చాకలి ఐలమ్మ (పాలకుర్తి)

నా పేరు చిట్యాల ఐలమ్మ చిట్యాలోల్లంటరు. నా పెనిమిటిదేంలేదు. నా కొడుకులదేంలేదు. ఎక్కడవోయిన ఏంజేసిన ముందుగ నాపేరేజెప్తరు. ఎప్పటి కొత్తనేవుంటరు, సంగపోల్లు.
రాంగనె వూరికి బండ్లుగట్టిన్రు. కడ్తెల్లకు యిస్నూర్నుంచి యమ్ముత్యం వచ్చిండు. వచ్చి కలెవడ్డరు, కలెవడి కత్తుల సోములయ్యను పట్టుకున్నరు, వట్టుకుంటె మాపటికి మల్లొచ్చి సగజెప్పిన్రు. సగజెప్తె యేమొ గిట్లయితదంటెరుకలేదు. ఓ….యిస్నూరంత దెలిసొచ్చింది. ఆ నారంకయ్య, యిగక్కడ శారదాం బింటికాడ సదువుజెప్తాండ్రు. ఇగ నీ బాంచెనయితె కట్టెలూ….అన్ని వచ్చినయి. యిస్కినలిగాడు, గుమస్త, అబ్బసలీం వుత్తాలం రామిరెడ్డిగాడువాడు జేసిండ్రు. ఓ….నీ బాంచెనయితె యిగ కత కత జేసిండ్రు, కత కత జేసిండ్రు. మేం కొట్టాలేసుకుంటె కొట్టాలిప్పేసిండ్రు, దున్నుకున్నం, చేసినం అన్ని ఆగం జేసిండ్రు….గడ్డపాయినెదున్నుకున్న జాగల ఏడెకురాలు అపరాయించుండు అవిదీసుకున్నరు, షెర్కలుదీసుకున్నరు, సేన్లు దీసుకున్నరు. మమ్ముల ముగ్గుర తల్లి కొడుకులను ఒకకాల వట్టుకపోయిన్రు మమ్ముల ఆగంజేత్తాంటె నిర్మాలోల్లు, బ్యాగురూపులోల్లు, కడెండోల్లు, సీతరాంపురపోల్లు ఈల్లందరొచ్చి నాయిల్లు కావలున్నరు. ఇంటినిండిత్తులున్నయి, ఆ…పందుం వొడ్లున్నయి. ఆగమాగం జేత్తాంటె వాల్లంతొచ్చి కావలున్నరు. మూన్నాలుగునెల్లున్నరు. వుంటె వూరుమీద కూడడుక్కొచ్చివెట్టిన, రెండు పేర్పుల సల్లజేసి….అందకుంటె అదివోస్క తిన్నరు నా తండ్రులు. అన్నమందకుంటె యింత గట్కవెట్కోని సల్లవోస్కోని తిన్నరు. తిని నాల్గునెల్లు కాపుగాసిండ్రు. కాసి కాసి యిగ యెల్లిపోయిండ్రు. యిగ వాల్లు యెల్లిపోయినంకొచ్చిన్రు, యింటికి నిప్పువెట్టిండ్రు. యేదుం సద్దలు వోస్కపోయిండ్రు, యెనుమందుం పెసర్లు వోస్కపోయిండ్రు. నువ్వులు గానుగ్గట్టించుకుంటమని తెచ్చిపోసుకున్న నువ్వులు వోస్కపోయిండ్రు. యిట్లనే మెరుక….నువ్వులు వోసుకపోయిండ్రు. యిగ నేతిపట్వలైతె, వాల్లక్కన్నే పోయిండ్రుగద పటువలు యింతింత పటువలు పక్కున పల్లగ్గొట్టిండ్రు. గిట్లనే మెరుక. పెల్లలకు పెల్లలే తీస్కపోయిండ్రు, తినుకుంట దీస్కపోయిండ్రు, పెల్లలకు పెల్లలే తీస్కపోయిండ్రు. బండ్లుగట్టిచ్చి అవి. వోస్కపోయిండ్రు వూల్లె యింటికి నిప్పువెట్టిండ్రు.
ఇగ నా బిడ్డను దొరికిచ్చుకున్నరు – నేన్దొరకలేగని నాబిడ్డన్దొరికిచ్చుకున్నరు. యిగ జీవంజి నర్సయ్య కడ్పుసల్లగుండ వాడ్వట్టిచ్చిండు, పట్టిసైవో…. యిగ తుపాకిమొదల్తానె గుద్దుతాంటె, తంతాంటె, ఓ…. ఒకటె బట్టలమీదబట్టలిడిసిన. ఆయిన పేరేందొవుండె సింహాద్రి, పోలీసోడు బూడుగులాయినె…. ఆ శింవాద్రి. ఆయిన కడ్పుసల్లగుండాయినొచ్చి, వాల్లనెంటంటటని, ఆపోర్నటని గాలవెట్టిండు, ఆ పోరప్పుడు సచ్చేదేవుండె. ఒగాగంగాదు నీ….బాంచెన్‌ యెంజెప్పాలె…. ఒక కుండలేకుంట, ఒక గాబులేకుంట, గోలెంలేకుంటన్ని…. వల్లగ్గొట్టిండ్రు. పల్లగ్గొట్టి యింటికి నిప్పువెట్టిండ్రు…. తూర్పింటికి నిప్పువెట్టిండ్రు. పెడ్తాల్లకు ఈ మోత్కూరమీను కడుపునిండుగనుకున్నడో కనుకోలేదో – వొచ్చిండు. గింత యిల్లుగాలిపోతె యెట్లయితదని వొక్కగోలెంల నీల్లున్నయి. పెంకలతోని దబ్బదబ్బదీసి వోసిండు. బుడ్డెడాముదం వోసిండ్రు. మీదిమీద్కి యెగ్గొట్టి గాలవెట్టిండ్రు. ఆమ్దంబోసి కాలవెట్టిండ్రు, పొయ్యేటప్పుడు. ఆయినొచ్చి సల్లార్పిండు.
యిగ కమ్మరాయినవోయినంక యిగ యిట్లనె ఆగంజేసిన్రు. జేత్తాంటె జేత్తాంటె దున్నుకునే పొలంబోయింది. దున్నుతుంటె మాది ఆ ముక్తదారు మాకిచ్చిండు. మా దొరవారు దొరసాని మాకిచ్చిన్రని మమ్ముల ఆగమాగం అడివడివి జేసిండ్రు. జేత్తాంటె యిస్నూరి మాల్పటేల్‌ దీస్కవోయిండు. వాల్లు యిప్పుడు జెయ్యొద్దు సేపొద్దంటె పందుంయిత్తనాలు వోసినం. దండ్గగట్టి మూడొందల అరవై రూపాయలు సేతులవోసిండ్రు. వాల్లు వోయినప్పటికైన పందుంయిత్తనాలు వోసినం. ఆల్లొద్దంటె యిగ తండ్రికి వుట్టినోడైతె జెయ్యడుగని పినతండ్రికి వుట్టినోడైతె జేస్తడు అని అట్నే అనుకొని వూర్కున్నం. యిగ నాయినా నాటువెట్టే సమయానికి మల్లొచ్చిండ్రు. మల్ల దున్ననియ్యలె. యిగ యింతపాపమాని సోమిల్ల బుచ్చయ్య గాదు పెద్ద మల్లయ్య ఆయన్నెంటవెట్కవోయిండ్రు పట్నం. పట్నంలున్నడు దొర, సెంచోల్ల దొర. ఆ దొర మలక్పేట్లున్నడు. సెంచోల్ల బంగ్లమీదున్నడు. ఆ బంగ్లమీదికి వోయినం.
పన్నెండు కచ్చీర్లకు దిరిగిన, నీ బాంచెన్‌ కాల్మొక్త. పట్నమన్ని దిరిగిన. అయ్యో….యింకేందో యేందో అన్ని దిప్పిన్రు, తిప్తె వోయిన. అంతవోయిన గద! నేను యేన్నన్న దొరిక్తె సంపుదురు. జనగాం వొక్కదాన్నె వొయ్యేది, వొక్కదాన్నె వొచ్చేది. నీది నువ్వే జేసుకోపో యిగ యేంలేదు. రామిరెడ్డిగాన్కి బుద్ది వానికి జెప్తనని కాయితం రాసిచ్చిండ్రు, కాయితం రాసిస్తె అది దీస్కో నొచ్చిన, మల్లొచ్చినంక యిగ నాట్లేసినం, నీల్లు వెట్టుకున్నం, అన్ని జేసినం. వరిపొలం మంచిగొచ్చింది. ఒక పాన్పెడల్పు వోసిండ్రు. వొచ్చిండ్రు వొక్క పాన్పు వోసేకల్ల, కాసి మల్లయ్య వోసెవరకు, వొచ్చి పదాలు వాడ్కుంట యిగ యేనంగనో వుర్కొచ్చిండ్రు. యిగ వడ్లెక్కడ బోయినయొ, నాలుగుపుట్ల వడ్లయ్యేవి. ఆ వడ్లెక్కడబోయినయో, మన్నెక్కడబోయినయో. ఇగ రెండొంపుల్ల, ఆ రెండొంపుల్ల సాంతం వో….అంతమడికి మడే యెక్కడికక్కడ అంత యేమడికామడే గొట్టుకున్నరు, కోసుకున్నరు, పోయిండ్రు. అయితె మల్ల నేను పట్నం బోయిన. గిట్లయితాందని మల్ల పట్నంబోతె లచ్చిమి నరిసిమ్మారెడ్డి అందర్ని యెంటవెట్కోనొచ్చిండు. వొచ్చి నేను మీకు మంచిగ జేత్త….యింత పాపం యెట్లయితది, చేసిన చేత యెట్లయితదని అడుగుదామనొచ్చిండు. వొచ్చి వాక్కాడ నా యింటికాన్నె నా యింటికాన్నె బండిడుసుకున్నడు. అన్ని సామాన్లు, సాపలు, చెత్తంత గొంగళ్ళు గింగళ్ళు అన్ని సామాన్లేస్కోని యిస్నూరు పోతమని వోయిండ్రు. నిర్మాల రామిరెడ్డి బండి, యెడ్లు అదేంది….షాపూరోల్లు, మావూరోల్లు, ఆ వూరోల్లు పదిమంది గూడిండ్రు, పోయిండ్రు, పొయ్యేవరకు వాక్కాన్నె దొరికిచ్చుకున్నరు. దొరికిచ్చుకొని కొట్టిన్రు గదమ్మా….నీ బాంచెన్‌, రోకటితోని గుద్దినట్టే. ఇంతింతెడల్పు బొడ్డు మీద యింతింతెడల్పు రక్తాలుగారినయి. లాగు బిడిపిచ్చుకున్నరు. దొరికిచ్చుకొని కొట్టిన్రు గదమ్మా….నీ బాంచెన్‌, రోకటితోని గుద్దినట్టే. ఇంతింతెడల్పు బొడ్డు మీద యింతింతెడల్పు రక్తాలుగారినయి. లాగులిడిపిచ్చుకున్నరు, గుంజిండ్రు, అంగీలిడిపిచ్చుకున్నరు. అవీ యివి….బండి వాగులకు గుంజిండ్రు, అంతిప్పిండ్రు, బండి గాలవెట్టిండ్రు. కమ్మలండ్ల దొక్కిండ్రు. ఎడ్లను హనుమకొండ దోలిండ్రు. గంతాగం జేసిండ్రు. మా ఆగం యిట్లుండాలె, ఇంతింత జెనిమోటర్లు గొట్టుకొచ్చిండ్రు, వాని కడుపుగాల, జెనిమోటర్లు గొట్టుకొచ్చి వాని కడుపుగాల ఆరొందల రూపాయలు దండుగ వెట్టిచ్చిండ్రు, వాల్లు జైల్లల్లుండంగనె మమ్ములగింతపని….నన్ను జేసిండ్రు, నా కొడుకొక్కడుండె కాసెదిగినోడు. ఇగవాడయితె గాకూసుమింతున్నడు. అమీను పొద్దునొచ్చె, పొద్దుమీకొచ్చె. పొద్దుమీకొచ్చె యింటికి, యెక్కడని సంబందం. అప్పుడూరంత వొక్క పట్టుండబటికె మమ్ముల దాసిండ్రు. లేకుంటె యిప్పటోలుంటె యేడవోదుం. మేమ్మందిసొమ్ము దిన్లే, (ఏడుస్తూ) మాదే నాశడంజేసిండ్రు. నీ బాంచెనయితె కాల్మొక్త. మమ్ముల గింత నాశడం జేసిండ్రు. గింత పాపమయ్యింది. నా కొడుక్కయితె గోర్లల్ల సూదుల్తోటి వొడిసిండ్రు, సిలుక్కొయ్య కేసిండ్రు జుట్టువట్టి. నా పెనిమిటికయితె చెయ్యేవడిపోయింది కొడ్తె. ఓ….అర్వయి మగ్గాలు వోయినయి. ఇదేందొ సెవులకు పోగులు, రెండు సెవులకు పోగులు, పావులెత్తు, పావులెత్తు పోగులు. అదేందొ సెవులకు అవి కమ్మలు, దండెగడాలు, ముంజేతికడెం, పోంచి….పెండ్లయిందదివరకు, నా కొడుకు చిన్నకొడుకు పెట్లెవెట్టి యెత్తుకున్నడు. ఇగ యెవనికెరుక యిట్లవోతున్నమని యెవరికెరుకబిడ్డా. అన్ని….ఆండ్ల వెట్టినం అది….ఒక్క సొమ్మువొయ్యిందా అయ్య, అక్కడి సొమ్ము వొయ్యింది, యింట్ల సొమ్ము వొయ్యింది. అంత నాశడం జేసిండ్రు. అప్పుడు నా కొడుకు కోడెల, రెండు కోడెల….అడ్డికి పావుశేరు, వొక్కొక్క కోడె వెయ్యిరూపాయల కోడె….అడ్డికి పావుశేరమ్మినం. బర్లోతెరువైనయి, ఆవులో తెరువైనయి, అర్వయి, డెబ్బయి గొర్రెలుండె కొట్టుకపోయిండ్రు, తరుముకపోయిండ్రు….అయ్యో యిగ బత్కనే, యిగ అవిగూడవోతయి. నాయినా కొట్టుకపో నీ మందలకు కొట్టుకపో….ఇండ్లు గట్టినప్పుడు అయిదారొందలరూపాయలు బాకున్నం. యేడికాడికి గొట్కపో. కొట్కపో….అవి గూడ వోతయి….బర్లువోయినయి, ఆవులు వోయినయి. ఆగమాగం….అయ్యో. నా కొడుకు నా నడిపికొడుక్కు లేదు, నా పెనిమిటికిలేదు. యింత కష్టపడ్డ, యింత నిస్టూరపడ్డ, యింత జేస్తె, మా ఆగం దేవునికిసుత ముట్టింది. మేమ్మంది సొమ్ముదిన్లేదు, మంది సేతుల సావ లేదు. (ఏడుస్తూ)
మేం మల్లంపల్లి దొరవారిది కౌలుకు దీస్కున్నం కర్నపాయనది, మాది యింటిదిగాదు మరి. ఈయనది గాదు, ఈ మునసబాయనదిగాదు. కర్నపోల్ల బాయిసేతవట్టుకోని జేసినం, కౌలుకి దీస్కోని జేసినం. కొంచెమయ్యిందా….అయ్యయ్యో- ఈ పనుగడమంత…. ఈ యిండ్లు గట్టిందంత నా చెల్కే. ఇదంతమ్ముకున్నరు, కొడుకులమ్ముకున్నరు. నా యిద్దరు కొడుకులు వోయిండ్రు. నా పెద్దకొడుకు వోయిండు, చిన్నకొడుకు వోయిండు. నా పెద్దకొడుక్కేంలేకుండె. ఆగమాగంజేసి వేరే పోయిండు. పొయ్యి యిప్పుడు పటాశోకమొచ్చిండు. చిన్న కొడుకు సర్పంచయ్యిండు. అయిపాయె….
ఇగ సంగవంటె గదే సంగం. వాళ్ళు బేదాఖులజెయ్యమని…. బేదాఖుల జెయ్యొద్దని సంగమోల్లు జెప్పిండ్రు. దానిమీద ఈ ఫైటు. లక్షిమి నర్సిమ్మారెడ్డి వకీలుసాబు, ఆరుట్ల లక్షిమి నర్సిమారెడ్డి. దీని గురించి మాట్లాడెతందుకొచ్చిండ్రు. లక్షిమి నర్సిమ్మారెడ్డి, రామిరెడ్డి ఈ ఏరియాల అప్పుడు ఆర్గనైజు జేసిండ్రు. ఆయనేమొ ముక్యసంగంలుండె…. కాదు యిప్పుడు పొలం కాళీజెయ్‌, కౌలుకు జెయ్యొద్దు – ఆయన మల్లారెడ్డి, ఆ మల్లంపల్లి దొరోడు మాకిచ్చుండు…. అదువరకేవుంది, అదివరకునుంచే దీసుకున్నం. అంతకుముందే దీసుకున్నరు. వుండే యీల్లు ఆగంజేసుకుంట వున్నరు. వాల్ల వూసొచ్చేవరకు యెల్లిపోయిండ్రు. ఇగ వూరొచ్చి నాశడం జేసిండ్రు. పోలీసులురాలే గప్పుడు, ఆ…గప్పుడు నాశడం జేసిండ్రు. ఆగమాగం అడివడివి, నాయినా నీ బాంచెన్‌. ఇప్పుడు నా కొడుకుల తాడగూడలేను. నా కొడుకుబిడ్డింట్లున్న. నర్సయ్య….ఆయన బిడ్డ.
అప్పుడు సంగంల ఈవూరి ఆడోల్లుగూడ వున్నరుగని యిప్పుడెక్కడున్నరు? యెక్కడోల్లక్కడ దెంకపోయిండ్రు. ఇంతమందొస్తె నాయింట్లనే భోజనంబెట్టిన, యెవ్వరువెట్టలే. నాదేవెట్టిన యెవ్వరు వెట్టలే నాయింట్లనే నాల్గునెల్లున్నరు. నాల్గునెల్లు కాపాడిండ్రు. వాల్లేమొ జైల్లల్లుంటె, వీల్లేమొ యిల్లుగాపాడిండ్రు. కాపాడ్తె…. ఆ…. వాల్లొచ్చేంపనిజేసిండ్రు, గిదే పనిజేసిండ్రు. యూనియనొచ్చిందంటె బాగనే వుంటది. ఆ…. వీల్ల బయానికేంజెయ్యలే. ఇరవయ్యయిదు మోటర్లొచ్చినయి. జంగి మోటర్లు, జంగిమోటర్లు. ఓ…. గప్పుడు వెట్టిచ్చిండు మల్ల ఆరొందల రూపాయలు గాడ్దికొడుకు కడుపుగాల అటే…… ఓ…. అంత ఆడోల్లా….సభ్యులుగుండ లేదు. అంతెక్కడోల్లక్కడ వూర్కున్నరు. యూనియన్‌వచ్చింతర్వాత అంతకుముందు మంచిగనేవున్నరు. నన్నేమన్నంటె నువ్వని. నిన్నేమన్నెంటె నన్నని మంచిగ అందరు కూడే వున్నరు. ఇంక యెక్కువైపోయిందని వూర్కున్నరు. పట్నందాక మంత్రిజాడవోయిన. నేను వూరంత దిరిగొచ్చిన తిరిగొచ్చి, తిరిగొచ్చి సెర్లవెట్టుకున్న. ఆడోల్లను సంగపోల్లు దీస్కపోయిన్రు. ఒక్క ఆడోల్లు, నేను కమలాదేవి. పేచిపేచికి కమలాదేవి, నేను బయాని మందిని దీస్కపోయేది. కమలాదేవి వొస్తే….పక్కేసి, బట్టలేసి నిలుసుండేది. రాంచంద్రరావు ఆయన జైల్లనెవుండె ఒక్క లచ్చిమి నర్సిమ్మరెడ్డుండె.
అప్పుడా సంగం రాకముందే వున్నది బూమి. అదివరకే వున్నది బూమి. అదివరకే అదేందో కౌలుకు దీసుకున్నం. అదివరకే యిరువయ్యేండ్లకొచ్చింది. వుంచుకుంటె వానికోర్వలేక అదిగుంజిండ్రు, పట్టావున్న వాల్లనేమొ యెవ్వరేవన్లేదు. మేంగాడదెచ్చుకుంటె మాది గుంజుకున్నరు. మాకు పట్టెక్కడిది? కౌలుకేజేస్తిమి. గదే…వచ్చేవరకు మేం వొదిలిపెట్టమంటె, మేం వదిలిపెట్టమన్నరు. సంగం వొదిలిపెట్టమన్నరు. సంగం వొదలాలన్నరు. అంటే మేం వొదలమన్నం. యూనియన్‌ రాకముందుగూడ యెవ్వరురాలె.
ఆడోల్లు, మొగోల్లు సమావేశంబెట్టినప్పుడు వచ్చిండ్రు ఆ…. జనగాంల వెట్టినపుడు వొచ్చిండ్రు. అదే తిరుమలరెడ్డి కోయేసమేసుకొచ్చిండు. కోయేసమేసుకోనొస్తె వాని కడుపుగాల వట్టుకున్నరు. తిరుమల్రెడ్డిని అన్నె జనగాంల వట్టుకున్నరు. కంచెకాడ జంపిండ్రు. మూడు బజార్లకాడ జంపిండ్రు. ఇల్లుతగులవెట్టి, జొన్నలెత్తుక పోయిండ్రు ఇవన్ని జేస్తాంటె యీ పోరాటమెందు కనెట్లనిపిస్తది. సేతులున్నదాయె, సేతులనుండెట్లిడిసి పెడ్తం. వాల్లే గుంజుకున్రి, అన్ని యెక్కడి యక్కడ గుంజుకున్నంక యేంజేసినం…. మల్ల నా పెనిమిటి గిట్టొచ్చినంక నాదెల్కలు నాకొచ్చినయి. నా పొలం నాకే వొచ్చింది. కొట్లాటలయితె మాత్రం పొలమంతరాలె, అమ్ముకున్నరు. మంది మల్లంటి దొరవారు అమ్ముకున్నరు. ఆయనమ్ముకుంటె అంతబోడవోసి…. దొరలేడు, దొరసానే. అంతబోదవోసి లంచలువోసి. యీ వూర్లెవొక దూదేకులోడున్నడు తెనుగోడు, కొజ్జోడున్నడు. అంతమ్ముకున్నడు. అమ్ముకుంటె మాకోగొర్లాయినె, వొక కాపాయినె, తెనుగోడు అదే వాళ్ళయిదుగురు మొగోల్లు అయిదుగురు కొడుకులు వాడేం జేస్కొని బతుకుతర్రా…. పొలాలన్ని గుంజ్కరా అంటె పొట్టోడు అన్నడుగద, అడివిన తంపుల అడుక్కుతినేటోనికన్నడు. అంటె అడుక్కుతింటె అయిదుగురు మనుసులు ఏడడుక్కుతింటె ఏమయతదిర, ఏమొస్తదిరా, ఏన్నుంచొస్తదిరా, వొద్దంటె ఆకరుకి గొల్లాయనుండి రెండున్నరెకరాలు దీసుకున్నడు, పైకంగట్టి దీసుకున్నడు అయ్యో….నాయనా, యిగ అంతకష్టపడ్డం ఇగగదే నిలిసింది. ఇగ సెరుకల్నిలిసినయి. పొలం నిలిసింది. ఇగన్ని వోయినయి. ఒక్కటని యాదికుంటదామ్మ! ఎంత ఆగంబెట్టిచ్చిండ్రు, సంగపోల్లు యిప్పటికొస్తనేవున్నరు. వొచ్చిపోతనే వున్నరు. ఎకరాలకెకరాలు వాగుల కలిసినయి, అమ్ముకున్నరు, అంతవోయి రెండెకరాలొచ్చింది.
నాకొడుకులయిదుగురు, నొక బిడ్డ. బిడ్డను రామన్న పేటకిచ్చిన. ఇద్దరు కొడుకులు సచ్చిండ్రు. ఈ పోరాటంల వొకడు సచ్చిండు, చిన్నోడు సచ్చిండు. వాల్లుండేదుంటె నా ఈ వూసే దగ్గకపోవు. నా పెనిమిటిగూడ సచ్చిపోయిండు. ఆ దెబ్బలకే అప్పుడే సచ్చిండు. ఆ దెబ్బలకే నష్టపడ్డరు.
సంగమంటె దేశందేశంపంటి వున్నది. మేం వొదలమన్నం, గదే వొదలాలంటె వొదులాలన్నరు. గదే గింత పన్జేసిండ్రు. సంగంలకు ఆడోల్లు వోతరు, మొగోల్లువోతరు. అందరువోతరు. మాయింట్ల యెవ్వరడ్డువెట్టకపోతున్రి. అందరం పోయేటోల్లమే, ఏ మడ్డులేదు. పొలాల్లల్ల పన్జేసుకునేది. వృత్తిపనిమీదంతిష్టంలేదు. జీతగాండ్లులేరు. కొడుకుల్లేరు, కోడండ్లు లేరు, బిడ్డల్లేరు. పొలంపనిజేసుకునేది, యవసాయం జేసుకునేది. అన్నిటికి తిరిగేది, బాగనేతిరిగేది, బాగనేజేసేది. గిప్పుడు రోగాలకిందవడ్డ. చాతగాకుంటయ్యింది. గిప్పుడు నడుస్తుంటె కాల్లులేవు, కండ్లు కానొస్తలేవుగద. మందిచ్చిండ్రు. డాక్టరొచ్చి మొన్న యింజక్షన్లిచ్చిండు, పట్నం దీస్కపోయిండ్రు.
సంగంల యేంపనున్నది. వాల్లకుజేసిన, పెట్టిన, చేపిన. ఇగ నాకేం పనున్నది. అన్నంవొండిపెట్టడం. ఎప్పటికివెట్టినం. వొచ్చినోల్లందరికి మాఅమ్మ, నేనే పెట్టేది. సంగవని, సంగపోల్లని వెట్టిన. పెట్టనా మరి నీకు వెడ్త, అందరికి వెడ్త. ఆ ప్రేముండేవెట్టిన. బూమికోసం కొట్లాడిన్రనివెట్టలే. బూమికోసం కొట్లాడ్తెమాత్రం బూమున్నదా? జైల్లగూడ వెట్టిండ్రు. చంచల్‌గూడ జైల్లవెట్టిండ్రు, యాడాదుంచిండ్రు. జనగామల ఆర్నెల్లుంచిండ్రు. ఖమ్మంల ఆర్నెల్లుంచిండ్రు. ఒక దిక్కుంచినారు? ఆఖర్కి నాకొడుకునేంజేసిండ్రు, గుడివాడ దిక్కు, నా మొగన్నేసిండ్రు. ఒక్కొక్క దిక్కుంచినారు వాల్లకడుపుగాల. ఓ…. ఆగమా…. ఒక్కొక్క ఆగమా. ఆకరికి మల్ల నల్గొండకేసిండ్రు. నన్నెవడుదీస్కపోతడు జైల్లకు. నన్నెవడు దీస్కపోలె. దొరకలే నేను దొరకలె. ఇక్కన్నే మార్గానికున్న. నల్గొండాయనే మన్నడుగద. ఈ వూరిపిల్లను జేసుకున్నరు గదా అన్నడు. మల్ల నేను కచ్చీరికి వోయిన నల్గొండల. ఆగమాగం నేనాడంగగానొస్తె యెవరో యేర్పాటు జేసిండ్రు, వొచ్చిండు. నాయినా నీ బాంచెనయితె. యేంగొట్టుకున్నరు, నల్గొండకాడ, మంది. సగజెప్పేవరకు పోలీసులెగబడిండ్రు, కొట్టుకున్నరు, యిడిపిచ్చిండ్రు ఆ కష్టం రాగూడదనుకుంట నేను. ఆ కష్టం యెట్ల సముదాయిచ్చిన్నో, ఎట్లబోయిన్నో నేను నాకెరుకలే. యెప్పటికి దాక్కున్న. వాని యినుమునని కండ్లవడ్డనా నేను పడ్లే. బాబుగోని కడుపుగాల పెద్దగుర్రమెక్కొచ్చె. చెట్టుకి గట్టేసి సంపె వొగన్ని, చెరువుకట్టకు సంపె. యిద్దరు, ముగ్గుర్ని…. అదేందో, అట్లొత్తాంటె యిద్దరన్నదమ్ముల అండ్లేసి కందిపుల్లలేసి కాలబెట్టిరి. వాని కడుపుగాల. జనగామల దొరికిచ్చుకున్నరు. జనగామల సాకలోడు దొరికిచ్చుకున్నడు. ఆన్నే సంపిండ్రు. నేనప్పుడ్లేనక్కడ. అక్కడ సంపిండ్రు.
నేనా బైటవోయినప్పుడు నాపోరగాన్లు జూసుకునేది. సిన్నోల్లుగద. ఇంతోడు వాడు, అంతోడు వోడు. నా బిడ్డున్నది, నా కోడలున్నది. ఓ కోడలు అవ్వగారింట్లనే వున్నది. మరి వాల్లు బయపడేది.
ఇగ పెండ్లయినయి రెండుబట్టలుండంగ సంచిలవెట్టుకోని మార్గంగ నీది యేవూరంటె పలాన వూరని జెప్పకు, అక్కడజెప్పకు దూరం ఏ వూరన్న జెప్పుగని మనవూరుజెప్పకని ఆ యాదగిర్రావుతోని అనిపిచ్చిండ్రు. రెండుసీరలిచ్చి పంపిండు. పోలీసాయినగూడ కొంచెం సాయమిచ్చిండు. కొంతమంది సాయమయిండ్రు. మోటర్లు ఇరువయ్యయిదు మోటర్లిచ్చిన్నాడు, నా పిల్లలందరు తమ్మునింటికాన్నె వున్నరు. ఈ పోలీసాయినె, పిల్లలు అందరండ్లనే వొక్కదగ్గర్నే వున్నరు. అందరొక్క తీరుగనే వుంటరా? ఇగ గిప్పుడు యెనిక్కాయలోలె వున్నట్టుంటె అందరు సత్తురు. కొడవండ్లు యెత్తుకపోయేదమ్మ, గొడ్డన్లు యెత్తుకపోయేదమ్మ, కత్తులెత్తుకపోయేది, మాపనోల్లయి. రెండు దీపాలు, రెండు కందీల్లు ఆ యింట్లోటి, ఈ యింట్లోటి, అవ్వెత్తుకపోయిండ్రు. తలె, చెంబు యెత్కపోయిండ్రు. బిందెలెత్క పోయిండ్రు. ఆకరికి యిల్లిడిసిపెట్టివోయినం. అక్కడ తూర్పువోయినం, బెజవాడ. యెక్కడ సంగపోల్లుంటె అక్కడవోయిన. వాల్లకడుపుసల్ల గుండ. నాకా బయమెయ్యలె. ఏమో ఆ నారాయనుడెట్ల దీస్క పోయిండో. బగవంతునిమీద బారమేస్కోనిపోయిన. ఒక్కదాన్నె పోయిన. జనగామనుంచయితె వొక్కదాన్నె వొచ్చేది నడ్సుకుంట…. నడిసి నడిసి వొకనాడు పట్నంనుంచొస్తాంటె రగునాద్పల్లికాడ కాల్జారింది. బోలెడంత రాత్రయ్యింది. రాత్రిపూటొస్తాంటె కాల్జారింది. సేతులమూటున్నది. రగునాద్పల్లికాడ ఆడ నిలబడివున్న. అరె సచ్చె సచ్చె…. అందుకున్నడు ఆయన, బాగమురుకున్నడు. పోలీసందు కున్నడు నిజంగ యిగ నాపానం వొణుకుతాంది గద. నా పిల్లల్ని జూడకుంట పోదుగద. నాతండ్రి…. యెవరన్న అడ్డమొచ్చిండ్రు. అనుకోని తీస్కపోయి అమీనున్నకాడ, పెండ్లామున్నది…. బిడ్డలు న్నరు…. అమ్మా, వచ్చినానె, వచ్చినావె అని….మావూర్లె చానారోజు లుండి పోయిండ్రు. మంచంయేసి, జంబుఖానేసి పండమంటె నిద్రపట్టది, యెటూవట్టది. యెక్కన్నో పోయిన గద, అండ్లపడిపోయిన గదా అనుకున్న…. తెల్లారంగ లేచినంక ఇగ చిన్నంగవో అమ్మా….
ఇగ ఆడబయిలెల్లి యింతవర్దాకొచ్చిన, యెట్ల వొచ్చిన్నో, యెట్ల వొయిన్నో అయిదుపూటలారుపూటలు తినకపోయేది-తినకున్నా తిన్నట్టుండేది. తిన్నట్టే తాగినట్టే, యెవరన్న పెడతమన్నా తినబుద్ధి గాకపోయేదమ్మ, ఆ కష్టంలపడ్తె, అప్పుడు ఆ కష్టం, యిప్పుడు ఈ కష్టమమ్మా. ఈ కష్టమొచ్చిందమ్మా, కొడుకులున్నా యిట్లుంటిని. కొడుకులా మాగసచిండ్రు. ఆడొగడు, ఈడొగడు, వున్నా యేం జూత్తరు, యేం జేత్తరు. మనువరాలియ్యాలె, కొడుకు బిడ్డ….వుంటె యిచ్చిరి, ఇయ్యాల ఆపతొచ్చినా, సంపతొచ్చినా, సూస్తరా, యేం జూస్తరు….యేంది సూసేది. మొన్నవాడు నేనాయె పాయెనంటె….ఆ సారు సల్లగుండ సూదేసిండు మొన్నటిదాక నొప్పిలేసింది. యెన్నుపట్టెలన్ని గుంజుతయి. ఇయన్ని గుంజుతయి….
నా పేరుమీదనా బూమియ్యలె అంత పంచుకున్నరు. ఇయ్యలే వాల్ల కడుపుగాల, ఇయ్యలె ఏ మొత్తయని. నాల్గుబత్తాల వొడ్లిత్తన్నరు. నాకానాల్గుబత్తలిత్తే యేం బతుకుతం. బట్టిండ్లనే, రైకిండ్లనే, చుట్టంబువ్విండ్లనే, దీపం సమురు, తల సమురు, తినబుద్దయితె కూరిండ్లనే, నారిండ్లనే ఏమయితది? యేమయితది, అయిపాయె…. వాల్ల కడుపు సల్లగుండ, వాల్లింట్లది బెడ్తాండ్రు. మరి వాల్లింట్లది వెట్టకుంటె వీలైతాదమ్మ, అయితాదమ్మ.
ఐల్రెడ్డిపోటువదింపిచ్చుకున్నడు. పైకం వత్తదన్నడు. మొన్న అక్కన్నె లచ్చిమి నర్సిమ్మారెడ్డి సస్తె దినాలకి బోయిన పెంబర్తికి, ఆన్నేదీయించుకున్న అందరొచ్చిండ్రు, కమలాదేవి వాల్లాంతొచ్చిండ్రు, రాంచంద్రారెడ్డి, రామారెడ్డి, చంద్రయ్య అందరొచ్చిండ్రు ఎక్కడెక్కడోల్లో పోటువ దీయించుకున్నరు. ఏంజేత్తమమ్మ నీకు పైకమొచ్చేది. పైసలొస్తయని సెప్పిండ్రు….
నేను జైల్లల్ల లేను. నా పెనిమిటి లేడ? ఆయన పేరు మీద రావాలె, నా పేరు మీద రావాలె. యేది యిదంత జేసిండ్రు, సేత్తెంది యేది యిదంతజేసిండ్రు నాకురాలే, నా పెనిమిటికీరాలే, అవతారమెత్తిండ్రు. ఒంటిమీద సొమ్మువాయె, దెబ్బల్తోనే సచ్చిండు సంగంతోని మా సొమ్ముదిన్నరుగని, మేం యెవరి సొమ్ము దిన్లే.
నేను బైటవోయినప్పుడు నా బిడ్డ, నాకోడలింట్లనే వుండేది. యెవరు బాధవెట్టలే, యెందుకు పెడ్తరు? వాల్ల దగ్గరెందుకొస్తరు. వాల్లకడుపుగాల, అన్ని దోస్కవోయిరి, మల్లెందుకొస్తరు, యేమున్నదనొస్తరు లంజకొడుకులు. మల్లింక యిల్లిడిసి పెట్టిపోతిమి. జైల్లల్లనుంచొచ్చినంకేమున్నది. గాబులు పగిలిపాయె, కుండలు పగిలిపాయె, అడుక్కుతిన, వండుకుతినెతందుకు కుండలేదాయె, తాగెతందుకు చెంబులేదాయె. ఎల్లిపోయి అక్కడుండొచ్చినం. మా తల్లిగారున్నరు. మా గింజలు, మా గొడ్డు గోడవుంటె అక్కడికి పంపించ్చిండ్రు. వాల్లకేసి మొక్కాలె. పోయొచ్చినంగని యెక్కడేంలేదని మల్లదీస్కొచ్చిండ్రు, తీస్కొస్తె…మల్లేంలేదు, అంతయిపోయిందని, మల్లొచ్చిండ్రు. యూనియనొచ్చినపుడు, అదేందో కాల్లకాల్లదిరిగి. అదేందో దొర గొంగడి కొనిచ్చిండు. ఆ గొంగేడేస్కొని కల్లం, కల్లం దిరుక్కుంట యిన్ని గింజలు అడుక్కొచ్చేది. నా పెనిమిటి అవిదినుకుంటవున్నం. ఊరు మాపాలోల్లుత్కిన్రు…. వొచ్చినంక మా పాలోల్లు యిడ్సిపెట్టిండ్రు. ఆ యిగ మా వూరుంచుకున్నం పుట్టెడొడ్లగాబుండె, సంపాయించుకున్నం. నాక తగ్గట్లయ్యింది…. మాకతగట్లయ్యింది. ఒక్కటని యాదికుంటదా! నా బిడ్డల పెండ్లిల్లదివరకె అయినయి, ఒక్క కొడుకుదే గాలె. ఒక్క కొడుకుదే యెక్కడికక్కడయినంక అయ్యింది. ఇగ ఒక్కడే సిన్న పిల్లగాడు. ఈ బూముల్దరలైనయి. అనంతపూరు దొరవారు మాకు ఈ బూమమ్మిండు. చెరుకలు మేమే గొన్కున్నం. ఇగ ఆ పొలం పైకం పట్టుకున్నం, బియ్యమున్నయి, ఇగ గంతెజాలనుకున్నం, వాని పెండ్లి జేసినం…. వాడు బాయివట్టిండు, వోరలేని బాయి. ఈ వూరి సర్పంచు నా మనువడే. అంత సంగంల్నే వున్నరు. నా బల్గం బల్గమంత.
సంగమంటె మురిసిన. సంగవంటె పేదోల్లు సమం గుండాలని, ఆ రాజ్యం గావాలని అప్పుడు జెప్పిండ్రు. యిప్పుడు తిన్నోల్లె తింటాడ్రు, పేదోని కిత్తాండ్రా, వాని కడుపుగాల, వాడే తింటాండు. పేదోల్లకొస్తాందామరిప్పుడు. పోరాటం జేసినం సేస్తెమాత్రం…. పోరాటం జేసినోల్లున్నరా? పోయిరి, సేసినోల్లు సచ్చిరి.
సంగపోల్లు పోరాటం ఆపుజెయ్యకుంటెనే గింత ఆగం జేసిన్రమ్మా, ఇది యిడిసి పెట్టున్రన్నరు. వాల్లు సెంచల్గూడ జైలుకవోయి ఆడికి దీస్కపోయండ్రు. మాల్పటేలు మీ వూరు వొదిలి పెట్టున్రంటె మేం వొదిలిపెట్టమని వాల్లన్నరు, మేం సచ్చినా మంచిదేగని మేం వొదిలి పెట్టమన్నరు. అన్నంక యిగ యెట్లొదిలిపెడ్తరు. సంగపోల్ల దలాలు ఆయుధాల్తొ పోరాటం జేసేటోల్లు. ఆ తర్వాత యెందుకు సెప్పిన్రా ఆపమని, అవన్ని యాదికిలేవు….వాల్లున్నన్ని రోజులు పొలమున్నది. వాల్లు సప్పుడుజేయక పోయినంకనే గద మల్ల ఆల్లందరు గుంజుకున్నది.
అప్పుడా యెందుకు బయం, యేంగాలె మొత్తం వాల్లొస్తనే సంపి సంపి యిడిసిపెట్టె, బుడ్డగోసులు వెట్టుకోని పోయిరి. వాడు బుడ్డగోసులు వెట్టుకోనిపోతె, నా యింట్లయి దోతులు జింపి నపరో గుడ్డయిచ్చిన, బట్టల్లేకవ్వా, అన్ని గుంజుకున్నరవ్వా, అన్ని కాలబెట్టిండ్రు, అన్ని నాశడం జేసిండ్రు, బండ్లే గాలబెట్టిరి, అన్నిజేసిరి యింకేమున్నది. లోపల యింతింతెల్పు దెబ్బలు, యింతింతెల్పు నెత్తుర్లుగారినయి. వాల్ల కడ్పుగాల నేన్దెబ్బవల్లె, యెప్పుడు దొర్కలే. ఇయ్యాల ఈ పక్కింటి కాడున్నగని, వాల్లొత్తాన్రంటె యింట్లున్నగని యెవ్వరికి సెప్పలె. ఇప్పుడు ఈ దినమయ్యుంటె సెప్పుదురు. వుండకపోదురు. పోతె అదేపాయె…. మంచిగుందురు.
అప్పుడాడ, మగ అందరున్రి సంగంన్లె, కమ్మరాయెనది గాలబెట్టిండ్రు, యిద్దరన్నదమ్ములను సంపిండ్రు. ఒక కోమటాయన్ను సంపిండ్రు. కుమ్మరోల్ల పిలగాడు, గొల్లోల్ల పిలగాడు పడుసోల్లె, గొర్లనుదోల్తాంటె సంపిండ్రు. సెట్టుగ్గట్టేసి సంపిండ్రు, వాల్ల కడుపుగాల, ఆడోల్లని ఆగంజేసిండ్రుగని, నేనింట్లలేను, చాన జరిగినయి. ఏం జేసిండ్రు సంగమోల్లు, వుసునూరు పట్కపోతాంటె పోనియ్యలె ఆడోల్లని ఈ వూరోల్లందరుగల్సి. దండుగలందరికాడ…. వాని కడుపుగాల దిండుగల్దీసుకున్నరు. ఎంతమందినయితె, అంత మందిని రెక్కలు బట్కోని దీస్కపోయిండ్రు, గుంజ్కపోతనేవున్రి, మొగోల్లనయితె కొట్టి కొట్టి సంపిండ్రు. ఆడోల్లనయితె ఏం జెయ్యలె.
ఆడోల్ల, మొగోల్ల గడీలకి దీస్కపోతాంటె మేం సచ్చిన మంచిదెగని ఆడోల్లని పోనియ్యమన్నరు, పోనిత్తరా, యిప్పుడయితె మంచిగ సంపుదురు. అప్పుడంత ఏకమై వుంటంసాత జరిగింది. యిప్పుడయితె నువు సత్తె నాకేంది, నేను సత్తె నీకేంది అన్నట్టుండె. ఆ….యిప్పుడట్లున్నరు. నేను సత్తె నీకు తిందామనుండె గట్ల…. ఇప్పటి సంగమేంది, వస్తరు, సూసుకుంటవోతరు. వొచ్చినోల్లకింత వెడ్తరు, తింటరు. అప్పుడు బయముండేది. ఇప్పుడెక్కడిది? ఇప్పటి సంగానికి అప్పటి సంగానికి చాన తేడుంది. సంగపోల్లా యేం జెప్తరు. నాకు జెప్పొత్తదా. అగొ యిచ్చంత్రం, యిచ్చంత్రం చిత్రజెప్తరు. చెప్తరుగని నాకు జెప్పొత్తదా! అనొత్తదా, అనరాదు, లేనిమాటలెందుకు జెప్పాలె ఆ లేని మాటలు నాకు జెప్పరాదు. వున్నది జెప్తాందుకే రాదు.
బూమా నా కొడుకులు పంచుకున్నరు. వాల్లమీద మన్నువొయ్య, నా పెనిమిటి సచ్చటం పంచుకున్నరు. నా పెనిమి టుండంగ అరెకరం పొలముండె – వాల్లు నా పెనిమిటుండంగనె యెగబడ్డరు, రెండెకరాల సెల్క, అరెకరం పొలం వుంచుకున్నం. యిద్దరు సిన్నోల్లు నాతోనున్రి, ఆయన సావంగనే తీసేసిండ్రు. అది గూడ తీసేసిండ్రు….వాల్లకడుపు సల్లగుండ తింటాండ్రు.
యిగ యిటుగూడ పట్నం పెరుగుతాంది. ఈ దేశమంత ఇయన్ని సెల్కలే. ఒక్కగుడే అడ్డం. యివన్నవ్వే, యిదో కొడుకుది, అదో కొడుకుది. వాన్దోటి….సచ్చిన కొడుకుది. యింక కడతాన్రిల్లు, అగో.
సమావేశాలకి సంగపోల్లొస్తే మేం పన్జేసేది. మొగోల్లయిరి అందరు. వొండుకోండ్రి అంటె వొండుకునేది. గిన్నెలుండె బిందులుండె, వొండుకోన్రి నాయినా అంటె వొండుకునేది. తోటల్ల నుంచి కాయగూరలొచ్చేది. వూల్లోవాల్లు వంపేది. చారుట్లనుంచొచ్చేది, సీతారాంపురంనుంచొచ్చేది. గింజల్రాలెగని కాయగూరలొచ్చేది. నా యింట్లయె రెండు బర్లు పాలిచ్చేయి, రెండావులిచ్చేయి. వాల్లిస్టం, తాగినరు, తిన్నరు. అప్పుడు గదిసేసిన సేతనే గిప్పుడు గిట్ల. నాకా పాటవాడొచ్చిందా, నాకేం చెప్పిన మాటొత్తదా! గవి వడ్డది, నేను కష్టపడ్డది, నేను సెప్తావుంటె పోతనే వుంటది…..
అప్పుడు పాడమన్నగని యిప్పుడేంలేదు. ఏమని సెప్పేది వాల్ల మన్ను వొయ్య, ఎవరు బయానికి పాడకపొయ్యేది. యిస్నూరు బయానికి పాడకపొయ్యేది. నన్ను బాలనాగమ్మన్నరు. పాట పాడిండ్రు. వుయ్యాలపదం పాడిండ్రు. మాలపక్కీరోల్లు వుయ్యాలపదం పాడిండ్రు. ఎవరన్న పాడనిచ్చిన్రా. దేశం దేశం వంటి పాడిండ్రు. చేల్ల పంటి పాడిండ్రు కాపలాగాసిండ్రు.
సమావేశాల్లల్ల ఆట, వేసాలేసిండ్రు, నాటకాలేసిండ్రు. ఏజ్జేసిన యిదే ఆగడం, సంగం రాజ్జెం వొస్తుందనే ఆశ వుండకేడబోద్ది వుంది. వాల్లొచ్చి వొక్కమాటంటె సాలు. గప్పుడు నాకెన్నేండ్లంటావు. యూనియనొచ్చేముందు నాకప్పటికి కాన్పుడిగింది. అయిపోయింది – వాయ్యో గయన్ని యాదికుంటయా! గీ పసిపిల్లంతున్నప్పుడు, నా మనుమరాలంత – పెండ్లయిన నాలుగేండ్లకే పెద్దమనిషయిన. పదిహేనోయేట పిల్లలు పుట్టిండ్రు. నా పెద్దకొడుకు పదిహేనేండ్లకు పుట్టిండు. అయిదుగురు మొగోల్లు ఇద్దరాడోల్లు-మూడేండ్లకో కాన్పు. జొరం వొచ్చి దానంతటోడు వొగడు సచ్చిపోయిండు, నిశ్చితార్థంగ. ఒగడు నల్లబట్టలేసి సచ్చిండు. ఇగ ఒకడున్నడు, వుంటె ఇగ గీ బాగోతంగావట్టె. డెబ్బయేండ్ల పైనే వుంటయేమొ యింక, గిప్పటికి గూడ సంగం వొత్తదనె ఆశవుంది. వుండకుంటె యేడవోద్ది. వాల్లొచ్చి వొక్క మాటంటె సాలు. సంగం గురించి నా పోరగాన్లకా – చెప్పాలనే వుండెగని బయం….గని అంత ఆలోచన గూడ లేకుండెమల్ల.
ఇగ నా బిడ్డనుగూడ కరాబు జేసిరి, లేనిటైముల. నా బిడ్డ పేరు సోమునర్సమ్మ. ఇద్దరు పిల్లలు పుట్టిండ్రు. సంటిపిల్ల తల్లి, పచ్చిబాలెంత కొట్టిండ్రు, కరాబు జేసిండ్రు. ఇగ నా బిడ్డను, నా అల్లుడు దీస్కవోలె – అల్లుడు పాడుగాను, వాడు దీస్కనేపోలె. మల్లోదాన్నిగూడ దెచ్చుకున్నడు. నా బిడ్డను కరాబు జేస్తె గూడ సంగపోల్లు యేం జెయ్యలె.
నేను సంగంల దిరిగితె యెందుకంటరు. యేమనకపోయేది. నన్నెందుకంటరు. పెద్దదాన్నని బయం. వాల్లేమనలె. యెవలదేంలేదు, నా మొగనిదేంలేదు, నా కొడుకులదేంలేదు-నాదే పేరు నిల్సింది, యేడవోయిన, ఇప్పటికి వొత్తనే వుంటరు.సంగపోల్లు. అందరు జెప్పుకుంటరట, అయిలమ్మలాగ జెయ్యాలె అని. ”యెవరు జెప్తరు మన్ను” అబ్బ, ఇయ్యాల ఒక్క మనిషికి జేస్తె సేసిండ్రని అంటరు. మా కాలంలయితె గట్ల లేకుండెమల్ల-ఇగ గట్ల జరిగిందినా కత……
‘మనకు తెలియని మన చరిత్ర’

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.