పసుపులేటి గీత
‘లాంగ్‌లివ్ ఆఫ్ఘన్ ముజాహిదీన్…!’ నినాదాలు మిన్నంటుతుండగా ఆమె తలలోకి లెక్కలేనన్ని తూటాలు దూసుకు వెళ్ళాయి. క్షణాల్లో ఆమె దైవం సాక్షిగా, జనం సాక్షిగా, చూపరుల సాక్షిగా ప్రాణాల్ని వదిలేసింది. కాబూల్‌కి కూతవేటు దూరంలో అందరూ చూస్తుండగా ‘అ(?)క్రమ సంబంధం’ అనే నేరం మీద తాలిబన్ ఒకడు ఆ స్త్రీని కిరాతకంగా కాల్చి చంపాడు.
అస్సాంలో కరీంగంజ్ జిల్లాలోని నక్షత్ర హోటల్లో బస చేసిన మహిళా ఎంఎల్ఎ రూమీనాథ్, ఆమె భర్త జాకీ జకీర్ మీద జూన్ 29న రాత్రి తొమ్మిది గంటల సమయంలో సుమారు వందమంది దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆమె చేసిన నేరం వివాహితే అయినప్పటికీ, మరో పురుషుణ్ణి పెళ్ళాడడం. అదీ మతాంతర వివాహం చేసుకోవడం.
గౌహతి నగరం నడిబొడ్డున, సచివాలయానికి కిలోమీటర్ దూరంలో రోడ్డు మీద ఒక పసిపిల్ల మీద 20 మంది మృగాలు (మృగాల్ని ‘మంది’ అనాల్సి వస్తున్నందుకు బాధపడాలో, లేక వీళ్ళని మృగాలతో పోలుస్తూ, వాటిని కించపరచాల్సిన నా చేతగానితనానికి సిగ్గుపడాలో తెలియడం లేదు. లాభం లేదు, భాష మరింత క్రౌర్యాన్ని సంతరించుకోవలసి ఉంది.) పైశాచికంగా 40 నిమిషాల పాటు దాడి చేసి, హింసించారు. అత్యాచారం కన్నా అమానుషంగా ఎలా ప్రవర్తించ వచ్చునో చెప్పడానికి వీళ్ళే తాజా నమూనా. ఈ సంఘటన కూడా నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే జరిగింది.
అందరూ చూస్తుండగానే ఎన్నో జరుగుతున్నాయి. చర్మం మొద్దుబారింది. కళ్ళకి భావదారిద్య్రపు గ్లుకోమా అడ్డు పడుతోంది. అందరూ చూస్తుండగానే అన్ని దాష్టీకాలు యధావిధిగా జరిగి పోతుంటాయి. ఇలా కళ్ళప్పగించి చూడ్డానికి అలవాటు పడిన సమాజంలో చూస్తూ ఊరుకోవడం చేతకాని వాళ్ళు కూడా ఉన్నారనడానికి నిదర్శనం జిమ్మీ బ్రిగ్స్, బరుణ్ బిశ్వాస్‌లు.
‘నా ఉద్వేగాన్ని త్రోసిరాజనలేను….’
బ్రిగ్స్ ఒక జర్నలిస్టు. వృత్తిలో భాగంగా అతను ఒకసారి ఆఫ్రికాలోని కాంగో ప్రాంతంలో పర్యటించాడు. సైనికుల చేతిలో హింసలకు, అత్యాచారాలకు బలైపోయిన వారిని కలుసుకున్నాడు. ఆ సమయంలోనే అతను ఒక మహిళతో మాట్లాడాల్సి వచ్చింది. తన కళ్ళెదురుగానే తన పిల్లల్ని, తండ్రిని కాల్చి చంపి, ముష్కరులు తన మీద రాక్షసంగా అత్యాచారం జరిపిన ఘోరాన్ని ఆమె బ్రిగ్స్‌కి వివరించింది. ఈ విషాద కథనాన్ని ఆమె నోటి వెంటే విన్న బ్రిగ్స్ నిలువునా రగిలిపోయాడు. వెంటనే అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసి, విలేకరిగా తన వృత్తికి తిలోదకాలిచ్చాడు. మహిళలపై జరిగే అత్యాచారాలు, హింసలకు వ్యతిరేకంగా ఉద్యమించేలా యువతకు స్ఫూర్తినిచ్చేందుకు నడుం కట్టాడు. అంతవరకూ తాను సమాజ హితం కోసం నిర్వహిస్తున్న ‘మ్యాన్ అప్’ అనే స్వచ్ఛంద సంస్థను అతను ఈ పనికి నియోగించాడు. ‘జర్నలిస్టులంటే ఉద్వేగాలకు అతీతంగా వాస్తవాలకు పరిమితమయ్యే వాళ్ళు. నేను ఇక ఎంత మాత్రమూ నా ఉద్వేగాన్ని తోసిరాజని కేవలం వాస్తవాల్ని రిపోర్టు చేసి, చేతులు దులిపేసుకోవడానికి సిద్ధంగా లేను’ అంటాడు బ్రిగ్స్. ‘మ్యాన్ అప్’ ద్వారా బ్రిగ్స్ స్త్రీలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా యువతలో అవగాహనను పెంచేందుకు వాళ్ళు ప్రేమించే సాకర్ గేమ్‌తో పాటు, హిప్హాప్ ప్రాంతాల్లో, దేశాల్లో మహిళలపై జరిగే ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమెలాగో అతను వారికి నేర్పుతున్నాడు. మహిళలపై అత్యాచారాన్ని ఒక యుద్ధ సాధనంగా వాడుకుంటున్న కాంగో, నైజీరియాల్లోను, ఆడపిల్లల్ని భ్రూణదశలోనే అంతమొందించడంలో అగ్రభాగాన ఉన్న గ్వాటెమాలా, మెక్సికోల్లోను, వ్యభిచారంలోకి మహిళల్ని దింపుతున్న బాల్కన్ ప్రాంతాల్లోను, గృహహింసకు వ్యతిరేకంగా ఐరోపా, అమెరికాల్లోను మ్యాన్ అప్ సంస్థ ఆయా దురాగతాలకు వ్యతిరేకంగా యువతను కూడగడుతోంది. ‘ఎక్కడికి వెళ్ళినా గొంతుతో పాటు, మనసును కూడా విప్పి తమ బాధల్ని నాతో పంచుకున్న ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉన్నాను’ అంటాడు బ్రిగ్స్. అతను రచించిన ‘ది వార్స్ ఉమెన్ ఫైట్’ అనే పుస్తకం వచ్చే ఏడాది ప్రచురితం కానుంది. బ్రిగ్స్ తాను విన్న వ్యథార్త గాథల్ని వివరిస్తూ తన కుమార్తె మరీలాకు రాసిన ఉత్తరాల సమాహారమే ఈ పుస్తకం.
‘నేను కూడా ఒక ఆడపిల్లకు తండ్రిని. అందువల్లనే మహిళలు ఎదుర్కొంటున్న కష్టాల్ని, హింసల్ని ఇతర పురుషుల్లా తేలికగా తీసుకోలేక పోతున్నానేమో అనిపిస్తుంది. ఒక వేళ నా జీవితంలో మరీలా లేకుంటే నేను కూడా ఇవన్నీ ఆడవాళ్ళ సమస్యలే అనుకుంటూ దూరంగా ఉండేవాణ్ణేమో’ అంటాడు బ్రిగ్స్. కానీ ఆడవాల్ళ మీద దాష్టీకాలకు తెగబడుతున్న వారి జీవితాల్లోను, అలా తెగబడడాన్ని ఒక జన్మహక్కుగా భావిస్తున్న వారి జీవితాల్లోనూ కూడా మహిళలు ఏదో ఒక కీలక పాత్రను పోషిస్తూనే ఉంటారు. అయినప్పటికీ వాళ్ళలో చాలామందికి ఆ హింసలు హింసగా కనిపించక పోవడమే ఇవాల్టి వికృత సత్యం.
‘ఉద్యమాన్ని ప్రారంభించాలనుకున్న ప్రదేశంలోని పాఠశా లలకు, కళాశాలలకు వెళ్ళి, అక్కడ మహిళలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ పిల్లల్ని తమకు నచ్చినట్టుగా నృత్యం చేయ మంటాం లేదా పాట పాడమంటాం లేదా ఏదైనా ఆటను ఆడమంటాం’ – ఆశించిన దాన్ని కార్యాచరణలో పెట్టడం కన్నా మన మెటు పోతున్నామన్నదే ముఖ్యం’ అన్నది బ్రిగ్స్ అభిప్రాయం. ‘మీ ఆసక్తిని ఒక సామాజిక కారణానికి ఉపయోగించాలంటూ మేం యువతను ప్రోత్సహిస్తాం’ అంటూ మ్యాన్ అప్ పనితీరు వివరించాడు బ్రిగ్స్.
ధైర్యానికి చిరునామా
పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాకు చెందిన సూథియాలో పదేళ్ళ క్రితం జులైలో జరిగిన ఒక ఉదంతమిది. సూథియా గ్రామాన్ని సుషాంత చౌదరి అనే గూండా, అతని గుంపు తన గుప్పెట్లో పెట్టుకుని, ఎదిరించిన వారిని హింసించి, పెట్టుకుని జీవించే వారు. ఈ దుర్మార్గానికి చరమగీతం పాడాలని గ్రామంలోని అందరూ కోరుకునే వాళ్ళు. కానీ వాళ్ళలో ఏ ఒక్కరు కూడా బాహాటంగా నోరు మెదపడానికి సాహసించే వారు కారు. అలాంటి పరిస్థితిలో ఒకరోజు మార్కెట్లో ఒక యువకుడు మైక్రోఫోన్‌ని పట్టుకుని, ‘మన తల్లుల్నీ, తోబుట్టువుల్నీ, భార్యల్నీ మనం కాపాడుకోలేక పోతే ఈ నాగరిక సమాజంలో ఉండడానికే మనకు అర్హత లేదు. అత్యాచారాన్ని జరుపుతున్న దుండగుల్ని నిరోధించే ధైర్యం మనకు లేకపోతే వారి కన్నా కఠినమైన శిక్ష మనకే పడాలి. అందుకే మన మహిళల్ని రక్షించుకునే ఉద్యమంలో భాగం కండి, అందరూ ముందుకు రండి’ అంటూ పిలుపునిచ్చాడు. క్షణాల్లో అందరూ ఉత్తేజితులయ్యారు. మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా ‘ప్రతిబాదీ మంచా’ అనే సంస్థ ఆవిర్భవించింది. ఆ యువకుని పేరు బరుణ్ బిశ్వాస్. అత్యాచారాలకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసేలా ఈ సంస్థ వారికి అన్నుదన్నుగా నిలిచింది. రెండేళ్ళలో సూథియా మహిళలపై అత్యాచారాలు జరుపుతున్న సుషాంత్ చౌదరితో సహా నలుగురు అరెస్టయ్యారు. అత్యాచారాలకు గురైన మహిళలకు సామాజిక పునరావాసాన్ని కల్పించేందుకు కూడా బిశ్వాస్ కృషి చేశాడు. వరదల్లో మునిగి పోతున్న గ్రామాన్ని కాపాడేందుకు ఒక కాలువను తవ్వించాడు. దాంతో బిశ్వాస్ ఆ గ్రామానికి ఆరాధనీయుడయ్యాడు. కానీ ఇదంతా నచ్చని వర్గం అతని ప్రాణాల్ని కబళించడానికి కనిపెట్టుకుంది. అతను ఒంటరిగా ఉన్నప్పుడు హతమార్చింది. నడివీధిలో కాల్పులకు గురైన బిశ్వాస్‌ను ఆసుపత్రిలో చేర్పించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అతను మరణించాడు. ‘ధైర్యంగా జీవించడమెలాగో బిశ్వాస్ మాకు నేర్పాడు. కానీ మేమింకా నేర్చుకోవలసింది ఎంతో ఉంది’ అంటున్నాడు అతని సోదరుడు అరుణ్. సూథియా నేటికీ బరుణ్ బిశ్వాస్కు నివాళులర్పిస్తూనే ఉంది. ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకుంటే, వాలడం మరిచిపోయి అచేతనమైన రెప్పలకి కాసింత జవసత్త్వాలు చేకూరుతాయి. మరచి పోయిన సిగ్గు మళ్ళీ గుర్తుకొస్తుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags