అప్పుడు నాకు తొమ్మిది సంవత్సరాలు. నా కంటే మూడేళ్ళు పెద్దది మా అక్కయ్య. మా ఫామిలీలో (కుటుంబం) మగ పిల్లలు తక్కువ. పెద్దమ్మకు ఒక్క కొడుకుండేవాడు. మా అన్నయ్యకు పదకొండు రోజులప్పుడు తల్లి చచ్చిపోతే మా అమ్మ పెంచింది. తర్వాత మేం వరసన నల్గురు ఆడపిల్లలం. నా తర్వాత పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు చనిపోయారు. ఆడపిల్లలెక్కు పుట్టటం తోటి ఫ్యామిలీలో వచ్చే నిర్లక్ష్యం కొంత స్వభావికంగా పనిచేసింది. మా అక్కయ్యకు పన్నెండు సంవత్సరాలు. అప్పుడేదో ఆత్మరక్షణ శిక్షణ అని ఒకటి పెట్టారు.
చండ్రసావిత్రి, డా|| అచ్చమాంబ, కొమర్రాజు అచ్చమాంబ గారు, ఇంకా ఎవరో కొంతమంది, ఒక టీచరు వాళ్ళ పేర్లు నాకు గుర్తురావటంలేదు. వాళ్ళని నెలరోజులు ట్రెయినింగ్ (శిక్షణ) పంపించారు. అప్పుడు తెలంగాణా ఏరియా (ప్రాంతం) నుంచి స్వరాజ్యంగారు, మా ఊరు బ్రాహ్మణపల్లి నుంచి మా అక్కయ్య, బీబీనగర్‌లో ఒక టీచరుండేది, ఆమె వెళ్ళారు. ఆ రోజుల్లో ఒక స్త్రీ టీచరుగా చెయ్యడమంటే అరుదు. అసలు స్కూళ్ళే తక్కువ. ఆమె టీచరుగా పనిచేస్తూ మీటింగ్స్‌కి వస్తుండేది. మేం ఆమెని చాలా గౌరవించే వాళ్ళం. ఆమె వితంతువు. పిల్లలు లేరు. తర్వాత ఆమెని రజాకార్లు కాశింరజ్వీ నాయకత్వంలో బీబీనగర్ మీద దాడిచేసి స్టేషన్ మాష్టరును చంపి ఆమెని కూడా చెరిచారన్నమాట. తర్వాత ఆమె చనిపోయిందనుకోండి. అయితే వీళ్ళందర్ని ట్రెయినింగ్‌కి పంపించారు. అప్పుడు నేను కూడా మా వాళ్ళతో పోతానని చాలా గొడవ చేశాను. మా అన్నయ్య దగ్గర ఏదో నేర్చుకోవాలనేదొకటి. ఇంట్లో నన్ను కొంచెం నిర్లక్ష్యంగా చూడడం ఇంకొకటి. ఆడపిల్లలెక్కువ వున్నారు, వీళ్ళకి ఖర్చులు అనేది ఒకటి. మా అన్నయ్య మటుకు అట్లా చూడకుండా నన్ను చాలా ఎంకరేజ్ (ప్రోత్సాహం) చేసేవాడు. నేనంటే చాలా ఇష్టపడుతుండేవాడు. అయితే నన్ను పంపించలేదని దాదాపు మూడు రోజులు ఉపవాసం పడుకొని ఏడుస్తే మా అన్నయ్య నచ్చ చెప్పాడు. నీకు పన్నెండు సంవత్సరాలు లేనిదే తీసుకోరు ఇంకొకసారి పంపిస్తానని చెప్పాడన్నమాట. మా అమ్మకి ఇంట్లో పెద్ద స్వతంత్రం వుండేది కాదు. మా పెద్దమ్మదే ఇంట్లో అంతా. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళదీనితోటి మా అమ్మదేం వుండేది కాదు. మా అన్నయ్య ఇంట్లో వాళ్ళతోటి ఎప్పుడూ దెబ్బలాడేవాడు మా గురించి ‘ఆడపిల్లల్ని వేరేగా చూడకూడదు. చదువు చెప్పించాలి. మీటింగులకు పంపించాలి’. సాధారణంగా భూస్వాముల కుటుంబాల్లో ఘోషా. అసలు చుట్టాలొచ్చినా బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. చిన్నపిల్లలయినా సరే ఆడపిల్లలు బయటికి రాకూడదు. ఎక్కడికన్నా ప్రయాణం చేసినప్పుడు బండికి పరదాలు కట్టుకొనిపోవాలి. అక్కణ్నించి మొదలై ఏమైందంటే స్కూళ్ళలో మగపిల్లలతో ఆడటం, అన్ని ఆటలు నేర్చుకోవటం, కబడ్డీ ఆడటం కూడా చేసేవాళ్ళం. చుట్టాలంతా వచ్చిచూసి ”ఆడపిల్లల్నేంటి మగపిల్లల్లాగా తయారు చేస్తున్నాడు నీ కొడు”కని మా అమ్మవాళ్ళని కోప్పడేవాళ్ళు. అయినా మేం లెక్కచేయలేదు. మా అన్నయ్య ఎవరన్నా ఇంటికొస్తే భోజనం పెట్టించడం, కాఫీలిప్పించడం మా చేత కావాలని చేయిస్తుండేవాడు, అదంతా కూడా కొంత మార్పు రావాలనే. ఆయన మూలంగానే మాకు బయటి ప్రపంచమేమిటో కొంచమైనా తెలిసింది.
ట్రెయినింగ్ అయిపోయిన ఆరునెల్లకనుకుంటా భువనగిరిలో పెద్ద ఎత్తున మహాసభ జరిగింది. నాకు ఫస్ట్‌టైం అంత పెద్ద మీటింగ్ చూడ్డం. ఎంత మంది జనమో! దానికి మా ఫామిలీ మొత్తం అమ్మానాన్నలతో సహా బండ్లు కట్టుకెళ్ళి మూడు రోజులక్కడేవున్నాం. దానిలో ప్రధానంగా రావి నారాయణరెడ్డిగారు, బద్దం ఎల్లారెడ్డిగారు నాయకులు. నల్గొండ జిల్లాలో మా అన్నయ్య వాళ్ళకి ప్రధమశిష్యుడన్నమాట. అంతకు ముందు అమ్మవాళ్ళకి, ‘వీడేంటి ఎప్పుడూ తిరుగుతుంటాడు. ఇంటి విషయాలు పట్టించుకోడు. చదువుకోడు’ అనే వ్యతిరేకత ఉండేది. ఇప్పుడు అది పోయి, ఈ జనం అదంతా చూసిన తర్వాత వీడు చేసే పని మంచిదని, వీడెనక ఇంతమంది జనం వున్నారు అనే మార్పు ఆటోమేటిక్‌గా (దానంతటదే) వచ్చేసిందన్నమాట. ‘పోనీలే వాడిదార్ని వాణ్ణి వదిలెయ్యా’లనే స్థితికి వచ్చారు. భువనగిరి మహాసభలో మా అన్నయ్య మా తోటి బుర్ర కథ చెప్పించాడు. ఎక్కడన్నా మీటింగ్ అయితే చిన్న చిన్న పాటలు పాడించేవాడు. ఆ రోజుల్లో టాన్యా బుర్రకథ ఒకటి, జోయా, ఝాన్సీ లక్ష్మి కథ, బెంగాల్ కథ ఒకటి ఇట్లాంటివెన్నో, ఏవో వుండేవన్నమాట. అన్నయ్య రెగ్యులర్‌గా (రోజూ) నైట్స్కూలు ఒకటి నడిపేవాడు. మా జీతగాళ్ళు హరిజనులుండేవారు. వాళ్ళని తాకకూడదు అని ఒకటుండేది. అయితే మా అన్నయ్య వాళ్ళని తప్పనిసరిగా ముట్టుకోమని తమాషాకి కొట్టినట్టుగా తాకటము మా తోటి చేయించేవాడు. అట్లా ఈ రకంగా నడుస్తుండేది.
‘మిమ్మల్ని హాస్టలులో వుంచి చదివిస్తాను, పెళ్ళిళ్ళు చిన్నతనంలో చేయనివ్వను’ అనేవాడు మా అన్నయ్య. అప్పటికే మా అక్కయ్య పెద్దమనిషయింది, పద్నాలుగేళ్ళు. అయితే ఆమెకు సంబంధాలు వెతుకుతున్నారు. ఈ లోపల ఖమ్మం మహాసభలొచ్చాయి. 14వ మహాసభ అనుకుంటా దానికి మేం వెళ్తామంటే ఖమ్మం చాలా దూరం. ఏదో భువనగిరి అంటే మేమందరం వచ్చాం కాని ఖమ్మం వెళ్ళడానికి వీల్లేదని ఆపేశారు. అన్నయ్య ఒక్కడే వెళ్ళాడు. అప్పుడే మావాళ్ళేంచేశారంటే రెండో పెళ్ళతని సంబంధం అక్కయ్యకు స్థిరం చేశారు. అతను జాజీరెడ్డి గూడెంలో పెద్ద లాండ్లార్డు (భూస్వామి). అతనికి భార్య వుంది. టి.బి. ఏదో వుందని రెండో పెళ్ళన్నమాట. అతనికి ఆస్తి కూడా వుందని ఎంగేజ్మెంటు (నిశ్చితార్థం) కూడా చేసి డేట్ ఫిక్సు (నిర్ణయం) చేశారు. నాకు బాగా గుర్తుంది. మా అన్నయ్య ఖమ్మం మహాసభ నుంచి తిరిగొచ్చి, ‘నేను లేకుండా ఎందుకు నిర్ణయించేశారు, అతను మంచివాడా? బాగా తాగుతాడు. చుట్టుప్రక్కల అందర్ని దోచుకున్నాడు. పెద్ద భూస్వామి’ అని గొడవ చేశాడు. అతనెట్లాంటి వాడైతే మనకేంటి ఆస్తి వుంది మన పిల్ల సుఖపడుతుంది, అనేది మా తాతగారు. ఆయన డామినేషన్ (ఆధిపత్యం) యింట్లో, మా నాన్నది కూడా ఏమీ లేదు. చివరికి మా అన్నయ్యేమన్నాడు! ”ఈ పెళ్ళెట్లా అవుతుందో చూస్తాను. మీరాపండి ఆపకపోండి. నేను మటుకు అమ్మాయిని తీసుకుపోతాను. మీరే అభాసుపాలవుతా”రని ఖచ్చితంగా చెప్పాడు. అప్పటికింక వారం రోజుల్లో లగ్నం పెట్టుకొని అన్నీ తయారు చేసుకొన్నారన్నమాట. కాని ఈ పెళ్ళి కాన్సిల్ (రద్దు) చేయించటం ఎట్లా? అసలు ఆ రోజుల్లో భూస్వాముల ఫామిలీలో ఎంగేజిమెంటు అయిన తర్వాత పెళ్ళి బ్రేకయిందంటే ఇహ మళ్ళీ పెళ్ళిళ్ళెట్లా జరుగుతాయి? అనే ఇది తోటి మా వాళ్ళు పెద్ద గొడవ చేశారు. ఏడుపులు పెట్టి గొడవచేస్తే మా అన్నయ్య మీ మీదకేం రాకుండా నేను చూసుకుంటానని చెప్పి మా అక్కయ్యతోటే చెప్పిస్తానన్నాడు. ‘నాకిష్టం లేదని దానితోటే చెప్పిస్తా’నంటే వాళ్ళొప్పుకోలా. ఇదంతా ఎవరో చెప్పిస్తున్నారు. అమ్మాయిది కాదు. ఆ అమ్మాయి చెప్తే మేం నమ్ముతాం లేకపోతే నమ్మం అన్నారు వాళ్ళు. మా అన్నయ్య దాన్ని రూములో కూర్చోపెట్టి బాగా ట్రెయినింగ్ ఇచ్చాడన్నమాట. ‘నువ్వు భయపడకు నాకిష్టంలేదని ఒక్క మాట చెప్పు’ అని. అదట్లా చెప్పేసింది. వాళ్ళ బ్రాహ్మణుడు, పెద్ద మనుషులు అందరూ వచ్చారు. అంతకు ముందే నగలు, గిగలు, బట్టలు అన్నీ పెట్టి పోయారు గదా. పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చారన్నమాట. అదొక పెద్ద వింత ఆ రోజుల్లో ఆడపిల్ల ఇష్టం లేదని చెప్తుందేమిటి అని. ఆ వింత చూడడం కోసమే కొంతమంది పెద్ద మనుషుల వచ్చేశారు. అంతమందిలో వెళ్ళి, మా అక్కయ్య నాకిష్టంలేదని, ఈ రెండో పెళ్ళి నేను చేసుకోను అంది. మరప్పుడెందుకు ఒప్పుకున్నావంటే నాకిష్టం లేకుండానే మా వాళ్ళంతా ఒప్పేసుకున్నారు అంది. వాళ్ళిచ్చిన బంగారం అంతా వాళ్ళకిచ్చేశాక మా అమ్మ వాళ్ళేడుస్తుంటే ‘మరేం ఏడ్వద్దు నేనిదేనెల్లో దాని పెళ్ళి చేస్తా’నని మాట ఇచ్చాడు మా అన్నయ్య. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో మా బావగారు వున్నారన్నమాట. ఆంధ్ర మహాసభలో వున్నారు వాళ్ళంతా అప్పటికే. ఆయన్ను తీసుకొనివచ్చి మళ్ళీ పెండ్లి చేసేశారన్నమాట. దానితోఎటి మాకు కూడా అన్నయ్య బైటపన్లే కాకుండా ఇంట్లో కూడా మా కోసం చేస్తాడు. ఇక అన్నయ్య మాట తప్పితే ఎవరి మాట కూడా వినకూడదు అని మనసులో బాగా పడిపోయిందన్నమాట. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చినాయన మంచివాడే కనుక, పోతే పోయిందిలే మన మంచికే అయిందని సంతోషపడ్డారు. ఆయన ఏ పనిచేసినా మంచిపనే అనే జనరల్ మార్పొకటి వచ్చేసిందన్నమాట ఇంట్లో. ఆయనెక్కడ తీసుకెళ్తున్నా అభ్యంతర పెట్టని పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత నన్ను హైద్రాబాద్ హాస్టల్లో పెట్టి చదివిస్తానని, ఓబులరెడ్డి రంగమ్మ ప్రిన్సిపల్‌గా వున్నప్పుడు ప్రయత్నం చేశారన్నమాట. ఈ లోపలే అన్నయ్య మీద వారంటు వచ్చింది. అన్నయ్య అండర్ గ్రౌండు (రహస్యంగా) పోయాడు. ఎప్పుడో రాత్రిపూట ఇంటికి రావడం పోవడం చేసే వాడు. 1947లో అనుకుంటా యుద్ధ సమయం, విమానాల్ని కూల్చడం, పారషూట్ క్లాత్ తీసుకొచ్చి గ్రామాల్లో పంచటం అవన్నీ చేసేవాళ్ళం. అప్పటి వాళ్ళకి సిల్క్ తెలియదు. అన్నీ ముతకగుడ్డలే కదా. క్లాత్ బ్లౌజులు కుట్టించుకోవడం, ఎంబ్రాయిడరీ చేయించుకోవటం చేసుకునే వాళ్ళు.
ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళం కాని ఇంట్లో పనులు పట్టించుకునే వాళ్ళం కాదు. ఆ ఊళ్ళో స్కూలుండేది కాదు. అయితే అందరి దగ్గరా తలావొక కర్ర సంపాయించి అందరి శ్రమశక్తిదానంతో స్కూలు కట్టించాడు మా అన్నయ్య. దానికి ధర్మశాల అని పేరుపెట్టాడు. కొంతసేపు హిందీ, ఇంగ్లీషు అన్నయ్య చెప్పే వాడు. భధ్రయ్య అని ఒక బలిజాయన టీచరుండేవాడు. ఆయనకు గవర్నమెంటు జీతంలేదు కనుక తలా యింతవేసుకొని ఇచ్చేవాళ్ళం. ఆయన అయిదారు క్లాసుల వరకు చెప్పేవాడన్నమాట. ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా స్కూలు లేకపోవటంతో అందరం అక్కడే చదివాం. అంతకుముందు ఉర్దూ మీడియం మాత్రమే వుండేది. లెక్కలు, హిస్టరీ, జాగ్రఫీ, సైన్సు అన్నీ ఉర్దూలోనే, తెలుగులో అసలెట్లా చెప్పాలో కూడా తెలియదు. ఎవరన్నా ఇంటికివస్తే కూడా ఉర్దూలోనే మాట్లాడటం. గవర్నమెంటు ఆఫీసర్లు అయినా ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్ వచ్చినా వాడికి తెలుగొచ్చేది కాదు. ఎక్కడికయినా పోవాలనుకుంటే ఉర్దూ వచ్చి వుండాలి. అప్పుడు స్కూల్లో వున్నప్పుడు ఇవన్నీ మార్చి హిందే అక్షరాలు నేర్పించడం, ఎ, బి, సి, డిలు నేర్పించడం ప్రవేశ పెట్టా రన్నమాట. అప్పుడా స్కూల్లో చదివినవాళ్ళిప్పటికీ వున్నారన్నమాట.
ఆ తర్వాత కొద్దికాలానికే పోలీసాక్షన్, బ్రిటిషు వాళ్ళెళ్ళిపోయిన తర్వాత నైజాం నవాబు సంస్థానం రద్దు చేసుకోవడం కోసం ప్రభుత్వం అడగటం. కాశిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు తయారుకావటం – అన్నీ జరిగినయి. మా అన్నయ్య అండర్‌గ్రౌండు పోయిన తర్వాత ఒకరోజు ఇంటికొచ్చాడు. తను ఏడు గంటలకొచ్చాడు. ఎనిమిది గంటలకు సరిగ్గా బీబీనగర్ రైల్వే స్టేషను మీద మొదటి రజాకార్ల దాడి జరిగింది. కాశిం రజ్వీ నాయకత్వాన స్టేషన్మీద దాడి చేయటం, ఊరిమీద దాడిచేయడం. ఆ టీచర్ని కూడా అప్పుడే రేప్ చేయటం జరిగింది. అక్కడది జరగగానే మాకొక మనిషొచ్చి చెప్పాడు. బీబీనగరొచ్చారు ఇహ ఇక్కడికి కూడా వస్తారని చెప్పాడు. అంతకుముందే రజాకార్లు హిందువుల్ని ఎక్కడపడితే అక్కడ పట్టుకొని కొట్టడం, గిల్లికజ్జం పెట్టుకొని కొట్టడం, చంపడం ఆ రకంగా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సిటీలో బాగా వ్యాపించి సిటీవాళ్ళంతా గ్రామాలకొస్తున్నారు. అట్లా మా ఊళ్ళో ఒక చాకలామె వుండేదన్నమాట. ఆమెని సికింద్రాబాద్ ఇచ్చారు. ఆమె ఇవన్నీ కథలు చెప్పేది. ‘తురకవాళ్ళు, తెలుగువాళ్ళని బతకనివ్వట్లేదమ్మా. పసిపిల్లల్ని కూడా తీసుకుపోయి మేకులుకొట్టి తగిలిస్తా’రని అట్లా చెప్పేది. చెరచటం, బంగారం లాక్కోవటం, ఆడవాళ్ళు ఒంటరిగా పోతుంటే పట్టుకోవటం, ఇవన్నీ జరుగుతుంటే ఇహ అక్కడ వుండలేక వచ్చేశామని చెప్పేవాళ్ళన్నమాట. ఒక సినిమా షికారు ఏమీ వుండేది కాదు. స్తంభించిపోయింది పట్నమంతా. ఇంకొక పద్మశాలీల అమ్మాయి, కాపామె రాములమ్మ అని వీళ్ళు ముగ్గురు ఈ కథలు చెప్తావుంటే అసలిట్లా చేస్తారా అనుకునేది. కాని చేస్తే ఏం చేయాలి, పట్నాల్లో మొదలుపెట్టి పల్లెలకొస్తే ఏం చేయాలి అని కూడా మాట్లాడుతుండేది. పార్టీలో కూడా ఆత్మరక్షణ ఎట్లా చేసుకోవాలి, కారంపొడి దగ్గర పెట్టుకోవటం, వాళ్ళొచ్చినపుడు ఎట్లా రక్షించుకోవాలి అనేది కొంతవరకు చెప్తున్నారప్పటికే. ఆ రోజు మా అన్నయ్య కూడా అదే మాట్లాడ్తున్నడు. ”ఇహ రేపట్నుంచి గ్రామాలమీద దాడి చేస్తారు. ఇళ్ళల్లో పడుకోవద్దు, బావులదగ్గర పడుకోండి” అని ఇట్లా చెప్తున్నాడన్నమాట. అదే టైములో ఈ దాడి జరిగింది. అప్పటికి నాకు పన్నెండు సంవత్సరాలుంటాయి. 1947లో అనుకుంటా, అయితే మా అన్నయ్య ఏం చేశాడు, మమ్మల్ని కూడా ఇంట్లో ఉండొద్దని అంటే, అందరం కల్సి పరిగెత్తిపోయాం. మా పెద్దమ్మ, మా మేనత్త ఒక ముసలామె వాళ్ళిద్దరే ఇంట్లో వున్నారు. ఊరంతా ఖాళీ అయిపోయింది. సరే ఇహ వాళ్ళేంచేశారు. మొదటి ఎటాక్ బీబీనగర్ మీద జరిగిన తర్వాత ఇక దాని ప్రభావం ఎట్లావుంటుందో చూడాలనుకున్నారో ఏమో వెనక్కి వెళ్ళిపోయారు. ఇక మర్నాడు మా అన్నయ్య ఒక మీటింగ్ పెట్టాడు. అక్కడంతా మనకనుకూలురేకాని, వ్యతిరేకులెవరూ లేరు. బీబీనగర్‌లో జరిగిన విధంగా ఎక్కడయినా జరగొచ్చు. రేపెవరూ మనకి రక్షణ ఇవ్వరు, మనకి మనమే రక్షించుకోవాలి అని ఇవన్నీ చెప్పాడు.
ఆ తర్వాత గ్రామాన్ని రక్షించుకోవటం కోసము గ్రామంలోని జనాన్ని ఏర్పరిచి ఊరి బయట సెంట్రీని ఒకన్ని చెట్టుమీద కాపలాకి పెట్టేవాళ్ళు రాత్రి పగలూ. ఎవరైనా వస్తున్నారంటే వీళ్ళు డప్పుకొడితే ఊళ్ళో జనమంతా పోగయ్యేవాళ్ళన్నమాట. వీలైనంతవరకు వాళ్ళని ఊళ్ళోకి రానివ్వకుండా అడ్డుపడటం, ఇక వచ్చేశారంటే తప్పించుకోని ఊరొదిలి వెళ్ళిపోవటం. వాళ్ళకి చిక్కకుండా జనం కూడా వీళ్ళదగ్గర వడిశెలలు, గొడ్డళ్ళు, కొడవళ్ళు అన్నీ దగ్గర తయారుగా వుంచుకునేవాళ్ళన్నమాట. కాపలాలు కాయడానికి కూడా కొంతమంది యువకుల్ని సెలెక్టు చేసి పెట్టారు. ఆ రోజుల్లో ఆంధ్రమహాసభ సభ్యత్వంతో పాటు వ్యవసాయకూలీ సంఘ సభ్యత్వం, యువజన సంఘ సభ్యత్వం కూడా వుండేదన్నమాట. అట్లా యువజనుల్లో వుండేవాళ్ళకే ఇట్లాంటివన్నీ అప్పజెప్పి మా అన్నయ్య వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన నాలుగైదురోజులకే అనుకుంట పార్టీ పిలుపిచ్చింది, ఊళ్ళల్లో పటేలు, పట్వారీలు దగ్గరుండే దస్తరాలు తగులబెట్టెయ్యాలని. నైజాంకి అనుకూలంగా వుండేవాళ్ళు కదా ఈ పటేలు, పట్వారీలు ఆ కార్యక్రమాలు తీసుకున్నారు. అప్పటి పటేలు, పట్వారీలు దగ్గర ఒక తుపాకీ, ఒక కత్తి వుండేది. దసరా రోజు జమ్మికి పోయేటప్పుడు, జమ్మిపూజ చేసేటప్పుడు దీనితో యాటని నరకటం, తుపాకి పేల్చటం అట్లాంటివన్నీ చేసేవారు. కత్తి అంటే బాగా ఇంత పెద్ద తల్వారన్నమాట. అందుకనే మొట్టమొదట వాళ్ళమీద దాడి ప్రారంభమైందన్నమాట. పార్టీ అంటే దళపోల్లొచ్చిన్రు, తుపాకి గుంజకపోయినన్రే వాళ్ళు. ఈ తుపాకులెందుకు అంటే రజాకార్లు దాడి చేస్తే ఎదుర్కోవటానికి అని చెప్పంగానే సాధారణంగా ఇచ్చేవాళ్ళు. మా అన్నయ్యేం చేశాడు! మరి రేపు మా నాన్న దగ్గరికెందుకు పోలేదనే మాటొస్తుందని ముందర మా నాన్న దగ్గరికే వచ్చేశాడు. మా నాన్నే మాలీ పటేలు, పోలీసు పటేలు రెండూ. అంటే ఆ ఊళ్ళో మాదొక్కటే ఇల్లున్నది. మిగతా వాళ్ళంతా రైతులు, సాలీలు వాళ్ళున్నారు. కనుక రెండు వతన్లు-వతన్లనే వాళ్ళన్నమాట. ఆ రెండూ మా నాన్నకే వుండేవన్నమాట. ఇహరావడం దస్తరం తీసుకపోవడం ఇంటిముందే తగులబెట్టడం. ఆయుధాలు ఒకటున్నా, రెండున్నా లాక్కుపోవడం. అది మొదట మా ఇంట్లోనే జరిగిందన్నమాట. మాకది పెద్ద మార్పు. అప్పుడు వెట్టిచాకిరీ అని ఒకటుండేది.
(మనకు తెలియని మన చరిత్ర)
(మిగతాది వచ్చే సంచికలో)
కర్ఫ్యూ పెట్టినపుడు అందులో చచ్చిపోయిన వాళ్ళని గుర్తించటానికి రమ్మని గవర్నమెంటు రేడియోలో అనౌన్స్ (ప్రకటన) చేసింది. మా ఇంటాయన, ఇంకొకాయన, చిన్నాన్న అందరూ కల్సివెళ్ళారు. కర్ఫ్యూను కూడా లక్ష్యపెట్టకుండా వెళ్ళారు. ఆ రోజు బైటికెళ్ళిన వాళ్ళని కక్షలకోసం చంపేశారు. వీళ్ళముందే మా ఇంటాయన్ని తీసుకోయి చంపేశారో ఏ చేశారో తెలియదు. చివరికి శవం కూడా దొరకలేదు. కర్ఫ్యూలో ఎక్కడన్నా చచ్చిపోయాడేమోనని కాల్చిన శవాన్నల్లా వెళ్ళి చూసొచ్చారు. ఈ కచ్చబెట్టుకోని సికింద్రబాద్‌లో ఓ పూలషాపతన్ని హిందువులెల్లి చంపేశారు. ఇట్లా కొన్ని రోజులదాకా వాళ్ళు చంపారని వీళ్ళు, వీళ్ళు చంపారని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం జరిగింది. తర్వాత ఇహ రజాకార్ల పీడాపోయింది. సైన్యాలొచ్చినయి, ఇహ హాయిగా ఇళ్ళకి వెళ్ళి వుండొచ్చు అనుకున్నాం. అటు విజయవాడ, ఆంధ్ర సైడెళ్ళిన వాళ్ళంతా కూడా వచ్చేశారు.
పుల్లాయపల్లి పాపిరెడ్డి అని ఏర్‌ఫోర్స్‌లో పనిచేస్తూ అన్నయ్యతో పాటు రజాకర్ మూవ్మెంటప్పుడు దళాల్లో కొచ్చేశాడు. చాలాదూరం గురిపెట్టేవాడని చాలా పేరుండేది. ఆయన భార్య ఆ రోజుల్లోనే బాగా చదువుకుంది. ఆమె కూడా చాలా సహకరించేదన్నమాట. ఆయన దళాల్లో చేరాడంటే ఇంకేముంది పాపిరెడ్డొచ్చాడని, రామిరెడ్డొచ్చాడని జనం పండగలు చేసుకుంటున్నారు. ఇహ వాళ్ళు ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు అంతా కలుసుకోవటం, బతికున్నవాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్పుకోవటం. మేం కూడా వెనక్కి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య మూడు దళాల్లో వచ్చాడు. ఒక్కొక్కదళానికి దాదాపు ముప్పై మంది చొప్పున వందమంది దాకా వున్నారు. మేం వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం. యాటలుకోసి బిరియానీలొండి భోజనాలు పెడదామనుకునేసరికి మళ్ళీ ఈ కాంగ్రెస్ మిలిటరీ వాళ్ళు లారీల్లో వచ్చారు పగలే. తీరా భోజనాలకి విస్తళ్ళేసి వడ్డనలు చేస్తుండంగనే వాళ్ళొచ్చారు. వచ్చేప్పటికి మా అన్నయ్యతో సహా అందరి లేచి పారిపోయాం. అసలప్పుడు పార్టీలో కూడా ఎట్లా వుందంటే మా అన్నయ్య ఒక పబ్లిక్ మీటింగ్‌లో చెప్పాడు. ఇప్పటిదాకా మనం తుపాకులు పట్టుకొని పోరాడాం కాని ఇప్పుడిహ అవసరం లేదు. రాతకోతలతోనే గవర్నమెంటుతో పోరాడతాం అని జాతీయజెండా, ఎర్రజెండా రెండూ కలిపి మన ఊళ్ళో పాతిపోయాడన్నమాట. అది జరిగిన రెండురోజుల్లో జనగాంలో ఇద్దరు పార్టీ ఆర్గనైజర్స్‌ని కాంగ్రెస్ అరెస్టు చేసి పట్టుకుపోయింది. అందుకని వీళ్ళట్లా పారిపోయారన్నమాట. ఈ మూడు దళాల వాళ్ళు దళనాయకులు అందరూ పారిపోయారు. మిలిటరీ వచ్చి మా నాన్ననడిగారు ‘ఏంటి ఈ భోజనాలంతా’ అని.
పోలీసాక్షన్ అయినాక మూడురోజులకి పుట్టాడు మా వదిన కొడుకు. అయితే అప్పుడేం చెయ్యలేదు. ఇంతకాలం హైద్రబాద్లో వున్నాం ఇప్పుడేదో అందర్ని పిచ్చి పండగ చేసుకుంటున్నాం అని చెప్పారన్నమాట. తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత పదిహేను, ఇరవైరోజులకి మళ్ళీ ఒక అర్థరాత్రి మూడువేల మంది వచ్చారు. మా అన్నయ్య కొడుకు పసిపిల్లవాడు. మా అక్కయ్య, నేను, మా వదిన, అమ్మ వున్నాం. ఇంట్లో ఇంకొక ముసలామె వుంది. మా నాన్నేమో బావిదగ్గర పండుకున్నాడు. సిక్కు మిలిటరీ వాళ్ళు ఊరు చుట్టేశారు. ఇప్పుడయినా నాలుగు పెంకుటిళ్ళున్నాయిగానీ అప్పుడు మాదొకటే వుండేది. తలుపులు కొడితే మా అమ్మ తీసింది. తియ్యంగానే అమ్మను కొట్టారు. ముసలామె పడుకొని వుంటే ముసుగుతీసి కర్రతో పొడిచి మా అన్నయ్యేమోనని చూశారు. అమ్మని కొడితే నన్నెందుకు కొడతారయ్యా అని కాళ్ళు పట్టుకుంది. ఆ తర్వాత మా ముగ్గుర్ని చూపించి వీళ్ళంతా నా బిడ్డలే అని చెప్పింది. కోడలంటే మళ్ళీ ఏమైనా చేస్తారేమోనని, అట్లా ఎవరూ చెప్పక్కర్లేకుండానే కథలు చెప్పడం అలవాటయిపోయిందన్నమాట. ఇల్లంతా వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. తర్వాత బావిదగ్గర మా నాన్నని పట్టుకొని బాగా కొట్టారు. పడుకోబెట్టి బూటు కాలితో తొక్కి, తలమీద రైఫిల్‌తో కొట్టి బాధలు పెట్టారు. అక్కడనుంచి బట్టుగూడెం తీసుకపోయారు. నాకిప్పుడేమనిపిస్తుందంటే అప్పుడు ఇదంతా చేయడం పార్టీ అంటే ఒక భయాన్ని సృష్టించి జనంలో పార్టీపట్ల ఒక వ్యతిరేకత తీసుకురావడం కోసమే అని. ఇంకా కొంతమందిని పట్టుకుపోయి బాగా కొట్టి అందర్ని బట్టుగూడెం తీసుకెళ్ళిపోయారు. అక్కడ మా వదిన అక్కవాళ్ళుండేవాళ్ళు. ఆయనే ఆ ఊరి పోలీస్‌పటేల్. మా నాన్నని బాగా కొట్టి చచ్చిపోయుంటాడని ఆ ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ వాళ్ళంతా చుట్టాలే కదా. ఆ మనుషులంతా వచ్చి నాన్నని ఒక మంచం మీదేసి నల్గురు మోసుకుని తీసుకొచ్చారు. అసలు స్పృహలో లేడు. మేమైతే చచ్చిపోయాడనే అనుకున్నాం. ఇక ఊర్లో వున్న వైద్యమేదో పచ్చికోడిగుడ్డు, సున్నం అదీ కలిపి గాయాలకు రాసి హైద్రబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకుని వచ్చాం. హాస్పిటల్లో వాళ్ళు తీసుకోలా. ఇదేదన్నా వాళ్ళ మీదికి కేసు వస్తుందేమోనని భయపడ్డారన్నమాట. అసలు మా చాయపారితేనే ఏమవుతుందోనని భయం. చుట్టాలైనా ఎంత దగ్గర వాళ్ళయినా సరే. హాస్పిటల్లో ఎవరూ తీసుకోకపోతే చివరికి ఒక ప్రైవేట్ డాక్టరు రంగారెడ్డిగారి దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయాం. ఆయనతో కొంచెం చుట్టరికం ఏదో వుందనుకుంటా. అక్కడికిపోతే ఆయన ప్లాస్టర్ అదీవేసి పంపించాడు. తర్వాత మా అన్నయ్యకి తెలిసి వచ్చాడు. అప్పుడు డాక్టర్ రామచంద్ర రావు అని అండర్‌గ్రౌండ్‌లో కూడా పార్టీ కేసులన్నీ ఆయనే చూసేవాడు. ఆయనే మా నాన్నకి సాయం చేశాడు. తర్వాత మెల్లగా బతికాడు మా నాన్న.