ఞానాన్ని, నేర్పరితనాన్ని కూతుళ్ళకు నోటిమాటలతోనే నేర్పారు. ఈ సమాంతర సంస్కృతిలో నేర్పించటం, నేర్చుకోవటం కూడా వ్యక్తుల మధ్య సన్నిహిత్వంతో, వాస్తవికతతో కూడినది. అణచివేతను ఎట్లా ఎదిరించాలి, దానినించి ఎట్లా నిలదొక్కుకోవాలనే విజ్ఞానమే ఎక్కువ ఒక తరం నుండి ఇంకొక తరానికి అందివ్వబడింది. మేం జరిపిన ఇంటర్వ్యూలలో కూడా ఇట్లాంటివెన్నో సందర్భాలున్నాయి. కొన్నిసార్లు వాళ్ళు మా టేప్‌రికార్డును ఆపివేయమని చెప్పి, ‘బయటికి చెప్పుకోగూడని’ ‘స్త్రీల రాజకీయాల’కు సంబంధించిన విషయాలు మాకు చెప్పేవాళ్ళు.
ఈ పుస్తకం వ్రాతప్రతి చదివి అభిప్రాయం చెప్పమని అడిగితే కొందరు స్నేహితులు ”ముఖ్యమైన” ”పబ్లిక్” (రాజకీయ) విషయాలేమీ ఈ ఇంటర్వ్యూల్లో కనపడలేదేమిటని ఆశ్చర్యపోయారు. వాళ్ళు చదివిన, విన్న – ఉద్యమానికీ, మా ఉపోద్ఘాతంలో రాసిన చరిత్రకీ, ఈ ఇంటర్వ్యూలకీ మధ్య పెద్ద చీలిక ఉన్నట్టుందని అభిప్రాయపడ్డారు. దీనర్థమేంటని అడిగారు. మీరు వాళ్ళని ఈ ప్రశ్నలడగకపోవటం మూలంగా ఇట్లా అయిందా – అని ప్రశ్న. (అంటే అది మాలో ఉన్న పక్షపాతం మూలంగానా?) లేకపోతే అసలు స్త్రీలకి ఈ రాజకీయ విషయాలవల్ల ఆసక్తి లేదా? ఈ విమర్శ చాలా సూక్ష్మంగా చేశారనిపిస్తుంది. కొన్ని ముఖ్య ప్రశ్నలన్ని జతకూడే కేంద్రం మీదే ఈ ప్రశ్న సరిగా వేలుపెడుతుంది. ముందర మేం అడిగిన ప్రశ్నలతో సమస్యలేమిటో చూద్దాం. మేం వాళ్ళ జీవితాల గురించి ప్రధానంగా చెప్పమని అడిగిన మాట వాస్తవం. వాళ్ళగురించీ, వాళ్ళు చేసిన పనుల గురించీ తెలుసుకోవాలనీ, వాళ్ళ అనుభవాల క్రమంలో ముఖ్యంగా బయటపడే కథల్ని వినాలనీ మేం కోరుకున్నాం. ”మాకు మీ జీవితాల గురించి చెప్పండి!” అన్నాం. ”మీరు పుట్టినప్పట్నించి – ఎట్లా పెరిగిందీ, అప్పుడు పరిస్థితులెట్లా ఉండేవీ, మీరు ఉద్యమంలో కెట్లా వచ్చిందీ – అన్నీ చెప్పండి!” అని అడిగాం. తెలంగాణా సాయుధపోరాటం గురించి మాకు చెప్పండని మేం అడగలేదు. మనం అడిగిన ప్రశ్నలకే చరిత్ర సమాధానం ఇస్తుందనే మాట వాస్తవం. అయితే, మనం ఆశించిన జవాబులు మాత్రమే వస్తాయనుకోవటం సరైనది కాదు. వెట్టిచాకిరీ, భూస్వాముల దౌర్జన్యం, పర్దా, మానభంగాల గురించి ఎక్కువ చెప్పలేదని మొదట్లో మేమూ ఆశ్చర్యపోయాం. పెళ్ళిళ్ళ సమస్యల గురించీ, కుటుంబాల్ని వదిలి ఉద్యమంలో చేరడానికి అన్నదమ్ములు ఆడవాళ్ళకి ఎట్లా సహయం చేశారన్న విషయాల గురించీ ఎక్కువగా విన్నాం. సంప్రదాయపు రాజకీయ చర్యల కంటే, స్త్రీపురుష సంబంధాల గురించి, పిల్లల్ని కనిపెంచటాల గురించీ, స్త్రీల సంతోషాలూ, టెన్షన్‌ల గురించీ ఎక్కువ విన్నాం. పార్టీలో ప్లానులు తయారు చేసుకోవటాలూ, నిర్ణయాలు తీసుకోవటాలూ సమస్యల గురించి చర్చించటాలూ – ఇకేవీ మాకు వినిపించలేదు.
ఇక్కడ (కనీసం) రెండు విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకటి – ఎటువంటి సందర్భంలో ప్రశ్న వేశాం అన్నది. ఇంటర్వ్యూకి మొదట్లో వెళ్ళినపుడు, స్పష్టంగా, ‘మీ జీవితం గురించి చెప్పండి’ అని అడగలేదు. అయితే మేం ఒక ఉద్యమంలో స్త్రీల చరిత్ర రాయడానికి ఒక స్త్రీ సంఘం సభ్యులుగా వెళ్ళాం. ఈ అవగాహనకు, ‘నిర్దిష్టం’ (ళిలీశీలిబీశిరిఖీలి) మీద కాకుండా ‘వ్యక్తిపరం’ (రీతిలీశీలిబీశిరిఖీలి) మీద ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలనే దృక్పథం కూడా తోడవడంతో – చెప్పిన విషయాల ప్రాధాన్యతే మారింది. (ఇది దాదాపు అనుకోకుండా జరిగిందే). ఉద్యమంలో స్త్రీల గురించి స్త్రీలుగానే వాళ్ళు మాతో మాట్లాడారు. అంతా కలిసి కూర్చోని గంటల తరబడి చాలా సన్నిహితంగా మాట్లాడటం జరిగింది. (కొన్నిసార్లు నాల్గయిదు గంటలు కూర్చోవటం తటస్థించింది). స్త్రీల సమస్యల రాజకీయాలు కేంద్రీకృతమై ఉన్న పరిధులన్నీ వెలుగులోకొచ్చాయి. అంటే, కుటుంబం, వ్యక్తిగత జీవితం, సెక్సువాలిటీల మీద జరిగే పోలీసింగ్; పిల్లల్ని కనటం, పెంచటం; ఇతర స్త్రీలతో పురుషులతో సంబంధాలూ; కుటుంబంనించీ, ‘స్త్రీత్వం’ నించీ బయటపడటానికి ‘సమంజసమైన’, ‘న్యాయసమ్మతమైన’ (జిలివీరిశిరిళీబిశిలి) ఆశ్రయం చూపించిన ఉద్యమం – ఇంకా ఇట్లాంటివి ఎన్నో విషయాలు ఇంటర్వ్యూల్లో బయటపడ్డాయి.
బయటి ‘పబ్లిక్’ రాజకీయాల గురించి స్త్రీలకేమీ పట్టలేదని అనుకోవటం కష్టం. (మిగతావాళ్ళతో మాట్లాడినపుడు కూడా – పోరాటం ఉద్ధృతంగా ఉన్నపుడు రాజకీయ సమస్యలపై కంటే పోరాటపద్ధతుల మీదే ఎక్కువ దృష్టి ఉంచినట్టు కనిపిస్తుంది). స్త్రీల ప్రయత్నాల్నీ వాళ్ళ కృషినీ పూర్తిగా ఆక్రమించుకున్న ‘సమాంతర ప్రపంచం’ (ఆబిజీబిజిజిలిజి జీలిబిజిళీ) ఒకటుందని, ఇంటర్వ్యూల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పటి రాజకీయ అవగాహనాపరిధికి బయట ఉన్న ప్రపంచం అది. అందువల్లే ఒక నిశితమైన, విమర్శనాత్మకమైన దృక్పథం లేకుండా స్త్రీలు ఒంటరిగానే ఆ ప్రపంచంలో అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రియంవద అంటుంది ”మేం ఒట్టి వ్యక్తులమే” అని. ఈ విషయమే మిగతా జీవితాల్లోనూ కనిపిస్తుంది. పబ్లిక్ పోరాటాన్ని అంటిపెట్టుకొనున్న (ఇంతవరకూ గుర్తింపుకురాని) ప్రైవేటు పోరాటాల ”రెండింతల భారాన్ని” స్త్రీలు మోశారు. ఈనాటికీ పార్టీ ఆర్గనైజేషన్లలో కంటికి కనిపించేదీ, కనిపించనిదీ – రెండు పోరాటాల సమస్య చాలావరకు ఉంది. ఏదేమైనా ఇట్లా చెప్పటంలో – నాయకత్వం సభ్యులుగా ఎన్నుకున్న స్త్రీలకు ఉద్యమం కలగజేసిన ”అవకాశాల” ప్రాముఖ్యత నుంచి ఏమాత్రం పక్కదారి పట్టించడం-మా ఉద్దేశం కాదు. ఇది మనని ప్రైవేటు పోరాటం గురించిన ఇంకొక అంశంలోకి తీసుకొని వెళ్తుంది. ఆ విషయం చివరిమాటలో చర్చించాం.
ఈ రోజు సోషలిస్ట్ ఫెమినిజం సిద్ధాంతం, ఆచరణా సూచిస్తున్నట్టు ‘ప్రైవేట్’ మీద మనం దృష్టిని కేంద్రీకరిస్తే, స్త్రీలని అణచివేసే నిర్మాణ స్వరూపాలే కాకుండా, ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానాల స్వరూపాలు కూడా సజీవంగా కొనసాగటానికి ఆధారాలేమిటని అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇది విలువ సూత్రం (ఉబిగీ ళితీ ఖీబిజితిలి) గురించిన చర్చలకంటే (ఎంత జ్ఞానాన్నిచ్చేదైనా సరే) ఉపయోగకరం. ఇక్కడ మనం ఒక అడుగు ముందుకెళ్ళొచ్చు. మనం సోషలిజంని అట్టడుగునుంచి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే మన అవగాహన ఇంకా లోతుగా స్పష్టంగా ఉంటుంది. అట్లా అట్టడుగునించి చూడటం అంటే – సోషలిజంలోని రహస్యభాషల్ని; అందులోని నిశ్శబ్దాల్ని; అది స్పష్టంగా బయటపెట్టని విలువల్ని; దానిలోని ముఖ్య కేంద్ర స్థానాల్ని; మనం గ్రహించగలిగే దాని శైలిలోని అపస్వరాల్ని; బహుశా అది పెంచి పోషించే అవసరాలూ-కోరికల్ని; దానికి ఆధారమైన ‘భయం’ ‘ఆశ’ల మూలాన్ని – వీటన్నింటినీ అర్థంచేసుకోవటం అన్నమాట. ఇవన్నీ మనం ఇరుక్కుపోయిన ఫ్యూడల్ మూసల్లో నుంచి ఎంతవరకు బయటపడగలిగాయి? స్త్రీ సమస్య అనే ప్రశ్నతోటి, రాజకీయ అవగాహనాపరిధి విశాలమవటమే కాకుండా మారిపోవడం కూడా జరుగుతుంది.
మౌఖిక చరిత్ర (ంజీబిజి కరిరీశిళిజీగి) అంటే స్త్రీల చరిత్రకీ, ప్రజల చరిత్రకీ చాలా ముఖ్యమైన ఆధారం అని రుజువైనప్పటికీ, దానికున్న కొన్ని ఖచ్చితమైన పరిమితుల్ని మనం మరిచిపోకూడదు. ఒక అనుభవం గురించి కానీ, జ్ఞాపకం గురించిగానీ జీవితచరిత్ర గురించి కానీ చెప్పటం చాలా సహజంగా ఉంటుందని భావిస్తాం. అట్లా చెప్పటం దైనందిన జీవితానికి సంబంధించినదే కానీ ఏ ఊహాసిద్ధాంతానికీ, కథల రూపాలకీ సంబంధించినది కాదు, అని అనుకుంటాం. కానీ జీవితచరిత్రలు రికార్డు చేసుకునే వాళ్ళందరూ తొందరలోనే గ్రహించే విషయం సైద్ధాంతిక పద్ధతులు వడబోయకుండా అటు జ్ఞాపకం గానీ ఇటు అనుభవం గానీ మిగిలుండదు, అని. మన సంస్కృతి ఒప్పుకునే విషయాలే మనం చాలావరకు గుర్తుంచుకుంటాం. (మనం ఎక్కడో మన మనసుల్లో దాచి ఉంచుకున్న జ్ఞాపకాలు కూడా సాంఘికంగా వెలివేయబడతాయనుకున్నవే.) మన జీవితాల్ని ఒక పద్ధతిలో అర్థంచేసుకొని, బయటికి చేప్పటానికి ఉపయోగించే ”ఈ కథలకు” నిగూఢంగా వుండే కొన్ని సాంప్రదాయాలూ, ఆదర్శాలూ ఒక రూపాన్నిస్తాయి. కమలమ్మ చరిత్ర చదివితే ఈ సమస్య చాలా స్పష్టంగా కనపడుతుంది. అప్పట్లో వున్న ఘోరమైన ఫ్యూడల్ అణచివేత గురించి కొన్ని సంఘటనలు చెప్పిన తర్వాత ఆమె, ఆ లెనినిస్ట్ పార్టీ మూలంగా నేను ఆమాత్రమైనా తెలుసుకున్నాను, మా చెల్లెలయితే అంతా మరిచిపోయింది” అని చెప్తుంది. ఆమె జ్ఞాపకాల్ని నిర్ణయించిన సిద్ధాంత వడబోత గురించీ ఆమెకు తెలుసు. అట్లాగే ఆ జ్ఞాపకాలకి ప్రతికూలమైన మరొక జ్ఞాపకాన్ని బయటకు తవ్వి తీసి, పరిశీలించగలిగే తన విమర్శనాత్మకశక్తి గురించీ ఆమెకు తెలుసు. పదహారవ ఏటనే ప్రపంచంలో వున్న కొద్ది కాలినడక వైద్యులలో ఒకతైన అచ్చమాంబని చూద్దాం. ఆమెకు చదువు కూడా సరిగా వచ్చేది కాదు. కాని జబ్బుల్ని నయంచేయటం, గాయాల్ని శుభ్రంచేసి కుట్లువేసి కట్టుకట్టడం, దొరికిన మాంసంతో కూరగాయలతో వంట చేయటం, చుట్టుప్రక్కల గ్రామాల్లో వైద్య అవసరాల్ని చూసుకోవటం-ఇవన్నీ చేసేది, తను నేర్చుకున్న వైద్యం, నిర్వహణా విజ్ఞానంతో ఒక ఆరోగ్య మంత్రిత్వశాఖకి సరిపోయే సమాచారాన్ని తయారుచేసి ఒక నమూనాని అందివ్వగలిగేది. అయినా ఆమె జీవితకథలో చాలాభాగం ఎలుగుబంట్లూ, సింహాలూ, దాడిచేయటం తప్పించుకోవటాల గురించే ఉంది. తాను సంపాదించిన విజ్ఞానం కంటే వున్న తిండిని సరిగ్గా ఎట్లా పంచిపెట్టాలనే తపనకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్టుంది. ఈ సమస్యను మనం ఎదుర్కోక తప్పదు. ఒక అధికారయుత రికార్డులే కాకుండా, స్త్రీలు కూడా వాళ్లు చేసిన పనిని అదేపనిగా తక్కువచేసి విలువలేనిదిగా చేయటం జరిగితే మనం వాళ్ళ పనిని ఎట్లా అంచనా వేస్తాం?
మార్క్సిజానికి ‘అనుభవం’ అనే ప్రశ్న ఎప్పుడూ కంటకంగానే ఉంటూ వచ్చింది. మార్క్సిజం ప్రధానంగా సాంఘిక సంబంధాల మొత్తం స్వరూపాన్ని విమర్శనాత్మకంగా పరిశీలిస్తుంది. అయితే అనుభవమనేది బాహ్యంగా పనిచేస్తున్న ఎన్నో శక్తులను పక్కకుపెట్టి ఒక వ్యక్తిగత దృష్టికి ప్రాముఖ్యతనిస్తుంది (అని విమర్శకులు వాదిస్తారు). అది ఒక విషయానికి విశ్లేషణ ఇచ్చే చోట ఆ విషయాన్ని పూర్తిగా వివరిస్తుంది. కాని, దాని సిద్ధాంతరూపాన్ని మాత్రం అది గుర్తించదు. అయితే ఒకటి మాత్రం నిజం. అనుభవం చాలా సజీవంగా, ఉన్నతంగా, చెప్పదలచుకున్న విషయాన్ని చక్కగా వ్యక్తం చేయగలిగే శక్తి కలిగి ఉంటుందనటంలో ఏమాత్రం సందేహంలేదు. ఎంత తీక్షణమైన విశ్లేషణ అయినా దానిముందు పనికిరాదు. చివరగా – అణచివేతకు, దోపిడీకి గురయ్యేవాళ్ళ ఏ అనుభవాలయితే సిద్ధాంతాల్లోకి పూర్తిగా ఇమడలేదో ఆ అనుభవాలే కార్యాచరణకూ, మార్పుకూ దోహదం అవుతాయి.
సిద్ధాంతపరమైన సందర్భంలోనే మనకు ఓరల్ టెస్టిమొనీలు తటస్థిస్థాయనే విషయం మనమెప్పుడూ గుర్తుంచుకోవాలి. కాని ఆ మౌఖిక చరిత్రలాగే, ఆ సందర్భం నిర్ణయించటం కూడా ఒకే క్రమపద్ధతిలో జరగదు. చెప్తున్న విషయం ధాటితో పోలుస్తూ మధ్యలో ఎదురయ్యే తటపటాయింపులు, నిశ్శబ్దాలు, దాటేయడాలు – ఇవన్నీ గమనించటం నేర్చుకుంటే, ఇంతకు ముందే చెప్పినట్టుగా వాళ్ళు ప్రశ్నించే పద్ధతి, వాళ్ళ తటపటాయింపు, వివరణలివ్వటాన్ని పూర్తిగా తిరస్కరించటం – మనకు స్పష్టంగా అర్థమౌతాయి. ఇంకో విధంగా చెప్పాలంటే కథలేం చెప్తున్నాయనే దాని మీదే కాకుండా, ఏం బయటపెడ్తున్నాయనే దానిమీద కూడా మన దృష్టి కేంద్రీకరించాలి. అంతేకాదు. ఇంతకుముందు గుర్తింపబడని అనుభవాల్ని మనకు వినిపించి వాటి అంతరార్థాల్ని వెతికే (రాజకీయంగా, సిద్ధాంతపరంగా సాధించిన) అవకాశాన్ని ఈ చరిత్ర కలిగిస్తుంది. ఈ చరిత్ర రాయడం మాకు, సాంప్రదాయ చరిత్రలురాసే పద్ధతి (నీరిరీశిళిజీరిళివీజీబిచీనీగి) దాని పరిమితులూ తెలుసుకోవటంలోనే కాక, మన పరిశోధనల పునర్‌కేంద్రీకరణ మూలంగా ఏర్పడ్డ అవకాశాల్ని అన్వేషించే కొత్త పద్ధతుల్ని కూడా నేర్పింది. ఇప్పుడు రాస్తున్న చరిత్రే ఒక సబ్‌గ్రూప్ చరిత్రగా మారొచ్చన్న విషయం ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తుంటే బోధపడుతుంది.
1.నష్టపరిహారం – ఇప్పటివరకూ చరిత్రలో స్త్రీలు కనిపించలేదు, కాబట్టి వాళ్ళగురించి ఎక్కడైనా తెచ్చిపెట్టాలి అనే ధోరణి.
2.పాజిటివిజమ్ – ఇది ఒక భౌతికవాద దృక్పథం. సమాజంలో భౌతిక జీవితానికి వుండే ప్రాముఖ్యతను అంగీకరిస్తుంది. అయితే వివిధ సామాజికరంగాల మధ్య వుండే ప్రతిచర్య (ఇంటరాక్షన్)ను విస్మరిస్తుంది. భౌతిక జీవితానికీ మానవుల ఆలోచనలకూ, ఆచరణకూ వుండే పరస్పర ప్రతిచర్యను విస్మరిస్తుంది. మార్పునూ, పరిణామక్రమాన్నీ విస్మరిస్తుంది. అన్ని విషయాలనూ విడివిడిగా ఇతర విషయాలతోగానీ, చారిత్రక క్రమంతోగానీ, మానవ ఆచరణతో గాని ప్రమేయం లేకుండా సర్వస్వతంత్రమయిన పునాది మీద నిలబెట్టి అధ్యయనం చేస్తుంది.
ముందుమాట
‘మనకు తెలియని మన చరిత్ర’ మొదటిసారి ప్రచురణ తెలుగులో 1986లో జరిగింది. స్త్రీల ఉద్యమం దేశమంతటా అనేక ప్రశ్నలను లేవదీస్తూ, నూతన సిద్ధాంతాల్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఈ పుస్తక ప్రచురణ జరిగింది. తెలంగాణా పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన స్త్రీల మౌఖిక చరిత్రల్ని వెలుగులోకి తీసుకుని రావాలని చేసిన ప్రయత్నం అది. పుస్తకం వచ్చిన తర్వాత విమర్శలూ, ప్రశంసలూ అనేకం వచ్చాయి.
స్త్రీలకు చరిత్ర అంటూ లేకుండా చేసినటువంటి భావజాలాన్ని విమర్శకు పెడ్తున్నటువంటి పుస్తకం ఇది అని కొంతమంది అంటే, చరిత్ర అంటే వ్యక్తిగతమైన అనుభవాలు మాత్రమే కాదని విమర్శించిన వారు మరి కొందరు. విమర్శల్లో మౌఖికంగా వచ్చినవే ఎక్కువ. రాతపూర్వకంగా వచ్చింది తక్కువ. ఆ తర్వాత వచ్చిన ఇంగ్లీషు అనువాదానికి కూడా మంచి స్పందన లభించింది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నో సందర్భాలలో ఈ పుస్తకం చర్చకు వచ్చిన మాట మాత్రం నిజం.
ఇప్పుడు ఈ పుస్తకాన్ని పునర్ముద్రించడానికి కాపీలు కావాలని, దొరకడం లేదనీ చాలామంది అడగడం కారణం. అంతేకాదు. పుస్తకం వచ్చిన రెండు దశాబ్దాల తరువాత ఆ పుస్తకాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనే ప్రశ్న వేసుకుంటే, ఆ పుస్తకంపై వచ్చిన విమర్శలూ, ప్రశంసలూ, ప్రశ్నలూ గత కొద్ది సంవత్సరాలుగా వస్తున్న ఉద్యమాలూ, అవి లేవనెత్తుతున్న ప్రశ్నలూ – వీటన్నిటినీ ప్రస్తావిస్తూ అప్పటి మా అవగాహన గురించి కొన్ని మాటలు చెప్పాలని భావిస్తున్నాం.
ఈ పుస్తకం గురించి వచ్చిన కొన్ని అభిప్రాయాలను మీ ముందుంచుతున్నాం. ‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకం వచ్చిన కొత్తలో జరిగిన చర్చ పరిమితమైనదే. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు ఈ పుస్తకం పరోక్షంగా సహాయకారిగా పని చేసింది. ఈ పుస్తకంలో పోరాట మహిళల జీవన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రేరణతో ఆ తర్వాత జరిగిన పోరాటాల్లో దాగిన సత్యాల్ని వెలికితీసే ప్రయత్నాన్ని ఎవరైనా చేయాలి”.
పుస్తకంలో విశ్లేషణ గురించి మరొక అభిప్రాయం: ”ఈ పుస్తకంలోని ఇంటర్వ్యూలలో అన్ని ప్రాంతాల స్త్రీల అవగాహనలు అగుపిస్తాయి. ప్రతి దాన్నీ విశ్లేషించే ప్రయత్నం చేయకపోవటం నిజానికి మంచిదే. ఇంటర్వ్యూలో ప్రాధాన్యత ‘పాలిటిక్సు’కు కేంద్రబిందువు అవుతుంది. ఆ విధంగా చుట్టూ ఉన్న సందర్భాలతో జోడించని ‘వైయక్తికత’ ‘అనుభవాలు’ పాలిటిక్సు’ అర్థాన్ని మార్చకపోవటమే గాక, ఉదారవాద సిద్ధాంతానికి చెందిన ‘వ్యక్తి’ ‘వ్యక్తిగతం’ గానే మిగిలిపోతాయి. అటువంటి అవగాహనే పెట్టుబడిదారి విధానానికి ప్రాతిపదిక అయింది. అనుభవాన్ని ఒక రాజకీయ దృక్పథంతో అర్థం చేసుకోకపోయినట్లయితే అవి సమాజంతో సంబంధంలేని విషయాలుగా, వ్యక్తి వికాసానికి గాని, వెనుకబడడానికిగాని కారణాలవుతాయనే అవగాహనకు దారితీస్తుంది. ఉదాహరణకు వ్యక్తి తన మేధస్సు, తన శ్రమ ద్వారానే తన ఆశయాలను పూర్తి చేసుకుంటాడని అర్థం చేసుకున్నట్లయితే సమాజంలో వ్యక్తికుండే స్థానం, పౌర సమాజంలో వ్యక్తి అనుభవాలు, సంస్థలతో సంబంధాలు ఏ విధంగా ‘వైయక్తికత’ను నిర్వచిస్తాయో, నిర్మిస్తాయో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఆంటోనియో గ్రాంసీ చెప్పినట్లుగా పౌర సమాజ రాజకీయాలు, వ్యక్తి దైనందిన జీవిత రాజకీయాలు రెండూ ముడిపడి ఉంటాయి. వైయక్తికత అనేది ఆ కోణంలోంచి అర్థం చేసుకోవాలి. వైయక్తికత అనేది సమాజంలో వ్యక్తిస్థానం, పౌర సమాజ సంస్థలైనటువంటి కుటుంబం, విద్యాసంస్థలు, మత సంస్థలతో ప్రచార సాధనాలు వంటి సంస్థలు వాటితో వ్యక్తికుండే సంబంధాలపైన ఆధారపడి వుంటాయి. వీటన్నింటిలో వ్యక్తికుండే స్థానం, వర్గం, కులం, మతం, జెండర్‌లో ముడిపడే వుంటాయి. వైయక్తికతను అనుభవం, రాజకీయ దృక్పథంతో విశ్లేషించడం వల్ల హక్కులు, సమానత్వంకై వస్తున్నటువంటి పోరాటాలపై అవగాహన పెంచుకోగలుగుతాం.
‘అనుభవం’ గురించి జరిగిన చర్చ ఒక అంశం అయితే ‘ప్రాతినిధ్యం’ గురించి జరిగిన చర్చ రెండవది. స్త్రీ శక్తి సంఘటన గ్రంథకర్తలు మధ్య తరగతి చెందిన స్త్రీలుగా అధిక శాతం నిరక్షరాస్యులైన రైతాంగ స్త్రీలకు ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమయింది. స్త్రీల ‘వైయక్తికత’ గురించి మాకున్న అవగాహనలో లోపించిన అంశం ప్రధానంగా కుల సమస్య గురించినది. పుస్తకం రాసిన సమయంలో కుల సమస్య, దళిత ప్రశ్నల గురించి ఇప్పుడున్న అవగాహన అప్పట్లో లేదు. అంతేకాదు, పట్టణ ప్రాంతాలనుంచి వచ్చిన మధ్య తరగతి స్త్రీలు కొంతయినా చదువుకున్న వాళ్ళు, గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన దళిత స్త్రీలు, ముస్లిం స్త్రీల వైయక్తికతలో తేడాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ‘దళిత’, ‘మైనారిటీ’, ‘గిరిజన’ ‘స్త్రీ’, ‘వర్గ’ సమస్యలన్నింటినీ కూడా, ఒకదానితో ఒకటి ముడిపడి వున్న అంశాలుగా పునర్వి శ్లేషించాల్సిన అవసరం ప్రస్తుతం మనముందుంది.
‘మనకు తెలియని మన చరిత్ర’