వసంతలక్ష్మి
నిన్నే ఒక వార్త చదివాను, ”ముస్కాట్ ఎయిర్ పోర్ట్‌లో, పాస్‌పోర్ట్ పోయిన ఒక మహిళ, నాలుగు రోజులు ఎయిర్‌పోర్ట్‌లోనే మన ఏంబసీ వారి సహాయం కోసం ఎదురు చూస్తు, గుండె పోటుతో మరణించింది” అని. ఇండియాకి బయలుదేరిన ఆమె ప్రయాణం అర్థాంతరంగా దారిలోనే ముగిసింది. ఎంత హృదయ విదారకం? నిజంగా జనారణ్యంలో నివసిస్తున్నామా? మనం. దేశం కాని దేశానికి,ఎన్ని ఆశలుతో వస్తారో..కష్టపడి జీవితంలో ఏదో నాలుగు డబ్బులు కూడ బెట్టి బాగుపడాలనీ, కోటి ఆశలతో..కష్టపడి, ఇంకా ఓపిక, శక్తి, బలం నశించి పెద్ద వయసులో ఈ ఒంటరి మహిళ ఇలాగే తిరిగి మన దేశంకి బయలుదేరింది. దారిలో ఎక్కడో ఆమె పాస్‌పోర్ట్ పోయింది. రెసిడెన్సీ అయిపోయిన దేశం వెనక్కి అనుమతించరు. మన భారత దేశం ఎంబసి అధికారులులకి ఫోన్‌లో విషయం తెలిపినా, స్పందించడానికి మరి ఏమయిందో? రూల్స్, దేశాలు మధ్య గీసిన సరిహద్దు , ఒక పాస్‌పోర్ట్ ఎర్రదో, నీలందో, ఒక చిన్న పుస్తకం, దాని మీద అధికారుల సంతకాలు, ఇవే ఎక్కువా? ఒక ప్రాణం కన్నా?
ఒక తల్లి, ఒక కుటుంబం, ఒక భార్య, ఒక అక్క కాదా ఆమె? మన అధికారులకెందుకింత నిర్లక్ష్యం? మన అధికారులకి, అని మనసు దు:ఖించింది. ఇంక ఇప్పుడు, ఆ చనిపోయిన శరీరంని దేశంకి పంపించడానికి, ఎన్ని ఆటంకాలు ఉంటాయో? మరి ఇప్పుడు మానవత మేల్కొంటుందా, ఆలస్యంగానైనా? ఈ దేశాలకి వచ్చే మహిళలది ఇలాగే ఒక్కరికి ఒక్కో కథ.
ఏదో ఇంత డబ్బు సంపాదిద్దాం అని వస్తారు, ఒంటరిగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఆత్మ హత్యలు వింటాం, చెత్త కుప్పల్లో పడేసిన మృత శరీరాలు, చంటి బిడ్డలని వింటాం, రహస్య సంబంధాల్లో పట్టుపడ్డారని వింటాం, అవును మరి చాకిరి కోసం పని మనిషి రూపంలో ఒక మనిషి, వారికి కూడా కోరికలా? ఎంత ఘోరం. నడిచే చేతులు కదిలించే ఒక మర మనిషి, ఇంటి పనులకి కావాలి, కాని, ఒక సజీవ మనసున్న మనిషి కాదు. ఒక దేశం ప్రజలు, ఇంకో దేశానికి వచ్చి చాకిరి పనులు చేస్తూంటే, మన దేశం పెద్దలకి ఏమి అనిపించదా?ఇంటి పనులకోసం, ఇంత తక్కువ జీతాలుకోసం, ఈ దేశాలకు వచ్చే మన మహిళకు మన ప్రభుత్వం ఏదో ఒక ఇన్సూరెన్సు తీసుకుని, వారి జీవితాలకి భద్రత కల్పించాలి. ఏజెంట్లని నమ్మి మోసపోయేవారు ఒకరు, ఇక్కడ ఎక్కువ డబ్బు కోసం, పదహారు గంటలు, రెండు షిప్ట్స్ చేసే వారు, ఇంటికి డబ్బులు పంపిస్తే, అక్కడ భర్తలు, పిల్లలు కూడా, బాధ్యత లేకుండా ఖర్చుపెట్టి, వారిని డబ్బు సంపాదించే ఏటిఎం యంత్రాలులాగ చూడడం, ఓపిక నశించి, ఇక్కడ ఇంక పనులు చేయలేక ఇంటికి, వెనక్కి వెడితే, వీరిని ఆదరించే వారు ఉండరు.
ఇక్కడ పని చేసే మహిళలకి కూడా చదువులేకో, ఆలోచనలేకో, తమకోసం ఏమి దాచుకోకుండా, అంతా బంగారం రూపంలోనో, డబ్బురూపంలోనో, కుటుంబ సభ్యులకే పంపిస్తారు. పిల్లలకి చదువు చెప్పించి, పొదుపు చేసి, బ్యాంకులలో దాచుకోవాలని, ఒక ప్రణాళిక ఉండదు వారికి. ఆడపిల్లలు ఉంటే వారికి కట్నాలు ఇచ్చి పెళ్ళిచేయడం, బంగారం కొనడం వీటిలోనే వారి సంపాదన అంతా ఖర్చు అవుతుంది. ఇంక అల్లుళ్ళు కూడా అత్తగారు లక్షలు సంపాదిస్తున్నట్టు కోరికల చిట్టాలు విప్పుతారు.
మనదేశం నుంచి వచ్చేటప్పుడే వారికి ఒక అవగాహన తరగతిలాగ నిర్వహించి, వారి చేత బ్యాంకులో ఖాతాలు తెరిపించి, ఒక ఇన్సూరెన్సు తీయించి, ఒక పద్ధతిలో పంపిస్తే కొంతమేలు. మనదేశమే వీరికి పనులు కల్పించే స్థాయికి ఎదగడం ఒక సుదూర స్వప్నమే? ఈ లోపల వైద్యం, పెళ్ళిళ్ళు, వ్యాపారంలో నష్టాలు, పండని భూముల మీద అప్పులు, ఏవో శతకోటి కారణాలు ఉన్న ఊరులో కట్టెలు అమ్మలేక, సుదూరంగా ఉన్న ఈ గల్ఫ్ దేశాలకు పొట్ట చేత పట్టుకొని, నాలుగు డబ్బులు సంపాదించి, కుటుంబం పోషించాలని, భాష కాని భాష, కొత్త మనుషులు మధ్య అన్నింటికి తెగించి వస్తున్నారు. వీరికి కనీస సౌలభ్యం ఉన్న జీవితం కల్పించాలి. మన దేశ అధికారులు దృష్టిి సారించాలి, మన దేశ పరువు, ప్రతిష్ట అంటే జెండాలోనే కాదు, బంగారుపతకాలు పొందడమే కాదు, విదేశీ ద్రవ్య నిధులు పెరగడం కాదు, వీరి జీవన విధానం మెరుగుపరచడం కూడా..
సాప్ట్‌వేర్ ఉద్యోగులు, ఇంజనీర్లు, డాక్టర్లు మొదలైన నిపుణులు ఒక్కరే కాదు, ఇలాగ పని చేయడం కోసం వచ్చే వారు కూడా మన దేశ ప్రజలే…మన దేశం జెండా రెపరెపలాడుతూ ఉంటే, మనకి ఎంత గర్వంగా ఉంటుంది, ఈ దేశంలో. ఇలాగ దయనీయంగా పనిచేసేవారిని కూడా ఈ జెండా రెపరెపలులో చూడగలమా?
ఎన్నో ఏళ్ళు ఇక్కడ కష్టపడి వెనక్కి వెళ్ళేవాళ్ళకు ఎయిర్‌పోర్ట్‌లో ఒక సహాయ, సమాచార వ్యవస్థ నెలకొల్పాలి. హృదయం సరి అయిన స్థానంలో ఉన్న మనవీయ దృక్పథంతో పనిచేసే ఒక దేశీయ అధికారి ఒకరు అక్కడ, ఇరవై నాలుగు గంటలు, సహాయం, సలహా అందించే ఒక ఫోన్ లైన్, ఇలాంటివి వెంటనే అమలు పరిస్తే ఎంత బాగుంటుంది.
వారికేం? నాలుగైదు ఇళ్ళలో పనిచేసి, బాగానే సంపాదిస్తున్నారు, అని అనేవారు ఉంటారు. కాని, నాలుగు డబ్బులు కూడా వెనక్కి వేసుకోరు, చివరికి ఏమి మిగలదు వీరికి. రోగాలు, శక్తి కోల్పోయిన శరీరాలు తప్ప. మన ఎంబస్సీ మనం మనదేశం రాక ముందే అక్కడి అధికారులు వ్యవస్థలు అందరూ కూడి, ఆలోచించి, ఏదో కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలి. చాప కిందకి తోసేసి, అంతా బాగానే ఉందని, కళ్ళు మూసుకుని ఎన్ని రోజులు ఇంకా గడుపుతాం?
ఇలాగే ఎయిర్‌పోర్ట్‌లో ప్రాణాలు, అదీ, గుండె పగిలి ప్రాణాలు వదిలే సంఘటనలు ఇంకా ఎన్ని వినాలి మనం, మనలోని మానవత మేల్కొడానికి?